ఫెడ్‌ భేటీ,కొరియాపై దృష్టి! | 'Markets to take cues from Fed meet, geo-political developments' | Sakshi
Sakshi News home page

ఫెడ్‌ భేటీ,కొరియాపై దృష్టి!

Published Mon, Sep 18 2017 1:23 AM | Last Updated on Mon, Oct 1 2018 5:28 PM

ఫెడ్‌ భేటీ,కొరియాపై దృష్టి! - Sakshi

ఫెడ్‌ భేటీ,కొరియాపై దృష్టి!

► ఉత్తర కొరియా ఉద్రిక్తతల ప్రభావం
► ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశ ఫలితం
► మూడు కొత్త కంపెనీల లిస్టింగ్‌
► ఈ నెల 20 నుంచి ఎస్‌బీఐ లైఫ్‌ ఐపీఓ


కొరియా ప్రాంతంలో చెలరేగుతున్న ఉద్రిక్తతలు ఈ వారం స్టాక్‌మార్కెట్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపించనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశ ఫలితం కూడా స్టాక్‌ మార్కెట్‌ గమనాన్ని నిర్దేశిస్తుందని వారంటున్నారు. ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు కూడా కీలకం కానున్నాయని విశ్లేషకులంటున్నారు. ఇక రెండో క్వార్టర్‌కు సంబంధించిన కరంట్‌ అకౌంట్‌ గణాంకాలను ప్రభుత్వం ఈ వారంలోనే వెలువరిస్తుంది.  కొరియా పరిణామాలతో ముడిపడిన భౌగోళిక ఉద్రిక్తతలు ఈ వారం కీలకం కానున్నాయని కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీనియర్‌ వైస్‌–ప్రెసిడెంట్‌ శిబానీ కురియన్‌ చెప్పారు.

గత వారంలో ఉత్తర కొరియా జపాన్‌ మీదుగా మరో క్షిపణిని ప్రయోగించిన విషయం తెలిసిందే.  అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీలు ముఖ్యంగా ముడి చమురు ధరల గమనం కూడా స్టాక్‌ సూచీల కదలికలను ప్రభావితం చేస్తుందని కురియన్‌ అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ముగింపుకు వచ్చిన నేపథ్యంలో రానున్న వారాల్లో మార్కెట్‌ దృష్టి కంపెనీల ఆర్థిక ఫలితాల రికవరీపై ఉంటుందని వివరించారు. కొరియాతో చర్చలు జరిగితే సానుకూల ప్రభావం ఉంటుందని, మరో క్షిపణి ప్రయోగం జరిగితే అది పూర్తి స్థాయి యుద్ధానికి దారితీస్తుందని ట్రేడ్‌బుల్స్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ధ్రువ్‌ దేశాయ్‌ చెప్పారు.  

ఫెడ్‌ వ్యాఖ్యల ప్రాధాన్యం....
అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల పెంపు విషయమై తీసుకునే నిర్ణయం ఈ వారం మార్కెట్‌కు కీలకం కానున్నదని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ హెడ్‌(రీసెర్చ్‌) వినోద్‌ నాయర్‌ చెప్పారు. అమెరికాలో అర్థిక పరిస్థితులు మెరుగుపడిన నేపథ్యంలో 25 బేసిస్‌ పాయింట్ల రేట్ల పెంపు తప్పదని, అయితే భవిష్యత్‌ రేట్ల పెంపుపై ఫెడ్‌ సమావేశం వ్యాఖ్యలు కీలకం కానున్నాయని జైఫిన్‌  ఆడ్వైజర్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ దేవేంద్ర నేవ్‌గి చెప్పారు. 21న ఫెడ్‌ సమావేశం నిర్ణయం వెలువడనుంది.

ఈ వారంలోనే ఎస్‌బీఐ లైఫ్‌ ఐపీఓ
ఈ వారంలో రెండు కంపెనీలు ఐపీఓలు ఉండగా, మూడు కంపెనీలు స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌కానున్నాయి. నేడు (సోమవారం) డిక్సన్‌ టెక్నాలజీస్, భారత్‌ రోడ్‌ నెట్‌వర్క్‌ కంపెనీల షేర్లు స్టాక్‌ మార్కెట్లో లిస్టవుతాయి. ఈ రెండు ఐపీఓలు ఈ నెల 8న ముగిశాయి. డిక్సన్‌ టెక్నాలజీస్‌ ఇష్యూ ధర రూ.1,766గా, భారత్‌ రోడనెట్‌వర్క్‌ తన ఇష్యూ ధరను రూ.205గా నిర్ణయించాయి. ఈ నెల 21న(గురువారం)మాట్రిమోనిడాట్‌కామ్‌ స్టాక్‌ మార్కెట్లో లిస్టవనున్నది.

ఇక ఈ నెల 20న(బుధవారం) ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) మొదలవుతుంది. ఈ నెల 22న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.8,400 కోట్లు సమీకరించనున్నది. ఈ ఐపీఓ ధరల శ్రేణి రూ.685–700. అర్హులైన ఉద్యోగులకు ఒక్కో షేర్‌కు రూ.68 డిస్కౌంట్‌ లభిస్తుంది. కనీసం 21 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇక గత శుక్రవారం ప్రారంభమైన ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఐపీఓ 19న(మంగళవారం) ముగియనున్నది.

రూ.3,000 కోట్ల విదేశీ స్టాక్‌ పెట్టుబడులు వెనక్కి
విదేశీ ఇన్వెస్టర్ల స్టాక్‌ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. ఈ నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ.3,000 కోట్ల మేర పెట్టుబడులను స్టాక్‌ మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్నారు. ఉత్తర కొరియా ఉద్రిక్తతలు, అంతంత మాత్రంగానే ఉన్న కంపెనీల క్యూ1 ఫలితాలు దీనికి కారణాలని నిపుణులంటున్నారు.

ఈ ఏడాది ఆగస్టులో స్టాక్‌ మార్కెట్‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.12,770 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారని, దీనికి కొనసాగింపుగా ఈ నెలలో కూడా స్టాక్‌ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయని వారంటున్నారు. డిపాజిటరీల తాజా గణాంకాల ప్రకారం.., ఈ నెల 15 వ తేదీ వరకూ విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్‌ మార్కెట్‌ నుంచి రూ.3,085 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోగా, డెట్‌ మార్కెట్లో మాత్రం రూ.3,051 కోట్లు పెట్టుబడులు పెట్టారు.  మొత్తం మీద ఈ ఏడాదిలో స్టాక్‌ మార్కెట్లో విదేశీ పెట్టుబడులు రూ.45,099 కోట్లుగా ఉన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement