AP: YS Jagan Focus on Social Transformation, Social Justice: Kaluva Mallaiah - Sakshi
Sakshi News home page

AP YS Jagan: మౌలిక మార్పులే లక్ష్యంగా...

Published Fri, May 20 2022 1:56 PM | Last Updated on Fri, May 20 2022 3:49 PM

YS Jagan Focus on Social Transformation, Social Justice: Kaluva Mallaiah - Sakshi

ముఖ్యమంత్రిగా, చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌ను పెద్దగా పట్టించుకోలేదు. ఏ మౌలిక మార్పునూ చేయడానికి ప్రయత్నించలేదు. జగన్‌ ముఖ్య మంత్రి పదవి చేపట్టగానే రాష్ట్రానికేం కావాలో అర్థం చేసుకున్నారు. తన తండ్రి రాజశేఖర్‌ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఇతర పాలనాపరమైన చర్యలను మననం చేసుకున్నారు. ఆంధ్ర ప్రజల అవస రాలనూ, ఆత్మగౌరవాన్నీ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య అంతరాలను గుర్తించారు. వ్యావసాయిక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో దాని ప్రాముఖ్యాన్ని గుర్తించాడు. రాష్ట్రంలో మౌలిక మార్పులైన సోషల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్, సామాజిక న్యాయం, విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని పాలనను ప్రారంభించారు. 

గత ముప్పై, నలభై ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్‌ ఇంగ్లిష్‌ మాధ్యమ విద్యవల్ల పెరుగుతున్న సామాజిక అంతరాలనూ, బహుజనులకు తగ్గుతున్న ఉద్యోగావ కాశాలనూ, ప్రైవేట్‌ విద్యాలయాల్లో చదివించ లేక బహుజనులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులనూ, ఆత్మన్యూనతనూ గుర్తించారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. ఇది విద్యా రంగంలో విప్లవాత్మకమైన ముందడుగుగా చెప్పవచ్చు.

దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు... తరతరాలుగా, సామాజిక దురన్యాయానికి గురువుతున్నారు. వీరిని పట్టించుకున్న పాలకులు దేశమంతటా వెదికినా వేళ్లమీద లెక్క బెట్టేంతమంది కూడా లేరు. పాలనా రంగంలో సముచితస్థాన మిచ్చినపుడే వారికి న్యాయం చేసినట్టవుతుంది. అధికారం వారి చేతికి అందినప్పుడే ‘సాధికారత’ సాధ్యమవుతుంది. అందుకే వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో నామినేటెడ్‌ పోస్టుల్లో ఈ వర్గాల వారికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే అసెంబ్లీ సీట్ల కేటాయింపులోనూ వీరికి అగ్ర తాంబూలం ఇచ్చారు. పంచాయతీలు, మునిసిపాలిటీలు, జిల్లా పరిషత్‌ వంటి స్థానిక సంస్థల అధిపతులుగా అధిక శాతం మంది ఈ వర్గాలవారే ఎన్నికయ్యేట్లు చూశారు. మంత్రి వర్గంలోనూ బహుజన వర్గాలకు ఎవ్వరూ ఊహించనంతమంది బహుజనులకు చోటివ్వడం ద్వారా జగన్‌ సామాజిక మార్పునకు పునాది వేశారు. ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని అన్ని రోగాలకు వర్తింపజేసేట్టు చట్టం చేయడం, ప్రభుత్వ దవాఖానాలను బలోపేతం చేయడం ద్వారా వైద్యాన్ని అట్టడుగు జనం ముంగిటకు చేర్చగలుగుతున్నారు. (చదవండి: వారికో న్యాయం.. ఊరికో న్యాయం)

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రాయలసీమ, మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలుగా ఉంది. ఈ ప్రాంతాల మధ్య సామాజిక అంతరాల దొంతరలతోపాటూ, ఆర్థిక అసమానతలూ ఉన్నాయి. ఈ అంతరాలను తొలగించకపోతే భవిష్యత్తులో అనేక సమస్యలు వచ్చే అవకాశముంది. అందుకే ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు పెట్టాలనే సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తిరుగులేని ప్రజాభిమానాన్ని సంపాదించుకున్న వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మౌలికమార్పులతో వచ్చే ఎన్నికల నాటికి అజేయశక్తిగా నిలబడి తీరుతారు. (చదవండి: తనవాళ్లయితే తప్పుచేసినా సరేనా?)


- డాక్టర్‌ కాలువ మల్లయ్య 
వ్యాసకర్త కథకుడు, నవలా రచయిత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement