Budget 2024 : బడ్జెట్‌ ‘హల్వా’ మెప్పిస్తుందా? | Budget 2024: Expectations from Union Budget 2024 | Sakshi
Sakshi News home page

Budget 2024 : బడ్జెట్‌ ‘హల్వా’ మెప్పిస్తుందా?

Published Mon, Jul 22 2024 1:34 AM | Last Updated on Mon, Jul 22 2024 8:04 AM

Budget 2024: Expectations from Union Budget 2024

మోదీ 3.0 తొలి బడ్జెట్‌పై ఎన్నో అంచనాలు 

పన్నుల భారం తడిసిమోపెడు..  

తగ్గింపునకు డిమాండ్లు 

ఈ దిశగా ప్రకటనలకు వీలు..    

తయారీ, మౌలికానికి ప్రాధాన్యం 

గృహ రుణాలపై ప్రోత్సాహకాలు 

బీమాపైనా ఇవే ఆశలు

చరిత్రాత్మక నిర్ణయాలు అంటూ రాష్ట్రపతి సంకేతం 

ఒక పక్క ధరాభారం... మరోపక్క పన్నుల మోత! దేశంలో వేతన జీవుల నుండి సామాన్యుల వరకు ఈ సెగ గట్టిగానే  తగులుతోంది. వికసిత భారతదేశమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్న మోదీ 3.0 సర్కారుకు  ఉపాధికల్పన ఇప్పుడు చాలా కీలకంగా మారింది. పారిశ్రామికంగా దేశాన్ని పరుగులు పెట్టిస్తూనే.. 
ప్రజలకు ఆర్థిక ఉపశమనం కలి్పంచాల్సిన అవసరం కూడా నెలకొంది.

 ఈ నేపథ్యంలో రికార్డు స్థాయిలో  వరుసగా ఏడో బడ్జెట్‌ను  ప్రవేశపెడుతున్న ఆర్థిక  మంత్రి నిర్మలా సీతారామన్‌ వైపు అన్ని వర్గాలూ ఆశగా ఎదురుచూస్తున్నాయి. మరి సీతమ్మ బడ్జెట్‌ ‘హల్వా’ అందరినీ మెప్పిస్తుందా? వివిధ రంగాలు, పరిశ్రమ వర్గాల అంచనాలు సాకారమవుతాయా? మధ్యతరగతి ఆశలు నెరవేరుతాయా? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. 

భారత్‌ 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించాలి’.. కేంద్రంలోని మోదీ సర్కారు దీర్ఘకాలిక లక్ష్యం ఇది. అమెరికా, యూరప్, చైనా ఆర్థికవ్యవస్థలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న తరుణంలోనూ భారత్‌ ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధి (7% పైనే)తో సాగిపోతోంది. ప్రస్తుతం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న దేశం అమెరికా, చైనా తర్వాత మూడో స్థానానికి చేరుకుంటుందని అంచనా.

 ఈ స్వప్నం సాకారం కావాలంటే ఉపాధి అవకాశాల కల్పన, పరిశ్రమల ఏర్పాటు, మౌలిక వసతులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అవసరం. పన్నుల ఉపశమనం కలి్పంచాలన్న డిమాండ్లు ఉండనే ఉన్నాయి. రానున్న బడ్జెట్‌లో చరిత్రాత్మక, ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు ఉంటాయంటూ పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇప్పటికే సంకేతం పంపారు. దీంతో ఈ నెల 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమరి్పంచే 2023–24 పూర్తి స్థాయి బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

పన్నుల భారం తగ్గించరూ.. 
ప్రస్తుత పరిస్థితి: ఆదాయపన్ను, జీఎస్‌టీ తదితరాల రూపంలో ప్రజలపై ప్రత్యక్ష, పరోక్ష పన్నుల బాదుడు గడిచిన పదేళ్లలో గణనీయంగా పెరిగిపోయింది. ఇది ఏ స్థాయిలో అంటే.. 2023–24లో కేంద్ర సర్కారు రూ.34.6 లక్షల కోట్ల భారీ మొత్తాన్ని ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో సమకూర్చుకుంది. ఒక వస్తువు చేతులు మారుతున్న ప్రతి దశలోనూ పన్ను పరిధిలోకి వెళుతోంది. ఉదాహరణకు డీజిల్, పెట్రోల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్, వ్యాట్‌ ట్యాక్స్‌ విధిస్తుంటాయి. వాహనం వాడే ప్రతి ఒక్కరూ ఇంధనం కొనుగోలుపై పన్ను చెల్లిస్తున్నట్టే. 

వస్తు రవాణాకు వినియోగించే లారీలు, ట్రక్కులు, రైల్వే డీజిల్, విద్యుత్‌ను ఇంధనంగా వినియోగిస్తుంటాయి. ఆ దశలో అవి డీజిల్, విద్యుత్‌పై పన్ను చెల్లిస్తుంటాయి. ఆ చార్జీల భారం వస్తువులపై పడి, చివరికి వినియోగదారుడు తన వంతు కూడా చెల్లించాల్సి వస్తోంది. ఒక కంపెనీ తన లాభం నుంచి 25 శాతం పన్ను చెల్లించాలి. ఆ తర్వాతే డివిడెండ్‌ పంపిణీ చేస్తుంది. ఈ డివిడెండ్‌ అందుకున్న వారు దానిపై తమ ఆదాయ స్థాయికి అనుగుణంగా పన్ను చెల్లించాలి. అంటే రెండు దశల్లో డివిడెండ్‌పై పన్ను పడినట్టు అవుతోంది. ఇలా ప్రత్యక్షం కంటే, పరోక్ష పన్నుల భారం ప్రజలపై బాగా పెరిగిపోయింది. 

వ్యవసాయం– గ్రామీణం
ప్రస్తుత పరిస్థితి: రైతుల ఆదాయాన్ని, వారి ఆర్థిక స్థితిగతులు పెంచేందుకు కృషి చేస్తామంటున్న మోదీ సర్కారు.. ఈ రంగానికి ఆశించిన స్థాయిలో కేటాయింపులు చేయడం లేదు. 2023–24 బడ్జెట్‌లో సాగు రంగానికి రూ.1.25 లక్షల కోట్లు కేటాయించారు. దీంతో పోలి్చతే కేవలం 0.6 శాతం పెంచి 2024–25 మధ్యంతర బడ్జెట్‌లో రూ.1.27 లక్షల కోట్లు కేటాయించారు. గ్రామీణాభివృద్ధి కేటాయింపులు మాత్రం 4.2 శాతం పెంచి 1.80 లక్షల కోట్లు చూపించారు. 

అంచనాలు: పంట నష్టాన్ని తగ్గించి, మెరుగైన రేటు వచ్చే దిశగా బడ్జెట్‌లో చర్యలు ప్రకటిస్తారన్న ఆశలు రైతన్నల్లో నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా రైతులు అందరికీ నానో డీఏపీ ఎరువులను అందుబాటులోకి తీసుకురావడం, పంట ఉత్పత్తి అనంతరం నిల్వ, సరఫరా వ్యవస్థ, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సాహిస్తామని మధ్యంతర బడ్జెట్‌లో చేసిన ప్రకటనలు ఈ రంగానికి బలాన్నిచ్చేవే. ఇవి కాకుండా పూర్తి స్థాయి బడ్జెట్లో అదనపు చర్యలు ఏమి ప్రకటిస్తారో చూడాలి. ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు పెంచాలన్న డిమాండ్‌ను పరిశీలించవచ్చు. 

అంచనాలు: పాత పన్ను విధానం నుంచి ప్రజలను క్రమంగా కొత్త విధానంలోకి తీసుకురావాలన్నది కేంద్రం ఆశయం. పాత విధానంలో పీపీఎఫ్, ఫిక్స్‌డ్‌ డిపాజిట్, చిన్న మొత్తాల పొదుపు పథకాలు, పిల్లల స్కూల్‌ ట్యూషన్‌ ఫీజులు, ఈఎల్‌ఎస్‌ఎస్, జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియం, గృహ రుణం చెల్లింపులపై గణనీయమైన పన్ను ప్రయోజనాలున్నాయి. అందరూ వీటిని వినియోగించుకోలేరు. కనుక అందరికీ ఉపయోగపడే విధంగా, పారదర్శకంగా ఉండేందుకు మినహాయింపుల్లేని కొత్త పన్ను విధానాన్నే అంతిమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. 

అందుకని నూతన పన్ను విధానంలోకి మళ్లే దిశగా పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించేందుకు ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు చేయవచ్చని అంచనాలున్నాయి. పరిశ్రమ భాగస్వాములు కూడా ఆర్థిక మంత్రిని ఇదే కోరాయి. స్టాండర్డ్‌ డిడక్షన్‌ను రూ.50వేల నుంచి రూ. లక్షకు పెంచొచ్చన్న అంచనాలున్నాయి. పాత పన్ను విధానంలో రూ.2.5 లక్షల ప్రాథమిక పన్ను మినహాయింపు పదేళ్ల నుంచి అదే స్థాయిలో కొనసాగుతోంది. 

దీన్ని పెంచాలన్న డిమాండ్లు ఉన్నాయి. కానీ, పాత పన్ను విధానాన్ని నిరుత్సాహపరిచేందుకు అందులో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చని భావిస్తున్నారు. పన్ను మినహాయింపులను పెంచడం  వల్ల ప్రజల చేతుల్లో ఖర్చు చేసే ఆదాయం  పెరిగి, అది వినియోగంలోకి వస్తుందని..  అంతిమంగా దేశ వృద్ధికి దోహదం చేస్తుందని  నిపుణులు అంటున్నారు. 2023–24 ఆర్థిక  సంవత్సరంలో సాధించిన 8.2 శాతం  వృద్ధి రేటు ఇక మీదటా గరిష్టాల్లో నిలదొక్కుకునేందుకు ఈ తరహా చర్యలు అవసరమన్న వాదన  వినిపిస్తోంది. 

బీమాపై డిమాండ్లు ఇవీ.. 
ఇక జీవిత బీమా, ఆరోగ్య బీమాపై జీఎస్‌టీ భారం తగ్గించాలన్న బలమైన డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. వీటిపై 18 శాతం జీఎస్‌టీ అమలవుతోంది. దేశంలో ప్రతి ఒక్కరికీ బీమాను చేరువ చేసేందుకు పన్ను రేటును 5 శాతానికి తగ్గించాలని పరిశ్రమ కోరుతోంది. 

ఆరోగ్యం, వైద్యం కోసం చేసే ఖర్చులు గణనీయంగా పెరిగిపోయినప్పటికీ సెక్షన్‌ 80డీ కింద హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలకు కలి్పస్తున్న వెసులుబాటులో (60ఏళ్లలోపు ఉంటే రూ.25 వేలు, 60 ఏళ్లు నిండిన వారికి రూ.50 వేలు) గత తొమ్మిదేళ్లుగా ఎలాంటి మార్పులు లేకపోవడాన్ని ఆర్థిక మంత్రి దృష్టికి పరిశ్రమ తీసుకెళ్లింది.

 ద్రవ్యోల్బణానికి ముడిపెట్టి, ఈ సెక్షన్‌ కింద హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంపై పన్ను మినహాయింపు ఏటా ఆటోమేటిక్‌గా పెరిగే విధంగా ఉంటే బావుంటుందని తెలిపింది. ఇంటి అద్దెలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో హౌస్‌ రెంట్‌ అలవెన్స్‌ (హెచ్‌ఆర్‌ఏ) మినహాయింపును పెంచాలన్న డిమాండ్‌ ఉంది. భారీ పన్ను వసూళ్లు అంచనాల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకునేందుకు బడ్జెట్‌కు వెసులుబాటు ఉంటుందన్నది విశ్లేషణ.

దీర్ఘకాల మూలధన ఆస్తుల నిర్వచనం మారుతుందా? 
దీర్ఘకాల మూలధన ఆస్తుల నిర్వచనం మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈక్విటీ పెట్టుబడులు ఏడాదిలోపు విక్రయించినట్టయితే స్వల్పకాల, ఏడాది ముగిసిన తర్వాత విక్రయించినట్టయితే దీర్ఘకాల మూలధన ఆస్తులుగా ఆదాయపన్ను చట్టం పరిగణిస్తోంది. స్వల్పకాల మూలధన లాభాలపై 15 శాతం పన్ను, దీర్ఘకాల మూలధన లాభం రూ.మొదటి లక్ష తర్వాత మొత్తంపై 10 శాతం పన్ను అమలవుతోంది. అదే రియల్‌ ఎస్టేట్‌ను 24 నెలలు నిండినప్పుడే దీర్ఘకాల మూలధన ఆస్తిగా చూస్తున్నారు. వివిధ సాధనాల మధ్య గందరగోళం లేకుండా ఏకరూపత తీసుకురావచ్చన్న అంచనాలున్నాయి.

 అంటే ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన ఆస్తుల కాలాన్ని రెండేళ్లకు పెంచడం లేదంటే రియల్‌ ఎస్టేట్‌ సాధనానికి రెండేళ్లకు బదులు ఏడాది కాలాన్ని దీర్ఘకాల ఆస్తిగా నిర్ణయించొచ్చని భావిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులకు ఏడాదికే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ప్రయోజనాలు కలి్పస్తే మార్కెట్లోకి ఎక్కువ ప్రాపరీ్టలు విక్రయానికి వచ్చి, రేట్ల పెరుగుదల ఒత్తిడి తగ్గుతుందనే అంచనాలు సైతం ఉన్నాయి. ఒకవేళ ఈక్విటీ పెట్టుబడులకు రెండేళ్లకు పెంచితే అది కొంత నిరుత్సాహపరిచే అవకాశం లేకపోలేదు. ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన లాభం మొదటి రూ.లక్షకు పన్ను ఉపశమనం ఉండగా, దీన్ని రూ.2 లక్షలు చేయాలని మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) ఆర్థిక మంత్రిని కోరింది.

ఉపాధి 
ప్రస్తుత పరిస్థితి: తలసరి ఆదాయాన్ని పెంచడం ముందున్న ప్రధాన సవాళ్లలో ఒకటి. ప్రపంచంలో టాప్‌–10 ఆర్థిక వ్యవస్థల్లో జీడీపీ పరిమాణం పరంగా 3,942 బిలియన్‌ డాలర్లతో (2024 జూలై 1 నాటికి ఐఎంఎఫ్‌ డేటా) భారత్‌ ఐదో స్థానంలో ఉంది. కానీ, తలసరి ఆదాయం 2730 డాలర్లతో (రూ.2.27 లక్షలు) టాప్‌–10లో చివరి స్థానంలో ఉంది. 2014 నుంచి చూస్తే తలసరి ఆదాయం రెట్టింపైనప్పటికీ.. అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే ఇది గణనీయంగా మెరుగుపడాల్సి ఉంది. దీనికి ప్రభుత్వం వద్దనున్న ఏకైక అస్త్రం ఉపాధి కల్పన. సేవల రంగంపై ఆధారపడిన ఎకానమీని తయారీ వైపు మళ్లించడం ద్వారా ఉపాధి కల్పనను సాధించాలన్నది లక్ష్యం.

అంచనాలు:  ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కింద వివిధ రంగాల్లో కొత్తగా తయారీ కేంద్రాల ఏర్పాటు, అదనపు ఉత్పాదకతపై ప్రోత్సాహకాలు అందిస్తోంది. దిగుమతులను తగ్గించి, దేశీయంగా ఆయా ఉత్పత్తుల స్వావలంబన సాధించేందుకు (ఆత్మనిర్భర్‌ భారత్‌), ప్రపంచానికి తయారీ కేంద్రంగా చేయాలన్న (మేక్‌ ఇన్‌ ఇండియా) లక్ష్యాలు ఇందులో అంతర్లీనంగా ఉన్నాయి. దీంతో దేశీ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో పోటీపడగలవని కేంద్రం భావిస్తోంది. ఆయా దిశల్లో తాజా బడ్జెట్‌ నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు.

మౌలికం
ప్రస్తుత పరిస్థితి: దేశం పారిశ్రామికంగా మరింత పురోగతి చెందాలంటే, అందుకు మెరుగైన వసతులు అవసరం. అప్పుడే పెట్టుబడిదారులు ముందుకు వస్తారు. కేంద్రంలోని మోదీ సర్కారు రహదారులు, రైల్వే, జలమార్గాలకు ప్రాధాన్యాన్ని పెంచింది. రైల్వే వసతుల ఆధునికీకరణపై పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది.

అంచనాలు:  2023–24లో రైల్వేలకు రూ.2.41 లక్షల కోట్లు చేయగా, ఈ విడత రూ.2.9–3 లక్షల కోట్లకు పెంచొచ్చని భావిస్తున్నారు. అంతేకాదు రహదారుల నిర్మాణానికీ కేటా యింపులు పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2014 నాటికి జాతీయ రహదారుల నిడివి 91,287 కిలోమీటర్లు ఉండగా, 2023 డిసెంబర్‌ నాటికి 1,46,145 కిలోమీటర్లకు పెరిగింది. ఏటా 4,000 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం ఉండగా, దాన్ని, 12వేల కిలోమీటర్లకు విస్తరించారు. జీడీపీలో మూలధన కేటాయింపులను 3.5 శాతానికి పెంచొచ్చని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ నోమురా అంచనా వేస్తోంది. ఎకానమీ పురోగతికి మౌలిక రంగం కీలకమని భావిస్తున్న కేంద్రం ఈ విషయంలో ప్రైవేటు భాగస్వా మ్యాన్ని ప్రోత్సహించడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది. బడ్జెట్‌లోనూ ఈ మేరకు నిర్ణయాలు ఉండవచ్చని అంచనా.

హెల్త్‌కేర్‌
ప్రస్తుత పరిస్థితి: దేశ ఉత్పాదకత పెరిగేందుకు ఆరోగ్యకర సమాజం ఎంతో అవసరం. 2023–24 బడ్జెట్‌లో ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖకు చేసిన కేటాయింపులు రూ.80,517 కోట్లు. మొత్తం బడ్జెట్‌లో 2 శాతంలోపే. 2024–25 మధ్యంతర బడ్జెట్‌లో 13 శాతం పెంచి రూ.90,658 కోట్లు చూపించారు. ఈ నిధులు మరింత పెరగాల్సిన అవసరం ఉంది. నూతన ఔషధాల ఆవిష్కరణపై చేసే ఖర్చుకు, డయాగ్నోస్టిక్స్‌పైన జీఎస్‌టీ మినహాయించాలని, పీఎల్‌ఐ కింద ఈ రంగానికి ప్రోత్సాహకాలు పెంచాలని పరిశ్రమ కోరుతోంది. 9–14 ఏళ్ల బాలికలకు గర్భాశయ ముఖ ద్వారా కేన్సర్‌ నుంచి నివారణకు టీకా ఇవ్వడాన్ని సార్వత్రిక టీకా కార్యక్రమం పరిధిలోకి తేవాలన్న డిమాండ్‌ ఉంది.

అంచనాలు:  కేన్సర్, జీవనశైలి వ్యాధుల నివారణకు వీలుగా ప్రజారోగ్యంపై మరింత పెట్టుబడులు అవసరమన్న సూచనలను  బడ్జెట్‌ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య పథకాన్ని మరింత మందికి చేరువ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న అంచనాలు బలంగా ఉన్నాయి. వైద్య ఉపకరణాల దిగుమతులపై ప్రపంచంలోనే అత్యధికంగా కస్టమ్స్‌ డ్యూటీలు మన దేశంలోఉన్నాయని, వీటిని తగ్గించాలన్న పరిశ్రమ డిమాండ్‌ను పరిశీలించవచ్చు.

విద్యారంగం
విద్యారంగానికి 2023–24 బడ్జెట్‌తో పోలిస్తే 7% తక్కువగా రూ.1.2 లక్షల కోట్లనే 2024–25 మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి కేటాయించారు. పూర్తిస్థాయి బడ్జెట్‌లో అయినా దీన్ని సరిదిద్దుతారేమో చూడాలి.  విద్యా సేవలు, టెస్ట్‌ ప్రిపరేషన్, నైపుణ్య కోర్సులపై 18% జీఎస్‌టీ చాలా ఎక్కువన్న అభ్యంతరం    ఉంది. నాణ్యమైన విద్యను అందుబాటు వ్యయాలకే అందించే దిశగా తగినన్ని పెట్టుబడులతోపాటు స్కాలర్‌íÙప్‌లు, ఆర్థిక సాయం, సులభంగా విద్యా రుణాలు లభించేలా చర్యలు తీసుకోవాలని విద్యా సంస్థలు, ఎడ్‌టెక్‌ కంపెనీలు డిమాండ్‌ చేస్తున్నాయి. విద్యా రుణాలు సులభం కావాలన్నది డిమాండ్‌.

ఎంఎస్‌ఎంఈలు 
దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కలి్పస్తున్న ఈ పరిశ్రమ కేంద్రం నుంచి మరింత సాయాన్ని ఆశిస్తోంది. తక్కువ వడ్డీపై రుణ సాయానికి తోడు, సులభతర రుణాలు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం, మౌలిక వసతుల కల్పన, సానుకూల పన్ను విధానం, వ్యాపార సులభతర నిర్వహణకు వీలుగా నిబంధనల అమల్లో వెసులుబాటు తదితర రూపాల్లో సహకారాన్ని కోరుతోంది. ప్రతి జిల్లా స్థాయిలో ఆర్థిక కేంద్రాలు ఏర్పాటు చేసి, వసతులు కలి్పంచడం, నైపుణ్యాభివృద్ధి కల్పనతో మరింత మందికి ఉపాధి లభిస్తుందని చెబుతున్నాయి. ఎస్‌ఎంఈలకు 45 రోజుల్లోగా చెల్లింపులు జరిగేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని పరిశ్రమ కోరుతోంది.  

హౌసింగ్‌  
అందుబాటు ధరల ఇళ్లు, పర్యావరణ అనుకూల ఇళ్ల ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా డెవలపర్లకు ప్రోత్సాహకాలు కలి్పంచాలని రియల్టీ కోరుతోంది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం విజయవంతమైన నేపథ్యంలో.. మరింత మందికి లబ్ధి చేకూరేందుకు ఈ పథకాన్ని 2.0 రూపంలో తీసుకురావాలని డిమాండ్‌ చేస్తోంది. అందరికీ ఇళ్ల లక్ష్యం సాకారం దిశగా బడ్జెట్‌లో చర్యలు ఉంటాయన్న అంచనాలు పెరిగాయి. గృహ రుణాలపై రూ. 5 లక్షల వరకు వడ్డీ చెల్లింపులకు పన్ను మినహాయింపు కల్పించాలని పరిశ్రమ ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రిని కోరింది. ఈ రంగానికి పరిశ్రమ హోదా కలి్పంచాలన్న డిమాండూ ఉంది.

పర్యావరణ ఇంధనాలు 
శిలాజ ఇంధనాలైన బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తులపైనే ఎక్కువగా ఆధారపడగా, సోలార్, విండ్, గ్రీన్‌ హైడ్రోజన్‌ తదితర పర్యావరణ అనుకూల ఇంధనాలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. 2070 నాటికి సున్నా కర్బన ఉద్గారాల విడుదల లక్ష్యాన్ని చేరుకోవాలంటే పునరుత్పాదక ఇంధన వనరులపై పెట్టుబడులకు ప్రోత్సాహం ఉండాలని, శుద్ధ  ఇంధన వనరులకు మళ్లేందుకు, ఈ దిశగా పరిశోధన, అభివృద్ధికి  తగినంత ప్రోత్సాహం అందించాలన్న డిమాండ్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగంపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్న దశలో ఫేమ్‌ పథకం ద్వారా సబ్సిడీలు తొలగించడం సరికాదని పరిశ్రమ భావిస్తోంది.

బ్యాంకింగ్‌ 
బ్యాంకింగ్‌ ఎకానమీ పురోగతిలో కీలకమని కేంద్రం భావిస్తోంది. ఈ రంగంలో సంస్కరణలకు వీలుగా బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ 1949, ఇతర చట్టాలకు సవరణలను బడ్జెట్‌లో ప్రతిపాదించొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంక్‌లను ప్రైవేటీకరించాలంటే బ్యాంకింగ్‌ కంపెనీల చట్టం 1970, బ్యాంకింగ్‌ కంపెనీల చట్టం 1980లకు సవరణలు తప్పనిసరి. ఈ రెండు చట్టాలు బ్యాంకుల జాతీయకరణ సమయంలో తెచ్చినవి. వీటిల్లో సవరణలతో ప్రభుత్వరంగ బ్యాంక్‌ల ప్రైవేటీకరణకు, ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 51 శాతం లోపునకు తగ్గించుకునేందకు వీలు లభిస్తుంది.

మోదీ సర్కారు రహదారులు, రైల్వేలు, జల్‌శక్తి, కమ్యూనికేషన్లకు పెద్ద పీట వేస్తున్నట్టు గత నాలుగు బడ్జెట్‌ కేటాయింపులు పరిశీలిస్తే తెలుస్తోంది. విద్య, వైద్యానికీ కేటాయింపులు పెంచినప్పటికీ రహదారులు, రైల్వేల స్థాయిలో లేకపోవడాన్ని గమనించొచ్చు. ముఖ్యంగా దేశ రక్షణ కోసమే పెద్ద మొత్తంలో కేటాయింపులు చేస్తున్నట్టు ఈ పట్టికను పరిశీలిస్తే తెలుస్తుంది. 

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement