
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టే మరో బడ్జెట్ వెలుగు చూసేది రేపే. ఈ బడ్జెట్ పై ఇప్పటికే గణనీయమైన అంచనాలున్నాయి. ఇదొక విప్లవాత్మకమైన బడ్జెట్ అవుతుందనే మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గత 13 నెలలుగా ఎడతెరిపి లేకుండా షేర్లను అమ్ముకుంటూ మన మార్కెట్ కు చుక్కలు చూపిస్తున్న విదేశీ మదుపర్లు.. ఈసారి బడ్జెట్ ప్రత్యేక దృష్టి పెడతారనడంలో సందేహం లేదు. గత జనవరి నుంచి చూస్తే ఈ జనవరి చివరికి వీళ్ళు దాదాపు రూ. 3.80 లక్షల కోట్ల షేర్లను విక్రయించి మన మార్కెట్ కు గట్టి నష్టాన్నే కలిగించారు.
వీళ్ళ పయనం ఇదేమాదిరి కొనసాగకూడదంటే ఆర్ధిక మంత్రి మార్కెట్ ఫోకస్ తో కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలను వెలువరించాల్సి ఉంటుంది. 2024 -25 ఆర్ధిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు నాలుగేళ్ల కనిష్ట స్థాయి అయిన 6.3-6.8% నమోదుకావొచ్చని అంచనా. ప్రపంచ అస్థిర, అనిశ్చిత వాతావరణంతో మన ఆర్ధిక వ్యవస్థ సైతం ఇబ్బందులు పడుతోంది. వినియోగదారుల విశ్వాసం సన్నగిల్లింది. ప్రభుత్వం ఒత్తిడిలో ఉందన్న విషయం ఇది చెప్పకనే చెబుతోంది.
ఈనేపథ్యలో స్టాక్ మార్కెట్ విశ్వాసాన్ని పెంచే, ఇన్వెస్టర్ల మనసు చూరగొనే అంశాలపై ఈసారి బడ్జెట్ లో దృష్టి సారించాల్సిందే. గత నాలుగు రోజులుగా మార్కెట్లో ప్రీ-బడ్జెట్ ర్యాలీ నడుస్తోంది. దానికి తోడు శుక్రవారం వెలువడ్డ ఆర్ధిక సర్వే మార్కెట్ కు ఉత్సాహాన్నే ఇచ్చింది. దీన్ని నిజం చేస్తూ బడ్జెట్ సాగాల్సిన అవసరం ఉంది. మరి మార్కెట్ సెంటిమెంట్ ను ఈ బడ్జెట్ మెరుగుపరుస్తుందా... నివ్వెరపరుస్తుందా? అన్నది రేపు ఎటూ తేలిపోతుంది.
⇒ పన్నుల విధానంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని మార్కెట్ వర్గాలు గట్టిగానే పట్టుబడుతున్నాయి.
⇒ దీర్ఘ కాలిక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లో సమూల మార్పులు తీసుకు రావాలని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి. ప్రస్తుతం దీర్ఘకాలిక లాభాలు అనేవి మూడేళ్లకు పైబడితేనే పన్నురహితంగా ఉంటున్నాయి. అలాగే డివిడెండ్లను కూడా మామూలు ఆదాయంగానే పరిగణించి పన్ను విధిస్తున్నారు. ఇలా చేయడం రెండుసార్లు పన్ను విధించడమే అవుతుందని, డివిడెండ్ ఆదాయాన్ని పన్నులనుంచి మినహాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
⇒ షేర్ల లావాదేవీలపై విధించే పన్నును తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ లావాదేవీల పన్నును ప్రస్తుతమున్న 0.625% నుంచి తగ్గిస్తే డెరివేటివ్స్ లావాదేవీలు ఊపందుకుంటాయనే వాదనలు వినిపిస్తున్నాయి. కాకపోతే ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూరే మార్గాల్లో ఇదొకటి. కాబట్టి ప్రభుత్వం దీనిపై ఎంతవరకు పాజిటివ్ గా స్పందిస్తుంది అన్నది సందేహమే.
⇒ ఈ రెండూ జరిగితే మార్కెట్ సెంటిమెంట్ పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మార్కెట్లో లిక్విడిటీ పెరిగి రిటైల్, సంస్థాగత ఇన్వెస్టర్లు మరిన్ని పెట్టుబడులతో ముందుకొస్తారు.⇒ మరోపక్క మౌలిక రంగానికి కేటాయించే నిధులు మార్కెట్ కు ఉత్సాహాన్ని ఇస్తాయి. రోడ్లు, రైల్వేలు , రక్షణ రంగాలకు కేటాయింపులు పెంచితే సదరు నిధులు వినియోగాన్ని విస్తృతం చేస్తుంది. ముఖ్యంగా సిమెంట్, నిర్మాణ రంగాల్లో వినియోగం పెరగడం ద్వారా ఆయా రంగాలకు చెందిన షేర్లకు డిమాండ్ పెరుగుతుంది.
⇒ ఇక తయారీ, వ్యవసాయం, విద్యుత్ వాహనాలు వంటి రంగాలకు తగిన ప్రోత్సాహకాలను ప్రకటించడం, పాలసీ పరంగా సంస్కరణలు తీసుకురావడం ప్రధానం. విధానపరమైన నిర్ణయాలు సంబంధిత రంగాల షేర్లపై మదుపరులకు మక్కువ పెంచుతాయి. తద్వారా తయారీ రంగంలో సెంటిమెంట్ పెరుగుతుంది.
⇒ సబ్సిడీలు లేదా సంస్కరణలు వ్యవసాయ, అగ్రి బిజినెస్ రంగంలో కొత్త మార్పులను తీసుకొచ్చి ఆ రంగాల్లో డిమాండ్ పెంచుతాయి. దీర్ఘ కాలిక వృద్ధికి ప్రోత్సాహమిచ్చే ఇటువంటి చర్యలకు మార్కెట్లు ఆటోమేటిక్ గానే పాజిటివ్ గా రియాక్ట్ అవుతాయి.
భారత ఆర్ధిక రంగానికి సంబంధించినంతవరకు బడ్జెట్ అనేది ఒక ప్రధాన సంఘటన. పన్ను సంస్కరణలు, రాబడులు, వ్యయాలు, ఆయా రంగాలకు కేటాయింపులు, విధానపరమైన నిర్ణయాలు, అనుకూల/ప్రతికూల అంశాలు.. ఇత్యాది అంశాల సమాహారమే బడ్జెట్. మార్కెట్ వర్గాలకు బడ్జెట్ రుచించకపోతే భారీగా పడగొట్టేస్తారు. నచ్చిందా నెత్తిన పెట్టుకుంటారు. ప్రస్తుతం గత రెండు, మూడు రోజులుగా మార్కెట్లో ప్రీ-బడ్జెట్ ర్యాలీ కనిపిస్తోంది. తాజా బడ్జెట్ అంచనాలను చేరుకోకపోతే మాత్రం దాని పరిణామాలు మామూలుగా ఉండవు.
ఇప్పటికే నిక్కు నీలుగుతున్న మార్కెట్ మరింత పడిపోవడం ఖాయం. దూరమవుతున్న విదేశీ ఇన్వెస్టర్లు ఇంకా ఎంత చేటు చేయాలో అంతా చేసేస్తారు. అదే సమయంలో చిన్న ఇన్వెస్టర్లు మార్కెట్లోకి రాలేని పరిస్థితి ఎదురవుతుంది. ఫలితంగా పడిపోయే మార్కెట్లు దేశ ఆర్ధిక వ్యవస్థపై పెనుప్రభావం చూపిస్తాయి. ఆర్ధిక మంత్రికి ఈవిషయాలన్నీ తెలియనివి ఏమీ కావు. అందరినీ మెప్పించే నిర్ణయాలతోనే ముందుకెళ్తారని ఆశిద్దాం. కొద్ది గంటలు ఓపిక పట్టి చూద్దాం... ఏం జరుగుతుందో...