GYAN ­పద్దు! | Working Towards Making India A Viksit Bharat By 2047: Sitharaman | Sakshi
Sakshi News home page

GYAN ­పద్దు!

Published Fri, Feb 2 2024 4:16 AM | Last Updated on Fri, Feb 2 2024 4:20 AM

Working Towards Making India A Viksit Bharat By 2047: Sitharaman - Sakshi

న్యూఢిల్లీ: దేశ సుస్థిర, సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా, దేశాన్ని ‘వికసిత్‌ భారత్‌’గా మార్చే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దేశంలో పేదలు, యువత, రైతులు, మహిళల సాధికారత, సంక్షేమమే తమ ప్రాధాన్యత అని ప్రకటించారు. గత పదేళ్లలో అభివృద్ధి ఎంతో వేగం పుంజుకుందని పేర్కొన్నారు. ఆమె గురువారం పార్లమెంటులో 2024–25 ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సీతారామన్‌ ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే.. 

‘‘గత పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ సకారాత్మకంగా గణనీయ మార్పు సాధించింది. దేశ ప్రజలు ఎంతో ఆశగా, నమ్మకంతో భవిష్యత్తు వైపు చూస్తున్నారు. ప్రజల ఆశీర్వాదంతో, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ఎన్నో సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొంది. ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్‌’ మంత్రంతో, ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ముందడుగు వేస్తోంది. ఆర్థిక వ్యవస్థ నూతన శిఖరాల దిశగా సాగుతోంది. రెండోసారి ఘన విజయం సాధించిన తర్వాత మోదీ సర్కారు.. ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్‌’ మంత్రాన్ని చేపట్టి దేశంలోని అన్ని ప్రాంతాలు, అన్నివర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి చర్యలు చేపట్టింది. అవినీతి, బంధుప్రీతి తగ్గాయి. సామాజిక న్యాయం అందుతోంది. 

ఆత్మనిర్భర్‌ భారత్‌తో అమృత కాలానికి.. 
ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి విసిరిన సవాళ్లను ఎదుర్కొని.. ఆత్మనిర్భర్‌ భారత్‌తో అమృతకాలానికి పునాదులు వేసుకున్నాం. అద్భుతమైన భవిష్యత్తు దిశగా సాగుతున్నాం. అందరికీ ఇళ్లు, ప్రతి ఇంటికీ నీళ్లు, విద్యుత్, వంటగ్యాస్, బ్యాంకు ఖాతాలు వంటివాటితో దేశంలోని ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. 

వికసిత్‌ భారత్‌ దిశగా.. 
అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ప్రజలందరికీ సమాన అవకాశాలతో ప్రకృతితో కలసి సాగుతూ.. 2047 నాటికి ‘వికసిత భారత్‌’గా రూపొందే దిశగా అడుగులు వేస్తాం. వచ్చే ఐదేళ్లలో అనూహ్య ప్రగతి సాధించబోతున్నాం. మనకు అవకాశాలకు కొదవలేదు. ఆకాశమే హద్దు. ఈ అద్భుతమైన పనితీరు చూపిన మా ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. ‘వికసిత భారత్‌’ దిశగా చేపట్టే రోడ్‌మ్యాప్‌ను జూలైలో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్‌లో వెల్లడిస్తాం. 

ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఎదురవుతున్నా.. 
కొన్నేళ్లుగా యుద్ధాలు, వివాదాలతో ప్రపంచ పరిణామాలు సంక్లిష్టంగా మారుతున్నాయి. కీలక ఖనిజాలు, సాంకేతికతలు, సరుకుల రవాణాకు ఆటంకం కలుగుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, అప్పుల భారం, పర్యావరణ సమస్యలు సవాలుగా మారుతున్నాయి. వీటిని దీటు గా ఎదుర్కొంటూ, సరైన పరిష్కారాలను అనుసరిస్తూ ముందుకు సాగుతున్నాం.ఇండియా–మధ్యప్రాచ్య దేశాలు– యూరప్‌ ఎకానమిక్‌ కారిడార్‌ మనదేశానికి ఒక గేమ్‌ చేంజర్‌. ప్రపంచ వాణిజ్యానికి కీలకంగా మారనున్న ఈ కారిడార్‌కు మూలం భారత్‌ అన్న విషయం చరిత్రలో నిలిచిపోతుంది. 

మరిన్ని సంస్కరణలు తెస్తాం 
సుస్థిర, సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి కోసం, అందరికీ అవకాశాలు అందించడం కోసం మరిన్ని సంస్కరణలు తెస్తాం. రాష్ట్రాలు, ఇతర భాగస్వాములతో చర్చించి అమలు చేస్తాం. ప్రపంచంతో పోటీపడేలా పరిశ్రమలకు తోడ్పాటుఅందిస్తాం. తూర్పు ప్రాంతం, అక్కడి ప్రజలు దేశ అభివృద్ధిని ముందుండి నడిపించేలా దృష్టిసారిస్తాం. 

లక్షాధికారులను చేసేలా.. 
83 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలతో 9 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారు. వారిలో కోటి మంది ఇప్పటికే లక్షాధికారులు (లక్‌పతి దీదీ) అయ్యారు. త్వరలో మూడు కోట్ల మందిని ‘లక్‌పతి దీదీ’గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జీడీపీ అంటే.. ఈ మూడు.. : స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దేశం దూసుకుపోతోంది. అదే సమయంలో కీలకమైన మరో మూడు అంశాల ‘జీడీపీ.. గవర్నెన్స్‌ (పరిపాలన), డెవలప్‌మెంట్‌ (అభివృద్ధి), పర్ఫార్మెన్స్‌ (పనితీరు)’పై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజలే కేంద్రంగా పారదర్శక, బాధ్యతాయుతమైన పరిపాలన అందించేందుకు.. సమ్మిళిత అభివృద్ధి కోసం కృషి చేస్తోంది. 

నాలుగు వర్గాలకు ప్రాధాన్యత 
పేదలు, మహిళలు, యువత, రైతులు.. ఈ నాలుగు వర్గాల అవసరాలు, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ నాలుగు వర్గాల వారికి ప్రభుత్వ మద్దతు అవసరం. వారు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. 

పేదలకు మరో రెండు కోట్ల ఇళ్లు 
► పీఎం ఆవాస్‌ యోజన ద్వారా గత ఐదేళ్లలో మూడు కోట్ల ఇళ్లను నిర్మించాలన్న లక్ష్యానికి దాదాపు పూర్తి చేసుకుంటున్నాం. వచ్చే ఐదేళ్లలో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మిస్తాం. 
► రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్రాజెక్టు ద్వారా కోటి ఇళ్లకు ప్రతినెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందుతుంది. ప్రజలకు ఏటా రూ.15 వేల నుంచి రూ.18 వేలు ఆదా అవుతాయి. దీనితో ఎంతో మందికి ఉపాధి కూడా లభిస్తుంది. 
► అద్దె ఇళ్లలో నివసిస్తున్న మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు త్వరలో కొత్త పథకాన్ని ప్రారంభిస్తాం. 

► దేశంలో మెడికల్‌ కాలేజీల సంఖ్యను గణనీయంగా పెంచుతాం. దీనిపై ప్రతిపాదనల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. 
► మహిళల్ల సర్వైకల్‌ కేన్సర్‌ నివారణ కోసం 9–14 ఏళ్ల మధ్య వయసు బాలికలకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపడతాం. 
► గర్భిణులు, శిశువుల సంక్షేమం, పోషకాహారం అందించడం కోసం అంగన్‌వాడీలను ‘సక్షం అంగన్‌వాడీ అండ్‌ పోషణ్‌ 2.0’గా అప్‌గ్రేడ్‌ చేస్తాం. 
► చిన్నారుల్లో వ్యాధుల నివారణ కోసం టీకాల కార్యక్రమాన్ని విస్తృతం చేస్తాం. 

► ఆశా, అంగన్‌వాడీ వర్కర్లకు ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని వర్తింపజేస్తాం. 
► రైతులకు ప్రయోజనం కలిగేలా ఫుడ్‌ ప్రాసెసింగ్, పంటల నిల్వ, రవాణా సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తాం. నానో డీఏపీ వినియోగాన్ని పెంచుతాం. 
► వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఇతర నూనె గింజల దిగుబడి పెరిగేలా పరిశోధన, ఆధునిక వ్యవసాయ విధానాలపై పరిశోధనలను ప్రొత్సహిస్తాం. 
► పశువుల్లో ఫుట్‌ అండ్‌ మౌత్‌ వ్యాధి నియంత్రణకు చర్యలు చేపడతాం. 

► మత్య పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఐదు సమీకృత ఆక్వాపార్క్‌లను ఏర్పాటు చేస్తాం. 
► సరికొత్త టెక్నాలజీల రూపకల్పన, అభివృద్ధిని ప్రోత్సహించేందుకు రూ.లక్ష కోట్లతో కార్పస్‌ ఫండ్‌ను ఏర్పాటు చేస్తాం.  
► రక్షణ రంగం కోసం డీప్‌–టెక్‌ సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి కొత్త పథకాన్ని ప్రారంభిస్తాం. 
► దేశంలో పర్యాటకాన్ని పెంచేందుకు ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ఇందుకోసం రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాలు ఇస్తాం. 

పేదల సంక్షేమమే.. దేశ సంక్షేమం.. 
పేదలకు సాధికారత కోసం ప్రభుత్వం వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేసింది. ఫలితంగా గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ప్రభుత్వం వివిధ పథకాల కింద రూ.34 లక్షల కోట్లను నేరుగా జన్‌ధన్‌ ఖాతాల్లో జమ చేసింది. దీనిద్వారా వృధా వ్యయం, అక్రమాలకు చెక్‌పడి ప్రభుత్వానికి రూ.2.7లక్షల కోట్లు మిగిలాయి. పీఎం స్వానిధి పథకం ద్వారా 78 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలు అందించాం. పీఎం జన్‌మన్‌ యోజన ద్వారా ఆదివాసీలు, విశ్వకర్మ యోజన పథకం ద్వారా చేతివృత్తుల వారు ప్రయోజనం పొందారు. 

రైతులు మనకు అన్నదాతలు 
దేశంలో రైతు కేంద్రిత విధానాలు అమలు చేస్తున్నాం. పంటలకు మద్దతు ధరలను క్రమంగా పెంచుకుంటూ వస్తున్నాం. కిసాన్‌ సమ్మాన్‌ యోజన ద్వారా దేశవ్యాప్తంగా 11.8కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఏటా నగదు జమ అవుతోంది. నాలుగు కోట్ల మంది రైతులకు ఫసల్‌ బీమా యోజన అందుతోంది. ఈనామ్‌ ద్వారా 1,361 మార్కెట్లతో 1.8 కోట్ల మంది రైతులకు సేవలు అందుతున్నాయి. 

యువత సాధికారతతోనే దేశ శ్రేయస్సు 
యువతకు తగిన ప్రోత్సాహాన్ని, సాధికారతను అందించడంపైనే దేశ శ్రేయస్సు ఆధారపడి ఉంది. ప్రభుత్వం తెచి్చన జాతీయ విద్యా విధానం–2020 దేశంలో గుణాత్మక సంస్కరణలకు మార్గం వేసింది. పీఎంశ్రీ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతోంది. స్కిల్‌ ఇండియా మిషన్‌ ద్వారా 1.4కోట్ల మంది యువత శిక్షణ పొందారు. ప్రభుత్వం ఏడు ఐఐటీలు, 16 ట్రిపుల్‌ ఐటీలు, 7 ఎయిమ్స్, 390 యూనివర్సిటీలతోపాటు 3 వేల కొత్త ఐటీఐలను నెలకొల్పింది. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు పీఎం ముద్రా యోజన ద్వారా 22.5 లక్షల కోట్ల రుణా లు అందించాం. స్టార్టప్‌ ఇండియా, స్టార్టప్‌ క్రెడిట్‌ గ్యారెంటీ పథకాలను అమలు చేస్తున్నాం. ఇప్పుడు వారు ‘ఉద్యోగ దాత’లు అవుతున్నారు. క్రీడలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహానికి.. ఆసియన్‌ గేమ్స్‌లో మన క్రీడాకారులు సాధించిన పతకాలే నిదర్శనం. 

నారీ శక్తి ముందడుగు.. 
గత పదేళ్లలో మహిళల సాధికారత, ఆత్మగౌరవం కోసం తీసుకున్న చర్యలతో ‘నారీ శక్తి’ ముందడుగు వేస్తోంది. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు 30 కోట్ల ముద్ర రుణాలు అందించాం. ఉన్నత విద్యను అభ్యసించే మహిళలు 28శాతం పెరిగారు. ‘స్టెమ్‌ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథ్స్‌)’ కోర్సుల్లో చేరుతున్నవారిలో 43శాతం మంది మహిళలే. ఇది ప్రపంచంలోనే అత్యధికం. ఇవన్నీ ఉద్యోగాలు/ఉపాధిలో మహిళ భాగస్వామ్యం పెంచాయి. త్రిపుల్‌ తలాక్‌ రద్దు, లోక్‌సభ/అసెంబ్లీలలో మూడో వంతు రిజర్వేషన్లు, పీఎం ఆవాస్‌ యోజన కింద 70శాతం మహిళా లబ్ధిదారులకే మంజూరు వంటివి మహిళల ఆత్మగౌరవానికి తోడ్పడుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement