న్యూఢిల్లీ: కట్టలకొద్దీ బడ్జెట్ ప్రతులతో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టే సంస్కృతికి ఫుల్‌స్టాప్ పడి చాలా కాలమైంది. కాగితరహితమైన బడ్జెట్‌ను ఈసారీ విత్తమంత్రి నిర్మల విశిష్టమైన బహీ ఖాతా తరహాలో ఎరుపు రంగు పౌచ్‌లో ట్యాబ్‌ను తీసుకొచ్చారు. బ్రీఫ్‌కేస్ విధానాన్ని వదిలేసి గత మూడేళ్లుగా ఆమె ఇలాగే పౌచ్‌లోనే ట్యాబ్‌ను తీసుకొస్తున్నారు. బడ్జెట్ ప్రసంగం చేయడానికి పార్లమెంట్‌కు రావడానికి ముందు ఆమె కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయం బయట సహాయ మంత్రులు, శాఖ ఉన్నతాధికారులతో ట్యాబ్ పట్టుకుని గ్రూప్ ఫొటో దిగారు. 2020 లోనూ ఆమె బహీ ఖాతానే తెచ్చారు. 2021లో తొలిసారిగా పౌచ్‌లో ట్యాబ్‌ను పట్టుకొచ్చారు.
అదే సంస్కృతిని ఈసారీ కొనసాగించారు. 2019లో సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌తో కలుపుకుంటే 2014 ఏడాది నుంచి మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 12వ బడ్జెట్ ఇది. నిర్మలకు ఇది ఆరో బడ్జెట్. దశాబ్దాలుగా బడ్జెట్‌ను సాయంత్రం ఐదు గంటలకు ప్రవేశపెట్టేవారు. ఈ ఆనవాయితీకి వాజ్‌పేయీ చెల్లుచీటీ ఇచ్చారు. వాజ్‌పేయీ హయాంలో నాటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఉదయం 11 గంటలకే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఆనాటి నుంచి అదే సంస్కృతి కొనసాగుతోంది. బడ్జెట్ వివరాలను బ్రీఫ్‌కేస్‌కు బదులు బహీఖాతాలో తీసుకురావడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం స్పందించారు. ‘‘ఈ సంస్కృతి ఇలాగే కొనసాగుతోంది. భవిష్యత్తులో మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అయితే ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ఐప్యాడ్‌లోనే తీసుకొస్తారు’’అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment