నిజాలకు సమాధి కడతారా? | Opinion on Affidavit on Gangster Nayeem case by Devulapalli Amar | Sakshi
Sakshi News home page

నిజాలకు సమాధి కడతారా?

Published Wed, Jan 4 2017 12:57 AM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM

నిజాలకు సమాధి కడతారా?

నిజాలకు సమాధి కడతారా?

డేట్‌లైన్‌ హైదరాబాద్‌

నయీమ్‌కి శిక్ష పడాల్సిందే. కానీ నయీమ్‌ చనిపోయిన తరువాత దర్యాప్తు పేరుతో జరిగిన, ఇంకా జరుగుతున్న తతంగం ఎంత హాస్యాస్పదంగా ఉందో నారాయణ దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం మీద తెలంగాణ హోంశాఖ వేసిన కౌంటర్‌ అఫిడవిట్‌ స్పష్టం చేస్తుంది. నయీమ్‌ చనిపోయిన తరువాత స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, ఆస్తిపత్రాలు, పెద్ద మొత్తంలో నగదుతో పాటు అతడికి ఎవరెవరితో ఎటువంటి సంబంధాలు ఉన్నాయనే విషయంలో బోలెడంత సమాచారం ఉన్న డైరీలు కూడా దొరికాయి.

నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని కోరుతూ సీపీఐ నాయకుడు కె. నారాయణ న్యాయస్థానంలో దాఖలు చేసిన ప్రజాప్రయోజ  నాల వ్యాజ్యం మీద తెలంగాణ హోం శాఖ దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్‌ కొన్ని గొప్ప సత్యాలను వెల్లడించింది. సమాచార హక్కు చట్టం కింద తాను సేకరించిన కొన్ని వివరాల ఆధారంగా నారాయణ ఈ కేసు దర్యాప్తు రాష్ట్ర పోలీసులతో కాకుండా, కేంద్ర స్థాయి సంస్థ దర్యాప్తు చేస్తే బాగుంటుందని ఆశించి ఉండవచ్చు, అందులో తప్పులేదు. నారాయణ సీనియర్‌ రాజకీయ నాయకుడు. ఆయన పార్టీ లేదా ఆయన పార్టీతో మిత్రత్వం నెరపుతున్న ఇతర వామపక్షాలు అధికారంలో ఉన్న సందర్భాలు తక్కువ కాబట్టి అధికార యంత్రాంగం, అందునా పోలీసు వ్యవస్థ ఎవరి చెప్పుచేతల్లో నడుస్తుందో అనుభవపూర్వకంగా తెలియకపోవచ్చు కానీ, నారాయణ అసలేమీ తెలియని అమాయకుడని ఎవరూ అనరు.

నయీమ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన’ సిట్‌’ చిన్న పోలీసు అయితే, కేంద్ర స్థాయిలోని సీబీఐ పెద్ద పోలీసు. అంతకంటే పెద్ద తేడా ఏమైనా నారాయణ చూసినట్టయితే ఆయన అభిప్రాయం మార్చుకుంటే మంచిది. స్థానిక పోలీసు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుచేతల్లో పనిచేస్తే, సీబీఐ కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో మెలుగుతుంది. కేంద్ర ప్రభుత్వ హోం శాఖ పరిధిలో పనిచేసే సీబీఐ ఈ దేశంలో దర్యాప్తు జరుపుతున్న అనేక కేసుల్లో జరుగుతున్న నిర్వాకాలను కళ్లతో చూస్తూ కూడా నారాయణ నయీమ్‌ కేసులో సీబీఐ దర్యాప్తు కోరడం వింతగా ఉంది. ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభు త్వానికీ, తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రభుత్వాలకూ మధ్య ఉన్న సత్సంబంధాలను మరిచిపోయి నారాయణ సీబీఐ వల్ల న్యాయం జరుగుతుందని నమ్మితే ఆయన నమ్మకం ఆయనది. ఎవరైనా ఎందుకు కాదనాలి? నయీమ్‌ వ్యవ హారంలో దర్యాప్తు న్యాయంగా జరుగుతుందని ఎవరూ అనుకోలేదు. మొద టిరోజు నుంచి  ఎవరి అనుమానాలు వారికి ఉన్నాయి. ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అన్నమాట మన రాజకీయ నాయకులకూ, ప్రభుత్వ అధి కారులకూ ఊతపదంగా మారింది తప్ప, కొందరు పలుకుబడి కలిగిన వారి చుట్టంగా మారిపోయిన చట్టం వారి కనుసన్నల్లోనే నడుచుకుంటుందని తెలు సుకోలేనంత అమాయకులు కాదు ప్రజలు.

పెంచి పోషించింది పెద్దలే
దాదాపు పదిహేను సంవత్సరాలపాటు నయీమ్‌ చేసిన అకృత్యాలు ప్రభు త్వాలకూ, ముఖ్యంగా పోలీసు బాసులకూ తెలియకుండా జరిగినవి కాదు. తొలిరోజుల్లో వాళ్ల ప్రోత్సాహంతోనే నేరాలు చేసిన నయీమ్‌ వంటివారు, ఆ తరువాత వాళ్లకే తలపోటుగా మారి సొంత నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న విషయం అందరికీ తెలిసిందే. తమకు సైతం కొరకరాని కొయ్యగా తయా రయ్యాక, ఇక భరించే స్థితి దాటిపోయే సరికి అడ్డు తొలగించుకున్న విషయం కూడా అందరికీ తెలుసు. ఇక నయీమ్‌ షాద్‌నగర్‌లోని మిలీనియం కాలనీలో ఉన్నట్టు సమాచారం రావడం, పోలీసులు వెళ్లి హెచ్చరించడం, లొంగక పోగా పోలీసుల మీదనే కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం వీళ్లు తిరిగి కాల్పులు జరపగా నయీమ్‌ చనిపోవడం–ఇది సర్వే సర్వత్రా వినిపించే కథనం. ఈ దేశంలో పోలీసు ఎన్‌కౌంటర్‌లు మొదలయినప్పటి నుంచి∙ఇటువంటి కథలు వందలూ వేలూ విని ఉంటాం. ఎన్‌కౌంటర్‌కు అర్థాన్ని మార్చేసి చాలాకాలమైంది. ఎన్‌కౌంటర్‌ అంటే ఎదురుకాల్పులు అనే అర్థం మారి, పోలీసులు ఎవరినైనా పట్టుకుపోయి కాల్చి చంపడం అనే అర్థం స్థిరపడిపోయింది. సరే, నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ నిజమైనదా, కాదా? అన్నది ఇక్కడ అప్రస్తుతం.
 
నయీమ్‌ పాలకవర్గాల కంటే ప్రజలనే ఎక్కువ హింసించాడు. పేదలూ, మధ్యతరగతి వర్గాల ఆస్తులనూ, మాన ప్రాణాలనూ హరించాడు. చిన్న పిల్లలూ, అమాయక స్త్రీల జీవితాలతో చెలగాటమాడాడు. బడా బడా అధికారులూ, రాజకీయ నాయకుల నుంచి పెద్ద మొత్త్తంలో డబ్బు వసూలు చేసి ఉంటాడు, అందుకు బదులుగా వారికేవో సహాయాలు చేసే ఉంటాడు. కొందరిని ఇతరుల నుంచి రక్షించడానికి మరికొందరికి తన నుంచే రక్షణ కల్పించడానికి నయీమ్‌ చాలా మంది పెద్ద వాళ్ల నుంచి పెద్ద మొత్తా్తలనే రాబట్టాడన్న అంశంలో సందేహంలేదు. కాబట్టి నయీమ్‌కి శిక్ష పడాల్సిందే. కానీ నయీమ్‌ చనిపోయిన తరువాత దర్యాప్తు పేరుతో జరిగిన, ఇంకా జరుగుతున్న తతంగం ఎంత హాస్యాస్పదంగా ఉందో నారాయణ దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం మీద తెలంగాణ హోం శాఖ వేసిన కౌంటర్‌ అఫిడవిట్‌ స్పష్టం చేస్తుంది. నయీమ్‌ చనిపోయిన తరువాత ఆయ నకు సంబంధించిన పలు స్థావరాల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయు« దాలు, ఆస్తిపత్రాలు, పెద్ద మొత్త్తంలో నగదుతో పాటు నయీమ్‌కు ఎవరెవ రితో ఎటువంటి సంబంధాలు ఉన్నాయనే విషయంలో బోలెడంత సమా చారం ఉన్న డైరీలు కూడా దొరికాయి. నయీమ్‌కు తనను కలిసిన ప్రతి ఒక్క రితో ఫోటోలు దిగడం, సంభాషణలు రికార్డు చెయ్యడం, వీడియోల్లో నిక్షిప్తం చెయ్యడం, లెక్కలన్నీ వివరంగా రాసుకోవడం అలవాటు అనీ అవన్నీ తమకు దొరికాయని మీడియాకు చెప్పింది పోలీసులే.

ఉమ్మడి రాష్ట్రంలోనే ఆరంభం
కానీ వీటిని ఎందుకు బయట పెట్టడం లేదు? నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ తరు వాత మీడియాలో బోలెడు కథనాలు వచ్చాయి. ఇవేవీ ఇప్పుడు పోలీసులు చెప్పే విధంగా పూర్తి నిరాధారమైనవి  కాదు. నిరాధారమే అయి ఉంటే కొందరు రాజకీయ నాయకుల పేర్లు కూడా బయటికి వచ్చాయి కదా, ఆ నాయకులు సదరు మీడియా సంస్థల మీద పరువు నష్టం దావా వెయ్యక పోగా, కలుగులో దూరిన ఎలుకల్లాగా కొంతకాలం కనిపించకుండా పోయా రెందుకు? నయీమ్‌ నేరాలు చేసింది, వాటికి ప్రభుత్వ పెద్దల నుంచి ఆశీ స్సులు అందుకున్న ముచ్చట ఇప్పటిది కాదు, రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడే జరిగింది. పొరుగు తెలుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్ల కాలంలో నయీమ్‌ ఆగడాలు నిరాటంకంగా సాగాయి. నిజానికి నయీమ్‌ మరణం తరువాత బయటపడ్డ డైరీలోని సమాచారం గురించి విని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నత స్థాయిలో పని చేసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో ఉన్న కొందరు, పదవీ విరమణ చేసిన మరికొందరు బాబుగారి దగ్గరికి వెళ్లి ప్రభుత్వం ఆదేశాల మేరకే కదా మేము అవన్నీ చేసింది, అప్పుడు మీరే కదా ముఖ్యమంత్రి, ఇప్పుడు మమ్మల్ని మా ఖర్మానికి వదిలేస్తే ఎలా, మీరే కాపా డాలి అని మొర పెట్టుకున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో, ప్రతిపక్షంలో ఉన్న కొందరు రాజకీయ నాయకులకు నయీమ్‌తో దగ్గరి సంబంధాలు ఉండేవన్న వార్తలు కూడా చదివాం.

కానీ మొన్న నారాయణ కేసులో తెలంగాణ ప్రభుత్వ హోం శాఖ సమ ర్పించిన కౌంటర్‌ అఫిడవిట్‌లో మాత్రం అధికారులకూ, రాజకీయ నాయ కులకూ నయీమ్‌తో ఎటువంటి సంబంధమూ లేదని స్పష్టంగా పేర్కొంది. పైగా నారాయణ కమ్యూనిస్ట్‌ పార్టీ జాతీయ కార్యదర్శి కాబట్టి అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకి అయినందున రాజకీయ ప్రయోజనం ఆశించి ఈ కేసు వేశారు, కొట్టెయ్యండి అని కోర్టును కోరింది. తెలంగాణ ప్రభుత్వం నయీమ్‌ కేసులో దర్యాప్తునకు నియమించిన’ సిట్‌’ అంతిమంగా ఏం తేల్చబోతున్నదో హోం శాఖ దాఖలు చేసిన కౌంటర్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చు.

డైరీలను ప్రజల ముందు ఉంచండి!
నిష్పాక్షిక దర్యాప్తు జరిగితే, మన నేతలు చెప్పే విధంగా చట్టం తన పని తాను చేసుకుపోతే చాలా విషయాలు బయటికి వస్తాయి. అదేం జరగకపోగా ఎవ రెవరిని ఇందులో నుంచి బయట పడెయ్యాలో తద్వారా ఎవరి ప్రయోజనాలు కాపాడాలో ఇప్పటికే నిర్ణయం అయిపోయింది. అదే నిజం కాకపోతే పోలీసు శాఖకు కూడా తెలియకుండా హోం శాఖ అఫిడవిట్‌ ఎట్లా దాఖలు చేస్తుంది. ఈ విషయంలో పోలీసు శాఖలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉన్నట్టు వార్తలు వచ్చాయి.

మొత్తం పాలకవర్గాల విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసిన నయీమ్‌ కేసును ఇంతగా నీరుకార్చడం వ్యవస్థను ఏ విలువల వైపు నడిపించడానికి? ఇదంతా అబద్ధమైతే నయీమ్‌ డైరీలను ప్రజల ముందు ఉంచాలి. ఆ పని చేస్తారా?


(వ్యాసకర్త : దేవులపల్లి అమర్‌, ఐజేయూ సెక్రటరీ జనరల్
datelinehyderabad@gmail.com)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement