సహచర పాత్రికేయ మిత్రుడు దేవులపల్లి అమర్ తన నాలుగున్నర దశాబ్దాల అనుభవసారం రంగరించి రచించిన ‘మూడు దారులు - రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు’ అనే ఈ పుస్తకంలో మొత్తం 15 అధ్యాయాలు ఉన్నాయి. ‘రాజకీయాలు-ఒక సమాలోచన’ అనే అధ్యాయంతో మొదలయ్యే ఈ రచనలో అమర్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు-మొదట ఆంధ్రరాష్ట్రాన్ని, ఆ తర్వాత అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ను - ఏకచ్చత్రంగా ఏలిన కాంగ్రెస్ ప్రభుత్వాల గురించి, కాంగ్రెస్ ముఠాకలహాల గురించి, ఒకరినొకరు పడదోసుకుంటూ సాగించిన రాజకీయక్రీడ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి వివరించి ఈ తొలి అధ్యాయం ద్వారా ఈ పుస్తకానికి ఒక చారిత్రక ప్రతిపత్తిని సంతరించారు.
ఈ పుస్తకంలోని మొదటి అధ్యాయాన్ని ‘చరిత్రను తిరగ తోడటం దేనికి?’ అనే ప్రశ్నతో అమర్ ప్రారంభిస్తారు. ‘చరిత్ర పుటలను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ వర్తమానంలోకి రాలేమా, రావచ్చు కానీ గతాన్ని నిశితంగా పరికించినప్పుడు మాత్రమే వర్తమానాన్ని బేరీజు వేయగలం. అంతేకాదు వర్తమానంలో చోటు చేసుకుంటున్న మార్పులను, జరుగుతున్న సంఘటనలను నిష్పాక్షిక దృష్టితో చూసే వీలు కలుగుతుంది’ అంటూ ప్రారంభంలోనే ఈ పుస్తకంలోని థీమ్‌కి ఒక డెప్త్ తీసుకువచ్చారు, దీనిని చరిత్రగా చూపించారు.
చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి ఒకే కాలంలో రాజకీయరంగ ప్రవేశం చేయడం, భిన్నమైన దారుల్లో వెళ్లడం, ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి ప్రవేశం ఇవన్నీ ఈ పుస్తకంలో రచయిత చర్చించారు. ఈ విషయాల్లో ఎక్కడా రచయిత బేసిక్ ఫ్యాక్ట్స్‌తో కాంప్రమైజ్ కాలేదు. బేసిక్ ఫ్యాక్ట్స్‌పై, పబ్లిక్ డొమైన్‌లో ఉన్న విషయాలపై ఇంకొంచెం స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నం చేశారు తప్ప ఫ్యాక్ట్స్‌ను డిస్టార్ట్ చేయడం గానీ, కప్పిపుచ్చడం గానీ చేయలేదని ఈ పుస్తకం చదివినప్పుడు నాకు అర్థమైంది.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈ ముగ్గురు నాయకులూ, వారు అనుసరించిన దారుల గురించి ప్రధానంగా చర్చించిన పుస్తకం ఇది. ఈ పుస్తకంలో వైస్రాయి ఘట్టం చదువుతున్నప్పుడు నాకు ఒక సినిమా చూస్తున్నట్టు అనిపించింది. నిజంగా ఒక సినిమాకు సబ్జెక్టు అది.
అమర్ ఈ పుస్తకంలో బేసిక్ ఫ్యాక్ట్స్‌తో కాంప్రమైజ్ అవలేదనడానికి ఇంకో ఉదాహరణ ఏం చెబుతానంటే, వైస్రాయ్‌తో ముడిపడిన ఈ మొత్తం ఉదంతంలో ఎన్టీఆర్ స్వయంకృతం కూడా చాలా ఉంది. రాజకీయంగా అనుభవం లేకపోవడం, చెప్పినా వినకపోవడం, మొండితనం వంటివి కూడా దీనికి కొంత దోహదం చేశాయి. ఆ సంగతినీ అమర్ ప్రస్తావించారు. ఆవిధంగా రెండువైపులా ఏం జరిగిందో చిత్రించారు. అలాగే లక్ష్మీపార్వతి జోక్యాన్నీ ఆయన దాచలేదు. ఆ తరువాత మీడియా! ఇందులో ఎన్టీఆర్ వ్యక్తిగత వ్యవహార శైలి, అల్లుళ్లతో సహా ఆయన కుటుంబ సభ్యుల పాత్ర, ఆయన అర్ధాంగి పాత్ర.. వీటన్నిటితో పాటు మీడియా కూడా ప్రధాన పాత్రధారి.
ఎన్టీఆర్ అధికారచ్యుతికి సంబంధించిన మొత్తం ఉదంతంలో మీడియా పాత్ర గురించి, మీడియా వ్యవహారశైలి గురించి ప్రత్యేకంగా ఒక పుస్తకం రావాలని! ప్రీ-తెలుగుదేశం, పోస్ట్-తెలుగుదేశం అనే డివిజన్‌తో తెలుగు మీడియా చరిత్ర రాయాలని నేనంటాను. నాదెండ్ల భాస్కరరావు చేసిన దానికి చంద్రబాబు చేసినది ఒకవిధంగా పొడిగింపే.
మొత్తం మీద అమర్ ఈ పుస్తకంలో పబ్లిక్ డొమైన్‌లో ఉన్న విషయాలనే అందించారు. ప్రత్యక్షసాక్షిగా తన దృక్కోణాన్ని కలుపుకుంటూ వాటిని కథనం చేశారు. చివరిగా జగన్ మోహన్ రెడ్డిగారి విషయానికి వచ్చేసరికి ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహార శైలి, ఆయన ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సంక్షేమ పథకాలు, ఇతరత్రా చర్యలు, విధానాల గురించి చెప్పారు. ఈ అధ్యాయంలో కూడా అమర్ ఫ్యాక్ట్స్‌తో రాజీపడలేదనే విశ్వసిస్తున్నాను. (ఫిబ్రవరి ఒకటవ తేదీన హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో దేవులపల్లి అమర్ రాసిన మూడు దారులు పుస్తక పరిచయ సభలో పాత్రికేయ ప్రముఖులు, రచయిత కల్లూరి భాస్కరం చేసిన సమీక్ష నుంచి ముఖ్య భాగాలు).
ఇవి చదవండి: Lok Sabha polls 2024: సోషల్ మీడియా... నయా యుద్ధరంగం
Comments
Please login to add a commentAdd a comment