అత్యంత ‘సీనియర్‌’ అబద్ధాలు | Devulapalli amar writes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

అత్యంత ‘సీనియర్‌’ అబద్ధాలు

Published Wed, Jun 7 2017 1:18 AM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM

అత్యంత ‘సీనియర్‌’ అబద్ధాలు

అత్యంత ‘సీనియర్‌’ అబద్ధాలు

డేట్‌లైన్‌ హైదరాబాద్‌
రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలూ నాకు కావలసిన వాళ్లే, తెలంగాణలో కూడా పార్టీని అధికారంలోకి తెస్తానని చెప్పిన చంద్రబాబు కోదాడ దాటి జగ్గయ్యపేట చేరగానే స్వరం మార్చి చీకటిరోజు, హత్య అని మాట్లాడితే, అవతల అదేరోజున సంతోషంగా సంబరాలు జరుపుకున్న తెలంగాణ ప్రజల మనోభావాలు ఎంత దెబ్బ తిని ఉంటాయి? దేశంలోనే అత్యంత సీనియర్‌ నాయకుడూ, ఏకైక స్టేట్స్‌మన్‌ మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? పైగా అది హత్యే అనుకుంటే అందుకోసం ఒకటి కాదు, రెండుసార్లు లేఖాయుధాలు అందించింది చంద్రబాబు కాదా?
 
భారతదేశంలో స్వయం ప్రకటిత అత్యంత సీనియర్‌ రాజకీయ నాయకుడు నారా చంద్రబాబునాయుడుకు చరిత్ర అంటే గిట్టదు. చరిత్ర చదువుకోవడం శుద్ధ దండగ అంటారాయన. చరిత్రను గుర్తు పెట్టుకోవడం కూడా పరమ వేస్ట్‌ అని ఆయన నిశ్చితాభిప్రాయం. అందుకే ఆయన మొదటి విడత ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చరిత్ర, సామాజిక శాస్త్రాలను పాఠ్యాంశాల నుంచి తొలగించాలని ప్రకటనలు చేసేవారు. నిజానికి ఆయనకు దేని మీదా ఒక కచ్చితమైన అభిప్రాయం ఉండదు. అవసరాన్ని బట్టి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి కూడా. అభిప్రాయాలు మార్చుకోనివాడు రాజకీయ నాయకుడు కాదన్న గిరీశం ఆయనకు ఆదర్శం. ఇంకో విషయం కూడా చెప్పాలిక్కడ. చంద్రబాబునాయుడుకు చరిత్ర అన్నా, దాన్నిగుర్తు పెట్టుకోవడం అన్నా చాలా భయం కూడా. ఆయన అభిప్రాయాలూ, భయాలూ ఎట్లా ఉన్నా చరిత్ర పునాదుల మీదనే వర్తమానం, భవిష్యత్తు నిర్మితమవుతాయన్న విషయం ఆయనకు, ఆయన వంటి అభినవ గిరీశాలకు అప్పుడప్పుడు గుర్తుచేస్తూ ఉండాల్సిందే.
 
చరిత్ర చదవరాదు, గుర్తు పెట్టుకోరాదు
చరిత్రను గుర్తు పెట్టుకున్నా, జ్ఞాపకం చేసుకున్నా ఆయన మనసుకు నచ్చని బోలెడు విషయాలు మనో ఫలకం మీదకు వచ్చి చికాకు పరుస్తాయి. ఇప్పుడా విషయాలన్నీ ఇక్కడ ఏకరువు పెట్టడం కుదరదు కానీ, మచ్చుకు ఒకటి రెండు చెప్పుకోవచ్చు. కాంగ్రెస్‌ పార్టీలో ఉండి, అక్కడ పదవులు అనుభవించి ఆ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరిన విషయం, రెండోసారి రాజకీయ భిక్ష పెట్టిన మామ ఎన్టీఆర్‌ను దించేసి అధికారం చేజిక్కించుకున్న విషయం వగైరాలన్నీ ఉన్న చరిత్రను జ్ఞాపకం చేసుకుంటే ఇబ్బందిగా ఉంటుంది.
 
నారావారిపల్లె నుంచి అమరావతి దాకా ఆయన రాజకీయ ప్రయాణంలో ఇటువంటి చికాకు కలిగించే కఠోర సత్యాలు ఎన్నో. అందుకే ఆయనకు చరిత్ర అంటే చికాకు. దానికి తోడు దేశంలోనే అత్యంత సీనియర్‌ నాయకుడు కాబట్టి ఆయన ఏం చెబితే అది జనం నమ్మేస్తారన్న గొప్ప విశ్వాసం. హైదరాబాద్‌ తన బ్రెయిన్‌ చైల్డ్‌ అన్నా, ఇటలీకి స్వాతంత్య్రం వచ్చింది జూన్‌ రెండునే అన్నా, రాష్ట్ర విభజనను హత్యతో పోల్చినా, జూన్‌ రెండును చీకటిరోజు అన్నా చంద్రబాబునాయుడికే చెల్లింది. ఇంకొకరెవరూ అంత సునాయాసంగా అసత్యాలు పలకలేరు.
 
2014లో ఆంధ్రప్రదేశ్‌ విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది జూన్‌ రెండవ తేదీన కాబట్టి తెలంగాణ వారు నూతన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి ఏడాది అదే రోజున ఘనంగా జరుపుకుంటారు. అందులో లాజిక్‌ ఉంది. తెలంగాణ విడిపోగా మిగిలిన ఆంధ్రప్రదేశ్‌ తన అవతరణ దినోత్సవాలు ఎప్పుడు జరుపుకోవాలి? దానికి కూడా ఒక లాజిక్‌ ఉంటుంది కదా! రెండు రాష్ట్రాలయ్యాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్‌ కూడా జూన్‌ రెండునే పునరవతరణ దినోత్సవం జరుపుకోవచ్చు. లేదా రాజధాని లేకపోయినా ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాష్ట్రం కాదు కాబట్టి 1956 నవంబర్‌ ఒకటిన ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌గానే కొనసాగి, ఆ రోజునే ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాలు జరుపుకోవాలి. 
 
నిజానికి ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం సూచించింది కూడా నవంబర్‌ ఒకటినే అవతరణ దినోత్సవాలు జరుపుకోవాలని. అట్లా కుదరదు, అందులోని తెలం గాణ విడిపోయింది కదా అనుకుంటే కంపోజిట్‌ మద్రాస్‌ రాష్ట్రం నుంచి విడిపోయిన సంవత్సరం, నెల తేదీనయినా గుర్తు చేసుకుని ఆ రోజును ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలి. పోనీ అవేవీ కాదంటే 2014, జూన్‌ ఎనిమిదిన తమ ప్రభుత్వం ఏర్పాటు కోసం తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునయినా అవతరణ దినోత్సవంగా తాత్కాలికంగా పాటించే అవకాశం ఉంది. తాత్కాలికం అనడం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒకే పార్టీ ఎల్లకాలం అధికారంలో ఉండదు కాబట్టి, రేపు అధికారంలోకి వచ్చే పార్టీ చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం రోజును రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకోదు కాబట్టి.
 
ఆంధ్రాకు అవతరణ దినోత్సవం లేదు
మొత్తానికి ఈ గందరగోళంలో పడి ఒక ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్‌కు అవతరణ దినోత్సవం అనేది లేకుండా చేశారు చంద్రబాబునాయుడు. ఇంత అనుభవం కలిగిన దేశంలోనే అత్యంత సీనియర్‌ రాజకీయ నాయకుడు ఈ వ్యవహారాన్ని ఎందుకింత కంగాళీ చేశారో ఎవరికీ అంతుబట్టడం లేదు. జూన్‌ రెండును ఆయన చీకటిరోజు అంటున్నారు, ఆ రోజున ఒక ఘోర హత్య జరిగిందని కూడా చెపుతున్నారు, ఇటలీ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు కాబట్టే ఆ రోజున మనకీ కష్టాలు కలిగించారని చెపుతున్నారు. చివరిమాట మొదలు మాట్లాడుదాం, ఇటలీకి స్వాతంత్య్రం వచ్చింది జూన్‌ రెండున కాదు. జూన్‌ రెండు ఇటలీ రిపబ్లిక్‌డే. చరిత్ర అంటే గిట్టదు కాబట్టి ఇటువంటి తప్పులు చెయ్యడం చంద్రబాబుకు కొత్తేం కాదు. 
 
కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని విడగొట్టింది కాబట్టీ, ఆ ప్రభుత్వాన్ని నడిపించింది సోనియా గాంధీ కాబట్టీ, ఆ సోనియాగాంధీ ఇటలీ దేశస్తురాలు కాబట్టీ, మొన్న జూన్‌ రెండు బెజవాడ బెంజ్‌ సర్కిల్‌లో ఖాళీ కుర్చీల చేత నవ నిర్మాణ దీక్ష చేయించిన సందర్భంగా చంద్రబాబు ఇటలీ ప్రస్తావన తెచ్చి ఉంటారు. కుర్చీలకు ఆలోచించే తెలివి ఉండదు కదా, అందుకే నమ్మేశాయి. మనుషులు నమ్మడం ఎట్లా? ఇక చీకటిరోజు, ఘోర హత్య గురించి మాట్లాడుకుందాం. ఓ వారం పదిరోజుల కిందే అనుకుంటా హైదరాబాద్‌లో జరిగిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో మాట్లాడాడు చంద్రబాబునాయుడు. ఆ సభలో ఆయనకు చీకటిరోజు కానీ, హత్య సంఘటన కానీ గుర్తే రాలేదు.
 
రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలూ నాకు కావలసిన వాళ్లే, తెలంగాణలో కూడా పార్టీని అధికారంలోకి తెస్తానని చెప్పిన చంద్రబాబు కోదాడ దాటి జగ్గయ్యపేట చేరగానే స్వరం మార్చి చీకటిరోజు, హత్య అని మాట్లాడితే, అవతల అదేరోజున సంతోషంగా సంబరాలు జరుపుకున్న తెలంగాణ ప్రజల మనోభావాలు ఎంత దెబ్బతిని ఉంటాయి? దేశంలోనే అత్యంత సీనియర్‌ నాయకుడూ, ఏకైక స్టేట్స్‌మన్‌ మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? పైగా అది హత్యే అనుకుంటే అందుకోసం ఒకటి కాదు, రెండుసార్లు లేఖాయుధాలు అందించింది చంద్రబాబునాయుడు కాదా? చీకటిరోజే అనుకుంటే తానూ, తనతోబాటు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వారు కూడా ఆ దీపాలు ఆర్పిన వాళ్లలో ఉన్నారు కదా! ఇటువంటి వ్యాఖ్యల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను రెచ్చగొట్టగలమనుకుంటే పొరపాటు. 
 
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆయన లాగా చరిత్రను విస్మరించే వాళ్లు కాదు. ఆ ప్రయోజనం నెరవేరక పోగా తెలంగాణలో కొడిగట్టిన తెలుగుదేశం పార్టీ దీపం పూర్తిగా ఆరిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ హైదరాబాద్‌లో మాట్లాడిన మాటలు విజయవాడకు, అక్కడ అమరావతిలో మాట్లాడిన మాటలు హైదరాబాద్‌కు తెలియక పోవడానికి మనం మధ్య యుగాల్లో లేము. చంద్రబాబు గారే ప్రవేశపెట్టానని చెప్పుకుంటున్న ఇంటర్నెట్‌ యుగంలో ఉన్నాం. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల మధ్య అగాధం సృష్టించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాల వల్ల ఫలితం ఏమీ ఉండదు. రాజకీయ నాయకుల కంటే మన ప్రజలు చాలా విజ్ఞత కలవారు.
 
నవ నిర్మాణ ఊదర
జూన్‌ రెండున తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని మరునాటి నుంచి ఎవరి పనుల్లో వాళ్లు పడిపోతుంటే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు మాత్రం జూన్‌ రెండు నుంచి మొదలు పెట్టి తాను ప్రమాణ స్వీకారం చేసిన జూన్‌ ఎనిమిది వరకూ వారం రోజుల పాటు నవ నిర్మాణ దీక్షల పేరిట ప్రజలనూ, ప్రభుత్వాన్ని వేరే పని చేసుకోకుండా గంటల తరబడి ఉపన్యాసాలతో ఊదరగొట్టేస్తున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కేవీపీ రామచంద్రరావు ఎక్కడో మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ఉపన్యాసాలు వినీ వినీ ప్రజల చెవుల్లో నుంచి రక్తాలు కారుతున్నాయన్నారు. నవ నిర్మాణ దీక్షతో ప్రారంభం అయి, పునరంకిత దీక్షతో ముగిసే ఈ వారం రోజుల కార్యక్రమంతో ఆచరణలో ఒరుగుతున్నదేమిటో అర్ధం కాక అధికారపక్షం వారే విసుక్కుంటున్నారు. 
 
చంద్రబాబునాయుడి పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఒక అయిదేళ్లు తమ రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించుకునే అవకాశం అయితే కోల్పోయారు. ఇది ఆ రాష్ట్ర అస్తిత్వానికి సంబంధించిన అంశం అన్న విషయం ఎవరూ మరిచిపోగూడదు. రాష్ట్ర విభజన వల్ల రాజధాని తెలంగాణలో ఉండిపోయిన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ఎదుర్కొంటున్న సమస్యలకు సరైన పరిష్కారాలు ఆలోచించాలి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను కష్టాలనుండి గట్టెక్కిస్తానని ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాల అమలు గురించి ఆలోచించాలి తప్ప నెపం ఇతరుల మీదకు నెట్టి దీక్షా జపం చేస్తూ కూర్చుంటే ప్రజలు హర్షించరు.
దేవులపల్లి అమర్‌
datelinehyderabad@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement