ఇండియన్  సైన్స్ కాంగ్రెస్‌ వర్ధిల్లాలి! | Sakshi Guest Column On Indian Science Congress | Sakshi
Sakshi News home page

ఇండియన్  సైన్స్ కాంగ్రెస్‌ వర్ధిల్లాలి!

Published Fri, Jan 19 2024 12:16 AM | Last Updated on Fri, Jan 19 2024 12:16 AM

Sakshi Guest Column On Indian Science Congress

ఏటా జనవరిలో జరగాల్సిన ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలు ఈసారి రద్దుకావడం అవాంఛనీయ పరిణామం. భారతీయ శాస్త్ర సమాజం ఒక పొందికతో పురోగమించేందుకు... నూటా పదేళ్లుగా సాగుతున్న ఈ సమావేశాలూ ఒక కారణమంటే అతిశయోక్తి కాదు. ఇండియన్  సైన్స్ కాంగ్రెస్‌ అనేది ఓ విభిన్న వేదిక. ప్రత్యేక అంశాలు ఇతివృత్తంగా ఏర్పాటు చేసే శాస్త్రీయ సెమినార్లలో ఆ యా రంగాల్లో నిష్ణాతులైన శాస్త్రవేత్తలు మాత్రమే పాల్గొంటారు. సైన్స్ కాంగ్రెస్‌లో మాత్రం అన్ని రంగాలకు సంబంధించిన చర్చోపచర్చలూ జరుగుతాయి. శాస్త్రవేత్తలతో పాటు సామాన్యులు, డిగ్రీ కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులు కూడా హాజరవుతారు. ఇవి వారికి ఎంతో స్ఫూర్తిదాయకం. అందుకే ఈ సమావేశాలు నిరాటంకంగా కొనసాగాలి.

భారతీయ శాస్త్ర పరిశోధన రంగానికి జనవరి నెల చాలా ముఖ్యమైంది. ఏటా ఈ నెల లోనే ‘ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌’ సమావేశాలు ఘనంగా జరుగు తాయి. భారత ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ వార్షిక ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది శాస్త్రవేత్తలు, విద్యార్థులు హాజరవుతారు. కానీ ఈ ఏడాది సైన్స్ కాంగ్రెస్‌కు ఆతిథ్యం ఇవ్వాల్సిన లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ చివరి నిమిషంలో ఊహించని సమస్యల కారణంగా తప్పుకొంది. సమావేశాలకు ఆర్థిక సాయం అందించే కేంద్ర ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గడంతో ఈ ఏడాది కార్య క్రమాలు అనివార్యంగా రద్దయ్యాయి.

కీలకమైన అంశాలపై మేధోమధనం జరిపేందుకు, ఆ విషయా లపై ప్రభుత్వాలకు సూచనలిచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌లో ఉంటాయి. ఇలాంటి సలహా, సూచనలు గతంలో విధాన రూపకల్పనకు ఉపయోగపడిన ఉదాహరణలు కోకొల్లలు.

కేంద్రంలో పర్యావరణ విభాగం (తరువాతి కాలంలో మంత్రిత్వ శాఖ స్థాయికి ఎదిగింది) ఏర్పాటుకూ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఓషన్‌ డెవలప్‌ మెంట్‌ (ప్రస్తుతం ఎర్త్‌ సైన్సెస్‌ మినిస్ట్రీ) ఏర్పాటుకూ సైన్స్ కాంగ్రెస్‌ ఇచ్చిన సలహాలే కారణం. వీటన్నింటికీ మించి ఇండియన్ సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేలా అత్యంత కీలకంగా వ్యవహరించింది.

నూరేళ్లకు పైగా అప్రతిహతంగా...
1914లో ఏర్పాటైంది మొదలు ఇండియన్  సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలు ఏటా అప్రతిహతంగా కొనసాగాయి. కోవిడ్‌ కాలం నాటి పరిస్థితులు ఒక్కటే మినహాయింపు. అప్పట్లో లక్నోలోని కానింగ్‌ కాలేజ్‌ అధ్యాపకులు పి.ఎస్‌. మెక్‌మోహన్ , మద్రాస్‌లోని ప్రెసిడెన్సీ కాలేజీ అధ్యాపకులు జేఎల్‌ సైమన్ సెన్  మానస పుత్రికగా ఇండియన్  సైన్స్‌ కాంగ్రెస్‌ అసోసియేషన్  ఆవిర్భవించింది. ‘బ్రిటిష్‌ అసోసియేషన్  ఫర్‌ ద అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌’ తరహాలో వారు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ప్యూర్, అప్లైడ్‌ సైన్స్‌ రంగాలపై అభినివేశం ఉన్న వారందరికీ ఒక వేదిక కల్పించడం దీని ప్రధానోద్దేశం.

సమాజానికీ, సైన్స్కూ మధ్య ఒక వారధిగానూ ఈ సంస్థ ఉపయోగపడుతుందని వారు భావించారు. గణిత, ఖగోళ, భౌతిక, రసాయన, భౌగోళిక, జీవ శాస్త్రాల్లో పరిశోధనలు చేస్తున్న వారందరికీ తొలి ఉమ్మడి వేదిక కూడా ఇదే. ఆయా శాస్త్ర రంగాలకు సంబంధించిన కొత్త ఆలోచనలు పంచుకునేందుకు సైన్స్‌ కాంగ్రెస్‌ ఎంతో ఉపయోగపడింది. దశాబ్దాల సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాల కారణంగా దేశంలో మరిన్ని శాస్త్రీయ సొసైటీలు, వృత్తినైపుణ్యమున్న సంస్థలు ఏర్పడ్డాయి. 

ఈ వేదిక ఈ కాలానికి సరిపోయేది కాదనీ, పాతకాలపు పద్ధతులనే కొనసాగిస్తోందనీ కొందరు అంటూంటారు. దేశంలో శాస్త్ర రంగాల అభివృద్ధితో పరుగులు పెడుతూనే, వేర్వేరు దశల్లో ఇండియన్  సైన్స్ కాంగ్రెస్‌ ఎలా ఎదిగిందో విస్మరించేవారే ఇలాంటి విమర్శలు చేయగలరు.

ప్రాక్‌ – పశ్చిమాల మేళవింపు...
ఇండియన్  సైన్స్ కాంగ్రెస్‌ అసోసియేషన్  ప్రస్థానంలో తొలిదశ 1914–47 మధ్యకాలమని చెప్పవచ్చు. ఈ సమయంలో భారతీయ, యూరోపియన్  శాస్త్రవేత్తల మధ్య సమాచార వినిమయం ఎక్కువగా ఉండేది. యూరోపియన్  శాస్త్రవేత్తలు అనేకులు భారతీయ పరిశోధన సంస్థల్లో పనిచేస్తూండేవారు. తమ ఆలోచనలు పంచుకునేందుకు వీరికి ఉన్న ఒకే ఒక్క వేదిక ఇండియన్  సైన్స్‌ కాంగ్రెస్సే.

దీనికి సమర్పించే అన్ని పరిశోధన వ్యాసాలనూ సమాకాలీన శాస్త్రవేత్తలు సమీక్షించేవారు. ఈ రకమైన సమీక్ష, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు అన్న భావన ఇండియన్  సైన్స్‌ కాంగ్రెస్‌ ద్వారానే ఏర్పడ్డాయి. భారత్‌లో సైంటిఫిక్‌ జర్నల్స్‌ ప్రచురణ కూడా సైన్స్ కాంగ్రెస్‌ పుణ్యమే. ప్రఖ్యాత శాస్త్రవేత్త మేఘనాథ్‌ సాహా ప్రచురించిన ‘సైన్స్ అండ్‌ కల్చర్‌’ జర్నల్‌ దీనికి ప్రబల ఉదాహరణ.

దేశంలో స్వాతంత్య్ర ఉద్యమం బాగా నడుస్తున్న 1930లలో జాతీయ నాయకత్వం దేశ భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో దేశాభివృద్ధిలో సైన్స్ను వినియోగించడంపై దీని వేదికగా అనేక కొత్త ఆలోచనలపై చర్చ జరిగింది. పారిశ్రామికీకరణ, సమాజం పట్ల సైన్స్‌ బాధ్యత వంటి ఆలోచనలు పురుడు పోసుకున్నది ఇక్కడే. 1937లో జరిగిన సమావేశాల్లోనే జవహర్‌లాల్‌ నెహ్రూ ‘‘ఈ కాలపు స్ఫూర్తి సైన్స్‌. ఆధునిక ప్రపంచాన్ని శాసిస్తున్నదీ ఇదే.

సైన్స్తో మిత్రత్వం నెరిపేవారిది, సమాజ పురోభివృద్ధికి దాని సాయం తీసుకునేవారిదే భవిష్యత్తు’’ అన్న వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947లోనూ ఈ సమావేశాలకు నెహ్రూ అధ్యక్షుడిగా ఉన్నారు. 1964లో ఆయన మరణించేంత వరకూ కొనసాగారు. ఆ తరువాతి కాలంలో ఈ సమావేశాల్లో దేశ ప్రధాని శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించే సంప్రదాయం మొదలైంది. చాలా సందర్భాల్లో దేశ ప్రధానులు ఈ వేదికపై నుంచి కొన్ని కీలకమైన విధాన నిర్ణయాలను కూడా ప్రకటించేవారు. 

స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశంలో శాస్త్ర పరిశోధనల పునాదులకు శ్రీకారం చుట్టారు. జాతీయ పరిశోధన సంస్థలు, రీసెర్చ్‌ కౌన్సిళ్లు పనిచేయడం మొదలైంది. ఇండియన్  సైన్స్ కాంగ్రెస్‌ కూడా ఒక కొత్త దశలోకి అడుగుపెట్టింది. శాస్త్ర పరిశోధనలపై చర్చలకు వేదికగా నిలుస్తూనే ప్రణాళిక, ఆహార సంక్షోభం, ఆరోగ్యాభివృద్ధి వంటి విస్తృత స్థాయి విధానపరమైన అంశాలపై కూడా చర్చలు మొదలయ్యాయి.

యూనివర్సిటీ వ్యవస్థలోని పరిశోధకులతో పాటు జాతీయ పరిశోధన సంస్థలు, శాస్త్ర విభాగాలకు చెందినవారు ఇండి యన్  సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రక్రియలో ఎక్కువగా పాలుపంచుకోవడం మొదలైంది. ఈ క్రమంలోనే కొన్ని దశాబ్దాల తరువాత ఆయా రంగా లకు ప్రత్యేకమైన సంస్థలు ఏర్పడటంతో ఇండియన్  సైన్స్ కాంగ్రెస్‌ తన ప్రాభవాన్ని కొంత కోల్పోయిందని చెప్పాలి. ఆయా రంగాల పరి శోధన పత్రాలను మునుపటిలా సైన్స్ కాంగ్రెస్‌లో కాకుండా ప్రత్యేక సంస్థలకు సమర్పించడం మొదలైంది.

శాస్త్రీయ దృక్పథం పెరగాలంటే...
ప్రస్తుతానికి వద్దాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో, సైన్స్ రంగంలో పోటీని దృష్టిలో పెట్టుకుంటే ఇండియన్  సైన్స్ కాంగ్రెస్‌ సమావేశాల్లో శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ఫలితాలను పంచుకోవాలని అను కోవడం అత్యాశే అవుతుంది. అందుకే ఈ సమావేశాలపై కొంతమంది పెదవి విరుస్తున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యం అనండి... ఇంకేమైనా కానివ్వండి... సైన్స్ వ్యతిరేకులు కొందరికి ఈ సైన్స్ కాంగ్రెస్‌ వేదికగా మారడం ఇటీవలి పరిణామం. 

ఒక్కటైతే నిజం. యువతరంతో తమ పరిశోధనల వివరాలను పంచుకోవాలని అనుకునే శాస్త్రవేత్తలకు, ఇతర రంగాల్లోని సహోద్యో గులతో ఆలోచనలు పంచుకోవాలనుకునేవారికి ఇండియన్ సైన్స్‌ కాంగ్రెస్‌ అవసరం ఇప్పటికీ ఉంది. నోబెల్‌ అవార్డు గ్రహీతలు ఇక్కడ చేసే ప్రసంగాలు ఎంతోమంది యువకులు, విద్యార్థులకు స్ఫూర్తినిస్తా యనడంలో సందేహం లేదు. ఈ కారణాలన్నింటినీ దృష్టిలో ఉంచు కుంటే ఈ సమావేశాలు భవిష్యత్తులోనూ కొనసాగాలి.

సామాజిక మాధ్యమాల ద్వారా సూడోసైన్స్‌ కూడా సైన్స్‌ పేరిట చలామణి అవుతున్న ఈ సమయంలో దేశంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ఇలాంటి వేదికలు అనేకం అవసరం. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ 2024 సైన్స్ కాంగ్రెస్‌ సమావేశాలకు ఆర్థిక సాయాన్ని ఎందుకు నిలిపేసిందో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.
దినేశ్‌ సి. శర్మ 
వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement