YS Jagan: ఆదర్శపాలకుడు.. ఇచ్చిన హామీలు నెరవేర్చారు! | Purna Chandra Rao Chaladi Views on YS Jagan Mohan Reddy Rule in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

YS Jagan: ఆదర్శపాలకుడు.. ఇచ్చిన హామీలు నెరవేర్చారు!

Published Mon, Nov 14 2022 3:41 PM | Last Updated on Mon, Nov 14 2022 3:41 PM

Purna Chandra Rao Chaladi Views on YS Jagan Mohan Reddy Rule in Andhra Pradesh - Sakshi

‘నేను విన్నాను – నేను ఉన్నాను’ అంటూ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో 3,648 కి.మీ. దూరం ‘ప్రజా సంకల్ప యాత్ర’ చేసి రికార్డ్‌ నెలకొలిపారు. ఆ పాదయాత్రలో ప్రజల హృదయాలలో స్థానం సంపాదించారు. యాత్ర ఇడుపులపాయలో 2017  నవంబర్‌ 6న ప్రారంభించి 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లాలో ముగించారు. 13 జిల్లాలోని 134 అసెంబ్లీ నియోజక వర్గాలు, 231 మండలాలు, మరో 2,516 గ్రామ పంచాయతీల ద్వారా సాగిన యాత్రలో లక్షలాది పేదలు, వృద్ధులు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ పలకరించి ‘నేను విన్నాను – నేను ఉన్నాను’ అని హామీ ఇచ్చారు. 341 రోజులపాటు తన యాత్ర సాగిస్తూ కుల, మత రహితంగా ప్రజల్లో తిరుగులేని ప్రజాదరణ సంపాదించారు. 

ఫలితంగా 2019 లో జరిగిన ఎన్నికల్లో 151 శాసనసభ స్థానాలు సాధించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి ఒంటి చేత్తో తెచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల అమలులో కూడా వెనుకడుగు వేయని నేతగా ప్రజా హృదయాలను దోచుకున్నారు జగన్‌మోహన్‌ రెడ్డి. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా విడుదల చేసిన ఒక పత్రంలో... మొత్తం 129 హామీలు ఆనాటి మేనిఫెస్టోలో ఇవ్వగా మూడేళ్లలోనే 95 శాతం హామీలు అమలు చేశామని ప్రకటించారు. ఇటువంటి పాలకులు గతంలో ఎవరూ లేరనే చెప్పాలి.

ఈ 129 హామీల్లో 111 అమలు చెయ్యగా 12 హామీలకు అడుగులు పడ్డాయి. ఇంకా కేవలం 6 మాత్రమే అమలు కావాల్సి ఉన్నాయి. కాగా ఈ ఇచ్చిన హామీలకు అదనంగా మరో 45 పథకాలు అమలు చెయ్యటం ప్రజా సంక్షేమానికి ఆయన ఇచ్చిన బోనస్‌. 

అమలుకు అడుగులు పడ్డ వాటిల్లో ప్రధానంగా రాజధానిని ఫ్రీ జోన్‌గా (అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉండేలా) గుర్తించడం, నిజమైన వికేంద్రీకరణ లక్ష్యంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలనూ సమగ్రంగా అభివృద్ధి చెయ్యటం, అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులను వారి అర్హత, సర్వీస్‌లను పరిగణించి వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులర్‌ ఉద్యోగులుగా చెయ్యటం  (న్యాయ పరమైన చిక్కుల మూలంగా ఇప్పటికే వారికి టైం స్కేల్‌ అమలు అవుతోంది) ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా ప్రాంతాల్లో ఇళ్ళ స్థలాలు లేని వారికి ఇళ్ళ స్థలాలు ఇవ్వటం.

కుల, మతతత్వాలు, వర్గాలు లేని సమసమాజ నిర్మాణానికి కావలసిన పాలన అందిస్తామని తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొని... మడమ తిప్పకుండా అన్ని హామీలను నెరవేర్చుతున్న యువనేత జగన్‌మోహన్‌ రెడ్డి ఆదర్శపాలకుడు. ఆయన  ప్రజలకు చేస్తున్న సేవను, సాధించిన విజయాలను గడప గడపకు తీసుకెళ్లే కార్యక్రమం ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతోంది.
– చలాది పూర్ణచంద్ర రావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement