ముంబై: సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ స్టాక్ మార్కెట్‌ను మెప్పించకలేకపోయింది. మౌలిక వసతుల రంగానికి అంచనాల కంటే తక్కువ కేటాయింపులు, ఆదాయం పన్ను శ్లాబులు య«థాతథంగా కొనసాగింపు నిర్ణయాలు నిరాశపరిచాయి. మరోవైపు ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య పాలసీ నిర్ణయాల వెల్లడి సందర్భంగా చైర్మన్ పావెల్ ఈ మార్చిలోనూ కీలక వడ్డీ రేట్ల తగ్గింపు ఉండకపోవచ్చనే సంకేతాలిచ్చారు. ఇన్వెస్టర్లు క్యాపిటల్ గూడ్స్, మెటల్, రియల్టీ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ఫలితంగా సెన్సెక్స్ 107 పాయింట్లు నష్టపోయి 71,645 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 28 పాయింట్లు దిగివచ్చి 21,698 వద్ద నిలిచింది.
ఇంట్రాడేలో ఒడిదుడుకులు...
సార్వత్రిక ఎన్నికల ముందు ప్రజాకర్షక బడ్జెట్ ఉండొచ్చనే అంచనాలతో ఉదయం స్టాక్ మార్కెట్ లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ 247 పాయింట్లు పెరిగి 71,999, నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 21,781 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. జనరంజక బడ్జెట్ సమర్పణ ఆశలతో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగ సమయం(గంటసేపు)లో సెన్సెక్స్ 400 పాయింట్లు పెరిగి 72,151 వద్ద, నిఫ్టీ 107 పాయింట్లు బలపడి 21,833 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. అయితే స్టాక్ మార్కెట్‌కు ఉత్సాహాన్నిచ్చే ప్రకటలేవీ వెలువడకపోవడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ పాల్పడ్డారు. ఫలితంగా ఆరంభ లాభాలు కోల్పోయిన సూచీలు చివరికి నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 576 పాయింట్ల పరిధిలో నిఫ్టీ 174 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.
మార్కెట్లో మరిన్ని సంగతులు
► బడ్జెట్ ప్రకటన రోజు గత ఆరేళ్లలో స్టాక్ మార్కెట్ నాలుగు పర్యాయాలు లాభపడగా., రెండుసార్లు నష్టాలు చవిచూసింది. 2023, 2022, 2021, 2019 ఏడాదిల్లో పెరిగింది. కాగా, 2020, 2024 ఏడాదిల్లో పతనాన్ని చవిచూసింది.
► బాండ్లపై రాబడులు తగ్గడంతో ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. పీఎస్‌బీ, ఐఓబీ, యూకో బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ షేర్లు 7–5%, కెనరా బ్యాంక్, పీఎన్‌బీ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ షేర్లు 4–3% పెరిగాయి. మహారాష్ట్ర బ్యాంక్, ఎస్‌బీఐలు 2–1% లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 3.11% లాభపడింది.
► రైల్వే సంబంధిత స్టాకులు ఆరంభ లాభాలు కోల్పోయి నష్టాలు మూటగట్టుకున్నాయి. ఇర్కాన్ 3.69%, రైల్వే వికాస్ నిగమ్ 3.49%, రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 3%, జుపిటర్ వేగన్స్ 2% పతనమమయ్యాయి. ఐఆర్‌సీటీసీ 1.50%, టెక్స్‌మాకో రైల్ ఇంజనీరింగ్, టిటాఘర్ రైల్వే సిస్టమ్స్ 1% నష్టపోయాయి.
► చరిత్రాత్మకంగా పరిశీలిస్తే మధ్యంతర బడ్జెట్ వేళ ఈక్విటీ మార్కెట్లు పెద్దగా స్పందించలేదు. ఈ ఏడాది అదే పునరావృతమైంది. మూలధన వ్యయాలకు కేటాయింపుల స్వల్ప పెంపు, ద్రవ్య లోటు 5.5% నుంచి 5.1%కి తగ్గింపు లక్ష్యం మినహా ఉత్సాహాన్నిచ్చే ఇతర ప్రకటలేవీ వెలువడలేదు. ప్రసంగం తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే వరకు వడ్డీరేట్ల తగ్గింపు యోచన సముచితంకాదని ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలతో అమెరికా పదేళ్ల బాండ్లపై రాబడులు 4% పెరగడం ప్రతికూల ప్రభావం చూపింది
– యస్ సెక్యూరిటీస్ ఎండీ అమర్ అంబానీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బాధ్యతాయుత, వినూత్న, సమిళిత మధ్యంతర బడ్జెట్‌ను సమరి్పంచారు. ఆర్థిక ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ., ప్రైవేట్ మూల పెట్టుబడులకు అవకాశం కల్పించారు. జాతీయ ప్రాముఖ్యతలున్న రంగాల వృద్ధికి మరోసారి పటిష్ట పునాదులు వేశారు’’
– బీఎస్‌ఈ ఎండీ సుందరరామన్ రామమూర్తి
Comments
Please login to add a commentAdd a comment