బహుముఖ ప్రజ్ఞకు ప్రతీక అమర్ ‘డేట్‌లైన్’!
జర్నలిజం అనేది ఒక ‘ఆర్గనైజ్డ్ గాసిప్’ అంటాడు అమెరికాకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు-నవలా రచయిత ఎడ్వర్డ్ ఎగెల్‌స్టన్. ప్రజాస్వామ్య సౌథం లోని నాలుగు వ్యవస్థలను ‘వరల్డ్‌వైడ్ క్యాపిటలిస్ట్ సొసైటీ’ నడిపిస్తున్న నేపథ్యంలో పండితులలోనే కాదు పామర జనంలోనూ జర్నలిజం పట్ల, జర్నలి స్టుల పట్ల చులకనభావం పెరుగుతోంది. నిజానికి జర్నలిజం అర్ధం, పరమార్ధం మారిపోయి చాలా కాలమయ్యింది. ఎన్నో ఆంక్షలు, పరిమితుల మధ్య పెనుగులాడుతున్న పరిస్థితి.
కార్యక్షేత్రంలో కనిపించని శత్రువుతో యుద్ధం చేయక తప్పనిస్థితి. ఎలాంటి కఠిన సమయాలలోనైనా నమ్మిన భావ జాలాన్ని-విలువలను విడనాడకుండా వృత్తిలో రాణిస్తూ సమాజం పట్ల నిబద్ధతను చాటుకుంటున్న జర్నలిస్టులను వేళ్లపై లెక్కించవచ్చు. అలాంటి వారిలో దేవులపల్లి అమర్ ఒకరు. ఆయన జగమె రిగిన జర్నలిస్టు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో విధులు నిర్వర్తిస్తూనే జర్నలిస్టు యూనియన్ జాతీయ బాధ్యతలలోనూ రాణిస్తున్న నేత.
‘ప్రజాతంత్ర’లో అమర్ చేసిన విశ్లేషణలు ‘డేట్‌లైన్ హైదరాబాద్’ పేరుతో పుస్తకరూపం సంతరించుకోవడం పాత్రికేయ మిత్రులందరికీ సంతోషం కలిగించింది. అది అత్యంత ప్రజాదరణ పొందిన కాలమ్ మాత్రమే కాదు.. నాలుగు దశా బ్దాల అమర్ పాత్రికేయ అనుభవానికి ప్రతీక. ఇది 1998 నుంచి 2004 వరకు ముఖ్యమైన పరిణా మాలపై విశ్లేషణల సమాహారం. ఆంధ్రప్రదేశ్ రాజకీ యాలలో అది అత్యంత కీలకమైన సమయం. తెలంగాణ మలిదశ పోరాటానికి అంకురార్పణ జరి గిందప్పుడే. నక్సలైట్ ఉద్యమ ఉత్థానపతనాలకూ ఆ కాలం అద్దం పడుతుంది. వీటన్నిటితోపాటు 2004లో తెలుగు ప్రజలు మార్పు కోరుకోవడానికి దారి తీసిన పరిణామాల గురించి విపులంగా తెలు సుకోవడానికి ఈ పుస్తకం ఉపకరిస్తుంది.
వాస్తవాల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా సమకాలీన రాజకీయాలపై సునిశితమైన వ్యాఖ్యలు చేయడం, ఆయనలోని సాహస లక్షణాన్ని కళ్లకు కడు తుంది. ఉన్నతస్థానాలలో ఉన్నవారిని అధిక్షేపించ డానికి ధైర్యం కావాలి. పోలీసుల ఆధిపత్యాన్ని, నక్సల్స్ హింసను ప్రశ్నించడానికి తెగువ కావాలి. అలాంటి ధైర్యం, తెగువ ఈ పుస్తకంలో అడుగడుగునా కనిపిస్తాయి.
చంద్రబాబును అపరచాణక్యుడుగా పొగిడి నట్లు అక్కడక్కడా కనిపించినా జ్యోతిబసు, వాజ్ పేయిలకు సలహాలు ఇచ్చానంటూ ఆయన చెప్పు కోవడాన్ని ఎద్దేవా చేయడమూ కనిపిస్తుంది. మన ‘బాలచంద్రుడి’ నుంచి వారేం నేర్చుకుంటారో చూడాలి మరి.. అనడంలోనే వ్యంగ్యం తొంగి చూస్తుంది. సీఎంగారు రాష్ట్రాన్ని సింగప్రదేశ్‌గానో ఆంధ్రాపూర్ గానో చేయడానికి ప్రయత్నిస్తుంటే ప్రజాసమస్యలు పరిష్కరించాలని ప్రతిపక్షాలు కోరడమేమిటి? అంతతీరిక ఆయనకెక్కడిదంటూ విమర్శలు సంధించడమూ కనిపిస్తుంది.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద రావు మంత్రిగా ఉండగా ఎంత దూకుడుగా ఉండే వారో తెలుసుకోవాలంటే ‘దీన్ని ప్రజాస్వామ్యం అందామా?’ అనే వ్యాసం చదవాల్సిందే. కోడెల స్వయంగా మందీమార్బలాన్ని వెంటేసుకుని డాక్ట రైన ఓ బీజేపీ నాయకుడి క్లినిక్‌కు వెళ్లి ఆయన్ను చాచి చెంపదెబ్బ కొట్టారట. మంత్రి కాబట్టే, అధికారం తనకు అండగా ఉండబట్టే కదా కోడెల ఈ పని చెయ్యగలిగింది అని అమర్ ప్రశ్నించారు. అనేక సామాజిక అంశాలనూ విశ్లేషించారు.
సినిమా వాళ్లనూ వదల్లేదు. దాసరి కొత్త పార్టీ ప్రయత్నాల పైనా, రామ్‌గోపాల్‌వర్మ సినిమాలపైనా, రజనీ కాంత్ అమాయకంగా రెండుకోట్ల రూపాయలు పోగొట్టుకోవడంపైనా అమర్ విశ్లేషణలున్నాయి. రాజకీయాల పట్ల ఆసక్తి, అనురక్తి ఉన్నవారికే కాదు జర్నలిజంలో ఉన్నవారికి, జర్నలిజంలోకి రావాలను కునే వారికి ఈ పుస్తకం రిఫరెన్స్ మెటీరియల్ అందిస్తుందనడంలో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు. - పోతుకూరు శ్రీనివాసరావు