స్థూల ఆర్థిక గణాంకాలు, విదేశీ పెట్టుబడులపైనా కన్ను
ఇదే వారంలో జూలై ఎఫ్‌అండ్‌ఓ కాంట్రాక్టుల ముగింపు
బడ్జెట్ అంచనాలు అందుకుంటే మార్కెట్‌కు మరింత స్థిరత్వం
ఈ వారం సూచీల గమనంపై నిపుణుల అంచనా
ముంబై: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు సమగ్ర బడ్జెట్– 2024కు అనుగుణంగానే ఈ వారం స్టాక్ మార్కెట్ కదలాడవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అలాగే కార్పొరేట్ కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాలపైనా మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చు.
జూలై డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు (గురువారం), ఆయా దేశాల స్థూల ఆర్థిక గణాంకాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చంటున్నారు. వీటితో పాటు ప్రపంచ మార్కెట్ల గమనం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, రూపాయి ట్రేడింగ్, క్రూడ్ కదలికలు తదితర సాధారణ అంశాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది.
మార్కెట్‌పై బడ్జెట్ ప్రభావమెంత..?
ఎన్‌డీఏ 3.0 ప్రభుత్వం ఈ జూలై 23న (మంగళవారం) ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్ కోసం మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఆర్థిక లోటు, మూలధన వ్యయాలు, సామాజిక వ్యయాల కేటాయింపుల మధ్య సమతుల్యత చేకూర్చే దిశగా ప్రభుత్వం ప్రయతి్నస్తుండటంతో ఈసారి ‘పారిశ్రామిక అనుకూల బడ్జెట్’ను నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉద్యోగ కల్పన, మేక్ ఇన్ ఇండియా, గ్రీన్ ఎనర్జీ, పట్టణ, గ్రామీణాభివృద్ధి అంశాలపై దృష్టి సారించే వీలుంది. అలాగే ‘దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను’పై ప్రకటన కోసం దేశీయ విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘‘బడ్జెట్ అంచనాలను అందుకుంటే, మార్కెట్‌కు మరింత స్థిరత్వం లభిస్తుంది. రక్షణ, రైల్వే, మౌలిక రంగ షేర్లలో కదలికలు అధికంగా ఉండొచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌పై దృష్టి
మార్కెట్ ముందుగా గత వారాంతాన వెల్లడైన రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యస్ బ్యాంక్ క్యూ1 ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక ఈ వారంలో బీఎస్‌ఈ ఎక్సే్చంజీలో లిస్టయిన 298 కంపెనీలు జూన్ క్వార్టర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. బజాజ్ ఫైనాన్స్, హెచ్‌యూఎల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ ఇన్సూరెన్స్, నెస్లే, సిప్లా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంకులున్నాయి.
వీటితో పాటు ఇండిగో, ఐసీఐసీఐ ప్రుడెన్సియల్ లైఫ్ ఇన్సూరెన్స్, అలైడ్ బ్లెండర్స్, ఐడీబీఐ బ్యాంక్, సుజ్లాన్ ఎనర్జీ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్ సరీ్వసెస్, టొరెంట్ ఫార్మా, యూనిటెడ్ స్పిర్పిట్స్ కంపెనీలు తమ తొలి త్రైమాసిక ఫలితాలు వెల్లడించనున్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది.
ఆయా దేశాల స్థూల ఆర్థిక గణాంకాలు
యూరోజోన్ జూలై వినియోగదారుల విశ్వాస గణాంకాలు, అమెరికా జూన్ గృహ అమ్మకాలు మంగళవారం విడుదల కానున్నాయి. అమెరికా, జపాన్ యూరోజోన్‌లు బుధవారం జూలై నెలకు సంబంధించి తయారీ, సేవారంగ గణాంకాలను ప్రకటించనున్నాయి. అదే రోజున దేశీయ జూలై హెచ్‌ఎస్‌బీసీ తయారీ, సేవారంగ పీఎంఐ గణాంకాలు విడుదల కానున్నాయి. అమెరికా క్యూ2 జీడీపీ డేటా, కోర్ పీసీఈ ధరల గణాంకాలు, వాస్తవ వినియోగదారుల వ్యయ డేటా గురువారం వెల్ల డి కానుంది. ఇక వారాంతపు రోజైన శుక్రవారం ఆర్‌బీఐ జూలై 19తో ముగిసిన వారపు ఫారెక్స్ నిల్వ లు ప్రకటించనుంది. ఆయా దేశాలకు సంబంధించిన కీలక స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది.
గురువారం డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు
ఈ గురువారం(జూలై 25న) నిఫ్టీకి చెందిన జూలై సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీ తేదీ కూడా
ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘‘సాంకేతికంగా నిఫ్టీ 24,700 వద్ద కీలక నిరోదాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని చేధించగలిగితే 25,000 స్థాయిని శ్రేణిని పరీక్షిస్తుంది. దిగువ స్థాయిలో 24,000 వద్ద తొలి మద్దతు, 23,500 వద్ద మరో కీలక మద్దతు స్థాయిలు ఉన్నాయి’’ అని ఆప్షన్ డేటా సూచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment