రాజకీయ జీవిత చరమాంకంలో చంద్రబాబు ఈ దేశానికీ పెద్ద నష్టం చెయ్యడానికి సిద్ధపడ్డారు. ఎన్నికల నిర్వహణ గురుతర బాధ్యత నిర్వర్తిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నించడమే ఆ నష్టం. ఈ దుష్ప్రచారాన్ని ఈ దేశ ప్రజలు నమ్మే అవకాశం లేదు కాబట్టి మన ఎన్నికల వ్యవస్థ పది కాలాల పాటు పదిలంగా ఉంటుంది. కానీ ఇటువంటి నాయకులే వచ్చిపోతుంటారు. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయి, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతలను పూర్తిగా తుంగలో తొక్కిన కారణంగానే ప్రజాదరణ కోల్పోయి ఒక యువనేత చేతిలో ఓడిపోతున్నానన్న వాస్తవాన్ని అంగీకరించలేక చంద్రబాబు తన ఓటమికి ఈసీ అసమర్థత, ఎన్నికల్లో జరిగిన అవకతవకలూ కారణం అని చెప్పేందుకు తయారు చేసుకుంటున్న వేదికే ఈ నాటకం అంతా.
బహుశా స్వతంత్ర భారతదేశంలో ఏ ఎన్నికలప్పుడూ చూడని వింతలు మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా చూస్తున్నాం. ఎన్నికల్లో గెలుపు పట్ల కొన్ని రాజకీయ పక్షాలు ధీమాగా ఉంటాయి. కొన్ని పార్టీలకు గెలుస్తామో లేదో అర్థం కాకపోవచ్చు. వాళ్ళు కొంచెం సందిగ్ధంలో ఉంటారు. ఓటమి ఖాయం అని కొన్ని పార్టీలకు ముందే తెలిసి పోతుంది. ఈ అన్ని కోవలకు చెందిన పార్టీలు ఎన్నికలు అయ్యాక ఫలితాలు వెలువడే వరకూ తమకు తోచిన లెక్కలు వేసుకుని జయాపజయాలను గురించిన ఒక అంచనాకు రావడం సహజంగా జరిగే పని. గెలుపు పట్ల ధీమా ఉన్నవాళ్ళు లేదా గెలుపు ఓటములు ప్రజలు నిర్ణయిస్తారు, మనం చెయ్యాల్సిన ప్రయత్నం మనం చేశాం అనుకునే వాళ్ళు ఫలితాలు వెలువడే వరకూ ప్రశాంతంగా గడిపేస్తారు. ఎన్నికల సమయంలో పడ్డ శ్రమను మరిచిపోడానికి విశ్రాంతి తీసుకుంటారు. ఎన్నికలప్పుడు సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు ఫిర్యాదులు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్న పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందనీ, అక్రమాలకూ పాల్పడిందనీ ఫిర్యాదు చేస్తారు. అధికార పక్షం చాలా ధీమాగా ఉంటుంది. ఫలితాలు వెలువడిన తరువాత ఓడిపోయినా పార్టీలు కారణాలను విశ్లేషించుకోవడం సహజం. వీలయితే తప్పులు సరిదిద్దుకుని మళ్ళీ అయిదేళ్లకు వచ్చే ఎన్నికల్లో ప్రజాభిమానం చూరగొనడానికి ఏం చెయ్యాలో ఆలోచించి ఆ ప్రకారం నడుచుకోవడం కూడా సహజం.
ఈసీపై బాబు విమర్శ వింతల్లోకెల్లా వింత
ఓటమికి కారణాలను వెతుక్కోవడం, విశ్లేషించుకోవడం అంటే తమ వల్ల జరిగిన తప్పులను గుర్తించడం, మళ్ళీ ఆ తప్పులు జరక్కుండా చూసుకోవడం. మొదట్లోనే చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అట్లా కాకుండా ఒక వింత పరిస్థితి నెలకొని ఉన్నది. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తాను అధికారంలో ఉన్నానో, ప్రతిపక్షంలో ఉన్నానో అర్థం కాని పరిస్థితుల్లో ప్రవర్తిస్తున్న తీరు ఈ వింత పరిస్థితికి దారి తీసింది. 11వ తేదీన ఎన్నికలు జరిగాయి. అంతకు ఒక రోజు ముందు నుండే ఆయన ఈ ఎన్నికలు జరిగిన తీరు మీద అభ్యంతరాలు వ్యక్తం చెయ్యడం, అక్రమాలు జరగబోతున్నాయని వాపోవడం, నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించడం మొదలు పెట్టారు. తన పోలీసులనే తనను అరెస్ట్ చెయ్యమని ప్రేరేపించడం పరాకాష్ట. ఇన్నీ చేసి పోలింగ్ రోజున మళ్ళీ పొద్దున్నే బుద్ధిమంతుడిలా బూత్‌కు వెళ్లి ఓటు వేసి బయటికొచ్చి భార్యా బిడ్డలతో కలిసి వేలి మీద సిరా గుర్తు చూపించి ఇంటికి వెళ్ళారు. అట్లా వెళ్ళిన గంట తరువాత గోల మొదలు పెట్టారు ఈవీఎంలు మొరాయించాయనీ, తప్పులు చేస్తున్నాయనీ ప్రతిపక్షానికి అనుకూలంగా ఓట్లు మారుతున్నాయనీ. అసలు ఈ ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణే తప్పు.. పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరగాలనీ ఉపన్యాసం మొదలుపెట్టారు.
ఆయన ఇట్లా ఉపన్యసిస్తున్న సమయంలోనే ఆయన ప్రభుత్వంలో శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన పెద్దమనిషి కోడెల శివప్రసాద్ ఒక బూత్‌లో దూరి తలుపులు వేసుకుని రిగ్గింగ్ మొదలుపెట్టి జనం చేత బయటికి ఈడ్పించేసుకున్నాడు. 1994లో తాను భాగస్వామిగా ఉన్న టీడీపీ.. 1999, 2014లో తను అధ్యక్షుడిగా ఉన్న టీడీపీ ఎన్నికలలో గెలిచినప్పుడు ఇవే ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగిన విషయం ఆయన మరిచిపోతున్నారు. పోనీ అప్పుడు ఈవీఎంలు బాగా పనిచేశాయి ఇప్పుడు చెయ్యడం లేదు, అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నిజాయితీగా పనిచేసింది ఇప్పుడు చెయ్యడం లేదు అనుకుంటే గత అయిదేళ్లుగా ఎందుకు ఒక్క మాటా మాట్లాడలేదు? మొన్నటికి మొన్న నంద్యాల శాసన సభ ఉపఎన్నికల సందర్భంలో ఎందుకు మాకు ఈవీఎంలు వద్దు, ఈ ఎన్నికల సంఘం వద్దు అనలేదు. ఇప్పుడు తన కొత్త మిత్రులు కాంగ్రెస్ వారు పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో గెలిచినప్పుడు ఎందుకు మాట్లాడలేదు?
గెలుపుపై ధీమా.. తోడుగా చిత్తచాంచల్యం
ఇప్పుడెందుకు ఢిల్లీ కాన్‌స్టిట్యూషన్ క్లబ్ కప్పెక్కి ఈవీఎంలనూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తున్నారు? ఈ ఎన్నికలలో ప్రజల తీర్పు ఆయనకు ముందే తెలిసి పోయింది. అధికారం కోల్పోబోతున్నామని అర్థం అయింది. అందుకే పొంతన లేని మాటలు మొదలు పెట్టారు. కాసేపు నా ఓటు నా పార్టీకి పడిందో లేదో అని అనుమానం వ్యక్తం చేస్తారు, మళ్ళీ వెంటనే తన పార్టీకి 150 స్థానాలు లభిస్తాయని మాట్లాడతారు. గెలుపు మీద ధీమా ఉన్న వాళ్ళెవ్వరూ ఇట్లా చిత్త చాంచల్యం ప్రదర్శించరు. ‘‘స్టేట్స్‌మన్‘‘ అయితే ఓటమిని కూడా ధైర్యంగా స్వీకరిస్తారు. ఆత్మవిమర్శ చేసుకుంటారు. ఇక్కడ చంద్రబాబునాయుడు ఎంత సేపూ ఆత్మస్తుతి పరనిందతోనే గడిపేస్తారు. ఆయన రాజకీయ జీవితం అంతా అట్లానే గడిచింది. ఈ చివరి అంకంలో ఆయన మారతారని ఎట్లా అనుకుంటాం.
ఎన్నికలు అయిపోయాయి. ఈవీఎంలు స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రంగా ఉన్నాయి. మే 23వరకూ ఆగితే ఫలితం తెలిసి పోతుంది. ఇప్పుడు ఎన్ని విన్యాసాలు ప్రదర్శించినా పరిస్థితి మారదు, మళ్ళీ ఎన్నికలు జరగవు. మరెందుకు చంద్రబాబు ఇంత గోల చేస్తున్నట్టు. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పట్టుమని పదేళ్ళయినా పూర్తి కాని ఒక యువ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన ఒంటరి పోరాటంలో తాను మట్టికరవబోతున్నానన్న ఆలోచనే ఆయనకు మింగుడు పడటం లేదు. సీనియర్ రాజకీయవేత్తగా విలువల విషయంలో మార్గదర్శిగా ఉండాల్సిన తాను యువ నాయకుడు జగన్‌మోహన్ రెడ్డి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి రావడం ఆయనకు మింగుడు పడటం లేదు.
నిజాయితీ నా సొంతం, నేను నిప్పును అని చెప్పుకునే ఆయన ప్రజాప్రతినిధులను కొంటుంటే, జగన్ తన పార్టీలో చేరే వాళ్ళు పదవులకు రాజీనామా చెయ్యాలని నిబంధన విధించి కొన్ని విలువలను ప్రతిష్టించాడు. ఈ అయిదేళ్ళలో జగన్‌మోహన్ రెడ్డికి పెరిగిన ప్రజాదరణ, ముఖ్యంగా 14 మాసాలపాటు ఆయన చేసిన పాదయాత్రను జనం ఆదరించిన తీరు చంద్రబాబునాయుడును గంగవెర్రులు ఎత్తిస్తున్నది. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయి, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత పాటించకపోగా వాటిని పూర్తిగా తుంగలో తొక్కిన కారణంగానే ప్రజాదరణ కోల్పోయి ఒక యువనేత చేతిలో ఓడిపోతున్నానన్న వాస్తవాన్ని అంగీకరించలేక చంద్రబాబు నాయుడు తన ఓటమికి ఎన్నికల సంఘం అసమర్థత, ఎన్నికల్లో జరిగిన అవకతవకలూ కారణం అని చెప్పేందుకు తయారు చేసుకుంటున్న వేదికే ఈ నాటకం అంతా.
ఓటమి ముంగిట్లోనూ డబ్బు చేసుకోవడమే!
అంతే కాదు, ఫలితాలు వెలువడే దాకా ఈ నలభై రోజులు బీజేపీ వ్యతిరేక శిబిరంలో తానే చక్రం తిప్పుతున్నాననే భ్రమలో ఉండి, ఇతరులను కూడా ఉంచి మకాం ఢిల్లీకి మార్చాలనే ఆలోచన కూడా ఇందుకు కారణం కావచ్చు. కానీ వాతావరణం చూస్తే అట్లా లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 25 లోక్‌సభ స్థానాల్లో కచ్చితంగా ఆయన పార్టీ గెలవగల స్థానం ఒక్కటి కూడా గట్టిగా చెప్పలేని స్థితిలో ఉన్నారు. లోక్‌సభ స్థానాలు లేకుండా ఢిల్లీలో ఆయనను పిలిచి పీట వేసే వాళ్ళు ఎవరూ ఉండరన్న విషయం ఆయనకు కూడా బాగా తెలుసు. చంద్రబాబు ఆయన పార్టీ నేతలూ ఇంకా 150 స్థానాలు మావే అని చెప్పుకుని తిరగడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి మళ్ళీ ఆయనే వస్తాడేమో అనే భయంతో డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే వసూలు చేసుకోవడం (ఇది జరుగుతున్నది అనడానికి నిదర్శనం నిన్న మొన్న ముఖ్యమంత్రి అధికార నివాసం ఫోన్ నుంచి వ్యాపారులను డబ్బు ఇవ్వాలని పీడిస్తూ వెళ్ళిన ఫోన్ కాల్స్, ఆ వ్యాపారులు చేసిన పోలీసు కంప్లైంట్స్).
రెండో కారణం ఓడిపోతున్నామని తెలిస్తే ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి కూడా ఎవరూ పిలవరేమో అన్న దుగ్ధ కావొచ్చు. ఏది ఏమయినా రాజకీయ జీవిత చరమాంకంలో చంద్రబాబు నాయుడు ఈ దేశానికీ పెద్ద నష్టం అయితే చెయ్యడానికి సిద్ధపడ్డారు. ప్రజాస్వామ్య పండుగగా అందరం కీర్తించే ఎన్నికల నిర్వహణ గురుతర బాధ్యత నిర్వర్తిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం పట్ల ప్రజల్లో విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నించడమే ఆ నష్టం. అభినవ గోబెల్ చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ దుష్ప్రచారాన్ని ఈ దేశ ప్రజలు నమ్మే అవకాశం లేదు కాబట్టి మన ఎన్నికల వ్యవస్థ పది కాలాల పాటు పదిలంగా ఉంటుంది. ఇటువంటి నాయకులే వచ్చిపోతుంటారు. ఏది ఏమయినా వచ్చే నలభై రోజులు అమరావతిలోని ఉండవల్లి వేదిక బీట్ చూస్తున్న విలేకరులకు మాత్రం రోజూ కొన్ని గంటలు చంద్రబాబు పత్రికాగోష్టి పేరిట ఇచ్చే ఉపన్యాసాల ఘోష భరించక తప్పదు.
-దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com
Comments
Please login to add a commentAdd a comment