అదేమో వేదం.. ఇది ఉన్మాదం! | Opinion of Devulapalli Amar | Sakshi
Sakshi News home page

అదేమో వేదం.. ఇది ఉన్మాదం!

Published Wed, Aug 17 2016 10:31 AM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

అదేమో వేదం.. ఇది ఉన్మాదం!

అదేమో వేదం.. ఇది ఉన్మాదం!

డేట్‌లైన్ హైదరాబాద్

ఎవరికో అన్యాయం జరుగుతుందని మీరెట్లా వారి తరఫున పోరాడుతారు అంటే, దశాబ్దా లుగా దేశంలో కొన్ని వేల ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వచ్చి ఉండేవేకావు. ప్రజా ప్రయో జన వ్యాజ్యాల పేరిట ప్రాధాన్యం లేని చిన్న చిన్న విషయాల్లో కూడా కేసులు వచ్చి కోర్టు లను చీకాకు పరుస్తూ ఉండవచ్చు.  కానీ సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని అత్యు న్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చి సమగ్ర విచారణ కోరడం ఏబీకే ప్రసాద్ వంటి సీనియర్ సంపాదకుడికే  కాదు, సామాన్య పౌరుడికి కూడా రాజ్యాంగం ప్రసాదించిన హక్కు కదా!
 
ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని కావాలి. ఆ రాజధానిని ఎక్కడ, ఎవరు, ఎలా నిర్మించాలో రాష్ర్ట విభజనకు ముందే నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న నేటి అధికారపక్షం భారతీయ జనతా పార్టీ సావధానంగా ఆలోచించి నిర్ణయించాల్సింది. అలా జరగకపోవడం వల్ల ఇవాళ అది పెద్ద సమస్య అయి కూర్చుంది. అధికారం కోసం మొహం వాచి ఉన్న ఉమ్మడి రాష్ర్ట ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ అయినా ముందు దీని సంగతి తేల్చండి అని ఆనాడు పట్టుబట్టి ఉండాల్సింది. ఆ పని చేయక పోగా రాష్ర్ట విభజన నిర్ణయం ప్రకటన వెలువడిన మరుక్షణమే పత్రికా గోష్టి నిర్వహించి చంద్రబాబునాయుడు నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తే మంచి రాజధాని కట్టుకుంటాం అని ప్రకటించేశారు.
 
సొంతిల్లా? రాజధానా?

రాజధానికి ఏమేం కావాలి అన్న చర్చకు తరువాత వద్దాం. రాష్ర్టం విడి పోయాక ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉండాలి అన్న అంశం మొదలు చంద్రబాబునాయుడు సొంత ఎజెండా అమలు ఆలోచన కార్యరూపం దాల్చింది. నూతన రాజధాని ప్రాంతాన్ని గుర్తించడానికి కేంద్రం శివ రామకృష్ణన్ కమిటీని నియమించింది. ఈ నియామకం ప్రకటన వెలువడ గానే, అది తన పనిని ప్రారంభించక ముందే చంద్రబాబు తన మంత్రివర్గ సభ్యుడు నారాయణ అధ్యక్షతన సొంత కమిటీ ఏర్పాటు చేసేశారు. శివరామకృష్ణన్ కమిటీ ఏం చెబుతుందో వినక ముందే నారాయణ కమిటీ రాజధాని ప్రాంతాన్ని నిర్ధారించింది. నారాయణ కమిటీ నిర్ణయం మేరకు, అంటే చంద్రబాబు నిర్ణయించుకున్న ప్రాంతాన్నే రాజధాని నిర్మాణ ం కోసం ఖరారు చేసుకుని చంద్రబాబు శాసనసభలో ప్రకటించారు. ప్రధాన ప్రతిపక్షాన్ని సంప్రదించే ఆలోచన కూడా చేయలేదు. ఒక రాష్ర్ట రాజధాని నిర్మాణం వ్యవహారం ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం సొంత ఇంటి నిర్మాణం తరహాలో జరిగింది. ఏడాదికి మూడు పంటలు పండే సారవంతమైన భూములు వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకునే నిర్ణయం కూడా జరిగి పోయింది. వేలాది ైరైతు కుటుంబాలను ఛిద్రం చేసే ఈ నిర్ణయం మంచిది కాదంటూ, రాజధాని కోసం మరో ప్రాంతాన్ని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది. చంద్రబాబు పట్టించుకోలేదు. పైగా ఇది తప్పు అని ఎవరు మాట్లాడినా, రైతుల దగ్గర నుంచి భూములు బలవంతంగా తీసుకోవద్దని హితవు చెప్పినా వాళ్లు రాజధాని వ్యతిరేకులనే ముద్ర వేయడం మొదలు పెట్టారు. భూములు ఇవ్వ నిరాకరించిన రైతులను బెదిరించారు, దౌర్జన్యాలు చేశారు. ఒక భయానక వాతావరణం సృష్టించి వాటిని స్వాధీనం చే సుకున్నారు. ఇదంతా జరిగి ఏడాది కావస్తున్నది.
 
చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య కారణంగా పర్యావరణం ప్రమాదంలో పడుతుంది, రైతు జీవితం అస్తవ్యస్తం అయిపోవడమే కాక ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఎవరు చెప్పినా వినే స్థితి లేదు. రాజధాని కోసం నిర్ణయించిన ప్రాంతం గురించిన వివాదం ఇట్లా ఉంటే, ఆ రాజధానిని ఏ రీతిలో నిర్మించాలని చంద్రబాబు భావిస్తున్నారో చూస్తే ముక్కున వేలేసుకోవలసిందే. చంద్రబాబు నిర్ణయించిన ప్రకారమే జరిగితే అందరు కోరుకుంటున్నట్టుగా, ఆశిస్తున్నట్టుగా అమరావతి ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ రాజధాని నగరంగా కాక, ఒక విదేశీ కాలనీగా మాత్రమే మిగులుతుంది. రాజధాని పేరిట అమరావతిని చుట్టుకున్న భూదందాను మీడియా ఆధారాలతో సహా బయటపెట్టింది. భూములు ఇచ్చేది లేదని ఇప్ప టికీ ఎదురు తిరుగుతున్న వారు కొందరైతే, లాక్కోవద్దని ప్రాధేయ పడుతున్నవారు కొందరు.

కన్సార్టియం కథేమిటి?

రాజధానికి ఏం కావాలి అన్న చర్చ దగ్గరికి ఇప్పుడు వద్దాం. శాసనసభ, సచివాలయం, రాజ్‌భవన్, హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాలు; ఆ సిబ్బందికి గృహవసతి, ఇతర సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. వీటి నిర్మా ణానికి అయ్యే ఖర్చు కేంద్రం ఇస్తుంది. ఇప్పటికే కేంద్రం నిధులిచ్చింది, రాష్ర్ట  ప్రభుత్వం లెక్కలు చెప్పడంలేదు అని కేంద్రం అంటున్నది. రాజధాని కోసం ఇచ్చిన నిధులను దారి మళ్లించారని కూడా అధికార పక్ష ప్రధాన భాగస్వా ములు బీజేపీ వారు చెబుతున్నారు. ఒక విదేశీ సంస్థల కన్సార్టియంను ఏర్పాటు చేసి, దానికి రాజధాని నిర్మాణం బాధ్యత అప్పచెబుతున్నామని ప్రభుత్వం అంటున్నది. ఆ కన్సార్టియం ఏం కట్టబోతున్నది? ఎవరికీ తెలి యదు. భూములు మాత్రం వారికి అప్పచెబుతారు. అందులో సింహభాగం అభివృద్ధి చేసి, మళ్లీ అమ్ముకునే అధికారం ఆ కన్సార్టియంకు ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారంలో తలెత్తే న్యాయపరమైన లావాదేవీలన్నిటినీ లండన్ కోర్టులో తేల్చుకోవాలి. జిల్లా కోర్టుకు కూడా వెళ్లే స్థోమత లేని రైతులు లండన్ వెళ్లే ఆలోచన చెయ్యగలరా?

ఇదిగో, ఇంత తలా తోకా లేని వ్యవహారం జరుగుతున్నది, రైతులు రోడ్డున పడుతున్నారు, పర్యావరణానికి ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంది; వీటన్నిటినీ మించి అవినీతి విలయతాండవం చేస్తున్నది అని సీనియర్ సంపాదకుడు ఏబీకే ప్రసాద్, మరో జర్నలిస్ట్ రమణమూర్తి; ఇంకో జర్నలిస్ట్, న్యాయవాది శ్రావణ్‌కుమార్ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం సుప్రీం కోర్టులో దాఖలు చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ చేత దర్యాప్తు జరిపించా లని కూడా కోరారు. ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం తిరస్కరిం చింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ అంశంతో పిటిషనర్‌కు ఏం సంబం ధం అనడం సమంజసంగా లేదు. రాష్ట్రానికి రాజధాని లేదు, ప్రభుత్వం సొంతంగా నిర్మించుకుంటే మీరు ఆపుతారా? రాజధాని ఎక్కడ కట్టాలో మీరే నిర్ణయిస్తారా? అసలు మీకూ రాజధానికీ ఏమిటి సంబంధం? మీరేమైనా రైతులా, భూములు కోల్పోయారా? అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ఒకటి, నోరులేని వారికి అన్యాయం జరుగుతుంటే వారికి న్యాయం చేయడం కోసం ఎవరైనా మాట్లాడవచ్చు. పాత్రికేయులు సమాజంలో జరిగే అన్యాయా లను ప్రజల దృష్టికి తీసుకు రావడంతో పాటు అవసరమయితే వారి తరఫున పోరాడటం కొత్త కాదు. ఎవరికో అన్యాయం జరుగుతుందని మీరెట్లా వారి తరఫున పోరాడుతారు అంటే, దశాబ్దాలుగా దేశంలో కొన్ని వేల ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వచ్చి ఉండేవేకావు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పేరిట ప్రాధాన్యం లేని చిన్న చిన్న విషయాల్లో కూడా కేసులు వచ్చి న్యాయ స్థానాలను చీకాకు పరుస్తూ ఉండవచ్చు.  కానీ సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చి సమగ్ర విచారణ కోరడం ఏబీకే ప్రసాద్ వంటి సీనియర్ సంపాదకుడికే  కాదు, సామాన్య పౌరుడికి కూడా రాజ్యాంగం ప్రసాదించిన హక్కు కదా! నర్మదా బచావో ఆందోళన్‌తో మేధా పాట్కర్‌కు ఏం సంబంధం, లోక్‌పాల్ బిల్లు కోసం అన్నా హజారే ఎందుకు పోరాడాలి? అంటే ఎట్లా ఉంటుంది?
 

సీనియర్ సంపాదకుడు ఉన్మాదా?

ఇక సుప్రీం కోర్ట్టు నిర్ణయం వెలువడిన వెంటనే చంద్రబాబు ఏబీకే ప్రసాద్‌ను ఉన్మాది అన్నారు. మీలోనూ ఉన్మాదులున్నారని ఆయన మీడియా మిత్రులతో విజయవాడలో వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను, ప్రజా వ్యతిరేక చర్యలను, నిర్ణయాలను ప్రశ్నించే ప్రతి వారిని ఆయన ఉన్మాదులు గానే చూస్తున్నారు. వీలైతే అధికార బలాన్ని ప్రయోగించి ఉద్యోగాలు ఊడగొట్టిస్తున్నారు. వీలుకానిచోట ఉన్మాదులనే ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. సింగపూర్ తరహాలో 50 ఏళ్లు తామే అధికారంలో ఉంటామని ప్రజాస్వామ్యంలో కలలుగనే అధినేతకు ప్రజల తరఫున ఏం మాట్లాడినా, ఎవరు నిజం రాసినా ఉన్మాదంగానే కనపడుతుంది.
 
చంద్రబాబు రాజధానిని నిర్మించేందుకు తెగ కష్టపడి పోతుంటే కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం న్యాయమూర్తులకు కలిగి ఉండవచ్చు. అందులో తప్పేమీలేదు. ఈ మధ్యనే కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించే పేరిట చంద్రబాబు ఢిల్ల్లీ వెళ్లి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా పలువురు న్యాయమూర్తులను కలసి ఒక్కొక్కరి దగ్గరా ఒంటరిగా అరగంట పాటు గడిపినప్పుడు రాజధాని కోసం తానెంత కష్టపడుతున్నదీ చెప్పుకుని వాపోయి ఉండొచ్చు. సహజంగానే దాని ప్రభావం న్యాయమూ ర్తుల మీద ఉండొచ్చు.  దేశంలో ప్రతిష్టాత్మకంగా జరిగే  కుంభమేళాకు అది జరిగే రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబులాగా ఆహ్వానాలు పట్టుకుని ఢిల్లీలో ఇంటింటికీ తిరిగిన సందర్భం ఒక్కటి కూడా లేదు. మరి  తమ ప్రతిష్ట మసకబారే ఇటువంటి సమావేశాలను న్యాయమూర్తులు ఎందుకు అనుమ తిస్తున్నట్టు? అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయి? సుప్రీం కోర్టు న్యాయ వాది, ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం లో ఏబీకేతో పాటు సహా పిటిషనర్ శ్రావణ్‌కుమార్ సమాచార హక్కు చట్టం కింద ఈ  వివరాలను కోరారు.

దర్యాప్తు అవసరమే

ఇక చంద్రబాబు కనుసన్నల్లో మెదిలే ఒక నయా పత్రికాధిపతి, ప్లస్ జర్నలిస్ట్ ఇంకాస్త ముందుకు పోయి సుప్రీం కోర్టులో కేసు వేయడానికి ఏబీకే ప్రసాద్‌కు డబ్బు ఎక్కడిది, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన వృద్ధాశ్రమంలో సతీ సమేతంగా కాలం గడుపుతున్నారు కదా అని తన పత్రికలో రాసుకున్నారు. సుప్రీంకోర్టులో కేసు కొట్లాడటానికి లక్షల రూపాయలు కావాలని ఆయన అంటున్నారు. సరే ఏబీకే ప్రసాద్ ఆర్థిక పరిస్థితి ఏమిటి, ఆయన ఎందుకు వృద్ధాశ్రమంలో ఉంటున్నారు అన్న విషయాలు ఇక్కడ అప్రస్తుతం. సుప్రీం కోర్టులో ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి అయిన ఖర్చు కేవలం తొమ్మిది వేల రూపాయలు. 50 ఏళ్లకు పైగా జర్నలిస్ట్‌గా, చాలాకాలం సంపాదకుడిగా పనిచేసిన ఏబీకే, మరీ తొమ్మిది వేల రూపాయలు లేనంత నిరుపేద కాదు. ఆ నయా పత్రికాధిపతి ఇదే ఏబీకే సంపాదకుడిగా ఉన్న పత్రికలో చోటా విలేకరిగా పనిచేసిన విషయం మరిచి ఉండవచ్చు. వృత్తిని అడ్డుపెట్టుకుని అడ్డదారులు తొక్కి హఠాత్తుగా కోట్లకు పడగెత్త లేదు. కాబట్టే ఏబీకే ప్రసాద్ ఇవాళ వృద్ధాశ్రమంలో జీవిస్తున్నా అందరి గౌరవం అందుకుంటున్నారు. ఏబీకే ప్రసాద్ పిటిషన్ సంగతి ఎలా ఉన్నా రాజధాని వ్యవహారంలో ఒక స్వతంత్ర వ్యవస్థ చేత దర్యాప్తు చేయించడం అవసరమే.


దేవులపల్లి అమర్
 datelinehyderabad@gmail.com
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement