వ్యక్తిగా టాటా ఎలా ఉండేవారు? | Ratan Tata A Life book covers many topics | Sakshi
Sakshi News home page

వ్యక్తిగా టాటా ఎలా ఉండేవారు?

Published Mon, Nov 11 2024 3:36 AM | Last Updated on Mon, Nov 11 2024 3:36 AM

Ratan Tata A Life book covers many topics

అత్యంత ప్రభావవంతుల జీవితాలు ఎలా ఉంటాయో మనకు ఎప్పుడూ తెలీదు. కేవలం వారి కంపెనీల గురించిన ఉత్థాన పతనాలే తప్ప వ్యక్తిగతజీవితంలోని ఎగుడుదిగుళ్లు బయటికి రావు. ఇటీవల మరణించిన దేశంలోని అతి పెద్ద పారిశ్రామికవేత్తల్లో ఒకరైన రతన్‌ టాటా చిన్నతనంలో తల్లితండ్రులు విడాకులు తీసుకున్న కారణంగా అభద్రతకు గురయ్యారు. దానివల్లే పాఠశాలలో హేళన ఎదుర్కొన్నారు. 

ప్రేమించినప్పటికీ పెళ్లికి దూరంగా ఉండిపోయిన రతన్‌కు తన చివరి జీవితంలో తోడుగా ఉన్నది టిటో అనే కుక్క. టిటోతో గడిపే సమయమే ఆయనకు రోజులో అత్యుత్తమంగా ఉండేదట.ఇలాంటి ఎన్నో అంశాలను ‘రతన్‌ టాటా: ఎ లైఫ్‌’ పుస్తకం వెల్లడిస్తుంది.

మనందరికీ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా తెలుసు. ఒక పారిశ్రామికవేత్తగా ఆయన ప్రత్యేకత కలిగివున్నారు. కానీ ఒక వ్యక్తిగా ఆయన ఎలా ఉండేవారు? ఆయనకు ఎలాంటి బాల్యం ఉండేది? ఆయన ప్రేమించినప్పటికీ పెళ్లి చేసుకోని స్త్రీలు ఉన్నారా? ఆయన వ్యక్తిగత జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయాలు ఏమిటి? ఇలాంటి అంశాలను సాధారణంగా మనం ఎప్పటికీ తెలుసుకోలేం. కానీ థామస్‌ మాథ్యూ ఇటీవల ప్రచురించిన పుస్తకం ‘రతన్‌ టాటా: ఎ లైఫ్‌’ కలిగించే మహదానందం ఏమిటంటే, ఆయన ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను వెల్లడించారు.

రతన్‌ టాటా పదేళ్ల వయసులో ఉండగా ఆయన తల్లితండ్రులు విడాకులు తీసుకున్నారు. అందువల్ల వాళ్ల నానమ్మ (నవాజ్‌బాయి టాటా) వద్ద పెరిగాడు. లేడీ టాటా వైభవంగా ఒక పెద్ద భవంతిలో యూనిఫారం ధరించిన పనివాళ్లతో నివసించారు. ఆమెకు రోల్స్‌ రాయిస్‌ కారు ఉండేది. నేను ‘బీబీసీ’ కోసం రతన్‌ టాటానుఇంటర్వ్యూ చేసినప్పుడు, తాను చెడిపోలేదని టాటా నొక్కి చెప్పారు; కాకపోతే ఎంతో గారాబంగా పెరిగానని ఒప్పుకున్నారు. అయితేఆ విషయాన్ని కనుగీటి మరీ చిరునవ్వుతో చెప్పారు.

తమ తల్లితండ్రుల విడాకులురతన్‌ పై, ఆయన సోదరుడు జిమ్మీపై తీవ్ర ప్రభావాన్ని చూపాయని థామస్‌ మాథ్యూ మనకు చెబు తారు. అది వారిలో అభద్రతా భావాన్ని కలిగించింది. వారు పాఠ శాలలో చదువుతున్నప్పుడు ర్యాగింగ్‌కు గురయ్యారు, హేళనకు గురయ్యారు. ఈ సమయంలో టాటా తన నాన్నమ్మకు మరింత దగ్గర య్యారు. నిజం చెప్పాలంటే, ఆమెను ఆరాధించారు.సీనియర్‌ కేంబ్రిడ్జ్‌ విద్య పూర్తి చేసిన తర్వాత టాటా అమెరికా వెళ్లారు. కుమారుడు చార్టర్డ్‌ అకౌంటెన్సీ చదవడానికి బ్రిటన్‌ వెళ్లాలని ఆయన  తండ్రి కోరుకున్నారు. కానీ రతన్‌ ఆర్కిటెక్చర్‌పై మనసు పడ్డారు. చివరికి ఆయన నిర్ణయమే గెలిచింది. చాలా ఏళ్ల తర్వాత రతన్‌ టాటా బొంబాయిలో హలేకై (సముద్రం పక్కని ఇల్లు అనిఅర్థం) అని పిలిచే తన సొంత ఇంటిని తానే డిజైన్‌ చేసుకున్నారు.

అయితే టాటా అమెరికాతో ప్రేమలో పడ్డారు. వృద్ధురాలైన నానమ్మ ఆయన్ని తిరిగి రమ్మని గట్టిగా కోరుకోకపోతే, ‘‘ఆయన అమెరికాలోనే ఉండి పని చేస్తూ తన జీవితాన్ని అక్కడే గడిపేవారు. దానిని ఆయన తన రెండవ ఇల్లు అని పిలుస్తారు’’ అని మాథ్యూ వెల్లడించారు.లాస్‌ ఏంజిల్స్‌లో ఆయన తన మొదటి ప్రియురాలు కరోలిన్‌ ఎమ్మన్స్‌ను కలుసు కున్నారు. ఆమె తండ్రి ఫ్రాంక్‌ ఆయన మొదటి బాస్‌. ఆయనే వారిని పరస్పరం పరిచయం చేశారు. రతన్‌ జీవితంలో మరో మూడు ప్రేమలు ఉన్నాయి కానీ ఎవరినీ పెళ్లి చేసు కోలేదు. ‘బీబీసీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, తాను ఇతర విషయాలకు ప్రాధాన్యంఇచ్చాను గానీ ఎన్నడూ పెళ్లిపై దృష్టి పెట్టలేదని చెప్పారు.  

అయినప్పటికీ, కరోలిన్‌ తో టాటా టచ్‌లో ఉండేవారు. 2017లో జరిగిన ఆయన 80వ పుట్టినరోజుకు ఆమె హాజరయ్యారు. రతన్‌ అమెరికాలో ఉన్న ప్రతిసారీ కరోలిన్‌ను డిన్నర్‌కి తీసుకువెళ్లేవారని మాథ్యూ పేర్కొన్నారు. అందుకే దీన్ని చేదైన తీపి కథగా నేనుభావించడంలో పొరబడలేదు కదా? ఇది కచ్చితంగా నిజమని కూడా అనిపిస్తుంది.టాటా వ్యక్తిత్వంలోని ఆకర్షణీయమైన అంశాలను థామస్‌ పుస్తకం వెల్లడిస్తుంది. ఉదాహరణకు, ఆయన చెక్స్‌ షర్టులను ఇష్టపడే  వారు. ‘‘ఆయన బాలుడిగా లేదా పెద్ద వయస్సులో ఉన్నప్పుడు తీసిన ఫొటోలలో దాదాపు 90 శాతం వరకు ఆయన ఫార్మల్‌ దుస్తులుకాకుండా చెక్స్‌ షర్టు ధరించి ఉన్నట్లు చూపుతాయి.’’ ఆయనకుకార్లంటే కూడా మోజు ఉండేది. వాటిని హాలెకైలో ప్రత్యేకంగా నిర్మించిన నేలమాళిగలో భద్రపరిచారు. అమెరికన్‌ ‘మజిల్‌ కార్లు’ అంటే ఆయనకు ఎంతో ఇష్టం.

టీవీలో రతన్‌ టాటా అంత్యక్రియలను చూసిన మీకు, ఆయన పెంచిన కుక్క గోవా ఎలా దూకి శవపేటిక పక్కన కూర్చుందోగుర్తుకు వస్తుంది. టాటా తన కుక్కలకు ఎంత సన్నిహితంగాఉండేవారో ఇది తెలియజేస్తుంది. మాథ్యూ దీనిపై పూర్తి కథను వెల్లడించారు.ఆయన కుక్కలను తనకు లేని పిల్లలుగా చూసుకున్నారన్న భావన మీకు వస్తుంది. వీటిలో చాలా కుక్కలను టిటో, ట్యాంగోఅనిపిలిచేవారు. మాథ్యూ అదే పేరుతో ఉన్న మూడు తరాలకుక్కల గురించి చెబుతారు.

2008లో ట్యాంగోలలో ఒకదానికి కాలు విరిగింది. అప్పుడు టాటా ఆ కాలిని రక్షించగల పశువైద్యుని కోసం ప్రపంచాన్ని జల్లెడ పట్టారు. చివరికి ట్యాంగోను చికిత్స కోసం మిన్నెసోటా (యూఎస్‌ నగరం) తీసుకెళ్లారు.తన చివరి జీవితంలో టిటో ఆయన ప్రధాన సహచరుడు. ‘‘ఇప్పుడు టాటాకు టిటో మాత్రమే ఉంది’’ అని మాథ్యూ రాశారు. ‘‘ప్రతి సాయంత్రం టిటో కోసం ఏ అవాంతరం లేకుండా ఒక సమయం రిజర్వ్‌ చేయబడేది. ఆ షెడ్యూల్‌కు ఎవరైనా, లేదా ఏ కార్య క్రమమైనా భంగం కలిగించడం టాటాకు ఇష్టం ఉండేది కాదు. టిటోతో గడిపే సమయమే ఆయనకు రోజులో అత్యుత్తమ సమయం’’ అని మాథ్యూ వివరిస్తారు.

బహుశా నమ్మశక్యం కాని విధంగా, టాటాలో చిలిపిగుణం కూడా ఉండేది. బోర్డ్‌ మీటింగ్‌లలో వృద్ధ డైరెక్టర్లు తమ బూట్లను తీసేస్తారని గమనించిన తర్వాత, ఆయన నిశ్శబ్దంగా వాటిని వీలైనంత దూరంలోకి తన్నేవారు. ఆ బూట్లు ఎక్కడ ఉన్నాయో వారికి కనిపించనప్పుడు అల్లరిగా నవ్వుతూ ఉండేవారు. మాథ్యూ పుస్తకంలోని అన్ని విశేషా ల్లోకీ ఇది నాకు రసవత్తరమైన సంగతిగా అనిపించింది.అయితే, సైరస్‌ మిస్త్రీ, టెట్లీ టీ, కోరస్, జాగ్వార్‌ అధ్యాయాలతో సహా ఇంకా చాలానే ఈ పుస్తకంలో ఉన్నాయి. ఆ వివరాలు ఉండకుండా ఎలా ఉంటాయి? కానీ వ్యక్తిగత వివరాలే నా దృష్టిని ఆకర్షించాయి. అవి మిమ్మల్ని కూడా ఆకర్షిస్తాయని నేను ఆశించవచ్చా?

- వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌
- కరణ్‌ థాపర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement