పసిడిపై ఫెడ్ నీడ..!
న్యూయార్క్/ముంబై: అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడరల్ రిజర్వు తన ఫండ్ రేటును పెంచుతుందనే అంచనాలకు అనుగుణంగా పసిడి ధర కొనసాగుతోంది. స్టాక్ మార్కెట్ల అనిశ్చితి కన్నా, ఫెడరల్ రిజర్వ్ రేటును పెంచుతుందన్న అంచనాలే పసిడిని సమీప కాలంలో ప్రభావితం చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి బంగారం ధర ఈ ఏడాది ఇప్పటికే 24 శాతానికి పైగా ఎగసింది. దీంతో కొంత లాభాల స్వీకరణ కూడా జరిగింది. దీంతో ప్రస్తుతం కొన్నాళ్లు కన్సాలిడేషన్ దశ కొనసాగవచ్చని గోల్డ్ న్యూస్‌లెటర్ ఎడిటర్ బ్రయిన్ లూండిన్ అభిప్రాయపడ్డారు. డాయిష్ బ్యాంక్‌పై అమెరికా న్యాయశాఖ భారీ జరిమానా విధించటంతో ఆ స్టాక్ భారీగా నష్టపోయింది.
దీంతో స్టాక్ మార్కెట్లూ నష్టాల పాలై అనిశ్చితిలో ఉన్నాయి. వీటివల్ల స్వల్ప ఒడిదుడుకులున్నప్పటికీ సమీప కాలంలో పసిడి అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్- నెమైక్స్‌లో ఔన్స్‌కు 1,300 - 1,345 డాలర్ల మధ్య కొనసాగే అవకాశాలు ఉన్నాయని కమోడిటీ నిపుణులు అంచనా వేస్తున్నారు.
వారంలో ఇలా...: వారంలో పసిడి ధర న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో ఔన్స్‌కు 23 డాలర్లు తగ్గి, 1,318 వద్ద ముగిసింది. దేశీయంగానూ అంతర్జాతీయ ప్రభావం కనబడింది. ముంబై ప్రధాన మార్కెట్‌లో పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.220 తగ్గి రూ.31,350కి చేరింది.