kalluri bhaskaram
-
అమర్ రచన "మూడు దారులు" పై.. కల్లూరి భాస్కరం సమీక్ష!
సహచర పాత్రికేయ మిత్రుడు దేవులపల్లి అమర్ తన నాలుగున్నర దశాబ్దాల అనుభవసారం రంగరించి రచించిన ‘మూడు దారులు - రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు’ అనే ఈ పుస్తకంలో మొత్తం 15 అధ్యాయాలు ఉన్నాయి. ‘రాజకీయాలు-ఒక సమాలోచన’ అనే అధ్యాయంతో మొదలయ్యే ఈ రచనలో అమర్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు-మొదట ఆంధ్రరాష్ట్రాన్ని, ఆ తర్వాత అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ను - ఏకచ్చత్రంగా ఏలిన కాంగ్రెస్ ప్రభుత్వాల గురించి, కాంగ్రెస్ ముఠాకలహాల గురించి, ఒకరినొకరు పడదోసుకుంటూ సాగించిన రాజకీయక్రీడ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి వివరించి ఈ తొలి అధ్యాయం ద్వారా ఈ పుస్తకానికి ఒక చారిత్రక ప్రతిపత్తిని సంతరించారు. ఈ పుస్తకంలోని మొదటి అధ్యాయాన్ని ‘చరిత్రను తిరగ తోడటం దేనికి?’ అనే ప్రశ్నతో అమర్ ప్రారంభిస్తారు. ‘చరిత్ర పుటలను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ వర్తమానంలోకి రాలేమా, రావచ్చు కానీ గతాన్ని నిశితంగా పరికించినప్పుడు మాత్రమే వర్తమానాన్ని బేరీజు వేయగలం. అంతేకాదు వర్తమానంలో చోటు చేసుకుంటున్న మార్పులను, జరుగుతున్న సంఘటనలను నిష్పాక్షిక దృష్టితో చూసే వీలు కలుగుతుంది’ అంటూ ప్రారంభంలోనే ఈ పుస్తకంలోని థీమ్‌కి ఒక డెప్త్ తీసుకువచ్చారు, దీనిని చరిత్రగా చూపించారు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి ఒకే కాలంలో రాజకీయరంగ ప్రవేశం చేయడం, భిన్నమైన దారుల్లో వెళ్లడం, ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి ప్రవేశం ఇవన్నీ ఈ పుస్తకంలో రచయిత చర్చించారు. ఈ విషయాల్లో ఎక్కడా రచయిత బేసిక్ ఫ్యాక్ట్స్‌తో కాంప్రమైజ్ కాలేదు. బేసిక్ ఫ్యాక్ట్స్‌పై, పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలపై ఇంకొంచెం స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నం చేశారు తప్ప ఫ్యాక్ట్స్‌ను డిస్టార్ట్ చేయడం గానీ, కప్పిపుచ్చడం గానీ చేయలేదని ఈ పుస్తకం చదివినప్పుడు నాకు అర్థమైంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈ ముగ్గురు నాయకులూ, వారు అనుసరించిన దారుల గురించి ప్రధానంగా చర్చించిన పుస్తకం ఇది. ఈ పుస్తకంలో వైస్రాయి ఘట్టం చదువుతున్నప్పుడు నాకు ఒక సినిమా చూస్తున్నట్టు అనిపించింది. నిజంగా ఒక సినిమాకు సబ్జెక్టు అది. అమర్ ఈ పుస్తకంలో బేసిక్ ఫ్యాక్ట్స్‌తో కాంప్రమైజ్ అవలేదనడానికి ఇంకో ఉదాహరణ ఏం చెబుతానంటే, వైస్రాయ్‌తో ముడిపడిన ఈ మొత్తం ఉదంతంలో ఎన్టీఆర్ స్వయంకృతం కూడా చాలా ఉంది. రాజకీయంగా అనుభవం లేకపోవడం, చెప్పినా వినకపోవడం, మొండితనం వంటివి కూడా దీనికి కొంత దోహదం చేశాయి. ఆ సంగతినీ అమర్ ప్రస్తావించారు. ఆవిధంగా రెండువైపులా ఏం జరిగిందో చిత్రించారు. అలాగే లక్ష్మీపార్వతి జోక్యాన్నీ ఆయన దాచలేదు. ఆ తరువాత మీడియా! ఇందులో ఎన్టీఆర్ వ్యక్తిగత వ్యవహార శైలి, అల్లుళ్లతో సహా ఆయన కుటుంబ సభ్యుల పాత్ర, ఆయన అర్ధాంగి పాత్ర.. వీటన్నిటితో పాటు మీడియా కూడా ప్రధాన పాత్రధారి. ఎన్టీఆర్ అధికారచ్యుతికి సంబంధించిన మొత్తం ఉదంతంలో మీడియా పాత్ర గురించి, మీడియా వ్యవహారశైలి గురించి ప్రత్యేకంగా ఒక పుస్తకం రావాలని! ప్రీ-తెలుగుదేశం, పోస్ట్-తెలుగుదేశం అనే డివిజన్‌తో తెలుగు మీడియా చరిత్ర రాయాలని నేనంటాను. నాదెండ్ల భాస్కరరావు చేసిన దానికి చంద్రబాబు చేసినది ఒకవిధంగా పొడిగింపే. మొత్తం మీద అమర్ ఈ పుస్తకంలో పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలనే అందించారు. ప్రత్యక్షసాక్షిగా తన దృక్కోణాన్ని కలుపుకుంటూ వాటిని కథనం చేశారు. చివరిగా జగన్ మోహన్ రెడ్డిగారి విషయానికి వచ్చేసరికి ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహార శైలి, ఆయన ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సంక్షేమ పథకాలు, ఇతరత్రా చర్యలు, విధానాల గురించి చెప్పారు. ఈ అధ్యాయంలో కూడా అమర్ ఫ్యాక్ట్స్‌తో రాజీపడలేదనే విశ్వసిస్తున్నాను. (ఫిబ్రవరి ఒకటవ తేదీన హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో దేవులపల్లి అమర్ రాసిన మూడు దారులు పుస్తక పరిచయ సభలో పాత్రికేయ ప్రముఖులు, రచయిత కల్లూరి భాస్కరం చేసిన సమీక్ష నుంచి ముఖ్య భాగాలు). ఇవి చదవండి: Lok Sabha polls 2024: సోషల్ మీడియా... నయా యుద్ధరంగం -
PV చనిపోయినప్పటి నుంచి ఇప్పటి దాకా పట్టించుకోని కాంగ్రెస్
-
మూలాల అన్వేషణలో వరదకు ఎదురీత
కల్లూరి భాస్కరం రచించిన ‘ఇవీ మన మూలాలు’ అనే పుస్తకం ఒక మల్టి– డిసిప్లినరీ అధ్యయనం. మానవుడికి సంబంధించిన ఒక సుదీర్ఘమైన కథని ఎంతో ఉత్కంఠభరితంగా చెప్తున్న రచన ఇది. ఇటువంటి కృషి ఒక్క మనిషి ఒంటి చేత్తో చెయ్యగలిగేది కాదు. ఏదైనా ఒక విశ్వ విద్యాలయమో లేదా ఒక శాస్త్రవేత్తల బృందమో మాత్రమే చెయ్యగల పని. మానవ చరిత్ర దశాబ్దాల లెక్కకో, చివరికి శతాబ్దాల లెక్కకో కుదించగలిగేది కాదు. అది సహస్రాబ్దాల లెక్కలో అర్థం చేసుకో వలసింది. మనం ఈ రోజు అట్లాసులో చూస్తున్న ఈ ఖండాలు ఎల్లప్పుడూ ఇలానే లేవనీ, ఈ దేశాలూ, ఈ సరిహద్దులూ ఎప్పటి కప్పుడు మారుతూనే ఉన్నాయనీ, ఈ రోజు భారతదేశంతో సహా ఎన్నో జాతీయరాజ్యాలు భావిస్తున్నట్టుగా వాటి జాతి చరిత్ర అవి గీసుకున్న సరిహద్దులకే పరిమితం కాలేదనీ, నిజానికి మనం కట్టు కుంటున్న గోడలేవీ ఒకప్పుడిలా లేవనీ, ఇప్పుడు కూడా ఈ గోడలు ఇలానే శాశ్వతంగా నిలబడిపోయేవి కావనీ మనం గ్రహించవలసి ఉంటుంది. మన్వంతరాల చరిత్రలో మానవుడు ఈ వసుధ మొత్తాన్ని ఏక కుటుంబంగా భావించాడనీ, ఎక్కడో సుదూర ప్రాంతానికి చెందిన మానవ సమూహాలు మరెక్కడో సుదూర ప్రాంతానికి పోయి అక్కడ నాగరికతలు నిర్మించాయనీ ఈ రోజు ఎన్నో ఆనవాళ్ళు లభిస్తున్నాయి. ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా తన సంస్కృతి, తన సాహిత్యం, తన సాంకేతికత పూర్తిగా తన ఘనత మాత్రమే అనుకోడానికి లేదనీ, మానవుడు ఏ దేశంలో ఉన్నా అతడు సాధించిన ప్రతి విజయంలోనూ ప్రపంచ మానవులందరి పాత్రా ఉందని మనం ఒప్పుకోవలసి ఉంటుంది. ఇదే మాట మన జన్యు వారసత్వం గురించి కూడా చెప్పుకోక తప్పదు. ఇప్పుడు ఈ నేల మీద నడయాడుతున్న ప్రతి ఒక్క మానవుడూ, ఇంతదాకా ఈ పృథ్వి మీద సంచరించిన ప్రతి ఒక్క మానవుడికీ జన్యుపరంగా వారసుడేనన్నది ఒక వైజ్ఞానిక సత్యం. ఇంత కొట్టొచ్చినట్టుగా మన ముందు బయటపడుతున్న మానవుడి గతాన్ని చూడటానికి ఇష్టపడకుండా, ఇంకా శుద్ధ జాతులూ, శుద్ధరక్తమూ, శుద్ధ సంస్కృతీ ఉంటాయనుకోవడం సాంస్కృతిక అంధ త్వం మాత్రమే! ఇటువంటి గుడ్డితనం ఎవరో ఒక రిద్దరు వ్యక్తులకి ఉండటం వేరు, ఒక జాతి అత్యధికభాగం ఇటువంటి కథనాల్ని చెప్పుకుంటూ తనని తాను నమ్మించుకోడం వేరు. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. తాను బలపడుతున్నానుకుంటూ నిజా నికి ఒక జాతి దుర్బలమైపోతున్న ప్రక్రియ ఇది. ఈ నేపథ్యంలో భాస్కరం గారి పుస్తకాన్ని మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది. జాతీయోద్యమ నాయకులు భారతదేశ చరిత్రలో ప్రతి ఒక్కరి పాత్రనీ గుర్తించారు. కానీ కొత్త జాతీయవాదులు అటు వంటి విశాల దృక్పథాన్ని స్వాగతించరు సరికదా, అటువంటి విస్తృత దృక్పథాన్ని సహించలేరు కూడా. తమ అసహనాన్ని ప్రక టించడానికి వారికున్న అనేక సాధనాల్లో కృత్రిమ కథనాల్ని ప్రచారం చేయడం కూడా ఒకటి. ముఖ్యంగా భారతదేశ చరిత్ర గురించి వాళ్ళు శాస్త్రీయ దృక్పథానికి బదులు పౌరాణిక దృక్ప థాన్ని ప్రచారం చేస్తారు. ప్రజల్ని ఉద్రిక్తుల్ని చేయడానికి వాస్తవం కన్నా కల్పనది దగ్గరి దారి అని వాళ్ళ నమ్మకం. సరిగ్గా ఈ వరదకు ఎదురీదుతూ భాస్కరం గారు ఈ పుస్తకం రాశారని చెప్పవచ్చు. ఇది సాహసమే కాని ఎంతో అవసరం. ఆయనిలా అంటున్నారు: ‘ఒక్కోసారి రాజకీయం తన హద్దును, తూకాన్ని దాటిపోయి సంస్కృతి, సాహిత్యం, శాస్త్రవిజ్ఞానం తదితర జ్ఞాన రంగాలను కూడా తన పరిధిలోకి తెచ్చేసుకుని, రాజకీయాన్నీ వాటినీ కలగా పులగం చేసి సర్వం తానే అవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. రాజకీయానికి సమాంతరంగా జ్ఞానరంగానికి ఉన్న ప్రాము ఖ్యాన్నీ, దాని స్వేచ్ఛా స్వాతంత్య్రాల్నీ గుర్తించి దాని ఉనికిని ఎప్పటికప్పుడు పటిష్ఠం చేసుకోవడమే రాజకీయ స్వైరవిహారానికి విరుగుడు.’ ఈ రచన సత్యాన్వేషణ దృష్టితో చేసిన కృషి. ఇందుకు గాను భాస్కరంగారు ఆధునిక, సమకాలిక జన్యుశాస్త్ర పరిశోధనల్ని తన ముడిసరుకుగా తీసుకున్నారు. ఎందుకంటే ఆయనే ఒక చోట రాసినట్టుగా ‘జనశాస్త్రమంటే జన్యుశాస్త్రమే.’ ఒక ప్రాంతం నుంచి వలసపోయినవాళ్ళో లేదా అక్కడికి వలస వచ్చినవాళ్ళో మాత్రమే అక్కడి చరిత్రని నిర్మించారని భాస్కరం గారు ఈ రచనలో ఎక్కడా రాయలేదు. ఆయన చెప్తు న్నదల్లా ఏమిటంటే, ఏ దేశ చరిత్రనైనా కేవలం ఆ దేశీయులు మాత్రమే నిర్మించారనుకోకండి, అది బహుళ జాతుల సంస్కృతుల ఆదాన ప్రదానాలతో నిరంతరం సంభవిస్తూండే ఒక ప్రక్రియ అని మాత్రమే. అలాగే, శుద్ధమైన జాతి అంటూ ఏదీ లేదనీ, అలా ఉంటుందనుకుని తమ దేశం చుట్టూ సాంస్కృతి కంగా గోడలు కట్టుకోవడం మూర్ఖత్వం మాత్రమే కాదు, ప్రమా దకరమని కూడా ఆయన చెప్తున్నారు. ముందే చెప్పినట్టుగా ఇదొక మల్టీ డిసిప్లినరీ అధ్యయనం. ఇందులో జన్యుశాస్త్ర పరిశీలనలతో పాటు, పురావస్తు, మానవ శాస్త్ర పరిశీలనలతో పాటు, తులనాత్మక భాషాశాస్త్రం, మైథాలజీ, వేద, పురాణ, ఇతిహాసాల పరిశీలనలతో పాటు, సంస్కృత, తెలుగు సాహిత్యాల నుంచి కూడా ప్రస్తావనలు ఉన్నాయి. ఈ ఒక్క గ్రంథం చదివితే ఎన్నో గ్రంథాలు చదివినట్టు! ఈ అధ్యయ నంలో భాస్కరంగారు ఎన్నో హైపోథీసిసులు మనముందుంచ డమేకాక, మన సంస్కృతి, చరిత్రలకు సంబంధించిన ఎన్నో చిక్కుముళ్ళు విడి పోవడానికి అవసరమైన తాళంచెవులు కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఒకటి, ఆయన స్వయంగా పండిత కుటుంబం నుంచి వచ్చిన వారు కావడంవల్లా, భారతీయ సంస్కృతికి మూలగ్రంథాలు అని చెప్పదగ్గవాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసినందువల్లా ఇది సాధ్యపడిందని చెప్పవచ్చు. రెండోది– ఏళ్ళ తరబడి ఆయన ఎంతో సమర్థవంతంగా నిర్వహించిన పాత్రికేయ వృత్తి ఆయనకు సమకాలిక ప్రపంచం గురించీ, భారతీయ సామాజిక పరివర్తన గురించీ ప్రత్యక్ష పరిజ్ఞానాన్ని అందించడం మరో కారణం. (‘ఇవీ మన మూలాలు’కు రాసిన ముందుమాట నుంచి) వాడ్రేవు చినవీరభద్రుడు వ్యాసకర్త కవి, రచయిత (ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ‘ఇవీ మన మూలాలు’ పుస్తక ఆవిష్కరణ) -
GS Varadachary: ఒక ‘డీఫ్యాక్టో ఎడిటర్’ ఆత్మకథ
వరదాచారిగారు తెలుగు పత్రికారంగానికీ, తెలుగు పత్రికారంగ చరిత్రకూ చేసిన ఉపకారం ఎనలేనిది. ఆయా రంగాలలో ఉత్తమస్థాయిని అందుకున్న ప్రతి ఒక్కరూ ఆత్మకథను రాసితీరాలని నా భావన. అవి కేవలం వారి సొంత కథలు కావు. ఆరేడు దశాబ్దాలకు విస్తరించిన ఆయా రంగాల తాలూకు చరిత్రను, మొత్తంగా దేశ చరిత్రను చెబుతాయి. అనేకమైన పనుల ఒత్తిడుల మధ్య ‘జ్ఞాపకాల వరద’ చదవడం ప్రారంభించి ఆ వరదలో ఎక్కడా ఆగకుండా మునకలేస్తూ, 272 పేజీల పుస్తకాన్ని ఒక్కరోజులోనే పూర్తి చేయగలిగాను. వరదాచారి పండిత పత్రికా రచయిత, ఆపైన బహుముఖ కార్యదక్షులు, బహుళ వ్యాపకులు, తాను పనిచేస్తూనే, ఇతరులతో పని చేయిస్తూ, అందులోనే శిక్షణను మేళవిస్తూ, డెస్క్‌నే ఒక తరగతి గదిగా మలచుకుంటూ, ఒక నిష్కామబుద్ధితో మెరిక ల్లాంటి ఎందరో పత్రికారచయితలను తయారు చేసినవారు. ఈ దృష్ట్యా, పొత్తూరి వంటివారు ఆయనను ‘ప్రొఫెసర్’ అని పిల వడం ఎంతైనా అర్థవంతం. ఆ మాటను సార్థకం చేస్తూ, తెలుగు విశ్వ విద్యాలయంలో జర్నలిజం శాఖలో అధిపతిగానూ, అధ్యా పకులు గానూ రెండు దశాబ్దాలకు పైగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్, జర్నలిస్టుల సహకార గృహ నిర్మాణ సంఘం, ప్రెస్ క్లబ్, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్, ఇటీవలి కాలంలో వయోధిక పాత్రికేయ సంఘం మొదలైన సంస్థలతో క్రియాశీల సంబంధం లేకుండా, ఆయన పండిత పత్రికా రచయిత గానే ఉండిపోయి ఉంటే, ఈ రంగంలో తిరుమల రామచంద్ర వంటి పండిత ప్రకాండులలో ఒకరయ్యేవారని ఈ పుస్తకం చదివినప్పుడు నాకు అనిపించింది. జర్నలిస్టులతోపాటు భవిష్య నిధి సభ్యత్వం కలిగిన కార్మికులందరికీ లాభం చేకూర్చిన పింఛను పథకం మొదట వారి మెదడులోనే అంకురించి మొక్క అయిం దంటే– ఆయన వ్యక్తిత్వ, వ్యాపకాలకు చెందిన మరో పార్శ్వం ఎంత విలువైనదో, ఎంత స్ఫూర్తిదాయ కమో తెలుస్తుంది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరుకు చెందిన ఒక వైష్ణవ కుటుంబానికి చెంది, దానిని అంటి పెట్టు కుని ఉండే సంప్ర దాయ గాఢతను, పరి భాషను, పాండిత్య స్పర్శను వరదాచారి బాల్యం నుంచే రంగ రించుకున్నారు. చిన్న ప్పుడు ఏర్పడిన కులమతవర్గాతీత స్నేహాలు ఆయనలో భావ వైశాల్యాన్ని, హృదయ వైశాల్యాన్ని పెంచి విస్తృత మానవ సంబంధాలవైపు నడిపించాయి. తెలంగాణలోనూ, ఆంధ్రలోనూ ఉన్న వైష్ణవ కుటుంబాలు చాలావరకూ నేటి తమిళనాడు నుంచి వలస వచ్చాయన్న చారిత్రక సమాచారం మనం ఎరిగినదే. అలాంటి అనుభవాలు, మూలాలు ఆ తరహా కుటుంబాలలో ఒక విధమైన కార్యదక్షతను, క్రియా శీలాన్ని, ఎంతో ముందుచూపుతో ప్రణాళికాబద్ధంగా పిల్లలను పెంచి పెద్దజేసే లక్షణాన్ని అలవరచడం సహజమే. తండ్రి కృష్ణమాచారిగారిలో ప్రస్ఫుటంగా కనిపించే ఈ లక్షణాలే మనకు తెలిసిన రూపంలోని వరదాచారిగారినే కాక, ఆయన సోదరులను కూడా ఉన్నతవిద్యాపరంగానూ, ఇతరత్రానూ ప్రయోజకులుగా తీర్చిదిద్దినట్టు ఈ పుస్తకం చదివితే అర్థమవుతుంది. ఈ పుస్తకం నాలో కలిగించిన గొప్ప తెలివిడి ఏమిటంటే – అప్పటికి విద్య, ఉద్యోగాలపరంగా ముందుందనుకునే ఆంధ్రప్రాంతపు కుటుం బాల కన్నా కూడా వరదాచారి కుటుంబం అన్నివిధాలా ముందడు గులో ఉందన్న సంగతి! ఆ విధంగా కుటుంబాన్ని తీర్చిదిద్దిన కృష్ణ మాచారిగారే ఈ ఆత్మకథలో నాకు అసలు హీరోగా కనిపిస్తారు. వరదాచారిగారి ఆత్మకథ చదువుతుంటే, ఎంత నమ్మకం లేని వారికైనా ‘విధి’ని నమ్మక తప్పదేమోననిపిస్తుంది. మూడు, నాలుగు పత్రికలలో సంపాదకులయ్యే అవకాశం వచ్చినట్టే వచ్చి తప్పిపోవడానికి, అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ పత్రికారంగంలో ఉన్నతమైన ఎడిటర్ స్థానాన్ని ఆయన అందుకోలేకపోవడానికి కేవలం విధి తప్ప మరో కారణం లేదని అనిపిస్తుంది. మరోవైపు, ‘ఆంధ్రభూమి’ దినపత్రికకు గోరాశాస్త్రి ఎడిటర్ కావడానికి పూర్వ రంగంలో ప్రముఖపాత్ర నిర్వహించినదీ ఆయనే. వరదాచారిగారి అమోఘ జ్ఞాపకశక్తికి అద్దంపట్టే ‘జ్ఞాపకాల వరద’ అనేక కోణాలలో విలువైనది. వారి స్వీయచరిత్రనే కాక, ఆరేడు దశాబ్దాలకు విస్తరించిన తెలుగు పత్రికారంగ చరిత్రను, అందులో భాగంగా దేశ, రాష్ట్ర రాజకీయ, సామాజిక, సాంస్కతిక చరిత్రనూ చెబుతుంది. కల్లూరి భాస్కరం (జి.ఎస్. వరదాచారి జీవన సాఫల్య అభినందన సభ, ‘పరిణత పాత్రికేయం’ ఆవిష్కరణ సందర్భంగా..) -
12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు
నాంపల్లి (హైదరాబాద్): వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ 2018 ఏడాదికి ప్రతిభా పురస్కారాలను ప్రకటించింది. రామకవచం వెంకటేశ్వర్లు (కవిత), ఆచార్య వెలుదండ నిత్యానందరావు (విమర్శ), డి.అనంతయ్య (చిత్రలేఖనం), ఆర్.గంగాధర్ (శిల్పం), ఓలేటి రంగమణి (నృత్యం), డాక్టర్ ఎస్.కె.వెంకటాచార్యులు (సంగీతం), కల్లూరి భాస్కరం (పత్రికారంగం), రావుల వెంకట్రాజం గౌడ్ (నాటకం), కౌళ్ళ తలారి బాలయ్య (జానపద కళారంగం), డాక్టర్ మలుగ అంజయ్య (అవధానం), ఎన్.అరుణ (ఉత్తమ రచయిత్రి), పి.చంద్రశేఖర ఆజాద్ (నవల) పురస్కారాలకు ఎంపికయ్యారు. (చదవండి: జోనల్ సర్దుబాటు తర్వాత కొత్త ఉద్యోగాలు) డిసెంబరులో హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే ప్రత్యేక ఉత్సవంలో ఈ పురస్కారాలు ప్రదానం చేస్తామని రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్ తెలిపారు. (చదవండి: ఉద్యోగుల కేటాయింపులో ఆప్షన్లు) -
యజ్ఞమూ, మాంత్రికతా
పురా చరిత్రగా, సామాజిక పరిణామ చరిత్రగా మహాభారతాన్ని పరిశీలిస్తూ కల్లూరి భాస్కరం రాసిన వ్యాసాల సంపుటి ‘మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే’. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన ఈ 800 పేజీల పుస్తకంలోంచి కొంత భాగం. ఓరోజు సాయంత్రం అట్లాంటిక్ సముద్ర తీరంలో ఉన్న (ఐర్లాండ్) గ్రామంలో జార్జి థామ్సన్ పచార్లు చేస్తూ ఊరి బావి దగ్గరకు వెళ్లాడు. అక్కడ తెలిసినామె కనిపించింది. ఆమె ఒక వృద్ధ రైతుమహిళ. అప్పుడే బొక్కెనలో నీళ్లు నింపుకుని సముద్రం వైపు తదేకంగా చూస్తూ నిలబడివుంది. ఆమె భర్త చనిపోయాడు. ఏడుగురు కొడుకులు. ఏడుగురూ ‘కట్టకట్టుకుని’(ఆమె అభివ్యక్తి) మసాచూసెట్స్‌లోని స్ప్రింగ్ఫీల్డ్కు వెళ్లిపోయారు. కొద్ది రోజుల క్రితమే ఒక కొడుకు దగ్గరనుంచి ఆమెకు ఉత్తరం వచ్చింది. ‘ఈ చివరి రోజుల్లో మా దగ్గర సుఖంగా ఉందువుగాని, వచ్చేయి, నువ్వు సరేనంటే ప్రయాణానికి డబ్బు పంపిస్తా’మని దాని సారాంశం. ఈ విషయం ఆమె థామ్సన్‌తో చెప్పింది. కొండలు, బండలు ఎక్కుతూ, ఎగుడు దిగుడు పచ్చికబీళ్ల మీద నడుస్తూ జీవితంలో తను పడిన కష్టాల గురించి, తను పోగొట్టుకున్న కోళ్ల గురించి, పొగచూరిన చీకటి గుయ్యారం లాంటి తన చిన్న ఇంటి గురించి వర్ణించుకుంటూ వచ్చింది. తర్వాత అమెరికా గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. ఆమె ఊహలో అమెరికా అంటే బంగారపు దేశం. అక్కడ కాలిబాటల మీద కూడా బంగారం దొరుకుతుందట. ఆ తర్వాత, కొడుకులుండే కార్క్ నగరానికి రైలు ప్రయాణం గురించి, అట్లాంటిక్ దాటడం గురించి మాట్లాడింది. ఆపైన తన శరీరం ఐరిష్ మట్టిలోనే కలిసిపోవాలన్న తన చివరి కోరిక గురించి చెప్పింది. ఆమె మాట్లాడుతున్నకొద్దీ ఉత్తేజితురాలు కావడం ప్రారంభించింది. ఆమె భాష క్రమంగా మరింత ప్రవాహగుణాన్ని సంతరించుకోసాగింది. అది మరింత ఆలంకారికతను, లయాత్మకతను, శ్రావ్యతనూ పుంజుకుంటూ వచ్చింది. ఆమె దేహం స్వాప్నికమైన ఒక ఊయలలో ఊగిపోతున్నట్టు అనిపించింది. తను కవినన్న భావన ఏ కోశానా లేని ఈ నిరక్షరాస్య వృద్ధమహిళ మాటల్లో కవిత్వానికి ఉండే అన్ని లక్షణాలూ ఉన్నాయంటాడు థామ్సన్. ఇదొక పూనకం; కవిత్వం ఒక ప్రత్యేకమైన వాక్కు అంటాడు. కవిత్వం పుట్టుక గురించి తెలుసుకోవాలంటే వాక్కు ఎలా పుట్టిందో తెలుసుకోవాలి. వాక్కు ఎలా పుట్టిందో తెలుసుకోవడమంటే, మనిషి ఎలా అవతరించాడో తెలుసుకోవడమే. వాక్కు సామూహిక శ్రమలో భాగంగా పుట్టింది. శ్రమ చేసేటప్పుడు కండరాల కదలికకు అది సాయపడుతుంది. శ్రమలో భాగమైన వాక్కును శ్రమకు కారణంగా, లేదా చోదకంగా మనిషి అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు మనం మాట అనుకుంటున్నది, అతని దృష్టిలో మాట కాదు, మంత్రం! శ్రమ సాంకేతికత అభివృద్ధి చెందినకొద్దీ, శ్రమలో గొంతు పాత్ర తగ్గిపోతూ వచ్చింది. వ్యక్తులు సమూహంగానే కాక విడివిడిగా కూడా పనిచేసే స్థాయికి ఎదిగారు. అయితే సామూహిక ప్రక్రియ వెంటనే అదృశ్యం కాలేదు. అది, ఒక అసలు కార్యాన్ని ప్రారంభించబోయే ముందు ప్రదర్శించే రిహార్సల్ రూపంలో మిగిలింది. ఇంతకుముందు అసలు కార్యంలో భాగమైన సామూహిక కదలికలే ఒక నృత్యరూపంలో రిహార్సల్స్‌గా మారాయి. ఈ మూకాభినయ నృత్యం ఇప్పటికీ ఆదిమజాతులలో ఉంది. అయితే, నృత్యంలో వాచికాభినయం ఉన్న చోట, అది మాంత్రికరూపం తీసుకుంది. అందుకే అన్ని భాషలలోనూ రెండు రకాల వాగ్రూపాలు కనిపిస్తాయి. నిత్యజీవితంలో మాట్లాడుకునే సాధారణ వాక్కు, కవితాత్మకమైన వాక్కు. ఈ విధంగా చూసినప్పుడు సాధారణ వాక్కు కంటే కవితాత్మకమైన వాక్కే ప్రాథమికమని తేలుతుంది. వాళ్లకు తెలిసిన కవిత్వరూపం పాట ఒక్కటే. వారి పాట, తీరిక సమయంలో పాడుకునేది కాదు. పనిలో భాగంగా పాడుకునేది. పని ద్వారా ఏ భౌతిక ప్రయోజనాన్ని ఆశిస్తారో పాట ద్వారా కూడా అదే భౌతిక ప్రయోజనాన్ని ఆశిస్తారు. ఈ సందర్భంలో మావోరీలు(న్యూజిలాండ్) జరిపే పొటాటో నృత్యాన్ని థామ్సన్ ప్రస్తావించాడు. ఆడపిల్లలు ఆలుగడ్డలు పండించే పొలానికి వెళ్లి పంట ఎదుగుదలకు అవసరమైన తూర్పుగాలి వీస్తున్నట్టు, వర్షం పడుతున్నట్టు, పంట మొలకెత్తి పెరుగుతున్నట్టు తమ శరీరపు కదలికల ద్వారా సూచిస్తూ పాడుతూ నృత్యం చేస్తారు. అంటే, వాస్తవంగా తాము కోరుకునేది ఊహాత్మకంగా సాధిస్తారు. వాస్తవికమైన క్రియకు భ్రాంతిపూర్వక క్రియను జోడించడమే మాంత్రికత. యుద్ధంలో విజయం సాధించడానికి ముందు యాగం జరుపుతారు. అది యుద్ధానికి రిహార్సల్స్. అందులో విజయాన్ని భ్రాంతిపూర్వకంగా ముందే సాధిస్తారు. ఆ భ్రాంతిపూర్వక విజయం అసలు విజయాన్ని కట్టబెడుతుందని నమ్మకం. వర్షాలు పడనప్పుడు సహస్రఘటాభిషేకం చేస్తారు. ఆ జల పుష్కలత్వం గురించిన భ్రాంతివాస్తవికత, వాస్తవికమైన జలపుష్కలత్వాన్ని ఇస్తుందని నమ్మకం.మహాభారతంలో ఇటువంటి మాంత్రికతకు అద్దం పట్టిన ఘట్టాలలో సర్పయాగం, ద్రౌపదీ, దృష్టద్యుమ్నుల జన్మవృత్తాంతం ప్రముఖంగా చెప్పుకోదగినవి. -కల్లూరి భాస్కరం -
జీవితమే ఒక వ్యూహం, ఓ ప్రయోగం
‘భారత్’ అనే ఈ దేశం ఆంగ్లేయుల పాలనలో ‘ఇండియా’గా మారుతున్న చారిత్రకదశలో ఆ రెండింటికీ ప్రాతినిధ్యం వహిస్తూ గాంధీ అవతరించాడు. సంప్రదాయాన్ని నిలుపుకుంటూనే ఆధునికతవైపు, కులమతజాతి భేదాలకు అతీతమైన ఒక విస్తృతివైపు సాగడంలో గాం«దీలో మొదటినుంచీ ఉన్న ఒక జిజ్ఞాస సాయపడింది. చిన్నప్పుడు మెహతాబ్ అనే ముస్లింతో స్నేహంద్వారా గాంధీ మొదటిసారి తన కులమత సంప్రదాయ పరిధికి అవతల ఉన్న ప్రపంచంలోకి తొంగిచూడగలిగాడు. భారత్‌లో స్వాతంత్య్ర పోరాటానికి అంతవరకూ లేని ఒక విశాల జనభూమికను కలి్పంచడమే ఇతర సమకాలీన నాయకుల్లో ఆయనను విశిష్టంగా నిలబెట్టింది. అదే ఆయనను కొందరికి ఆరాధ్యుని చేస్తే, కొందరికి శత్రువును చేసింది. ఆ శత్రుత్వమే చివరికి ఆయన ప్రాణాలను హరించింది. గాంధీ గురించి రాసేటప్పుడు కేవలం వాస్తవాలు రాస్తున్నా అవి అతిశయోక్తుల్లా ధ్వనిస్తాయి. ప్రపంచచరిత్రలో కానీ, మన దేశచరిత్రలో కానీ గాంధీ లాంటి వ్యక్తి మరొకరు కనిపించకపోవడమే అందుకు కారణం. గాంధీ అభిమానులకే కాదు, వ్యతిరేకులకు కూడా ఎదురయ్యే పరి స్థితి ఇది. గాంధీ భారతదేశంలోనే కాదు, అంతకుముందు దక్షిణాఫ్రికాలో కూడా స్వాతంత్య్రపోరాటం నిర్వహించాడు. ఈవిధంగా రెండు దేశాలలో స్వాతంత్య్రపోరాటం నిర్వహించిన నాయకులు కనిపించరు. 21 ఏళ్లపాటు దక్షిణాఫ్రికా గడ్డ మీద నిలబడి ఆయన సాగించిన పోరాటం, భారతదేశంలో నిర్వహించిన పోరాటానికి ఏమాత్రం తక్కువది కాదు. పైగా అది తనలో యవ్వనోత్సాహం ఉరకలు వేస్తున్నప్పుడు జరిగినది. ఇంకా చెప్పాలంటే, ఆయన భారతదేశ పోరాటానికి అవసరమైన శిక్షణ పొందినదీ, వ్యూహాలను పదును పెట్టుకున్నదీ దక్షిణాఫ్రి కాలోనే. బారిస్టర్ చదవడానికి 1888లో ఇంగ్లండ్ వెళ్ళేవరకూ గాంధీలో ఎలాంటి నాయకత్వ లక్షణాలూ కనిపించవు. పైగా నలుగురిముందూ మాట్లాడటానికి కూడా తగని బిడియం. ఇంగ్లండ్‌లో మాంసం ముట్టనని తల్లికి మాట ఇచ్చాడు కనుక, లండన్‌లో శాకాహార ఉద్యమంవైపు సహజంగానే ఆకర్షితుడై, ఆ ఉద్యమంలోనే రాజకీయ నాయకత్వానికి అవసరమైన శిక్షణ పొందాడు. ఉపన్యాసం ఇవ్వడానికీ, రచనలు చేయడానికీ శాకాహార ఉద్యమమే ఆయనకు ఊతమిచ్చింది. ది వెజిటేరియన్ అనే పత్రికకు ఆయన రాసిన వ్యాసాలలో ఉప్పుపన్ను మీద రాసినది ఒకటి. 1930లలో ఆయన నిర్వహించిన ఉప్పుసత్యాగ్రహం ఆలోచన మూలాలు ఇంత సుదూర గతంలో ఉన్నాయన్నమాట. చదువు ముగించుకుని భారత్‌కు తిరిగివచి్చన తర్వాత కథియవార్ లోని బ్రిటిష్ రాజప్రతినిధి చార్లెస్ ఒలివంట్ రూపంలో జాతిదురహంకార రూపాన్ని నగ్నంగా దర్శించేవరకూ గాం«దీలో నాయకత్వ లక్షణం వెల్లడికాలేదు. ఆ తర్వాత దాదా అబ్దుల్లా అండ్ కో అనే కంపెనీకి ఒక కేసులో సహకరించడానికి ఆయన దక్షిణాఫ్రికా వెళ్ళడం, వెడుతూనే మరింత కర్కశమైన జాతిదురహంకారాన్ని ఎదుర్కోవడం, రైలులో మొదటి తరగతిలో ప్రయా ణిస్తున్న తనను అర్ధరాత్రి చలిలో పీటర్ మారిట్జ్ బర్గ్ అనే స్టేషన్లో దింపివేయడం, ఆ క్షణంలోనే జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన సంకలి్పంచుకోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. నిజానికి అంతకుముందు డర్బన్‌లోని ఒక కోర్టులో తలపాగా తీసివేయ మన్న మేజి్రస్టేట్ ఆదేశాన్ని ధిక్కరిస్తూ కోర్టునుంచి బయటికి రావడం ద్వారా గాంధీ అక్కడి పత్రికల్లో ఒక సంచలన వార్త అయ్యాడు. అంతేకాదు, ఒక ప్రతీకాత్మకచర్యకు గల శక్తి ఎలాంటిదో, తన పోరాటాల తొలిరోజుల్లోనే పసిగట్టగలిగాడు. అనంతరకాలంలో సత్యాగ్రహానికి ఉప్పును సాధనం చేసుకోవడంలోనూ, చితికిపోయిన భారత ఆరి్థకతను పునరుద్ధరించడానికి సంకేతంగా చరఖాను చేపట్టడంలోనూ ప్రతీకలపట్ల అలాంటి స్పృహే వ్యక్తమవుతుంది. వేషభాషలకు గల ప్రతీకాత్మకతను గుర్తించి వాటిని కూడా గాంధీ తన ఎత్తుగడలలో భాగం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాలో పోరాటం చేస్తున్న రోజుల్లో కూడా ఆయన డాబు దర్పం ఉట్టిపడే యూరోపియన్ దుస్తులనే చాలాకాలంపాటు ధరించాడు. భారతీయులను చిన్నచూపు చూసే అక్కడి యూరోపియన్ అధికారులకు, విద్యా వంతులకు పాఠం చెప్పే ఒక ఎత్తుగడ దానివెనుక ఉంది. అదే గాంధీ అక్కడి ఒప్పంద కార్మికులతో మమేకమవుతూ వారి దుస్తుల్లోకి మారిపోవడమే కాదు, తన మకాన్ని చిన్న కుటీరానికి మార్చివేయడానికీ క్షణం సందేహించలేదు. ఈ దుస్తుల ఎత్తుగడ ఆయన భారత్ వచి్చన తర్వాతా కొనసాగించాడు. 1915లో బొంబాయి రేవులో ఓడ దిగుతూనే ఒప్పంద కారి్మకుల దుస్తులు విడిచేసి సంప్రదాయిక హిందూ వేషంలోకి మారిపోయాడు. గాంధీ ఆ తర్వాత అర్ధనగ్నవేషంలోకి మారడం వెనుకా పేదలతో మమేకమయ్యే ఎత్తుగడే ఉంది. దక్షిణాఫ్రికాలో మొదట్లో మొదటితరగతిలో ప్రయాణించడానికే పట్టుబట్టిన గాం«దీ, భారత్‌లో మూడవ తరగతి బోగీలో ప్రయాణించడం వెనుక ఉన్నదీ ఇలాంటి ప్రతీకాత్మకతే. లక్ష్యసాధనకు తన జీవితం మొత్తాన్నే ఒక ఎత్తుగడగా, ఒక ప్రయోగశాలగా గాంధీ మార్చుకున్నాడు. ఆ ఎత్తుగడలో, ప్రయో గంలో తన కుటుంబం మొత్తాన్ని భాగం చేశాడు. ఆయనకు బహి రంగ జీవితమే తప్ప, ప్రైవేట్ జీవితం ఉన్నట్టే కనిపించదు. క్రియకు దూరమైన క్షణం ఆయన జీవితం మొత్తంలో ఎక్కడా లేదు. ఒకవిధంగా ఆయన చేసినదంతా తపస్సే. ‘భారత్’ అనే ఈ దేశం ఆంగ్లేయుల పాలనలో ‘ఇండియా’గా మారుతున్న చారిత్రకదశలో ఆ రెండింటికీ ప్రాతినిధ్యం వహిస్తూ గాంధీ అవతరించాడు. సంప్రదాయాన్ని నిలుపుకుంటూనే ఆధునికతవైపు, కులమతజాతి భేదాలకు అతీతమైన ఒక విస్తృతివైపు సాగడంలో గాం«దీలో మొదటినుంచీ ఉన్న ఒక జిజ్ఞాస సాయపడింది. చిన్నప్పుడు మెహతాబ్ అనే ముస్లింతో స్నేహంద్వారా గాంధీ మొదటిసారి తన కులమత సంప్రదాయ పరిధికి అవతల ఉన్న ప్రపంచంలోకి తొంగిచూడగలిగాడు. అలా పడిన అడుగులు తన లండన్ జీవితంలో ఆయనను మరింత ముందుకు తీసుకెళ్ళాయి. అక్కడాయన క్రైస్తవమత బోధలకు వెళ్ళేవాడు, చర్చి సేవల్లో పాల్గొనేవాడు, దివ్యజ్ఞాన సమాజానికి వెళ్ళేవాడు, అంజుమన్–ఎ–ఇస్లాం సమావేశాల్లో పాలుపంచుకునేవాడు. ప్రసిద్ధ నాస్తికుడైన చార్లెస్ బ్రాడ్ లాఫ్‌ను ఎంత అభిమానించాడంటే, ఆయన అంత్యక్రియలకు కూడా వెళ్ళాడు. ఆయన జీవితంలో, ఉద్యమ జీవితంలో మొదటినుంచీ ఉన్న ముస్లిం భాగస్వామ్యం ఆశ్చర్యం కలిగిస్తుంది. భారత్‌లో మొదట్లో న్యాయవాదిగా రాణించలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆయన చేత మొదటిసారి అర్జీ రాయించుకుని ఆవిధంగా ఎంతోకొంత సంపాదనకు మార్గం చూపిన వ్యక్తి ఒక పేద ముస్లిం. ఆయన దక్షిణాఫ్రికా వెళ్లడానికి కారణం కూడా ముస్లిమే. అక్కడ ఆయన నిర్వహించిన పోరాటాల్లో ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నది ముస్లింలే. ఈ కులమతాతీత దృష్టి ఆయన పోరాటాలలో ఒక ప్రధానవ్యూహానికి రూపకల్పన చేసింది. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, పార్శీలు, మహిళలు అనే తేడా లేకుండా దక్షి ణాఫ్రికాలో భారతీయులందరూ జాతివివక్షను ఎదుర్కొంటూ ఉండడం ఆయన విశాలవ్యూహానికి ఒక కారణం. భారత్‌లో ఆయన చేసిందల్లా ఈ దక్షిణాఫ్రికా ప్రయోగాన్ని యథాతథంగా అమలు చేయడమే. ఆ విధంగా భార త్లో స్వాతంత్య్ర పోరాటానికి అంతవరకూ లేని ఒక విశాల భూమికను కలి్పంచడమే సమకాలీనుల్లో ఆయనను విశిష్టంగా నిలబెట్టింది. అదే ఆయనను కొందరికి ఆరాధ్యుని చేస్తే, కొందరికి శత్రువును చేసింది. ఆ శత్రుత్వమే చివరికి ఆయన ప్రాణాలను హరించింది. భారత్‌కు తిరిగివస్తూనే ఇక్కడ ఏం చేయాలో ఆయన ముందే వ్యూహం రచించుకున్నాడు. పేదలతోనూ, రైతులతోనూ కనెక్ట్ కావడం అందులో భాగం. విప్లవవాద విద్యార్థుల సమావేశంలోనూ, బెనారస్ హిందూవిశ్వవిద్యాలయ స్థాపన సమావేశంలోనూ రెచ్చగొట్టేలా చేసిన రెండు ప్రసంగాలతో గాంధీ యావద్భారత దృష్టినీ ఆకర్షించాడు. కృపలానీ, పటేల్, నెహ్రూ, ఆజాద్, రాజేంద్రప్రసాద్, రాజాజీ, వినోబాభావే తదితరులను ఒక్కొక్కరినే తన ప్రభావ పరిధిలోకి ఆకర్షించాడు. చంపారన్ ఉద్యమంతో మొదలు పెట్టి, ఖెడా రైతు పోరాటం, రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా దేశమంతటా నిర్వహించిన హర్తాళ్, సహాయ నిరాకరణ, నిర్మాణ కార్యక్రమం, ఉప్పుసత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం మీదుగా గాంధీ నాయకత్వంలో సాగిన పోరాటం మరో ఉజ్వలఘట్టం. కులమతభాషాప్రాంత భేదా లతో నిండిన భారత్ వైవిధ్యానికి అద్దంపట్టే నాయకుడిగానే కాదు; భిన్నభావజాలాల వారిని కలిపే కేంద్రబిందువుగా కూడా వ్యవహరించాడు. భావజాలపరంగా దగ్గరైన నెహ్రూ కన్నా గాం«దీకే సోషలి స్టులు సన్నిహితంగా ఉండేవారు. అలాగే హిందూవాదులైన స్వామి శ్రద్ధానంద, లాలా లజపతిరాయ్, మాలవీయ తదితరులు కూడా. రెండు పంథాలవారికి మాత్రమే గాంధీ దగ్గర కాలేకపోయాడు. ఒకరు మహమ్మదాలి జిన్నా. ఆయనకు దగ్గర కావడానికి గాంధీ చేసిన ఏ ప్రయత్నమూ ఫలించలేదు. రెండవ వ్యక్తి సావర్కర్, ఆయన భావజాల ప్రతినిధులు. ఎవరు బతికారు మూడు యాభైలు అంటారు. చనిపోయిన తర్వాత కూడా బతకడమే నిజమైన బతుకు అనుకుంటే ఇప్పటి దేశవాతావరణంలో గాంధీ ఇంకా బతకాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆయనలో బలహీనతలు, వైరుధ్యాలు లేవని కాదు. ఎవరూ పరిపూర్ణులు కారనీ, కాకపోతే పరిపూర్ణతకు గాంధీ కాస్త దగ్గ రగా వెళ్లాడన్న లజపతిరాయ్ వ్యాఖ్య కొంత అర్థవంతమనిపిస్తుంది. వ్యాసకర్త : కల్లూరి భాస్కరం, సీనియర్ పాత్రికేయులు -
గొప్ప చదువరి, అరుదైన మేధావి
దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉంటూ మనకు తెలిసినట్టు అనిపించే వ్యక్తుల్లో కూడా మనకు తెలియని అద్భుతపార్శ్వాలు ఉంటాయి. అవి ఒక్కోసారి హఠాత్తుగా వెల్లడై ఆశ్చర్యం కలిగిస్తాయి. జైపాల్ రెడ్డిగారు అలాంటి వ్యక్తి. విద్యార్థినాయకునిగా, శాసనసభ్యునిగా, ఎంపీగా, గొప్ప వక్తగా, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, కేంద్రమంత్రిగానే కాక; విలువలకు అంకితమైన వ్యక్తిగా ఆయన రాజకీయజీవితం తెరచిన పుస్తకమే. ఈ రాజకీయ జీవితమనే దండలో దారంలా ఆయనకు ఎంతో లోతు, వైశాల్యం కలిగిన మేధోజీవితం ఉంది. ఒక ఏడాది పరిచయంలో అది అనేక రూపాలలో నాకు తెలిసివచ్చింది. జైపాల్ రెడ్డిగారు ఆంగ్లంలో వెలువరించిన ‘టెన్ ఐడియాలజీస్–ది గ్రేట్ ఎసిమెట్రీ బిట్వీన్ ఏగ్రేరియనిజం అండ్ ఇండష్ట్రియలిజం’ అనే పుస్తకం గురించి ప్రముఖపాత్రికేయులు కె. రామచంద్రమూర్తిగారు చెప్పి, మీరు దానిని తెలుగులోకి అనువదించాలని సూచించినప్పుడు నేను వెంటనే అంగీకరించాను. ఆ సందర్భంలో ఆయనతో కలసి మొదటిసారి జైపాల్‌రెడ్డిగారిని కలిసినప్పుడు, కాంగ్రెస్‌లో ఉంటూ అప్పటికే అనేక ఉన్నతపదవులను నిర్వహించిన ఒక ప్రముఖనాయకుని గురించి జైపాల్ రెడ్డిగారు ప్రస్తావించి, ఆయన హిందుత్వవర్గాలకు దగ్గరవడంపై మీ అభిప్రాయమేమిటని అడిగారు. ఆయనే ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ, గాంధీ–నెహ్రూ ప్రభావాల మత్తులో రాజకీయాల్లోకి వచ్చి, వారు ప్రాతినిధ్యం వహించిన విలువలను ఉగ్గడిస్తూ దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో ఉన్నా, హిందూత్వాభిమానం ఆయనలో సుప్తావస్థలో ఉందనీ; బాహ్యవాతావరణం హిందూత్వకు అనుకూలంగా మారగానే అదిప్పుడు బయటపడుతోందని ఒక సామాజికశాస్త్రవేత్తలా విశ్లేషించారు. ఈ సందర్భంలోనే, అత్యున్నతపదవిని నిర్వహించిన ఇంకొక ప్రముఖ కాంగ్రెస్ నాయకునికి కూడా ఈ విశ్లేషణను ఆయన అన్వయించారు. దేశంలో ఇప్పుడు ప్రాబల్యం వహిస్తున్న రాజకీయశక్తుల గురించి మాట్లాడుతూ, విప్లవవ్యతిరేక మితవాదశక్తుల విజృంభణ ఈరోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నదేనంటూ, దీనినొక అవాంతరదశగా పేర్కొని చారిత్రిక ఆశావాదాన్ని ధ్వనింపజేశారు. అనువాదాన్ని పూర్తి చేసిన తర్వాత, ఆయనతో కలసి మూలంతో దానిని బేరీజు వేసుకునే కార్యక్రమం కొన్ని రోజులపాటు సాగింది. అప్పుడే ఆయన వ్యక్తిత్వ, మేధోజీవితాల తాలూకు బహు పార్శ్వాలు నాకు పరిచయమయ్యాయి. రకరకాల భావజాలాల మీదుగా సాగిన ప్రపంచ చరిత్రగమనంపై, సంస్కృతీసాహిత్యాలపై తన అవగాహనను, అనుభూతిని ఎదుటివారితో పంచుకోవాలన్న నిరంతరోత్సాహం ఆయనలో ఉరకలు వేసేది. దాంతో ఒక్కోరోజున మా అనువాదపరిశీలన రెండు, మూడు పేజీలను మించి సాగేది కాదు. ఇంకోవైపు, ఆయన రాజకీయమార్గదర్శనం కోసం రాష్ట్రానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలకు, ఆయన స్వస్థలానికి చెందిన చిన్నా, పెద్దా నాయకులు, అభిమానుల రాకతో అంతరాయం కలుగుతూ ఉండేది. ఆవిధంగా ఆయన రాజకీయ, మేధోజీవితపార్శ్వాలను రెంటినీ ఒకేసారి, ఒకేచోట చూడగల అవకాశం ఏర్పడేది. గాంధీ, బుద్ధుడు, ఫ్రాన్సిస్ బేకన్, జాన్ మేనార్డ్ కీన్స్, డేవిడ్ రికార్డో వంటి పేర్లు ఒకపక్కన; స్వగ్రామంలో సర్పంచ్ ఎన్నికతో సహా పలు అంశాలకు సంబంధించిన మాటలు ఇంకోపక్కన దొర్లుతూ ఒక విచిత్రమైన వాతావరణాన్ని కల్పించేవి. మరోవైపు, ఎన్ని రోజులు తీసుకుంటున్నాసరే, ఒక్క మాటను కూడా విడిచిపెట్టకుండా అనువాదాన్ని క్షుణ్ణంగా పరిశీలించడంలో ఒక పండితునిలో మాత్రమే ఉండే ఓపిక, శ్రద్ధ, దీక్ష ఆయనలో ఉండేవి. అవసరమైనప్పుడల్లా తన ముందున్న ఆంగ్లనిఘంటువులను, విజ్ఞానసర్వస్వాలను శోధిస్తూ నిర్దుష్టతకు ప్రాధాన్యమిచ్చేవారు. కొన్ని పదప్రయోగాలను, వాక్యాలను స్వయంగా సవరించుకుంటూ, కొన్ని చోట్ల కత్తిరిస్తూ మూలానికి మెరుగులు దిద్దే ప్రయత్నమూ చేశారు. జైపాల్ రెడ్డిగారిలో ప్రత్యేకించి ఆకట్టుకునేది, ఆయన మౌలిక ఆలోచనా సరళి. ఆయన ప్రధానంగా జ్ఞానవాది. భాషాసాహిత్యాలలో పాండిత్యం గొప్పదే కానీ, జ్ఞానానికి దోహదం చేయడం అంతకన్నా గొప్పదనేవారు. ఈ సందర్భంలోనే భాషా,సాహిత్యవేత్తగా ప్రసిద్ధికెక్కిన ఒక ప్రముఖకాంగ్రెస్ నాయకుని గురించి ప్రస్తావిస్తూ, ఆయన ఆ రెండింటిలోనూ కూరుకు పోకుండా ఉంటే, జ్ఞానమార్గంలో ముందుకు పోగలిగిన సమర్థుడేననేవారు. అదే సమయంలో కదిలించే ఒక కవితావాక్యానికి, లేదా కథనానికి కంట తడిపెట్టే ఆర్ద్రత ఆయనలో ఉండేది. మౌలిక చింతనతోపాటు, ఆయనలోని మరో ఆకర్షణ, చారిత్రికదృక్కోణం. ఆయన పుస్తకమే ఈ రెండింటికీ నిలువెత్తు ఉదాహరణ. ఉదారవాదం, లౌకికవాదం, పెట్టుబడిదారీ వాదం, సామ్యవాదంతో సహా నేటి భిన్న భిన్న భావజాలాల వేళ్ళు–సాంస్కృతిక పునరుజ్జీవనం, మానవవాదం, సంస్కరణవాదం, శాస్త్రవిజ్ఞానవిప్లవమనే నాలుగు ఉద్యమాలలోనూ; ఫ్రెంచి, పారిశ్రామిక విప్లవాలలోనూ ఎలా ఉన్నాయో అందులో ఆయన చర్చిస్తారు. మళ్ళీ నేటి సమస్యలు, సంక్షోభాల మూలాలను కూడా వాటిలోనే నిరూపిస్తూ, పరిష్కారమార్గాన్ని సూచిస్తారు. వివిధ భావజాలాల మధ్య నేడున్న ఘర్షణ పరిస్థితిని అధిగమించవలసిన అవసరం ఉందనీ; ప్రస్తుత సంక్షోభాలను సక్రమంగా అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలంటే చారిత్రికదృక్కోణాన్ని పెంపొందించుకోవాలనీ ఆయన అంటారు. మన జీవనవిధానంపై సాంకేతిక అభివృద్ధి ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నా; దానికి తగినట్టే ఆలోచనాసరళులలో వచ్చిన మార్పుల ప్రభావం మాత్రం కనిపించడం లేదంటారు. ఉదారవాదం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం వంటి భావనలను ఆధునిక సందర్భంనుంచి తప్పించి పురాతనకాలంనుంచీ ఉన్నవిగా భావించడంలోని పొరపాటును ఎత్తిచూపుతారు. అలాగే, చారిత్రిక పాశ్చాత్యానికీ, ఆధునిక పాశ్చాత్యానికీ తేడా గమనించకపోవడం కూడా మనలోని అనేక అయోమయాలకు కారణమంటారు. వలసదేశాలకు విముక్తి కలిగించినమేరకు జాతీయవాదం ఆహ్వానించదగినదే కానీ; భాష, జాతి, మతం వంటివి దానికి ఆధారం కాకూడదంటారు. పెట్టుబడిదారీ విధానం నుంచి సంక్షేమరాజ్యం ఎలా అవతరించిందో, కమ్యూనిజానికి సోషలిజానికి ఉన్న తేడా ఎలాంటిదో ఆయన వివరించిన తీరు ఆసక్తికరమే కాక; ఎంతో అవగాహనాకరంగా ఉంటుంది. నేటి అనేక సవాళ్ళకు మూలాలు, మన వ్యావసాయిక గతంలో ఉన్నాయనీ, పారిశ్రామికవిప్లవం ఆవిష్కరించిన సాంకేతిక అద్భుతాలతో, వ్యావసాయికదశకు చెందిన కరడుగట్టిన మన మనస్తత్వం తులతూగలేకపోవడమే అసలు సమస్య అనీ ఆయన చేసిన నిర్ధారణ చారిత్రికకోణం నుంచి మరింత ఆసక్తినీ, ఆలోచననూ కలిగిస్తుంది. గాంధీ–నెహ్రూ–అంబేడ్కర్ల భావధార సన్నగిల్లుతున్నదనీ, భావజాలాలకు ప్రాధాన్యం అడుగంటిందనీ భావించే కాలంలో వెలువడడం ఆయన పుస్తకానికి విశేష ప్రాధాన్యాన్ని కల్పిస్తూనే, ఒక శకం అంతరించిందన్న స్ఫురణ కలిగిస్తుంది. రచయితలే కానీ, రాజకీయనాయకులే కానీ తమ భావజాల పాక్షికతను ప్రకటించుకుని తీరాలంటూ తనను ప్రగతిశీల ఉదారవాదిగా, లేదా సామాజిక ప్రజాస్వామ్యవాదిగా చెప్పుకున్న జైపాల్ రెడ్డి అంతర్జాతీయవాదిగానూ తనను ఎలుగెత్తి చాటుకుంటారు. మతతత్వరాజకీయాలతో ఎప్పటికీ రాజీపడని ఒక నిబద్ధుడు ఆయనలో చివరివరకూ ఉన్నాడు. తన పుస్తకం తెలుగు అనువాదం అచ్చుప్రతిని చూడకుండానే ఆయన కన్ను మూయడం కుటుంబసభ్యులకూ, అనువాదకునిగా నాకూ కూడా తీరని వెలితి, తీవ్ర బాధాకరం. కల్లూరి భాస్కరం వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
విగ్రహాలు కాదు, విలువల కూల్చివేత
లెనిన్ విగ్రహాలను కూల్చినవారు, పెరియార్ విగ్రహాన్ని కూడా కూలగొట్టాలని చెప్పినవారు తాము ఆదర్శ పురుషుడిగా చెప్పే రాముణ్ని కానీ, ధర్మరాజును కానీ అనుసరించలేదు. ‘విజయాంతాని వైరాణి’ అనుకోలేదు. అల్పబుద్ధిని చాటుకున్న భీముణ్ని ఒరవడిగా తీసుకున్నారు. త్రిపురలో లెనిన్ విగ్రహాల కూల్చివేత దృశ్యాలను చూసినప్పుడు ఇద్దరు ఇతిహాస పాత్రలు మనసులో మెదిలారు. ఒకరు రాముడు, ఇంకొకరు ధర్మరాజు. రావణసంహారం జరిగిన తర్వాత, అన్న మరణానికి విభీషణుడు శోకిస్తున్నప్పుడు అతణ్ని ఓదార్చిన రాముడు, మృతుడైన రావణుని పట్ల తన వైఖరిని వివరిస్తూ, ‘‘విభీషణా! వ్యక్తులు జీవించి ఉన్నంతకాలమే వైరాలు ఉండాలి. ఆ తర్వాత వాటిని విడిచిపెట్టాలి. ఇప్పుడు మన కార్యం నెరవేరింది కనుక ఇతనికి అంత్యక్రియలు నిర్వహించు. ఇతడు నీకెంత గౌరవనీయుడో.. ఇప్పుడు నాకూ అంతే గౌరవనీయుడు’’ అంటాడు. ఈ సందర్భంలో రాముడు అన్న ‘‘మరణాంతాని వైరాణి’’ అనే మాట ఒక గొప్ప సూక్తిగా జాతి నాలుకలపై నిలిచిపోయింది. ధర్మరాజు విషయానికి వస్తే, తన గదాఘాతానికి తొడలు విరిగి దుర్యోధనుడు పడిపోయిన తర్వాత భీముడు అతణ్ని దూషిస్తూ ఎడమ కాలితో అతని శిరస్సును తంతాడు. ఆ చర్యను ధర్మరాజు, అర్జునుడు ఏవగించుకుంటూ మొహం పక్కకు తిప్పుకుంటారు. భీముడు రెండోసారి ఆ పని చేసినప్పుడు ధర్మరాజు ఊరుకోలేకపోతాడు. ‘‘ఎందుకలా తంతున్నావు? ఈ అధర్మం నీకు రోత పుట్టించడం లేదా? ఈ రాజరాజు తమ్ముళ్ళు, బంధువులు మరణించిన తర్వాత కూడా యుద్ధం చేసి పడిపోయిన గౌరవాన్ని పొందుతున్నప్పుడు నువ్వు చేసిన ఈ హీనమైన పనిని జనం మెచ్చుతారా?’’ అని తీవ్రంగా మందలిస్తాడు. విజయం కలిగించిన హర్షావేశాలతో ఉచితానుచితాలు పట్టించుకోని అల్పబుద్ధిగా ఈ ఘట్టంలో కవి భీముణ్ని వర్ణిస్తాడు. లెనిన్ విగ్రహాలను కూల్చినవారు, పెరియార్ విగ్రహాన్ని కూడా కూలగొట్టాలని చెప్పినవారు తాము ఆదర్శ పురుషుడిగా చెప్పే రాముణ్ని కానీ, ధర్మరాజును కానీ అనుసరించలేదు. ‘విజయాంతాని వైరాణి’ అనుకోలేదు. అల్పబుద్ధిని చాటుకున్న భీముణ్ని ఒరవడిగా తీసుకున్నారు. అఫ్ఘానిస్తాన్‌లోని బామియాన్‌లో బుద్ధ విగ్రహాలను నేలమట్టం చేసిన తాలిబన్లను ఆదర్శం చేసుకున్నారు. ఈ విగ్రహవిధ్వంసం ఇంతటితో ఆగదనీ, అది తమ నేతలకు కూడా వ్యాపిస్తుందనే స్పృహ లోపించింది కనుక దీని వెనుక అల్పబుద్ధే కాక మందబుద్ధి కూడా ఉంది. పశ్చిమ బెంగాల్లో శ్యామాప్రసాద్ ముఖర్జీ విగ్రహంపట్ల అపచారం జరిగింది. పెరియార్, అంబేడ్కర్, మహాత్మా గాంధీల విగ్రహాలకు మసిపూశారు. ఇది ఇటీవలి కాలంలో ఎరగని ధోరణి. మూడు దశాబ్దాలకు పైగా వామపక్షాలకు త్రిపురను మించి పెద్ద కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్‌ను చేజిక్కించున్న తర్వాత కూడా మమతాబెనర్జీ ఇలాంటి దురాగతానికి పాల్పడలేదు. అయినాసరే త్రిపురలో తమది గొప్ప భావజాల విజయంగా మోదీ చెప్పుకోవడం ఒక విడ్డూరమైతే, భిన్న భావజాలప్రతీకైన లెనిన్ విగ్రహాన్ని అనుయాయులు భౌతికంగా కూల్చివేయడం ఇంకొక వైపరీత్యం. లెనిన్ విదేశీయుడు కనుక అతని విగ్రహాన్ని కూల్చినా తప్పులేదని సమర్థించుకున్నారు కానీ, వాస్తవానికి తాము గురిపెడుతున్నది లెనిన్ భావజాలాన్ని నమ్మే స్వదేశీయులపైనేనన్న సంగతిని గమనించుకోలేదు. భావజాలం వ్యక్తుల ఆలోచనల్లో ఉంటుంది తప్ప విగ్రహాలలో ఉండదన్న గ్రహింపు లోపించింది. తన సమకాలీన భారతదేశ పరిణామాలపై లెనిన్ ఎలాంటి సానుకూల వైఖరి తీసుకున్నాడో ఆయనకూ, ఎం. ఎన్. రాయ్‌కి మధ్య జరిగిన చర్చల ద్వారా తెలుస్తుంది. గాంధీ నాయకత్వంలో స్వాతంత్య్ర పోరాటం సాగిస్తున్న జాతీయవాద శక్తులను తిరోగమనవాదులుగా పేర్కొంటూ, వారికి సైతం వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాన్ని నిర్మించాలని ఎం. ఎన్. రాయ్ వాదిస్తే,, లెనిన్ దానిని ఖండిస్తూ కమ్యూనిస్టులు గాంధీ సహా జాతీయవాద శక్తులను బలపరచితీరాలని స్పష్టం చేశాడు. విదేశీయుడన్న కారణంతో లెనిన్ విగ్రహాన్ని కుప్పకూల్చడంలోని సంకుచితత్వం, చారిత్రిక అజ్ఞానం మాటలకు అందనిది. లెనిన్ విగ్రహాన్ని కూల్చివేయడమంటే, భారత్‌తో ముడిపడిన ఆయన తాలూకు చారి త్రిక ఆనవాళ్లను చెరిపివేసి చరిత్రకు ద్రోహం చేయబోవడమే. ద్రవిడ ఉద్యమ నిర్మాత, సంఘసంస్కర్త పెరియార్ రామస్వామి నాయకర్ విగ్రహాన్ని కూడా కూల్చివేయాలని తమిళనాడుకు చెందిన బీజేపీ నేత ఒకరు పిలుపు ఇవ్వడం, విగ్రహానికి మసిపూయడం వెనుక ఉన్నదీ; భిన్న ఆలోచనా పంథాలను తుడిచిపెట్టి, వ్యక్తుల మెదళ్లు వంచి దేశం ఆ చివరి నుంచి ఈ చివరివరకూ ఏకశిలా సదృశమైన భావజాలాన్ని రుద్దే వ్యూహమే. ఈ సందర్భంలో కంచిలోని శంకరాచార్యపీఠాన్ని, చిరకాలం పీఠాధిపత్యం వహించిన పరమాచార్యను గుర్తు చేసుకోవడం అవసరం. కంచి మఠానికి ఎదురుగా గోడలపై పెరియార్ నాస్తికప్రబోధాలు కనిపిస్తాయి. మఠానికి దగ్గరలోనే ఒక మసీదు కూడా ఉంది. శతాబ్దకాలానికి పైనుంచీ ఈ మూడింటి సహజీవనం అక్కడ కొనసాగుతూవచ్చింది. మఠం పక్కనే మసీదు ఉండడం పరమాచార్యకు అభ్యంతరం కాకపోగా, తెల్లవారుజామున అక్కడ జరిగే నమాజుతోనే తను మేలుకునేవాడినని ఆయన చెప్పుకున్నారు. భిన్న విశ్వాసాల శాంతియుత సహజీవనానికి అతి గొప్ప ప్రతీ కలలో ఇదొకటి. ఈ సహజీవన వైవిధ్యాన్ని, చెరిపివేసి ఒకే మూసభావజాలాన్ని, మూర్తులను, చరిత్రలను ఉత్తర, దక్షిణ తేడాలు లేకుండా యావద్భారతవ్యాప్తం చేసే ఎత్తుగడలో భాగంగానే లెనిన్ విగ్రహ ధ్వంసాన్ని, పెరియార్ విగ్రహంపై దాడిని చూడవలసి ఉంటుంది. ఈ దుశ్చర్యలను సమర్థించుకునే విఫలయత్నంలో బీజేపీ శ్రేణులూ, పరివార్ సంస్థల ప్రతినిధులూ చేసిన వితండవాదాలు, దొర్లించిన వికృత వ్యాఖ్యలు అంతే విస్తుగొలిపాయి. ‘ఒక ప్రభుత్వం చేసిన దానిని ఇంకో ప్రభుత్వం రద్దు చేస్తుం’దని అంటూ త్రిపుర గవర్నర్ బాహాటంగా సమర్థించారు. మనుషులపై దాడి చేసినా, చంపినా హింస అవుతుంది తప్ప విగ్రహాలపై దాడి హింస కాబోదని ఆయన నిర్వచనం. ‘లెనిన్ విగ్రహాలను కూల్చింది రష్యాలో కాదు, త్రిపురలో! మార్పు రావలసిందే’నని మరో నేత వ్యాఖ్య. ఎప్పటిలానే ప్రధాని ఆలస్యంగా గొంతు విప్పి విగ్రహాల కూల్చివేతను ఖండించినా ఈ సమర్థింపు ప్రహసనం సాగుతూనే ఉంది. అధినేత ఖండిస్తారు. అనుయాయులు తాము చేసేది చేస్తూనే ఉంటారు. అంతిమంగా కుప్పకూలుతున్నవి ఏవో విగ్రహాలో మరొకటో కావు... వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ దేశ సంస్కృతీ, సభ్యతా, సంప్రదాయాలు. మనం ఎంతో అపురూపంగా పెంచి పోషించుకోవలసిన ప్రజాస్వామిక విలువలు. భాస్కరం కల్లూరి వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్ : kalluribhaskaram9@gmail.com -
ఉక్కు మనిషి కాదు.. మైనపు బొమ్మ
సందర్భం గమనించారా, ప్రధాని నరేం ద్రమోదిలో ఏదో మార్పు కని పిస్తోంది. కొన్ని ఉదాహర ణలు. ఇంతకుముందు ఆయ న విదేశీ గడ్డమీద నిలబడి ప్రతిపక్షాల మీద పదునైన వ్యంగ్యోక్తులు సంధించేవారు. ఇది మనకు కొత్త అనుభవం కనుక, సహజంగానే ఆక్షేప ణలు వెల్లువెత్తాయి. అయినా ఆయన పట్టించుకోలేదు. కానీ, తన తాజా విదేశీ పర్యటనల్లో ఆయన ఇలాంటి విమర్శలు చేయకుండా జాగ్రత్త పడ్డారు. రెండో ఉదాహరణ... పార్లమెంటరీ వ్యవహారాల్లో ప్రతిష్టంభన దృష్ట్యా మోదీ చొరవ తీసుకుని ప్రతిపక్ష నేతలతో ఎందుకు మాట్లాడరన్న విమర్శ చాలా మాసాలుగా ఉన్నప్పటికీ, మోదీ అందుకు సిద్ధపడలేదు. కానీ ఇప్పు డాయన జీఎస్టీ (వస్తు సేవల పన్ను) బిల్లుపై మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీలతో మాట్లాడారు! మూడో ఉదాహరణ మరింత ఆసక్తికరం. గుజరాత్ సీఎంగా ఉన్న పన్నెండేళ్లలోనూ, ప్రధానిగా ఉన్న గత 18 మాసాల్లోనూ మోదీ మీడియాతో దూరం పాటిస్తూ వచ్చారు. ప్రధాని విదేశీ పర్యటనల్లో మీడియా కూడా భాగమయ్యే ఆనవాయితీని మోదీ పాటించక పోవ డమూ, మీడియాకు సమాచారం అందించకుండా ఆయా మంత్రిత్వ శాఖలపై అప్రకటిత నిషేధాన్ని విధిం చారన్న ఆరోపణా మొదట్లోనే చర్చకు వచ్చాయి. అలాం టింది.. ఆయన ఇటీవల మొదటిసారిగా జాతీయ మీడి యాతో సమావేశమై, ఫొటోలు దిగడం ఆశ్చర్యాన్నీ, ఆసక్తినీ కూడా కలిగించింది. ఈ ఉదాహరణలు కొంతవరకూ మోదీని మారిన మనిషిగా చూపిస్త్తున్నాయి. విదేశాలలో ఒక పార్టీ ప్రతి నిధిగా కాక దేశ ప్రతినిధిగా ప్రధాని పాటించవలసిన మర్యాదలను గుర్తించడం; అహం విడిచి ప్రతిపక్ష నేత లతో, మీడియాతో సమావేశం కావడం నిస్సందేహంగా సంతోషించవలసినవే. అయితే, ఇంత వైవిధ్యవంతమైన దేశానికి ప్రధానిగా ఉన్న వ్యక్తి, కేవలం ఒక్క రాష్ర్టంలోని ఎన్నికల ఫలితాలే గీటురాయిగా తన నడకను మార్చు కున్నట్టు కనిపించడం ఎంతైనా నిరాశ కలిగిస్త్తుంది. తను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కానీ, ప్రధానిగా ఉన్న ఈ పదహారు మాసాల్లో కానీ తన ప్రభుత్వంపై వచ్చిన విమర్శలు ఆయనలో మార్పు తీసుకురాలేదు. మతతత్వ పూరితమైన అసహనం పెద్ద ఎత్తున పడగవిప్పి భిన్న భావజాలం కలిగిన వ్యక్తులను కాటేసి చంపుతున్నా ఆయనలో మార్పు కనిపించలేదు. కవులు, రచయితలు, కళాకారులు, చరిత్రకారులు సహా ఎందరో ఈ అసహ నాన్ని ఎత్తి చూపుతూ అవార్డు వాపసీ వంటి తీవ్ర చర్యకు పూనుకున్నా ఆయనలో మార్పు రాలేదు. వారి నిరసనను కృత్రిమ నిర్మాణంగా తీసిపారేస్తూ పార్టీ శ్రేణులు ఈ దేశపు సామూహిక అంతశ్చేతనను మొరటు మాటలతో కుళ్లబొడుస్త్తున్నా ఆయన మాట్లాడలేదు. అలాంటిది, వక్రించిన ఒకే ఒక్క ఎన్నికల ఫలితం ఆయ నలో కలవరపాటు కలిగించి మార్పు తీసుకురావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?! ఇన్నేళ్లుగా అభిమానులకు ఉక్కుమనిషిగా, ఇతరు లకు రాతిబొమ్మగా కనిపించిన నరేంద్రమోదీ గత 18 మాసాల ప్రధాని హోదాలో ఒక మైనపు బొమ్మలా కనిపి స్తున్నారు. మామూలుగా అయితే విమర్శల పిడుగులు పడినా ఆయన చలించరు. కానీ రాజకీయంగా పరిస్థితి తమకు ప్రతికూలంగా ఉందని అనిపించినప్పుడు కాస్త లొంగుబాటు ప్రదర్శిస్తుంటారు. ఉదాహరణకు, దాద్రీ హత్య మీద ప్రధాని నోరు విప్పరేమని ప్రతిపక్షాలూ, మీడియా రోజుల తరబడి నిలదీస్తున్నా ఆయన మౌనం పాటించారు. కానీ 15 రోజుల తర్వాత, బిహార్‌లో ఒక ఎన్నికల ర్యాలీలో పరోక్షంగా దానిని ప్రస్తావించి ఊరు కున్నారు. తన మౌనం ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేస్తుందన్న భయమే అందుకు కారణం. ఇక్కడ కుంగదీసే విషాదం ఏమిటంటే; ఈ దేశ ప్రధానికి ఎన్నికల విజయాలు తప్ప మరే విలువలూ పట్టవని రోజురోజుకూ రుజువు కావడం. ఈ దేశ మౌలిక స్వభావమూ, తాత్వికతా ఎలాంటివో ప్రధాని అయ్యే దాకా ఆయనకు తెలియకపోవడం. గుజరాత్లో తన ఏకచ్ఛత్రాధిపత్యంలో వైవిధ్యవంతమైన ఈ దేశపు రాజ కీయ వ్యాకరణాన్ని నేర్చుకోవలసిన అవసరం ఆయనకు రాలేదు. ఇప్పుడిప్పుడే ఆ అవసరాన్ని గుర్తిస్తున్న అప్రెంటిస్ ప్రధానిగానే ఆయన రూపుగడుతున్నారు. ఇలా ఈ గుజరాత్ ఉక్కు బొమ్మ కాస్తా జాతీయ వేదిక మీదికి వచ్చేసరికి, తప్పనిసరి ఒత్తిడులకు తలవంచే మైనపు బొమ్మ కావడం ఏం చెబుతుంది? అయితే, మోదీ వ్యవహారశైలికి సంబంధించిన వేళ్లు ఆయనను తీర్చిదిద్దిన భావజాలంలో బలంగా నాటుకుని ఉన్నాయి కనుక, ఆయనలో ఇప్పుడు కనిపిస్తున్న మార్పు కేవలం పైపూత కావచ్చు. విశేషమేమిటంటే, ఆయన ఆ పైపూతను ఆశ్రయిం చడంలోనే భారతదేశం మొత్తం గర్వించవలసిన లోతైన అంతస్సత్యం ఉంది. నాకు అరవై మాసాలు అధికారమి వ్వండి, దేశం రూపురేఖలే మార్చేస్తానని మోదీ ఎన్నికల ముందు చెప్పుకున్నారు. కానీ, దేశం తన స్వాభావిక మైన ఉనికిని ఉద్యమస్థాయిలో చాటుకుంటూ, మోదీని మార్చడానికి తనకు 18 మాసాలే చాలని నిరూపించు కుంది. ఆవిధంగా మోదీ పెనుగులాట రాజకీయ ప్రత్యర్థులతో కాదు; భారతదేశం అనే ఒక మౌలిక వాస్తవంతో! 2014 ఎన్నికల్లో మోదీ అద్భుత విజయం సాధించిన మాట నిజమే. కానీ ఇప్పుడు భారతదేశం ప్రతిరోజు, ప్రతి క్షణం మోదీ అనే ఉక్కు బొమ్మను మైనపు ముద్దగా మార్చుతూ తన అఖండ విజయాన్ని అప్రతిహతంగా స్థాపించుకుంటోంది! - కల్లూరి భాస్కరం వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు. 9703445985