సినీ ఖైదీ రాజకీయ అభిలాష | Opinion on Chiranjeevi Khaidi No.150 Movie by Devulapalli Amar | Sakshi
Sakshi News home page

సినీ ఖైదీ రాజకీయ అభిలాష

Published Wed, Jan 11 2017 1:12 AM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM

సినీ ఖైదీ రాజకీయ అభిలాష

సినీ ఖైదీ రాజకీయ అభిలాష

డేట్‌లైన్‌ హైదరాబాద్‌
చిరంజీవి చేసిన 150వ సినిమా ఆయన రాజకీయ జీవితంలో భాగంగా చూడాలంటే మాత్రం కుదరదు. అది తమిళంలో అద్భుతంగా నడిచిన సినిమా. నీళ్లు, రైతుల కడగండ్లు ప్రధాన ఇతివృత్తంగా కథ నడుస్తుంది. చిరంజీవి సహా ఆయన సమర్ధకులంతా ఈ సినిమాతో రైతుల సమస్యలు తీసుకుని గొప్ప పోరాటం చేసినట్టు చెప్పుకోవడం సమంజసం కాదు. రాజకీయాల్లో ఉండి, ఈ తొమ్మిది సంవత్సరాలు మీరు రైతులకు ఏం ఒరగబెట్టారు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వస్తుంది.

రాజకీయాలు కొందరికి వృత్తి, మరి కొందరికి హాబీ, మరెందరికో వ్యాపారం. అయితే రాజకీయాలు ఇంతకంటే భిన్నమైనవీ, ఇంతకంటే విలక్షణమైనవీ, ఇంతకంటే ఉదాత్తమైనవీ అన్న విషయం చాలా మంది రాజకీయ నాయకులు మరచిపోతున్నారు. ప్రజల కోసం జీవించడం అసలైన రాజకీయం అన్న విషయం తెలియని చాలామంది, సంపన్నులు కావడానికి రాజకీయాలు షార్ట్‌కట్‌ అనుకుంటుంటారు. అందుకే రాజకీయాల్లోకి వస్తారు. చెల్లితే స్థిరపడిపోతారు. చెల్లకపోతే వాపస్‌ వెళ్లిపోతారు. రాజకీయాలంటే పై మూడింటితో పాటు అధికారం కూడా అనుకుంటారు చాలామంది. ఒకసారి వస్తే ఆ అధికారం శాశ్వతమని నమ్మేవాళ్లు కొందరైతే, దాన్ని శాశ్వతం చేసు కోవడానికి నానా గడ్డీ కరవడానికి సిద్ధపడే వాళ్లు మరికొందరు. చేతికొచ్చిన అధికారాన్ని ఏంచేసైనా సరే కాపాడుకోవడం, కలకాలం చేజారిపోకుండా చూసుకోవడం రాజనీతి అని కొందరు అనుకుంటారు. ఆ రకంగా తమను మించిన రాజనీతిజ్ఞులు ప్రపంచంలో లేరని నమ్ముతుంటారు. అదే విషయం అందరికి చెబుతుంటారు కూడా. ఇట్లాంటి వారంతా ఇతరేతర కారణాలతో అధికారంలోకి వచ్చినా తెరమరుగు అయ్యాక చరిత్ర వీరిని మరచిపోతుంది. కొందరు మాత్రం కొంతలో కొంత అయినా జనం కోసం ఏదో ఒకటి చెయ్యా లనే తపన పడి సాధ్యమైనంత మేలు చేసి చిరస్థాయిగా నిలిచిపోతారు. సమ కాలీన రాజకీయాల పోకడ మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం నాయకులు రాజకీయాల అర్థం మార్చేస్తున్నారు. అధికారాన్ని శాశ్వతం చేసుకోవడం కోసం రాజకీయాలకే కొత్త నిర్వచనం చెబుతున్నారు.

ప్రజారాజ్యం ముందూ–వెనుకా
ఇటువంటి ఒకానొక సమయంలో రాజకీయాలలోకి వచ్చారు ప్రముఖ నటుడు చిరంజీవి. 2007లో తన 149వ సినిమా శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌ విడుదలైన తరువాత 2008లో ఆయన సొంత పార్టీ ప్రజారాజ్యం స్థాపిం చారు. దేశ పౌరులందరికీ రాజకీయాలలోకి వచ్చే స్వేచ్ఛ ఉన్నట్టే చిరంజీవికి కూడా ఉంది. ఆయన సొంత పార్టీ పెట్టుకున్నా, మళ్లీ ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినా అది ఆయన ఇష్టం. రాజకీయాలకు కామా పెట్టి 150వ చిత్రంలో నటించినా ఎవరూ ఆక్షేపించనక్కరలేదు. ‘కామా పెట్టి’ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే 150వ సినిమా చేస్తున్నాను అన్నారు తప్ప రాజకీయాల నుంచి శాశ్వతంగా నిష్క్రమిస్తున్నాను అని ఫుల్‌స్టాప్‌ పెడు తున్నట్టు ఆయన ప్రకటించలేదు కాబట్టి. నిజానికి ఆయన రాజకీయాల్లో నుంచి తప్పుకుంటున్నాను అని ప్రకటించి ఉంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆయన సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు ఇబ్బందులు కల్పించి ఉండేది కాదేమో! అలాగే ఆయన తమ్ముడు, జనసేన పార్టీ నాయకుడు పవన్‌ కల్యాణ్‌ కూడా ఈ కార్యక్రమానికి గైర్హాజరై ఉండేవారు కాదేమో! ఇప్పటికైతే చిరంజీవి ఇంకా కాంగ్రెస్‌ నాయకుడే. ఆ పార్టీకి చెందిన కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభ సభ్యుడు కూడా.

చిరంజీవి సినిమాలకే పరిమితమైనా, రాజకీయాల్లోకి వచ్చాక ఇక సినిమాల వైపు చూడకపోయినా ఆయన గురించి ఇది చర్చిం చుకునే సందర్భం అయ్యేది కాదు. సినిమా రంగానికే పరిమితమై ఆయన మంచిచెడులను గూర్చి మాట్లాడేవాళ్లం, రాజకీయాల్లోనే ఉండిపోతే ఇంకో రెండేళ్ల పాటు ఆయన గురించి, ఆయన పార్టీ కాంగ్రెస్‌ గురించి మాట్లాడు కోవడానికి పెద్దగా ఏమీ ఉండేది కాదు. ఆయన రాజకీయాల్లో కొనసాగు తూనే మళ్లీ సినిమా మీద దృష్టి పెట్టిన సమయం సందర్భం కారణంగా ఈ చర్చ తప్పనిసరైంది. సమయం సందర్భం అంటే సంక్రాంతికి కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి 150వ సినిమా, తెలుగుదేశం శాసనసభ్యుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం రెండింటి విడుదల. సంక్రాంతి సందర్భంగా బాలకృష్ణ సినిమాలు ఇప్పటి వరకు 18 విడుదల అయ్యాయట. అందులో ఆరు సినిమాలు చిరం జీవి సినిమాలతో పోటీ పడి బాక్సాఫీస్‌ హిట్‌ అయ్యాయి. గతంలో లాగా వీళ్లు సినిమా నటులు మాత్రమే కాదు, రెండు వైరి రాజకీయ పక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులు, రెండు సామాజిక వర్గాలకు ప్రతినిధులు.

ఆ ముగ్గురూ...
తెలుగునాట సినిమా రంగానికీ, రాజకీయాలకూ మధ్య రేఖలు పూర్తిగా చెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయానికి ఇప్పుడున్న రాజకీయ వాతావరణమే కొనసాగితే ముగ్గురు నటులు మూడు పార్టీలుగా ఎన్నికల బరిలోకి దిగి తమకు ఎంత ప్రజా భిమానం ఉందో తేల్చుకోవచ్చు. అప్పటిదాకా అదే పార్టీలో  కొనసాగితే 2019లో చిరంజీవి కాంగ్రెస్‌కు స్టార్‌ ప్రచారకుడవుతారు, పోటీ చెయ్యాలన్న ఆలోచనలో మార్పు రాకపోతే పవన్‌ కల్యాణ్‌ తన పార్టీ జనసేనకు ఆకర్షణగా నిలబడతాడు. ఇక మూడో నటుడు, అధికారపక్షంలో ఉన్న మరో నటుడు, శాసనసభ్యుడు, మహానటుడు ఎన్టీ రామారావు కుమారుడు బాలకృష్ణ. ఇది ఆంధ్రప్రదేశ్‌లో రెండు సామాజిక వర్గాల మధ్య ఎంతోకాలంగా ఉన్న రాజకీయ ఘర్షణగా కూడా తీసుకోవచ్చు. కాపు సామాజిక వర్గానికి రిజర్వే షన్‌లు కల్పించకుండా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాన్ని తుంగలో తొక్కిందని ఆందోళన చేస్తున్న మాజీమంత్రి, సీనియర్‌ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభానికి మద్దతుగా నిలబడ్డారు చిరంజీవి. కాగా కాపులకు అన్యాయం చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు పార్టీలో ఒక నాయకుడు బాలకృష్ణ.
 
ఆ రాజకీయ సినిమాకి ఇంకా రెండేళ్ల సమయం ఉంది కాబట్టి ఇప్పుడు అసలు సినిమాల గురించి మాట్లాడుకుందాం. రాజకీయాల్లో కొనసాగుతూ సినిమాల్లో నటించడం సమంజసమేనా అన్న చర్చ జరుగుతున్నది. రాజ కీయాల్లోకి వచ్చాక ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉంటూ విశ్వామిత్ర సినిమాలో నటించారు. సినిమా షూటింగ్‌ జరిగిన నాచారం స్టూడియోకి అధికారులు ఫైళ్లు చంకన పెట్టుకుని సంతకాల కోసం వెళ్లేవారు. ఆయన విశ్వామిత్రుడి మేకప్‌లోనే ఆ ఫైళ్ల మీద సంతకాలు చెయ్యడం దేశమంతటా పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించాయి. ఎన్‌టీఆర్‌ను నటుడిగా ఆరాధించి, ఆ కారణంగానే కాంగ్రెస్‌ను మట్టికరిపించి తెలుగుదేశంను అధికారంలోకి తీసుకొచ్చిన తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రిగా ఆయన సినిమాల్లో వేషాలు వెయ్యడం నచ్చలేదు. అందుకే ఆ వెంటనే వచ్చిన ఎన్నికల్లో  తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది.

ఎటు ప్రయాణం?
ఇక చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఏర్పాటు చేసిన తిరుపతి బహిరంగ సభలో ‘నాకు గంజీ తెలుసు, బెంజీ తెలుసు’ అని ప్రకటించి తొమ్మిదేళ్ల తరువాత ‘బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ ’ అంటూ 150వ సినిమాతో మళ్లీ రంగ ప్రవేశం చెయ్యడం చర్చనీయాంశమైంది. అయితే బాస్‌ మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లరా? అన్న ప్రశ్న తెర మీదకు వచ్చింది. ఇవాళ విడుదల అవుతున్న సినిమా సక్సెస్‌ మీద ఆధారపడి ఉంటుందేమో రాజకీయ భవిష్యత్తు మీద ఆయన నిర్ణయం. రాజకీయాల్లో కొనసాగడమా, శాశ్వతంగా సినిమాల్లోకి తిరిగి రావడమా లేక అక్కడో కాలు, ఇక్కడో కాలు వేసి అదృ ష్టాన్ని పరీక్షించుకోవడమా అన్నది చిరంజీవి నిర్ణయించుకుంటారు. కానీ ఆయన చేసిన 150వ సినిమా ఆయన రాజకీయ జీవితంలో భాగంగా చూడా లంటే మాత్రం కుదరదు. ఈ సినిమా తమిళంలో అద్భుతంగా నడిచిన సినిమా. నీళ్లు, రైతుల కడగళ్లు ప్రధాన ఇతివృత్తంగా కథ నడుస్తుంది. చిరంజీవి సహా ఆయన సమర్ధకులంతా ఈ సినిమాతో రైతుల సమస్యలు తీసుకుని గొప్ప పోరాటం చేసినట్టు చెప్పుకోవడం సమంజసం కాదు. రాజ కీయాల్లో ఉండి, ఈ తొమ్మిది సంవత్సరాలు మీరు రైతులకు ఏం ఒరగ బెట్టారు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇక అరవయ్యవ పడిలో పెద్దల సభ అని గౌరవంగా చెప్పుకునే రాజ్యసభ సభ్యుడై ఉండి, కేంద్ర మాజీమంత్రి అయి ఉండి చవకబారు పాటలకు చేసే డ్యాన్స్‌లను మాత్రం జనం మెచ్చరు.

ఈ సందర్భంలో మహానటుడు అమితాబ్‌ బచ్చన్‌ గుర్తొస్తున్నాడు. ఆయన నెహ్రూ–గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. రాజీవ్‌గాంధీకి ఆప్తమిత్రుడు. ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో మిత్రుడి కోరిక మేరకు అలహాబాద్‌ నుంచి పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కానీ కొద్ది మాసాల్లోనే పదవికి రాజీనామా చేశారు. అప్పుడాయన చేసిన వ్యాఖ్య, ‘నేను నటుడిని, సినిమాల్లోనే తప్ప రాజకీయాల్లో నటించలేను’ అని.

(వ్యాసకర్త : దేవులపల్లి అమర్‌, ఐజేయూ సెక్రటరీ జనరల్
datelinehyderabad@gmail.com)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement