ఎందుకీ ఉరుకులు, పరుగులు?
డేట్‌లైన్ హైదరాబాద్
యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడుతూ వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అప్పట్లో ఏ మాత్రమూ రాజధాని గురించి ఆలోచన చెయ్యలేదు. చేసినట్టయితే పరిస్థితి ఇంకోలా ఉండేది. ఆయన ఎంతసేపు రాజకీయ లబ్ధి కోసం చూసిన కారణంగానే ఈ ఆలోచన రాకపోయి ఉండొచ్చు. రాష్ట్ర విభజన కోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోగానే ఆయన హడావుడిగా పత్రికల వారిని పిలిచి నాలుగైదు లక్షల కోట్లు ఇస్తే కొత్త రాజధాని కట్టుకుంటాం అని కూడా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి శాశ్వతంగా వెళ్లిపోయినట్టే. రెండున్నర సంవత్సరాలయినా గడవక ముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి బిచాణా ఎత్తేసింది. ఇందుకు కారణం తెలంగాణ ప్రభుత్వం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలూ కాదు. అర్ధంతరంగా తట్టా బుట్టా సర్దుకుని వెళ్లి వస్తానని ఎవరికీ ఒక్క మాటయినా చెప్పకుండా, అప్పుడప్పుడు వస్తూ ఉండండి అనే చిరునవ్వుతో కూడిన ఆహ్వానాన్నయినా అందుకోకుండా ఆంధ్రప్రదేశ్ పరిపాలన వెలగపూడి బాట పట్టడం విచారకరం. అదీ అరకొర వసతుల తాత్కాలిక సచివాలయానికి వెళ్లిపోవడం బాధాకరం. అర్ధంతరంగా హైదరాబాద్ వదిలిపోవడానికి పూర్తి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుదే. హైదరాబాద్ సచి వాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసం కేటాయించిన భవన సము దాయాలు, అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి కార్యాలయ సముదాయం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం కేటాయించిన లేక్ వ్యూ అతిథి గృహం మరమ్మతులకు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోట్లాది రూపాయలను వెచ్చించి పది సంవత్సరాలు కాకపోయినా, పట్టుమని పదిరోజులయినా విడిది చెయ్య లేని పరిస్థితి చంద్రబాబు చేజేతులా కొనితెచ్చుకున్నారు. రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఎప్పటికయినా ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఆ రాష్ట్రం నుంచి జరగాల్సిందే. పరిపాలన కోసం ఎక్కడో ఒకచోట రాజధానిని ఏర్పాటు చేసుకోవాల్సిందే.
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన సందర్భంలో పదేళ్లపాటు విభజిత ఆంధ్రప్రదేశ్ కూడా పరిపాలనను హైదరాబాద్ రాజధానిగా కొనసాగించే వీలు కల్పించారు. అందుకోసం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా రెండు రాష్ట్రాలకూ ఒకే గవర్నర్ ఉండే విధంగా ఏర్పాటు జరిగింది. పది సంవత్సరాలు సమయం ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఏర్పాటు చేసుకునేందుకు సావకాశం ఉంటుందని అర్థం. 2024 దాకా ఆంధ్రప్రదేశ్ పరిపాలన హైదరాబాద్ నుంచి జరిగేందుకు చట్టబద్ధమయిన ఏర్పాటు ఉందని అర్థం. ఈ లోపల 2019లో మరోసారి శాసనసభలకూ, లోక్‌సభకూ సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు అధికారం ఎవరికి ఇచ్చినా మన రాజ్యాంగం ప్రకారం అయిదు సంవత్స రాలే. ఆ అయిదు సంవత్సరాలు ప్రజారంజకంగా పరిపాలిస్తే మళ్లీ ఎన్ని కయ్యే అవకాశం ఏ రాజకీయ పార్టీకి అయినా ఉంటుంది, లేదంటే అయిదేళ్ల తరువాత తలరాతలు మారొచ్చు. అధికారం లోకి వచ్చే ఏ పార్టీ అయినా ఇది దృష్టిలో ఉంచుకుని నడవాల్సిందే. చంద్రబాబు ఆ విషయం మరిచి పోయి నట్టున్నారు. అందుకే ఆయన ప్రణాళికలన్నీ వచ్చే 50 సంవత్సరాలకు సరి పడా వేస్తుంటారు. 50 ఏళ్లలో పదిసార్లయినా సార్వత్రిక ఎన్నికలు జరుగు తాయనీ, తామే ఈ పది ఎన్నికల్లో గెలిచి అధికారంలో కొనసాగుతామనే పూచీ ఏదీ లేదనీ ఆయన మరచిపోతుంటారు.
రాజధాని గురించి ఆలోచించలేదు
ఇక రాజధాని ఏర్పాటు చేసుకోవడం అంటే మాటలు కాదు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఏర్పడిన చిన్న రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్ రాజధాని నయా రాయ్ పూర్ ఇంకా పూర్తి కానేలేదు. రెండున్నర సంవత్సరాల క్రితం విడిపోయిన ఆంధ్రపదేశ్‌కు ఇంత తొందరగా రాజధాని ఏర్పడటం కష్టమే. నిజానికి గతంలో బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల నుంచి విడిపోయి ఏర్పడిన జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్‌లకు రాజధాని లేదు, ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తెలంగాణ మాత్రం రాజధాని సహితంగా విడిపోయింది. కాబట్టి ఆ మూడు కొత్త రాష్ట్రాల సరసన చేర్చాల్సింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌నే కానీ, తెలంగాణ కాదు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించండి’ అని ఉత్తరాలు రాసి బహిరంగ సభల్లో మాట్లాడి, ‘ఏమయింది, ఇంకా ఎందుకు నిర్ణయం తీసు కోవడం లేదు?’ అని కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడుతూ వచ్చిన తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అప్పట్లో ఏ మాత్రమూ రాజధాని గురించి ఆలోచన చెయ్యలేదు. చేసి ఉన్నట్టయితే పరిస్థితి ఇంకొక లాగా ఉండేది. ఆయన ఎంత సేపు రాజకీయ లబ్ధి కోసం ఆలోచించిన కారణంగానే ఆయ నకు ఈ ఆలోచన రాకపోయి ఉండొచ్చు. రాష్ట్ర విభజన కోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోగానే ఆయన హడావుడిగా పత్రికల వారిని పిలిచి నాలుగైదు లక్షల కోట్లు ఇస్తే కొత్త రాజధాని కట్టుకుంటాం అని కూడా ప్రకటించారు. అది ఎలాగూ సాధ్యంకాదని అందరికీ తెలుసు.
ఇదంతా స్వయంకృతం
సరే, విభజన సందర్భంగా హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న నిర్ణయం జరిగాక ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని మంచి రాజధానిని ఏర్పాటు చేసుకుని వెళ్దామనే ఆలోచన ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబుకు రాలేదు. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిలో ఉండే వాతావరణాన్ని ఆయనే చేజేతులా చెడగొట్టుకున్నారు. పదేళ్లు కచ్చితంగా హైదరాబాద్ నుంచే పరిపాలన కొనసాగిస్తామని తొలినాళ్లలో చెప్పడమే కాకుండా, తమ పార్టీ తెలంగాణ లో కూడా మళ్లీ త్వరలోనే అధికారంలోకి వస్తుంది అని ప్రకటించిన చంద్రబాబు అర్ధంతరంగా హైదరాబాద్ నుంచి వెళ్లిపోవడానికి ఒక్కటంటే ఒక్క సరయిన కారణం చెప్పగలరా? దసరా నాడు వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుంచి పరిపాలన ప్రారం భించిన రోజున ఆయన జరిపిన సుదీర్ఘ మీడియా గోష్టిలో మనకు జరుగు తున్న అవమానాన్ని ఇంకెంత మాత్రం సహించలేక పరిపాలనను ఇక్కడికి తరలించేశాను అని చెప్పారు. అవమానం ఎవరికి ఎందుకు జరిగిందో అదే గోష్టిలో ఆయన విడమరచి చెప్తే బాగుండేది. అట్లా కాకుండా ఆయన విజ్ఞుల యిన రాజకీయవేత్తలు ఎవరూ చెయ్యని ఒక దుర్మార్గమయిన ఆలోచనతోనే ఆ ప్రకటన చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తెలంగాణ ప్రభుత్వం పట్ల, ప్రజల పట్ల వ్యతిరేక భావన కల్పించే ప్రయత్నమే అది. హైదరాబాద్‌లో ఆయనను ఎవరూ అవమానించలేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించడం అనే ప్రసక్తే రాదు. చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ లో చేసిన నిర్వాకాలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధ్యులు కారు. ఎవరూ ఆయనను, ఆయన ప్రభుత్వాన్ని వెళ్లగొట్టలేదు. నిజానికి చంద్రబాబునాయుడు రాష్ట్రం విడిపోయే నాటికి హైదరాబాద్ ఓటర్. 2014 ఎన్నికల్లో ఆయన హైదరా బాద్‌లో ఓటేశారు. ఈ రోజుకూ ఆయనకు హైదరాబాద్‌తో బోలెడు వ్యాపార సంబంధాలు ఉన్నాయి. జూబిలీహిల్స్‌లో పాత ఇంటి స్థానంలో కోట్లాది రూపాయలు వెచ్చించి బ్రహ్మాండమయిన ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. నిజంగానే హైదరాబాద్ లేదా తెలంగాణ ఆయనను అవమానించి ఉంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్టు? ఆయన శేష జీవితం గడపడానికి హైదరాబాద్ రారని ఎవరయినా కచ్చితంగా చెప్పగలరా? శాసనమండలి ఎన్నికల్లో తెలంగాణలో కొందరు శాసనసభ్యులను కోట్లాది రూపాయలు డబ్బు ఆశ చూపి ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేసి దొరికిపోయిన కారణంగా ఆయన పరిపాలనను హడావుడిగా తరలించుకు పోయి ఉద్యోగులనూ, అధికారులనూ, ప్రజాప్రతినిధులను ఇబ్బందుల పాలు చేశారు తప్ప మరే కారణమూ లేదు.
ఈ పరిణామాలకు ఎవరు బాధ్యులు?
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. విశ్వాసాలతో పాటు రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా మొట్టమొదట అధి కారంలోకి వచ్చిన విషయం చిరస్థాయిగా నిలిచిపోవడం కోసం ఆయన అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో కొన్ని వివాదాస్పదం కూడా అవుతున్నాయి. అందులో భాగంగానే ఆయన కొత్త సచివాలయం కట్టుకో వాలని నిర్ణయించారు. ఆ మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం మొన్న ఒక తీర్మానం చేసి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు అందచేసింది. అదే సమ యంలో తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధీనంలో ఉన్న సచివాలయ భవన సముదాయాలను తెలంగాణ ప్రభు త్వానికి అప్పచెప్పాలని నిర్ణయించింది. అందుకు బదులుగా ఢిల్లీ ఆంధ్ర భవన్ మాదిరిగా హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ భవన్ ఒకటి కేటాయించా ల్సిందిగా కోరాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాన్ని రాష్ట్ర గవర్నర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియచేశారు. ఆ మేరకు ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గం కూడా సమావేశమై అందుకు ఆమోదం తెలపడం లాంఛ నంగా జరిగేదే.పదేళ్లు దర్జాగా ఉమ్మడి రాజధాని నుండి పరిపాలన సాగించాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివరకు ఒక భవనం కేటాయించాలని కోరే దుస్థితికి కారణం ఏమిటి? కారకులు ఎవరు? మొన్న ఎక్కడో గవర్నర్ గారు అన్నట్టు ఈ పరిస్థితి మీడియా సృష్టి మాత్రం కాదు.
(వ్యాసకర్త : దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com)