బాపూ బాటకు గ్రహణం పట్టిందా? | devulapalli amar dateline hyderabad special status | Sakshi
Sakshi News home page

బాపూ బాటకు గ్రహణం పట్టిందా?

Published Wed, Oct 14 2015 1:15 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

బాపూ బాటకు గ్రహణం పట్టిందా? - Sakshi

బాపూ బాటకు గ్రహణం పట్టిందా?

డేట్‌లైన్ హైదరాబాద్

పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష వల్ల ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రంలో జగన్‌మోహన్ రెడ్డి నిరాహార దీక్ష పట్ల ప్రభుత్వం అనుసరించిన వైఖరి, చేసిన వ్యాఖ్యలు సత్యాగ్రహానికి కాలం చెల్లిందేమో అనిపించే విధంగా ఉన్నాయి. ప్రత్యేక హోదా కోరుతూ శాసన సభ చేసిన నిర్ణయాన్ని కేంద్రం ముందుంచి అమలు చేయించాల్సిన ముఖ్యమంత్రే ఆ డిమాండ్‌ను అపహాస్యం చేయడాన్ని ఏమనాలి? ప్రతిపక్ష నేత నిరాహార దీక్షను భగ్నం చేశారు సరే, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రత్యేక హోదా కోసం బలంగా పెరుగుతున్న కోర్కెను ఏం చేస్తారు?
 
రాష్ట్ర విభజన సమయంలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రెండూ అంగీకరించిన విధంగానే, విభజనానంతర ఆంధ్రప్రదేశ్ శాసనసభ, రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అదే డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల ఏడవ తేదీన ప్రారంభించిన నిరవధిక నిరాహార దీక్షను ఆరు రోజుల తరవాత మంగళ వారం తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేశారు. ఆందోళనకరంగా మారిన ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా డాక్టర్ల సూచన మేరకు జగన్‌మోహన్‌రెడ్డిని ఆసుపత్రిలో చేర్పించామని పోలీసులు చెప్పారు. గత రెండేళ్ల కాలంలో జగన్‌మోహన్‌రెడ్డి నిరవధిక దీక్షను చేపట్టడం ఇది మూడవసారి. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య నినాదంతో ఒకసారి జైల్లో, మరోసారి హైదరాబాద్‌లోని తన ఇంటి వద్ద ఆయన దీక్షలు జరిపారు. రాష్ట్రం విడిపోయాక ఆయన ఇప్పుడు మళ్లీ నిరవధిక నిరాహార దీక్షకు దిగాల్సి వచ్చింది.
 
‘ఆంధ్ర రాష్ట్రం’లోనే దీక్షపై అపహాస్యాలా?
నిరాహార దీక్ష, ప్రజాస్వామ్యంలో సత్యాగ్రహాన్ని, ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే బలమైన ఆయుధం. స్వాతంత్య్ర పోరాట కాలంలో మహాత్ముడు పలుమార్లు భిన్న కారణాలతో నిరాహార దీక్షలు చేశాడు. ప్రజల ప్రబలమైన ఆకాంక్షను నెరవేర్చాలని పాలకుల మీద ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమాలు ఎంచుకునే శాంతియుత పోరాట రూపం నిరాహారదీక్ష. దాదాపు ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో ఎన్నో వందల, వేల మంది నేతలు, కార్యకర్తలు వివిధ కారణాలతో ఈవిధ మైన నిరసనను ప్రదర్శించారు.

కొన్ని సందర్భాల్లో సత్యాగ్రహానికి తలొగ్గి ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించడం, కొన్ని సందర్భాల్లో ఈ రకం ఉద్యమాలు విఫలం కావడమూ కూడా మనకు తెలుసు. పొట్టి శ్రీరాములు నిరాహారదీక్ష ఫలితంగానే మద్రాస్ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. నిరాహార దీక్ష ద్వారా రాష్ట్రాన్ని సాధించుకున్న సీమాంధ్రలోనే నిన్నటి దాకా సాగిన జగన్‌మోహన్‌రెడ్డి నిరాహార దీక్ష పట్ల ప్రభుత్వం, పాలక పార్టీ పెద్దలు అనుసరించిన వైఖరి, చేసిన వ్యాఖ్యలు సత్యాగ్రహానికి కాలం చెల్లిందేమో అనిపించే విధంగా ఉన్నాయి. అంతే కాదు నేటి పాలకుల వెకిలితనాన్ని కూడా బయట పెట్టాయి.
 
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఆ రాష్ట్రంలో ఒక ఉద్యమం సాగుతున్నది. ప్రతిపక్ష రాజకీయ పార్టీలన్నీ తమ తమ పద్ధతుల్లో అదే డిమాండుతో ఆందోళన చేస్తున్నాయి. ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అన్ని మార్గాలూ అన్వేషించి, అన్ని దారులూ నడచి, చివరి అస్త్రంగా ఈ నిరాహార దీక్షను ఎంచుకున్నారు. అది కూడా అధికార, ప్రతిపక్ష పార్టీలన్నిటికీ ఏకాభిప్రాయం ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాలనే కోరిక మీదనే చేపట్టిన దీక్ష. గత నెల జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో సభ్యులంతా చర్చించిన మీదట రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులతో పాటూ, బీజేపీ, తెలుగుదేశం పార్టీల సభ్యులు కూడా ఆ తీర్మానాన్నిఆమోదించారు.
 
 చట్టసభ తీర్మానానికి విలువే లేదా?
 శాసనాలు చేసే చట్ట సభ తీసుకున్న నిర్ణయానికి ఉండే విలువ ప్రాముఖ్యత ఒక్క అధికార పక్షానికి, దాని మిత్ర పక్షంగా ఉన్న బీజేపీకి తప్ప అందరికీ తెలుసు. శాసన సభ నిర్ణయాన్ని కేంద్రం ముందుంచి, ఇది మా రాష్ర్ట ప్రజల నిర్ణయం దీన్ని అమలు చెయ్యండని పట్టుబట్టాల్సింది సభా నాయకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. కానీ ఆయనే శాసనసభ తీర్మానించాక కూడా ప్రత్యేక హోదాను చులకన చేస్తూ మాట్లాడారు.

అయనతోబాటు ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌కు పేటెంట్ తనదేనని చెప్పుకునే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పలుమార్లు ఈ అంశాన్ని ‘జిందా తిలిస్మాత్’, ‘అమృతాంజనం’ అంటూ హేళన చేయడం అంతా చూశారు. అటు శాసన సభలో తీర్మానం చేసి దానికి భిన్నంగా బయట ఎట్లా మాట్లాడతారో చంద్ర బాబే చెప్పాలి. ప్రతిపక్షంలో ఉండగా కొట్లాడి, ఒప్పించి తెచ్చుకున్న ప్రత్యేక హోదాను అధికారంలోకి వచ్చాక ఎందుకు ఇవ్వలేకపోతున్నారో స్పష్టం చెయ్యాల్సింది బీజేపీ పెద్దలే. పదేళ్లు చాలదు పదిహేనేళ్ల కావాలన్న తామే ప్రత్యేక హోదా కోసం ఎందుకు పట్ట్టుబట్టడం లేదో చెప్పాల్సింది చంద్రబాబే.
 
ప్యాకేజీల గుట్టు ఎవరికి తెలియనిది?
కావాల్సినన్ని నిధులు ప్యాకేజీల ద్వారా వస్తుంటే ఇంకా ప్రత్యేక హోదా రాద్ధాంతం దేనికని అధికార పక్షం, దానికి గుడ్డిగా వంత పాడుతున్న మీడియాలోని ఒక వర్గం వాదన. చట్టబద్ధంగా ప్రత్యేక హోదా ఇవ్వడానికి, తమ చిత్తం వచ్చిన రీతిలో ప్యాకేజీల పేరిట నిధులు ఇవ్వడానికి మధ్య ఎంత తేడా ఉందో కొందరు బీజేపీ నాయకుల మాటలే స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ శాసనసభ్యుడు సోమూ వీర్రాజు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు. అంతేకాదు ఆరెస్సెస్‌తో గాఢమైన అనుబంధం ఉన్నవారు. ప్రధాని మోదీతో ఆయనకున్న స్నేహానుబంధం కూడా జగమెరిగిన సత్యం. ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులు ఏమవుతున్నాయో తెలియడం లేదని ఆయనే పబ్లిగ్గా చెప్పారు. పోలవరానికి రూ. 700 కోట్లు ఇస్తే లెక్కలు చెప్పలేదు, నిధులిస్తే బ్యాంకులలో వేసుకుని వడ్డీ తింటున్నారు తప్ప అభివృద్ధి పనులు చేపట్టడం లేదు అని కూడా ఆయన విమర్శించారు. ఆయన ప్రతిపక్షంలో లేరు, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీ నేత.
 
ప్యాకేజీలు ఎప్పుడయినా ఆగిపోవచ్చు, హోదా కచ్చితంగా నిర్ణీత కాలానికి కలగాల్సిన లాభాలన్నీ కలుగుతాయి. ప్యాకేజీల కంటే ప్రత్యేక హోదానే ముఖ్యం అంటున్న వారంతా ఇదే చెబుతున్నారు. ఇటువంటి ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టాల్సింది, అవసరమైతే నిరాహార దీక్షకు కూర్చోవాల్సింది చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, పవన్ కల్యాణ్. వారా పనిచేయకపోగా ప్రతిపక్ష నేత చేస్తున్న ఆందోళనకు అన్ని దశల్లోనూ అడ్డుతగిలే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ దీక్షలు చేస్తే ప్రజలకు ఇబ్బంది అనీ, చనిపోతామంటే అనుమతి ఇవ్వాలా? అనీ గుంటూరులో జగన్ దీక్ష గురించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయన తానూ గతంలో ప్రతి పక్షంలో ఉన్నాననీ, అప్పుడు తానూ కొన్ని దీక్షలు చేశాననీ మరిచిపోయినట్టుంది.
 
 విదూషక మంత్రుల తీరు గర్హనీయం
జగన్‌మోహన్‌రెడ్డి దీక్షను ఆపలేక పోవడంతో దాన్ని అపహాస్యం చెయ్యడానికి శతవిధాలా యత్నించారు. ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఆందోళన జగన్ దీక్షతో ప్రజల్లోకి మరింత బలంగా వెళుతున్న సంకేతాలు అందడంతో, ఆయన దాని మీంచి దృష్టి మళ్ళించడానికి తన కొలువులోని ఇద్దరు విదూషకులను ప్రయోగించారు. బీజేపీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, టీడీపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆస్థాన విదూషకులుగా జగన్ దీక్ష మీద అవాకులు చవాకుల మాట్లాడారు.

కేబినెట్ మంత్రి స్థాయి ఉన్న ప్రతిపక్ష నాయకుడు, ఒక పార్టీ అధ్యక్షుడు నిరాహార దీక్ష చేస్తుంటే ఆరవ రోజు దాకా వైద్య నివేదిక విడుదల చెయ్యకపోవడమే ఆయన దీక్ష విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరించిన నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. పైగా ఆయన ఆరోగ్య పరిస్థితి మీద, దీక్ష మీద ఇష్టానుసారం వ్యాఖ్యానించడం దుర్మార్గం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతాయుత స్థానంలో ఉండి, స్వయంగా డాక్టర్ కూడా అయిన కామినేని శ్రీనివాస్ మాట్లాడిన తీరు గర్హనీయం. ఇక గుంటూరు జనరల్ ఆస్పత్రి పరీక్షా పరికరాలను గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎలుకలను అరికట్టలేకపోయిన ఆ ఆసుపత్రిలో నాణ్యత గల పరికరాలు, పరీక్షా సదుపాయాలు ఉంటాయనుకోగలమా?
 
 ప్రజా ఉద్యమాలను పరిహసిస్తే భంగపాటే
 http://img.sakshi.net/images/cms/2015-10/61444765286_Unknown.jpgజగన్‌మోహన్‌రెడ్డి దీక్షను అపహాస్యం చేసిన 48 గంటలలోపే ఆయనను ఎందుకు ఆస్పత్రికి తరలించాల్సివచ్చింది? ఆరోగ్య వైద్యశాఖ మంత్రే సమాధానం చెప్పాలి. కేంద్రాన్ని ఒప్పించి, మెప్పించి లేదా బెదిరించి ప్రత్యేక హోదా సాధించుకోగలమా, లేదా? అనేది టీడీపీ, బీజేపీ పెద్దలు ఆలోచించుకోవాలి. కానీ ఆ డిమాండ్‌తో జరిగే ఉద్యమాలను పలుచన చెయ్యబోతే ఇటువంటి ఎదురుదెబ్బలే తగులుతాయి, నవ్వులపాలవ్వడమే జరుగుతుంది. ప్రతిపక్ష నాయకుడి నిరాహార దీక్షనయితే భగ్నం చెయ్యగలిగారుగానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రత్యేక హోదా కోసం బలంగా పెరుగుతున్న కోర్కెను ఏం చేస్తారు? ప్రజల్లో తమ పట్ల వ్యతిరేకత లేకుండా చూసుకోడానికి నాలుగు మంచి పనులు చెయ్యాలి కానీ, నాలుగు మంచి పనులు చెయ్యండని డిమాండ్ చేసే ప్రతిపక్షమే లేకుండా చెయ్యాలనుకుంటే ఇట్లాగే అవుతుంది.

-దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement