Purna chandra rao
-
YS Jagan: ఆదర్శపాలకుడు.. ఇచ్చిన హామీలు నెరవేర్చారు!
‘నేను విన్నాను – నేను ఉన్నాను’ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో 3,648 కి.మీ. దూరం ‘ప్రజా సంకల్ప యాత్ర’ చేసి రికార్డ్ నెలకొలిపారు. ఆ పాదయాత్రలో ప్రజల హృదయాలలో స్థానం సంపాదించారు. యాత్ర ఇడుపులపాయలో 2017 నవంబర్ 6న ప్రారంభించి 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లాలో ముగించారు. 13 జిల్లాలోని 134 అసెంబ్లీ నియోజక వర్గాలు, 231 మండలాలు, మరో 2,516 గ్రామ పంచాయతీల ద్వారా సాగిన యాత్రలో లక్షలాది పేదలు, వృద్ధులు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ పలకరించి ‘నేను విన్నాను – నేను ఉన్నాను’ అని హామీ ఇచ్చారు. 341 రోజులపాటు తన యాత్ర సాగిస్తూ కుల, మత రహితంగా ప్రజల్లో తిరుగులేని ప్రజాదరణ సంపాదించారు. ఫలితంగా 2019 లో జరిగిన ఎన్నికల్లో 151 శాసనసభ స్థానాలు సాధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఒంటి చేత్తో తెచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల అమలులో కూడా వెనుకడుగు వేయని నేతగా ప్రజా హృదయాలను దోచుకున్నారు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా విడుదల చేసిన ఒక పత్రంలో... మొత్తం 129 హామీలు ఆనాటి మేనిఫెస్టోలో ఇవ్వగా మూడేళ్లలోనే 95 శాతం హామీలు అమలు చేశామని ప్రకటించారు. ఇటువంటి పాలకులు గతంలో ఎవరూ లేరనే చెప్పాలి. ఈ 129 హామీల్లో 111 అమలు చెయ్యగా 12 హామీలకు అడుగులు పడ్డాయి. ఇంకా కేవలం 6 మాత్రమే అమలు కావాల్సి ఉన్నాయి. కాగా ఈ ఇచ్చిన హామీలకు అదనంగా మరో 45 పథకాలు అమలు చెయ్యటం ప్రజా సంక్షేమానికి ఆయన ఇచ్చిన బోనస్. అమలుకు అడుగులు పడ్డ వాటిల్లో ప్రధానంగా రాజధానిని ఫ్రీ జోన్‌గా (అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉండేలా) గుర్తించడం, నిజమైన వికేంద్రీకరణ లక్ష్యంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలనూ సమగ్రంగా అభివృద్ధి చెయ్యటం, అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను వారి అర్హత, సర్వీస్‌లను పరిగణించి వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులర్ ఉద్యోగులుగా చెయ్యటం (న్యాయ పరమైన చిక్కుల మూలంగా ఇప్పటికే వారికి టైం స్కేల్ అమలు అవుతోంది) ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా ప్రాంతాల్లో ఇళ్ళ స్థలాలు లేని వారికి ఇళ్ళ స్థలాలు ఇవ్వటం. కుల, మతతత్వాలు, వర్గాలు లేని సమసమాజ నిర్మాణానికి కావలసిన పాలన అందిస్తామని తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొని... మడమ తిప్పకుండా అన్ని హామీలను నెరవేర్చుతున్న యువనేత జగన్మోహన్ రెడ్డి ఆదర్శపాలకుడు. ఆయన ప్రజలకు చేస్తున్న సేవను, సాధించిన విజయాలను గడప గడపకు తీసుకెళ్లే కార్యక్రమం ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతోంది. – చలాది పూర్ణచంద్ర రావు -
మాటరాని మౌనమిది..!
సాక్షి, గుంటూరు: లక్షలాది జీవరాసుల్లో మానవుడికి మాత్రమే దక్కిన అదృష్టం మాట్లాడటం. కానీ ఓ వ్యక్తి మాత్రం మూడు దశాబ్దాలుగా మాట్లాడటం మానివేసి మౌనమునిగా మారిపోయాడు. అదేమంటే విలువైన మాటను పొదుపు చేయాలని సాధన చేశా.. అది శాశ్వతంగా అలవాటైందని సైగలు, చిటికెల శబ్దాలు, చేతిరాతతో చెప్పుకొచ్చాడు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెదరెడ్డిపాలెం గ్రామంలోని కశిందుల పూర్ణచంద్రరావు ఇంట్లోకి వెళితే మూగసైగలే కనిపిస్తాయి. అంతమాత్రాన ఆ ఇంట్లో మూగవాళ్లు ఎవరైనా ఉన్నారనుకుంటే పొరపాటు పడినట్లే. ఆ ఇంట్లోని వారందరికీ మాటలు వచ్చు. కానీ ఇంటి పెద్ద అయిన పూర్ణచంద్రరావు గత 30 ఏళ్లుగా మాట్లాడకుండా కేవలం సైగలు, చిటికెల శబ్దాలతోనే కాలం గడుపుతూ వస్తున్నారు. పూర్ణచంద్రరావు, ధనలక్ష్మి దంపతులకు నలుగురు పిల్లలు. వీరిలో వెంకట సత్యభీమలింగేశ్వరరావు, బసవశంకర్, సుధారాణి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తుండగా.. చిన్నకుమార్తె యశోద తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఊహ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు తండ్రి నోటి నుంచి ఒక్కచిన్నమాట కూడా వారి చెవిన పడలేదు. వారికి ఏం కావాలో కూడా సైగలు, చేతిరాత ద్వారానే పూర్ణచంద్రరావు కనుక్కునేవారు. పిల్లలు ఫోన్ చేసినా.. వారు చెప్పింది వినడమే గానీ వారి మాటలకు మాత్రం బదులు చెప్పరు. ఏదైనా చెప్పాలనుకుంటే భార్యకు చేతిరాతతో వివరించి.. ఆమె ద్వారా పిల్లలకు సమాధానమిస్తారు. ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తే.. ‘విలువైన దానిని దాచుకోవడం అందరూ చేసేదే కదా! ధనం కంటే మాటకే విలువ ఎక్కువ అని భావించాను. మొదట్లో పొదుపుగా మాట్లాడేవాణ్ని. రానురానూ అసలు మాట్లాడటమే మానివేశాను’ అని పూర్ణచంద్రరావు పేపర్ మీద రాసి చూపించారు. తనకు గురువైన సూర్యానంద సరస్వతి స్వామి(బొగ్గులకొండ స్వామి) మౌనంగా ఉండాలని ఉపదేశించడంతో ఆయన్ని అనుసరించానని చెప్పుకొచ్చారు. ‘1982లో చిన్న గురువు మారుతికుమార్తో సూర్యానంద సరస్వతి స్వామి కోటప్పకొండలో బ్రహ్మోపదేశం చేయించారు. అప్పటి నుంచి మౌనంగా ఉండటం మొదలుపెట్టాను. దేవుడిపై భారం వేసి జీవనం సాగించాను. ఆయన దయ వల్ల పిల్లలందరూ స్థిరపడ్డారు’ అని పేపర్‌పై రాసి చూపించారు. మొదట్లో ఇబ్బందిగా ఉండేది అడిగిన దానికి సమాధానం చెప్పకుండా సైగలు చేస్తుంటే మొదట్లో చాలా ఇబ్బందిగా ఉండేది. క్రమక్రమంగా ఆయన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఇప్పుడు సైగల ద్వారా, చిటికెల ద్వారా ఆయన ఏం చెబుతున్నారో కూడా నాకు ఇట్టే అర్థమవుతోంది. మాట్లాడాలని మేము కూడా ఆయన్ని ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. – ధనలక్ష్మి, భార్య హేళన చేసినా.. పట్టించుకోలేదు మా నాన్న సైగలు చేస్తుంటే గ్రామస్తులు హేళన చేసేవారు. ఏది పడితే అది మాట్లాడి ఎదుటివారిని ఇబ్బంది పెట్టడం కంటే.. నాన్నలా మౌనంగా ఉండటం గొప్పగా అనిపించింది. నాన్నను చూసి పూర్తిగా మౌనం పాటించలేకపోయినా.. తక్కువ మాట్లాడటం అలవాటు చేసుకున్నాం. – సుధారాణి, కుమార్తె -
పేకాటాడుతూ పట్టుపడిన టీడీపీ ముఖ్యనేత
► పూర్ణ చంద్రరావు సహా 11 మంది అరెస్టు ఇచ్ఛాపురం: శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్ చైర్మన్, తెలుగుదేశం పార్టీకి చెందిన కోత పూర్ణ చంద్రరావు జూదమాడుతూ పోలీసులకు పట్టుపడ్డాడు. ఆయనతో సహా 11 మందిని నిందితులను సోంపేట పోలీసులు అరెస్టు చేశారు. సోంపేట మండలంలోని బారువ రీసార్ట్స్లో పూర్ణచంద్రరావుతో సహా మరికొంతమంది జూదమాడుతుండగా దాడి చేసి అరెస్టు చేసినట్టు సోంపేట ఇన్చార్జి సీఐ సన్యాసి నాయుడు వెల్లడించారు. బారువ రీసార్ట్స్లో పేకాటాడుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలాస మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు తో పాటు కాశీబుగ్గకు చెందిన బి.మధు, ఎస్.మోహనరావు, గణేష్ మహాంతి, బి.శ్రీనివాసరావు, వి.శ్రీనివాసరావు, పలాసకు చెందిన బి.బల్లయ్య, పి.ముకుందరావు, కంచిలికి చెందిన వి.శ్రీనివాసరావు, డి.రవికుమార్, కె.శేఖర్, మందసకు చెందిన ఎం.ఉదయ్ కుమార్‌లను అరెస్టు చేశారు.. వారి వద్ద నుంచి 45 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.