ఈ ‘ఆగ్రహం’ అంతరార్థం?
డేట్‌లైన్ హైదరాబాద్
ఏపీ ప్రత్యేకహోదాపై రాజ్యసభలో జరిగిన చర్చకు జైట్లీ సమాధానం ఇచ్చాక చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ కేంద్రం మీద సంధించిన విమర్శలన్నీ ఆయనకూ, ఆయన ప్రభుత్వానికి సరిగ్గా వర్తిస్తాయి. ‘హామీలను నెరవేర్చని పార్టీలను ప్రజలు ఇంటికి పంపుతారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రజలు ఊరుకోరు. ప్రజలు చాలా తెలివైన వారు, దేనికయినా ఒక లాజికల్ ముగింపు ఇస్తారు’. ఈ డైలాగులు ఎవరికి వర్తిస్తాయి? అవును, ప్రజలు తెలివైనవాళ్లు. అది రుజువు కావడానికి ఇంకో రెండున్నరేళ్లు పడుతుంది.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సాచివేత ధోరణి చంద్రబాబు నాయుడుకు ఆగ్రహం తెప్పించింది. రెండు రోజుల పాటూ రాజ్యసభలో ఆరున్నర గంటలు సాగిన చర్చ అనంతరం అరుణ్ జైట్లీ ఇచ్చిన సమాధానం విని ఆయన రక్తం సల సల కాగింది. ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? అని ఆయన చాలా ఆవేశంగా ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కొడుకు చెప్పినా వినను. జైట్లీ సమాధానం వింటుంటే ఒళ్లు మండిపోతున్నది. మోదీని నేనెందుకు కలవాలి? అని చంద్రబాబు చాలా తీవ్రంగా స్పందించారు. చంద్రబాబుకు హఠాత్తుగా ఇంత కోపం ఎందుకొచ్చింది?
ప్రత్యేక హోదా రాదన్న నోరే...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ ధోరణిలోకి ఎందుకు వచ్చారంటే... రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు దాటిపోయింది. ఈ రెండేళ్లూ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని వేదికల మీదా, అన్ని రకాలుగా ప్రత్యేక హోదా కావాలని పోరాడింది. ఆ తదుపరి ఇతర రాజకీయ పార్టీలూ అదే మార్గం పట్టి, ఏపీ ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి వీధుల్లోకి వచ్చాయి. చివరికి ప్రధాన ప్రతిపక్షం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఆ బంద్‌ను రాష్ట్రమంతటా ప్రజలు విజయవంతం చేయబోతున్నారని అర్థం అయ్యాక చంద్రబాబుకు ఆగ్రహం వచ్చింది. 2014 జూన్ 8న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ప్రత్యేక హోదా కోసం ఏపీ ప్రజలు బంద్‌కు ఉపక్రమించిన నిన్నటి వరకు ఆయన అనేక సందర్భాల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదనీ, అది రాదనీ తన మాటల ద్వారా చేతల ద్వారా స్పష్టం చేశారు.
ప్రత్యేక హోదా సంజీవని కాదు, ఏళ్ల తరబడి ప్రత్యేక హోదాను అనుభవించిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి, ఏం బావుకున్నాయి? అని ఆయన అనేకమార్లు స్పష్టంగా అన్నారు. ప్రత్యేక హోదా అవసరాన్ని గురించిన ప్రస్తావన తెచ్చిన వారినందరినీ హేళన చేసి మాట్లాడారు. ప్రత్యేక హోదా కోరుతూ నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్న ప్రతిపక్ష నేత పట్ల అవమానకరంగా, అనాగరికంగా వ్యవహరించి దీక్షను భగ్నం చేశారు. మేధావులూ, ప్రజా సంఘాలూ, ప్రతిపక్ష రాజకీయ పార్టీల వారూ రాష్ట్రాభివృద్ధి కోసం తాను చేస్తున్న యాగాన్ని అడ్డుకునే రాక్షసుల్లా తయారయ్యారనీ, వాళ్లు అసలు ఉండకూడదనీ చాలాసార్లు మాట్లాడారు. ఇదంతా ఎందుకంటే ఎన్డీఏ హయాంలో ఏపీకి ప్రత్యేక హోదా రాదని ఆయనకు, ఆయన పార్టీ వారికి స్పష్టంగా తెలుసు. పదేళ్లు హోదాను కోరిన తన మిత్రుడు వెంకయ్య నాయుడూ, చాలదు పదిహేనేళ్లు ఇవ్వమన్న తానూ కలిసి తపస్సు చేసినా కేంద్రం దిగిరాదనీ, కేంద్రం మెడలు వంచే శక్తి తనకు లేదనీ కూడా చంద్రబాబుకు తెలుసు.
మారిన మాట-మారని రూటు
ఈ రెండేళ్లుగా జరిగిన ఉదంతాలను వివరించడానికి ఇక్కడ స్థలం సరిపోదు. ఒకే ఒక్క సంఘటన గురించి మాట్లాడుకుందాం. అది చంద్రబాబు మానస ‘‘పత్రిక’’లు నిన్న ప్రస్తావించిన విషయమే. ‘‘గత ఏడాది (2015) ఆగస్టు 25న ప్రధాన మంత్రి కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్యాకేజీ ముసాయిదా రూపకల్పన బాధ్యతను నీతి ఆయోగ్‌కు అప్పగించారు. ఆ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర కేంద్ర ఆర్థికశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. దాని కొనసాగింపుగానే నీతి ఆయోగ్ తన సిఫారసులను కేంద్ర ఆర్థికశాఖకు సమర్పించింది.’’ ఏడాది కిందటి ఈ వార్తను ఆ ప్రముఖ దినపత్రిక మళ్లీ ఎందుకు ప్రస్తావించవలసి వచ్చింది? చంద్రబాబు చెబుతున్నట్టుగా గాక, ప్రత్యేక హోదా విషయంలో ప్రజల మనోభావాలు బాగా దెబ్బతిన్నాయనీ, ప్రతిపక్షం చేస్తున్న ఆందోళనను వారు బలంగా సమర్థిస్తున్నారనీ అర్థం చేసుకున్న వెంకయ్యనాయుడు సోమవారం ప్రధానిని కలిసి, నీతి ఆయోగ్ ఏ సూచనలను చేసిందో వాకబు చేశారు. ఆ కథనాన్ని తెలిపే సందర్భంగా దానికి ప్రాతిపదిక 2015 ఆగస్టు 25 నాటి సమావేశమేనని తెలపడం కోసమే దాన్ని ప్రస్తావించాల్సి వచ్చింది.
బట్టీయం డైలాగులు ఎవరి కోసం?
అంటే ఎన్డీఏ హయాంలో ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే సమస్యే లేదని, ప్యాకేజీలు మాత్రమే వస్తాయని చంద్రబాబుకు 2015 ఆగస్టు నాటికే తెలుసు. అయినా ఆయన గత రెండు రోజులుగా ఎందుకు మాట మార్చారు? జనాగ్రహాన్ని తట్టుకునే శక్తి లేక అని ఆయనా అంగీకరిస్తారు. జనంతో ఓట్లు వేయించుకుని వారి అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించే నాయకులంతా చంద్రబాబు పరిస్థితిని ఎప్పుడో ఒకసారి ఎదుర్కోక తప్పదు. ప్రత్యేక హోదా సంజీవని కాదు అన్న నోటితోనే ఇది ఏపీ జీవన్మరణ సమస్య అని ఒప్పుకోవాల్సి వచ్చింది.
గత వారంలో రెండు రోజుల పాటు రాజ్యసభలో జరిగిన చర్చకు జైట్లీ సమాధానం ఇచ్చాక చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతిలో తన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. అంతకంటే ముందే ఆయన తప్పనిసరిగా ఇంట్లో నిలువుటద్దం ముందు నిలబడి ప్రాక్టీసు చేసి ఉంటారు. ఎందుకంటే ఆయన మీడియా ముందుకొచ్చి కేంద్రం మీద, బీజేపీ మీద సంధించిన విమర్శలన్నీ ఆయనకూ, ఆయన ప్రభుత్వానికి సరిగ్గా వర్తిస్తాయి. ‘‘హామీలను నెరవేర్చని పార్టీలను ప్రజలు ఇంటికి పంపుతారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రజలు ఊరుకోరు. ప్రజలు చాలా తెలివైనవాళ్లు దేనికయినా ఒక లాజికల్ ముగింపు ఇస్తారు’’. ఈ డైలాగులు ఎవరికి వర్తిస్తాయి? అధికారంలో ఎవరున్నారు, ఎన్నికలప్పుడు అలవికాని హామీలు ఇచ్చి వాటిని తీర్చలేక బొక్కబోర్లాపడింది ఎవరు? చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీయే కదా. మరి ఆయన ఎవరిని నిలదీస్తున్నట్టు? ఎవరిని ప్రశ్నిస్తున్నట్టు? ఆయనే చెప్పినట్టు ప్రజలు తెలివైనవాళ్లు. ఆ మాట మరొక్కసారి రుజుపు కావడానికి ఇంకో రెండున్నరేళ్ల సమయం ఉంది. సింగపూర్ మాదిరిగా 50 ఏళ్లు అధికారంలో కొనసాగాలని కోరుకుంటే సరిపోదు. అందుకు అవసరమయిన విధంగా ప్రజా హృదయాలను చూరగొనాలి. అది కేవలం డబ్బుతో సాధ్యం కాదన్న విషయం ప్రజలు అనేక సందర్భాలలో అన్ని రాజకీయ పార్టీలకూ నిరూపించి చూపించారు.
ఆడలేక మద్దెల ఓడన్నట్టు...
తిరిగి ఏపీ ప్రత్యేక హోదా, టీడీపీ పాత్ర విషయానికి వస్తే... చంద్రబాబును సమర్థిస్తున్న మీడియా అంత బలంగా కూడా ఆయన కేంద్రాన్ని విమర్శిస్తు న్నట్టుగా కనబడదు. కేంద్రాన్ని విమర్శించాలంటే ఆయన స్వరం మారిపోతుంది. గొంతు బలహీనంగా మారుతుంది. జపాన్ తరహా ఉద్యమాలు చెయ్యండని ప్రజలకు పిలుపు ఇస్తారు. రాష్ట్రవిభజన కారణంగా ఏర్పడ్డ ఆర్థిక దుస్థితి వల్ల రాష్ట్రాభివృద్ధి కొన్ని తరాల పాటూ వెనుకబడిపోబోతున్నదన్న ఆవేదనతో ఉన్న ప్రజలకు... మొక్కలను నాటండి, ఉత్పత్తిని పెంచి నిరసన తెలపండి, ఒక గంట ఎక్కువ పని చేయండి అనే నీతులు సాంత్వన కలిగిస్తాయా?
మోదీని నేనెందుకు కలుస్తాను, నాకేం అవసరం అన్నారాయన. ప్రధాని అపాయింట్‌మెంట్ లభించడం అంత సులభం కాదని ఆయనకు తెలుసు. కాబట్టే ఆ డైలాగు కొట్టారు. మోదీ అపాయింట్‌మెంట్‌ను కోరుతూ టీడీపీ ఎంపీలు ప్రధాని కార్యాలయం ఓఎస్‌డీకి రాసిన లేఖకు ఇంకా (మంగళవారం సాయంత్రానికి) మోక్షం లభించినట్టు లేదు. ప్రధాని రెండు గంటలు దృష్టి పెడితే చాలు అంటున్న చంద్రబాబు మరి ఈ రెండేళ్లలో ఒక రెండు గంటలు మోదీ దృష్టిని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇచ్చే విషయంపైకి ఎందుకు మళ్లించలేకపోయారు? ఆ వైఫల్యానికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అని ప్రశ్నిస్తే చంద్రబాబు మళ్లీ ఇదంతా ప్రతిపక్షం కుట్ర అంటారు. యువ ప్రతిపక్ష నేతకు రాజకీయాల్లో ఓనమాలు రానందునే ఈ పరిస్థితి అంటారు. మరి డాక్టరేట్ సాధించిన మీరెందుకు ఈ సమస్యను పరిష్కరించలేక చతికిల పడ్డారు? అని ప్రశ్నించే మీడియాను మాత్రం ఈ భూమ్మీద ఉండకుండా చేస్తామంటారు. రాష్ట్ర బంద్‌ను విఫలం చెయ్యడానికి ఏపీ ప్రభుత్వం ఎక్కడికక్కడ రాజకీయ పార్టీల కార్యకర్తలను, నాయకులనూ అరెస్ట్‌లు చేస్తే సమస్య పరిష్కారం కాదన్న విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. బంద్ విఫలం లేదా పాక్షికం అని తమను సమర్థించే మీడియాలో రాయించుకోడానికి అదేమైనా ఉపయోగ పడితే పడొచ్చు. చంద్రబాబు నాయుడు మాటల్లోనే ‘‘ప్రజలు చాలా తెలివైనవాళ్లు దేనికయినా ఒక లాజికల్ ముగింపు ఇస్తారు’’.
(వ్యాసకర్త: దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com)