దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉంటూ మనకు తెలిసినట్టు అనిపించే వ్యక్తుల్లో కూడా మనకు తెలియని అద్భుతపార్శ్వాలు ఉంటాయి. అవి ఒక్కోసారి హఠాత్తుగా వెల్లడై ఆశ్చర్యం కలిగిస్తాయి. జైపాల్ రెడ్డిగారు అలాంటి వ్యక్తి. విద్యార్థినాయకునిగా, శాసనసభ్యునిగా, ఎంపీగా, గొప్ప వక్తగా, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, కేంద్రమంత్రిగానే కాక; విలువలకు అంకితమైన వ్యక్తిగా ఆయన రాజకీయజీవితం తెరచిన పుస్తకమే. ఈ రాజకీయ జీవితమనే దండలో దారంలా ఆయనకు ఎంతో లోతు, వైశాల్యం కలిగిన మేధోజీవితం ఉంది. ఒక ఏడాది పరిచయంలో అది అనేక రూపాలలో నాకు తెలిసివచ్చింది.
జైపాల్ రెడ్డిగారు ఆంగ్లంలో వెలువరించిన ‘టెన్ ఐడియాలజీస్–ది గ్రేట్ ఎసిమెట్రీ బిట్వీన్ ఏగ్రేరియనిజం అండ్ ఇండష్ట్రియలిజం’ అనే పుస్తకం గురించి ప్రముఖపాత్రికేయులు కె. రామచంద్రమూర్తిగారు చెప్పి, మీరు దానిని తెలుగులోకి అనువదించాలని సూచించినప్పుడు నేను వెంటనే అంగీకరించాను. ఆ సందర్భంలో ఆయనతో కలసి మొదటిసారి జైపాల్‌రెడ్డిగారిని కలిసినప్పుడు, కాంగ్రెస్‌లో ఉంటూ అప్పటికే అనేక ఉన్నతపదవులను నిర్వహించిన ఒక ప్రముఖనాయకుని గురించి జైపాల్ రెడ్డిగారు ప్రస్తావించి, ఆయన హిందుత్వవర్గాలకు దగ్గరవడంపై మీ అభిప్రాయమేమిటని అడిగారు. ఆయనే ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ, గాంధీ–నెహ్రూ ప్రభావాల మత్తులో రాజకీయాల్లోకి వచ్చి, వారు ప్రాతినిధ్యం వహించిన విలువలను ఉగ్గడిస్తూ దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో ఉన్నా, హిందూత్వాభిమానం ఆయనలో సుప్తావస్థలో ఉందనీ; బాహ్యవాతావరణం హిందూత్వకు అనుకూలంగా మారగానే అదిప్పుడు బయటపడుతోందని ఒక సామాజికశాస్త్రవేత్తలా విశ్లేషించారు. ఈ సందర్భంలోనే, అత్యున్నతపదవిని నిర్వహించిన ఇంకొక ప్రముఖ కాంగ్రెస్ నాయకునికి కూడా ఈ విశ్లేషణను ఆయన అన్వయించారు. దేశంలో ఇప్పుడు ప్రాబల్యం వహిస్తున్న రాజకీయశక్తుల గురించి మాట్లాడుతూ, విప్లవవ్యతిరేక మితవాదశక్తుల విజృంభణ ఈరోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నదేనంటూ, దీనినొక అవాంతరదశగా పేర్కొని చారిత్రిక ఆశావాదాన్ని ధ్వనింపజేశారు.
అనువాదాన్ని పూర్తి చేసిన తర్వాత, ఆయనతో కలసి మూలంతో దానిని బేరీజు వేసుకునే కార్యక్రమం కొన్ని రోజులపాటు సాగింది. అప్పుడే ఆయన వ్యక్తిత్వ, మేధోజీవితాల తాలూకు బహు పార్శ్వాలు నాకు పరిచయమయ్యాయి. రకరకాల భావజాలాల మీదుగా సాగిన ప్రపంచ చరిత్రగమనంపై, సంస్కృతీసాహిత్యాలపై తన అవగాహనను, అనుభూతిని ఎదుటివారితో పంచుకోవాలన్న నిరంతరోత్సాహం ఆయనలో ఉరకలు వేసేది. దాంతో ఒక్కోరోజున మా అనువాదపరిశీలన రెండు, మూడు పేజీలను మించి సాగేది కాదు. ఇంకోవైపు, ఆయన రాజకీయమార్గదర్శనం కోసం రాష్ట్రానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలకు, ఆయన స్వస్థలానికి చెందిన చిన్నా, పెద్దా నాయకులు, అభిమానుల రాకతో అంతరాయం కలుగుతూ ఉండేది. ఆవిధంగా ఆయన రాజకీయ, మేధోజీవితపార్శ్వాలను రెంటినీ ఒకేసారి, ఒకేచోట చూడగల అవకాశం ఏర్పడేది. గాంధీ, బుద్ధుడు, ఫ్రాన్సిస్ బేకన్, జాన్ మేనార్డ్ కీన్స్, డేవిడ్ రికార్డో వంటి పేర్లు ఒకపక్కన; స్వగ్రామంలో సర్పంచ్ ఎన్నికతో సహా పలు అంశాలకు సంబంధించిన మాటలు ఇంకోపక్కన దొర్లుతూ ఒక విచిత్రమైన వాతావరణాన్ని కల్పించేవి.
మరోవైపు, ఎన్ని రోజులు తీసుకుంటున్నాసరే, ఒక్క మాటను కూడా విడిచిపెట్టకుండా అనువాదాన్ని క్షుణ్ణంగా పరిశీలించడంలో ఒక పండితునిలో మాత్రమే ఉండే ఓపిక, శ్రద్ధ, దీక్ష ఆయనలో ఉండేవి. అవసరమైనప్పుడల్లా తన ముందున్న ఆంగ్లనిఘంటువులను, విజ్ఞానసర్వస్వాలను శోధిస్తూ నిర్దుష్టతకు ప్రాధాన్యమిచ్చేవారు. కొన్ని పదప్రయోగాలను, వాక్యాలను స్వయంగా సవరించుకుంటూ, కొన్ని చోట్ల కత్తిరిస్తూ మూలానికి మెరుగులు దిద్దే ప్రయత్నమూ చేశారు. జైపాల్ రెడ్డిగారిలో ప్రత్యేకించి ఆకట్టుకునేది, ఆయన మౌలిక ఆలోచనా సరళి. ఆయన ప్రధానంగా జ్ఞానవాది. భాషాసాహిత్యాలలో పాండిత్యం గొప్పదే కానీ, జ్ఞానానికి దోహదం చేయడం అంతకన్నా గొప్పదనేవారు. ఈ సందర్భంలోనే భాషా,సాహిత్యవేత్తగా ప్రసిద్ధికెక్కిన ఒక ప్రముఖకాంగ్రెస్ నాయకుని గురించి ప్రస్తావిస్తూ, ఆయన ఆ రెండింటిలోనూ కూరుకు పోకుండా ఉంటే, జ్ఞానమార్గంలో ముందుకు పోగలిగిన సమర్థుడేననేవారు. అదే సమయంలో కదిలించే ఒక కవితావాక్యానికి, లేదా కథనానికి కంట తడిపెట్టే ఆర్ద్రత ఆయనలో ఉండేది. మౌలిక చింతనతోపాటు, ఆయనలోని మరో ఆకర్షణ, చారిత్రికదృక్కోణం. ఆయన పుస్తకమే ఈ రెండింటికీ నిలువెత్తు ఉదాహరణ.
ఉదారవాదం, లౌకికవాదం, పెట్టుబడిదారీ వాదం, సామ్యవాదంతో సహా నేటి భిన్న భిన్న భావజాలాల వేళ్ళు–సాంస్కృతిక పునరుజ్జీవనం, మానవవాదం, సంస్కరణవాదం, శాస్త్రవిజ్ఞానవిప్లవమనే నాలుగు ఉద్యమాలలోనూ; ఫ్రెంచి, పారిశ్రామిక విప్లవాలలోనూ ఎలా ఉన్నాయో అందులో ఆయన చర్చిస్తారు. మళ్ళీ నేటి సమస్యలు, సంక్షోభాల మూలాలను కూడా వాటిలోనే నిరూపిస్తూ, పరిష్కారమార్గాన్ని సూచిస్తారు. వివిధ భావజాలాల మధ్య నేడున్న ఘర్షణ పరిస్థితిని అధిగమించవలసిన అవసరం ఉందనీ; ప్రస్తుత సంక్షోభాలను సక్రమంగా అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలంటే చారిత్రికదృక్కోణాన్ని పెంపొందించుకోవాలనీ ఆయన అంటారు. మన జీవనవిధానంపై సాంకేతిక అభివృద్ధి ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నా; దానికి తగినట్టే ఆలోచనాసరళులలో వచ్చిన మార్పుల ప్రభావం మాత్రం కనిపించడం లేదంటారు. ఉదారవాదం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం వంటి భావనలను ఆధునిక సందర్భంనుంచి తప్పించి పురాతనకాలంనుంచీ ఉన్నవిగా భావించడంలోని పొరపాటును ఎత్తిచూపుతారు.
అలాగే, చారిత్రిక పాశ్చాత్యానికీ, ఆధునిక పాశ్చాత్యానికీ తేడా గమనించకపోవడం కూడా మనలోని అనేక అయోమయాలకు కారణమంటారు. వలసదేశాలకు విముక్తి కలిగించినమేరకు జాతీయవాదం ఆహ్వానించదగినదే కానీ; భాష, జాతి, మతం వంటివి దానికి ఆధారం కాకూడదంటారు. పెట్టుబడిదారీ విధానం నుంచి సంక్షేమరాజ్యం ఎలా అవతరించిందో, కమ్యూనిజానికి సోషలిజానికి ఉన్న తేడా ఎలాంటిదో ఆయన వివరించిన తీరు ఆసక్తికరమే కాక; ఎంతో అవగాహనాకరంగా ఉంటుంది. నేటి అనేక సవాళ్ళకు మూలాలు, మన వ్యావసాయిక గతంలో ఉన్నాయనీ, పారిశ్రామికవిప్లవం ఆవిష్కరించిన సాంకేతిక అద్భుతాలతో, వ్యావసాయికదశకు చెందిన కరడుగట్టిన మన మనస్తత్వం తులతూగలేకపోవడమే అసలు సమస్య అనీ ఆయన చేసిన నిర్ధారణ చారిత్రికకోణం నుంచి మరింత ఆసక్తినీ, ఆలోచననూ కలిగిస్తుంది.
గాంధీ–నెహ్రూ–అంబేడ్కర్‌ల భావధార సన్నగిల్లుతున్నదనీ, భావజాలాలకు ప్రాధాన్యం అడుగంటిందనీ భావించే కాలంలో వెలువడడం ఆయన పుస్తకానికి విశేష ప్రాధాన్యాన్ని కల్పిస్తూనే, ఒక శకం అంతరించిందన్న స్ఫురణ కలిగిస్తుంది. రచయితలే కానీ, రాజకీయనాయకులే కానీ తమ భావజాల పాక్షికతను ప్రకటించుకుని తీరాలంటూ తనను ప్రగతిశీల ఉదారవాదిగా, లేదా సామాజిక ప్రజాస్వామ్యవాదిగా చెప్పుకున్న జైపాల్ రెడ్డి అంతర్జాతీయవాదిగానూ తనను ఎలుగెత్తి చాటుకుంటారు. మతతత్వరాజకీయాలతో ఎప్పటికీ రాజీపడని ఒక నిబద్ధుడు ఆయనలో చివరివరకూ ఉన్నాడు. తన పుస్తకం తెలుగు అనువాదం అచ్చుప్రతిని చూడకుండానే ఆయన కన్ను మూయడం కుటుంబసభ్యులకూ, అనువాదకునిగా నాకూ కూడా తీరని వెలితి, తీవ్ర బాధాకరం.
కల్లూరి భాస్కరం
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment