నోబెల్‌ అవార్డులు చెప్పే పాఠాలు | Sakshi Guest Column On Nobel Awards | Sakshi
Sakshi News home page

నోబెల్‌ అవార్డులు చెప్పే పాఠాలు

Published Wed, Oct 23 2024 11:56 PM | Last Updated on Thu, Oct 24 2024 4:05 AM

Sakshi Guest Column On Nobel Awards

విశ్లేషణ

ఈ ఏడాది భౌతిక, రసాయనశాస్త్ర నోబెల్‌ అవార్డులను పరిశీలించారా? ఈ రెండింటితోనూ రేపటితరం టెక్నాలజీగా చెప్పుకొంటున్న కృత్రిమ మేధకు సంబంధం ఉంది. కృత్రిమ మేధ పునాదులు దశాబ్దాల నాటి ఆవిష్కరణల్లో ఉన్నాయని ఈ పురస్కారాలు చాటుతున్నాయి. మౌలికాంశాలపై పరిశోధ నలు ఎంత ముఖ్యమో కూడా ఇవి మరోసారి స్పష్టం చేస్తున్నాయి. మానవ విజ్ఞానం విస్తరించేందుకూ ఇవి ఎంతగానో అవసరం. మౌలికాంశాల పరి శోధనలకు ప్రత్యామ్నాయం లేదు. భారతీయులెవరికీ నోబెల్‌ అవార్డులు దక్కడం లేదంటే... అందుకు కారణం అదే. అంతర్జాతీయ స్థాయి శాస్త్ర రంగంలో భారత్‌ తనదైన ముద్ర వేయాలంటే, మౌలికాంశాలపై పరిశోధనలకు పెద్దపీట వేయాలి. ఇదో దీర్ఘకాలిక కార్యక్రమం అన్నది కూడా గుర్తు పెట్టుకోవాలి.

ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్‌ అవార్డులు పొందిన జాన్‌ హాప్‌ఫీల్డ్, జెఫ్రీ హంటన్‌ భౌతిక శాస్త్ర సిద్ధాంతాలను, టూల్సును మెషీన్‌ లెర్నింగ్‌ కోసం ఉపయోగించారు. అణువు తిరిగే పద్ధతి సాయంతో హాప్‌ఫీల్డ్‌ సమా చారాన్ని నిల్వ చేసుకునే, పునర్మించే నిర్మాణం రూపొందించారు.

హంటన్‌ సమాచార ధర్మాలను స్వతంత్రంగా గుర్తించగల పద్ధతిని ఆవిష్కరించారు. ప్రస్తుతం విస్తృత వినియోగంలో ఉన్న న్యూరల్‌ నెట్‌ వర్క్‌కు పునాదులు ఇవే. కాలక్రమంలో ఈ ఆవిష్కరణలు కంప్యూటర్లు కాస్తా మానవుల జ్ఞాపకశక్తి, నేర్చుకునే శక్తులను అనుకరించేంత శక్తి మంతమయ్యాయి.

ఇప్పుడు ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్‌ అవార్డు సంగతి చూద్దాం. వాషింగ్టన్‌ యూనివర్సిటీకి చెందిన డేవిడ్‌ బేకర్, గూగుల్‌ డీప్‌మైండ్‌లో పని చేస్తున్న డెమిస్‌ హస్సాబిస్, జాన్‌ ఎం.బంపర్‌లకు ఈ పురస్కారం దక్కింది. ప్రొటీన్‌ డిజైన్‌ను కంప్యూటర్ల సాయంతో అంచనా వేసేందుకు బేకర్‌ ఒక పద్ధతిని ఆవిష్కరిస్తే, డీప్‌మైండ్‌ శాస్త్ర వేత్తలు ప్రొటీన్ల నిర్మాణాన్ని ముందస్తు అంచనా వేయగలిగారు. 

మన శరీరంలోని కణాలు, జీవక్రియలన్నింటికీ ప్రొటీన్లే కీలకం. అవి అతి సంక్లిష్టమైన పద్ధతుల్లో ముడుచుకుని ఉంటాయి. ఈ ముడతల్లోని తేడాలు, మార్పులు శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అణు నిర్మాణం, పరిసరాల్లోని నీటి పరమాణువులు ప్రొటీన్‌ ముడతలను నిర్ణయిస్తాయి. ఒకే ఒక్క ప్రొటీన్‌ లెక్కలేనన్ని ఆకారాల్లో ఉండవచ్చు. 

కొత్త ప్రొటీన్లను డిజైన్‌ చేసేందుకు అవసరమైన కంప్యూటర్‌ నియ మాలను బేకర్‌ అభివృద్ధి చేశారు. దీనివల్ల కొత్త చికిత్సలు, పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఇక గూగుల్‌ డీప్‌మైండ్‌ శాస్త్రవేత్తలు ఆల్ఫా–ఫోల్డ్‌ పేరుతో తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌ అమైనో ఆమ్ల క్రమాన్ని బట్టి ప్రొటీన్‌ త్రీడీ నిర్మాణాన్ని ముందుగానే అంచనా కడుతుంది. 

పథ నిర్దేశకులకే నోబెల్‌...
మౌలికాంశాలపై పరిశోధనలు ఎంత ముఖ్యమో ఈ అవార్డులు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. సీవీ రామన్‌ తరువాత భారతీయు లెవరికీ నోబెల్‌ అవార్డు దక్కలేదంటే... కారణం ఇదే. హరగోబింద్‌ ఖొరానా, ఎస్‌.చంద్రశేఖర్, వెంకీ రామకృష్ణన్‌ వంటి వారు విదేశీ విశ్వవిద్యాలయాల్లో మౌలిక అంశాలపైనే పరిశోధనలు చేసి నోబెల్‌ అవార్డులు సాధించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. 

నోబెల్‌ అవార్డులు సాధారణంగా సాంకేతిక, శాస్త్ర రంగాల్లో కొత్త మార్గాలను ఆవిష్కరించిన వారికే ఇస్తూంటారు. హాప్‌ఫీల్డ్‌ విషయాన్నే తీసుకుందాం. తొంభై ఒక్క సంవత్సరాల వయసున్న ఈయన ‘హాప్‌ ఫీల్డ్‌ నెట్‌వర్క్‌’ అని పిలుస్తున్న ఆవిష్కరణ కోసం 1980 నుంచే కృషి చేస్తున్నారు. హంటన్‌ ఆవిష్కరించిన ‘బోల్‌æ్ట›్జమన్‌ మెషీన్‌’ పద్ధతి కూడా దశాబ్దాల కృషి ఫలితమే. 

ఎంతో కాలం తరువాత 2010లో ఈ ఆవిష్కరణలు మెషీన్‌ లెర్నింగ్‌ రంగాన్ని సమూలంగా మార్చేశాయి. చాట్‌జీపీటీ వంటి వినియోగదారు ఉత్పత్తికి వీరి పరిశోధనలే మూలం. ఇదే విధంగా రసాయన శాస్త్రంలో బేకర్‌ ప్రొటీన్‌ నిర్మాణా లపై దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. 1998లో ఆయన తన తొలి ఆవిష్కరణ ‘రొసెట్టా’ను సిద్ధం చేశారు. 

ఇలాంటి ఆవిష్కరణల్లో భారతీయుల పాత్ర కూడా ఉందన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. కృత్రిమ మేధ, డిజిటల్‌ కంప్యూటర్లకు సంబంధించి శాస్త్రవేత్తల్లో ప్రాథమికంగా ఒక ఆలోచన మొదలైన 1950లలోనే గణాంక శాస్త్రవేత్తగా మారిన భౌతిక శాస్త్రవేత్త ప్రశాంత చంద్ర మహాలనోబిస్‌ ఒక భావనను ప్రతిపాదించారు. 

‘మహాలనోబిస్‌ డిస్టెన్స్‌’ అని పిలిచే ఈ భావన వేర్వేరు డేటా పాయింట్లలోని తేడాలను లెక్కిస్తుంది. అనంతరం ఈ మహాలనోబిస్‌ డిస్టెన్స్‌ను కంప్యూటర్‌ సైన్స్, కృత్రిమ మేధ రంగాల్లో విస్తృతంగా వినియోగించారు. కోల్‌కతాలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ) వ్యవస్థాపకుడు కూడా మహాలనోబిసే. 

సైబర్నెటిక్స్‌ ప్రాము ఖ్యతను అప్పట్లోనే గుర్తించారు. ఇందుకు తగ్గట్టుగా 1955లోనే నార్బెర్ట్‌ వీనర్‌ వంటి వారిని ఐఎస్‌ఐ విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా ఆహ్వానించారు. ద్విజేశ్‌ దత్తా మజుందార్‌ వంటి వారిని ఫజీ లాజిక్, న్యూరల్‌ నెట్‌వర్క్‌ వంటి రంగాల్లో పరిశోధనలకు వీనర్‌ పురిగొల్పారు.

ప్రొఫెసర్‌ రాజ్‌ రెడ్డి భాగస్వామ్యం...
1966లో అమెరికాలో డాక్టోరల్‌ విద్యార్థిగా ఉన్న రాజ్‌ రెడ్డి... మాటలను గుర్తించేందుకు ‘హియర్సే–1’ వంటి వ్యవస్థలను అభివృద్ధి చేశారు. మనుషుల్లానే కంప్యూటర్లు కూడా విషయాలను జ్ఞాపకం ఉంచుకునేలా, మనిషి మాటలను గుర్తించి అర్థం చేసుకోగల సామ ర్థ్యాన్ని కల్పించారు. ప్రస్తుతం కంప్యూటర్లు, రోబోలు మాటలను గుర్తించేందుకు ఉపయోగిస్తున్నది రాజ్‌ రెడ్డి అభివృద్ధి చేసిన ‘హియర్సే –2’, హార్పీ, డ్రాగన్‌ వంటి సిస్టమ్సే. 

‘బ్లాక్‌బోర్డ్‌ మోడల్‌’ పేరుతో రాజ్‌ రెడ్డి అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌... కృత్రిమ మేధ వేర్వేరు మార్గాల నుంచి వచ్చే సమాచారాన్ని సమన్వయపరచుకునేందుకు కీలకంగా మారింది. ఈ ఆవిష్కరణకు గాను 1994లో ప్రొఫెసర్‌ రాజ్‌ రెడ్డికి కంప్యూటర్‌ సైన్సులో నోబెల్‌ అవార్డుగా పరిగణించే ‘టూరింగ్‌ అవార్డు’ దక్కింది. 

నోబెల్‌ అవార్డులు కృత్రిమ మేధ రంగంలో కీలక ఆవిష్కరణలకు దక్కడం బాగానే ఉంది. అయితే ఈ టెక్నాలజీతో వచ్చే ప్రమాదాలను కూడా ఈ ఏడాది నోబెల్‌ గ్రహీతలు గుర్తించారు. ఏఐ ఛాట్‌బోట్లు భయం పుట్టించేవే అని గూగుల్‌ కృత్రిమ మేధ విభాగపు అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తరువాత హింటన్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. 

కృత్రిమ మేధ విస్తృత వాడకం వల్ల సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతాయనీ, ఏఐ కారణంగా పెరిగిపోయే ఉత్పాదకత, సంపద ధనికులకు మాత్రమే సాయపడుతుందనీ అంచనా కట్టారు. కృత్రిమ మేధ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే చిన్నా చితకా ఉద్యోగాలు అనేకం లేకుండా పోతాయని హెచ్చరించారు. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వాలు సార్వత్రిక సామాన్య వేతనం వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాలని హింటన్‌ సూచించారు. 

భారతీయులకు నోబెల్‌ అవార్డు దక్కక పోవడం గురించి కూడా మాట్లాడుకుందాం. పరిశోధనలకు అవసరమైన నిధులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ‘అనుసంధాన్‌ నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌’ ఒకదాన్ని ఏర్పాటు చేసింది. కాకపోతే ఇందుకు నిధులు ఎలా సమకూరుస్తారన్నది ఇంకా స్పష్టం కాలేదు. 

అంతర్జాతీయ స్థాయి శాస్త్ర రంగంలో భారత్‌ తనదైన ముద్ర వేయాలని కృత నిశ్చయంతో ఉంటే, యూనివర్సిటీల్లో మౌలికాంశాలపై పరిశోధనలకు పెద్దపీట వేయాలి. అలాగే అన్ని రకాల మద్దతు అందివ్వాలి. ఇదో దీర్ఘ కాలిక కార్యక్రమం అన్నది గుర్తు పెట్టుకోవాలి. అప్లైడ్‌ రీసెర్చ్, టెక్నా లజీ డెవలప్మెంట్లపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా తక్షణ సామాజిక, పారిశ్రామిక అవసరాలను తీర్చుకోవచ్చు. 

స్థూలంగా చెప్పాలంటే నిధుల కేటాయింపు విషయంలో మౌలికాంశాలపై పరిశోధనలతోపాటు అప్లైడ్‌ రీసెర్చ్, టెక్నాలజీలు రెండింటికీ మధ్య ఒక సమతూకం సాధించాలి. ప్రైవేటు రంగం కూడా ఈ ఏడాది నోబెల్‌ అవార్డు గ్రహీతల నుంచి స్ఫూర్తి పొందాలి. రసాయన శాస్త్ర నోబెల్‌ అవార్డులో సగం గూగుల్‌ శాస్త్రవేత్తలకు దక్కిన విషయం గమనార్హం. మౌలికాంశాలపై పరిశోధనలకు ఆ ప్రైవేట్‌ కంపెనీ పెట్టిన పెట్టుబడులు ఇందుకు కారణం. నోబెల్‌ స్థాయి అవార్డు రావాలంటే, మౌలికాంశాలపై పరిశోధనలకు పెట్టుబడులు సమకూరుస్తుండటమే మార్గం.

దినేశ్‌ సి.శర్మ
వ్యాసకర్త సైన్స్‌ అంశాల వ్యాఖ్యాత
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement