‘ప్రశ్న’కు దూరంగా ఉద్యమస్ఫూర్తి | opinion on Prof. kodandaram political jac by Devulapalli Amar | Sakshi
Sakshi News home page

‘ప్రశ్న’కు దూరంగా ఉద్యమస్ఫూర్తి

Published Wed, Dec 28 2016 12:27 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 PM

‘ప్రశ్న’కు దూరంగా ఉద్యమస్ఫూర్తి

‘ప్రశ్న’కు దూరంగా ఉద్యమస్ఫూర్తి

డేట్‌లైన్‌ హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికార పక్షం కార్యాచరణ చూసిన ఎవరికైనా అర్థమ వుతుంది ప్రతిపక్ష రాజకీయ పార్టీల ఉనికిని కూడా అది సహించజాలదని. ఆ మేరకు ఇతర రాజకీయ పక్షాలను నిర్వీర్యం చేసే కార్యక్రమం కొనసాగుతుండగానే శత్రువు జేఏసీ రూపంలో వస్తున్నాడేమో అన్న సందేహం, ఆందోళన కారణంగానే ఇవాళ అధికారపక్షం కోదండరామ్‌ మీద కత్తి కట్టినట్టు కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రజలు పెద్ద ఎత్తున ఆదరించారు.

1980 దశకం తొలిరోజులు. ప్రతిష్టాత్మక హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యా లయంలో విద్యార్థినిని వేధించిన సంఘటనలో ఒక ప్రొఫెసర్‌ను సస్పెండ్‌ చెయ్యాలని కోరుతూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. యూనివ ర్సిటీ పాలకవర్గం దిగిరాలేదు. ఉద్యమంలో భాగంగా దశలవారీ ప్రదర్శ నలు, రిలే నిరాహార దీక్షలు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇక విద్యా ర్థులు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అప్ప టికి హైదరాబాద్‌ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఏర్పడలేదు. విద్యా ర్థిని వేధింపు వ్యవహారంలో ప్రొఫెసర్‌ మీద చర్యలు తీసుకోవాలని ఉద్యమిం చిన విద్యార్థుల బృందమే అంతకు ముందు యూనివర్సిటీ పాలకవర్గానికి ఒక ముసాయిదా నియమావళిని తయారుచేసి సమర్పించింది. దాని మీద ఇంకా నిర్ణయం జరగక ముందే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో విద్యా ర్థులు ఉద్యమించారు. యాజమాన్యాన్ని దారికి తెచ్చేందుకు హైదరాబాద్‌ అబిడ్స్‌ గోల్డెన్‌ త్రెషోల్డ్‌లో ఒక విద్యార్థి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిం చాడు. ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నందున ముందుగా ప్రొఫెసర్‌ను సస్పెండ్‌ చేసి విచారణ జరపాలన్నది విద్యార్థుల డిమాండ్‌.

విచారణలో తేలితే కానీ సస్పెండ్‌ చేయబోమని యూనివర్సిటీ యాజమాన్యం మొండి కేసింది. చివరికి ప్రొఫెసర్‌ సస్పెన్షన్‌ జరిగాకే ఆ విద్యార్థి ఆమరణ నిరాహార దీక్ష విరమించాడు. ఆ సంఘటనతో చాలా మార్పు వచ్చింది. విద్యార్థి బృందం సమర్పించిన ముసాయిదా నియమావళిని మెజారిటీ విద్యార్థులు ఆమోదించి ఆనాటి నుంచి దాని ఆధారంగానే విద్యార్థి సంఘానికి ఎన్నికలు నిర్వహించుకుంటున్నారు. యూనివర్సిటీ యాజమాన్యం ప్రమేయం ఏ మాత్రం లేకుండా విద్యార్థులే ఈ ఎన్నికలు అత్యంత ప్రజాస్వామిక వాతా వరణంలో ఇప్పటికీ  జరుపుకోవడం విశేషం. తోటి విద్యార్థినికి న్యాయం చేయడం కోసం ఆనాడు ఆమరణ నిరాహార దీక్షకు తెగించిన ఆ విద్యార్థి ఆ తరువాత కాలంలో ఒక మంచి అధ్యాపకుడిగా, పౌర హక్కుల ఉల్లంఘనను ప్రతిఘటించేందుకు జరిగిన ప్రతి ఆందోళనలోనూ అడుగు కలిపిన మానవ హక్కుల కార్యకర్తగా సుప్రసిద్ధుడైన ప్రొఫెసర్‌ కోదండరామ్‌. 2009 డిసెంబర్‌ 9 రాత్రి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించి 24 గంటలలోనే వెనక్కి పోయిన కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మళ్లీ దారికి తేవడం కోసం ఏర్పడిన తెలంగాణ సంయుక్త కార్యాచరణ సమితి (టీజేఏసీ) చైర్మన్‌. సెంట్రల్‌ యూని వర్సిటీలో విద్యార్థినికి న్యాయం చేయడం కోసం దీక్ష చేయడం మొదలు, తెలంగాణ సాధన కోసం జరిగిన మహోద్యమంలో జేఏసీ అధ్య క్షుడి బాధ్య తలు నిర్వహించే వరకూ కోదండరామ్‌ ప్రజాపక్షమే.

పొలిటికల్‌ జేఏసీ ఎలా వచ్చింది?
డిసెంబర్‌ 9 ప్రకటనతో ఆమరణ నిరాహార దీక్ష  విరమించిన ఉద్యమ నేత, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసు కోవడంతో హుటాహుటిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కుందూరు జానా రెడ్డి ఇంటికి వెళ్లి చర్చించిన అనంతరం తీసుకున్న నిర్ణయం ఫలితమే ఇవాళ మనం పొలిటికల్‌ జేఏసీ అని చెప్పుకుంటున్న సంఘం. 2009 డిసెంబర్‌ 24న హైదరాబాద్‌ లోని కళింగభవన్‌లో జరిగిన ఒక సమావేశంలో ప్రొఫసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ ప్రతిపాదన మేరకు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ చైర్మన్‌గా రాజకీయాలకు అతీతంగా జేఏసీ ఏర్పాటైంది. తరువాత వాటి వాటి కార ణాల వల్ల కాంగ్రెస్‌ వంటి పార్టీలు బయటికి వెళ్లిపోయాయి. టీడీపీ వంటి పార్టీని పంపించేశారు. అన్ని రాజకీయ పక్షాలనూ ఒక్క తాటి మీదకు తెచ్చి రాష్ట్రాన్ని సాధించుకోవాలన్న ఆలోచనతో, కేసీఆర్‌ చొరవతో ఏర్పడిన ఈ జేఏసీ  బహుశా ప్రపంచంలోనే ప్రజా ఉద్యమాలన్నిటికీ మార్గదర్శిగా, దిక్సూ చిగా  నిలుస్తుందనడంలో సందేహం లేదు. తెలంగాణ ప్రజల్లో రాష్ట్ర విభజన కోసం బలంగా నాటుకుపోయిన ఆకాంక్ష కారణంగా రాజకీయాలను పక్కకు నెట్టేసి సబ్బండ వర్ణాలూ ఈ జేఏసీలో చేరిన కారణంగానే ఉద్యమం విజయం సాధించిందనడంలో సందేహం లేదు.

జేఏసీ మొత్తం తెలంగాణ సమాజాన్ని ఎంత ప్రభావితం చేసిందంటే కుల, వృత్తి, ఉద్యోగ, విద్యార్థి సంఘాలన్నీ జేఏసీలుగా ఏర్పడి ప్రధాన జేఏసీ వెంట నడిచి ఉద్యమాన్ని విజయవంతం చేశాయి. మిలియన్‌ మార్చ్‌ చేసినా, సాగరహారం నిర్మించినా, సకల జనుల సమ్మెను చెదిరిపోకుండా బలంగా నిలబెట్టినా, రాష్ట్రమంతటా వంటావా ర్పులు చేసి వందల కిలోమీటర్ల రోడ్లను దిగ్బంధం చేసినా, ఒక్క పిలుపుతో రైళ్లు ఎక్కడివక్కడ నిలిచిపోయినా అది కోదండరామ్‌ నాయకత్వంలోని జేఏసీ కృషి, పట్టుదల, నిబద్దత కారణంగానే. ఉద్యమ సంస్థగా తెలంగాణ రాష్ట్ర సమితికీ, దానికి నాయకత్వం వహించి, అన్ని ఆటుపోట్లనూ తట్టుకుని ముందుకు నడిపిన చంద్రశేఖరరావుకు రాజకీయ నాయకత్వాన్ని ప్రభా వితం చేసి కేంద్రాన్ని రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తీసుకునే వైపు అడుగులు వేయించిన ఘనత ఎంత దక్కుతుందో, క్షేత్ర స్థాయిలో ప్రజలను కదిలించి, వారిని ప్రభావితం చేసి ఉద్యమ సెగ పాలకవర్గాలకు తగిలేట్టు చేసి టీఆర్‌ఎస్‌కు అవసరమైన బలాన్ని సమకూర్చిన  జేఏసీకి అంతే దక్కుతుంది. ఒకానొక దశలో జేఏసీ తెరాస కనుసన్నల్లో నడుస్తున్నదని ఇతర రాజకీయ పక్షాలు విమర్శించినా, తమ మాట వినడంలేదని కోదండరామ్‌ మీద టీఆర్‌ఎస్‌ పెద్దలు అలకబూని పరోక్ష సహాయ నిరాకరణకు దిగినా చలించకుండా ఉద్య మానికి జేఏసీని బాసటగా నిలిపింది కోదండరామ్‌ నాయకత్వ దక్షతే.

జేఏసీ ఆవిర్భావ సభ చరిత్రాత్మకమే
తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ ఆవిర్భవించి మొన్న 24వ తేదీకి ఏడేళ్లు నిండిన సందర్భంగా సభ జరిగింది. తెలంగాణ సాధన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టడానికి కూడా సిద్ద్ధమై చంద్రశేఖరరావు చేసిన ఆమరణ దీక్షను గుర్తుచేసుకోడానికి దీక్షా దివస్‌ నిర్వహించడం ఎంత సమంజసమో, జేఏసీ ఆవిర్భావ సభను జరుపుకోవడం అంతే సమంజసం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధానపాత్ర నిర్వహించిన జేఏసీని మరచిపోవడానికి వీలులేదు. అయితే లక్ష్యం నెరవేరిన తరువాత కూడా జేఏసీ అవసరం ఏముంది? అన్న ప్రశ్న వినిపిస్తున్నది. ఉద్యమ సంస్థగా ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర సమితి విషయంలో కూడా అప్పట్లో ఇటువంటి వాదనే వినిపించింది. అయితే టీఆర్‌ఎస్‌ ఉద్యమ సంస్థ నుంచి ఫక్తు రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది ఎన్నికల బరిలో నిలిచి అధికారం చేజిక్కించుకుంది. నిజానికి ఇవాళ పేరుకే అది పొలిటికల్‌ జేఏసీ కానీ, అందులో టీఆర్‌ఎస్‌ సహా ఏ రాజకీయ పార్టీ భాగస్వామి కాదు.

ఉద్యమకాలంలో ఉన్న ఉద్యోగ సంఘాలు కూడా ఇప్పుడు దూరమ య్యాయి. కొందరు ఉద్యోగ సంఘాల నాయకులకూ, జేఏసీలో క్రియాశీలక పాత్ర నిర్వహించిన ఇతర విద్యార్థి నాయకులకూ, మేధావులకూ కొన్ని ప్రభుత్వ పదవులు వచ్చాయి. అట్లా పదవులు పొందిన వారి అర్హతలను ప్రశ్నించాల్సిన అవసరం లేదు. కానీ జేఏసీని కొనసాగించడానికీ, దానిని మళ్లీ పునర్వ్యవస్థీకరించడానికీ సాగుతున్న ప్రయత్నం మీద ఎందుకు పెద్ద ఎత్తు్తన దాడి జరుగుతున్నది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మళ్లీ అన్యాయం జరగకుండా సచివాలయం ముందు కుర్చీ వేసుకుని కూర్చుని కాపలా కాస్తాను అన్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో పరిపాలనలో జరిగే పొరపాట్ల మీద విమర్శలు చేసే వారి పట్ల అసహనం సముచితమేనా? కాంగ్రెస్‌ పార్టీ తరఫున బీఫారం తీసుకుని పోటీ చేసి గెలిచిన శాసన సభ్యులను రాజీనామా చేయించకుండా తమ బలాన్ని పెంచుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీలోని ఏ నాయకుడికి అయినా కోదండరామ్‌ టీఆర్‌ఎస్‌ ఏజెంట్‌ అనే అర్హత ఎట్లా ఉంటుంది? జేఏసీ ఏర్పడే వరకూ కోదండరామ్‌ ఏ రాజకీయ పార్టీలోనూ సభ్యుడుకాదు. భవిష్యత్తులో ఆయన ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే ఎవరికీ ఆక్షేపణ ఉండాల్సిన పనిలేదు. ప్రభుత్వ కార్యక్రమాలూ, పథకాల మీద జేఏసీ కానీ, కోదండరామ్‌ కానీ చేసే విమర్శలు అవాస్తవాలు అయితే వివరణ ఇచ్చే అవకాశాన్ని, అవసరాన్ని వదిలేసి అసహనాన్ని వ్యక్తం చెయ్యడం, అందునా గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించిన చందంగా రాజ కీయాల్లో ఓనమాలు కూడా నేర్వని బాల్క సుమన్‌ వంటి వాళ్ల చేత దాడి చేయించడం ఆరోగ్యకరం కాదు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికార పక్షం కార్యాచరణ చూసిన ఎవరికైనా అర్థమవుతుంది ప్రతిపక్ష రాజకీయ పార్టీల ఉనికిని కూడా అది సహించజాలదని. ఆ మేరకు ఇతర రాజకీయ పక్షాలను నిర్వీర్యం చేసే కార్యక్రమం కొనసాగుతుండగానే శత్రువు జేఏసీ రూపంలో వస్తున్నాడేమో అన్న సందేహం, ఆందోళన కారణంగానే ఇవాళ అధికారపక్షం కోదండరామ్‌ మీద కత్తి్త కట్టినట్టు కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రజలు పెద్ద ఎత్తున ఆదరించారు. ఇంకా ఆదరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు ఆ విశ్వసనీయత రావడంలో జేఏసీ పాత్ర కూడా ఉంది. ఆ కారణం కూడా తోడై ఇతర రాజకీయపక్షాలు ఇవాళ నామ మాత్రంగా, నిష్క్రియాపరంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో జేఏ సీని బలోపేతం చేసే ఆలోచన కోదండరామ్‌ వంటి వారికి రావడాన్ని సహ జంగానే అధికారపక్షం జీర్ణించుకోలేకపోతున్నది.

కోదండరామ్‌ నాయకత్వంలో బలోపేతం కావాలనుకుంటున్న జేఏసీ భవిష్యత్తులో రాజకీయ స్వరూపం తీసుకుంటుందా లేదా అన్నది ఇప్పుడే నిర్ణయించలేం కానీ, నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ శూన్యం మాత్రం ప్రజాస్వామ్య వాతావరణాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తు న్నది. ప్రత్యామ్నాయ రాజకీయాలను ప్రజాస్వామ్యవాదులంతా ఆహ్వానిం చాల్సిందే.


(వ్యాసకర్త : దేవులపల్లి అమర్‌, ఐజేయూ సెక్రటరీ జనరల్
datelinehyderabad@gmail.com)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement