Nobel awards
-
నోబెల్ అవార్డులు చెప్పే పాఠాలు
ఈ ఏడాది భౌతిక, రసాయనశాస్త్ర నోబెల్ అవార్డులను పరిశీలించారా? ఈ రెండింటితోనూ రేపటితరం టెక్నాలజీగా చెప్పుకొంటున్న కృత్రిమ మేధకు సంబంధం ఉంది. కృత్రిమ మేధ పునాదులు దశాబ్దాల నాటి ఆవిష్కరణల్లో ఉన్నాయని ఈ పురస్కారాలు చాటుతున్నాయి. మౌలికాంశాలపై పరిశోధ నలు ఎంత ముఖ్యమో కూడా ఇవి మరోసారి స్పష్టం చేస్తున్నాయి. మానవ విజ్ఞానం విస్తరించేందుకూ ఇవి ఎంతగానో అవసరం. మౌలికాంశాల పరి శోధనలకు ప్రత్యామ్నాయం లేదు. భారతీయులెవరికీ నోబెల్ అవార్డులు దక్కడం లేదంటే... అందుకు కారణం అదే. అంతర్జాతీయ స్థాయి శాస్త్ర రంగంలో భారత్ తనదైన ముద్ర వేయాలంటే, మౌలికాంశాలపై పరిశోధనలకు పెద్దపీట వేయాలి. ఇదో దీర్ఘకాలిక కార్యక్రమం అన్నది కూడా గుర్తు పెట్టుకోవాలి.ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ అవార్డులు పొందిన జాన్ హాప్ఫీల్డ్, జెఫ్రీ హంటన్ భౌతిక శాస్త్ర సిద్ధాంతాలను, టూల్సును మెషీన్ లెర్నింగ్ కోసం ఉపయోగించారు. అణువు తిరిగే పద్ధతి సాయంతో హాప్ఫీల్డ్ సమా చారాన్ని నిల్వ చేసుకునే, పునర్మించే నిర్మాణం రూపొందించారు.హంటన్ సమాచార ధర్మాలను స్వతంత్రంగా గుర్తించగల పద్ధతిని ఆవిష్కరించారు. ప్రస్తుతం విస్తృత వినియోగంలో ఉన్న న్యూరల్ నెట్ వర్క్‌కు పునాదులు ఇవే. కాలక్రమంలో ఈ ఆవిష్కరణలు కంప్యూటర్లు కాస్తా మానవుల జ్ఞాపకశక్తి, నేర్చుకునే శక్తులను అనుకరించేంత శక్తి మంతమయ్యాయి.ఇప్పుడు ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ అవార్డు సంగతి చూద్దాం. వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన డేవిడ్ బేకర్, గూగుల్ డీప్‌మైండ్‌లో పని చేస్తున్న డెమిస్ హస్సాబిస్, జాన్ ఎం.బంపర్లకు ఈ పురస్కారం దక్కింది. ప్రొటీన్ డిజైన్‌ను కంప్యూటర్ల సాయంతో అంచనా వేసేందుకు బేకర్ ఒక పద్ధతిని ఆవిష్కరిస్తే, డీప్‌మైండ్ శాస్త్ర వేత్తలు ప్రొటీన్ల నిర్మాణాన్ని ముందస్తు అంచనా వేయగలిగారు. మన శరీరంలోని కణాలు, జీవక్రియలన్నింటికీ ప్రొటీన్లే కీలకం. అవి అతి సంక్లిష్టమైన పద్ధతుల్లో ముడుచుకుని ఉంటాయి. ఈ ముడతల్లోని తేడాలు, మార్పులు శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అణు నిర్మాణం, పరిసరాల్లోని నీటి పరమాణువులు ప్రొటీన్ ముడతలను నిర్ణయిస్తాయి. ఒకే ఒక్క ప్రొటీన్ లెక్కలేనన్ని ఆకారాల్లో ఉండవచ్చు. కొత్త ప్రొటీన్లను డిజైన్ చేసేందుకు అవసరమైన కంప్యూటర్ నియ మాలను బేకర్ అభివృద్ధి చేశారు. దీనివల్ల కొత్త చికిత్సలు, పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఇక గూగుల్ డీప్‌మైండ్ శాస్త్రవేత్తలు ఆల్ఫా–ఫోల్డ్ పేరుతో తయారు చేసిన సాఫ్ట్వేర్ అమైనో ఆమ్ల క్రమాన్ని బట్టి ప్రొటీన్ త్రీడీ నిర్మాణాన్ని ముందుగానే అంచనా కడుతుంది. పథ నిర్దేశకులకే నోబెల్...మౌలికాంశాలపై పరిశోధనలు ఎంత ముఖ్యమో ఈ అవార్డులు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. సీవీ రామన్ తరువాత భారతీయు లెవరికీ నోబెల్ అవార్డు దక్కలేదంటే... కారణం ఇదే. హరగోబింద్ ఖొరానా, ఎస్.చంద్రశేఖర్, వెంకీ రామకృష్ణన్ వంటి వారు విదేశీ విశ్వవిద్యాలయాల్లో మౌలిక అంశాలపైనే పరిశోధనలు చేసి నోబెల్ అవార్డులు సాధించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. నోబెల్ అవార్డులు సాధారణంగా సాంకేతిక, శాస్త్ర రంగాల్లో కొత్త మార్గాలను ఆవిష్కరించిన వారికే ఇస్తూంటారు. హాప్ఫీల్డ్ విషయాన్నే తీసుకుందాం. తొంభై ఒక్క సంవత్సరాల వయసున్న ఈయన ‘హాప్ ఫీల్డ్ నెట్వర్క్’ అని పిలుస్తున్న ఆవిష్కరణ కోసం 1980 నుంచే కృషి చేస్తున్నారు. హంటన్ ఆవిష్కరించిన ‘బోల్æ్ట›్జమన్ మెషీన్’ పద్ధతి కూడా దశాబ్దాల కృషి ఫలితమే. ఎంతో కాలం తరువాత 2010లో ఈ ఆవిష్కరణలు మెషీన్ లెర్నింగ్ రంగాన్ని సమూలంగా మార్చేశాయి. చాట్‌జీపీటీ వంటి వినియోగదారు ఉత్పత్తికి వీరి పరిశోధనలే మూలం. ఇదే విధంగా రసాయన శాస్త్రంలో బేకర్ ప్రొటీన్ నిర్మాణా లపై దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. 1998లో ఆయన తన తొలి ఆవిష్కరణ ‘రొసెట్టా’ను సిద్ధం చేశారు. ఇలాంటి ఆవిష్కరణల్లో భారతీయుల పాత్ర కూడా ఉందన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. కృత్రిమ మేధ, డిజిటల్ కంప్యూటర్లకు సంబంధించి శాస్త్రవేత్తల్లో ప్రాథమికంగా ఒక ఆలోచన మొదలైన 1950లలోనే గణాంక శాస్త్రవేత్తగా మారిన భౌతిక శాస్త్రవేత్త ప్రశాంత చంద్ర మహాలనోబిస్ ఒక భావనను ప్రతిపాదించారు. ‘మహాలనోబిస్ డిస్టెన్స్’ అని పిలిచే ఈ భావన వేర్వేరు డేటా పాయింట్లలోని తేడాలను లెక్కిస్తుంది. అనంతరం ఈ మహాలనోబిస్ డిస్టెన్స్‌ను కంప్యూటర్ సైన్స్, కృత్రిమ మేధ రంగాల్లో విస్తృతంగా వినియోగించారు. కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ) వ్యవస్థాపకుడు కూడా మహాలనోబిసే. సైబర్నెటిక్స్ ప్రాము ఖ్యతను అప్పట్లోనే గుర్తించారు. ఇందుకు తగ్గట్టుగా 1955లోనే నార్బెర్ట్ వీనర్ వంటి వారిని ఐఎస్ఐ విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఆహ్వానించారు. ద్విజేశ్ దత్తా మజుందార్ వంటి వారిని ఫజీ లాజిక్, న్యూరల్ నెట్వర్క్ వంటి రంగాల్లో పరిశోధనలకు వీనర్ పురిగొల్పారు.ప్రొఫెసర్ రాజ్ రెడ్డి భాగస్వామ్యం...1966లో అమెరికాలో డాక్టోరల్ విద్యార్థిగా ఉన్న రాజ్ రెడ్డి... మాటలను గుర్తించేందుకు ‘హియర్సే–1’ వంటి వ్యవస్థలను అభివృద్ధి చేశారు. మనుషుల్లానే కంప్యూటర్లు కూడా విషయాలను జ్ఞాపకం ఉంచుకునేలా, మనిషి మాటలను గుర్తించి అర్థం చేసుకోగల సామ ర్థ్యాన్ని కల్పించారు. ప్రస్తుతం కంప్యూటర్లు, రోబోలు మాటలను గుర్తించేందుకు ఉపయోగిస్తున్నది రాజ్ రెడ్డి అభివృద్ధి చేసిన ‘హియర్సే –2’, హార్పీ, డ్రాగన్ వంటి సిస్టమ్సే. ‘బ్లాక్‌బోర్డ్ మోడల్’ పేరుతో రాజ్ రెడ్డి అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్... కృత్రిమ మేధ వేర్వేరు మార్గాల నుంచి వచ్చే సమాచారాన్ని సమన్వయపరచుకునేందుకు కీలకంగా మారింది. ఈ ఆవిష్కరణకు గాను 1994లో ప్రొఫెసర్ రాజ్ రెడ్డికి కంప్యూటర్ సైన్సులో నోబెల్ అవార్డుగా పరిగణించే ‘టూరింగ్ అవార్డు’ దక్కింది. నోబెల్ అవార్డులు కృత్రిమ మేధ రంగంలో కీలక ఆవిష్కరణలకు దక్కడం బాగానే ఉంది. అయితే ఈ టెక్నాలజీతో వచ్చే ప్రమాదాలను కూడా ఈ ఏడాది నోబెల్ గ్రహీతలు గుర్తించారు. ఏఐ ఛాట్బోట్లు భయం పుట్టించేవే అని గూగుల్ కృత్రిమ మేధ విభాగపు అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తరువాత హింటన్ వ్యాఖ్యానించడం గమనార్హం. కృత్రిమ మేధ విస్తృత వాడకం వల్ల సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతాయనీ, ఏఐ కారణంగా పెరిగిపోయే ఉత్పాదకత, సంపద ధనికులకు మాత్రమే సాయపడుతుందనీ అంచనా కట్టారు. కృత్రిమ మేధ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే చిన్నా చితకా ఉద్యోగాలు అనేకం లేకుండా పోతాయని హెచ్చరించారు. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వాలు సార్వత్రిక సామాన్య వేతనం వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాలని హింటన్ సూచించారు. భారతీయులకు నోబెల్ అవార్డు దక్కక పోవడం గురించి కూడా మాట్లాడుకుందాం. పరిశోధనలకు అవసరమైన నిధులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’ ఒకదాన్ని ఏర్పాటు చేసింది. కాకపోతే ఇందుకు నిధులు ఎలా సమకూరుస్తారన్నది ఇంకా స్పష్టం కాలేదు. అంతర్జాతీయ స్థాయి శాస్త్ర రంగంలో భారత్ తనదైన ముద్ర వేయాలని కృత నిశ్చయంతో ఉంటే, యూనివర్సిటీల్లో మౌలికాంశాలపై పరిశోధనలకు పెద్దపీట వేయాలి. అలాగే అన్ని రకాల మద్దతు అందివ్వాలి. ఇదో దీర్ఘ కాలిక కార్యక్రమం అన్నది గుర్తు పెట్టుకోవాలి. అప్లైడ్ రీసెర్చ్, టెక్నా లజీ డెవలప్మెంట్లపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా తక్షణ సామాజిక, పారిశ్రామిక అవసరాలను తీర్చుకోవచ్చు. స్థూలంగా చెప్పాలంటే నిధుల కేటాయింపు విషయంలో మౌలికాంశాలపై పరిశోధనలతోపాటు అప్లైడ్ రీసెర్చ్, టెక్నాలజీలు రెండింటికీ మధ్య ఒక సమతూకం సాధించాలి. ప్రైవేటు రంగం కూడా ఈ ఏడాది నోబెల్ అవార్డు గ్రహీతల నుంచి స్ఫూర్తి పొందాలి. రసాయన శాస్త్ర నోబెల్ అవార్డులో సగం గూగుల్ శాస్త్రవేత్తలకు దక్కిన విషయం గమనార్హం. మౌలికాంశాలపై పరిశోధనలకు ఆ ప్రైవేట్ కంపెనీ పెట్టిన పెట్టుబడులు ఇందుకు కారణం. నోబెల్ స్థాయి అవార్డు రావాలంటే, మౌలికాంశాలపై పరిశోధనలకు పెట్టుబడులు సమకూరుస్తుండటమే మార్గం.దినేశ్ సి.శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
నర్గేస్ మొహమ్మదికి నోబెల్ శాంతి అవార్డు.. ఆమె ఏ దేశమంటే?
స్టాక్‌హోమ్: ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. 2023 సంవత్సరానికి గానూ నోబెల్ శాంతి బహుమతిని ఇరాన్‌కు చెందిన మహిళా సామాజిక కార్యకర్త నర్గేస్ మొహమ్మదిని వరించింది. వివరాల ప్రకారం.. ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని ఇరాన్‌కు చెందిన మహిళ నర్గేస్ మొహమ్మది గెలుచుకున్నారు. కాగా, నర్గేస్ మొహమ్మది.. ఇరాన్లో మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. మహిళల హక్కులు, స్వేచ్చపై పోరాటం చేసినందుకు గాను ఆమెకు శాంతి బహుమతి లభించింది. BREAKING NEWS The Norwegian Nobel Committee has decided to award the 2023 #NobelPeacePrize to Narges Mohammadi for her fight against the oppression of women in Iran and her fight to promote human rights and freedom for all.#NobelPrize pic.twitter.com/2fyzoYkHyf — The Nobel Prize (@NobelPrize) October 6, 2023 ఇక, ఇరాన్ మహిళల కోసం నర్గేస్ మొహమ్మది వీరోచిత పోరాటం చేశారు. ఈ క్రమంలో ఇరాన్ ప్రభుత్వం ఆమెను 13 సార్లు అరెస్టు చేసింది. ఐదుసార్లు ఆమెను దోషిగా నిర్ధారించింది. అంతేకాకుండా ఆమెకు మొత్తం 31 సంవత్సరాల జైలు శిక్ష మరియు 154 కొరడా దెబ్బలు విధించింది. మహ్మదీ ఇంకా జైలులోనే ఉన్నారు. 2023 #NobelPeacePrize laureate Narges Mohammadi’s brave struggle has come with tremendous personal costs. The Iranian regime has arrested her 13 times, convicted her five times, and sentenced her to a total of 31 years in prison and 154 lashes. Mohammadi is still in prison. pic.twitter.com/ooDEZAVX01 — The Nobel Prize (@NobelPrize) October 6, 2023 ఇది కూడా చదవండి: జాన్ ఫోసేకు సాహిత్య నోబెల్ -
Nobel Prize: నార్వే రచయితకు సాహిత్యంలో నోబెల్
స్టాక్‌హోం: ప్రపంచలోనే ప్రతిష్ఠాత్మకంగా భావించే నోబెల్ పురస్కారాల ప్రకటన కొనసాగుతోంది. తాజాగా సాహిత్యం కేటగిరిలో 2023 సంవత్సరానికి నోబెల్ బహుమతిని ప్రకటించారు. కాగా, 2023 సంవత్సరానికి గానూ సాహిత్యంలో నోబెల్ బహుమతిని గురువారం ప్రకటించారు. నార్వేకు చెందిన రచయిత జాన్ ఫోసెను ఈ ఏడాది సాహిత్య నోబెల్ వరించింది. ఇక, ఇప్పటికే రసాయన శాస్త్రం, భౌతిక, వైద్య రంగాల్లో నోబెల్ అవార్డులను ప్రకటించారు. తాజాగా సాహిత్యంలో నోబెల్ ప్రకటించారు. శాంతి కేటగిరిలో ప్రకటించాల్సి ఉంది. The 2023 Nobel Prize in Literature is awarded to the Norwegian author Jon Fosse “for his innovative plays and prose which give voice to the unsayable". (Pic: The Nobel Prize) pic.twitter.com/RI2jThwOYV — ANI (@ANI) October 5, 2023 -
Nobel Prize- 2022: ముగ్గురికి ఆర్థిక నోబెల్
స్టాక్‌హోమ్: తీవ్ర ఆర్థికమాంద్యంలో అతలాకుతలమైన అమెరికా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు అహర్నిశలు కృషిచేసిన అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ మాజీ చైర్మన్ బెన్ బెర్నాంకీని ఆర్థికశాస్త్ర నోబెల్ వరించింది. ఆయనతోపాటు బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలపై కీలక పరిశోధనలు చేసిన మరో ఇద్దరు అమెరికా ఆర్థికవేత్తలు డగ్లస్ డబ్ల్యూ.డైమండ్, ఫిలిప్ హెచ్.డైబ్విగ్లకు సోమవారం ఆర్థిక నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు. ‘బ్యాంక్‌లు కుప్పకూలకుండా చూసుకోవడం మనకు ఏ విధంగా అత్యంత ముఖ్యమైన అంశం’ అనే దానిపై ఈ ముగ్గురి శోధన కొనసాగిందని స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్స్‌లోని నోబెల్ కమిటీ పేర్కొంది. ఆర్థికవ్యవస్థలను సంస్కరించాలనే పునాదులను ఈ ముగ్గురు 1980 దశకంలోనే వేశారని ఆర్థిక శాస్త్రాల నోబెల్ కమిటీ అధినేత జాన్ హస్లర్ చెప్పారు. ‘ ఆర్థిక వ్యవస్థను నిట్టనిలువునా కూల్చేసేవి ముఖ్యంగా రెండే. అవి ఆర్థిక సంక్షోభం, ఆర్థికమాంద్యం. వీటి నివారణ, సమర్థవంతంగా ఎదుర్కోవడం అనే వాటిలో వీరి పరిశోధనలు ఎంతగానో సాయపడనున్నాయి’ అని హస్లర్ అన్నారు. 68 ఏళ్ల బెర్నాంకీ ప్రస్తుతం ఒక బ్రోకింగ్ ఇన్స్టిట్యూట్ కోసం పనిచేస్తున్నారు. ఈయన 1930లో అమెరికా చవిచూసిన మహామాంద్యం మూలాలపై పరిశోధన చేశారు. ఆనాడు ఆందోళనకు గురైన జనం ఒక్కసారిగా బ్యాంక్‌ల నుంచి మొత్తం నగదును ఉపసంహరించుకుంటుంటే బ్యాంకింగ్ వ్యవస్థలు కుప్పకూలడం, తదనంతరం ఊహించనిస్థాయికి ఆర్థికవ్యవస్థ కుప్పకూలడం లాంటి వాటిపైనా బెర్నాంకీ పరిశోధన చేశారు. అంతకుముందు షికాగో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 68 ఏళ్ల డగ్లస్ డైమండ్, సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 67 ఏళ్ల ఫిలిప్ డైబ్విగ్లు బ్యాంక్ డిపాజిట్లకు ప్రభుత్వం పూచీకత్తుగా ఉంటే సంక్షుభిత ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఎలా నిలబడగలదో అనే అంశాలపై పరిశోధన కొనసాగించారు. బ్యాంకింగ్ వ్యవస్థకు సాయపడేలా 1983లోనే డైమండ్, ఫిలిప్ సంయుక్తంగా ‘ బ్యాంక్ రన్స్, డిపాజిట్ ఇన్సూరెన్స్, లిక్విడిటీ’ రచన చేశారు. బెర్నాంకీ 2007–08 కాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలోపెట్టేందుకు స్వల్పకాలిక వడ్డీరేట్లను సున్నాకు తెచ్చారు. ఈయన నేతృత్వంలో ఫెడ్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయాల వల్ల అమెరికా ఆర్థికమాంద్యం నుంచి త్వరగా గట్టెక్కింది. 2020 తొలినాళ్లలో కోవిడ్‌తో కుదేలైన అమెరికా ఆర్థిక వ్యవస్థకు 2020నాటి ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జోరోమ్ పావెల్ సైతం ఇవే నిర్ణయాలను అమలుచేసి వ్యవస్థను మళ్లీ దారిలోపెట్టడం గమనార్హం. 1930నాటి మహామాంద్యం చాలా సంవత్సరాలు తీవ్రస్థాయిలో కొనసాగడానికి గల కారణాలను 1983నాటి పరిశోధనా పత్రంలో బెర్నాంకీ విశదీకరించారు. డిపాజిటర్లు డబ్బంతా బ్యాంక్‌ల నుంచి ఉపసంహరించుకోవడంతో ఆర్థికవ్యవస్థకు కీలకమైన కొత్త రుణాలను మంజూరుచేయలేక బ్యాంక్‌లు కుప్పకూలాయని బెర్నాంకీ కనుగొన్నారు. ఇవి బ్యాంకింగ్ వ్యవస్థను మరింతగా అర్థంచేసుకునేందుకు సాయపడుతున్నాయని నోబెల్ కమిటీ అధినేత హస్లర్ అభిప్రాయపడ్డారు. -
వేలంపాట సిద్ధాంతానికి ఆర్థిక నోబెల్
స్టాక్‌హోమ్: వేలంపాటల నిర్వహణకు కొత్త, మెరుగైన పద్ధతులను సృష్టించడంతోపాటు వేలంపాటల సిద్ధాంతాన్ని మరింత మెరుగుపరిచిన అమెరిక ఆర్థికవేత్తలు, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పాల్ ఆర్ మిల్‌గ్రూమ్ (72), రాబర్ట్ బి విల్సన్ (83) ఈ ఏడాది నోబెల్ అవార్డుకు ఎంపికయ్యారు. వేలం పాటలు ఎలా పనిచేస్తాయి అన్న విషయాన్ని పరిశీలించిన అవార్డు గ్రహీతలు సంప్రదాయ పద్ధతుల్లో అమ్మడం వీలుకాని (రేడియో తరంగాలు, విమానాల ల్యాండింగ్ స్లాట్స్ వంటివి) వస్తు, సేవలను విక్రయించేందుకు కొత్త వేలం పద్ధతులను ఆవిష్కరించారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అమ్మకందారులు, ఇటు వినియోగదారులతోపాటు పన్ను చెల్లింపుదారులు లబ్ధి పొందారని నోబెల్ అవార్డుల కమిటీ తెలిపింది. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రటరీ జనరల్ గొరాన్ హాన్సన్ సోమవారం విజేతలను ప్రకటించారు. విల్సన్ తన పీహెచ్డీ సలహాదారుగా పనిచేశాడని మిల్‌గ్రూమ్ తెలిపారు. విల్సన్ మాట్లాడుతూ వేలంపాటలకు సంబంధించి మిల్‌గ్రూమ్ ఓ మేధావి అని తన పూర్వ విద్యార్థిని ప్రశంసల్లో ముంచెత్తారు. ఆర్థిక శాస్త్ర నోబెల్ అవార్డు కింద రూ.8.32 కోట్ల నగదు, బంగారు పతకం లభిస్తాయి. అన్ని వేలాలు ఒకటి కాదు... సాధారణంగా వేలంపాటలో ఎవరు ఎక్కువ మొత్తం చెల్లించేందుకు సిద్ధమవుతారో వారికి ఆయా వస్తు, సేవలు లభ్యమవుతూంటాయి. లేదంటే ఒక పనిని అతి చౌకగా చేసిపెడతామన్న వారికీ ఆ పనిని కట్టబెట్టడమూ కద్దు. అతిపురాతనమైన, అపురూపమైన వస్తువులు మొదలుకొని ఇంటి సామాన్ల వరకూ రోజూ అనూహ్యమైన ధరలకు అమ్ముడవుతూండటం మనం చూస్తూనే ఉంటాం. వేలం ద్వారా ప్రభుత్వాలు ప్రజావసరాల కోసం వస్తు, సేవలను సమీకరించడం కూడా మనం చూస్తూంటాం. రాబర్ట్ విల్సన్, పాల్ మిల్‌గ్రూమ్‌లు వేలంపాట సిద్ధాంతం ఆధారంగా వేలంపాట జరిగే తీరు, తుది ధరలు, వేలంలో పాల్గొనేందుకు ఏర్పాటు చేసే నిబంధనలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా తుదిఫలితాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే వేలంలో పాల్గొనేవాళ్లు తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూండటం వల్ల ఈ విళ్లేషణ అంత సులువుగా ఉండదు. తమకు తెలిసిన, ఇతరులకు తెలిసి ఉంటుందని భావిస్తున్న సమాచారాన్ని కూడా వీరు పరిగణనలోకి తీసుకుంటూ ఉంటారు. రాబర్ట్ విల్సన్.. సాధారణ విలువగల వస్తువుల వేలానికి సంబంధించి ఒక సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. రేడియో తరంగాల భవిష్యత్తు ధరలు, నిర్దిష్ట ప్రాంతంలోని ఖనిజాల పరిమాణం వంటివన్నమాట. ఇలాంటి అంశాల్లో సాధారణ విలువ కంటే తక్కువగా ఎందుకు బిడ్లు వేస్తారన్నది విల్సన్ తన సిద్ధాంతం ద్వారా తెలుసుకోగలిగారు. మరీ ఎక్కువగా చెల్లిస్తున్నామేమో అన్న బెంగ వీరికి ఉంటుందని విల్సన్ అంటారు. మరోవైపు పాల్ మిల్‌గ్రూమ్ వేలంపాటలకు సంబంధించి ఓ సాధారణీకరించిన సిద్ధాంతాన్ని సిద్ధం చేశారు. ఇందులో సాధారణ విలువతోపాటు ఇతర విలువలూ ఉంటాయి. ఇవి ఒక్కో బిడ్డర్‌ను బట్టి మారిపోతూంటాయి. వివిధ రకాల వేలం పద్ధతులను పరిశీలించిన మిల్‌గ్రూమ్ ఒకరకమైన పద్ధతి అమ్మేవాడికి ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతుందని, ఇది కూడా బిడ్డర్లు ఇతరుల అంచనా విలువలను తెలుసుకోగలిగినప్పుడు వీలవుతుందని మిల్‌గ్రూమ్ చెబుతున్నారు. 1994లో అమెరికా అధికారులు తొలిసారి రేడియో తరంగాల వేలానికి మిల్‌గ్రూమ్ సిద్ధం చేసిన సరికొత్త విధానాన్ని ఉపయోగించగా ఆ తరువాత చాలా దేశాలు అదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. -
జన్యు కత్తెరకు నోబెల్
స్టాక్‌హోమ్: జన్యువులను మనకు అవసరమైన రీతిలో కచ్చితంగా కత్తిరించేందుకు ఓ పద్ధతి(జెనెటిక్ సిజర్స్)ని ఆవిష్కరించిన ఫ్రాన్స్ శాస్త్రవేత్త ఎమ్మాన్యుల్ షార్పెంటైర్ (51), అమెరికన్ శాస్త్రవేత్త జెన్నిఫర్ ఏ డౌడ్నా (56)లకు ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ బహుమతి దక్కింది. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం స్టాక్‌హోమ్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది. జన్యు సంబంధి త వ్యాధుల చికిత్సతోపాటు అనేక ఇతర ప్రయోజనాలు కలిగిన ఈ పద్ధతిని క్రిస్పర్ క్యాస్–9 అని పిలుస్తారు. ‘ఈ జన్యు ఆధారిత పరిజ్ఞానం మౌలిక శాస్త్ర పరిజ్ఞానంలో విప్లవాత్మక మార్పులు తీసుకు రావడమే కాకుండా సరికొత్త చికిత్సలు, అనూహ్యమైన పంటలను అందుబాటులోకి తీసుకురానుందని క్రిస్పర్ క్యాస్–9 గురించి రసాయన శాస్త్ర నోబెల్ కమిటీ అధ్యక్షులు క్లేస్ గుస్తాఫ్సన్ తెలిపారు. షార్పెంటైర్, డౌడ్నాల పరిశోధనల ఫలితంగా జన్యుక్రమంలోని లోపాలను సులువుగా సరిదిద్దవచ్చునని, అయితే ఈ టెక్నాలజీని చాలా జాగరుకతతో ఉపయోగించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అవార్డులో భాగంగా ఒక బంగారు పతకం, కోటి క్రోనార్లు (రూ.8.23 కోట్లు) నగదు అందిస్తారు. స్వీడన్‌కు చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ 124 ఏళ్ల క్రితం ఈ అవార్డును ఏర్పాటు చేశారు. అవార్డు ప్రకటించిన సందర్భంగా ఎమ్మాన్యుల్ షార్పెంటైర్ బెర్లిన్ నుంచి ఫోన్ ద్వారా మాట్లాడుతూ ‘‘ఇది చాలా ఉద్వేగభరితమైన క్షణం’’అని వ్యాఖ్యానించారు. క్రిస్పర్ క్యాస్–9 కథ ఇదీ... పరిణామ క్రమంలో వైరస్ల దాడి నుంచి రక్షించుకునేందుకు బ్యాక్టీరియా ఓ శక్తిమంతమైన పరిజ్ఞానాన్ని తన సొంతం చేసుకుంది. దీన్నే క్రిస్పర్ అని పిలుస్తారు. వైరస్ దాడి చేసినప్పుడు దాన్ని జన్యుక్రమంలో బాగా గుర్తించగలిగే కొంత భాగాన్ని బ్యాక్టీరియా తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. భవిష్యత్తులో అదే వైరస్ మళ్లీ దాడి చేస్తే.. ఈ ‘మెమరీ కార్డు’ సాయంతో గుర్తించేందుకన్నమాట. ఒకసారి గుర్తించిందనుకోండి.. తనలోని మెమరీ కార్డుకు ఓ ఎంజైమ్ (క్యాస్ 9)ను జత చేసి కొత్తగా దాడి చేసిన వైరస్‌పైకి ప్రయోగిస్తుంది. ఇది కాస్తా... వైరస్ జన్యుక్రమంలోకి చేరిపోవడమే కాకుండా.. దాన్ని ముక్కలుగా కత్తిరిస్తుంది. మనిషికి విపరీతమైన హాని కలిగించే స్ట్రెప్టోకాకస్ పయోజీన్స్ బ్యాక్టీరియాపై పరిశోధనలు చేస్తున్న క్రమంలో ఎమ్మాన్యుల్ షార్పెంటైర్ అందులో అప్పటివరకూ గుర్తించని ఓ అణువు ఉన్నట్లు గుర్తించారు. ఈ ట్రాకర్‌ఆర్‌ఎన్‌ఏ పురాతన బ్యాక్టీరియా రోగ నిరోధక వ్యవస్థలో భాగమని తెలిసింది. దీనిపై 2011లో షార్పెంటైర్ తన పరిశోధన పత్రాన్ని సమర్పించారు. అదే ఏడాది ఆర్ఎన్ఏపై అనుభవమున్న జెన్నిఫర్‌తో కలిసి పరిశోధనలు చేపట్టారు. ఇరువురూ ఆ ప్రక్రియను కృత్రిమంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేసి విజయం సాధించారు. సులువుగా పనిచేసేలా, ఏ రకమైన జన్యుపదార్థంతోనైనా పనిచేసేలా మార్చారు. అవసరమైతే మనుషులతోపాటు జంతువులు, మొక్కల జన్యువుల్లోనూ మార్పులు చేసేలా అన్నమాట. డీఎన్ఏ పోగులను అవసరమైనట్లుగా కత్తిరించడంతోపాటు జోడించే శక్తినీ ఈ పద్ధతికి వీరు చేర్చారు. 2012లో క్రిస్పర్ క్యాస్–9 పద్ధతిని ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు ఆవిష్కరించగా.. శాస్త్రవేత్తలు ఇప్పటికే దీనిద్వారా ఎన్నో అద్భుతమైన ఫలితాలు రాబట్టగలిగారు. ప్రయోజనాలు ఇవీ... ► ఎయిడ్స్ తదితర వ్యాధులకు కారణమైన జన్యువులను సులువుగా తొలగించేందుకు ఈ క్రిస్పర్‌క్యాస్–9 ఉపయోగపడుతుంది. ► మలేరియా వంటి వ్యాధులను నిరోధించగల జన్యువులను దోమల్లోకి ప్రవేశపెట్టడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని అడ్డుకోవచ్చు. ► చైనాలో పాడిపశువుల్లో కండరాలు, వెంట్రుకల ఎదుగుదలను నిరోధించే జన్యువులను క్రిస్పర్ టెక్నాలజీ ద్వారా తొలగించి ఎక్కువ మాంసం, బొచ్చు పెరిగే గొర్రెలను అభివృద్ధి చేశారు. ► కేన్సర్‌కు సరికొత్త చికిత్స కల్పించేందుకు క్రిస్పర్ క్యాస్–9 పరిజ్ఞానాన్ని వాడుకునే ప్రయత్నం జరుగుతోంది. రోగ నిరోధక వ్యవస్థ తాలూకూ కణాల్లో మార్పులు చేయడం ద్వారా అవి కేన్సర్ కణాలను మరింత సమర్థంగా గుర్తించడంతోపాటు, నాశనం చేసేలా చేసేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. ► కరవు కాటకాలను, చీడపీడలను తట్టుకోగల సరికొత్త వంగడాల సృష్టికి క్రిస్పర్ క్యాస్–9 బాగా ఉపయోగపడుతుంది. ► ఒక రకమైన ఈస్ట్‌లో జన్యుపరమైన మార్పులు చేసి అవి చక్కెరలను హైడ్రోకార్బన్లుగా మార్చేలా చేయవచ్చు. ఈ హైడ్రోకార్బన్లతో ప్లాస్టిక్‌ను తయారు చేయవచ్చు. ► మానవ జన్యుక్రమాల్లోనూ మార్పులు చేసేందుకు ఈ టెక్నాలజీని వాడుకునే అవకాశం ఉన్నప్పటికీ దీనిపై పలు దేశాల్లో నిషేధం కొనసాగుతోంది. యూకేలో మానవ పిండాలపై మాత్రమే ప్రయోగాలు చేయవచ్చు. -
భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్
స్టాక్‌హోమ్ : భౌతికశాస్త్రంలో విశేష పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలను 2020సంవత్సరానికి గానూ ప్రఖ్యాత నోబెల్ పురస్కారం వరించింది. అంతరిక్షంలో కృష్ణ బిలం ఎలా ఏర్పాటవుతుందో సూత్రీకరించిన బ్రిటన్ సైంటిస్ట్ రోజర్ పెన్రోజ్, జర్మనీ శాస్త్రవేత్త రీన్‌హర్డ్ గెంజెల్‌తో పాటు పాలపుంత కేంద్రకంపై పరిశోధనలు చేసిన అమెరికన్ ప్రొఫెసర్ అండ్రియా గెజ్‌ను ఈ పురస్కారానికి నోబెల్ కమిటీ మంగళవారం ఎంపిక చేసింది. అవార్డు కింద బంగారు పతకం, కోటి స్వీడిష్ క్రోనార్లు (రూ.8.22 కోట్లు) నగదు లభిస్తుంది. అయితే ఇందులో రోజర్ పెన్రోస్కు సగం పురస్కారాన్ని ఇవ్వగా, మిగత సగాన్ని రిన్హార్డ్, ఆండ్రియాలు పంచుకోనున్నారు. (చదవండి : వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం) BREAKING NEWS: The Royal Swedish Academy of Sciences has decided to award the 2020 #NobelPrize in Physics with one half to Roger Penrose and the other half jointly to Reinhard Genzel and Andrea Ghez. pic.twitter.com/MipWwFtMjz — The Nobel Prize (@NobelPrize) October 6, 2020 -
నింగికేగిన దిగ్గజాలు.. చారిత్రక నిర్ణయాలు..మహిళా విజయాలు
-
2018 : ప్రకృతి విలయాలు.. చారిత్రక ఘటనలు
అనేక ఘటనలు, సంఘటనలు - ఆయా దేశాల్లోని పరిణామాలు ఆందోళన కలిగించాయి. అనేక ఆటుపోటుల మధ్య అంతర్జాతీయంగా 2018 సంవత్సరం పలు చేదు జ్ఞాపకాలను మిగిల్చడంతో పాటు పలు చారిత్రక ఘటనలకు వేదికగా నిలిచింది. కీలకమైన అంతర్జాతీయ పరిణామాలపై సాక్షి రౌండప్...!!! అఫ్గాన్‌లో మారణహోమం (జనవరి 30) అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో తాలిబన్లు మారణహోమం సృష్టించారు. నగరంలో రద్దీగా ఉన్న ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 95 మంది ప్రాణాలు కోల్పోగా 151 మంది గాయపడ్డారు. అంతర్యుద్ధంతో తీవ్రంగా దెబ్బతిన్న కాబూల్‌లో ఇటీవల కాలంలో చోటుచేసుకున్న అతిపెద్ద దాడి ఇదే. స్వీడన్‌తో బంధం బలోపేతం (ఫిబ్రవరి 5) రక్షణ, భద్రత రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, స్వీడన్లు నిర్ణయించాయి. సరికొత్త వ్యూహాత్మక భాగస్వామ్యంతో పటిష్ట సహకారానికి ఇరు దేశాలు అంగీకరించాయి. 5 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈమేరకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఘోర విమాన దుర్ఘటన (మార్చి 13) నేపాల్‌లోని ఖట్మాండు విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఢాకా నుంచి అమెరికాకు బయలుదేరిన బంగ్లాదేశ్ విమానం ఖట్మాండు అంతర్జాతీయ విమానాశ్రయంలో కుప్పకూలింది. ఈ ఘటనలో 50మంది ప్రయాణికులు మరణించారు. విశ్వవిజేత స్టీఫేన్ హాకింగ్ మరణం (మార్చి 14) మన కాలపు మహా మేధావి... ఐన్‌స్టీన్‌కు మాత్రమే సాటిరాగల విజ్ఞానఖని స్టీఫెన్ హాకింగ్ (76) కన్నుమూశారు. ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి ఆద్యుడైన గెలీలియో పుట్టిన జనవరి 8 న జన్మించి, మరో విఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ జన్మదినం రోజైన మార్చి 14న కన్నుమూశారు. విశ్వాంతరాళంలో మనిషిని పోలిన జీవులుండొచ్చునని పదేళ్ల క్రితం జోస్యం చెప్పి వారివల్ల ప్రమాదం ముంచుకు రావొచ్చునని ఆయన హెచ్చరించారు. సిరియాలో మరో విష దాడి (ఏప్రిల్ 8) అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో మరో విష రసాయన దాడి జరిగింది. తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న డౌమా పట్టణంపై జరిగిన ఈ దాడిలో 42 మందికి పైగా ప్రజలు మృత్యువాతపడ్డారు. వందలాది పౌరులు శ్వాస, కంటిచూపు సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తిరుగుబాటుదారులు లక్ష్యంగా సిరియా ప్రభుత్వమే ఈ దారుణానికి పాల్పడిందన్న ఆరోపణలు వచ్చాయి. 257 మంది దుర్మరణం (ఏప్రిల్ 11) ఆఫ్రికా ఖండంలోని ఉత్తరాది దేశమైన అల్జీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబాలతో వెళ్తున్న సైనిక విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 257 మంది మృతిచెందారు. రాజధాని అల్జీర్స్‌కి దగ్గరలోని బౌఫరిక్ సైనిక కేంద్రం నుంచి టేకాఫ్ అయిన విమానం.. సమీపంలోని పొలాల్లో కూలడంతో పెద్ద ఎత్తున మంటలు రేగాయి. ఆ మంటల్లో చాలా మంది సజీవదహనమయ్యారు. కూచిభోట్ల దోషికి జీవిత ఖైదు (మే 6) అమెరికాలోని కన్సాస్ సిటీలో భారతీయ ఇంజనీరు కూచిభొట్ల శ్రీనివాస్ హత్య కేసులో నిందితుడికి యూఎస్ ఫెడరల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. 2017, ఫిబ్రవరి 22 న కన్సాస్‌లోని ఒక బార్లో కూచిభొట్ల, అతని స్నేహితుడిపై.. నిందితుడు ఆడం ప్యూరింటన్ (52) కాల్పులు జరిపాడు. ‘మా దేశం విడిచి వెళ్లండి’ అని అరుస్తూ ఈ ఘాతుకానికి పాల్పడి అక్కడి నుంచి పారిపోయాడు. ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కల్ వివాహం (మే 19) బ్రిటన్ రాజకుమారుడు ప్రిన్స్ హ్యారీ (33), అమెరికా నటి మేఘన్ మార్కల్ (36)లు వివాహం బంధంతో ఒక్కటయ్యారు. కొత్త జంట ప్రిన్స్ హ్యారీ-మేఘన్ మార్కల్‌కు రాణి ఎలిజబెత్ 2 సస్సెక్స్ డ్యూక్, సస్సెక్స్ డచెస్ బిరుదులు ప్రదానం చేశారు. వివాహానికి మన దేశం నుంచి నటి ప్రియాంక చోప్రా, మైనా మహిళా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుహానీ జలోటా, తన ఫౌండేషన్ సభ్యులతో హాజరయ్యారు. ట్రంప్ - కిమ్ చారిత్రాత్మక భేటీ (జూన్ 12) కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్– ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య జరిగిన చరిత్రాత్మక శిఖరాగ్ర సదస్సు విజయవంతమైంది. ట్రంప్ ఆశించినట్లుగానే అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా అంగీకరించగా.. అందుకు ప్రతిగా ఉత్తర కొరియా భద్రతకు అమెరికా నుంచి కిమ్ హామీ పొందారు. సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ (జూన్ 24) కట్టుబాట్లకు మారుపేరైన సౌదీలో దశాబ్దాలుగా మహిళల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధాన్ని ఆ దేశ యువరాజు బిన్ సల్మాన్ ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులు 2018, జూన్ 24 నుంచి అమల్లోకి వచ్చాయి. మహిళల డ్రైవింగ్‌పై నిషేధాన్ని ఎత్తివేయడంతో ఆదివారం తెల్లవారుజామున అధిక సంఖ్యలో మహిళలు కార్లతో రోడ్లపైకి చేరి సంబరాలు చేసుకున్నారు. తొలిసారి డ్రైవింగ్‌కు బయలుదేరినవారికి కొందరు మహిళలు పూలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. నవాజ్ షరీఫ్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష (జూలై 6) అవెన్‌ఫీల్డ్ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. షరీఫ్ తనయ మర్యమ్, అల్లుడు కెప్టెన్ సర్దార్లు కూడా ఈ కేసులో దోషులుగా తేలారు. కానీ సెప్టెంబర్‌లో షరీఫ్ జైలు శిక్షను రద్దు చేసి.. అతన్ని విడుదల చేశారు. నాటో దేశాల సరసన భారత్ (ఆగస్టు 1) భారతదేశానికి వ్యూహాత్మక రక్షణ, హైటెక్ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చే దిశగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌కు వ్యూహాత్మక భాగస్వామ్య హోదా కల్పించే ‘స్ట్రేటజిక్ ట్రేడ్ ఆథరైజేషన్-1 (ఎస్టీఏ- 1)’ ప్రతిపత్తిని మంజూరు చేసింది. ప్రధానంగా ‘నాటో’లోని తన మిత్రదేశాలకు మాత్రమే కల్పించే అవకాశాన్ని తాజాగా భారత్‌కు కూడా వర్తింపచేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. పాక్ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్ (ఆగస్టు 18) పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం, తెహ్రీక్-ఇ-న్సాఫ్ (పీటీఐ) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ 22 వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రకృతి విలయం.. 832 మంది మృతి (సెప్టెంబరు 29) ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో భూకంపం, సునామీ కారణంగా భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ ఘటనలో 832 మంది చనిపోయారు. ప్రజలు భారీగా మృత్యువాత పడిన నేపథ్యంలో అంటువ్యాధులు వ్యాపించకుండా అధికారులు శవాలను సామూహికంగా ఖననం చేశారు. నోబెల్ శాంతి బహుమతి విజేతలు (అక్టోబరు 5) ప్రపంచ వ్యాప్తంగా చెలరేగుతున్న యుద్ధాలు, అంతర్యుద్ధాల కారణంగా కల్లోలంగా మారిన ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న లైంగిక హింసపై అలుపెరుగని పోరాటం జరుపుతున్న... కాంగో వైద్యుడు డెనిస్ మక్వీజ్ (63), ఇరాక్‌లోని యాజిది తెగకు చెందిన యువతి నదియా మురాద్ (25) లకు నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. కాగా డెనిస్ లైంగిక బానిసలకు బాధితులకు అండగా నిలిస్తే నదియా స్వయంగా ఆ బాధలన్నీ అనుభవించారు. మలేసియాలో మరణశిక్ష రద్దు (అక్టోబరు 10) తీవ్రమైన నేరాలకు పాల్పడిన దోషులకు విధించే మరణశిక్షను త్వరలోనే రద్దు చేస్తామని మలేసియా ప్రభుత్వం ప్రకటించింది. ఆ దేశ ప్రధాని మహతీర్ మొహమ్మద్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. మలేసియా ప్రభుత్వ నిర్ణయాన్ని అమ్నెస్టీ ఇంటర్నేషనల్, మానవహక్కుల సంస్థ ‘లాయర్స్ ఫర్ లిబర్టీ’ స్వాగతించాయి. సెనెట్ నీది హౌస్ నాది (నవంబర్ 8) అమెరికా మధ్యంతర ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలొచ్చాయి. ప్రతినిధుల సభ డెమొక్రటిక్ పార్టీ వశం కాగా.. ఎగువ సభ సెనెట్‌లో అధికార రిపబ్లికన్ పార్టీ తన మెజారిటీని నిలబెట్టుకుంది. ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి ముస్లిం మహిళలుగా రషిదా త్లాయిబ్, సోమాలియాకు చెందిన ఇల్హాన్ ఒమర్‌లు గుర్తింపు పొందారు. సీనియర్ బుష్ కన్నుమూత (డిసెంబరు 1) పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెర్బర్ట్ వాకర్ బుష్ (94) శుక్రవారం కన్నుమూశారు. సీనియర్ బుష్‌గా సుపరిచితులైన ఆయన 1989- 1993 మధ్య కాలంలో అమెరికా 41వ అధ్యక్షుడిగా పనిచేశారు. మిస్ వరల్డ్‌గా మెక్సికన్ సుందరి (డిసెంబరు 8) ఈ ఏడాది ప్రపంచ సుందరిగా మెక్సికోకు చెందిన వెనెస్సా పోన్స్ డీ లియోన్ (26) ఎంపికయ్యారు. చైనాలో జరిగిన ఈ అందాల పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన నికోలేనే పిచప లిమ్స్నుకన్ మొదటి రన్నరప్‌గా నిలిచారు. ఇక మిస్ ఇండియా 2018 అనుకృతి వ్యాస్ టాప్ - 30లో చోటు దక్కించుకున్నారు. ఐర్లాండ్‌లో.. ఇక అబార్షన్ చట్టబద్ధం (డిసెంబరు 13) అబార్షన్‌ను చట్టబద్ధం చేస్తూ ఐర్లాండ్ పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేసింది. 80 శాతం క్యాథలిక్‌లు ఉండే ఆ దేశంలో ఇదొక చరిత్రాత్మక నిర్ణయం. కాగా ఆరేళ్ల క్రితం అనారోగ్య కారణాల వల్ల గర్భస్రావానికి అనుమతివ్వాలంటూ భారతీయురాలు సవిత చేసిన విన్నపాన్ని ఐరిష్ ప్రభుత్వం తిరస్కరించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. మిస్ యూనివర్స్‌గా ఫిలిప్పిన్స్ సుందరి (డిసెంబరు 17) మిస్ యూనివర్స్ 2018 కిరీటాన్ని ఫిలిప్పీన్స్ యువతి కాట్రియానా గ్రే సొంతం చేసుకుంది. బ్యాంకాక్‌లో జరిగిన ఫైనల్లో తొలి రన్నరప్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన తామరిన్ గ్రీన్, రెండో రన్నరప్‌గా వెనెజులాకు చెందిన స్టీఫనీ గుటీరెజ్ నిలిచారు. సిరియాపై ట్రంప్ సంచలన ప్రకటన (డిసెంబరు 19) సిరియా నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకుంటున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ‘సిరియాలో ఐఎస్‌ను ఓడించాం. నా అధ్యక్ష కాలంలో పూర్తిచేయాలనుకున్న లక్ష్యం అది’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా సిరియాలో ఐఎస్ సృష్టిస్తున్న అలజడి కారణంగా మారణహోమం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. మృత్యు సునామీ (సాక్షి 2018 రౌండప్) (డిసెంబర్ 23) ఇండోనేషియాను మళ్లీ జల విలయం ముంచెత్తింది. సముద్రం నుంచి ఉప్పెనలా దూకొచ్చిన మృత్యు అలల కారణంగా... ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే దాదాపు 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో వంద మంది జాడ ఇంకా తెలియరాలేదు. ఈ అలల సునామీకి పశ్చిమ జావా, దక్షిణ సుమత్రా దీవులు అతలాకుతలం కాగా 15 వందలకుపైగా క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. -
అణుస్థాయి ఫొటోలు తీశారు
సాక్షి నాలెడ్జ్ సెంటర్: వెయ్యి మాటల్లో చెప్పలేని విషయాన్ని ఒక్క చిత్రంతో చెప్పొచ్చు అంటారు. కంటికి కనిపించే వాటి విషయంలో ఇది నిజమే కానీ.. మైక్రోస్కోప్ వాడినా కంటికి చిక్కని అతి సూక్ష్మమైన వైరస్లు, అణువుల సంగతేంటి? నానోమీటర్ల స్థాయిలో ఉండే వీటిని ముందు చూసి.. ఫొటోలు తీయగలగాలి. అప్పుడే వాటి గురించి స్పష్టమైన అవగాహన కలుగుతుంది. వైరస్లు, బ్యాక్టీరియా వల్ల కలిగే నష్టాలను తగ్గించుకునేందుకు కొత్త మందులను ఆవిష్కరించేందుకు వీలవుతుంది. క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కొపీ విధానాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ గ్రహీతలు జాక్స్ డుబోషే, జొయాకిమ్ ఫ్రాంక్, రిచర్డ్ హెండర్సన్‌లు బయో కెమిస్ట్రీలో సరికొత్త అధ్యాయానికి తెరతీశారు. అతిసూక్ష్మమైన అణువుల చిత్రాలను తీయడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌లు అందుబాటులో ఉన్నా అవి మృత పదార్థాల్లోని అణువుల చిత్రాలు తీసే వరకే పనికొచ్చాయి. పరిశీలించాల్సిన పదార్థాన్ని శూన్యంలో ఉంచడం.. దానిపైకి శక్తిమంతమైన ఎలక్ట్రాన్ కిరణాలను ప్రసారం చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది. అయితే ఎలక్ట్రాన్ కిరణాల శక్తికి జీవాణువులు జీవించి ఉండటం కష్టం. 1990లో రిచర్డ్ హెండర్సన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపుతోనే అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఎలక్ట్రాన్ కిరణాల శక్తిని గణనీయంగా తగ్గించడం ద్వారా ఏడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ల స్పష్టత ఉన్న చిత్రాలను తీయగలిగారు. పదార్థాలను శీతల నైట్రోజన్‌లో ఉంచడం ద్వారా స్పష్టత మరింత పెరిగింది. కొన్ని మార్పుల ద్వారా ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీని అత్యంత స్పష్టమైన చిత్రాలు పొందేందుకు ఉపయోగిం చొచ్చని స్పష్టమైంది. జాక్వెస్ డుబోషే, జోయాకిమ్ ఫ్రాంక్‌లు ఈ మార్పులను ప్రయోగపూర్వకంగా చూపించారు. ఫలితంగా రూపుదిద్దుకున్న సరికొత్త టెక్నాలజీ పేరే క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ. క్రయో అంటే అతి తక్కువ ఉష్ణోగ్రత. ఈ అంశం ఆధారంగా క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ పనిచేస్తుంది. సాధారణ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా 2డీ చిత్రాలనే తీయొచ్చు. పైగా చాలా అస్పష్టంగా ఉంటాయి. ఫ్రాంక్ 1975– 86 మధ్య కాలంలో అభివృద్ధి చేసిన ఇమేజ్ ప్రాసెసింగ్ పద్ధతితో త్రీడీ చిత్రాలు మరింత స్పష్టంగా రావడం మొదలైంది. వేర్వేరు 2డీ చిత్రాలను కలపడం ద్వారా ఇది సాధ్యమైంది. ఇంకోవైపు డుబోషే ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీకి నీటిని జోడించడం ద్వారా క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ టెక్నాలజీని పూర్తిస్థాయికి చేర్చారు. -
‘అణువుల అధ్యయనా’నికి నోబెల్
స్టాక్‌హోం: అతి సూక్ష్మమైన అణువులను ఫొటోలు తీసేందుకు సులువైన, మెరుగైన ‘క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ’అనే పద్ధతిని కనుగొన్నందుకు గాను రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ అవార్డు దక్కింది. ఇందులో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలు జాక్వెస్ డుబోషే, జోయాకిమ్ ఫ్రాంక్, రిచర్డ్ హెండర్సన్లను ఈ అత్యున్నత పురస్కారం వరించింది. ‘ఎలక్ట్రాన్ కిరణాలతో అణువులను ఫొటోలు తీసేందుకు కొత్త పద్ధతిని కనుగొన్న బృందానికి ధన్యవాదాలు’అని నోబెల్ కెమిస్ట్రీ కమిటీ పేర్కొంది. దీంతో పరిశోధకులు ఎంతో సులువుగా జీవ అణువుల త్రీడీ చిత్రాలను తీయొచ్చని కమిటీ తెలిపింది. శాస్త్రవేత్తలు ఇప్పుడు జీవాణువులను ఏ క్షణంలోనైనా నిలిపేసి (ఫ్రీజ్) ఫొటోలు తీసే అవకాశం ఉంటుందని వివరించింది. ఇందుకోసం ఎటువంటి రంగులు కానీ వాటిని ఫ్రీజ్ చేసే పదార్థాలు కానీ వాడాల్సిన అవసరం లేదు. జీవ రసాయన శాస్త్రం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడమే కాకుండా ఫార్మాస్యూటికల్స్ రంగాన్ని అభివృద్ధి చేయొచ్చని పేర్కొంది. ఇలా ఫొటోలు తీయడం ద్వారా సూక్ష్మమైన కణ నిర్మాణాలను, వైరస్‌లను, ప్రొటీన్లను అధ్యయనం చేయొచ్చు. ఇటీవల బ్రెజిల్లో సంచలనం సృష్టించిన జికా వైరస్‌ను ప్రపంచానికి చూపించేందుకు ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ విధానాన్ని వినియోగించారు. అంతేకాదు అల్జీమర్స్ (మతిమరుపు) వ్యాధితో సంబంధం ఉన్న ఎంజైమ్‌ను గుర్తించేందుకు కూడా ఈ విధానాన్నే ఉపయోగించారు. ► జోయాకిమ్ ఫ్రాంక్: జర్మనీకి చెందిన 77 ఏళ్ల ఫ్రాంక్ అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ► రిచర్డ్ హెండర్సన్: స్కాట్లాండ్కు చెందిన 72 ఏళ్ల హెండర్సన్ కేంబ్రిడ్జ్‌లోని ఎంఆర్సీ మాలిక్యులార్ బయాలజీ లేబొరేటరీలో పనిచేస్తున్నారు. 1990లోనే ఓ ప్రోటీన్ త్రీడీ చిత్రాన్ని తయారుచేశారు. ► జాక్వెస్ డుబోషే: స్విట్జర్లాండ్‌కు చెందిన 75 ఏళ్ల జాక్వెస్ యూనివర్సిటీ ఆఫ్ లౌసానే బయోఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. 1980లో నీటిని అతి వేగంగా చల్లబర్చడం వల్ల ద్రవస్థితిలో ఉండగానే గడ్డ కట్టేలా ప్రయోగాలు చేసి విజయవంతమయ్యారు. -
‘సంప్రదాయత’కు నోబెల్ పట్టం
మళ్లీ నోబెల్ బహుమతుల రుతువు వచ్చేసింది. ప్రపంచంలో భిన్నరంగాల్లో అత్యుత్తములను ఎంచి పురస్కారాలను ప్రకటించే ఈ ప్రక్రియ ఎప్పటిలానే వైద్య శాస్త్రంతో ప్రారంభమైంది. ఈసారి ముగ్గురు శాస్త్రవేత్తలు తు యుయు (చైనా), విలి యం కాంప్‌బెల్ (ఐర్లాండ్), సతోషి ఒమురా(జపాన్)లను ఉమ్మడిగా ఆ బహుమతికి ఎంపిక చేశారు. ఈ పురస్కారంతోపాటు నోబెల్ ఎంపిక కమిటీ ఇచ్చే 9.6 లక్షల డాలర్లలో సగభాగం మహిళా శాస్త్రవేత్త యుయు కూ, మిగిలిన సగభాగం మిగిలిన ఇద్దరు శాస్త్రవేత్తలకూ లభిస్తుందని కమిటీ ప్రకటించింది. ఈ ముగ్గురూ వైద్య శాస్త్రంలో చేసిన కృషీ... దాని ఫలితాలూ ఎన్నదగినవి. మానవాళికి పరాన్న జీవుల ద్వారా సంక్రమించే వ్యాధులకు ఈ ముగ్గురూ కొత్త ఔషధాలను కనిపెట్టారు. ఇందువల్ల మలేరియా, ఫైలేరియా, రివర్ బ్ల్రైండ్నెస్ వంటి వ్యాధులను అరికట్టేందుకు వీలైంది. వారి పరిశోధన మూలాలు సంప్రదాయ విధానంలో ఉండటం గమనార్హమైన అంశం. మిగిలిన శాస్త్రాలకూ, వైద్య శాస్త్రానికీ మధ్య మౌలికంగా తేడా ఉంది. మిగిలిన శాస్త్రాల్లో ఏ అంశంపైన అయినా దాదాపు ఏకాభిప్రాయం ఏర్పడుతుంది. కనీసం అనంతరకాలంలో జరిగే పరిశోధనల్లో కొత్త అంశాలు వెల్లడయ్యే వరకూ అప్పటికున్న నిర్ధారణలు కొనసాగుతాయి. వైద్య శాస్త్రంలో అలా కాదు. ఏక కాలంలో సమాంతరంగా వేర్వేరు స్రవంతులుంటాయి. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్టు అల్లోపతి వైద్యం ఆధునిక వైద్య విధానమై...శతాబ్దాలుగా జనావళిలో ప్రబలంగా ఉంటున్న సంప్రదాయ వైద్య విధానాలు, ఇతర చికిత్సా పద్ధతులు ‘ప్రత్యామ్నాయ విధానాలు’గా ముద్రేయించుకుని మిగిలిపోయాయి. ఇవన్నీ సమాంతరంగా కొనసాగుతున్నాయి. సంప్రదాయ వైద్య విధానాలను విస్మరించడంవల్ల అవి తగినంతగా ఎదగలేకపోయాయి. రోగాలను అదుపు చేయడంలో చురుకుదనమూ... శస్త్ర చికిత్సా విధానాలుండటం, నిరంతర పరిశోధనలు అల్లోపతి ప్రధాన స్రవంతి వైద్య విధానంగా మారడానికి దోహదపడ్డాయి. ఆ విధానంలో ఇమిడి ఉండే లాభార్జన కూడా దాని విస్తరణకు తోడ్పడింది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన వైద్య విధానాలు అల్లోపతి దెబ్బకు దాదాపు కొన ఊపిరితో మిగిలాయి. చైనా వైద్య విధానం, యునానీ, హోమియో, ఆయుర్వేదం వంటివి ఇంకా కనిపిస్తున్నాయిగానీ...శతాబ్దాలుగా పరంపరగా వస్తున్న రకరకాల చికిత్సా విధానాలు కనుమరుగవుతున్నాయి. ఇంట్లో దొరికే దినుసులతో, పెరట్లో లభించే మొక్కలు, పూవులు, చెట్ల ఆకులతో, బెరళ్లతో చేసే వైద్యం ఇప్పుడు తెలిసినవారెంతమంది? ఈ పరిస్థితిని ఆసరా చేసుకుని ఆస్పత్రులు జనాన్ని నిలువుదోపిడీ చేస్తున్నాయి. అల్లోపతి వైద్యం అంగడి సరుకైంది. కొనుక్కోగలిగినవారికే ప్రాణాలు దక్కుతాయి. ఇతర శాస్త్రాల్లా కాకుండా వైద్య శాస్త్రం నేరుగా మానవ శరీరంతోనూ, దానికొచ్చే రుగ్మతలతో వ్యవహరించేది కనుక ఆ శాస్త్రంతో మనుషులందరిదీ నిత్యానుబంధం. ఫలితంగా ప్రతివారికీ ఎంతోకొంత అనుభవ జ్ఞానం లభిస్తుంది. మిగిలిన శాస్త్రాల విషయంలో ఇది సాధ్యం కాదు. కానీ పరంపరగా వస్తున్న అనుభవ జ్ఞానాన్ని గుర్తించి, ఆదరించే పాలక వ్యవస్థలున్నప్పుడే అది మరింతగా రాణింపునకు వస్తుంది. యుయుకు అలాంటి ప్రోత్సాహం లభించింది. చైనాలో సాంస్కృతిక విప్లవం ఉధృతంగా సాగుతున్న ఆరో దశకం చివరిలో అప్పటి చైనా కమ్యూనిస్టు పార్టీ చైర్మన్ మావో జెడాంగ్ మలేరియా వ్యాధిని అరికట్టేందుకు నెలకొల్పిన పరిశోధనా ప్రాజెక్టులో పాలుపంచుకోవడంవల్లనే యుయు నోబెల్ పురస్కారానికి అర్హమైన వినూత్న ఆవిష్కరణ చేయగలిగారు. ఆనాడు ఒకపక్క అమెరికా సేనలతో, మరోపక్క దక్షిణ వియత్నాం సేనలతో పోరాడుతున్న తమ సైన్యానికి మలేరియా పెను సమస్యగా మారిందని గుర్తించిన ఉత్తర వియత్నాం ప్రధాని హో చి మిన్...దాన్ని అరికట్టడానికి సాయం చేయమని మావోను అభ్యర్థించారట. ఫలితంగా ఆ ప్రాజెక్టు ఆవిర్భవించింది. ఈ ప్రాజెక్టులో రెండు విభాగాలున్నాయి. మలేరియాను అరికట్టేందుకు అప్పటికే వినియోగిస్తున్న రసాయనాలను మేళవించి కొత్త ఔషధాన్ని కనుగొనడానికి ఒక విభాగం... సంప్రదాయ వైద్య విధానాలపై దృష్టి నిలిపి, మూలికలతో ఔషధాన్ని రూపొందించే పనిలో మరో విభాగం నిమగ్నమయ్యాయి. యుయు నేతృత్వంలోని బృందం శతాబ్దాలుగా వాడుకలో ఉన్న 2,000 రకాల ఔషధ యోగాలను అధ్యయనం చేసి, 640 మూలికల లక్షణాలను జల్లెడపట్టి...క్రీస్తు పూర్వం 340 నాటి తాళపత్రాలను సైతం పరిశోధించి అత్యుత్తమమైన ఆర్టిమేసినిన్ అనే ఔషధాన్ని తయారుచేశారు. అప్పటికే క్లోరోక్విన్, క్వినైన్ వంటి మందులకు లొంగకుండా పోయిన మలేరియా కారక సూక్ష్మజీవి యుయు దెబ్బతో అదుపులోనికొచ్చింది. ఈ మాత్రం మనం చేయలేమా అని వందలాదిమంది శాస్త్రవేత్తలు వేలాది సింథటిక్ సమ్మేళనాలతో రాత్రింబగళ్లు ప్రయోగాలు చేసినా అవన్నీ వ్యర్థంగా మిగిలిపోయాయి. అచ్చం యుయు బృందం తరహాలోనే అమెరికా సాగించిన పరిశోధనలు దారీ తెన్నూ దొరక్క ఆగిపోయాయి. యుయు విశిష్టతేమిటో వీటినిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడామె ఆవిష్కరణ ఏటా లక్షలాదిమంది ప్రాణాలను కాపాడుతోంది. గత పదిహేనేళ్లలో మలేరియా మరణాలు 60 శాతం తగ్గాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది. పాత అంతా చెత్త అని కొట్టిపారేయని తత్వం ఒక కొత్త ఆవిష్కరణకు తావిచ్చింది. బహుశా దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా జనాన్ని సమీకరించి విజయం సాధించిన కమ్యూనిస్టు పార్టీ పాలక వ్యవస్థగా ఉండకపోతే ఇది సాధ్యమయ్యేది కాదేమో! మన ఆయుర్వేదంలో, ఇతర మూలికా వైద్యాల్లో కూడా అపారమైన జ్ఞాన సంపద ఉంది. దాన్ని వెలికితీయగలిగితే, అందుకు అవసరమైన పరిశోధనలకు ప్రోత్సాహమిస్తే మెరుగైన, ప్రామాణికమైన ఔషధాలు అందుబాటులోకి వస్తాయి. యుయు సాధించిన నోబెల్ బహుమతి ఆ దిశగా ఆలోచించడానికి దోహదపడాలని ఆశిద్దాం.