బెన్ బెర్నాంకీ, డగ్లస్ డబ్ల్యూ. డైమండ్, ఫిలిప్ హెచ్. డైబ్‌విగ్
స్టాక్‌హోమ్: తీవ్ర ఆర్థికమాంద్యంలో అతలాకుతలమైన అమెరికా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు అహర్నిశలు కృషిచేసిన అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ మాజీ చైర్మన్ బెన్ బెర్నాంకీని ఆర్థికశాస్త్ర నోబెల్ వరించింది. ఆయనతోపాటు బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలపై కీలక పరిశోధనలు చేసిన మరో ఇద్దరు అమెరికా ఆర్థికవేత్తలు డగ్లస్ డబ్ల్యూ.డైమండ్, ఫిలిప్ హెచ్.డైబ్‌విగ్‌లకు సోమవారం ఆర్థిక నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు.
‘బ్యాంక్‌లు కుప్పకూలకుండా చూసుకోవడం మనకు ఏ విధంగా అత్యంత ముఖ్యమైన అంశం’ అనే దానిపై ఈ ముగ్గురి శోధన కొనసాగిందని స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్స్‌లోని నోబెల్ కమిటీ పేర్కొంది. ఆర్థికవ్యవస్థలను సంస్కరించాలనే పునాదులను ఈ ముగ్గురు 1980 దశకంలోనే వేశారని ఆర్థిక శాస్త్రాల నోబెల్ కమిటీ అధినేత జాన్ హస్‌లర్ చెప్పారు. ‘ ఆర్థిక వ్యవస్థను నిట్టనిలువునా కూల్చేసేవి ముఖ్యంగా రెండే. అవి ఆర్థిక సంక్షోభం, ఆర్థికమాంద్యం. వీటి నివారణ, సమర్థవంతంగా ఎదుర్కోవడం అనే వాటిలో వీరి పరిశోధనలు ఎంతగానో సాయపడనున్నాయి’ అని హస్‌లర్ అన్నారు.
68 ఏళ్ల బెర్నాంకీ ప్రస్తుతం ఒక బ్రోకింగ్ ఇన్‌స్టిట్యూట్ కోసం పనిచేస్తున్నారు. ఈయన 1930లో అమెరికా చవిచూసిన మహామాంద్యం మూలాలపై పరిశోధన చేశారు. ఆనాడు ఆందోళనకు గురైన జనం ఒక్కసారిగా బ్యాంక్‌ల నుంచి మొత్తం నగదును ఉపసంహరించుకుంటుంటే బ్యాంకింగ్ వ్యవస్థలు కుప్పకూలడం, తదనంతరం ఊహించనిస్థాయికి ఆర్థికవ్యవస్థ కుప్పకూలడం లాంటి వాటిపైనా బెర్నాంకీ పరిశోధన చేశారు. అంతకుముందు షికాగో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 68 ఏళ్ల డగ్లస్ డైమండ్, సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 67 ఏళ్ల ఫిలిప్ డైబ్‌విగ్‌లు బ్యాంక్ డిపాజిట్లకు ప్రభుత్వం పూచీకత్తుగా ఉంటే సంక్షుభిత ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఎలా నిలబడగలదో అనే అంశాలపై పరిశోధన కొనసాగించారు.
బ్యాంకింగ్ వ్యవస్థకు సాయపడేలా 1983లోనే డైమండ్, ఫిలిప్ సంయుక్తంగా ‘ బ్యాంక్ రన్స్, డిపాజిట్ ఇన్సూరెన్స్, లిక్విడిటీ’ రచన చేశారు. బెర్నాంకీ 2007–08 కాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలోపెట్టేందుకు స్వల్పకాలిక వడ్డీరేట్లను సున్నాకు తెచ్చారు. ఈయన నేతృత్వంలో ఫెడ్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయాల వల్ల అమెరికా ఆర్థికమాంద్యం నుంచి త్వరగా గట్టెక్కింది. 2020 తొలినాళ్లలో కోవిడ్‌తో కుదేలైన అమెరికా ఆర్థిక వ్యవస్థకు 2020నాటి ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జోరోమ్ పావెల్ సైతం ఇవే నిర్ణయాలను అమలుచేసి వ్యవస్థను మళ్లీ దారిలోపెట్టడం గమనార్హం. 1930నాటి మహామాంద్యం చాలా సంవత్సరాలు తీవ్రస్థాయిలో కొనసాగడానికి గల కారణాలను 1983నాటి పరిశోధనా పత్రంలో బెర్నాంకీ విశదీకరించారు. డిపాజిటర్లు డబ్బంతా బ్యాంక్‌ల నుంచి ఉపసంహరించుకోవడంతో ఆర్థికవ్యవస్థకు కీలకమైన కొత్త రుణాలను మంజూరుచేయలేక బ్యాంక్‌లు కుప్పకూలాయని బెర్నాంకీ కనుగొన్నారు. ఇవి బ్యాంకింగ్ వ్యవస్థను మరింతగా అర్థంచేసుకునేందుకు సాయపడుతున్నాయని నోబెల్ కమిటీ అధినేత హస్‌లర్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment