Central Bank of America
-
Nobel Prize- 2022: ముగ్గురికి ఆర్థిక నోబెల్
స్టాక్‌హోమ్: తీవ్ర ఆర్థికమాంద్యంలో అతలాకుతలమైన అమెరికా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు అహర్నిశలు కృషిచేసిన అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ మాజీ చైర్మన్ బెన్ బెర్నాంకీని ఆర్థికశాస్త్ర నోబెల్ వరించింది. ఆయనతోపాటు బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలపై కీలక పరిశోధనలు చేసిన మరో ఇద్దరు అమెరికా ఆర్థికవేత్తలు డగ్లస్ డబ్ల్యూ.డైమండ్, ఫిలిప్ హెచ్.డైబ్విగ్లకు సోమవారం ఆర్థిక నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు. ‘బ్యాంక్‌లు కుప్పకూలకుండా చూసుకోవడం మనకు ఏ విధంగా అత్యంత ముఖ్యమైన అంశం’ అనే దానిపై ఈ ముగ్గురి శోధన కొనసాగిందని స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్స్‌లోని నోబెల్ కమిటీ పేర్కొంది. ఆర్థికవ్యవస్థలను సంస్కరించాలనే పునాదులను ఈ ముగ్గురు 1980 దశకంలోనే వేశారని ఆర్థిక శాస్త్రాల నోబెల్ కమిటీ అధినేత జాన్ హస్లర్ చెప్పారు. ‘ ఆర్థిక వ్యవస్థను నిట్టనిలువునా కూల్చేసేవి ముఖ్యంగా రెండే. అవి ఆర్థిక సంక్షోభం, ఆర్థికమాంద్యం. వీటి నివారణ, సమర్థవంతంగా ఎదుర్కోవడం అనే వాటిలో వీరి పరిశోధనలు ఎంతగానో సాయపడనున్నాయి’ అని హస్లర్ అన్నారు. 68 ఏళ్ల బెర్నాంకీ ప్రస్తుతం ఒక బ్రోకింగ్ ఇన్స్టిట్యూట్ కోసం పనిచేస్తున్నారు. ఈయన 1930లో అమెరికా చవిచూసిన మహామాంద్యం మూలాలపై పరిశోధన చేశారు. ఆనాడు ఆందోళనకు గురైన జనం ఒక్కసారిగా బ్యాంక్‌ల నుంచి మొత్తం నగదును ఉపసంహరించుకుంటుంటే బ్యాంకింగ్ వ్యవస్థలు కుప్పకూలడం, తదనంతరం ఊహించనిస్థాయికి ఆర్థికవ్యవస్థ కుప్పకూలడం లాంటి వాటిపైనా బెర్నాంకీ పరిశోధన చేశారు. అంతకుముందు షికాగో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 68 ఏళ్ల డగ్లస్ డైమండ్, సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 67 ఏళ్ల ఫిలిప్ డైబ్విగ్లు బ్యాంక్ డిపాజిట్లకు ప్రభుత్వం పూచీకత్తుగా ఉంటే సంక్షుభిత ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఎలా నిలబడగలదో అనే అంశాలపై పరిశోధన కొనసాగించారు. బ్యాంకింగ్ వ్యవస్థకు సాయపడేలా 1983లోనే డైమండ్, ఫిలిప్ సంయుక్తంగా ‘ బ్యాంక్ రన్స్, డిపాజిట్ ఇన్సూరెన్స్, లిక్విడిటీ’ రచన చేశారు. బెర్నాంకీ 2007–08 కాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలోపెట్టేందుకు స్వల్పకాలిక వడ్డీరేట్లను సున్నాకు తెచ్చారు. ఈయన నేతృత్వంలో ఫెడ్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయాల వల్ల అమెరికా ఆర్థికమాంద్యం నుంచి త్వరగా గట్టెక్కింది. 2020 తొలినాళ్లలో కోవిడ్‌తో కుదేలైన అమెరికా ఆర్థిక వ్యవస్థకు 2020నాటి ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జోరోమ్ పావెల్ సైతం ఇవే నిర్ణయాలను అమలుచేసి వ్యవస్థను మళ్లీ దారిలోపెట్టడం గమనార్హం. 1930నాటి మహామాంద్యం చాలా సంవత్సరాలు తీవ్రస్థాయిలో కొనసాగడానికి గల కారణాలను 1983నాటి పరిశోధనా పత్రంలో బెర్నాంకీ విశదీకరించారు. డిపాజిటర్లు డబ్బంతా బ్యాంక్‌ల నుంచి ఉపసంహరించుకోవడంతో ఆర్థికవ్యవస్థకు కీలకమైన కొత్త రుణాలను మంజూరుచేయలేక బ్యాంక్‌లు కుప్పకూలాయని బెర్నాంకీ కనుగొన్నారు. ఇవి బ్యాంకింగ్ వ్యవస్థను మరింతగా అర్థంచేసుకునేందుకు సాయపడుతున్నాయని నోబెల్ కమిటీ అధినేత హస్లర్ అభిప్రాయపడ్డారు. -
స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులు
►నష్టాల్లో ముగిసిన సూచీలు ►ఫెడ్ నిర్ణయం కోసం ఎదురుచూపు ముంబై: అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని వెల్లడించనున్న నేపథ్యంలో బుధవారం ప్రపంచ మార్కెట్ల బాటలోనే భారత్ సూచీలు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనై..చివరకు స్వల్పనష్టాలతో ముగిసాయి. 32,499–32,383 పాయింట్ల మధ్య కదలిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 1.86 పాయింట్ల నష్టంతో 32,400.51 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. 10,171–10,134 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు గురైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 6.40 పాయింట్ల నష్టంతో 10,141.15 పాయింట్ల వద్ద ముగిసింది.ఆసియా, యూరప్ దేశాల సూచీలు కూడా ఇదేరీతిలో బలహీనంగా ముగిసాయని విశ్లేషకులు చెప్పారు. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11.30 గంటలకు ఫెడ్ నిర్ణయం వెలువడుతుంది. ఫెడ్ మీట్ నేపథ్యంలో వరుసగా రెండోరోజు భారత్ సూచీలు దాదాపు ఫ్లాట్‌గా ముగిసాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రేట్ల సవరణ, పెట్రోలియం ఉత్పత్తుల్ని జీఎస్టీలోకి తీసుకువచ్చే ప్రతిపాదనలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టినిలిపారని ఆయన వివరించారు. టెలికం షేర్లలో చురుగ్గా ట్రేడింగ్..: ఇంటర్ కనెక్టివిటీ ఛార్జీల్లో భారీ కోత విధించిన నేపథ్యంలో బుధవారం టెలికం షేర్లు చురుగ్గా ట్రేడయ్యాయి. సెన్సెక్స్–30 షేర్లలో అధికంగా డాక్టర్ రెడ్డీస్ లాబ్ షేరు 3.33% పెరిగింది. -
అమెరికా ఫెడ్ వడ్డీరేటు యథాతథం
న్యూయార్క్: అమెరికా సెంట్రల్ బ్యాంక్... ఫెడరల్ రిజర్వ్.. ఫండ్ రేటు యథాతథంగా కొనసాగనుంది. ప్రస్తుతం ఈ రేటు 1–1.25 శాతం శ్రేణిలో ఉంది. మంగళ, బుధవారాల్లో కీలక విధాన సమావేశం నిర్వహించిన ఫెడ్ తాజా నిర్ణయం తీసుకుంది. అమెరికాలో వెలువడుతున్న ఆర్థిక గణాంకాల హెచ్చుతగ్గులు...కీలక వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించడానికి ఒక కారణంగా భావిస్తున్నారు. కఠిన విధానమే... భారత్ కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11.30కి వెలువడిన ఫెడ్ ప్రకటన ప్రకారం... అక్టోబర్ నుంచి సెంట్రల్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ తగ్గింపు ప్రక్రియను మొదలు పెడుతుంది. వ్యవస్థ నుంచి లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) ఉపసంహరణ దీని ఉద్దేశం. ఈ ఏడాది డిసెంబర్లో మరో విడత రేటు పెంపు ఉంటుందని, వచ్చే ఏడాది ఈ పెంపు మూడు దఫాలుగా జరగవచ్చన్న సంకేతాల్ని ఫెడ్ కమిటీలో అధికశాతం సభ్యులు వెలిబుచ్చారు. ఆయా అంశాల నేపథ్యంలో అమెరికాలో ద్రవ్యోల్బణం సమీపకాలంలో 2శాతం లోపే ఉండవచ్చని ఫెడ్ అంచనావేసింది. 2017లో స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 2.4 శాతంగా ఉంటుందని పేర్కొంది. ఇంతక్రితం ఈ రేటు అంచనా 2.2 శాతం. వచ్చే ఏడాది 2.1 శాతంగా అంచనావేసింది. అమెరికా ఆర్థిక వృద్ధి లక్ష్యంగా 2008 ఆర్థిక సంక్షోభ సమయంలో 0–0.25 శాతం శ్రేణికి తగ్గినడ్డీరేటును ఏడాది నుంచీ ఫెడ్ క్రమంగా పెంచుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. -
పసిడిపై ఫెడ్ నీడ..!
న్యూయార్క్/ముంబై: అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడరల్ రిజర్వు తన ఫండ్ రేటును పెంచుతుందనే అంచనాలకు అనుగుణంగా పసిడి ధర కొనసాగుతోంది. స్టాక్ మార్కెట్ల అనిశ్చితి కన్నా, ఫెడరల్ రిజర్వ్ రేటును పెంచుతుందన్న అంచనాలే పసిడిని సమీప కాలంలో ప్రభావితం చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి బంగారం ధర ఈ ఏడాది ఇప్పటికే 24 శాతానికి పైగా ఎగసింది. దీంతో కొంత లాభాల స్వీకరణ కూడా జరిగింది. దీంతో ప్రస్తుతం కొన్నాళ్లు కన్సాలిడేషన్ దశ కొనసాగవచ్చని గోల్డ్ న్యూస్‌లెటర్ ఎడిటర్ బ్రయిన్ లూండిన్ అభిప్రాయపడ్డారు. డాయిష్ బ్యాంక్‌పై అమెరికా న్యాయశాఖ భారీ జరిమానా విధించటంతో ఆ స్టాక్ భారీగా నష్టపోయింది. దీంతో స్టాక్ మార్కెట్లూ నష్టాల పాలై అనిశ్చితిలో ఉన్నాయి. వీటివల్ల స్వల్ప ఒడిదుడుకులున్నప్పటికీ సమీప కాలంలో పసిడి అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్- నెమైక్స్‌లో ఔన్స్‌కు 1,300 - 1,345 డాలర్ల మధ్య కొనసాగే అవకాశాలు ఉన్నాయని కమోడిటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. వారంలో ఇలా...: వారంలో పసిడి ధర న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో ఔన్స్‌కు 23 డాలర్లు తగ్గి, 1,318 వద్ద ముగిసింది. దేశీయంగానూ అంతర్జాతీయ ప్రభావం కనబడింది. ముంబై ప్రధాన మార్కెట్లో పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.220 తగ్గి రూ.31,350కి చేరింది.