‘‘దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా... దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్.’’ గురజాడ దేశభక్తి గీతం ఒక్కటే చాలు ఆయనకు ప్రపంచ స్థాయి కవుల పక్కన చోటివ్వడానికి అని శ్రీశ్రీ అన్న మాటలు అక్షర సత్యాలు. దేశం, దేశంపై ప్రేమ, దేశభక్తి అంటే ఏంటో వంద సంవత్సరాల కిందటే మనిషి కోణంలోంచి ఆలోచించి చెప్పాడు గురజాడ. రెండువేల ఆరువందల సంవత్సరాల ముందే గౌతమ బుద్ధుడు అన్న ‘బహుజన హితాయ బహుజన సుఖాయ’ వాక్యంలోనూ, బౌద్ధ నైతిక ధర్మంలోనూ దుఃఖంలేని మానవ సమాజమే ముఖ్యం. బౌద్ధ ధర్మంలోని సారాన్ని హృదయానికి హత్తుకున్నవాడు కాబట్టే గురజాడ ‘దేశభక్తి’ లాంటి ప్రపంచస్థాయి గీతాన్ని రాయగలిగాడు. ఈ దేశంలోంచి బౌద్ధం తరిమి వేయబడినపుడే మతపరంగా భారతదేశం ఆత్మహత్య చేసుకుంది అన్నాడు గురజాడ. మనిషిని పట్టించుకోని ఏ మతం అయినా, విషయమైనా మానవజాతి ప్రగతిని కోరే వారి దృష్టిలో అసమ్మతం అయిందేనన్నది వాస్తవం.
దేశమంటే చెట్లు, గుట్టలు, నదీనదాలు కాదు. మట్టి మాత్రమే కాదు, దేశమంటే మను షులు. దేశభక్తంటే ఆ మనుషులపై భక్తి, ప్రేమ... ఆ మనుషుల బాగోగులను చూడటమే. మనిషి కేంద్రంగా, మనిషి బాగోగులు లక్ష్యంగా, మానవాభివృద్ధి ధ్యేయంగా పాలన సాగించేవాడే మంచి పాలకుడు. దేశమును ప్రేమించడమంటే అదే. అలాంటి పాలన నందించే అతికొద్దిమంది నాయకులలో యువ నాయకుడు జగన్‌మోహన్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. అతనికి కావాల్సింది తన ప్రజలందరికీ కూడు, గూడు, గుడ్డ అందించడం. కుల, మత, ప్రాంత, వర్ణ, వర్గాలకతీతంగా అందరికీ మేలు చేసే పనులు చేయడం. అందుకే దాదాపు 31 లక్షల మందికి మూడున్న రేళ్లయినా పూర్తికాక ముందే ఇండ్ల స్థలాలు ఇచ్చారు. దాదాపు రెండు లక్షల మందికి ఇప్పటికే ఇళ్లు కట్టించారు. లక్షలాది ఇళ్ల నిర్మాణ యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నికల వాగ్దానాలను 95 శాతం పైగా నెరవేర్చారు.
విద్య, వైద్యం, సేద్యం, తిండి, బట్ట, ఇల్లు... ఇలా మనిషి మనుగడకు సంబంధించిన అన్ని అవసరాలనూ రాజకీయ విలువలనూ కాపాడుతూ, కమిట్‌మెంట్ రాజకీయాలను నడుపుతూ తీర్చడం సామాన్య విషయం కాదు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడుతూ సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తున్నారు.
ఇలాంటి మనిషి కేంద్రంగా సాగుతున్న పాలన తెలుగుదేశం లాంటి ప్రధాన ప్రతి పక్షానికీ, తెలుగు రాష్ట్రాల్లో తద్వారా దక్షిణాదిలో బలపడాలని అనుకుంటున్న బీజేపీకీ, ఏ రాజకీయ సిద్ధాంత అవగాహన లేక నోటి కొచ్చింది మాట్లాడుతూ ఎవరితోనైనా సరే పొత్తు పెట్టుకోవాలని చూసే పవన్ కల్యాణ్‌కూ నచ్చవు. ద్వేషపూరిత రాజకీయాలను రెచ్చ గొడుతూ అధికారంలోకి రావాలని చూడటమే వీరి ఉద్దేశ్యం. దేశభక్తంటే వీరికి మతభక్తి. కులాలను రెచ్చగొట్టడం. ప్రాంతీయ విభేధాలను రెచ్చ గొట్టడం. రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు ఏవీ వీరికి పట్టవు. ఏం చేసైనా సరే అధికారంలోకి రావడం వీరి ఉద్దేశ్యం. ప్రజల కనీసావరాలను తీర్చే ఒక్క ప్రణాళిక కానీ, రాష్ట్ర ప్రగతి పథానికి ఉపయోగపడే ఒక్క పథకం కానీ లేకుండా ప్రజల సెంటిమెంట్లను రెచ్చ గొట్టి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్న వీరికి 2019 ఎన్నికల్లోనూ, ఆ తర్వాత జరిగిన అనేక ఉప ఎన్నికల్లోనూ జరిగిన ఆశా భంగమే 2024 ఎన్నికల్లో జరుగుతుందన్నది వాస్తవం.
గురజాడ చెప్పిన దేశమును ప్రేమించుమన్నా అన్న సూక్తినీ, దేశభక్తి నిర్వచనాన్నీ హృదయానికి హత్తుకొని పరిపాలన కొనసాగిస్తూ ఆంధ్ర ప్రజల హృదయాలను గెలుచుకున్న జగన్ అజేయుడే! (క్లిక్ చేయండి: మూడు రాజధానుల ప్రతిపాదన అందుకే..)
- కాలువ మల్లయ్య
ప్రముఖ సాహితీవేత్త
Comments
Please login to add a commentAdd a comment