కల్లూరి భాస్కరం రచించిన ‘ఇవీ మన మూలాలు’ అనే పుస్తకం ఒక మల్టి– డిసిప్లినరీ అధ్యయనం. మానవుడికి సంబంధించిన ఒక సుదీర్ఘమైన కథని ఎంతో ఉత్కంఠభరితంగా చెప్తున్న రచన ఇది. ఇటువంటి కృషి ఒక్క మనిషి ఒంటి చేత్తో చెయ్యగలిగేది కాదు. ఏదైనా ఒక విశ్వ విద్యాలయమో లేదా ఒక శాస్త్రవేత్తల బృందమో మాత్రమే చెయ్యగల పని.
మానవ చరిత్ర దశాబ్దాల లెక్కకో, చివరికి శతాబ్దాల లెక్కకో కుదించగలిగేది కాదు. అది సహస్రాబ్దాల లెక్కలో అర్థం చేసుకో వలసింది. మనం ఈ రోజు అట్లాసులో చూస్తున్న ఈ ఖండాలు ఎల్లప్పుడూ ఇలానే లేవనీ, ఈ దేశాలూ, ఈ సరిహద్దులూ ఎప్పటి కప్పుడు మారుతూనే ఉన్నాయనీ, ఈ రోజు భారతదేశంతో సహా ఎన్నో జాతీయరాజ్యాలు భావిస్తున్నట్టుగా వాటి జాతి చరిత్ర అవి గీసుకున్న సరిహద్దులకే పరిమితం కాలేదనీ, నిజానికి మనం కట్టు కుంటున్న గోడలేవీ ఒకప్పుడిలా లేవనీ, ఇప్పుడు కూడా ఈ గోడలు ఇలానే శాశ్వతంగా నిలబడిపోయేవి కావనీ మనం గ్రహించవలసి ఉంటుంది.
మన్వంతరాల చరిత్రలో మానవుడు ఈ వసుధ మొత్తాన్ని ఏక కుటుంబంగా భావించాడనీ, ఎక్కడో సుదూర ప్రాంతానికి చెందిన మానవ సమూహాలు మరెక్కడో సుదూర ప్రాంతానికి పోయి అక్కడ నాగరికతలు నిర్మించాయనీ ఈ రోజు ఎన్నో ఆనవాళ్ళు లభిస్తున్నాయి. ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా తన సంస్కృతి, తన సాహిత్యం, తన సాంకేతికత పూర్తిగా తన ఘనత మాత్రమే అనుకోడానికి లేదనీ, మానవుడు ఏ దేశంలో ఉన్నా అతడు సాధించిన ప్రతి విజయంలోనూ ప్రపంచ మానవులందరి పాత్రా ఉందని మనం ఒప్పుకోవలసి ఉంటుంది.
ఇదే మాట మన జన్యు వారసత్వం గురించి కూడా చెప్పుకోక తప్పదు. ఇప్పుడు ఈ నేల మీద నడయాడుతున్న ప్రతి ఒక్క మానవుడూ, ఇంతదాకా ఈ పృథ్వి మీద సంచరించిన ప్రతి ఒక్క మానవుడికీ జన్యుపరంగా వారసుడేనన్నది ఒక వైజ్ఞానిక సత్యం.
ఇంత కొట్టొచ్చినట్టుగా మన ముందు బయటపడుతున్న మానవుడి గతాన్ని చూడటానికి ఇష్టపడకుండా, ఇంకా శుద్ధ జాతులూ, శుద్ధరక్తమూ, శుద్ధ సంస్కృతీ ఉంటాయనుకోవడం సాంస్కృతిక అంధ త్వం మాత్రమే!
ఇటువంటి గుడ్డితనం ఎవరో ఒక రిద్దరు వ్యక్తులకి ఉండటం వేరు, ఒక జాతి అత్యధికభాగం ఇటువంటి కథనాల్ని చెప్పుకుంటూ తనని తాను నమ్మించుకోడం వేరు. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. తాను బలపడుతున్నానుకుంటూ నిజా నికి ఒక జాతి దుర్బలమైపోతున్న ప్రక్రియ ఇది. ఈ నేపథ్యంలో భాస్కరం గారి పుస్తకాన్ని మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది.
జాతీయోద్యమ నాయకులు భారతదేశ చరిత్రలో ప్రతి ఒక్కరి పాత్రనీ గుర్తించారు. కానీ కొత్త జాతీయవాదులు అటు వంటి విశాల దృక్పథాన్ని స్వాగతించరు సరికదా, అటువంటి విస్తృత దృక్పథాన్ని సహించలేరు కూడా. తమ అసహనాన్ని ప్రక టించడానికి వారికున్న అనేక సాధనాల్లో కృత్రిమ కథనాల్ని ప్రచారం చేయడం కూడా ఒకటి. ముఖ్యంగా భారతదేశ చరిత్ర గురించి వాళ్ళు శాస్త్రీయ దృక్పథానికి బదులు పౌరాణిక దృక్ప థాన్ని ప్రచారం చేస్తారు. ప్రజల్ని ఉద్రిక్తుల్ని చేయడానికి వాస్తవం కన్నా కల్పనది దగ్గరి దారి అని వాళ్ళ నమ్మకం. సరిగ్గా ఈ వరదకు ఎదురీదుతూ భాస్కరం గారు ఈ పుస్తకం రాశారని చెప్పవచ్చు. ఇది సాహసమే కాని ఎంతో అవసరం. ఆయనిలా అంటున్నారు:
‘ఒక్కోసారి రాజకీయం తన హద్దును, తూకాన్ని దాటిపోయి సంస్కృతి, సాహిత్యం, శాస్త్రవిజ్ఞానం తదితర జ్ఞాన రంగాలను కూడా తన పరిధిలోకి తెచ్చేసుకుని, రాజకీయాన్నీ వాటినీ కలగా పులగం చేసి సర్వం తానే అవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. రాజకీయానికి సమాంతరంగా జ్ఞానరంగానికి ఉన్న ప్రాము ఖ్యాన్నీ, దాని స్వేచ్ఛా స్వాతంత్య్రాల్నీ గుర్తించి దాని ఉనికిని ఎప్పటికప్పుడు పటిష్ఠం చేసుకోవడమే రాజకీయ స్వైరవిహారానికి విరుగుడు.’ ఈ రచన సత్యాన్వేషణ దృష్టితో చేసిన కృషి.
ఇందుకు గాను భాస్కరంగారు ఆధునిక, సమకాలిక జన్యుశాస్త్ర పరిశోధనల్ని తన ముడిసరుకుగా తీసుకున్నారు. ఎందుకంటే ఆయనే ఒక చోట రాసినట్టుగా ‘జనశాస్త్రమంటే జన్యుశాస్త్రమే.’
ఒక ప్రాంతం నుంచి వలసపోయినవాళ్ళో లేదా అక్కడికి వలస వచ్చినవాళ్ళో మాత్రమే అక్కడి చరిత్రని నిర్మించారని భాస్కరం గారు ఈ రచనలో ఎక్కడా రాయలేదు. ఆయన చెప్తు న్నదల్లా ఏమిటంటే, ఏ దేశ చరిత్రనైనా కేవలం ఆ దేశీయులు మాత్రమే నిర్మించారనుకోకండి, అది బహుళ జాతుల సంస్కృతుల ఆదాన ప్రదానాలతో నిరంతరం సంభవిస్తూండే ఒక ప్రక్రియ అని మాత్రమే. అలాగే, శుద్ధమైన జాతి అంటూ ఏదీ లేదనీ, అలా ఉంటుందనుకుని తమ దేశం చుట్టూ సాంస్కృతి కంగా గోడలు కట్టుకోవడం మూర్ఖత్వం మాత్రమే కాదు, ప్రమా దకరమని కూడా ఆయన చెప్తున్నారు.
ముందే చెప్పినట్టుగా ఇదొక మల్టీ డిసిప్లినరీ అధ్యయనం. ఇందులో జన్యుశాస్త్ర పరిశీలనలతో పాటు, పురావస్తు, మానవ శాస్త్ర పరిశీలనలతో పాటు, తులనాత్మక భాషాశాస్త్రం, మైథాలజీ, వేద, పురాణ, ఇతిహాసాల పరిశీలనలతో పాటు, సంస్కృత, తెలుగు సాహిత్యాల నుంచి కూడా ప్రస్తావనలు ఉన్నాయి. ఈ ఒక్క గ్రంథం చదివితే ఎన్నో గ్రంథాలు చదివినట్టు! ఈ అధ్యయ నంలో భాస్కరంగారు ఎన్నో హైపోథీసిసులు మనముందుంచ డమేకాక, మన సంస్కృతి, చరిత్రలకు సంబంధించిన ఎన్నో చిక్కుముళ్ళు విడి పోవడానికి అవసరమైన తాళంచెవులు కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు.
ఒకటి, ఆయన స్వయంగా పండిత కుటుంబం నుంచి వచ్చిన వారు కావడంవల్లా, భారతీయ సంస్కృతికి మూలగ్రంథాలు అని చెప్పదగ్గవాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసినందువల్లా ఇది సాధ్యపడిందని చెప్పవచ్చు. రెండోది– ఏళ్ళ తరబడి ఆయన ఎంతో సమర్థవంతంగా నిర్వహించిన పాత్రికేయ వృత్తి ఆయనకు సమకాలిక ప్రపంచం గురించీ, భారతీయ సామాజిక పరివర్తన గురించీ ప్రత్యక్ష పరిజ్ఞానాన్ని అందించడం మరో కారణం.
(‘ఇవీ మన మూలాలు’కు రాసిన ముందుమాట నుంచి)
వాడ్రేవు చినవీరభద్రుడు
వ్యాసకర్త కవి, రచయిత
(ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ సోమాజిగూడ
ప్రెస్ క్లబ్‌లో ‘ఇవీ మన మూలాలు’ పుస్తక ఆవిష్కరణ)
మూలాల అన్వేషణలో వరదకు ఎదురీత
Published Sun, Jan 28 2024 4:58 AM | Last Updated on Sun, Jan 28 2024 4:58 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment