స్వాతంత్య్రానంతర కాలంలో రాజకీయాల్లో ఉన్న విలువలు క్రమక్రమంగా మృగ్యం అవుతున్నాయి. రాజనీతి శాస్త్రంలోని నీతి, శాస్త్రీయత మాయమై రాజకీయాలు మాత్రమే మిగులుతున్నాయి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలిస్తే జగన్ రాజకీయ విలువల పునరుద్ధరణ దిశలో పయనిస్తుంటే... ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రం రాజకీయ విలువలను మరింత దిగజార్చే విధంగా ప్రవర్తిస్తున్నట్లు అర్థమవు తుంది.
ముఖ్యమంత్రిగా విలువల వలువలొలిచే రాజకీయాలను నడిపి, ప్రతిపక్ష నాయకుడుగా మరింత బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తున్నారు బాబు. జగన్ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలను, ప్రజారంజక పాలనను ఏమాత్రం పట్టించుకోకుండా, కనీసంగా గమనించకుండా ఏది చేసినా కువిమర్శలతో, ప్రతీఘాత ఉద్యమాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాల పైనా, జగన్ పైనా కక్ష తీర్చుకున్నట్లూ, పార్టీ మార్పిడు ల్లాంటివి ప్రోత్సహించినట్లూ... వైఎస్ జగన్ కూడా చేసి ఉంటే... ప్రస్తుతం టీడీపీకి ఉన్న 23 సీట్లలో మూడు సీట్లు కూడా మిగులకుండా ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయేది.
పార్టీ మార్పిడులను ప్రోత్సహించక పోవడం, సామాజికంగా వెనుకబడిన కులాలవారికి ప్రాధాన్యత నివ్వడం, మత సామరస్యాన్ని కాపాడటం, విద్య, వైద్యం, సేద్యాలకు ప్రాముఖ్యతనిస్తూ మెజారిటీ ప్రజల నాదుకోవడం లాంటి ఎన్నో చర్యల్లో జగన్ విలువలు ప్రతిబింబిస్తున్నాయి. ఇవేవీ చంద్రబాబుకు నచ్చవు.
ఇంతకీ ప్రతిపక్ష నాయకుడంటే ఎవరు? ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలి? ప్రతిపక్షం అంటే ప్రభుత్వం చేసిన ప్రతి పనినీ వ్యతిరేకించి తీరాలనీ, ప్రభుత్వాన్ని నిరం తరం తిడుతూ, పాలన స్తంభింపచేసేవాడే ప్రతిపక్ష నాయకుడనీ చంద్రబాబు అభిప్రాయంలా ఉంది. రచయితల విషయంలో... రచయిత అనేవాడు ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండాలనే అభిప్రాయం ఒకటుంది. రచయితలంతా ఎందుకు ప్రతిపక్షంలో ఉండాలి? ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షాల్లా ప్రభుత్వం ఏంచేసినా తిడుతూనే ఉండాలా? నేటి పాలకపక్షం రేపటి ప్రతిపక్షం కావచ్చు. అందువల్ల రచయిత, జర్నలిస్టు ప్రతిసారీ ప్రతిపక్షంలోనే ఉండాల్సిన పనిలేదు. ప్రభుత్వాలు ప్రజోపయోగకరమైన పనులు చేసినప్పుడు, ప్రజాస్వామ్య లౌకిక విలువలను కాపాడినప్పుడు మేధావులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, ప్రజలు కూడా సపోర్టు చేయాలి. తాను అధికారంలో ఉన్నప్పుడు చేసినవన్నీ కరెక్టేననీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసేవన్నీ తప్పులేననీ చంద్రబాబునాయుడి ప్రగాఢ విశ్వాసం. అందుకే ఎన్నో ఆదర్శాలను జీర్ణించుకొని, ఎంతో రీసెర్చ్ చేసి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్ ప్రతి నిర్ణయాన్నీ తప్పుపడుతున్నారు చంద్రబాబు.
ఆడ బిడ్డల రక్షణకు తెచ్చిన ‘దిశ’ చట్టాన్నీ చంద్ర బాబు విమర్శించారు. బహుజనుల, పేదల చిరకాల స్వప్నమైన ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెడితే దానిపైనా విమర్శే! అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి ‘మూడు రాజధాను’ల అవసరాన్ని ముందుకు తెచ్చిన జగన్ పనిని ఇప్పటికే విమర్శిస్తూ ఉద్యమాలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలను సరిదిద్దుతున్నందుకు కూడా వీరావేశంతో విమర్శలు చేయడం బాబుకే చెల్లింది.
మనిషి కేంద్రంగా... దేశమంటే మనుషులేనన్న దృక్పథంతో రాజకీయాలను మలుచుకున్న నాయకులే నిజమైన ప్రజానాయకులు. అలాంటి ప్రజా నాయకుడే జగన్ అని గత మూడేళ్ల పాలన రుజువు చేస్తోంది. వయస్సులో చిన్న వాడైనా జగన్ నుంచి చంద్రబాబు లాంటివాళ్ళు చాలా నేర్చుకోవాల్సి ఉంది. (క్లిక్: విద్యావ్యవస్థకు ఒక షాక్ ట్రీట్‌మెంట్)
- డాక్టర్ కాలువ మల్లయ్య
ప్రముఖ సాహితీవేత్త
Comments
Please login to add a commentAdd a comment