పంతం మాటున పగటికల | chandra babu naidu's dream behind obstinate stand | Sakshi
Sakshi News home page

పంతం మాటున పగటికల

Published Wed, Jun 24 2015 12:01 AM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM

పంతం మాటున పగటికల - Sakshi

పంతం మాటున పగటికల

ఎన్.టి.రామారావును పదవి నుంచి దించేసి అధికారం చేజిక్కించుకున్న నాడు నారా చంద్రబాబునాయుడి లక్ష్యం 2020. ఆ మేరకు ఆయన 1996 లోనే 2020 పేరిట ఒక విజన్ డాక్యుమెంట్‌ను కూడా విడుదల చేశారు. పదవిలో కొనసాగినంత కాలం ఆయన అదే డాక్యుమెంట్‌ను పదే పదే వల్లె వేసే వారు. మామూలుగా అయితే 2020 సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ చేరుకో వలసిన అభివృద్ధి లక్ష్యంగా దీనిని అర్థం చేసుకోవాలి. కానీ చంద్రబాబు ఆలో చనలో 2020కి మరో అర్థం ఉంది. అది- 2020 వరకూ ఆయన అధికారంలో కొనసాగడం.

 

అయితే చంద్రబాబు లక్ష్యానికి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో 2004లోనే కాంగ్రెస్ పార్టీ గండి కొట్టేసింది. ఇలాంటి గండి 1999లోనే పడవలసి ఉంది. కానీ అటల్ బిహారీ వాజపేయి పట్ల దేశ వ్యాప్తంగా ఏర్పడ్డ సానుభూతి పవనాలూ, కార్గిల్‌యుద్ధ ప్రభావం, బీజేపీతో మిత్రత్వం చంద్రబాబుకు కలిసొచ్చింది. కాంగ్రెస్ చేసిన కొన్ని తప్పులు కూడా తోడై ఆ ఎన్నికలలో బతికి బయటపడింది తెలుగుదేశం. అట్లా కలిసొ చ్చిన అదృష్టాన్ని తన లక్ష్యం ‘2020’ వరకు నిలుపుకోడానికి ఆయన ప్రజా ప్రయోజన విధానాలను ఎన్నుకుంటే ఎలా ఉండేదో కానీ, ఇదంతా తన సొంతబలం అనుకున్నారు. తనకు ఎదురులేదన్నట్టే వ్యవహరించారు. ఇలా తీవ్ర ప్రజావ్యతిరేకతను కొనితెచ్చుకోవడంతో ఆయన లక్ష్యానికి 2004లో గండిపడింది. రాజశేఖరరెడ్డి మృతి, తెలంగాణ ఉద్యమ ఉధృతి, విభజనకు యూపీఏ అనుమతి లేకుంటే చంద్రబాబు 2020 లక్ష్యం కలగానే మిగిలేది.
 
 తర్కం లేని ఆలోచన
 
 ఈ సోది ఇప్పుడెందుకు అనిపిస్తుంది ఎవరికైనా. తాజా పరిణామాలకూ, చంద్రబాబు 2020 స్వప్నానికీ సంబంధం ఉంది. 2020 వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో కొనసాగాలనుకున్న చంద్రబాబు పదేళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చోవలసి రావడమే కాక, 2014లో చేతికొచ్చిన అధికారం కూడా తన సొంత బలంతో కాక, పూర్తిబలంతో కాక అదీ అర్ధరాజ్యమే చేతికి రావడం, ఆ అర్ధ రాజ్యం కూడా 2019 వరకే కావడంతో తన కల నెరవేరదే మోనన్న అనుమానం కలిగింది. నిజానికి చంద్రబాబు కల నెరవేరాలంటే 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల వేళకు రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావాలి. నిజాయితీగా పనిచేసి రెండు రాష్ట్రాల ప్రజల మన్ననలు పొంది అధికారంలోకి వస్తే సంతోషమే. ఇక్కడ ఒక సినిమా డైలాగ్ గుర్తుకొస్తుంది. ముఖ్యమంత్రి కావడం కోసం తన పార్టీకే చెందిన శివా రెడ్డి అనే మరో నాయకుడిని హత్య చేయించిన ఒక రాజకీయ నాయకుడితో ఆ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి అంటాడు, ‘శివారెడ్డి చని పోతే మీరు ముఖ్యమంత్రి అవుతారు, శివారెడ్డిని హత్య చేస్తే మీరు హంతకుడ వుతారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మరిచిపోయారు?’ అని. ఇది చంద్రబాబు వైఖరికి అద్దం పట్టే ైడైలాగ్.
 
 ఎలాగంటే, తెలంగాణ లో ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేసి, వారి మన్ననలను పొంది పార్టీని బలోపేతం చేస్తే, ఆంధ్రప్రదేశ్‌లో చేజిక్కిన అధికా రాన్ని ప్రజాసంక్షేమానికీ, చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికీ ఉపయోగిస్తే మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకానీ, తెలంగాణలో ఎమ్మెల్యేలనూ, ఆంధ్రప్రదేశ్‌లో గ్రామస్థాయి నుంచి పార్లమెంట్ దాకా అన్ని స్థాయిలలో ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తే అధికారం రాదు. పట్టుబ డితే రేవంత్‌రెడ్డికి పడ్డట్టు అరదండాలు పడతాయి అన్న చిన్న లాజిక్ చంద్ర బాబు మరిచిపోవడం ఆశ్చర్యం. 2019లో తెలంగాణ లో మేమే అధికారంలోకి వస్తాం అని చంద్రబాబునాయుడు, ఆయన పార్టీ తెలంగాణ శాఖ నాయ కులూ ఈ సంవత్సర కాలంలో చాలాసార్లు ప్రకటించారు. ఆ దిశగా ప్రజలలో బలం పెంచుకునే పని మానేసి ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం కక్కుర్తిపడి దొరికి పోయి ఇప్పుడింకా తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. నామినేటెడ్ శాసన సభ్యుడు ఎల్విస్ స్టీఫెన్సన్‌కు బయానాగా రూ.50 లక్షలు ఇస్తూ ఏసీబీకి దొరికి పోయిన రేవంత్‌రెడ్డి జైలుకు పోయి ఇవ్వాళ్టికి 24 రోజులు. ఈ 24 రోజుల్లో చంద్రబాబునాయుడు ఆయన పార్టీ, ప్రభుత్వ పెద్దలూ 10 తప్పులు చేశారు.

 

రేవంత్‌రెడ్డిని సమర్థించడం, స్టీఫెన్సన్‌తో తాను స్వయంగా మాట్లాడిన ఆడియో బయటపడితే వివరణ ఇవ్వడానికి బదులు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నదంటూ అందరి దృష్టినీ మళ్లించే ప్రయత్నం నుం చిచివరికి తెలంగాణ న్యూస్ చానల్‌కు నోటీసులు ఇప్పించే వరకూ చంద్ర బాబునాయుడు తప్పులు చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి మీడియా సలహా దారు పరకాల ప్రభాకర్ తన విధుల పరిమితి దాటి చంద్రబాబు తరఫున తెలంగాణ  ప్రభుత్వం మీద విరుచుకుపడిన విధానం, రాష్ర్ట మంత్రుల చేత గవర్నర్ మీద పరుష పదజాలంతో తీవ్ర ఆరోపణలు చేయించడం, పక్క రాష్ర్టంలో సొంత పోలీస్‌స్టేషన్‌లు పెట్టుకుంటాం అనడం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన నేరంలో నాల్గవ నిందితుడిగా ఉన్న మత్తయ్యకు, అదే కేసులో ఏసీబీ నోటీసులు ఇచ్చిన టీడీపీ శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్యకు ఆశ్రయం ఇవ్వడం వంటి తప్పులు చేస్తూనే ఉన్నారు.
 
 ఎదురుదాడికే మొగ్గు
 
 విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కు బోలెడు సమస్యలున్నాయి. ఎన్నికల వాగ్దా నాలను నెరవేర్చడానికి నిధులు లేవు. రాజధాని నిర్మాణానికి డబ్బు కావాలి. కేంద్రం ఇస్తానన్న ప్రత్యేక హోదా పత్తాలేదు. ప్రతి పనికీ హుండీ పెట్టి చందాలు ఇవ్వండనే పరిస్థితి. చంద్రబాబునాయుడు హైదరాబాద్ నివాసి. ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, సొంత ఇల్లు అన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. పాత ఇంటిని కూల్చేసి కొత్త ఇల్లు కట్టడం మొదలు పెట్టారాయన. ఆయన మీద వచ్చిన ఒక నేరారోపణను దర్యాప్తు అధికారులు ఆ కోణం నుంచే చూడా లి తప్ప చంద్రబాబు కోరుకుంటున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద అభియోగంగా చూడటానికి వీలులేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఈ వ్యక్తిగత నేరారోపణ అంశాన్ని రెండు ప్రభుత్వాల మధ్య, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య తగాదాగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు.

 

మంగళగిరి సంకల్పసభలో మాట్లాడినా, ఢిల్లీలో జాతీయ మీడియా ముందు మాట్లాడినా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల మధ్య అంతరాలను సృష్టించి, వాటిని పెంచే ధోరణిలోనే మాట్లాడుతున్నారు చంద్రబాబు. ఒక నేరం జరిగింది. నిందితులు జైల్లో ఉన్నారు. ఆ నేరాన్ని సమర్థించినట్టు మరొకరు మాట్లాడిన ఆడియో బయటపడింది. దర్యాప్తు జరుగుతున్నది. ఒక స్టేట్స్‌మన్‌గా (ఆ మాటను ఆయనే పలు సందర్భాలలో చెప్పారు) చంద్రబాబునాయుడు ఏం చేయాలి? పదవికి రాజీనామా చేసి మరొకరిని ముఖ్యమంత్రిగా నియమించి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. కనీసం చట్టం తన పని తను చేసుకుపోతుంది అనైనా అనాలి. అలా చెయ్యక పోగా, నా మీదే కేసులు పెడతారా అన్న ధోరణి సరైనది కాదు. పైగా మా శాసనసభ్యులను తెలంగాణ రాష్ర్ట సమితి ప్రలోభ పెట్టి తన వైపు తిప్పుకు న్నది, అది తప్పు కాదా అంటున్నారు. ఈ విషయంలో టీఆర్‌ఎస్‌ను ఎవరూ సమర్థించరు. దానికి బదులుగా మేం ఇది చేశాం అన్న టీడీపీ సమర్థింపునూ ఎవరూ హర్షించరు. ఉభయులూ ఈ బేరసారాలను ఆపాల్సిందే.
 
 దృష్టిని మళ్లించేందుకే సెక్షన్ 8 ఊసు
 
 ఈ వ్యవహారాన్నంతా పక్కదారి పట్టించేందుకు రాష్ర్ట పునర్విభజన చట్టం లోని సెక్షన్ 8ని ముందుకు తెస్తున్నారు చంద్రబాబునాయుడు. సెక్షన్ 8 చెబు తున్నది ఏమిటంటే, ఉమ్మడి రాజధాని ప్రాంతంలో ప్రజల ప్రాణాలనూ, ఆస్తులనూ, స్వేచ్ఛనూ రక్షించే ప్రత్యేక బాధ్యతలను రాష్ర్ట గవర్నర్ కలిగి ఉంటారనే. శాంతిభద్రతలకు, అంతర్గత భద్రతకు విఘాతం కలిగితే, ముఖ్య మైన కట్టడాలకు భద్రత లోపిస్తే, ఉమ్మడి రాజధాని ప్రాంతంలో కార్యాల యాల కేటాయింపులో సమస్యలొస్తే గవర్నర్ జోక్యం చేసుకుంటారు. ఈ అంశాలలో మంత్రిమండలి చేసే సూచనలు కాదని గవర్నర్ సొంత నిర్ణయం కూడా తీసుకోవచ్చు. ఈ ఏడాది కాలంలో ఎవరి ధన మాన ప్రాణాలకు భం గం కలిగిందో తెలుగుదేశం నాయకులే చెప్పాలి. ప్రముఖ జర్నలిస్ట్ సంజయ్ బారు చెప్పినట్టు హైదరాబాద్ (ఉమ్మడి రాజధాని) ప్రశాంతంగా ఉన్నది, హాయిగా ఆనందంగా ఉన్నది. శాసనసభ్యుడిని డబ్బుతో ప్రలోభపెట్టడానికి ప్రయత్నించిన రేవంత్‌రెడ్డి కేసు, దానిని ప్రోత్సహించే రీతిలో వినిపిస్తున్న చంద్రబాబు గొంతు గల టేప్‌ల మీద దర్యాప్తు ఇవేవీ సెక్షన్8 పరిధిలోకి రావు. ప్రస్తుతం తెలంగాణ అవినీతి నిరోధకశాఖ ఈ కేసులో జరుపుతున్న దర్యాప్తులో గవర్నర్‌గారే కాదు, న్యాయవ్యవస్థ కూడా జోక్యం చేసుకోజాలదు. ఇవన్నీ సుదీర్ఘ రాజకీయ, పరిపాలననుభవం కలిగిన చంద్రబాబుకు తెలియ వనుకోవాలా? 2020 లక్ష్యాన్ని అడ్డదారిలో చేరుకోవాలన్న ప్రయత్నమే తెలు గుదేశం అధినేతకు ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టింది.


 -దేవులపల్లి అమర్,  datelinehyderabad@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement