జి.ఎస్. వరదాచారి
వరదాచారిగారు తెలుగు పత్రికారంగానికీ, తెలుగు పత్రికారంగ చరిత్రకూ చేసిన ఉపకారం ఎనలేనిది. ఆయా రంగాలలో ఉత్తమస్థాయిని అందుకున్న ప్రతి ఒక్కరూ ఆత్మకథను రాసితీరాలని నా భావన. అవి కేవలం వారి సొంత కథలు కావు. ఆరేడు దశాబ్దాలకు విస్తరించిన ఆయా రంగాల తాలూకు చరిత్రను, మొత్తంగా దేశ చరిత్రను చెబుతాయి. అనేకమైన పనుల ఒత్తిడుల మధ్య ‘జ్ఞాపకాల వరద’ చదవడం ప్రారంభించి ఆ వరదలో ఎక్కడా ఆగకుండా మునకలేస్తూ, 272 పేజీల పుస్తకాన్ని ఒక్కరోజులోనే పూర్తి చేయగలిగాను.
వరదాచారి పండిత పత్రికా రచయిత, ఆపైన బహుముఖ కార్యదక్షులు, బహుళ వ్యాపకులు, తాను పనిచేస్తూనే, ఇతరులతో పని చేయిస్తూ, అందులోనే శిక్షణను మేళవిస్తూ, డెస్క్‌నే ఒక తరగతి గదిగా మలచుకుంటూ, ఒక నిష్కామబుద్ధితో మెరిక ల్లాంటి ఎందరో పత్రికారచయితలను తయారు చేసినవారు. ఈ దృష్ట్యా, పొత్తూరి వంటివారు ఆయనను ‘ప్రొఫెసర్’ అని పిల వడం ఎంతైనా అర్థవంతం. ఆ మాటను సార్థకం చేస్తూ, తెలుగు విశ్వ విద్యాలయంలో జర్నలిజం శాఖలో అధిపతిగానూ, అధ్యా పకులు గానూ రెండు దశాబ్దాలకు పైగా పనిచేశారు.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్, జర్నలిస్టుల సహకార గృహ నిర్మాణ సంఘం, ప్రెస్ క్లబ్, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్, ఇటీవలి కాలంలో వయోధిక పాత్రికేయ సంఘం మొదలైన సంస్థలతో క్రియాశీల సంబంధం లేకుండా, ఆయన పండిత పత్రికా రచయిత గానే ఉండిపోయి ఉంటే, ఈ రంగంలో తిరుమల రామచంద్ర వంటి పండిత ప్రకాండులలో ఒకరయ్యేవారని ఈ పుస్తకం చదివినప్పుడు నాకు అనిపించింది.
జర్నలిస్టులతోపాటు భవిష్య నిధి సభ్యత్వం కలిగిన కార్మికులందరికీ లాభం చేకూర్చిన పింఛను పథకం మొదట వారి మెదడులోనే అంకురించి మొక్క అయిం దంటే– ఆయన వ్యక్తిత్వ, వ్యాపకాలకు చెందిన మరో పార్శ్వం ఎంత విలువైనదో, ఎంత స్ఫూర్తిదాయ కమో తెలుస్తుంది.
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరుకు చెందిన ఒక వైష్ణవ కుటుంబానికి చెంది, దానిని అంటి పెట్టు కుని ఉండే సంప్ర దాయ గాఢతను, పరి భాషను, పాండిత్య స్పర్శను వరదాచారి బాల్యం నుంచే రంగ రించుకున్నారు. చిన్న ప్పుడు ఏర్పడిన కులమతవర్గాతీత స్నేహాలు ఆయనలో భావ వైశాల్యాన్ని, హృదయ వైశాల్యాన్ని పెంచి విస్తృత మానవ సంబంధాలవైపు నడిపించాయి.
తెలంగాణలోనూ, ఆంధ్రలోనూ ఉన్న వైష్ణవ కుటుంబాలు చాలావరకూ నేటి తమిళనాడు నుంచి వలస వచ్చాయన్న చారిత్రక సమాచారం మనం ఎరిగినదే. అలాంటి అనుభవాలు, మూలాలు ఆ తరహా కుటుంబాలలో ఒక విధమైన కార్యదక్షతను, క్రియా శీలాన్ని, ఎంతో ముందుచూపుతో ప్రణాళికాబద్ధంగా పిల్లలను పెంచి పెద్దజేసే లక్షణాన్ని అలవరచడం సహజమే.
తండ్రి కృష్ణమాచారిగారిలో ప్రస్ఫుటంగా కనిపించే ఈ లక్షణాలే మనకు తెలిసిన రూపంలోని వరదాచారిగారినే కాక, ఆయన సోదరులను కూడా ఉన్నతవిద్యాపరంగానూ, ఇతరత్రానూ ప్రయోజకులుగా తీర్చిదిద్దినట్టు ఈ పుస్తకం చదివితే అర్థమవుతుంది. ఈ పుస్తకం నాలో కలిగించిన గొప్ప తెలివిడి ఏమిటంటే – అప్పటికి విద్య, ఉద్యోగాలపరంగా ముందుందనుకునే ఆంధ్రప్రాంతపు కుటుం బాల కన్నా కూడా వరదాచారి కుటుంబం అన్నివిధాలా ముందడు గులో ఉందన్న సంగతి! ఆ విధంగా కుటుంబాన్ని తీర్చిదిద్దిన కృష్ణ మాచారిగారే ఈ ఆత్మకథలో నాకు అసలు హీరోగా కనిపిస్తారు.
వరదాచారిగారి ఆత్మకథ చదువుతుంటే, ఎంత నమ్మకం లేని వారికైనా ‘విధి’ని నమ్మక తప్పదేమోననిపిస్తుంది. మూడు, నాలుగు పత్రికలలో సంపాదకులయ్యే అవకాశం వచ్చినట్టే వచ్చి తప్పిపోవడానికి, అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ పత్రికారంగంలో ఉన్నతమైన ఎడిటర్ స్థానాన్ని ఆయన అందుకోలేకపోవడానికి కేవలం విధి తప్ప మరో కారణం లేదని అనిపిస్తుంది. మరోవైపు, ‘ఆంధ్రభూమి’ దినపత్రికకు గోరాశాస్త్రి ఎడిటర్ కావడానికి పూర్వ రంగంలో ప్రముఖపాత్ర నిర్వహించినదీ ఆయనే.
వరదాచారిగారి అమోఘ జ్ఞాపకశక్తికి అద్దంపట్టే ‘జ్ఞాపకాల వరద’ అనేక కోణాలలో విలువైనది. వారి స్వీయచరిత్రనే కాక, ఆరేడు దశాబ్దాలకు విస్తరించిన తెలుగు పత్రికారంగ చరిత్రను, అందులో భాగంగా దేశ, రాష్ట్ర రాజకీయ, సామాజిక, సాంస్కతిక చరిత్రనూ చెబుతుంది.
కల్లూరి భాస్కరం
(జి.ఎస్. వరదాచారి జీవన సాఫల్య అభినందన సభ, ‘పరిణత పాత్రికేయం’ ఆవిష్కరణ సందర్భంగా..)
Comments
Please login to add a commentAdd a comment