Economic Development
-
చట్టబద్ధ స్వామిత్రతో ఆర్థికాభివృద్ధి
న్యూఢిల్లీ: చట్టబద్ధంగా జారీచేస్తున్న స్వామిత్ర ఆస్తి కార్డులతో దేశంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుని ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. శనివారం 65 లక్షల మందికి నూతనంగా స్వామిత్ర ప్రాపర్టీ కార్డ్‌లను జారీచేసిన సందర్భంగా ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. పెరిగిన ఆర్థిక కార్యకలాపాలతో పేదరికాన్ని తరిమికొట్టొచ్చని ఆయన చెప్పారు. ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరం, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మొత్తంగా 10 రాష్ట్రాలతోపాటు జమ్మూకశీ్మర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 50,000 గ్రామాలకు చెందిన 65 లక్షల మందికి శనివారం ఈ కార్డులను అందజేశారు. కార్డులు అందుకున్న వారిలో కొందరు లబ్ధిదారులతో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో భూముల డిజిటలైజేషన్‌తో మరింత సమర్థవంతమైన సాంకేతికత, సుపరిపాలన సాధ్యమవుతుంది. ఇది గ్రామాల సాధికారతకు బాటలువేస్తుంది. కార్డులున్న లబ్ధిదారులు రుణాలు పొందేందుకు, ఇతర ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హులవుతారు. కొత్తగా తీసుకున్న వారితో కలుపుకుని ఇప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు 2.24 కోట్ల మంది స్వామిత్ర ప్రాపర్టీ కార్డుదారులున్నారు. ఆస్తి హక్కు అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రధాన సవాల్‌గా తయారైంది. చాలా దేశాల్లో ప్రజలకు తమ సొంత ఆస్తులకు సంబంధించిన చట్టబద్ధమైన పత్రాలు లేవని స్వయంగా ఐక్యరాజ్యసమితి చేపట్టిన ఒక అధ్యయనంలో తేలింది. పేదరిక నిర్మూలనలో ఆస్తి హక్కు కీలకమైనది ఐరాస ఆనాడే పేర్కొంది’’అని మోదీ గుర్తుచేశారు. మృత మూలధనం కాదు ‘‘గతంలో ఒక ప్రముఖ ఆర్థికవేత్త చెప్పినట్లు భారతీయ గ్రామాల్లోని భూమి పెట్టుబడికి పనికిరాని మృత మూలధనం కాదు. సరైన పత్రాలు లేకపోవడంతో చాలా మంది వాటిని విక్రయించలేకపోతున్నారు. కొనేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. ఆక్రమణలు, భూవివాదాలతో గ్రామీణులు ఇబ్బందులు పడుతున్నారు. సరైన భూమి డాక్యుమెంట్లు లేని కారణంగా వీళ్లకు బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వవు. మనసున్న ఏ ప్రభుత్వమూ గ్రామీణులను ఇలా కష్టాల కడలిలో వదిలేయదు. గత ప్రభుత్వాలు ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపే ప్రయత్నంకూడా చేయలేదు. దీంతో దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్య పోగొట్టేందుకే గ్రామాల్లో వ్యక్తులకు నివాస, భూములకు సంబంధించిన ప్రాపర్టీ కార్డులను జారీచేస్తున్నాం. స్వామిత్ర (సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్) యోజన పథకం ద్వారా డ్రోన్ సాంకేతికత సాయంతో మ్యాపింగ్ చేసి వారి వారి ఇళ్లు, భూములను ఖచి్చతమైన సరిహద్దులతో చట్టబద్ధమైన ఆస్తికార్డులను అందజేస్తున్నాం. వీటితో వ్యక్తులకు తమ భూములపై సర్వాధికారాలు ధారాదత్తమవుతాయి. ఈ పథకం ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. భారత్‌లో 6,00,000 గ్రామాలుంటే వాటిల్లో సగం గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయింది’’అని ప్రధాని మోదీ అన్నారు. శనివారం దాదాపు 230 జిల్లాల్లో రైతులకు అధికారులు స్వయంగా ప్రాపర్టీ కార్డులను అందజేశారు. స్వామిత్ర యోజన పథకాన్ని మోదీ సర్కార్ 2020లో ప్రారంభించింది. ఆస్తులను నగదుగా మార్చుకునే వెసులుబాటు, ఆయా భూములకు బ్యాంక్ రుణాలు వచ్చేలా చేయడం, ఆస్తి తగాదాలను సాధ్యమైనంత మేరకు తగ్గించడం, ఆస్తులు, ఆస్తిపన్నుల మదింపు, గ్రామస్థాయిలో సమగ్ర విధాన నిర్ణయాలకు దోహదపడటమే స్వామిత్ర యోజన ముఖ్యోద్దేశం. -
Amit Shah: అవినీతిరహితుడు నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై గత పదేళ్లలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని, ఆయన అవినీతిరహితుడు అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. మోదీ విధానాలతో దేశ ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుందని అన్నారు. భారత్‌ను ప్రపంచంలోని అత్యున్నత ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిపారని ప్రశంసించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) భారత్‌ను ‘వెలుగుతున్న తార’ అని కొనియాడిందని గుర్తుచేశారు. గురువారం ఢిల్లీలో పీహెచ్డీ చాంబర్ ఆర్ కామర్స్, ఇండస్ట్రీ వార్షిక సదస్సులో అమిత్ షా మాట్లాడారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన ప్రగతిశీల చర్యలతో మనదేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా నిలిచిందని తెలిపారు. కేంద్రంలో 2014లో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వేర్వేరు రంగాల్లో సంస్కర ణలకు శ్రీకారం చుట్టిందని, వాటి ఫలితా లు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని, అనుసంధానం పెరిగిందని, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అందుబాటు లోకి వచ్చిందని, రైల్వే నెట్వర్క్ భారీగా విస్తరించిందని, విద్యుత్ వాహనాలు, సెమి–కండక్టర్ల తయారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని వివరించారు. -
మూలధన వ్యయాల వృద్ధిపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వ మూలధన వ్యయాల వేగవంతంపై కేంద్రం దృష్టి సారించింది. రూ. 500 కోట్లకు మించిన వ్యయానికి సంబంధించిన నిబంధనలను ఆర్థిక మంత్రిత్వ శాఖ సడలించింది. ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 11.11 లక్షల కోట్ల క్యాపెక్స్‌ను(మూలధన వ్యయం) బడ్జెట్ అంచనా వేసిన సంగతి తెలిసిందే. 2023–24 ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే ఇది 11.1 శాతం ఎక్కువ. సార్వత్రిక ఎన్నికల కారణంగా కొన్ని నెలలపాటు మందగించిన ప్రభుత్వ వ్యయాలను తిరిగి వేగవంతం చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి.మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 15 నెలల కనిష్ట స్థాయిలో 6.7 శాతంగా నమోదుకావడానికి ఎన్నికల సందర్భంగా మూలధన వ్యయాల్లో నెమ్మదే కారణమన్న విశ్లేషణలు వచ్చిన సంగతి తెలిసిందే. మూలధన వ్యయాలకు సంబంధించి అనుమతించిన తాజా సడలింపులను అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు కచ్చితంగా పాటించవలసి ఉంటుంది. సింగిల్ నోడల్ ఏజెన్సీ (ఎస్ఎన్ఏ), సెంట్రల్ నోడల్ ఏజెన్సీ (సీఎన్ఏ), మంత్లీ ఎక్స్పెండిచర్ ప్లాన్ (ఎంఈపీ), స్కీమ్ అలాగే నాన్–స్కీమ్ ఖర్చుల కోసం మంత్రిత్వ శాఖలు రూపొందించిన త్రైమాసిక వ్యయ ప్రణాళిక (క్యూఈపీ)లు సీలింగ్‌ల మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి. క్యాపెక్స్ కోసం త్రైమాసిక లక్ష్యాలు మరోవైపు రోడ్డు, రవాణా– రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్టీహెచ్), టెలికాం శాఖ కోసం బడ్జెట్ మూలధన వ్యయాలపై జరిగిన ఒక సమీక్షా సమావేశంలో ఆర్థికశాఖ నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, వివిధ మంత్రిత్వ శాఖలు క్యాపెక్స్ కోసం త్రైమాసిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం అవసరమని అన్నారు. సంవత్సరంలో మిగిలిన నెలల్లో వ్యయాలను వేగవంతం చేయాల్సిన ఆవశ్యకత ప్రాముఖ్యతను ఉద్ఘాటించారు. రోడ్డు, రవాణా– రహదారుల మంత్రిత్వ శాఖకు బడ్జెట్ క్యాపెక్స్ కేటాయింపులు 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.42 లక్షల కోట్లు ఉంటే, ప్రస్తుత 2024–25లో 90% వృద్ధితో రూ. 2.72 లక్షల కోట్లకు ఎగశాయి. 2024–25కు సంబంధించిన క్యాపెక్స్ ప్రణా ళికల గురించి ఎంఓఆర్టీహెచ్ సెక్రటరీ కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. వివిధ చర్యల ద్వారా ప్రైవేట్ మూలధనాన్ని ఆకర్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆస్తుల రీసైక్లింగ్ లక్ష్యాలను కూడా చేరుకునేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆర్థికమంత్రికి సెక్రటరీ తెలియజేసినట్లు సమాచారం. క్యాపెక్స్ వ్యయాల వేగవంతంపై ఆర్థిక మంత్రి వివిధ మంత్రిత్వశాఖలు, సమావేశమవుతున్నారు. -
ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ఆర్థికాభివృద్ధికి, జీవన ప్రమాణాల పెంపునకు, రాష్ట్రాభివృద్ధికి బాటలు వేశారు. ఈ ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా తయారైంది. బ్యాంకింగ్ రంగం కీలక సూచికలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గత ఐదేళ్లలో రాష్ట్రంలో డిపాజిట్లతో పాటు రుణాల మంజూరులో భారీగా వృద్ధి నమోదైనట్లు 226వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక వెల్లడించింది. ఐదేళ్లలో రెండేళ్లు కోవిడ్ సంక్షోభం నెలకొన్నప్పటికీ రాష్ట్ర ప్రజల జీవనోపాధికి సమస్యల్లేకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు సత్పలితాలు ఇస్తున్నాయనడానికి డిపాజిట్లలో భారీ వృద్ధి నిదర్శనం. గత ఐదేళ్లలో డిపాజిట్లలో ఏకంగా 58.23 శాతం వృద్ధి నమోదైంది. 2019 మార్చి నాటికి డిపాజిట్లు రూ.3,12,642 కోట్లు ఉండగా 2023 డిసెంబర్ నాటికి రూ.4,94,690 కోట్లు.. అంటే రూ.1,82,048 కోట్లు పెరిగాయి. అన్ని రంగాలకు బ్యాంకు రుణాల మంజూరులో ఏకంగా 96.64 శాతం భారీ వృద్ధి నమోదైంది. 2019 మార్చి నాటికి రుణాల మంజూరు రూ.3,97,350 కోట్లు ఉండగా 2023 డిసెంబర్ నాటికి రూ.7,81,313 కోట్లకు పెరిగాయి. అంటే రుణాలు రూ.3,83,963 కోట్లు పెరిగాయి. డిపాజిట్ల పెరుగుదల ప్రజల ఆదాయం పెరుగుదలకు నిదర్శనం కాగా రుణాలు ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నవరత్నాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలందరి జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా నేరుగా నగదు బదిలీని అమలు చేసింది. అలాగే బ్యాంకుల ద్వారా పేదలు, రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ఎంఎస్ఎంఈలు, ఇతర వర్గాలకు వివిధ పథకాల కింద బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం ద్వారా వారి ఆదాయం మెరుగుపడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది., ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు మహిళలకు బ్యాంకుల నుంచి రుణాలు విరివిగా లభించేలా చర్యలు చేపట్టింది. అందువల్లే గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని రంగాల్లో రుణాల మంజూరులో భారీ వృద్ధి నమోదైంది. ఆర్బీఐ నిబంధనలకన్నా అన్ని రంగాల్లో అత్యధికంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. బ్యాంకులు ఇచ్చిన రుణాలను సకాలంలో చెల్లించేలా ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తోంది. అలాగే నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు లబ్ధిదారులకు పావలా వడ్డీకి రుణాలు ఇప్పిస్తోంది. వీధుల్లో, వాడల్లో చిరు వ్యాపారాలు చేసుకునే వారికి బ్యాంకులు ద్వారా సున్నా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పిస్తోంది. వైఎస్సార్ చేయూత ద్వారా పేద మహిళలకు ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు బ్యాంకు రుణాలను మంజూరు చేయించి, వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహిస్తోంది. ప్రజలు కూడా ప్రభుత్వం అందించిన చేయూతతో సకాలంలో రుణాలు చెల్లిస్తూ వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం గత ఏడాది డిసెంబర్ నాటికి క్రెడిట్ రేషియో 60 శాతం ఉండాల్సి ఉండగా దానికి మించి 157.94 శాతం నమోదైనట్లు బ్యాంకర్ల కమిటీ నివేదిక పేర్కొంది. సీడీ రేషియో అధికంగా ఉందంటే ఆ రాష్ట్రంలో వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు అధికంగా జరగుతున్నాయనే అర్ధమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. -
2030కల్లా లక్ష కోట్ల డాలర్ల జమ
న్యూఢిల్లీ: కొత్తగా యూనికార్న్‌లుగా ఆవిర్భవించే స్టార్టప్‌ల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు లక్ష కోట్ల డాలర్లు జమయ్యే వీలున్నట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ అంచనా వేసింది. 2030కల్లా దేశ ఆర్థిక వ్యవస్థ 7 ట్రిలియన్ డాలర్లకు చేరనున్నట్లు పేర్కొంది. ఈ కాలంలో కొత్తగా 5 కోట్ల ఉద్యోగాలకు తెరలేవనున్నట్లు తెలియజేసింది. బిలియన్ డాలర్ల విలువను అందుకున్న స్టార్టప్‌లను యూనికార్న్‌గా గుర్తించే సంగతి తెలిసిందే. మెకిన్సీ అండ్ కంపెనీతో రూపొందించిన ‘యూనికార్న్ 2.0: తదుపరి ట్రిలియన్ జమ’ పేరుతో సీఐఐ నివేదికను విడుదల చేసింది. రానున్న కాలంలో రిటైల్, ఈకామర్స్, ఆధునిక తరం ఫైనాన్షియల్ సర్వీసులు, తయారీ, ఎస్ఏఏఎస్(శాస్), డిజిటల్ తదితర రంగాలు భారీ వృద్ధికి దన్నుగా నిలవనున్నట్లు నివేదిక పేర్కొంది. శతకాన్ని దాటాయ్ నివేదిక ప్రకారం దేశీయంగా 2011లో తొలి యూనికార్న్ నమోదుకాగా.. దశాబ్దం తదుపరి 100 మార్క్‌ను యూనికార్న్‌లు చేరుకున్నాయి. 2024 జనవరికల్లా 113 యూనికార్న్‌ల ఉమ్మడి విలువ 350 బిలియన్ డాలర్లను తాకడం గమనార్హం! యూనికార్న్‌ల సంఖ్య 100ను అధిగమించడం చెప్పుకోదగ్గ విజయంకాగా.. ఇందుకు పలు కీలక అంశాలు సహకరించాయి. ఇందుకు యువత డిజిటల్ సేవలను అందిపుచ్చుకోవడం, విస్తారిత మొబైల్ ఇంటర్నెట్ వినియోగం, మధ్యతరగతి పుంజుకోవడం, దన్నుగా నిలిచిన మార్గదర్శకాలు కారణమయ్యాయి. -
ఆధ్యాత్నిక పర్యాటకం.. ఆర్థిక వృద్ధికి దోహదం
దేశ వ్యాప్తంగా ప్రధాన ఆలయాలకు దేశ విదేశాల నుంచి భక్తులు నిరంతరం పోటెత్తుతున్నారు. ప్రఖ్యాత ఆలయాలు, ప్రదేశాలు లక్షలాది మంది భక్తులు, పర్యాటకులతో కళకళలాడుతున్నాయి. ఆలయాల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధి కూడా వేగంగా జరుగుతోంది. చిన్న చిన్న పరిశ్రమలకు, వృత్తి కళాకారులకు చేతినిండా పనిదొరుకుతోంది. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతున్నాయి. ఇటీవలప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కూడా ఆధ్మాత్నిక పర్యాటకానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఆధ్మాత్మిక పర్యాటకంతో స్థానిక వ్యాపారులకు పెద్దఎత్తున అవకాశాలు లభిస్తాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తన ప్రసంగంలో కూడా చెప్పారు. సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా ఏటా ఆధ్యాత్నిక పర్యాటకం పెరుగుతోంది. ప్రఖ్యాత ఆలయాలు, ప్రదేశాలు యాత్రికులను ఆకర్షించడమే కాకుండా ఆర్థిక వృద్ధికి ఉ్రత్పేరకంగా మారుతున్నాయి. కోవిడ్ మహమ్మారి తర్వాత భారతీయుల్లో ఆధ్యాత్నిక భావనలు, భక్తి విశ్వాసాలు మరింత బలపడినట్టు గణాంకాలను బట్టి తెలుస్తోంది. 2022లో తీర్థయాత్ర కోసం ప్రయాణాల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది. దేశంలో ఆధ్యాత్నిక కేంద్రాలకు వచ్చే విరాళాల వాటా 14 శాతం పెరిగింది. ఈ క్రమంలోనే 2023–30 మధ్యకాలంలో దాదాపు 16 శాతానికిపైగా వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)ను అధిగమిస్తోందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలోని పురాతన ఆలయాలు, క్షేత్రాలు ఆధ్యాత్నిక పర్యటనలకు స్వర్గధామంగా మారాయి. విస్తృతంగా ఉద్యోగాల కల్పన ఆధ్యాత్నిక పర్యటన భక్తితో పాటు దేశంలోని నైపుణ్యం కలిగిన యువతకు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తోంది. ఆధ్యాత్నిక హాట్ స్పాట్స్‌లో భక్తుల అవసరాలను తీర్చేందుకు వీలుగా హోటళ్లు, రెస్టారెంట్లు వస్తున్నాయి. తద్వారా పాకశాస్త్ర కళలు, ఈవెంట్ ప్లానింగ్ వరకు ఆతిధ్య పరిశ్రమలో అనేక ఉద్యోగాలు వస్తున్నాయి. కేంద్ర పర్యాటక మంత్రిత్వ లెక్కల ప్రకారం దేశంలో 2022లో వంద కోట్ల మంది పర్యాటకులు వివిధ ప్రాంతాలను సందర్శించారు. ఇందులో ఆధ్యాత్మిక ప్రదేశాలు సుమారు రూ. 1.34 లక్షల కోట్లు ఆర్జించాయి. ఎక్కువగా విదేశీలు భారతీయ సంస్కృతి, ఆలయాల చరిత్రను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతూ ఇక్కడకి వస్తున్నారు. అందుకే ఈ రంగం 2030 నాటికి 14 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, బిహార్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో ఉద్యోగాల సృష్టికి ఆలయాలు చోదక శక్తిగా ఉంటాయని విశ్వసిస్తున్నారు. ఆధ్యాత్నిక పర్యటనల్లో ప్రయాణం, ఆతిథ్యం, పర్యాటక పరిశ్రమల్లో చిన్న సంస్థలకు మేలు జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్‌డబ్ల్యూటీఓ)సైతం తరచుగా సంస్కృతి అన్వేషణలో భాగంగా ఆధ్యాత్నికతలో కొత్త అనుభవాలు కోరుకునేవారు పెరుగుతున్నట్టు గుర్తించింది. టాప్‌లో తిరుపతి.. దేశ ఆధ్యాత్నిక పర్యాటకంలో అయోధ్య రామ మందిరం రిలీజియస్ టూరిజంలో కీలక మార్పులు తీసుకొస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడున్న పర్యాటకులకు అదనంగా 5 నుంచి 10 కోట్ల మందికిపైగా భారత్‌ను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. తాజ్ మహల్ (65 లక్షలు), రోమ్‌లోని వాటికన్ సిటీ (90 లక్షలు), సౌదీ అరేబియాలోని మక్కా (2 కోట్లు) వార్షిక సందర్శకుల సంఖ్యల కంటే అయోధ్య ప్రత్యేకంగా నిలుస్తుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి దేవాలయం ఏడాదికి 2.50 కోట్ల మంది సందర్శకులతో టాప్‌లో నిలుస్తోంది. జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయం 80 లక్షల మంది సందర్శకులతో అలరాలుతోంది. ఇలాంటి ఆలయాలు భారతదేశంలో బలమైన ఆధ్యాత్నిక, చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఏపీలోనూ ప్రత్యేక సర్క్యూట్లు ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక పర్యాటకంలో అతిపెద్ద విభాగంగా ఉంది.ం మెరుగైన కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలతో సరికొత్త ఆర్థిక ప్రభావాన్ని కలిగి ఉంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ), దేవదాయశాఖ సంయుక్తంగా ‘రిలీజియస్ టూరిజం’ను ప్రవేశపెట్టాయి. తిరుమల, మహానంది, శ్రీశైలం, అహోబిలం, యాగంటి, శ్రీకాళహస్తి, అన్నవరం, సింహాచలం, అరసవల్లి, శ్రీకూర్మం, అమరావతి, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట, పిఠాపురం, విజయవాడ, మంగళగిరి, కోటప్పకొండ, మంత్రాలయం, లేపాక్షి, కదిరి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శనలను ఒకే ప్లాట్‌ఫాంపైకి తీసుకొచ్చింది. నిత్యం ఆధ్యాత్నిక పర్యటనలను ప్రోత్సహించేలా భక్తులకు నచి్చన ఆలయాలను కలుపుతూ ప్యాకేజీలు అందిస్తోంది. తిరుపతిలో భక్తులకు చింతలేని దర్శనాన్ని కల్పించడం కోసం బ్యాకెండ్ సేవలను ప్రారంభించింది. సర్క్యూట్ టూరిజంలో భాగంగా 100కి పైగా ఆలయాల జాబితాను సిద్ధం చేసింది. దశల వారీగా ఆధ్యాత్నిక టూర్లను అందుబాటులోకి తెస్తోంది. -
బహీ ఖాతా తరహా పౌచ్‌లో బడ్జెట్ ట్యాబ్
న్యూఢిల్లీ: కట్టలకొద్దీ బడ్జెట్ ప్రతులతో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టే సంస్కృతికి ఫుల్స్టాప్ పడి చాలా కాలమైంది. కాగితరహితమైన బడ్జెట్‌ను ఈసారీ విత్తమంత్రి నిర్మల విశిష్టమైన బహీ ఖాతా తరహాలో ఎరుపు రంగు పౌచ్‌లో ట్యాబ్‌ను తీసుకొచ్చారు. బ్రీఫ్‌కేస్ విధానాన్ని వదిలేసి గత మూడేళ్లుగా ఆమె ఇలాగే పౌచ్‌లోనే ట్యాబ్‌ను తీసుకొస్తున్నారు. బడ్జెట్ ప్రసంగం చేయడానికి పార్లమెంట్‌కు రావడానికి ముందు ఆమె కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయం బయట సహాయ మంత్రులు, శాఖ ఉన్నతాధికారులతో ట్యాబ్ పట్టుకుని గ్రూప్ ఫొటో దిగారు. 2020 లోనూ ఆమె బహీ ఖాతానే తెచ్చారు. 2021లో తొలిసారిగా పౌచ్‌లో ట్యాబ్‌ను పట్టుకొచ్చారు. అదే సంస్కృతిని ఈసారీ కొనసాగించారు. 2019లో సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌తో కలుపుకుంటే 2014 ఏడాది నుంచి మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 12వ బడ్జెట్ ఇది. నిర్మలకు ఇది ఆరో బడ్జెట్. దశాబ్దాలుగా బడ్జెట్‌ను సాయంత్రం ఐదు గంటలకు ప్రవేశపెట్టేవారు. ఈ ఆనవాయితీకి వాజ్‌పేయీ చెల్లుచీటీ ఇచ్చారు. వాజ్‌పేయీ హయాంలో నాటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఉదయం 11 గంటలకే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆనాటి నుంచి అదే సంస్కృతి కొనసాగుతోంది. బడ్జెట్ వివరాలను బ్రీఫ్‌కేస్‌కు బదులు బహీఖాతాలో తీసుకురావడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం స్పందించారు. ‘‘ఈ సంస్కృతి ఇలాగే కొనసాగుతోంది. భవిష్యత్తులో మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అయితే ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ఐప్యాడ్‌లోనే తీసుకొస్తారు’’అని వ్యాఖ్యానించారు. -
GYAN పద్దు!
న్యూఢిల్లీ: దేశ సుస్థిర, సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా, దేశాన్ని ‘వికసిత్ భారత్’గా మార్చే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశంలో పేదలు, యువత, రైతులు, మహిళల సాధికారత, సంక్షేమమే తమ ప్రాధాన్యత అని ప్రకటించారు. గత పదేళ్లలో అభివృద్ధి ఎంతో వేగం పుంజుకుందని పేర్కొన్నారు. ఆమె గురువారం పార్లమెంటులో 2024–25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సీతారామన్ ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే.. ‘‘గత పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ సకారాత్మకంగా గణనీయ మార్పు సాధించింది. దేశ ప్రజలు ఎంతో ఆశగా, నమ్మకంతో భవిష్యత్తు వైపు చూస్తున్నారు. ప్రజల ఆశీర్వాదంతో, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ఎన్నో సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొంది. ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’ మంత్రంతో, ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ముందడుగు వేస్తోంది. ఆర్థిక వ్యవస్థ నూతన శిఖరాల దిశగా సాగుతోంది. రెండోసారి ఘన విజయం సాధించిన తర్వాత మోదీ సర్కారు.. ‘సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్’ మంత్రాన్ని చేపట్టి దేశంలోని అన్ని ప్రాంతాలు, అన్నివర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి చర్యలు చేపట్టింది. అవినీతి, బంధుప్రీతి తగ్గాయి. సామాజిక న్యాయం అందుతోంది. ఆత్మనిర్భర్ భారత్‌తో అమృత కాలానికి.. ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి విసిరిన సవాళ్లను ఎదుర్కొని.. ఆత్మనిర్భర్ భారత్‌తో అమృతకాలానికి పునాదులు వేసుకున్నాం. అద్భుతమైన భవిష్యత్తు దిశగా సాగుతున్నాం. అందరికీ ఇళ్లు, ప్రతి ఇంటికీ నీళ్లు, విద్యుత్, వంటగ్యాస్, బ్యాంకు ఖాతాలు వంటివాటితో దేశంలోని ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. వికసిత్ భారత్ దిశగా.. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ప్రజలందరికీ సమాన అవకాశాలతో ప్రకృతితో కలసి సాగుతూ.. 2047 నాటికి ‘వికసిత భారత్’గా రూపొందే దిశగా అడుగులు వేస్తాం. వచ్చే ఐదేళ్లలో అనూహ్య ప్రగతి సాధించబోతున్నాం. మనకు అవకాశాలకు కొదవలేదు. ఆకాశమే హద్దు. ఈ అద్భుతమైన పనితీరు చూపిన మా ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. ‘వికసిత భారత్’ దిశగా చేపట్టే రోడ్‌మ్యాప్‌ను జూలైలో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో వెల్లడిస్తాం. ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఎదురవుతున్నా.. కొన్నేళ్లుగా యుద్ధాలు, వివాదాలతో ప్రపంచ పరిణామాలు సంక్లిష్టంగా మారుతున్నాయి. కీలక ఖనిజాలు, సాంకేతికతలు, సరుకుల రవాణాకు ఆటంకం కలుగుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, అప్పుల భారం, పర్యావరణ సమస్యలు సవాలుగా మారుతున్నాయి. వీటిని దీటు గా ఎదుర్కొంటూ, సరైన పరిష్కారాలను అనుసరిస్తూ ముందుకు సాగుతున్నాం.ఇండియా–మధ్యప్రాచ్య దేశాలు– యూరప్ ఎకానమిక్ కారిడార్ మనదేశానికి ఒక గేమ్ చేంజర్. ప్రపంచ వాణిజ్యానికి కీలకంగా మారనున్న ఈ కారిడార్‌కు మూలం భారత్ అన్న విషయం చరిత్రలో నిలిచిపోతుంది. మరిన్ని సంస్కరణలు తెస్తాం సుస్థిర, సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి కోసం, అందరికీ అవకాశాలు అందించడం కోసం మరిన్ని సంస్కరణలు తెస్తాం. రాష్ట్రాలు, ఇతర భాగస్వాములతో చర్చించి అమలు చేస్తాం. ప్రపంచంతో పోటీపడేలా పరిశ్రమలకు తోడ్పాటుఅందిస్తాం. తూర్పు ప్రాంతం, అక్కడి ప్రజలు దేశ అభివృద్ధిని ముందుండి నడిపించేలా దృష్టిసారిస్తాం. లక్షాధికారులను చేసేలా.. 83 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలతో 9 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారు. వారిలో కోటి మంది ఇప్పటికే లక్షాధికారులు (లక్పతి దీదీ) అయ్యారు. త్వరలో మూడు కోట్ల మందిని ‘లక్పతి దీదీ’గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జీడీపీ అంటే.. ఈ మూడు.. : స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దేశం దూసుకుపోతోంది. అదే సమయంలో కీలకమైన మరో మూడు అంశాల ‘జీడీపీ.. గవర్నెన్స్ (పరిపాలన), డెవలప్మెంట్ (అభివృద్ధి), పర్ఫార్మెన్స్ (పనితీరు)’పై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజలే కేంద్రంగా పారదర్శక, బాధ్యతాయుతమైన పరిపాలన అందించేందుకు.. సమ్మిళిత అభివృద్ధి కోసం కృషి చేస్తోంది. నాలుగు వర్గాలకు ప్రాధాన్యత పేదలు, మహిళలు, యువత, రైతులు.. ఈ నాలుగు వర్గాల అవసరాలు, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ నాలుగు వర్గాల వారికి ప్రభుత్వ మద్దతు అవసరం. వారు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. పేదలకు మరో రెండు కోట్ల ఇళ్లు ► పీఎం ఆవాస్ యోజన ద్వారా గత ఐదేళ్లలో మూడు కోట్ల ఇళ్లను నిర్మించాలన్న లక్ష్యానికి దాదాపు పూర్తి చేసుకుంటున్నాం. వచ్చే ఐదేళ్లలో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మిస్తాం. ► రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టు ద్వారా కోటి ఇళ్లకు ప్రతినెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతుంది. ప్రజలకు ఏటా రూ.15 వేల నుంచి రూ.18 వేలు ఆదా అవుతాయి. దీనితో ఎంతో మందికి ఉపాధి కూడా లభిస్తుంది. ► అద్దె ఇళ్లలో నివసిస్తున్న మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు త్వరలో కొత్త పథకాన్ని ప్రారంభిస్తాం. ► దేశంలో మెడికల్ కాలేజీల సంఖ్యను గణనీయంగా పెంచుతాం. దీనిపై ప్రతిపాదనల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. ► మహిళల్ల సర్వైకల్ కేన్సర్ నివారణ కోసం 9–14 ఏళ్ల మధ్య వయసు బాలికలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతాం. ► గర్భిణులు, శిశువుల సంక్షేమం, పోషకాహారం అందించడం కోసం అంగన్వాడీలను ‘సక్షం అంగన్వాడీ అండ్ పోషణ్ 2.0’గా అప్‌గ్రేడ్ చేస్తాం. ► చిన్నారుల్లో వ్యాధుల నివారణ కోసం టీకాల కార్యక్రమాన్ని విస్తృతం చేస్తాం. ► ఆశా, అంగన్వాడీ వర్కర్లకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేస్తాం. ► రైతులకు ప్రయోజనం కలిగేలా ఫుడ్ ప్రాసెసింగ్, పంటల నిల్వ, రవాణా సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తాం. నానో డీఏపీ వినియోగాన్ని పెంచుతాం. ► వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఇతర నూనె గింజల దిగుబడి పెరిగేలా పరిశోధన, ఆధునిక వ్యవసాయ విధానాలపై పరిశోధనలను ప్రొత్సహిస్తాం. ► పశువుల్లో ఫుట్ అండ్ మౌత్ వ్యాధి నియంత్రణకు చర్యలు చేపడతాం. ► మత్య పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఐదు సమీకృత ఆక్వాపార్క్‌లను ఏర్పాటు చేస్తాం. ► సరికొత్త టెక్నాలజీల రూపకల్పన, అభివృద్ధిని ప్రోత్సహించేందుకు రూ.లక్ష కోట్లతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తాం. ► రక్షణ రంగం కోసం డీప్–టెక్ సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి కొత్త పథకాన్ని ప్రారంభిస్తాం. ► దేశంలో పర్యాటకాన్ని పెంచేందుకు ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ఇందుకోసం రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాలు ఇస్తాం. పేదల సంక్షేమమే.. దేశ సంక్షేమం.. పేదలకు సాధికారత కోసం ప్రభుత్వం వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేసింది. ఫలితంగా గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ప్రభుత్వం వివిధ పథకాల కింద రూ.34 లక్షల కోట్లను నేరుగా జన్‌ధన్ ఖాతాల్లో జమ చేసింది. దీనిద్వారా వృధా వ్యయం, అక్రమాలకు చెక్‌పడి ప్రభుత్వానికి రూ.2.7లక్షల కోట్లు మిగిలాయి. పీఎం స్వానిధి పథకం ద్వారా 78 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలు అందించాం. పీఎం జన్మన్ యోజన ద్వారా ఆదివాసీలు, విశ్వకర్మ యోజన పథకం ద్వారా చేతివృత్తుల వారు ప్రయోజనం పొందారు. రైతులు మనకు అన్నదాతలు దేశంలో రైతు కేంద్రిత విధానాలు అమలు చేస్తున్నాం. పంటలకు మద్దతు ధరలను క్రమంగా పెంచుకుంటూ వస్తున్నాం. కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా దేశవ్యాప్తంగా 11.8కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఏటా నగదు జమ అవుతోంది. నాలుగు కోట్ల మంది రైతులకు ఫసల్ బీమా యోజన అందుతోంది. ఈనామ్ ద్వారా 1,361 మార్కెట్లతో 1.8 కోట్ల మంది రైతులకు సేవలు అందుతున్నాయి. యువత సాధికారతతోనే దేశ శ్రేయస్సు యువతకు తగిన ప్రోత్సాహాన్ని, సాధికారతను అందించడంపైనే దేశ శ్రేయస్సు ఆధారపడి ఉంది. ప్రభుత్వం తెచి్చన జాతీయ విద్యా విధానం–2020 దేశంలో గుణాత్మక సంస్కరణలకు మార్గం వేసింది. పీఎంశ్రీ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతోంది. స్కిల్ ఇండియా మిషన్ ద్వారా 1.4కోట్ల మంది యువత శిక్షణ పొందారు. ప్రభుత్వం ఏడు ఐఐటీలు, 16 ట్రిపుల్ ఐటీలు, 7 ఎయిమ్స్, 390 యూనివర్సిటీలతోపాటు 3 వేల కొత్త ఐటీఐలను నెలకొల్పింది. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు పీఎం ముద్రా యోజన ద్వారా 22.5 లక్షల కోట్ల రుణా లు అందించాం. స్టార్టప్ ఇండియా, స్టార్టప్ క్రెడిట్ గ్యారెంటీ పథకాలను అమలు చేస్తున్నాం. ఇప్పుడు వారు ‘ఉద్యోగ దాత’లు అవుతున్నారు. క్రీడలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహానికి.. ఆసియన్ గేమ్స్‌లో మన క్రీడాకారులు సాధించిన పతకాలే నిదర్శనం. నారీ శక్తి ముందడుగు.. గత పదేళ్లలో మహిళల సాధికారత, ఆత్మగౌరవం కోసం తీసుకున్న చర్యలతో ‘నారీ శక్తి’ ముందడుగు వేస్తోంది. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు 30 కోట్ల ముద్ర రుణాలు అందించాం. ఉన్నత విద్యను అభ్యసించే మహిళలు 28శాతం పెరిగారు. ‘స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథ్స్)’ కోర్సుల్లో చేరుతున్నవారిలో 43శాతం మంది మహిళలే. ఇది ప్రపంచంలోనే అత్యధికం. ఇవన్నీ ఉద్యోగాలు/ఉపాధిలో మహిళ భాగస్వామ్యం పెంచాయి. త్రిపుల్ తలాక్ రద్దు, లోక్‌సభ/అసెంబ్లీలలో మూడో వంతు రిజర్వేషన్లు, పీఎం ఆవాస్ యోజన కింద 70శాతం మహిళా లబ్ధిదారులకే మంజూరు వంటివి మహిళల ఆత్మగౌరవానికి తోడ్పడుతున్నాయి. -
ప్రధాని మోదీపై పుతిన్ ప్రశంసలు
మాస్కో: ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పలు ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారత్ అమలు పరుస్తున్న విదేశి విధానాలు అసాధారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఇటువంటి సమయంలో అన్ని రంగాల్లో ప్రపంచం వ్యాప్తంగా దూసుకుపోవటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వంటి ధృడమైన నాయకత్వం ఉండటమే కారణమని మోదీపై పుతిన్ ప్రశంసలు కురిపించారు. భారత్‌ను శక్తివంతమైన దేశంగా ముందుకు నడిపించటంలో మోదీ గుర్తింపు పొందారని పుతిన్ అభిప్రాయపడ్డారు. గురువారం కలింగ్రాడ్ ప్రాంతంలో నిర్వహించిన ‘రష్యన్ స్టుడెంట్ డే’ కార్యక్రమంలో పుతిన్ పాల్గొన్నారు. ‘ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత్. సమర్థవంతమైన నాయకత్వం లక్షణాలు ఉన్న వ్యక్తి భారత్‌కు ప్రధానిగా ఉన్నారు. ప్రధాని నాయకత్వ పటిమ వల్లనే ఇండియా ఈ రోజు మనం చూస్తున్న వృద్ధిలోకి వచ్చింది’ పుతిన్ పేర్కొన్నారు. ‘ప్రపంచ వేదికలపై భారత్.. రష్యాపై ఎప్పుడూ వ్యతిరేకమైన వైఖరితో నిర్ణయాలు తీసుకోలేదు. రష్యాపై ఇప్పటివరకు ద్వంద వైఖరిని భారత్ ప్రదర్శించలేదు. అందుకే భారత్, ఆ దేశ నాయకత్వంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉంది’ అని పుతిన్ అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి కార్యక్రమం రష్యాతోపాటు ప్రపంచ దేశాల్లో కూడా చర్చకు వస్తోందన్నారు. భారత్‌కు అంత్యంత ఎక్కువ విదేశి పెట్టుబడులు రష్యా నుంచి లభిస్తున్నాయని తెలిపారు. తమ దేశంలోని పలు కంపెనీలు భారత్‌లో ఇప్పటికే సుమారు సుమారు 23 బిలియన్ అమెరికా డాలర్ల మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టినట్లు వెల్లడించారు. చదవండి: ఖరీదైన బ్యాగ్ గిఫ్ట్.. దక్షిణ కొరియా రాజకీయాల్లో దుమారం -
G20 Summit 2023: శిఖరాగ్ర భేటీకి శ్రీకారం
న్యూఢిల్లీ: అద్భుతమైన ప్రపంచ ఆర్థికాభివృద్ధి సాధనే పరమావధిగా సాగే జీ20 అగ్రరాజ్యాల కూటమి సమావేశానికి హస్తిన సర్వాంగ సుందరంగా ముస్తాబై సభ్య దేశాల అధినేతలకు సాదర స్వాగతం పలుకుతోంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తదితర ప్రపంచ దేశాల ఆగమనంతో జీ20 శిఖరాగ్ర సదస్సు హడావిడి మరింత పెరిగింది. శనివారం సైతం మరికొందరు నేతలు విచ్చేస్తున్నారు. శుక్రవారం ఢిల్లీలో అడుగుపెట్టగానే బైడెన్‌తో మోదీ విస్తృతస్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రపంచ శ్రేయస్సుకు పాటుపడతామని ప్రకటించారు. మానవ కేంద్రిత, సమ్మిళిత అభివృద్ధి దిశగా సదస్సు కొత్త బాటలుపరుస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం ప్రకటించారు. మరోవైపు ఢిల్లీ డిక్లరేషన్ దాదాపు సిద్ధమైందని, ఏకాభిప్రాయం సాధిస్తామని భారత్ ధీమా వ్యక్తంచేసింది. 9, 10 తేదీల్లో (శని, ఆదివారాల్లో) జరిగే సదస్సుకు హాజరయ్యే నేతల రాక, సాదర స్వాగతం, అతిథులకు ఆతిథ్యంతో ఢిల్లీలో కోలాహలం పెరిగింది. పసందైన వంటకాలు, భిన్న సంప్రదాయ వాయిద్యాలతో సంగీత విభావరి ఇలా పలు రకాల కార్యక్రమాలు, ప్రదర్శనలతో అధినేతలకు మరెప్పుడూ మరిచిపోలేని రీతిలో అద్భుతంగా అతిథ్యం ఇవ్వనున్నారు. వాతావరణ మార్పులు, ఉక్రెయిన్–రష్యా యుద్ధం, ఆర్థిక అనిశి్చతి, మాంద్యం భయాలు వంటి కీలక అంశాలతో చర్చలు శిఖరాగ్రానికి చేరుకోనున్నాయి. ఎలాగైనా సరే సదస్సు ముగిసేనాటికి అందరి ఏకాభిప్రాయంతో సంయుక్త ప్రకటన విడుదల చేసేందుకు భారత్ శాయశక్తులా కృషిచేస్తోంది. నేడు మొదలయ్యే ఈ చర్చా సమరంలో నేతలు చివరకు ఎలాంటి వాగ్దానాలు చేస్తారో, ఏమేం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూద్దాం..!! దుర్భేద్యమైన భద్రత ముఖ్యనేతలంతా ఢిల్లీకి వచ్చేస్తున్న నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో ఢిల్లీలో భద్రతా బలగాలను మొహరించారు. చర్చలకు ప్రధాన వేదిక అయిన ‘భారత్ మండపం’ కాంప్లెక్స్ వద్ద భద్రతను పోలీసులు, పారామిలటరీ, నిఘా వర్గాలతో కట్టుదిట్టం చేశారు. తొలిసారిగా ఇండియా ఈ సదస్సును నిర్వహిస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చేసేందుకు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సదస్సు వివరాలను జీ20లో భారత షెర్పా అమితాబ్ కాంత్ శుక్రవారం ఢిల్లీలో వివరించారు. ‘ మన న్యూఢిల్లీ డిక్లరేషన్ దాదాపు సిద్ధం. దానిని ఇప్పుడు బహిర్గతం చేయలేం. ఎందుకంటే డిక్లరేషన్ తాలూకు ప్రతిపాదలను అధినేతలకు సమరి్పస్తాం. వారి సూచనలు, సవరణల తర్వాతే దానికి ఆమోదం లభిస్తుంది. ఆ తర్వాతే డిక్లరేషన్ ద్వారా సాధించబోయే విజయాలను వివరిస్తాం’ అని అమితాబ్ చెప్పారు. ‘ ఐక్యరాజ్యసమితి తర్వాత అత్యంత క్రియాశీలకమైన కూటమిగా ఉన్న ఆఫ్రికన్ యూనియన్ను జీ20లో చేర్చుకునేందుకు దాదాపు అందరినీ ఒప్పించడం భారతదేశ నిబద్ధతకు నిదర్శనం’ అని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా చెప్పారు. ఆఫ్రికన్ యూనియన్ ఆగమనం మాకు సంతోషదాయకమే అని యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైఖేల్ అన్నారు. ఆఫ్రికన్ యూనియన్‌లో మొత్తంగా 55 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. నేటి ప్రపంచానికి సరిపోయే నినాదమిది మహా ఉపనిషత్తు నుంచి స్ఫూర్తి పొంది రూపొందించిన ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు ఇతివృత్తం’ నేటి ప్రపంచానికి సరిపోయే నినాదమని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. కాగా, చర్చల్లో రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రధానంగా ప్రస్తావించి చర్చించాలని బ్రిటన్ భావిస్తోంది. దీంతో ఈ చర్చలో భారత్ పాత్ర కీలకంగా మారనుంది. ‘ ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణ, మానవ హక్కుల హననంపై ఇండియా తన నిర్ణయం వెలువరచాలని చర్చలో పట్టుబడతాం. మోదీతో, ఇతరులతో భేటీలను పుతిన్ దారుణ అకృత్యాలను ఆపేందుకు సాధనాలుగా వినియోగిస్తాం’ అని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అధికార ప్రతినిధి చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో కూటమి సభ్య దేశాల మధ్య భేదాభిప్రాయాలున్నా ఏకాభిప్రాయానికి ప్రయతి్నస్తామని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ చెప్పారు. కాగా, భారత్ తమకు వ్యతిరేకంగా జీ20 వేదికగా ప్రకటన చేయాలని జీ7 దేశాలు ఒత్తిడి చేస్తున్నాయని రష్యా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో ఆరోపించింది. డిజిటల్ మౌలిక వసతులు, వాతావరణ సంబంధ నిధులు, సుస్థిరాభివృద్ధి, శుద్ధ ఇంథనం వంటి అంశాల్లో జీ20 వేదికగా సానుకూల నిర్ణయాలు వెలువడతాయని అంతర్జాతీయ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ ఒకటో తేదీన కూటమి సారథ్య బాధ్యతల్ని భుజానికి ఎత్తుకున్న భారత్ అప్పట్నుంచీ దేశవ్యాప్తంగా భిన్న నగరాలు, వేదికలపై 200 సమావేశాలను నిర్వహించింది. ప్రపంచ జీడీపీలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల జనసంఖ్య జీ20 దేశాల్లోనే ఉంది. అందుకే ఈ సదస్సులో తీసుకునే నిర్ణయాలు పెను ప్రభావం చూపిస్తాయి. సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం జీ20 శిఖరాగ్రంలో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ తదితరులు శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. సంప్రదాయ నృత్యాల నడుమ వీరికి ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలినా జార్జియెవా విమానాశ్రయంలో డ్యాన్స్ చేశారు. భారతీయ సంస్కృతిపై క్రిస్టలినా చూపిన మక్కువను ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రశంసించారు. వచ్చే రెండు రోజుల్లో వివిధ దేశాల నేతలతో ఫలప్రదమైన చర్చలు జరిపేందుకు ఆసక్తితో ఉన్నట్లు ఆయన తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం భారత్‌కు వచ్చారు. ఆయన సతీమణి జిల్ బైడెన్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. బైడెన్‌కు చేసిన రెండు పరీక్షల్లోనూ నెగెటివ్‌గా రావడం పర్యటనను ఖరారు చేసుకున్నారు. ఇటలీ ప్రధాని జియోర్జియా మెలోనీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాలకు విమానాశ్రయంలో కేంద్ర మంత్రులు శోభా కరంద్లాజే, దర్శనా జర్దోష్ స్వాగతం పలికారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే, అర్జెంటినా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్‌కు కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే స్వాగతం పలికారు. కొమరోస్ అధ్యక్షుడు, ఆఫ్రికన్ యూనియన్ చైర్ పర్సన్ కూడా అయిన అజలి అస్సౌమనీ, రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్, ఒమన్ డిప్యూటీ ప్రధాని సయ్యిద్ ఫహద్, ఈజిప్టు అధ్యక్షుడు ఫతా ఎల్–సిసి, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్, ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్, యూఏఈ ప్రెసిడెంట్ అల్ నహ్యాన్‌లకు కూడా ఘన స్వాగతం లభించింది. ఐరాస సెక్రటరీ జనరల్ గుటెర్రస్‌కు అధికారులు స్వాగతం పలికారు. జీ20(గ్రూఫ్ ఆఫ్ 20)లో అర్జెంటినా, ఆ్రస్టేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేసియా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, తుర్కియే, యూకే, అమెరికా, యూరోపియన్ యూనియన్(ఈయూ)సభ్యులన్న విషయం తెలిసిందే. బ్రిటిష్ కౌన్సిల్ విద్యార్థులతో సునాక్ ముఖాముఖి శుక్రవారం యూకే ప్రధాని రిషి సునాక్ ఢిల్లీలోని బ్రిటిష్ కౌన్సిల్‌కు వెళ్లి సిబ్బంది, విద్యార్థులతో ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. -
పడుతూ లేస్తూ.. పైపెకి!... ఒడిదొడుకుల మధ్య ఆర్థికాభివృద్ధి
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పదేళ్లలో ఎంతో అభివృద్ధిని సాధించినట్లు రాష్ట్ర ప్ర భుత్వం ప్రకటించింది. అనేక సవాళ్లను అధిగమించి వివిధ రంగాల్లో గణనీయ ప్రగతిని సాధించడం వెనుక జిల్లాల విభజన, జిల్లాలు సాధించిన జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ), తలసరి ఆదాయం (పీసీఐ)కారణంగా పేర్కొంది. రాష్ట్రం ఏర్పడక ముందు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల (బీఆర్జీఎఫ్)కింద ఉన్న తొమ్మిది జిల్లాల్లో ఉమ్మడి వరంగల్ ఒకటి కాగా.. ఆతర్వాత అభివృద్ధిలో అన్ని రంగాల్లో పురోగతి సాధించింది. పదేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో సాధించిన ప్రగతి సూచికలో ఉమ్మ డి వరంగల్ జిల్లా భాగస్వామ్యం కూడా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ ఆర్థికాభివృద్ధి–10’ నివేదికలో వెల్లడించింది. ఆర్థిక వృద్ధి రేటులో హనుమకొండ టాప్–2 ఉమ్మడి వరంగల్‌లో ఆరు జిల్లాలు ఉండగా.. 2021–22 సంవత్సరానికి ఆర్థిక వృద్ధిలో హనుమకొండ జిల్లా టాప్–2లో నిలిచినట్లు నివేదిక స్పష్టం చేసింది. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ ఉత్తమ పనితీరు కనబర్చాయి. ప్రస్తుత ధరల ప్రకారం.. వరుసగా 34.2 శాతం, 24.9 శాతం వృద్ధి రేటుతో ఈరెండు జిల్లాలు ఉన్నాయి. వీటితో పాటు రాష్ట్రంలోని 32 జిల్లాలు వృద్ధి రేటులో పురోగమించగా.. రూ.6,240 కోట్ల జీడీపీపీతో అన్నింటికన్నా చివరన ములుగు జిల్లా నిలిచింది. జిల్లాల ఆర్థికాభివృద్ధికి సూచికగా జీడీడీపీని పరిగణించగా.. అభివృద్ధి అంతా హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే కేంద్రీకృతం కాగా.. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో కొద్దిగా మెరుగ్గా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. గ్రేటర్ వరంగల్ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి కారణంగా.. ఆర్థిక వృద్ధిలో టాప్–2లో నిలిచినట్లు నివేదిక చెబుతోంది. భూపాలపల్లి భేష్ 2021–22లో రంగారెడ్డి జిల్లా రూ.7,58,102 తలసరి ఆదాయంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవగా..రూ.2,34,818తో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎనిమిదో స్థానంలో నిలిచింది.వరంగల్ జిల్లా రూ.1,94,317తో 16వ స్థానం, రూ.1,86,278తో జనగామ 18, రూ.1,79,222లతో మహబూబాబాద్ 20, రూ.1,77,316తో ములుగు 21వ స్థానాల్లో నిలవగా.. హనుమకొండ రూ.1,56,086తో చివరి స్థానానికి చేరింది. బాగా పట్టణీకరణ జరిగిన జిల్లాలతో పోల్చితే.. మారుమూల గ్రామీణ జిల్లాలు తలసరి ఆదాయంలో వెనుకబడి ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. హనుమకొండ జిల్లా కూడా తలసరి ఆదాయంలో వెనుకబడగా.. భూపాలపల్లి మినహా మిగతా జిల్లాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తలసరి ఆదాయం విషయంలో పదేళ్లలో వృద్ధిరేటు గణనీయంగానే పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆయా జిల్లాల ప్రజల సగటు ఆదాయం పెరుగుతూ వస్తోంది. హనుమకొండ జిల్లాలో 2015–16 సంవత్సరానికి తలసరి సగటు ఆదాయం రూ.77,378 ఉండగా.. అది కాస్తా.. 2021–22 నాటికి రూ.1,56,086కు పెరిగింది. వరంగల్ రూరల్, మహబూబాబాద్, ములుగు, జనగామ, జేఎస్ భూపాలపల్లిలోనూ తలసరి సగటు ఆదాయం పెరిగినట్లు నివేదికలో గణాంకాలు చెబుతున్నాయి. -
3 జిల్లాలు = 30 జిల్లాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా.. ఆర్థికాభివృద్ధిలో కేవలం మూడు జిల్లాలకే 43.72 శాతం వాటా ఉంది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పట్టణీకరణ ఎక్కువగా ఉన్న రంగారెడ్డి జిల్లా రూ.2,26,957 కోట్లు, హైదరాబాద్ జిల్లా రూ.1,86,225 కోట్లు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రూ.73,132 కోట్ల స్థూల జిల్లా దేశీయోత్పత్తి (జీడీడీపీ)ని సాధించి.. ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచాయి. రాష్ట్రంలోని మిగతా 30 జిల్లాలు కలిపి వాటా 56.28 శాతమే కావడం గమనార్హం. ములుగు జిల్లా రూ.6,240 కోట్ల జీడీడీపీతో అన్నింటికన్నా చివరన నిలిచింది. ‘తెలంగాణ ఆర్థికాభివృద్ధి ః 10’ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. జిల్లాల ఆర్థికాభివృద్ధికి సూచికగా జీడీడీపీని పరిగణిస్తుంటారు. అభివృద్ధి అంతా హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే కేంద్రీకృతమైందని.. జిల్లాల మధ్య సమతుల్యత లోపించినట్టుగా ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. జిల్లాల మధ్య అసమతుల్యతను తొలగించేందుకు అమలు చేయాల్సిన విధానాలు, పాలనాపర నిర్ణయాలు, ప్రణాళికల రూపకల్పనలో జీడీడీపీని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. – జీడీడీపీకి సంబంధించి.. భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, మహబూబ్‌నగర్ జిల్లాలు వరుసగా 34.2శాతం, 24.9శాతం. 24.9శాతం వృద్ధి రేటును సాధించి టాప్‌లో నిలిచాయి. రాష్ట్రంలోని 32 జిల్లాలు వృద్ధిరేటులో పురోగమించగా.. ఒక జిల్లా మాత్రం వృద్ధి రేటులో తిరోగమనంలో ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. తలసరి ఆదాయంలో రంగారెడ్డి టాప్ రంగారెడ్డి జిల్లా రూ.7,58,102 తలసరి ఆదాయంతో 2021–22లో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. దేశ సగటు తలసరి ఆదాయంతో పోల్చితే ఇది 5.1 రెట్లు అధికం. హైదరాబాద్ జిల్లా రూ.4,02,941తో, సంగారెడ్డి జిల్లా రూ.3,01,870తో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. వికారాబాద్ జిల్లా రూ.1,54,509 తలసరి ఆదాయంతో అట్టడుగున నిలిచింది. బాగా పట్టణీకరణ జరిగిన జిల్లాలతో పోల్చితే.. మారుమూల గ్రామీణ జిల్లాలు తలసరి ఆదాయంలో వెనుకబడి ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక తలసరి ఆదాయంలో రాష్ట్రంలోని 32 జిల్లాలు రెండంకెల వృద్ధి రేటు నమోదు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నివేదికలో తెలిపింది. -
దేశంలో అభివృద్ధి కన్నా రాజకీయాలపైనే దృష్టి
సాక్షి, హైదరాబాద్/మాదాపూర్: యువతకు ఉద్యోగాల కల్పన దిశగా ఆలోచించే నాయకత్వం దేశానికి అవసరమని పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ప్రపంచంలో గుర్తించదగిన బ్రాండ్స్ మన దేశం నుంచి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. చైనా, జపాన్ లాంటి దేశాలు అభివృద్ధిలో ముందున్నాయని, భారత్‌లో మాత్రం ఆర్థికాభివృద్ధి కన్నా.. రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని దుయ్యబట్టారు. మన దేశంలో కూడా ఆర్థిక అభివృద్ధిపై దృష్టిసారిస్తే నంబర్ వన్‌గా ఎదుగుతామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇన్నోవేషన్ (ఆవిష్కరణ,), ఇన్ఫ్రాస్ట్రక్చర్ (మౌలిక వసతులు), ఇన్‌క్లూజివ్ గ్రోత్ (సమ్మిళిత అభివృద్ధి) అనే మూడు ‘ఐ’ల పై దృష్టి సారించిందని చెప్పారు. దేశ జనాభాలో కేవలం 2.5 శాతమే ఉన్న తెలంగాణ.. దేశ జీడీపీకి 5 శాతం సమకూరుస్తోందన్నారు. దేశానికి నాయకత్వం వహిస్తున్న వారు కేవలం ఎన్నికల కోసమే పనిచేస్తున్న పరిస్థితి ఉందని పరోక్షంగా ప్రధాని మోదీనుద్దేశించి విమర్శించారు. తెలంగాణలో అతిపెద్ద లైఫ్‌సైన్స్ యూనివర్సిటీ, ఏవియేషన్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఎన్హెచ్ఆర్డీ ‘డీకోడ్ ది ఫ్యూచర్’ అనే అంశంలో భాగంగా ‘5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ– తెలంగాణ తోడ్పాటు’పై గురువారం నిర్వహించిన జాతీయస్థాయి సదస్సుకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యువత ఎదురుచూస్తోంది.. మన దేశంలో మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని, మొత్తం జనాభాలో 60 శాతం మంది యువతేనని కేటీఆర్ చెప్పారు. దేశంలో యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోందని, ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని ఆలోచన చేయకపోవడం బాధాకరమని అన్నారు. హైదరాబాద్ కన్నా విస్తీర్ణంలో చిన్నగా ఉండే సింగపూర్ అభివృద్ధిలో మాత్రం వేగంగా ముందుకెళ్తున్నదని చెప్పారు. గత ఎనిమిదేళ్లుగా అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ.. దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ ప్రఖ్యాతిచెందిన సంస్థలు తమ రెండో అతిపెద్ద క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం శుభపరిణామమని చెప్పారు. ఎనిమిదేళ్లలో 47 బిలియన్ డాలర్ల మేరకు పెట్టుబడులు ఆకర్షించినట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంను నాలుగేళ్లలోనే పూర్తిచేశామన్నారు. భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్ సీపీవో శ్రీనివాస్ ఉడుముల తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో అభివృద్ధి వ్యయం పరుగులు.. ఆర్బీఐ అధ్యయన నివేదికలో వెల్లడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి వ్యయం గత మూడేళ్లుగా పెరుగుతుండగా అభివృద్ధియేతర వ్యయం ఏటా తగ్గుతోందని ఆర్బీఐ అధ్యయన నివేదిక వెల్లడించింది. వడ్డీల చెల్లింపుల వ్యయం కూడా మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి తగ్గుతోందని పేర్కొంది. రాష్ట్రాల ఆర్థిక వ్యవహారాలు, బడ్జెట్లపై రూపొందించిన అధ్యయన నివేదికను ఆర్బీఐ విడుదల చేసింది. 2020 – 21 నుంచి 2022 – 23 వరకు ప్రధాన ఆర్థిక సూచికలను విశ్లేషించింది. సామాజిక సేవలు, ఆర్థిక సేవల వ్యయం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపింది. సామాజిక, ఆర్థిక అభివృద్ధి కార్యకలాపాలపై వెచ్చించే నిధులను అభివృద్ధి వ్యయంగా పరిగణించాలని పేర్కొంది. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య తదితరాలపై చేసే వ్యయాన్ని అభివృద్ధి వ్యయంగా పరిగణిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి వైద్యం, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం.. నీటి సరఫరా, పారిశుద్ధ్య రంగాలపై వ్యయం పెరుగుతోంది. 2021 – 22 నుంచి 2022 – 23 వరకు మొత్తం వ్యయంలో అభివృద్ధి వ్యయం ఏటా పెరుగుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను మించి రాష్ట్రం అభివృద్ధి వ్యయం చేస్తోంది. ► 2020 – 21 (అకౌంట్స్)లో మొత్తం వ్యయంలో అభివృద్ధి వ్యయం 63.0 శాతం ఉండగా 2022 – 23 బడ్జెట్ అంచనాల ప్రకారం 72.0 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో అభివృద్ధియేతర వ్యయం 29.7 శాతం నుంచి 21.6 శాతానికి తగ్గింది. ► 2020 – 21 రెవెన్యూ వ్యయంలో వడ్డీల చెల్లింపుల వ్యయం 13.1 శాతం ఉండగా 2022 – 23 బడ్జెట్ అంచనాల్లో 10.2 శాతానికి తగ్గింది. ► ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం, నీటి సరఫరా, పారిశుధ్య వ్యయం 2020 – 21లో రూ.9,990.6 కోట్లు ఉండగా 2021–22లో రూ.16,659.5 కోట్లకు పెరిగింది. 2022–23లో రూ.17,988.2 కోట్లకు చేరుకుంది. -
వృద్ధి, ద్రవ్యోల్బణం రానున్న బడ్జెట్ లక్ష్యాలపై నిర్మలా సీతారామన్
వాషింగ్టన్: ఆర్థికాభివృద్ధి, ద్రవ్యోల్బణం కట్టడే 2022-23 వార్షిక బడ్జెట్ (2023 ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో సమర్పించే అవకాశం) లక్ష్యాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వార్షిక సమావేశాల్లో పాల్గొనడానికిగాను ఆరు రోజుల అమెరికా పర్యటనకు వచ్చిన నిర్మలా సీతారామన్ మొదటిరోజు-మంగళవారం వాషింగ్టన్ డీసీలో బిజీబిజీగా గడిపారు. అమెరికా ఆర్థికమంత్రి జనెత్ యెల్లెన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో భేటీ, ప్రతిష్టాత్మక బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్లో ఆర్థికవేత్తలు, వ్యాపారవేత్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఇందులో ఉన్నాయి. బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్లో కార్యక్రమంలో ప్రముఖ ఆర్థికవేత్త ఈశ్వర్ ప్రసాద్‌సహా పలువురు నిపుణుల అడిగిన ప్రశ్నలకు ఆమె సవివరంగా సమాధానాలు ఇచ్చా రు. ఆమె ప్రసంగంలో మరిన్ని ముఖ్యాంశాలు.. ► భారత్ ఎకానమీ సమీప భవిష్యత్తులో ఎదుర్కొనబోయే ప్రధాన సవాళ్లలో అధిక ఇంధన ధరలు ఒకటి. ► మహమ్మారి సవాళ్ల నుంచి సమర్థవంతంగా బయటపడిన భారత్ అటు వృద్ధి-ఇటు ద్రవ్యోల్బణాన్ని సమర్థవంతంగా సమతౌల్యం చేయగలుగుతోంది. ఇది గమనించడం చాలా ముఖ్యం. ► భారత్ దేశ ఆర్థిక వ్యవస్థను గమనిస్తున్న పలు రేటింగ్, విశ్లేషణా, ఆర్థిక సంస్థలు కూడా భారత్ ఎకానమీ బలహీనపడలేదన్న విషయాన్ని గుర్తిస్తున్నాయి. ► ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి వల్ల ఇంధనం, ఎరువులు, ఆహార రంగాలకు సంబంధించిన సవాళ్లను భారత్ ఎదుర్కొంటోంది. వీటన్నింటినీ భారత్ జాగ్రత్తగా గమనిస్తోంది. ► అంతర్జాతీయ ఒత్తిళ్లు ప్రజలకు చేరకుండా చూసుకుంటున్నాము. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల ఇంధన ధరల పెరుగుదల భారం సామాన్య ప్రజలపై పడ్డం లేదు. ► రూపాయిని తమ దేశాల్లో ఆమోదయోగ్యంగా మార్చేందుకు వివిధ దేశాలతో భారత్ చర్చలు జరుపుతోంది. ► యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), బీహెచ్ఐఎం యాప్, ఎన్సీపీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) అన్నీ ఇప్పుడు ఆయా దేశాల్లో వ్యవస్థలతో కలిసి పటిష్టంగా పనిచేయడానికి తగిన ప్రయత్నం జరుగుతోంది. మన వ్యవస్థకు ఇంటర్–ఆపరేటబిలిటీ కూడా ఆ దేశాల్లోని భారతీయుల నైపుణ్యానికి బలాన్ని ఇస్తుంది. బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్లో ప్రముఖ ఆర్థికవేత్త ఈశ్వర్ ప్రసాద్‌తో ఆర్థికమంత్రి -
రాష్ట్ర ఆర్థికాభివృద్థిలో పారిశ్రామికపార్కులే కీలకం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో పారిశ్రామిక పార్కుల పాత్ర కీలకమని, పారదర్శక విధానాలతో పారిశ్రామిక వాడల ప్రగతికి నిరంతరం కృషి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) 49 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన లోగోను సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రగతిలో ఏపీఐఐసీ కీలక భూమిక పోషిస్తూ ముందుకు సాగాలని సీఎం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జేవీఎన్ సుబ్రహ్మణ్యం, ఏపీఐఐసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏడాదిపాటు నిర్వహించే ఏపీఐఐసీ స్వర్ణోత్సవ వేడుకుల వివరాలను ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలియచేశారు. రాష్ట్రంలో శరవేగంగా పారిశ్రామికాభివృద్ధి మంగళగిరిలోని ప్రధాన కార్యాలయంలో ఏపీఐఐసీ స్వర్ణోత్సవ వేడుకలను పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో ఏపీఐఐసీ పాత్ర మరువలేనిదని చెప్పారు. ప్రస్తుతం ఏపీఐఐసీ చేతిలో ఉన్న 1.50 లక్షల ఎకరాలను వినియోగించుకుంటూ మరింత పారిశ్రామిక ప్రగతి సాధిస్తామన్నారు. సీఎం జగన్ నాయకత్వలో రాష్ట్రం పారిశ్రామికంగా శరవేగంగా పురోగమిస్తోందని తెలిపారు. ఏపీఐఐసీలో ఉత్తమ పనితీరు కనపర్చిన ఉద్యోగులకు ఈ సందర్భంగా మంత్రి అవార్డులను అందచేశారు. ఏపీ ఎకనామిక్ బోర్డు (ఏపీఈడీబీ) కొత్తగా రూపొందించిన వెబ్‌సైట్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఏడాది పాటు ఉత్సవాలు 2023 సంవత్సరాన్ని ఏపీఐఐసీ గోల్డెన్ జూబ్లీ ఇయర్‌గా ప్రకటించి ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ జవ్వాది సుబ్రమణ్యం తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు ఏపీఐఐసీ ద్వారా 21 లక్షల మందికి ఉపాధి కల్పించడంతోపాటు రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులను తెచ్చినట్లు చెప్పారు. సింగిల్ డెస్క్ విధానంలో భాగంగా ఏపీఐఐసీ ప్రవేశపెట్టిన 14 రకాల ఆన్లైన్ సేవలకు మంచి స్పందన వస్తోందని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు. రూ.20 కోట్లతో మొదలై రూ.5,000 కోట్లకు రూ.20 కోట్లతో ప్రారంభమైన సంస్థ ఇప్పుడు రూ.5,000 కోట్ల స్థాయికి చేరుకుందని ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. కార్యక్రమానికి సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి హాజరై అత్యుత్తమ పనితీరు కనపరచిన ఏపీఐఐసీ ఉద్యోగులకు అవార్డులు అందచేసి అభినందించారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో షన్ మోహన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. -
ఆ మార్పులతోనే ఆర్థికాభివృద్ధి
గత 75 ఏళ్ళలో ప్రపంచ ఆర్థిక దిగ్గజాల సరసన భారత్ చోటు నిలుపుకొంది. సంపద పంపిణీకి సంబంధించినంత వరకు మాత్రం అలా ఉండకపోవచ్చు. సాధారణ జీడీపీ పరంగా చూస్తే ప్రపంచంలోనే ఆరవ అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్. దశాబ్దాలుగా విధానాల్లో, స్తంభించిన వృద్ధిరేట్లలో మార్పు చేసుకుంటూ వచ్చిన ఫలితంగానే దేశం ఈ స్థాయికి చేరు కుంది. ఇదో సుదీర్ఘ ప్రయాణం. 1700లో ప్రపంచ ఆదా యంలో 22.6 శాతంగా ఉన్న భారత్ వాటా 1947 నాటికి 3 శాతానికి పడిపోయింది. 1947 నాటికి జాతీయ దిగుబడిలో పారిశ్రామిక రంగ వాటా 7.5 శాతం ఉండేది. కానీ 35 కోట్లమంది శ్రామికుల్లో 25 లక్షల మందికే పారిశ్రామిక రంగం ఉపాధి కల్పించింది. అప్పట్లో దేశ జీడీపీలో సగభాగం వ్యవసాయం నుంచే వచ్చేది. రూ. 249 తలసరి ఆదాయంతో అతి పేద దేశాల్లో ఒకటిగా భారత్ మిగిలింది. ఈ నేపథ్యంలోనే నూతనంగా ఎంపికైన ప్రభుత్వాధినేత ప్రథమ భారత ప్రధాని నెహ్రూ దేశాన్ని దారిద్య్రం నుంచి బయటకు లాగే లక్ష్యంతో విధానాల రూపకల్పన ప్రారంభిం చారు. నెహ్రూ విశ్వసించే సామ్యవాద ఆదర్శాలు ఆర్థిక ప్రణాళికకు పునాదిరాయిగా నిలిచాయి. దీంతోనే భారీ స్థాయి ప్రభుత్వ యాజమాన్య సంస్థల ఏర్పాటు వేగం పుంజుకుంది. ‘ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్–1948’ ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రతిపాదించింది కానీ ఆ వ్యవస్థ పగ్గాలు మాత్రం పబ్లిక్ సెక్టార్‌కే ఉద్దేశించబడ్డాయి. ‘రెండో ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ –1956’ ప్రభుత్వ రంగ సంస్థలు ఏ రంగాలను నియంత్రించవచ్చు, వేటిని ప్రైవేట్ రంగానికి వదిలిపెట్టవచ్చు అనే విషయంలో ముఖ్యమైన విభజనరేఖ గీసింది. భారీయెత్తున మూలధనం అవసరమైన పరిశ్రమలను చాలావరకు పబ్లిక్ సెక్టార్‌కి పరిమితం చేయగా, వినియోగ సరకుల తయారీని ప్రైవేట్ పరిశ్రమలకు ఉద్దేశించారు. నాటి ప్రధాన ఆర్థికవేత్త, గణాంక శాస్త్రవేత్త పీసీ మెహలనోబిస్ మార్గదర్శకత్వంలో ఈ విధాన ప్రకటనను రూపొందించారు. తర్వాత అనేక సంవత్సరాలు ఇదే ఆర్థిక విధానాల మార్గదర్శక సూత్రంగా మారింది. భారీ పరిశ్రమలపై ప్రధానంగా దృష్టిపెట్టడం వల్ల వ్యవ సాయ రంగం నిర్లక్ష్యానికి గురైంది. దీంతో 1950ల చివరి నాటికి దేశంలో ఆహార కొరత ఏర్పడింది. ‘పబ్లిక్ లా 480’ కింద అమెరికా నుంచి దిగుమతులపై భారత్ ఆధారపడాల్సి వచ్చింది. ఈ ‘పబ్లిక్ లా 480’ మిగులు ఆహార ధాన్యాలను ఉచితంగా అందించేది. అయితే అధిక దిగుబడి వంగడాలను ప్రవేశపెట్టినందున హరిత విప్లవం దేశంలో మరో మలుపు నకు దారి తీసింది. విస్తృతంగా పంటల ఉత్పత్తి సాధ్యమై, సమృద్ధిగా ఆహారధాన్యాలు అందుబాటు లోకి వచ్చాయి. ఇందిరాగాంధీ పాలనాకాలంలో లైసెన్స్‌రాజ్ వ్యవస్థ బలపడింది. అవినీతి స్థాయి పెరిగిపోయింది. ప్రైవేట్ పరిశ్రమల రంగం ఉక్కిరిబిక్కిరైంది. ఉపాధి నష్టాలను నిరోధించడానికి బ్యాంకింగ్ పరిశ్రమ, విదేశీ చమురు కంపెనీలు, పలు రోగగ్రస్థ కంపెనీల జాతీయీకరణ పథకాలను వరుసగా చేపడుతూ పోయారు. దేశంలో అనేక ప్రైవేట్ బ్యాంకులు కుప్పకూలిపోయి, సామాన్యులు భారీ నష్టాలకు గురైన నేపథ్యంలోనే బ్యాంకుల జాతీయీకరణ చేయాల్సి వచ్చిందని తప్పక గుర్తుంచుకోవాలి. జాతీయీ కరణ వల్ల పేద వ్యక్తి కూడా ఇప్పుడు అతి కొద్ది నగదుతోనే బ్యాంక్ ఖాతాను తెరవగలడు. ఇది ఆర్థిక వ్యవస్థలో సామాన్యుల చేరికకు వీలు కల్పించిన తొలి అడుగు. చమురు కంపెనీల జాతీయీకరణ అనేది హైడ్రో కార్బన్లకు సంబంధించినంతవరకు దేశ వ్యూహాత్మక భద్రతకు హామీ కల్పించింది. అయితే రోగగ్రస్థ ప్రైవేట్ కంపెనీలను స్వాధీన పర్చుకోవడం ఘోర తప్పిదమైంది. దీంతో అనేక దశాబ్దాల పాటు దేశం భారీ ఆర్థిక చెల్లింపుల్లో ఇరుక్కుపోయింది. ఖాయిలా పడిన ఈ సంస్థలను సాధారణ మూసివేతకు అనుమతించి, వాటి స్థానంలో కొత్త వెంచర్లను ప్రారంభిం చాలని నిర్దేశించి ఉంటే బాగుండేది. 1980ల వరకు ఈ సోషలిస్టు పాలసీలు భారత వృద్ధి రేటును 3 నుంచి 4 శాతానికే పరిమితం చేస్తూ వచ్చాయి. దీన్ని ‘హిందూ వృద్ధి రేటు’ అని వ్యంగ్యంగా పేర్కొంటూ వచ్చారు. 1991లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆయన ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ క్రమాన్ని ప్రారంభించవలసి వచ్చింది. ఈ నూతన విధానాలు లైసెన్స్‌రాజ్ వ్యవస్థ ఆంక్షల నుంచి పరిశ్రమను విముక్తి చేసి, సులభతరమైన దిగుమతులు, విదేశీ పోటీకి అనువుగా ఆర్థిక వ్యవస్థను బార్లా తెరిచాయి. ఫలితంగా 1990ల మధ్య నుంచి వృద్ధి రేటు 7 –8 శాతానికి ఉన్నట్లుండి పెరిగింది. సంస్కరణలను తీవ్రతరం చేయడమే కాక అనేక ప్రభుత్వ రంగ కంపెనీలను సాహసోపేతంగా ప్రైవేటీకరించిన వాజ్‌పేయి వరకు ఈ వృద్ధి కొనసాగింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం 2014లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత మన అభివృద్ధి మందగించినట్లు కనిపించింది. పెద్ద నోట్ల రద్దు విధానం, జీఎస్టీ ప్రారంభం, కోవిడ్ మహమ్మారి, చమురు ధరలు, సరఫరాపై ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం వంటివి అందుకు కారణాల్లో కొన్ని. అయితే, దిశా నిర్దేశం చేసిన 1991 నాటి సంస్కరణల కాలంతో పోలిస్తే నేడు దేశం ఎదుర్కొంటున్న సమస్యలు భిన్నమైనవి. దేశ ఆర్థిక వ్యవస్థ ముందంజ వేసినప్పటికీ, నలిపివేస్తున్న దారిద్య్రం ఇప్పటికీ కొనసాగుతోంది. అంత ర్జాతీయ రంగంలో ఐటీ పరిశ్రమ బలమైనశక్తిగా మారినం దున దేశం కూడా గొప్పగా ముందడుగు వేసింది. పైగా బిలియన్ డాలర్ల పెట్టుబడులను సాధించిన వెంచర్లుగా పేరుపడిన యూనికార్న్‌లను అత్యధికంగా స్థాపించిన మూడో అతి పెద్ద దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. అదే సమయంలో, ప్రత్యేకించి కరోనా తర్వాత నిరుద్యోగం పెరిగిన గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్రం కొనసాగుతోంది. (క్లిక్: పండించినవారికే తిండికి కొరతా!?) గ్రామీణ, కుటీర పరిశ్రమల వృద్ధిని ప్రోత్సహించడం ద్వారా క్షేత్రస్థాయిలో మరిన్ని ఉద్యోగాలను ప్రభుత్వం సృష్టించాల్సిన అవసరం ఉంది. గాంధీ దీన్నే ప్రబోధిస్తూ వచ్చారు. జీడీపీలో వాటా తగ్గినా, వ్యవసాయరంగం నేటికీ 50 శాతం ఉద్యోగితను కల్పిస్తున్నందున రైతుల ప్రయోజనాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. రానున్న సంవత్సరాల్లో విస్తృతంగా వేరవుతున్న రెండు ఇండియాల మధ్య డిజిటల్ అంతరాన్ని పూరించాలి. ప్రపంచ స్థాయి ఐటీ పరిశ్రమ ఉన్నప్పటికీ మహమ్మారి కాలంలో మొబైల్ ఫోన్లు లేక విద్యకు ఎంతోమంది పిల్లలు దూరమయ్యారు. 2022–23లో భారత్ ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అవుతుందని అంచనా. ఆ మాటెలా ఉన్నా, నిరుపేదల స్థితిగతుల్ని మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది. (క్లిక్: మా వాటా మాకిచ్చారా?) - సుష్మా రామచంద్రన్ సీనియర్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్ (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో...) -
పైసలు, పంటలు జోర్దార్.. ఆదాయం, అప్పులు రెండూ భారీగానే..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆర్థికాభివృద్ధిలో వేగంగా దూసుకెళుతోంది. వివిధ రంగాల్లో మంచి వృద్ధిరేటుతో దూకుడు కొనసాగిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాతి నుంచి ఏడేళ్లలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) ఏకంగా 117 శాతం వృద్ధి నమోదు చేసింది. పలు అంశాల్లో జాతీయ సగటుకు రెండింతలకుపైగా వృద్ధిని సాధించింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై రిజర్వు బ్యాంకు తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత ధరల ప్రాతిపదికన.. 2013–14లో రూ.4,51,580.4 కోట్లుగా ఉన్న తెలంగాణ జీఎస్డీపీ విలువ.. 2020–21 నాటికి రూ.9,80,407 కోట్లకు పెరిగింది. ముఖ్యంగా ఐటీ, ఐటీ అనుబంధ సేవలు, ఔషధ రంగ పరిశ్రమలతోపాటు వ్యవసాయం, అనుబంధ రంగాలు రాష్ట్ర వృద్ధికి అండగా నిలిచినట్టు రిజర్వు బ్యాంకు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బ్యాంకింగ్, బీమా, తయారీ, నిర్మాణ రంగాలు కూడా వృద్ధికి ఊతమిస్తున్నాయి. పంటల ఉత్పత్తి బాగా పెరిగింది. మరోవైపు గత ఏడేళ్లలో రాష్ట్రం సొంత పన్నులు, పన్నేతర ఆదాయాన్ని సైతం భారీగా పెంచుకుంది. కానీ మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం భారీగా రుణాలు తీసుకుంటుండటంతో ఏటేటా అప్పులు కూడా పెరిగిపోయాయి. వాటిపై చెల్లిస్తున్న వడ్డీలు భారంగా మారుతున్నాయి. బడ్జెట్ ప్రతిపాదనల్లో రెవెన్యూ మిగులును చూపుతున్నా.. భారీ ఆర్థికలోటు కొనసాగుతుండటం గమనార్హం. ఏడేళ్లుగా రాష్ట్రంలో అన్ని రంగాలు గణనీయంగా వృద్ధిని నమోదు చేయడంతో.. రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. రాష్ట్రం ఏర్పాటైనప్పటితో పోలిస్తే మూడింతలకుపైగా రాబడి వృద్ధి నమో దైంది. పన్నుల రాబడితోపాటు పన్నేతర ఆదాయాన్నీ ప్రభుత్వం పెంచుకోగలిగింది. ఇదే సమయంలో రాష్ట్ర అప్పులు కూడా మూడింతలు పెరిగాయి. వ్యవసాయ ఉత్పత్తుల వృద్ధిలో రాష్ట్రం మెరుగైన పనితీరు ప్రదర్శించింది. వరి, పత్తి, పప్పుధాన్యాల ఉత్పత్తిలో దేశ సగటుకన్నా 3, 4 రెట్లకుపైగా వృద్ధి నమోదవడం గమనార్హం. సొంత పన్నులు, పన్నేతర ఆదాయంలో భారీ వృద్ధి తెలంగాణ రాష్ట్రం గత ఏడేళ్లలో సొంత పన్నులు, పన్నేతర ఆదాయంలో భారీ వృద్ధిని నమోదు చేసినట్టు రిజర్వుబ్యాంకు నివేదిక పేర్కొంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఐటీ, తయారీ, పారిశ్రామిక, వ్యవసాయ, మైనింగ్ రంగాలు గణనీయ వృద్ధి సాధించడంతో ఖజానాకు రాబడి పెరిగిందని తెలిపింది. 2014–15తో పోల్చితే.. 2020–21 నాటికి పన్నేతర ఆదాయం 474 శాతం, పన్నుల ఆదాయం 291 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు పేర్కొంది. రాష్ట్ర సొంత ఆదాయం, ఆర్థిక–రెవెన్యూ లోటు లెక్కలివీ.. (రూ.కోట్లలో) ఏడాది పన్నేతర పన్నుల ఆర్థిక లోటు రెవెన్యూ ఆదాయం ఆదాయం లోటు 2014–15 6,447 29,288 9,410 –369 2015–16 14,414 39,975 18,498 –238 2016–17 9,782 48,408 35,231 –1386 2017–18 7,825 58,177 26,514 –3459 2018–19 10,007 65,040 26,944 –4337 2019–20 12,275 71,328 21,913 –104 2020–21 30,600 85,300 33,191 –4482 (రెవెన్యూ లోటు (–)లో చూపారు. అంటే మిగులు ఆదాయం ఉన్నట్టు చూపారు) ఏడేళ్లలో రంగాల వారీగా రాష్ట్రంలో నమోదైన వృద్ధి.. (రూ.కోట్లలో) అంశం 2013–14 2020–21 వృద్ధిరేటు మొత్తం జీఎస్డీపీ విలువ 4,51,580.40 9,80,407.01 117 వ్యవసాయ రంగంలో.. 47,092.85 80,574.00 71 తయారీ రంగంలో.. 57,148.39 94,020.80 64.5 నిర్మాణ రంగంలో.. 24,582.42 37,029.76 50.6 పారిశ్రామిక రంగంలో.. 1,02,825.74 1,79,884.62 74.9 సేవల రంగంలో.. 2,42,272.96 5,33,230.87 120 బ్యాంకింగ్, బీమా రంగంలో 26,595.53 53,145.22 99.8 (ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశం/రాష్ట్రంలో ఉత్పత్తి అయిన సరుకులు, సేవల మొత్తం విలువను స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ/జీఎస్డీపీ) అంటారు. సదరు దేశ/రాష్ట్ర ఆర్థికవ్యవస్థ పరిస్థితి ఏమిటన్నది దీనితో అంచనా వేయవచ్చు) రాష్ట్రంపై అప్పులు, వడ్డీల భారం.. ఏటేటా రాష్ట్ర అప్పులు పెరిగిపోతున్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2015 మార్చి నాటికి రూ.72,658 కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పులు.. 2021 మార్చి నాటికి రూ.2,52,325 కోట్లకు చేరాయి. అంటే ఆరేళ్లలో మూడింతల అప్పులు పెరిగిపోయినట్టు రిజర్వుబ్యాంకు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రుణాలపై వార్షిక వడ్డీల చెల్లింపులు సైతం రూ.5,227 కోట్ల నుంచి రూ.14,615 కోట్లకు పెరిగాయి. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతోపాటు రైతుబంధు, పంట రుణాల మాఫీ, ఆసరా పెన్షన్లు, ఇతర సం క్షేమ పథకాల కోసం రాష్ట్రం భారీగా అప్పులు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఆర్బీఐ నివేదికలోని ఇతర ముఖ్యాంశాలివీ పప్పుధాన్యాల ఉత్పత్తిలో వృద్ధి దేశ సగటు 34.2 శాతంకాగా.. రాష్ట్రం 108.8 శాతం వృద్ధిని సాధించింది. వరి ఉత్పత్తిలో దేశవ్యాప్తంగా సగటున 12.7 శాతం, రాష్ట్రం 67.3 శాతం వృద్ధి నమోదైంది. పత్తిసాగులో దేశవ్యాప్తంగా సగటున 3.6 శాతం, రాష్ట్రం 79.8 శాతం వృద్ధి సాధించాయి. మాంసం ఉత్పత్తిలో దేశ సగటు వృద్ధి 28.5 శాతంకాగా.. రాష్ట్రం 67.9 శాతం వృద్ధి నమోదు చేసింది. సాగునీటి సౌకర్యాలలో రాష్ట్రం 34.2 శాతం వృద్ధి సాధించగా.. దేశవ్యాప్తంగా సగటు వృద్ధి –11.1గా ఉంది. మొత్తంగా ఆహారధాన్యాల ఉత్పత్తిలో దేశం సగటున 2.2 శాతం, రాష్ట్రం 22.2% వృద్ధిని నమోదు చేశాయి. జీఎస్డీపీ విలువ (రూ.కోట్లలో) 2013–14లో 4,51,580.40 2020–21లో 9,80,407.01 రాష్ట్ర అప్పులు.. (రూ.కోట్లలో) 2015లో 72,658 2021 నాటికి 2,52,325 రాష్ట్ర సొంత ఆదాయం తీరు (రూ. కోట్లలో) పన్నుల ఆదాయం 2014–15లో 29,288 2020–21లో 85,300 రాష్ట్ర ప్రగతికి ఆర్బీఐ నివేదికే సాక్ష్యం రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంతోసహా అన్ని రంగాల్లో గణనీయ ప్రగతి సాధించిందని ఆర్బీఐ తాజా నివేదిక స్పష్టం చేసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించాలని, ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించడం ద్వారా రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని వారిని కోరారు. చౌకబారు విమర్శలు, ప్రగల్భాలు మానుకోవాలని హితవు పలికారు. ఆర్బీఐ నివేదికపై గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ, దేశ సగటు కన్నా రాష్ట్రం చాలా రంగాల్లో మెరుగైన ప్రగతి సాధించిందని నివేదిక తేటతెల్లం చేసిందన్నారు. మాంసం, వరి, పప్పు దినుసుల ఉత్పత్తిలో రాష్ట్ర వృద్ధిరేటు దేశ సగటును మించిపోయిందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అనేక రంగాల్లో దూసుకుపోతోందని తెలిపారు. -
అభివృద్ధిలో పైపైకి
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలను హరించడమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేసింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆర్థికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తోంది. ఈ విషయం ఇండియా టుడే స్టేట్ ఆఫ్ స్టేట్స్–2020 అధ్యయనంలో వెల్లడైంది. ఒక్క ఆర్థిక రంగంలోనే కాదు. పర్యాటక రంగంలోనూ ఏపీ మెరుగైన ప్రదర్శన కనబరుస్తోందని ఆ అధ్యయనం పేర్కొంది. వివిధ రంగాల్లో దేశం, రాష్ట్రాలు జూన్ నుంచి అక్టోబర్ వరకూ సాధించిన ప్రగతిపై మార్కెటింగ్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ అసోసియేట్స్ (ఎండీఆర్ఏ)తో కలిసి ఇండియా టుడే సంస్థ అధ్యయనం చేసింది. కరోనా ప్రతికూల పరిస్థితులను అధిగమించి 12 రంగాల్లో (ఆర్థిక, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత అభివృద్ధి, పరిపాలన, శాంతిభద్రతలు.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, పరిశుభ్రత, పర్యావరణం, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం) రాష్ట్రాలు సాధిస్తున్న ప్రగతిని.. వివిధ మార్గాల్లో సేకరించిన డేటాతో పరిశీలించింది. ఆ విభాగాల్లో రాష్ట్రాలను ఉత్తమ ప్రదర్శన (బెస్ట్ పెర్ఫార్మింగ్), అత్యుత్తమ మెరుగైన (మోస్ట్ ఇంప్రూవ్డ్), ఓవరాల్ కేటగిరీలుగా విభజించింది. వాటికి అనుగుణంగా స్కోర్ ఇచ్చింది. ఆయా విభాగాల్లో ఉత్తమ రాష్ట్రాలను విజేతలుగా పేర్కొంది. ఈ అధ్యయనంలో భాగంగా 35 వేల చదరపు కి.మీ.ల భౌగోళిక విస్తీర్ణం లేదా 5 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా కలిగిన 20 రాష్ట్రాలను పెద్ద రాష్ట్రాలుగానూ, అంతకంటే తక్కువ విస్తీర్ణం, జనాభా కలిగిన రాష్ట్రాలను చిన్న రాష్ట్రాలుగానూ వర్గీకరించింది. వీటికి అనుగుణంగా ర్యాంకులు ఇచ్చింది. రెండేళ్ల క్రితం పది.. ఇపుడు ఏడో స్థానం ఓవరాల్ బెస్ట్ పెర్ఫార్మింగ్ పెద్ద రాష్ట్రాల విభాగంలో 2018లో పదో స్థానంలో ఉంటే.. గతేడాది ఎనిమిదో స్థానానికి చేరింది. ఇప్పుడు ఏడో స్థానంలోకి దూసుకొచ్చింది. మోస్ట్ ఇంప్రూవ్డ్ పెద్ద రాష్ట్రాల విభాగంలో 2018లో మన రాష్ట్రం ఎనిమిదో ర్యాంకులో నిలిస్తే.. గతేడాది రెండో ర్యాంకును సాధించింది. ఈ ఏడాది అదే ర్యాంకును నిలబెట్టుకుంటూ స్థిరమైన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని ఇండియా టుడే అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనంలో వెల్లడైన ముఖ్యాంశాలు ఇవీ.. ► మోస్ట్ ఇంప్రూవ్డ్ పెద్ద రాష్ట్రాల విభాగంలో ఆర్థిక రంగం, పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. ► ఓవరాల్ మోస్ట్ ఇంప్రూవ్డ్ పెద్ద రాష్ట్రాల విభాగంలో 2,000 మార్కులకుగానూ 1,194.8 మార్కులను సాధించిన ఏపీ రెండో స్థానంలో నిలిచింది. ► ఓవరాల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ పెద్ద రాష్ట్రాల విభాగంలో 2,000 మార్కులకుగానూ 1,147.7 మార్కులను సాధించిన ఏపీ ఏడో స్థానానికి చేరుకుంది. ► కరోనా కట్టడిలో వందకు 65.8 మార్కులను సాధించిన రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. -
వినియోగ విశ్వాసం బలోపేతంతోనే వృద్ధి
ముంబై: ఆర్థికాభివృద్ధి అంశంలో వినియోగదారుని విశ్వాసం, మనోభావాలే కీలక పాత్ర పోషిస్తాయని ఫిక్కీ ప్రెసిడెంట్, అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ అంశాల్లో బలహీనత నెలకొందని ఆమె అన్నారు. వినియోగ విశ్వాసం పటిష్టతే ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తుందని పేర్కొన్నారు. ఈ దిశలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ జరిగిన ఒక గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ సందర్భంగా జరిగిన చర్చ గోష్టిలో ఆర్థిక అనిశ్చిత పరిస్థితిపై ఆమె మాట్లాడారు. ఆమె ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► కరోనా మహమ్మారి ప్రేరిత అంశాలతో దాదాపు 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. పూర్తి అనిశ్చితి, భయాందోళనకర పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక పురోగతికి ప్రభుత్వం నుంచి మరింత వ్యయాలు అవసరం. ► కరోనా ముందటి పరిస్థితితో పోల్చితే ఉత్పత్తి ప్రస్తుతం 60 నుంచి 70 శాతం స్థాయికి చేరిందని కర్మాగారాల నుంచి వార్తలు వస్తున్నాయి. రుణ లభ్యత బాగుంది. ఎగుమతులు దారిలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డిమాండ్ పెంపు పరిస్థితులపై ఆలోచించాలి. ఎందుకంటే వినియోగదారు విశ్వాసం ఇంకా బలహీనంగానే ఉంది. వారి మనోభావాలు మెరుగుపడకుండా వృద్ధిని మళ్లీ పట్టాలపైకి ఎక్కించడం అసాధ్యం. ఇందుకుగాను ప్రభుత్వం నుంచి ప్రత్యక్ష నగదు బదలాయింపులు మరింత జరగాలి. పండుగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వృద్ధిలో ప్రత్యక్ష నగదు బదలాయింపు ఎంతో కీలకమవుతుంది. ► ఫిక్కీ ఇప్పటికే ప్రభుత్వానికి కన్జూమర్ వోచర్ విధానాన్ని సిఫారసు చేసింది. ప్రభుత్వం వ్యయాల కింద 30 నుంచి 50 శాతం డిస్కౌంట్‌తో కన్జూమర్ వోచర్ విధానాన్ని అమలు చేయడం వల్ల వ్యవస్థలో డిమాండ్ మెరుగుపడే అవకాశం ఉంటుంది. ► విధానాన్ని ఇకమీదట ఏ మాత్రం అనుసరించకూడదు. పూర్తి సాధారణ పరిస్థితులు నెలకొనాలి. ఏ విభాగంలోనూ ఇకపై లాక్డౌన్ నిబంధనలను ఏ మాత్రం అమలు చేయకూడదు. ► వేదాంతా గ్రూప్ సీఈఓ సునీల్ దుగ్గల్, టాటా మోటార్స్ సీఈఓ బషెక్, యాక్సెంచర్ సీఈఓ పీయూష్ సింగ్ తదితరులు ఈ చర్చలో పాల్గొన్నారు. వారి అభిప్రాయాలను చూస్తే... ద్రవ్యోల్బణంపై ఆందోళన అక్కర్లేదు వృద్ధిని తిరిగి పట్టాలు ఎక్కించే విషయానికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ద్రవ్యోల్బణంపై ఆందోళన చెందనక్కర్లేదు. ఎకానమీలోకి మరింత నగదు లభ్యత జరిగేలా చూడ్డం ఇప్పడు ముఖ్యం. ముఖ్యంగా మౌలిక రంగంలో వ్యయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీనితోపాటు కార్మిక సంస్కరణల విషయంలో కూడా ప్రభుత్వం ముందడుగు వేయాలి. పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి. – సునీల్ దుగ్గల్, సీఈఓ, వేదాంతా గ్రూప్ డిమాండ్ పటిష్టతకు మరో 9 నెలలు ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ విభాగంలో డిమాండ్ ఊరటకలిగించే స్థాయిలో మెరుగుపడింది. అయితే అన్ని విభా గాల్లో డిమాండ్ పూర్తి పునరుత్తేజానికి ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుంది. – పీయూష్ సింగ్, సీనియన్ ఎండీ, యాక్సెంచర్ ఆటో... పన్ను రాయితీలు కావాలి కరోనా ప్రేరిత అంశాలతో ఆటో పరిశ్రమ దారుణంగా దెబ్బతింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ రంగం 2010–11 స్థాయికి క్షీణిస్తుందన్నది అంచనా. పన్ను రాయితీలు ఈ రంగానికి తక్షణ అవసరం. – బషెక్, ఎండీ, సీఈఓ, టాటా మోటార్స్ -
కేంద్ర చర్యల చేయూత నామమాత్రమే!
ముంబై: ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న విధాన చర్యల ఫలితాలు ఇప్పటి వరకూ నామమాత్రంగానే ఉన్నట్లు రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ గురువారం పేర్కొంది. ఈ పరిస్థితుల్లో 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మేలో వేసిన మైనస్ 5 శాతం క్షీణ అంచనాలను ప్రస్తుతం మైనస్ 9 శాతానికి పెంచుతున్నట్లు కూడా క్రిసిల్ పేర్కొంది. ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగా ఎటువంటి ద్రవ్య పరమైన మద్దతూ లభించని పరిస్థితి, కరోనా వైరస్ సవాళ్లు కొనసాగుతున్న ప్రతికూలతలు కూడా తమ క్షీణ అంచనాలకు కారణమని తెలిపింది. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (2020–21) క్షీణత రేటు భారీగా 23.9 శాతం నమోదయిన నేపథ్యంలో ఆవిష్కరించిన క్రిసిల్ తాజా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ► ప్రభుత్వం రూ. 20 లక్షల కోట్ల సహాయక ప్యాకేజీ ప్రకటించింది. ఈ పరిమాణం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 10 శాతం. అయితే వాస్తవంగా తాజా వ్యయాలు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో రెండు శాతంకన్నా తక్కువగా ఉండడం గమనార్హం. ► ఆర్థిక వ్యవస్థ వృద్ధికిగాను ప్రభుత్వ పరంగా భారీ వ్యయాలు చేయడానికి తగిన ద్రవ్య పరిస్థితులు లేవు. ప్రభుత్వ ప్రత్యక్ష ద్రవ్య మద్దతు జీడీపీలో కనీసం ఒక శాతం ఉంటుందని మే అంచనాల నివేదికలో పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పటివరకూ ఈ స్థాయి ప్రత్యక్ష ద్రవ్య మద్దతు లభించలేదు. ► అక్టోబర్ నాటికి కరోనా కేసుల పెరుగుదల ఆగిపోతే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి (మార్చి నాటికి) జీడీపీ వృద్ధి రేటు కొంత సానుకూల బాటలోకి మళ్లే వీలుంది. ► భారత ఆర్థిక వ్యవస్థపై మహమ్మారి ఒక ‘‘శాశ్వత మచ్చ’’ను మిగల్చనుంది. ► స్వల్పకాలికంగా చూస్తే, జీడీపీకి 13 శాతం శాశ్వత నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విలువ దాదాపు రూ.30 లక్షల కోట్ల వరకూ ఉంటుంది. -
‘మౌలికం’ కీలకం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక అభివృద్ధికి చోదకశక్తి లాంటి మౌలిక వసతుల రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఇప్పటికే రూ.103 లక్షల కోట్లతో పలు ప్రాజెక్టులను ప్రారంభించిందని, తాజాగా రవాణా రంగంలో మౌలిక వసతులు, హైవేలను అభివృద్ధి చేసేందుకు బడ్జెట్లో రూ.1.70 లక్షల కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పౌరుల జీవనాన్ని సులభతరం చేసేందుకు 6,500 మౌలిక వసతుల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నట్లు చెప్పారు. మౌలిక వసతుల రంగంలో ఐదేళ్లలో రూ.100 లక్షల కోట్లకుపైగా వెచ్చిస్తామని ప్రధాని గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో చెప్పారని గుర్తు చేశారు. జాతీయ మౌలిక వసతుల పైప్‌లైన్ (ఎన్ఐపీ) కోసం ఇప్పటికే రూ.20 వేల కోట్లు కేటాయించామన్నారు. 2023కి ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం, నిర్వహణ రంగాల్లో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆర్థిక మంత్రి చెప్పారు. త్వరలోనే జాతీయ సరుకు రవాణా విధానాన్ని ప్రకటిస్తామని తెలిపారు. 2023 నాటికి ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్ వేతోపాటు మరో రెండు ప్యాకేజీలు పూర్తవుతాయన్నారు. చెన్నై–బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రహదారి పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. 27,000 కి.మీ మేర విద్యుదీకరణను పూర్తి చేసే దిశగా రైల్వేలు కృష్టి చేస్తున్నాయని చెప్పారు. ‘రహదారుల నిర్మాణంలో వేగం గణనీయంగా పెరిగింది. 2015–16లో రోజుకు 17 కి.మీ మాత్రమే రోడ్ల నిర్మాణం జరగగా 2018–19 నాటికి ఇది 29.7 కి.మీ.కి పెరిగింది’అని ఆర్థిక మంత్రి తెలిపారు. బడ్జెట్లో మౌలిక వసతులకు పెద్దపీట వేయడంతో గృహ నిర్మాణం, చౌకగా పరిశుద్ధమైన ఇంధనం, ఆరోగ్యం, విద్యా సంస్థలు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, బస్ టెర్మినళ్లు, మెట్రో, రైల్వే రవాణా, గిడ్డంగులు, సాగునీటి ప్రాజెక్టులు తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు విస్తృతం కానున్నాయి. ఉపాధి అవకాశాలు విస్తృతం: గడ్కారీ మౌలిక వసతుల రంగానికి ఈ బడ్జెట్ గట్టి ఊతం ఇచ్చిందని కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ పేర్కొన్నారు. తాజా బడ్జెట్ పారిశ్రామిక అభివృద్ధికి జవసత్వాలు కల్పించి ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని, తద్వారా 2 కోట్లకుపైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉందన్నారు. బడ్జెట్లో ‘మౌలిక’వరాలు... ► పర్యాటక ప్రాంతాలను అనుసంధానించేలా మరిన్ని తేజాస్ రైళ్లు. ► ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైళ్లపై చురుగ్గా పరిశీలన. ► ‘ఉడాన్’పథకం ద్వారా 2024 నాటికి మరో వంద విమానాశ్రయాల అభివృద్ధి. ► ఇంధనం, పునరుత్పాదక వనరులకు బడ్జెట్లో రూ.22,000 కోట్లు ► 9,000 కి.మీ మేర ఆర్థిక కారిడార్ ► 2,000 కి.మీ మేర తీర ప్రాంత రహదారులు, హైవేల అభివృద్ధి. రైల్వే లైన్ల పక్కన సోలార్ ప్రాజెక్టులు రైల్వే నెట్వర్క్ కోసం సౌర విద్యుత్‌ను వినియోగించుకునేలా ట్రాక్‌ల పక్కన రైల్వేకు చెందిన భూమిలో పెద్ద ఎత్తున సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. పీపీపీ విధానంలో 150 ప్యాసింజర్ రైళ్ల ఏర్పాటు, 4 స్టేషన్ల పునరాభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రూ. 18,600 కోట్లు ఖర్చయ్యే 148 కి.మీల బెంగళూరు సబర్బన్ రవాణా ప్రాజెక్టును బడ్జెట్లో ప్రతిపాదించారు. మెట్రో తరహాలో టికెట్ రేట్లు ఉంటాయి. -
నదీజలాల్లో ఆక్సిజన్ అదృశ్యం
సాక్షి, అమరావతి: మన దేశ నదీ జలాల్లోని ఆక్సిజన్ లభ్యతలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయా? కాలుష్యం, పారిశ్రామిక వ్యర్థాలు, అధిక ఉష్ణోగ్రతల వల్ల నదుల్లోని ఆక్సిజన్ శాతం తగ్గి అందులోని జలచరాల ఉనికికి ముప్పు ఏర్పడుతుందా? కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) తాజా నివేదికల ప్రకారం ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. పరిశ్రమల నుంచి విడుదలయ్యే కాలుష్యం, మురుగునీటిని నదుల్లోకి యథేచ్ఛగా వదిలేయడం.. ఇష్టారాజ్యంగా గనులు తవ్వకం, గ్లోబల్ వారి్మంగ్ వల్ల అవి కాలుష్య కాసారాలుగా మారాయని.. దాంతో నదీజలాల్లో ఆక్సిజన్ లభ్యత తగ్గిపోతుందని వెల్లడైంది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే దేశ ప్రజల సామాజిక, ఆర్థిక అభివృద్ధి, ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతుందని సీడబ్ల్యూసీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 13 నదుల్లో ఆక్సిజన్ లభ్యతపై పరీక్షలు దేశంలోని నదీ జలాల్లో రోజురోజుకు మత్స్యసంపద తగ్గిపోవడానికి గల కారణాలు అన్వేషించాలని జీవశాస్త్రవేత్తలు చేసిన సూచన మేరకు సీడబ్ల్యూసీ ఈ అధ్యయనం నిర్వహించింది. ఇందులో ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి. కాలుష్యం, భూతాపం వల్ల నదుల్లో ఆక్సిజన్ తగ్గిపోతుందని, తక్షణం కాలుష్యానికి అడ్డుకట్ట వేసి జీవావరణ (ఎకాలజీ) సమతుల్యతను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని ఇటీవల ప్రభుత్వానికి నివేదిక అందచేసింది. హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు కలిపి మొత్తం 13 నదుల్లోని 19 ప్రాంతాల్లో మూడు కాలాల్లో రోజూ మూడు గంటలకోసారి నీటిని సేకరించి డీఓ(నీటిలో కరిగిన ఆక్సిజన్) శాతాన్ని సీడబ్ల్యూసీ లెక్కగట్టింది. డీఓ తగ్గినా.. పెరిగినా ముప్పే డీఓ పరిమాణం 1 నుంచి 2 మిల్లీగ్రాముల మధ్య ఉంటే చేపలు చనిపోతాయి. 7 మిల్లీగ్రాములు అంతకంటే ఎక్కువ డీఓ ఉంటే ఆ నదుల్లో చేపల పునరుత్పత్తి్త గణనీయంగా తగ్గిపోతుంది. నదీజలాల్లో డీఓ శాతం 1 మిల్లీగ్రాము కంటే తగ్గితే బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. నాచు(ఆల్గే), గుర్రపుడెక్క వంటి నీటి మొక్కలు ఎక్కువగా పెరిగి నది జీవావరణం దెబ్బతింటుంది. దీంతోచేపల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. సీడబ్ల్యూసీ అధ్యయనంలో వెల్లడైన అంశాలు ►హిమాలయాల్లో జన్మించి ఉత్తరాది రాష్ట్రాల్ని సస్యశ్యామలం చేసే గంగ, యమునా, బ్రహ్మపుత్ర తదితర నదులు కాలుష్య కాసారాలుగా మారాయి. ఢిల్లీ రైల్వే బ్రిడ్జి వద్ద యమునా జలాల్లో ఆక్సిజన్ లభ్యత దాదాపుగా లేదు. అన్ని కాలాల్లో ఏ రోజూ కూడా అక్కడ ఆక్సిజన్ ఉనికి కని్పంచలేదు. యమునలో ఒకటీ అరా చేపలు కూడా కానరాలేదు. ►గంగా నదిలో వారణాసి వద్ద లీటర్ నీటిలో కనిష్టంగా 6.12 మిల్లీ గ్రాములు.. గరిష్ఠంగా 9.14 మిల్లీగ్రాముల డీఓ ఉంది. గాం«దీఘాట్ వద్ద గంగలో లీటర్ నీటిలో కనిష్టంగా 5.24 మి.గ్రా., గరిష్టంగా 7.95 మి.గ్రా.ల డీఓ ఉంది. నమామి గంగలో భాగంగా నది ప్రక్షాళనతో కాలుష్య ప్రభావం క్రమేణా తగ్గుతుంది. ►తుంగభద్ర నదిలో మంత్రాలయం వద్ద లీటర్ నీటిలో కనిష్టం 5.20, గరిష్టం 9.60 మిల్లీగ్రాముల ఆక్సిజన్ లభిస్తోంది. మహారాష్ట్రలోని పుల్గావ్ వద్ద భీమా నదిలో కనిష్టంగా 6.20 మి.గ్రా., గరిష్టంగా 10.90 మి.గ్రాముల డీఓ ఉంది. ►హిమాలయ నదుల కంటే మధ్య, దక్షిణ భారతదేశంలోని నదుల్లో ఆక్సిజన్ లభ్యత మెరుగ్గా ఉంది. ద్వీపకల్ప నదుల్లోనూ ఆక్సిజన్ లభ్యతలో ఎప్పటికప్పుడు మార్పుల వల్ల మత్స్యసంపద వృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతోంది. ►కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం లీటర్ నీటిని శుద్ధి చేయక ముందు.. డీఓ ఆరు మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉంటేనే వాటిని తాగునీటి కోసం వినియోగించవచ్చు. ఐదు మిల్లీగ్రాముల కంటే డీఓ ఎక్కువ ఉంటే వాటిని స్నానానికి వాడొచ్చు. శుద్ధి చేసిన తర్వాత డీఓ శాతం నాలుగుగా ఉంటే ఆ నీటిని తాగొచ్చు. -
పరుగులెత్తనున్న ప్రగతి రథం
నాలుగు నెలలుగా జరుగుతున్న ఆర్థిక సంస్కరణలను పరిశీలిస్తే భారత్ ఇక పెట్టుబడులకు అనుకూలం అనే మాట తేటతెల్లమౌతోంది. సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను పైనా, విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లకు అవసరమైన కనీస ప్రత్యామ్నాయ పన్ను, సెక్యూరిటీ లావాదేవీల పన్ను, మూలధనలబ్ధిపై పన్నువంటి వాటి నుంచి భారీ సడలింపులు ఇచ్చారు. ప్రోత్సాహకాలవల్ల దేశంలో పెట్టుబడులరాక పెరగడంతో పాటు పరిశ్రమలు భారీగా ఏర్పడతాయి. ఉత్పత్తి పెరుగుతుంది. ఎగుమతులతో ఆదాయం పెరుగుతుంది. భారీగా ఉపాధి అవకాశాలు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కార్పొరేట్ పన్నులు భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సందర్భంగా చైనా, వియత్నాం, మయన్మార్, తైవాన్, థాయిలాండ్, మలేషియా వంటి దేశాల నుంచి తయారీ కంపెనీలు భారత్‌కు బారులు తీరే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. ఆర్థికరంగ వృద్ధి కోసం మోదీ ప్రభుత్వం నాలుగు నెలలుగా విప్లవాత్మక చర్యలు చేపట్టింది. మరో అయిదేళ్లలో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ ఏర్పాటే లక్ష్యంగా తక్షణ కార్యాచరణను ముమ్మరం చేసింది. గత అయిదేళ్ల పాలనలో పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన సౌకర్యాలు కల్పించగా, ఇప్పుడు పెట్టుబడుల ఆకర్షణకు ఊతం ఇచ్చింది. 2015లోనే మేకిన్ ఇండియా నినాదంతో ప్రధాని నరేంద్రమోదీ పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహమి చ్చారు. రోడ్లు, రైల్వే, ఎయిర్‌పోర్టులు, ఓడరేవుల అభివృద్ధి అనుసంధానం వల్ల పలు కంపెనీలు ఏర్పడ్డాయి. మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలు భారత్‌లో తయారీ మొదలుపెట్టాయి. ఇప్పుడు నాలుగునెలలుగా జరుగుతున్న ఆర్థిక సంస్కరణలను పరిశీలిస్తే భారత్ ఇక పెట్టుబడులకు అనుకూలం అనే మాట తేటతెల్లమౌతుంది. బ్యాంకులకు మూలధన వనరులకింద రూ. 70 వేల కోట్లు అందించడం, విదేశీ రుణాలకు అవకాశం, డాలర్లలో చెల్లింపులకు, రూపాయి బాండ్లు జారీకి సడలింపులు ఇచ్చింది. గృహనిర్మాణం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యాపారసంస్థలు, ఆటోమొబైల్, బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థలు , ఎగుమతుల రంగాలకి ప్రోత్సాహకాలు ఇచ్చింది. సర్‌ఛార్జి తొలగించి పెట్టుబడులకు ప్రోత్సాహమిచ్చింది. తాజాగా కార్పొరేట్ రంగానికి విధించే పన్నును 10 శాతం వరకు తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. గత 28 ఏళ్లలో ఈ స్థాయిలో పన్ను తగ్గించడం ఇదే తొలిసారి. ఈ నిర్ణయంతో కార్పొరేట్ పన్ను 35 శాతం నుంచి 25.17 శాతానికి తగ్గింది. కనీస ప్రత్యామ్నాయ పన్నుగా విధించే 18.5 శాతం పన్నును 15 శాతానికి కుదించారు. సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను పైనా, విదేశీ పోర్టు ఫోలియో మదుపుదారులకు అవసరమైన కనీస ప్రత్యామ్నాయ పన్ను, సెక్యూరిటీ లావాదేవీలపన్ను, మూలధన లబ్ధిపై పన్నువంటి వాటి నుంచి భారీ సడలింపులు ఇచ్చారు. కొత్త కంపెనీలకు కార్పొరేట్ రంగంలో 2023 మార్చి 31 నాటికి ఉత్పత్తిని ప్రారంభించే సంస్థలకు ఆదాయపు పన్ను 15 శాతంగా ఉంటుంది. ఈ సంస్థలు ఎలాంటి కనీస ప్రత్యామ్నాయ పన్ను వంటివి చెల్లించనవసరం లేదు. కార్పొరేట్లు దేశీయ కంపెనీలు అయితే ఎలాంటి ప్రోత్సాహకాలు తీసుకోకుండా 22 శాతం పన్నులు చెల్లించుకోవచ్చు. ప్రత్యామ్నాయ పన్ను కూడా వారిపై విధించరు. ఇలాంటి సంస్థలకు అన్ని నుంకాలు, సెస్సులు కలిపి 25.17శాతంగా పన్నులు ఉంటాయి. దేశీయ ఉత్పత్తిరంగ సంస్థలకు మార్కెట్ వసతి కల్పించేందుకు మెగా మార్కెట్ జాతాలు నిర్వహిస్తారు. ఇన్ని ప్రోత్సాహకాలవల్ల దేశంలో పెట్టుబుడలరాక పెరగడంతో పాటు పరిశ్రమలు భారీగా ఏర్పడతాయి. ఉత్పత్తి పెరుగుతుంది. ఎగుమతులతో ఆదాయం పెరుగుతుంది. భారీగా ఉపాధి అవకాశాలు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఆర్థికరంగం బలోపేతం దేశీయ కంపెనీలకు విత్త సహాయం కావాలంటే బ్యాంకింగ్ రంగం బలంగా ఉండాలి. 2017 వరకు దేశంలో ఈ పరిస్థితి లేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కొందరు పెద్దలు బ్యాంకుల వద్ద భారీగా అప్పులు తీసుకుని వాటిని ఉద్దేశపూర్వకంగా తిరిగి చెల్లించకపోవడంతో రానిబాకీలు బాగా పెరిగాయి. ఇలాంటి నిరర్ధక ఆస్తులను తిరిగి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కఠినమైన చట్టాలు చేసింది. బ్యాంకులకు రుణం చెల్లించక ఎగవేసిన వారు వాటిని చెల్లించేలా చర్యలు తీసుకుంది. ఇదికాక పెద్దమొత్తంలో నగదు బ్యాంకుల వద్ద కాక కొద్దిమంది వద్ద మాత్రమే ఉండిపోయింది. దానిని బయటకు తీసుకువచ్చేందుకు పెద్దనోట్ల రద్దును 2017లో అమలు చేసి నగదును బ్యాంకుల వద్దకు తీసుకువచ్చారు. బ్యాంకులకు మరింత ఆర్థిక పరిపుష్టి కలిగించేందుకు రూ.70 వేల కోట్లు ఇచ్చారు. బ్యాంకులకు మరింత శక్తిని కల్పించే క్రమంలో గత నెలలోనే పది ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసి నాలుగు పెద్ద బ్యాంకులుగా మార్చారు. అలాగే ఇకపై 27 ప్రభుత్వరంగ బ్యాంకుల స్థానంలో 12 బ్యాంకులు మాత్రమే కొనసాగుతాయి. ప్రభుత్వం మార్కెట్లో రూ. 5 లక్షల కోట్లు ద్రవ్య నిధి జారీ చేయడానికి అడ్వాన్స్‌గా రూ. 7 లక్షల కోట్లు జమచేస్తుంది. దీనివల్ల కార్పొరేట్, రిటైల్ వ్యాపారులు, ఎంఎస్ఎంఈ, చిరు వ్యాపారులు మొదలైన వారికి లాభం కలుగుతుంది. బ్యాంకు రుణగ్రహీతలందరికీ లాభం చేకూర్చే ఉద్దేశంతో ఎంసీఎల్ఆర్ తగ్గించడానికి రేట్లలో కోత విధించాలని నిర్ణయించారు. బ్యాంకుల ద్వారా రుణ ఉత్పాదనలకు సంబంధించిన రెపో రేటు, ఔటర్ బెంచ్ మార్కు ఏర్పాటు చేయటం, ఆగిపోయిన గృహ నిర్మాణాల కోసం ఒక ప్రత్యేక గవాక్ష విభాగం ద్వారా సహాయం అందిస్తారు. దీని కోసం రూ. 10 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తారు. 2020 మార్చి 31 వరకూ ఇబ్బందుల్లో ఉన్న ఏ ఎంఎస్ఎంఈని ఎన్పీఏగా ప్రకటించరు. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో బ్యాంకులు, ఎన్బీఎఫ్, వ్యక్తిగత రుణాలు తీసుకునేవారి ముఖాముఖీ సమావే శాలు జరుగుతాయి. ఇందులో బ్యాంకుల ద్వారా రుణగ్రహీతలకు భారీగా నగదు అందుతుంది. తయారీ కంపెనీల వరుస కార్పొరేట్ పన్నులు భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటిం చిన సందర్భంగా చైనా, వియత్నాం, మయన్మార్, తైవాన్, థాయిలాండ్, మలేసియా వంటి ఆగ్నేయాసియా దేశాల నుంచి తయారీ కంపెనీలు భార త్‌కు బారులు తీరే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. తయారీ రంగంలో ఎగుమతుల్లో ప్రథమస్థానంలో ఉన్న చైనా ఇప్పుడు సంక్షోభంలో ఉంది. రెండేళ్లుగా చైనా, అమెరికాల మధ్య జరుగుతున్న వ్యాపార పోరాటమే దీనికి కారణం. ఇదొక్కటే కాదు చైనాలో ఉన్న అమెరికా కంపెనీలన్నీ త్వరలో అక్కడ నుంచి ఖాళీ చేసి బయటకు రానున్నాయి. ఇలా చైనాను విడిచే కంపెనీలు ఇప్పుడు భారత్ వైపు చూడనున్నాయి. నైపుణ్యం, తక్కువ వేతనంలో లభించే పనివారు చైనాకంటే భారత్‌లో లభ్యమైనా, అధిక పన్నులు ఉండటం వల్ల భారత్ పోటీ పడలేకపోయింది. ప్రస్తుతం పన్నుల తగ్గింపుతోపాటు మౌలికవసతులు కల్పించడంతో ఇక భారత్, త్వరలో చైనాకు ప్రత్యామ్నాయ తయారీ రంగంగా రూపుదిద్దుకోనుంది. దేశీయంగా ఉపయోగం దేశంలో పెట్టుబడుల రూపంలో ఒక పెద్ద మొత్తం మన ఆర్థ్ధికవ్యవస్థలో చేరుతుంది. ఈ పెట్టుబడి ముఖ్యంగా తయారీ రంగంలో, వ్యవసాయేతర రంగాల్లో ఉద్యోగాలు కల్పిస్తుంది. ఇల్లు, వాహనాలు, వినియోగవస్తువుల కొనుగోలును ప్రోత్సహించేందుకు హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్ఎఫ్సీ), నేషనల్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎన్హెచ్ఎఫ్సి)కి అదనంగా ఇచ్చే రూ. 20 వేల కోట్ల సహాయాన్ని రూ. 30 వేల కోట్లకు పెంచుతారు. బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థ, హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్ఎఫ్సీ), విస్తారంగా భూములు కొనడం కోసం పాక్షిక రుణ భద్రతా పథకం ఏర్పాటు, ఎగుమతుల రుణాలు రూ. 38 వేల కోట్ల నుంచి రూ. 68 వేల కోట్లకు పెంపు, ఎగుమతి రుణాలపై బీమా పరిధి పెంపు వంటి ప్రోత్సాహకాలు అమలు చేస్తారు. తక్కువ పన్నుల విధానం, అనుమతుల మంజూరులో మౌలిక మార్పులు తెస్తారు. కొత్త ప్రాజెక్టుల రూపంలో ద్రవ్య పెట్టుబడి జరుగుతుంటే దీనివల్ల తయారీరంగపు యూనిట్లు దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. దీనివల్ల ముందుముందు మరిన్ని ఉద్యోగాలు పెరుగుతాయి. ఆర్థికవ్యవస్థకు లాభం కలుగుతుంది. తయారీ రంగంలో అధిక పెట్టుబడులు వ్యవసాయ, వ్యయసాయేతర రంగాల్లో కార్మికుల వేతనాన్ని పెంచుతాయి. ప్రజలు వ్యవసాయంపై ఎక్కువ ఆధారపడతారు. దాంతో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది. ఉత్పాదకత పెరగడంతోపాటు ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది. వారి ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు వీలు కలుగుతుంది. జి. కిషన్ రెడ్డి వ్యాసకర్త కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి -
కారు నుంచి బుల్లెట్ రైలు వరకూ
ఒసాకా/కోబే: భారత ఆర్థికాభివృద్ధిలో జపాన్ కీలకమైన పాత్ర పోషించిందని ప్రధాని మోదీ తెలిపారు. సంయుక్త భాగస్వామ్యంలో కార్లు(మారుతీ సుజుకీ) తయారుచేయడం దగ్గర్నుంచి బుల్లెట్ రైళ్ల వరకూ ఇరుదేశాల మధ్య సంబంధాలు కాలంతోపాటు దృఢమయ్యాయని వ్యాఖ్యానించారు. నేటి నుంచి రెండ్రోజుల పాటు సాగే జీ20 సదస్సు కోసం మోదీ జపాన్‌లోని ఒసాకాకు చేరుకున్నారు. అనంతరం జపాన్ ప్రధాని షింబో అబేతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ పటిష్టత కోసం, అవినీతిని నిర్మూలించడానికి రుణఎగవేతదారులపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరముందని ఇరువురు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ వాణిజ్యం, డేటా ఫ్లో నియంత్రణ విషయంలో సరైన చర్యలు తీసుకోవాలని మోదీ–అబేలు నిర్ణయించారు. వాతావరణ మార్పులపై ఈ జీ20 సదస్సులోనే ఓ నిర్మాణాత్మక అంగీకారానికి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భారత్‌లో జపాన్ నిర్మిస్తున్న హైస్పీడ్ రైల్ కారిడార్(ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు)పై ఇరువురు కొద్దిసేపు చర్చించుకున్నారు. జీ20 సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత జిన్‌పింగ్‌తో మోదీ ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. ఇరుదేశాల సంస్కృతిలో అంతర్భాగం.. ప్రపంచదేశాలతో భారత్ సంబంధాల విషయానికి వస్తే జపాన్‌కు ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. సామరస్యం, పరస్పరం గౌరవించుకోవడం అన్నది ఇరుదేశాల సంస్కృతిలో అంతర్భాగంగా ఉందని వ్యాఖ్యానించారు. జపాన్ పర్యటనలో భాగంగా కోబే నగరంలో గురువారం భారత సంతతి ప్రజలతో మోదీ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన మోదీకి భారత సంతతి ప్రజలు కరతాళధ్వనులతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘రాబోయే ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావడంలో జపాన్ పాత్ర ఎంతో ఉంది. ఈరోజు ఇండియాలో ప్రతీచోట జపాన్ ప్రాజెక్టులు, పెట్టుబడులు ఉన్నాయి. అదే సమయంలో భారత మానవ వనరులు, నైపుణ్యంతో జపాన్ లబ్ధిపొందుతోంది’ అని అన్నారు. ‘విపత్తు’ సాయం కోరుతున్నా.. విపత్తు నిర్వహణ, పునరావాసం, పునర్నిర్మాణం విషయంలో జపాన్ సహకారాన్ని తాము కోరుతున్నట్లు చెప్పారు. కాగా, ఈ ఏడాది భారత్‌లో జరిగే ఇండియా–జపాన్ వార్షిక సదస్సుకు అబే రాకకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలిపారు. కాగా, ఈ భేటీకి ముందు ఇరుదేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. 3 కోతుల కథ చెప్పిన మోదీ భారత్–జపాన్ల మధ్య ఎంత బలమైన సంబంధాలు ఉన్నాయో తెలిపేందుకు కళ్లు, చెవులు, నోరు మూసుకున్న మూడు కోతులను మోదీ ప్రస్తావించారు. ‘చెడు చూడవద్దు.. చెడు వినవద్దు.. చెడు మాట్లాడవద్దు అని బాపూ(మహాత్మా గాంధీ) చెప్పడాన్ని మనమందరం వినుంటాం. ఇందుకు కళ్లు, చెవులు, నోరు మూసుకున్న కోతులను ప్రతీకగా చూపుతారు. కానీ ఇందుకు మూలం 17వ శతాబ్దపు జపాన్‌లో ఉంది. మిజారు అనే కోతి చెడు చూడదు. కికజారు అనే కోతి చెడు వినదు. ఇవజారు అనే కోతి చెడు మాట్లాడదు’ అని మోదీ తెలిపారు. -
రాష్ట్ర ఆర్థికాభివృద్ధి 10.52 శాతం
సాక్షి, అమరావతి: దేశ ఆర్థికాభివృద్ధి 7.3 శాతం కాగా ఏపీ ఆర్థికాభివృద్ధి 10.52 శాతంగా ఉందని ఏపీ, తెలంగాణ ఉమ్మడి గవర్నర్ నరసింహన్ చెప్పారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం జరిగిన గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దుతున్నామన్నారు. ఈబీసి కోటా కింద ప్రవేశ పెట్టిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయిస్తున్నామన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం రూ. లక్షా 9 వేల కోట్లు ఖర్చు అవుతుందని, మొదటి విడతగా రూ. 51,687 కోట్లు కేటాయించామన్నారు. అందులో భాగంగా రూ. 41,297 కోట్ల పనులు జరుగుతున్నాయన్నారు. నాలుగేళ్లలో రైతులకు రూ. 24 వేల కోట్ల మేర రుణమాఫీ చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ హౌసింగ్ కింద 10,15,663 ఇళ్లు నిర్మించినట్టు వివరించారు. ఇప్పటికే కృష్ణా–గోదావరి అనుసంధానం చేశామని, గోదావరి పెన్నా నదుల అనుసంధానం చేపట్టామన్నారు. రూ.20 వేల కోట్లతో అమరావతి–అనంతపురం గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం చేపట్టబోతున్నట్టు చెప్పారు. విమానాల ఇంధనంపై టాక్స్‌ను 16 శాతం నుంచి 1 శాతానికి తగ్గించినట్టు తెలిపారు. ఈ ఏడాది గన్నవరం నుంచి సింగపూర్‌కి అంతర్జాతీయ విమాన స్వర్వీసులు ప్రారంభించినట్టు చెప్పారు. చంద్రన్న బాట కింద గ్రామీణ ప్రాంతాల్లో 23,550 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మించామన్నారు. వ్యవసాయ రంగానికి 9 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. విద్యా రంగానికి పెద్ద పీట వేశామని, మన ఊరు, మన బడి, బడి పిలుస్తుంది కార్యక్రమాల ద్వారా విద్య ప్రాముఖ్యత తెలియజేశామన్నారు. నాలుగున్నరేళ్లలో వివిధ రంగాలలో జాతీయ అంతర్జాతీయ సంస్థల నుంచి 660 అవార్డ్స్ సాధించినట్టు చెప్పారు. శాంతిభద్రతల నిర్వహణలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించటం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నట్టు గవర్నర్ చెప్పారు. జాతీయ పతాకం ఎగురవేసిన గవర్నర్.. గణతంత్ర వేడుకల్లో భాగంగా జాతీయ పతాకాన్ని గవర్నర్ నరసింహన్ ఎగురవేశారు. తొలుత సభా ప్రాంగణానికి చేరుకున్న గవర్నర్ నరసింహన్, విమలా నరసింహన్‌లకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహనంపై గవర్నర్ పెరేడ్‌ను తిలకించి గౌరవ వందనం స్వీకరించారు. సీఎస్ పునేఠ, డీజీపీ ఠాకూర్ పెరేడ్లో గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, అధికారులు పాల్గొన్నారు. కవాతులో ఇండియన్ ఆర్మీ ఫస్ట్... గణతంత్ర వేడుకల్లో నిర్వహించిన కవాతు(పెరేడ్) అందర్నీ ఆకట్టుకుంది. ఆర్ముడ్ విభాగంలో ఇండియన్ ఆర్మీ, ఏపీఎస్పీ ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించాయి. అన్ ఆర్ముడ్ విభాగంలో ఎన్సీసీ బాలురు, బాలికలు ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించారు. ఒడిశా కంటిజెంట్‌కు ప్రత్యేక బహుమతిని అందించారు. ఇండియన్ ఆర్మీ కటింజెంట్ ముత్తు పాండ్యన్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ అమిత్ కుమార్, ఒడిశా స్టేట్ పోలీస్ అశోక్ కుమార్ బ్రహ్మ, ఏపీఎస్పీ 2వ బెటాలియన్ డి.మధుసూదనరావు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కృష్ణ ధర్మరాజు, ఎన్సీసీ బాలుర కటింజెంట్ కె.సురేంధర్, ఎన్సీసీ బాలికల కటింజెంట్ పి.భాగ్యశ్రీ, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్(బాయ్స్, గరల్స్) కటింజెంట్ సీహెచ్ కృష్ణవేణి, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ (బాయ్స్, గరల్స్) కటింజెంట్ గంగుల చందు, యూత్ రెడ్ క్రాస్ బాయ్స్ కటింజెంట్ వై మురళీకృష్ణ ఆధ్వర్యంలో గవర్నర్‌కు గౌరవవందనం అందజేశారు. అనంతరం పైప్ /బ్రాస్ బ్యాండ్ విభాగాలు గౌరవ వందనాన్ని అందజేశారు. సమాచార శాఖ శకటం ఫస్ట్.. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ రంగాలలో జరుగుతున్న కార్యక్రమాలపై రూపొందించిన శకటాలు ప్రదర్శించాయి. సమాచార పౌరసంబంధాల శాఖ, అటవీశాఖ, పర్యాటక శాఖల శకటాలు మొదటి, రెండు, మూడు బహుమతులు గెలుచుకున్నాయి. వ్యవసాయ, సీఆర్డీఏ, విద్యాశాఖ, అటవీశాఖ, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ, గృహనిర్మాణ శాఖ, ఉద్యాన శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, పర్యాటక శాఖ, జలవనరుల శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, పరిశ్రమలు, వాణిజ్య శాఖలు ప్రత్యేకంగా అలంకరించిన శకటాలు ప్రదర్శించాయి. ఉండవల్లిలో జాతీయజెండా ఎగురవేసిన సీఎం (బాక్స్) గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేసి, జెండాకు గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ఏవి రాజమౌళి, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ వెంకటేశ్వర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
పరిశ్రమలపై ఆర్బీఐ గవర్నర్ దృష్టి
ముంబై: దేశ స్థూల ఆర్థిక పరిస్థితులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ మరింత దృష్టి సారిస్తున్నారు. ఆర్థికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన గురువారం పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ట్వీట్లో దాస్ ఈ వివరాలను వెల్లడించారు. నవంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి కేవలం అరశాతంగా నమోదయిన నేపథ్యంలో గవర్నర్ పారిశ్రామిక బృందాలతో భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. డిసెంబర్ రిటైల్ (2.19%), టోకు ధరలు (3.80%) తగ్గిన పరిస్థితుల్లో ఆర్బీఐ రెపో రేటును (ప్రస్తుతం 6.5%) తగ్గించాలని ఇప్పటికే పారిశ్రామిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. పాలసీ విధానాలు, తీసుకునే నిర్ణయాల విషయంలో ఆర్బీఐ తమ వాదనలకు ప్రాధాన్యమివ్వడం లేదని కూడా పలు సందర్భాల్లో పారిశ్రామిక ప్రతినిధుల నుంచి విమర్శ వస్తోంది. కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్రవ్య పరపతి విధాన కమిటీ ఫిబ్రవరి 7వ తేదీన ద్వైమాసిన ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించనున్న సంగతి తెలిసిందే. వరుస సమావేశాలు... ఆర్బీఐ గవర్నర్‌గా డిసెంబర్ 12న బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండుసార్లు ప్రభుత్వ బ్యాంకర్లతో, ఒకసారి ప్రైవేటు బ్యాంకర్లతో ఆర్బీఐ గవర్నర్ సమావేశమయ్యారు. లిక్విడిటీ (ద్రవ్యలభ్యత), చిన్న పరిశ్రమలకు రుణ లభ్యతసహా దిద్దుబాటు చర్యల పరిధిలో (పీసీఏ) ఉన్న 11 బ్యాంకులపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అటు తర్వాత లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ), నాన్– బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులతో కూడా భేటీ అయ్యారు. ఎంఎస్ఎంఈ ప్రతినిధులతో సమావేశం అనంతరం ఈ రంగం అభివృద్ధిపై సలహాలకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మాజీ చైర్మన్ యూకే సిన్హా నేతృత్వంలో ఆరుగురు సభ్యుల నిపుణుల కమిటీనీ ఏర్పాటు చేయడం గమనార్హం. ఎంఎస్ఎంఈలకు సంబంధించి రూ.25 కోట్ల వరకూ రుణం ఉండి, చెల్లించలేకపోతున్న రుణాన్ని, ఒకేసారి పునర్వ్యవస్థీకరించడానికి కూడా ఆర్బీఐ అనుమతించింది. -
వచ్చే ఏడాదీ ఆర్థిక వృద్ధి జోరు– సీఐఐ
న్యూఢిల్లీ: పలు అంతర్జాతీయ ప్రతికూల సంఘటనలు జరిగినప్పటికీ, ఈ ఏడాది వేగవంతమైన వృద్ధి సాధించిన ఆర్థిక వ్యవస్థగా గుర్తింపుపొందిన భారత్ 2019లో సైతం ఇదే జోరును ప్రదర్శించగలదని పరిశ్రమల సమాఖ్య సీఐఐ అంచనావేసింది. సర్వీసుల రంగం పటిష్టమైన పనితీరుతో పాటు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వినియోగ డిమాండ్ మెరుగుదల కారణంగా 2019లో జీడీపీ వృద్ధి 7.5 శాతానికి చేరుతుందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. జీఎస్టీ అమలులో క్రమేపీ అడ్డంకులు తొలగడం, మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెరగడం, రుణ సమీకరణ ప్రత్యేకించి సర్వీసుల రంగంలో 24 శాతానికి పెంచుకోవడం వంటి అంశాలు బలమైన ఆర్థికాభివృద్ధికి బాట వేస్తున్నాయని ఆయన వివరించారు. 2018లో పలు ప్రధాన దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలుకావడం, చమురు ధరలు పెరగడం, అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ కఠినతర ద్రవ్య విధానం వంటి ప్రతికూలాంశాల నడుమ భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధిచెందిందని సీఐఐ గుర్తుచేసింది. 2019లో జీడీపీ వృద్ధి వేగవంతంకావడానికి ఏడు కీలక విధాన చర్యల్ని సీఐఐ సూచించింది. ఇంధనం, రియల్ ఎస్టేట్, విద్యుత్, ఆల్కహాల్ విభాగాలను జీఎస్టీ పరిధిలోకి తేవడం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణ లభ్యతను పెంచడం, పీసీఏ పరిధిలో వున్న బ్యాంకులపై నియంత్రణలను సరళీకరించడంతో పాటు మ్యూచువల్‌ఫండ్స్‌తో సహా ఆర్థిక సంస్థలకు అత్యవసర నిధుల్ని అందుబాటులో ఉంచాలని సీఐఐ కోరింది. ల్యాండ్ రికార్డుల్ని డిజిటలైజ్ చేయడం, రాష్ట్రాల్లో ఆన్లైన్ సింగిల్ విండో వ్యవస్థల్ని ఏర్పాటుచేయడం వంటివి జరగాలని సీఐఐ ఆకాంక్షించింది. -
ప్రపంచ ఆర్థిక రథసారథులు
కూడబెడితే డబ్బు జమౌతుంది.. దాచిపెడితే ఖర్చులకు ఉంటుంది.ఈ జమాఖర్చులేనా... మనీ మేనేజ్మెంట్ అంటే?ఇంటి వరకైతే ఇంతే. దేశం వరకైతే ఇంతే. దేశాల మధ్య డబ్బుని తిప్పడం మాత్రం.. అంతకుమించిన పని! ఆ పనిని మహిళలు నేర్పుగా చేస్తున్నారు కనుకే..ప్రపంచ బ్యాంకులన్నీ ఇప్పుడు ఆడవాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. దేశాల అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. సరకులు నిండుకున్నా.. ఆ క్షణంలో ఇంటికొచ్చిన అతిథికి కడుపు నిండా అన్నంపెట్టి పంపించగల నేర్పరులు మహిళలు. జేబులో చిల్లిగవ్వ లేకుంటే గడప దాటలేరు పురుషులు. అప్పంటే ఆడవారికి భయం. భర్త జీతంలోంచి ఖర్చుల కోసమని ఇచ్చే చాలీచాలని డబ్బుతోనే తులాల కొద్ది బంగారాన్ని కొనిపెట్టే ఇగురం ఆమెది.. ఆపదలో అక్కరకు వస్తుందని, భవిష్యత్ పట్ల విజన్ అది. వేలకు వేలు జీతం తీసుకుంటున్నా ఆ తెగువ చూపరు మగవాళ్లు. ఇన్వెస్ట్మెంట్ పట్ల ఇగ్నోరెన్స్ వీళ్లది. దుబారా.. మేల్కి నిర్వచనం. ఆదా ఆడాళ్ల పేటెంట్. అందుకే ఇంటి నుంచి ప్రపంచం దాకా మనీ మ్యాటర్స్ను మేనేజ్ చేస్తోంది మహిళే. ఇంటి పద్దు లోటు అప్పుగా మారకుండా ఎంత నేర్పుతో ఉంటుందో.. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వడ్డీని అంతే నిక్కచ్చిగా వసూలు చేస్తోంది. ఇది స్త్రీ శక్తి అని నిరూపిస్తున్నారు... ఐమ్ఎఫ్కు రెండు రోజుల క్రితమే చీఫ్ ఎకనమిస్ట్‌గా నియమితురాలైన గీతా గోపీనాథ్, ఐఎమ్ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టీన్ లెగార్డ్, వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ పినలోపి కౌజనో గోల్డ్బర్గ్, వరల్డ్ బ్యాంక్ సీఈఓ క్రిస్టలినా జార్జీవా, ఓఈసీడీ చీఫ్ ఎకనమిస్ట్ లారెన్స్ బూన్. వీళ్లే కాదు. ప్రతి సాధారణ గృహిణి కూడా! జగత్తుకు సంబంధించిన విత్తం వ్యవహారాలను చూస్తోన్న ఆ అయిదుగురి గురించి తెలుసుకుంటే.. మనింటి ఆడపడుచుల మీదా గౌరవం రెట్టింపవుతుంది. గీత గోపీనాథ్ డేటాఫ్ బర్త్.. డిసెంబర్, 1971. తండ్రి టీవీ గోపీనాథ్. రైతు, వ్యాపారి. తల్లి విజయలక్ష్మి గృహిణి. మలయాళీ కుటుంబం. కానీ గీత పుట్టింది కోల్‌కతాలో. తండ్రి వ్యవసాయంతో పాటు వ్యాపారమూ చేస్తుండడంతో ఆగ్రో ఎకనామిక్స్ మీద మొదటి నుంచి ఆసక్తి పెంచుకుంది. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో మాస్టర్స్ చేసి యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ వెళ్లింది. ప్రిన్స్టన్ యూనివర్శిటీలో పీహెచ్డీ చేసింది. 2010లో హార్వర్డ్ యూనివర్శిటీలో (ఎకనమిక్స్ డిపార్ట్మెంట్) పర్మినెంట్ ప్రొఫెసర్‌గా నియమితురాలైంది. ఆ అవకాశం దక్కిన మూడో మహిళ గీత. మన భారతదేశం నుంచి అమర్త్యసేన్ తర్వాత ఆ గౌరవం అందుకున్న మొదటి భారతీయురాలు కూడా. ‘‘నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో మన దేశం తీవ్ర ఆర్థిక ఎద్దడిలో ఉంది. కరెన్సీ క్రైసిస్‌ను ఫేస్ చేసింది. ఆ పరిస్థితులను చూసే ఆర్థికశాస్త్రంలో పీహెచ్డీ చేయాలని డిసైడ్ అయ్యాను. అదే ఈ రోజు నన్ను ఐఎమ్ఎఫ్కు చీఫ్ ఎకనమిస్ట్ను చేసింది’’ అంటుంది గీతా గోపీనాథ్. 2014లో ఐఎమ్ఎఫ్ ప్రకటించిన తొలి 25 మంది అత్యుత్తమ ఆర్థికవేత్తలో ఒకరిగా స్థానం సంపాదించుకుంది. 2011లో వరల్డ్ ఎకనమిక్ ఫారమ్ ‘యంగ్ గ్లోబల్ లీడర్’ కు ఎంపికైంది. ‘‘ప్రపంచంలోని ప్రతిభ గల ఆర్థికవేత్తల్లో గీతా గోపీనాథ్ ఒకరు. ఆర్థిక వ్యవహారాల మీద సమగ్రమైన అవగాహన.. సమర్థత ఆమె ఇంటలెక్చువల్ లీడర్షిప్కు ప్రతీకలు’ అంటూ కితాబిస్తుంది ఐఎమ్ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టీనా లేగార్డ్. క్రిస్టీనా లేగార్డ్ పారిస్‌లో పుట్టింది. విజయం ఆమెకు కొత్త కాదు. ఐఎమ్ఎఫ్కి ఎమ్డీ పదవితోనే అది ప్రారంభం కాలేదు. చిన్నప్పుడు ఈతతో ఆమె గెలుపు మొదలైంది. ఆ విజయం టీనేజ్ వరకూ సాగింది. అవును.. ఆమె స్విమ్మర్. సింక్రనైజ్డ్ స్విమ్మింగ్ (ఈత, డాన్స్, జిమ్నాస్టిక్స్ మూడూ కలిపి చేసేది) టీమ్‌కి లీడర్ కూడా. పదహారేళ్ల వయసులో చదువు కోసం పారిస్ నుంచి అమెరికాకు ప్రయాణమైంది. ఫ్రెంచ్ వాళ్లకు (యురోపియన్స్) ఇంగ్లీష్ రాదు అన్న అపవాదును తుడిచేసింది.. అనర్ఘళంగా ఇంగ్లీష్‌లో మట్లాడుతూ. అమెరికా వెళ్లిన యేడాదికే తండ్రి చనిపోవడంతో మళ్లీ పారిస్ వచ్చేసింది. లా స్కూల్ ఆఫ్ పారిస్ నుంచి డిగ్రీ పట్టా తీసుకుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎయిక్స్ ఎన్ ప్రావిన్స్‌లో పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ చదివింది. 1981లో మళ్లీ అమెరికా వెళ్లింది. ఇంటర్నేషనల్ లా ఫర్మ్ బేకర్ అండ్ మెకెంజీలో అసోసియేట్‌గా చేరి లేబర్, యాంటి ట్రస్ట్, ఎమ్ అండ్ ఏ (మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్)లో స్పెషలైజేషన్ చేసింది. చదువు పూర్తయిన పద్దెనిమిదేళ్లకు అదే లా ఫర్మ్‌కు చైర్పర్సన్ అయింది. ఆ పదవి పొందిన మొదటి మహిళ క్రిస్టీనానే. ఇలాంటి ఫస్ట్లు చాలానే ఉన్నాయి ఆమె కెరీర్లో. 2005లో ఫ్రాన్స్ ట్రేడ్ మినిస్టర్ పదవి వరించింది. ఫ్రాన్స్ దేశపు ఎగుమతులను రికార్డ్‌స్థాయికి తీసుకెళ్లింది. ఆ సామర్థ్యం 2007లో ఆర్థికశాఖా మంత్రి పదవిని కట్టబెట్టింది. ఒక్క ఫ్రాన్స్‌లోనే కాదు.. జీ8 ప్రధాన దేశాల్లోనే ఆర్థిక శాఖ చేపట్టిన మొదటి మహిళా మంత్రిగా ఖ్యాతినార్జించింది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలిగే ముక్కుసూటి మనిషి. పారిశ్రామిక వేత్తలకు కాదు.. ప్రజలకు అవసరమయ్యే ఆర్థిక వ్యూహాలనే అనుసరించగల ధైర్యశాలి. ఈ నైజం నచ్చని పురుషాధిపత్య ఆర్థిక, పారిశ్రామిక రంగం.. 2008 నాటి ఆర్థిక సంక్షోభానికి ఆమె నిర్ణయాలను కారణంగా చూపుతూ క్రిస్టీనాను నిందించింది. అయినా ఆమె చరిష్మా తగ్గలేదు. ఫ్రాన్స్‌లోని బ్రాడ్‌కాస్టర్ ఆర్టీఎల్, లీ పారిసీన్ వార్తా పత్రిక 2009లో నిర్వహించిన ‘కంట్రీస్ మోస్ట్ ఫేవరేట్ పర్సనాలిటీస్’ పోల్‌లో పాపులర్ సింగర్, యాక్టర్ జానీ హాలీడేను ఓడించింది క్రిస్టీనా. ఆ కీర్తి అంతర్జాతీయ తీరాన్నీ తాకింది. అదే యేడు ఫైనాన్షియల్ టైమ్ ఆమెను యూరప్‌లోనే ది బెస్ట్ ఫైనాన్స్మినిస్టర్గా ఎన్నుకుంది. ఈ ఘనతలన్నిటిని ఆమె ఖాతాలో చేర్చింది ఆమె ముక్కుసూటి నైజమే. ‘‘క్రిస్టీనా.. ఇంప్రెసివ్ అండ్ స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఒక్క మాటలో చెప్పాలంటే ఫైనాన్షియల్ ప్లాట్‌ఫామ్ మీద ఆమె ఒక రాక్‌స్టార్’’ అని అభివర్ణిస్తాడు ఐఎమ్ఎఫ్ మాజీ చీఫ్ ఎకనమిస్ట్ కెన్నెత్ రోగోఫ్. పినెలోపి కైజనో గోల్డ్బర్గ్ గ్రీస్‌లో పుట్టింది. ఏథెన్స్లోని జర్మన్ స్కూల్లో చదువుకుంది. జర్మనీలో అండర్ గ్రాడ్యుయేషన్ చేయడానికి స్కాలర్షిప్ రావడంతో తర్వాతి విద్యాభ్యాసం జర్మనీ దేశంలో సాగింది. అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోగానే అమెరికా వెళ్లడానికి ప్లాన్ చేసుకుంది పినలోపీ. అమెరికాలోని ఓ బ్యాంక్‌లో ఇంటర్న్‌షిప్ కోసం ఉత్తరం రాసింది. ఆమె జాబుకు జవాబు వచ్చింది.. ‘‘మీరు డాక్టోల్ ప్రోగ్రామ్‌కి ఎన్రోల్ చేయించుకోకపోయుంటే కనుక మీ ఈ ఇంటర్న్‌షిప్ దరఖాస్తును కనీసం చూసి ఉండేవాళ్లం కూడా కాదు’’ అని. ‘‘ఆ జవాబు రాసిన వ్యక్తి ఎవరో కాని.. డాక్టోరల్ కోర్స్ చేయమని చెప్పకనే చెప్పాడు నాకు. అతని వల్లే డాక్టోరల్ డిగ్రీ చేశాను’’ అని గుర్తుచేసుకుంటుంది పినెలోపి. అలా ఆమె అమెరికాలోని ప్రతిష్టాత్మాకమైన స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో ఎకనామిక్స్‌లో పోస్ట్గ్రాడ్యూషన్ పూర్తి చేసింది. యేల్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసింది. వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ పదవి బరీలో మహామహులతో పోటీపడి ఆ స్థానాన్ని గెలుచుకుంది పినలోపీ. ‘‘పినెలోపి తన అకడమిక్ ఎక్స్‌పీరియెన్స్, మేధస్సుతో వరల్డ్ బ్యాంక్ గ్రూప్ వృద్ధికి పాటుపడుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ జిమ్ యోంగ్ కిమ్. వరల్డ్‌బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్‌గా ఉన్నా పాఠాలు చెప్పడం మరిచిపోలేదు పినెలోపి. ఇప్పటికీ యేల్ యూనివర్శిటీలో గెస్ట్‌గా ఫ్యాకల్టీగా వెళ్తూనే ఉంది. అన్నట్టు.. వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్‌గా ఎన్నికైన మొదటి గ్రీస్ దేశస్థురాలు ఈమె. లారెన్స్ బూన్ ఐర్లండ్ దేశస్తురాలు. లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్శిటీ పారిస్‌లో చదువుకుంది. ఫ్రాన్స్ ఆర్థిక, రాజకీయ రంగాల్లోనూ కీలక పాత్ర వహించింది. బ్యాంక్ ఆఫ్ అమెరికాలోనూ పనిచేసింది. తన అనుభవంతో ప్రపంచ ఆర్థిక సవాళ్లను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. అంతేకాదు ప్రస్తుత పరిస్థితులకు అవసరమైన ఆర్థిక ప్రణాళికలనూ రచిస్తోంది లారెన్స్ బూన్. ఇప్పుడర్థమైంది కదా.. పోపులో ఇంగువ మోతాదును అంచనా వేసినంత ఈజీగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులనూ పసిగట్టగల సమర్థులు మన మహిళలు అని! క్రిస్టలీనా జార్జీవా బల్గేరియా దేశస్తురాలు. బల్గేరియా, సోఫియాలోని యూనివర్శిటీ ఆఫ్ నేషనల్ అండ్ వరల్డ్ ఎకానమీలో పీహెచ్డీ (ఎకనామిక్స్‌లో) చేసింది. అదే యూనివర్శిటీలో సోషియాలజీతో మాస్టర్స్ చదివింది. తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్, మస్సాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్‌లో నేచ్యురల్ రిసోర్స్ ఎకనామిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ పాలసీ అభ్యసించింది. వరల్డ్ బ్యాంక్గ్రూప్లోనే ఆమె కెరీర్ మొదలైంది. యురోపియన్ యూనియన్ అనే కాన్సెప్ట్ రూపకల్పనలో భాగస్వామ్యం పంచుకుంది క్రిస్టిలీనా. వరల్డ్ బ్యాంక్ గ్రూప్‌లోని వివిధ శాఖలు, వివిధ స్థాయిల్లో పనిచేశాక యురోపియన్ యూనియన్‌లో చేరింది. మళ్లీ ఇప్పుడు తిరిగి వరల్డ్ బ్యాంక్ గ్రూప్ గూటికే చేరి ఏకంగా వరల్డ్ బ్యాంక్ సీఈఓ అయ్యింది. – శరాది -
పట్టణవాసి ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ నివేదిక
నగదు కొరత, మందగిస్తున్న ఉపాధి కల్పన, పెట్రోలు, డీజిల్ సహా నిత్యావసర ధరల పెరుగుదల వల్ల దేశ ఆర్థిక పరిస్థితిపై పట్టణ ప్రాంతాల వినియోదారులకు నమ్మకం సన్నగిల్లుతోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో ప్రతి మూడు నెలలకు చేసే తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కిందటి డిసెంబర్ సర్వే మినహా 2017 మార్చినాటి సర్వే నుంచీ భారత నగరవాసులకు దేశ ఆర్థిక వ్యవహారలపై ఆశలు తగ్గుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సాధారణ ఆర్థిక పరిస్థితులు, ఉపాధి అవకాశాలపై వినియోగదారులు నిరాశా నిస్పృహలు వ్యక్తం చేస్తున్నారు. 2019 ఏప్రిల్‌మేలో జరిగే లోక్ సభ ఎన్నికలకల్లా దేశ ఆర్థికాంశాలు మెరుగవుతాయని భావిస్తున్నారుగాని, ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక మొదటి రెండేళ్లలో కనిపించిన ఆశావహ వాతావరణం వచ్చే ఏడాదిలో ఉండకపోవచ్చని అంచనా. కేంద్రంలో ఎన్డీఏ సర్కారు తొలి రెండేళ్లూ ఆర్థిక వ్యవస్థను సాఫీగా నడిపించి మంచి పేరు తెచ్చుకున్నాక హఠాత్తుగా దానికి బ్రేకులు పడేలా రెండు అనూహ్య చర్యలు తీసుకుంది. 2016 నవంబర్‌లో పెద్ద నోట్లు రద్దు చేసి, వాటి స్థానంలో ఆలస్యంగా కొత్త కరెన్సీ విడుదల చేయడంతో దేశ ప్రజలు కుదేలయ్యారు. చేతుల్లో డబ్బున్నా దిగులు లేకుండా బతకలేని పరిస్థితి సృష్టించిన నోట్ బందీ వల్ల 2017లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) అంతకు ముందు ఏడాదిలో నమోదైన 8.2 శాతం నుంచి 7.1 శాతానికి పడిపోయింది. ఆరు నెలల తర్వాత 2017లో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) ప్రవేశపెట్టడంతో ఆర్థిక వ్యవస్థ మరింత మందగించింది. జీఎస్టీ వల్ల సత్ఫలితాలు నెమ్మదిగా వస్తున్నాయని ఆర్థికవేత్తలు అంటున్నాగాని వినియోగదారులకు మాత్రం నమ్మకం కుదరడం లేదు. నాలుగు అంశాల్లో ప్రతికూలం బెంగళూరు, చెన్సై, హైదరాబాద్, కోల్ కత్తా, ముంబై, దిల్లీలో 5, 297 మంది వినియోగదారులను సాధారణ ఆర్థిక పరిస్థితి, ఉపాధి కల్పన అవకాశాలు, ధరల పరిస్థితి, వారి ఆదాయం, వ్యయంపై వారి కుటుంబాల అంచనాలపై ఆర్బీఐ ప్రతినిధులు ప్రశ్నించగా ప్రజల్లో విశ్వాసం పెరగలేదని తేలింది. ఆర్థిక స్థితి, ఉపాధి, ధరలు, ఆదాయంపై పౌరులకు సానుకూల అంచనాలు లేవు. ఈ నాలుగు విషయాల్లో పరిస్థితి దిగజారుతుందని భావిస్తున్నామని వినియోగదారులు చెప్పారు. వ్యయంపై ఆశలు సానుకూలంగా ఉన్నా గతంతో పోల్చితే అవి తక్కువే. వచ్చే ఏడాదికి ప్రజల సెంటిమెంటు బాగుందిగాని పూర్వపు స్థాయితో పోల్చితే మెరుగ్గా లేదు. సాధారణ ఆర్థిక పరిస్థితిపై దాదాపు తటస్థ స్థితిలో ఉన్న 2017 డిసెంబర్ఫలితాలతో పోల్చితే వినియోగదారుల విశ్వాసం ఈ మూడు నెలల్లో బాగా తగ్గిందని తాజా సర్వే చెబుతోంది. మోదీ రాకతో ‘అచ్ఛే దిన్’ ఆశలు! 2012 డిసెంబర్నుంచీ విడుదల చేసిన త్రైమాసిక ఆర్బీఐ వినియోగదారుల సర్వేల వివరాలు గమనిస్తే, నరేంద్రమోదీ 2014 మేలో ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి 2017 మార్చి వరకూ ప్రజలు ఆర్థికంగా ఆశావహంగానే ఉన్నారని స్పష్టమౌతుంది. అంతకు ముందు అంటే కాంగ్రెస్నాయకత్వంలోని యూపీఏ హయాంలో నగరాల్లో వినియోగదారులు ఇలాంటి ఆశావహ దృక్పథంతో ఉన్నది 2013 జూన్ సమయంలోనే. ఆ తర్వాత నుంచి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకూ పట్టణ కుటుంబాల సెంటిమెంటు దిగజారిపోతూనే ఉందని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. మళ్లీ మోదీ అధికారంలోకి వచ్చి ఆ తరువాత రెండేళ్ల వరకూ ‘అచ్ఛే దిన్’ వచ్చాయని భావించారు. నోట్ల రద్దు, జీఎస్టీతో పరిస్థితి దిగజారిందని ఆర్బీఐ వెల్లడించింది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
గిరిజనుల కోసం ‘ఎస్టీ విపత్తు నిధి’
సాక్షి, హైదరాబాద్: గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొస్తోంది. గిరిజనులు విపత్తుల బారిన పడినప్పుడు ఆదుకునే విధంగా కొత్త పథకానికి రూపకల్పన చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎస్టీ విపత్తు నిధిని ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ పంపిన ప్రతిపాదనల ను పరిశీలించిన సర్కారు కొత్త కార్యక్రమానికి పచ్చజెండా ఊపేసింది. తాజాగా ఫైల్‌పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు. ఒకట్రెండు రోజుల్లో ‘విపత్తు నిధి’కి సంబంధించి మార్గరద్శకాలు వెలువడే అవకాశముంది. ఏమిటీ ‘విపత్తు నిధి’... ఆర్థిక అభివృద్ధితోపాటు సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. విపత్తులు సంభవించినప్పుడు సైతం ప్రత్యేక కేటగిరీలకు మాత్రమే లబ్ధి చేకూర్చేలా పథకాలున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీలోని గిరిజను లు ఎక్కువగా పకృతి వైపరీత్యాలకు లోనవు తుంటారు. కొన్ని సందర్భాల్లో ఒకరిద్దరు మాత్రమే ప్రమాదాలకు గురవుతుంటారు. అలాంటి సందర్భంలో నిబంధనలకు లోబడి ఆపద్బంధు పథకం అమలు చేస్తారు. ఎలాంటి ప్రమాదమైనా, ఎంత నష్టం జరిగినా ఈప్రత్యేకనిధి ఏర్పాటుతో ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం కచ్చితంగా అందుతుంది. ఈ నిధి వినియోగంలో జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి సర్వాధికారాలు ఇవ్వనుంది. ఒక లబ్ధిదారుకు సంబంధించి రూ.25 వేల వరకు ఆర్థిక సాయాన్ని కలెక్టర్‌గాని, ఐటీడీఏ పీవోగాని నేరుగా అందించే అవకాశముంటుంది. రూ.50 వేలలోపు ఆర్థిక సాయమైతే గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ నిర్ణయం తీసుకుంటారు. అంతకు మించితే ప్రభుత్వస్థాయిలో నిర్ణయం తీసుకోవాలి. ఈ పథకానికి సంబంధించి విధివిధానాలు దాదాపు ఖరారయ్యాయి. సీఎం ఆమోదం సైతం లభించడంతో ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. -
మిలటరీ శక్తివంతమైతేనే ఆర్థికాభివృద్ధి
సమవుజ్జీలైన అంతర్జాతీయ భాగస్వామ్యాలతోనే ప్రగతి ప్రధాని శాస్త్రీయ సలహాదారు ఆర్.చిదంబరం తిరుపతి నుంచి సాక్షి ప్రతినిధి: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ ఎవరికీ తీసిపోదని ప్రధాని శాస్త్రీయ సలహాదారు, భారత అణుశక్తి సంస్థ మాజీ చైర్మన్ ఆర్.చిదంబరం అన్నారు. దేశ అభివృద్ధి, భద్రత ఒకే నాణేనికి రెండు ముఖా ల్లాంటివని, మిలటరీ రంగంలో శక్తిమంతంగా ఉంటేనే ఆర్థిక అభివృద్ధులపై దృష్టి పెట్టవచ్చ ని స్పష్టం చేశారు. సమవుజ్జీలైన అంతర్జాతీ య భాగస్వామ్యాల ద్వారానే శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి సాధించవచ్చన్నారు. తిరుపతిలో జరుగుతున్న జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో గురువారం ‘శాస్త్ర రంగంలో అంత ర్జాతీయ భాగస్వామ్యాలు’ అంశంపై ఆయన మాట్లాడారు. గత 20 ఏళ్లలో భారత్ అనేక అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో పాలుపంచుకుంద ని, వాటి ఫలితాలు కూడా ఇప్పుడిప్పుడే పొందుతున్నామన్నారు. ఎల్‌హెచ్‌సీ నుంచి... భారత్ ఇప్పటికే అనేక భారీస్థాయి శాస్త్ర ప్రయోగాల్లో పాలుపంచుకుంటోందని, హిగ్స్ బోసాన్ కణాన్ని గుర్తించేందుకు జరుగుతున్న ఎల్‌హెచ్‌సీ ప్రయోగాల్లోనూ అతికీలకమైన పరికరాలను మనం అతితక్కువ ఖర్చుతో సరఫరా చేశామన్నారు. అలాగే ఈ ప్రయోగా ల్లో వాడుతున్న సీఎంఎస్ డిటెక్టర్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆధ్వ ర్యంలో నిర్మాణమైతే.. అలీస్ డిటెక్టర్‌ను కోల్ కతా గ్రూపు నిర్మించిందన్నారు. 2004 నాటి సునామీ తరువాత హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సునామీ హెచ్చరికల కేంద్రం ఇప్పుడు హిందూమహా సముద్ర తీరంలోని అనేక దేశాలకు హెచ్చరికలు జారీ చేస్తోందని, ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని గుర్తించిందని తెలిపారు. అణుశక్తి ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడం వీలవుతుం దని.. అయితే ఇందుకోసం రేడియో ధార్మిక వ్యర్థాల సమర్థ పునర్ వినియోగం జరగాలని ఆయన చెప్పారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలతో అగ్రస్థానానికి.. అంతర్జాతీయ భాగస్వామ్యాలతో మనం మెరుగైన ఫలితాలు సాధించగలమనేందుకు యూరోపియన్ సంస్థలతో జరిగిన ఒప్పందాలు తార్కాణమని చిదంబరం తెలిపారు. జన్యుమార్పిడికి పనికొచ్చే జెర్మ్ ప్లాస్మాను మార్పిడి చేసుకోవడం ద్వారా 30 శాతం అధిక దిగుబడులిచ్చే కొత్త వంగడాన్ని సృష్టించగలిగామన్నారు. ఇలాంటివి మరిన్ని భాగస్వా మ్యాలు కుదరడం మనకు అవసరమని అన్నారు. మన శక్తి సామరŠాథ్యలను పూర్తిగా వినియోగించుకోవడంతోపాటు అంతర్జాతీయ భాగస్వామ్యాలను విస్తృతం చేయడం ద్వారా శాస్త్ర, పరిశోధన రంగాల్లో మనం అగ్రస్థానానికి చేరుకోవచ్చునని ఆకాంక్షించారు. -
ఆర్థికాభివృద్ధిలో యువత పాత్ర కీలకం
వెంగళరావునగర్ : వెనుకబడిన దేశాలు ఆర్థిక ప్రగతిని సాధించడంలో యువత పాత్ర కీలకమని కేంద్రమంత్రి (ఎంఎస్ఎంఈ) హరిబాయి పార్ధిబాయి చౌదరి అభిప్రాయపడ్డారు. యూసుఫ్‌గూడ డివిజన్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ కేంద్ర శిక్షణా సంస్థలో మూడు నెలలుగా నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని గురువారం ఆడిటోరియంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్రమంత్రి మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో మన దేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. దేశ విదేశాల్లోని ప్రతినిధులకు నిమ్స్‌మేలో శిక్షణ ఇవ్వడం గర్వంగా ఉందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న పలు దేశాల ప్రతినిధులకు కేంద్రమంత్రి చౌదరి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. నిమ్స్‌మే డైరెక్టర్ జనరల్ ఎం. చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నిమ్స్‌మే సీఏఓ డాక్టర్ వల్లభరెడ్డి, నిమ్స్‌మే ఫ్యాకల్టీ డాక్టర్ దిబ్యేందు చౌదరి, డాక్టర్ ఎన్ . శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
‘ముద్ర’ రుణాలతో నేతన్నల ఆర్థికాభివృద్ధి
► పవర్‌లూం సొసైటీలు ఏర్పాటుచేసుకోవాలి ► ఆర్బీఐ లీడ్ ఆఫీసర్ అలోక్‌రంజన్ రాణారాహుల్ ► సిరిసిల్ల ఆసాములతో సమావేశం సిరిసిల్ల : నేతన్నల ఆర్థికాభివృద్ధికి ముద్ర రుణాలు దోహదపడుతాయని ఆర్బీఐ లీడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అకోల్ రంజన్ రాణారాహుల్ అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో పవర్‌లూం ఆసాములతో మంగళవారం సమావేశం నిర్వహించారు. సిరిసిల్ల నేత కార్మికులకు వస్త్రోత్పత్తిలో నైపుణ్యం ఉందని, పవర్‌లూమ్స్‌పై మార్కెట్లో డిమాండ్ ఉన్న వస్త్రాన్ని ఉత్పత్తి చేయాలన్నారు. బ్యాంకుల ద్వారా తీసుకున్న ముద్ర రుణాలను సద్వినియోగం చేసుకోవాలని, పెట్టుబడులకు వినియోగించుకోవాలని సూచించారు. పవర్‌లూం ఆసాములు సొసైటీలుగా రిజిస్టర్ చేయించుకుని బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవచ్చన్నారు. రూ.50 వేల నుంచి రూ.పది లక్షల వరకు రుణాల తీసుకుని వస్త్రోత్పత్తి రంగాన్ని విస్తరించాలని సూచించారు. బ్యాంకుల నమ్మకాన్ని ఆసాములు పోగొట్టుకోవద్దని కోరారు. జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ డీఏ.చౌదరి మాట్లాడుతూ సిరిసిల్లలో 1300 కుటుంబాలకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సరైన డాక్యుమెంట్లతో దరఖాస్తులు చేసుకున్న వారికి తప్పకుండా రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. బ్యాంకుల్లో డాక్యుమెంటేషన్ పూర్తయితే రుణమేళా నిర్వహిస్తామని జౌళిశాఖ అధికారులు తెలిపారు. సమావేశంలో ఆసాముల సంఘం నాయకులు దాసరి వెంకటేశం, కొండ ప్రతాప్, వేముల దామోదర్, జౌళిశాఖ కమ్యునిటీ ఫెసిలిటేటర్లు పాల్గొన్నారు. అంతకు ముందు ఆర్బీఐ అధికారులు స్థానిక బ్యాంకులను సందర్శించి ముద్ర రుణాలపై సమీక్షించారు. -
దీర్ఘకాలిక పొదుపుతో ఆర్థికాభివృద్ధి
సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్ సదస్సులో సీడీఎస్ఎల్ రీజనల్ మేనేజర్ సాక్షి, తిరుపతి: దీర్ఘకాలికంగా పెట్టుబడులు, పొదుపు చేయడంతోనే ప్రతివ్యక్తికి పరిపూర్ణంగా ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ లిమిటెడ్(సీడీఎస్ఎల్) రీజనల్ మేనేజర్ శివప్రసాద్ వెనిశెట్టి తెలిపారు. సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతిలో మదుపరుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివప్రసాద్ వెనిశెట్టి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలో పెట్టుబడి మార్గాలు అసంఖ్యాక రీతిలో వెల్లువెత్తుతున్న తరుణంలో సరైన పెట్టుబడి అవకాశాలను ఎంచుకునే విధానాలను వివరించారు. లాభసాటి పెట్టుబడి అవకాశాలను ఎంచుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకెళితే ఆర్థిక సంపదను పెంచుకోవచ్చని తెలిపారు. ఆధునిక సమాజానికి అనుగుణంగా పెట్టుబడి రంగంలో సరికొత్త అవకాశాలు వచ్చాయన్నారు. వాటిపై ప్రతి ఇన్వెస్టర్ అవగాహన పెంచుకుంటే ఆర్థిక పరిపుష్టి సుసాధ్యమన్నారు. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాల వివరాలను ఎప్పటికప్పుడు సరిచూసుకునే సౌలభ్యం ఉందన్నారు. కొంత కాలం పెట్టుబడులు ఆపేసే అవకాశం కూడా ఉందని చెప్పారు. ఇంటర్నెట్ అవగాహన ఉంటే నేరుగా సీడీఎస్ఎల్ వెబ్సైట్ ద్వారా ఖాతాల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే సౌకర్యం ఉందన్నారు. డీమ్యాట్ ఖాతాలో మొబైల్ నంబరు నమోదు చేసుకుంటే సీడీఎస్ఎల్ నుంచి డిబెట్ జరిగితే తక్షణం మొబైల్‌కు మెసేజ్ వచ్చే విధంగా సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. అంతేకాక యాప్ సదుపాయం ఉండడంతో మొబైల్లోనే ఖాతా వివరాలు తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రతివ్యక్తి తన సంపాదనలో తొలుత పొదుపుచేసిన తర్వాతే ఖర్చులు చేసుకునే విధానం అలవర్చుకుంటే ఆర్థికాభివృద్ధి సాధించవచ్చన్న విషయాన్ని ఇన్వెస్టర్లు గుర్తించాలన్నారు. పెట్టుబడులుర, పొదుపుతో పాటు ప్రతివ్యక్తి ఆర్థిక ప్రణాళికలో జీవిత బీమా, ఆరోగ్య బీమా తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని శివప్రసాద్ వెనిశెట్టి సూచించారు. -
9% వరకూ వృద్ధి అవసరం: జైట్లీ
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుతం కన్నా ఒకటి నుంచి ఒకటిన్నర శాతం (1 శాతం-1.5 శాతం) వరకూ అదనపు ఆర్థికాభివృద్ధి రేటును సాధించాల్సి ఉందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బుధవారం పేర్కొన్నారు. వేతనాల పెంపు భారాన్ని మోయడానికి, కార్మికులు-పేద వర్గాల ప్రయోజనాలు నెరవేర్చడం వంటి అవసరాలకు వృద్ధి రేటు పెరుగుదల అవసరమని పేర్కొన్నారు. భారతీయ మజ్దూర్ సంఘం (బీఎంఎస్) నిర్వహించిన ఒక సన్మాన కార్యక్రమంలో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడారు. ‘‘ప్రస్తుతం మనం 7.5 శాతం మేర ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్నాం. అంతర్జాతీయ ఆర్థిక మందగమన పరిస్థితుల్లోనూ వేగవంతమైన వృద్ధి రేటు సాధిస్తున్న దేశంగా అవతరించాం. అయతే మన అవసరాలకు ఈ వృద్ధి రేటు సరిపోదు. ఈ రేటు అదనంగా మరో 1.5 శాతం వరకూ పెరగాలి’’ అన్నారు. వేతనాల పెంపునకు సంబంధించి ట్రేడ్ యూనియన్లతో ప్రభుత్వం సిద్ధమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆర్థికాభివృద్ధి ప్రయోజనాలు మొదటి కార్మికులకు, పేదలకు అందాలన్నదే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని వివరించారు. కార్మికుల వేతనాలు కనీస స్థాయిలో, ద్రవ్యోల్బణాన్ని తట్టుకోగలిగేలా ఉండడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. లెఫ్ట్ పార్టీల సిద్ధాంతం దేశ వ్యాప్తంగా ఆమోదనీయం కాని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా అంతర్జాతీయ అంశాలు, ప్రైవేటు పెట్టుబడులు వచ్చే ఏడాది భారత్ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లుగా మారో కార్యక్రమంలో జైట్లీ అన్నారు. -
అన్నీ లోపాలు!
- జిల్లాలో మూతపడుతున్న పాలశీతలీకరణ కేంద్రాలు - మరికొన్ని ఇతర ప్రాంతాలకు తరలింపు - పర్యవేక్షణ.. నిర్వహణ లోపమే ప్రధాన కారణం - నాడు ప్రారంభించింది 21.. నేడు మిగిలింది 8 - నిర్వహణపై విజిలెన్స్ ఆరా? కడప రూరల్ : జిల్లాలో మహిళా సాధికారత, ఆర్థికాభివృద్ధికోసం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) నిర్వహణలో పాలశీతలీకరణ కేంద్రాలు(బీఎంసీ) ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటి నిర్వహణ, పాల సేకరణలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. పాలసేకరణ వెల్లువలా సాగిన కేంద్రాలతోపాటు మరికొన్ని మూతపడగా, ఇంకొన్ని అర్ధంతరంగా నిలిచిపోయాయి. కేంద్రాల ఏర్పాటు నిమిత్తం రైల్వేకోడూరు, జమ్మలమడుగు, కొండాపురం, చక్రాయపేట, బద్వేలు, పోరుమామిళ్ల, కమలాపురం, రామాపురం, సుండుపల్లె, కాశినాయన, ఒంటిమిట్ట, చిట్వేలి, బి.మఠం, లింగాల, తొండూరు, వేంపల్లె, వేముల, సింహాద్రిపురం, పెనగలూరు, గాలివీడులో మొత్తం 21 బీఎంసీలను ఏర్పాటు చేశారు. ఈ బీఎంసీలు ఏపీ డెయిరీ సాంకేతిక సహకారంతో మహిళా సమాఖ్య సభ్యుల నిర్వహణలో సాగాయి. అందుకోసం మహిళా సభ్యులకు కమీషన్ వచ్చేది. మార్పులు, చేర్పులు 2010 నుంచి బీఎంసీలలో మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నాయి. జమ్మలమడుగు బీఎంసీని బద్వేలుకు తరలించారు. చిట్వేలిలో ఉన్న దానిని పెనగలూరులో పెట్టారు. బి.మఠం బీఎంసీని మదనపల్లెకు మార్చారు. అలాగే వేములలో ఉన్న బీఎంసీని అనంతపురం జిల్లా తిమ్మనపల్లె మండలం సింగవరంలో ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ నిర్వహించిన ట్రయల్ రన్లో మిల్క్ ట్యాంకర్ పనిచేయకపోవడంతో తిరిగి ఆ యూనిట్‌ను పులివెందులలో భద్రపరిచినట్లు చెబుతున్నారు. అలాగే ఏపీ డెయిరీకి ఒక బీఎంసీ మంజూరు కాగా, దాన్ని అనంతపురానికి తరలించినట్లు తెలుస్తోంది. అలాగే మరికొన్ని బీఎంసీలను ప్రజల భాగస్వామ్యంతో పెనగలూరు, పోరుమామిళ్ల, మైదుకూరులలో ఏర్పాటు చేయగా, అవి నేటికీ ప్రారంభం కాలేదు. అలాగే ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం అభివృద్ధిలో భాగంగా అక్కడున్న బీఎంసీని అధికారులు ఎత్తివేశారు. ఈ యూనిట్‌ను రాజంపేటలో భద్రపరిచారు. ఒంటిమిట్టలో పాల సేకరణ బాగా ఉంది. అయితే, ఇక్కడ యూనిట్‌ను ప్రారంభించాలనే సంకల్పం ఎవరికీ లేకపోవడం దారుణం. ఇలా పలు కారణాలతో బీఎంసీలపై నిర్లక్ష్యపు నీడలు అలుముకున్నాయి. దీంతో 2008లో విజయపథంలో నడిచిన 21 కేంద్రాలు నేడు బద్వేలు, కమలాపురం, తొండూరు, లింగాల, సుండుపల్లె, చక్రాయపేట, రైల్వేకోడూరు, కొండాపురంలో మొత్తం ఎనిమిది కేంద్రాలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఎన్నో కారణాలు కడపలో నిర్మించే మహిళా డెయిరీకి పాలు సరఫరా చేయాలన్న సంకల్పంతో జిల్లా వ్యాప్తంగా బీఎంసీలను ఏర్పాటు చేశారు. ఈ మహిళా డెయిరీ పూర్తి అయ్యేంత వరకు బీఎంసీల ద్వారా వచ్చే పాలను ఏపీ డెయిరీకి తరలించాలనే నిబంధన ఉంది. ఆ మేరకు పాలు ప్రస్తుతం ఏపీ డెయిరీకి తరలుతున్నాయి. కాగా, ఒక్కో యూనిట్‌కు రూ.12 లక్షల విలువైన పరికరాలతో ఏర్పాటు చేశారు. అయితే ఈ మిషనరీల సంరక్షణ విషయంలో పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఒక ఐకేపీ సిబ్బంది, మరికొందరు కలిసి పరిక రాలను ఇతర ప్రాంతాలకు తరలించడం తదితర అక్రమాలకు పాల్పడటంతో బీఎంసీల పరిస్థితి అధ్వానంగా తయారైందనే విమర్శలున్నాయి. దీనికితోడు ఏపీ డెయిరీ నిర్వాకం కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. కాగా, ఇటీవల విజిలెన్స్ అధికారులు ఇందుకు సంబంధించిన పలు ఫైళ్లను సేకరించి బీఎంసీల నిర్వహణ, అక్రమాలు, లోపాలు తదితర విషయాలపై ఆరా తీస్తున్నట్లు ఆ శాఖలో చర్చ జరుగుతోంది. నాటి ప్రభుత్వం మహిళా సాధికారత కోసం, నిరుపేద మహిళల కోసం ఏర్పాటు చేసిన బీఎంసీల లో‘పాల’ను సరిదిద్ది సక్రమమైన బాటలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2008లో కడప సమీపంలో రూ. 7 కోట్ల వ్యయంతో మహిళా డెయిరీని నిర్మించాలని నాటి ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా డెయిరీకి పాల సేకరణ -
జీహెచ్ఎంసీ తీరు ఆదర్శనీయం
ప్రధాని మోదీ ప్రశంస సాక్షి,సిటీబ్యూరో: గత దశాబ్ద కాలంగా ఆస్తిపన్నును పెంచకుండానే... ఆదాయ మార్గాలను గణనీయంగా పెంచడం ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను దేశంలోని అన్ని పట్టణాలు ఆదర్శంగా తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో గురువారం జరిగిన స్మార్ట్‌సిటీ, అమృత్ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. దేశంలోని దాదాపు 500 నగరాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, కేంద్ర మంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో ఆస్తిపన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ సాధించిన ప్రగతి, అందుకు అనుసరించిన విధానాలను కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ 2004-05 ఆర్థిక సంవత్సరంలో రూ.166 కోట్లుగా ఉన్న ఆస్తిపన్ను 2014-15లో రూ.1115 కోట్లకు పెరగడం ఎంతో గొప్ప విషయమని ప్రధాని ప్రశంసించారు. జీహెచ్ఎంసీ సాధించిన ఈ ప్రగతి మిగతా నగరాల్లో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. చిత్తశుద్ధితో పనిచేస్తే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయన్నారు. అంతకుముందు వివిధ కార్పొరేషన్లు సాధించిన ప్రగతిని తెలియజేసే ప్రదర్శనను ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తిలకించారు. మెరుగైన ప్రజా సదుపాయాలతో పాటు జీహెచ్ఎంసీ సాధించిన ఆర్థిక ప్రగతిని తెలియజేసే పోస్టర్‌ను కమిషనర్ సోమేశ్‌కుమార్ ప్రదర్శించి ప్రధానికి, వెంకయ్య నాయుడికి వివరించారు. జీహెచ్ఎంసీ చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలు రూ.5కే భోజనం, డ్రైవర్ కమ్ ఓనర్, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు సమగ్ర రహదారుల అభివృద్ధి పథకం(ఎస్ఆర్డీపీ), తదితరమైన వాటి గురించి సోమేశ్ కుమర్ తన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరించారు. -
అన్ని రోజుల్లో అదనపు బిల్లులకు అనుమతి
బిల్లులు సమర్పించే గడువు ఎత్తివేసిన ఆర్థిక శాఖ హైదరాబాద్: ఉద్యోగుల వేతన సవరణకు సంబంధిం చిన అదనపు బిల్లులు సమర్పించేందుకు నిర్దేశించిన గడువును ఆర్థిక శాఖ ఎత్తివేసింది. మే, జూన్ నెలల్లో పని దినాల్లోనూ బిల్లులు స్వీకరించాలని డెరైక్టర్ ఆఫ్ ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న మార్గదర్శకాల ప్రకారం ప్రతి నెలా 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మాత్రమే ట్రెజరీల్లో అదనపు బిల్లులు స్వీకరిస్తారు. మంగళవారంతో ఈ గడువు ముగిసింది. తిరిగి ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు రెగ్యులర్ పే బిల్స్‌తో పాటు అదనపు బిల్లులు సమర్పించాల్సి ఉంటుంది. కానీ.. ఈ తక్కువ వ్యవధిలో బిల్లులు సమర్పించడం సాధ్యంకాదని.. పదో పీఆర్సీ ప్రకారం పెరిగిన వేతనాలు మరో నెల అందే పరిస్థితి లేదని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ గడువును పెంచి.. జూన్ 1న కొత్త వేతనాలు అందుకునే వీలు కల్పించాలని విజ్ఞప్తి చేశాయి. ట్రెజరీ అధికారులు ఈ విషయాన్ని ఆర్థికశాఖకు నివేదించిం ది. స్పందించిన అధికారులు గడువు పెంచేందుకు అనుమతిం చారు. రెండు నెలలపాటు పనిదినాలన్నింటా అదనపు బిల్లుల ఆడిట్ చేయాలని మంగళవారం తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు సర్క్యులర్ జారీ చేశారు. గడువు పెంచినా సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపాలను సరిదిద్దకపోవడంతో పీఆర్సీ బిల్లులు తప్పుల తడకలుగా వస్తున్నాయని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
ఆర్బీఐ ప్రచురించే పత్రిక ఏది?
ఆర్థికాభివృద్ధికి దేశంలో అమల్లో ఉన్న ‘ద్రవ్య విధానం’ దిక్సూచీ లాంటిది. భారత్‌లో అత్యున్నత కేంద్ర బ్యాంక్ అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య విధానాన్ని రూపొందించడమే కాకుండా పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయాణం ఎలాంటి ఒడు దొడుకులు లేకుండా సాగడానికి పటిష్టమైన, ఆచరణీయమైన ద్రవ్య విధానాన్నిఆర్బీఐ రూపకల్పన చేస్తుంది. ప్రభుత్వ ఉద్దేశాలు నెరవేరడానికి, ప్రజాసంక్షేమానికి దేశ ద్రవ్య విధానం దోహదపడుతుంది. దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడకుండా నివారించడమే ఆర్బీఐ ద్రవ్య విధాన ప్రధాన ఉద్దేశం. ఆర్థికాభివృద్ధికి దేశంలో అమల్లో ఉన్న ‘ద్రవ్య విధానం’ దిక్సూచీ లాంటిది. భారత్‌లో అత్యున్నత కేంద్ర బ్యాంక్ అయిన భారతీయ రిజర్వ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య విధానాన్ని రూపొందించడమే కాకుండా పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయాణం ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా సాగడానికి పటిష్టమైన, ఆచరణీయమైన ద్రవ్య విధానాన్ని ఆర్బీఐ రూపకల్పన చేస్తుంది. ప్రభుత్వ ఉద్దేశాలు నెరవేరడానికి, ప్రజా సంక్షేమానికి దేశ ద్రవ్య విధానం దోహదపడుతుంది. దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడకుండా నివారించడమే ఆర్బీఐ ద్రవ్య విధాన ప్రధాన ఉద్దేశం. మాదిరి ప్రశ్నలు 1. {దవ్య విధానాన్ని రూపొందించి, నిర్వహించేది? 1) కేంద్ర మంత్రి మండలి 2) ఆర్బీఐ 3) ఆర్థిక సంఘం 4) కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2. ఆర్బీఐకి గవర్నర్‌గా పని చేసిన మొదటి భారతీయుడు? 1) బిమల్ జలాన్ 2) రంగరాజన్ 3) సి.డి. దేశ్‌ముఖ్ 4) ఎస్.ఎం. నరసింహం 3. రెపో రేటు అంటే? 1) రీ పర్చేజ్ ఆపరేషన్ రేట్ 2) రీ పేమెంట్ ఆప్షన్ రేట్ 3) రివర్స పర్చేజింగ్ ఆర్డర్ రేట్ 4) రివర్స పేమెంట్ ఓరియంటేడ్ రేట్ 4. ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? 1) న్యూఢిల్లీ 2) కోల్‌కతా 3) హైదరాబాద్ 4) ముంబయి 5. ‘హాట్‌మనీ’ అంటే? 1) అధిక పెట్టుబడులను ఆకర్షించే దేశాల్లోకి ద్రవ్య సరఫరా పెరగడం 2) బలహీన ఆర్థిక వ్యవస్థలోకి ద్రవ్య సరఫరాను తగ్గించడం 3) అధిక వడ్డీరేట్లు ఉన్న దేశాల్లోకి పెట్టుబడులు తరలిపోవడం 4) తక్కువ వడ్డీరేట్లు ఉన్న దేశాల నుంచి పెట్టుబడులు తరలిపోవడం 6. కంప్యూటరీకరించిన శాఖలు అధికంగా ఉన్న బ్యాంక్ ఏది? 1) ఎస్బీఐ 2) ఎస్బీహెచ్ 3) పీఎన్బీ 4) సీబీఐ 7. ఆర్బీఐ ప్రచురించే పత్రిక ఏది? 1) మనీ మ్యాగజైన్ 2) న్యూస్‌లెటర్ 3) మానిటరీ పాలసీ 4) బ్యాంకింగ్ బులెటిన్ 8. ఎస్బీఐని ఏ సంవత్సరంలో స్థాపించారు? 1) 1955 2) 1949 3) 1951 4) 1956 9. బ్యాంక్రేటు ఎక్కువగా ఉంటే పరపతి విధానంలో ఎలాంటి మార్పు వస్తుంది? 1) పెరుగుతుంది 2) తగ్గుతుంది 3) స్థిరంగా ఉంటుంది 4) ఎలాంటి ప్రభావం ఉండదు 10. ఆర్బీఐ తీసుకునే పరిమాణాత్మక నియంత్రణ చర్యల్లో శక్తివంతమైంది? 1) ఎస్ఎల్ఆర్ పెంచడం 2) సీఆర్ఆర్ పెంచడం 3) బ్యాంక్ రేటు పెంచడం 4) బహిరంగ మార్కెట్ కార్యకలాపాలను విస్తృతం చేయడం సమాధానాలు 1) 2; 2) 3; 3) 1; 4) 4; 5) 3; 6) 1; 7) 2; 8) 1; 9) 2; 10) 4. -
నిపుణుల తరం, దేశానికి వరం
సమష్టి సంపదను పెంచాలంటే సామాన్యుడిపై పెట్టే ఖర్చు పెరగాలి. అట్టడుగున ఉన్న యువశక్తికి ఊతమివ్వాలి. వారి జ్ఞానానికి వెలుగునివ్వాలి. కాబట్టి, జాతి వనరులను పెట్టుబడిదారుడి మీద వెచ్చిస్తారా? దేశ పురోగమనా నికి దోహదపడే సాధారణ ప్రజానీకం నైపుణ్యం పెంపు కోసం ఖర్చు చేస్తారా? అనేవి నేడు సవాళ్లుగా ఉన్నాయి. దేశం ఎదుర్కొంటున్న ఈ దశాబ్దపు సవాళ్లలో యువశక్తిని వినియోగించుకోవడమే అత్యంత కీలకమైనది. మన జనాభాలో దాదాపు సగభాగం ఉన్న నవ యువత నైపు ణ్యాలను వినియోగించుకు నేందుకు ఉన్న ఏకైక సాధనం విద్యే. సామాజిక, ఆర్థికాభివృద్ధికి నోచుకోని యువకులను నిపుణులుగా తీర్చిదిద్ది వారికి ఉపాధి కల్పిస్తే వారి శ్రమ దేశ సంపదగా మారే అవకాశం ఉంటుంది. యువశక్తిని ఆర్థికాభివృద్ధికి జోడిస్తేనే మరింత దేశ ప్రగతి సాధ్యమవుతుంది. లేదంటే పరిణా మాలు విపరీతంగా ఉంటాయి. 21వ శతాబ్దంలో భారతదేశాభివృద్ధికి ఇది సరైన సమయం. దీనిని జార విడుచుకుంటే మరో పదేళ్లలో ఈ యువతరం శక్తి వృథా అవుతుంది. ఇదే జరిగితే యదేశ సామాజిక, ఆర్థికాభివృద్ధి వెనుకబడడానికి దోహదం చేసినట్టే. 20వ శతా బ్దంలో మానవ సంపద పెరుగుదలను ఒక శాపం గా పరిగణించారు. అదే ఈ శతాబ్దంలో వరంగా భావిస్తున్నారు. ఈ కోణం నుంచి చూస్తే ఏ దేశా నికి లేని అవకాశం మనకు ఉంది. ఈ యువశక్తిని నైపుణ్యం కలిగిన వనరుగా రూపొందించుకోవాలి. అలాగే నైపుణ్యం లేని మానవవనరులు దేశానికి భారమేనన్న వాస్తవాన్ని కూడా గుర్తించాలి. అందు కే ప్రపంచ దేశాలు ప్రజలను నిపుణులుగా తీర్చి దిద్దడానికి పెద్ద మొత్తంలో వ్యయం చేస్తున్నాయి. నిజానికి సమాజాన్ని నిజమైన, నైపుణ్యం కలిగిన మానవ వనరుగా తీర్చిదిద్దడమంటే విద్యకు ప్రాధాన్యం ఇవ్వడమే. అప్పుడే విద్యపై పెట్టే ఖర్చు పెట్టుబడిగా మారే అవకాశం ఉంటుంది. దానితోనే సమ్మిళిత వృద్ధి సాధ్యమవుతుంది. చదువును పెట్టుబడిదారులకు అప్పగిస్తే వారు లాభార్జనే ధ్యేయంగా ఆ గొప్ప వ్యవస్థను వ్యాపారంగా మారుస్తారు. క్యూబా, లాటిన్ అమెరికా, స్విట్జర్లాండ్, పోలెండ్ వంటి కొన్ని దేశాలు తమ వనరులను, యావత్ శక్తియుక్తులను విద్య కోసం వెచ్చించాయి. మరొక వైపున అమెరి కాలో స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం వంటి వాటిని పెట్టుబడిదారులకు అప్పగించారు. ఇందువల్ల లాభాలు పెరిగాయి. కానీ సామాన్యులు, సంపన్న లు మధ్య అంతరం పెరిగింది. పెట్టుబడిదారుడి చదువును ప్రోత్సహిస్తే పెరిగేవి అంతరాలే. దీనిని గుర్తించి చర్యలు తీసుకున్న కొన్ని దేశాలు ముందుకు వెళుతున్నాయి. సమష్టి సంపదను పెంచాలంటే సామాన్యుడిపై పెట్టే ఖర్చు పెరగాలి. అట్టడుగున ఉన్న యువశక్తికి ఊతమివ్వాలి. వారి జ్ఞానానికి వెలుగునివ్వాలి. కాబట్టి, జాతి వనరులను పెట్టుబడిదారుడి మీద వెచ్చిస్తారా? దేశ పురోగమనానికి దోహదపడే సాధారణ ప్రజానీకం నైపుణ్యం పెంపు కోసం ఖర్చు చేస్తారా? అనేవి నేడు భారత పాలకుల ముందు సవాళ్లుగా ఉన్నాయి. నేటి సమాజంలో నిర్లక్ష్యానికి గురైన ప్రజలు 80 శాతం మించి ఉన్నారు. కాబట్టి పాలకులు ఎటు మొగ్గుతారోనన్న అంశం కీలకమే. సమష్టి సంపదను పెంచాలంటే సమష్టి క్యాపిటల్ తయారు కావాలి. అది కూడా నైపుణ్యం కలిగిన క్యాపిటల్ అయి ఉండాలి. అందుకే విద్యారంగాన్ని ఎవరికి అప్పగిస్తారన్నది ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. నిజానికి పేద వర్గాలను నైపుణ్యం కలిగిన వనరుగా మార్చడం ఒక దశాబ్దంలో పూర్తయ్యే పని కాదు. శతాబ్దాలు గా పీడనకు గురైన వర్గం, మిగిలిన వర్గాలను అందిపుచ్చుకోవాలంటే వారికి ప్రత్యేక అవకాశాలు కల్పించాలి. అందుకే సమానత్వం సాధ్యమ య్యేవరకు రిజర్వేషన్లు తప్పవు. 21వ శతాబ్దంలో పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన పరిశ్రమ లన్నీ సంపన్న వర్గం చేతికి వచ్చాయి. ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం నుంచి సాంకేతిక రంగానికి మళ్లడం ఇందుకు ప్రధాన కారణం. అదే ఇతర దేశాలలో వ్యవసాయం నుంచి పారిశ్రామిక వ్యవస్థకు మళ్లారు. దాని నుంచి సాంకేతిక రంగం వైపు పయనించారు. కార్మిక రంగం నుంచి ఎదిగిన పారిశ్రామిక వర్గంలో ప్రజాస్వామిక భావజాలం ఉంటుంది. ఫ్యూడల్ వ్యవస్థ నుంచి నేరుగా సాంకేతిక యుగం వైపు అడుగులు వేసిన భారత్ వంటి దేశాలలో ఫ్యూడల్ భావజాలం కనిపిస్తుం ది. ఈ చారిత్రక సంధ్యలోనే ప్రజాస్వామ్యం మీద నమ్మకం, దీక్ష కలిగిన నాయకులు అవసరం. సాంకేతిక పరిజ్ఞానం ఫలాలు పీడిత వర్గానికి అప్పుడే అందుతాయి. కానీ ఈ తత్వం మీద విశ్వాసం కలిగిన పాలకవర్గం రావడం కష్టం. కాబట్టి సాంకేతిక యుగం ఫలితాలు పీడిత ప్రజా నీకం అందుకోవాలంటే స్వాతంత్య్ర పోరాటాన్ని మించిన పోరాటం అవసరం. సమ్మిళిత వృద్ధి సాధ్యమయ్యేది అప్పుడే. ఈ పదేళ్లలో దీనిని సాధించకుంటే యువత శక్తిసామర్థ్యాలు వృథా అవుతాయి. వారిలో నిస్పృహ పెరుగుతుంది. అది ఎటు ప్రయాణిస్తుందో అనూహ్యం. కాబట్టి ముందే మేల్కొని నూటికి 90 శాతంగా ఉన్న ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి. ప్రభుత్వ రంగాన్ని విస్తరించాలి. - (వ్యాసకర్త విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు) చుక్కా రామయ్య -
పొదుపుతోనే ఆర్థికాభివృద్ధి: గిడ్డి ఈశ్వరి
పాడేరు రూరల్: పొదుపు చేయటం ద్వారనే ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుందని, తద్వారా భవిష్యత్తుకు భరోసా ఏర్పడుతుందని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. మండలంలోని కుజ్జెలి పంచాయతీ దిగు మోదాపుట్టు గ్రామంలో మంగళవారం ఐకేపీ రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, రుణాలను సద్వినియోగం చేసుకొని ప్రగతి సాధించాలన్నారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి దశల వారిగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కుజ్జెలి, దిగు మోదాపుట్టు గ్రామాల్లో సామాజిక భవనాల నిర్మాణానికి కషి చేస్తానన్నారు. పంచాయతీ పరిధిలోని ఇసుకలు, తూరుమామిడి గ్రామాల్లో రక్షిత తాగునీరు, రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలు తలెత్తితే నేరుగా తమకు అర్జీల రూపంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. అన్ని వేళల్లో గిరిజనులకు అందుబాటులో ఉంటానని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయం సహాయక సంఘంలోని 16 మంది సభ్యులకు మంజూరైన రూ.5 లక్షల రుణాల ద్వార కొనుగోలు చేసిన 3 ఆటోలు, ఒక జెరాక్స్ మెషీన్, దుక్కిటెద్దులు, గొర్రెలను అర్హులైన గిరిజనులకు అందజేశారు. మరో ఇద్దరు మహిళలు రుణం ద్వారా ఏర్పాటు చేసుకున్న కిరాణా దుకాణం, టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు పోలుపర్తి నూకరత్నం, ఎంపీపీ వర్తన ముత్యాలమ్మ, సర్పంచ్ గబ్బాడ చిట్టిబాబు, ఎంపీటీసీ సభ్యులు అడపా నర్శిం హామూర్తి నాయుడు, కిల్లు చంద్రమోహన్ కుమార్, కో ఆప్సన్ సభ్యుడు మహమ్మద్ తాజుద్దిన్, మాజీ ఎంపీపీ ఎస్వీవీ రమణమూర్తి, వైఎస్సార్సీపీ నాయకులు వర్తన పిన్నయ్యదొర, బూరెడ్డి నాగేశ్వరరావు, ఐకేపీ ఏపీఎం అప్పలనాయుడు, సీసీపీ. గోవిందమ్మ, ఓబీలు ఎస్.నాగమణి, డి.జయ, కె.చిన్నతల్లి, అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. -
100 గ్రామాలకు నగర శోభ!
ఏపీ రాజధాని చుట్టూ భూములిచ్చే రైతులకు అభివృద్ధిలో భాగస్వామ్యం విజయవాడ బ్యూరో: రాష్ట్ర పరిపాలనా వ్యవస్థకు రాజధానిగా మాత్రమే కాకుండా అన్ని రంగాల ఆర్థిక అభివృద్ధికి దోహదపడే ‘గ్రోత్ సెంటర్’గా బెజవాడ నగరాన్ని అభివృద్ధి పర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. అంతర్జాతీయ స్థాయి ఐటీ, పరిశోధన, కార్పొరేట్ సంస్థల ఏర్పాటుకు అవసరమైన కోట్లాది రూపాయల పెట్టుబడులు రావడానికి అనుగుణంగా.. రాజధాని నగర రూపకల్పనలో జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం నిపుణులతో చర్చించి నగర నిర్మాణం, అందులో ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాలు, నిర్మించాల్సిన భవన సముదాయాలు, సేకరించాల్సిన భూములపై కసరత్తు మొదలు పెట్టింది. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో సమావేశమైన రాజధాని సలహా కమిటీ వివిధ అంశాలపై సమగ్రంగా సమీక్షించినట్లు సమాచారం. నాలుగు రోజుల కిందట ఛత్తీస్‌గఢ్ రాష్టంలోని నయా రాయ్‌పూర్ నగరాన్ని సందర్శించిన కమిటీ నగర రూపకల్పన, వివిధ నిర్మాణాలకు జరిగిన వ్యయంపై వివరాలను సేకరించారు. విజయవాడ చుట్టూ చేపట్టాల్సిన నిర్మాణాలు, సమీకరించాల్సిన భూములపై స్పష్టతకు వచ్చారు. దీన్నిబట్టి చూస్తే విజయవాడ, దాని పరిసరాల్లో నిర్మితమయ్యే రాజధాని చుట్టూ.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న సుమారు వందకు పైగా గ్రామ పంచాయతీలు నగర శోభను సంతరించుకోనున్నాయి. ఆయా గ్రామాల చుట్టూ ఉన్న భూములను సేకరించిన తర్వాత రైతుల భాగస్వామ్యంతో రోడ్లు, విద్యుత్, తాగునీటి సదుపాయాలను మెరుగుపర్చి నగరంతో అనుసంధానించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే అమల్లోకి వస్తే.. గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు, తాడికొండ, అమరావతి మండలాల్లోని గ్రామాలు, కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, కొండపల్లి, పరిటాల, గుంటుపల్లి, గొల్లపూడి, కొటికలపూడి, కొత్తపేట, దాములూరు, నున్న పరిసర గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశముందని తెలుస్తోంది. రెండు జిల్లాల్లోనూ (ప్రకాశం బ్యారేజీకి ఎగువన) నదికి ఇరువైపులా 12,500 ఎకరాల భూములను గుర్తించాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 4 దశల్లో భూసేకరణ సాగుతుందని అధికారుల అంచనా. -
ఆర్థికాభివృద్ధిలో పట్టణీకరణ కీలకమే
శాటిలైట్ నగరాలతోనే సమస్యల పరిష్కారం సాక్షి, హైదరాబాద్: ‘ఒకే ప్రాంతంలో అభివృద్ధి జరిగితే అందరూ ఆ వైపుగానే పరుగు తీస్తారు. దీంతో ఆ ప్రాంతంపై ఒత్తిడి పెరిగి అనేక రకాల సమస్యలకు దారి తీస్తుంది. అలా కాకుండా శాటిలైట్ నగరాలను అభివృద్ధి చేస్తే పట్టణాలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు ప్రజలు లగ్జరీ జీవితాన్ని గడుపుతారు’ అని మౌలిక రంగ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. దేశం ఆర్థికంగా పురోగతి సాధించడంలో పట్టణాభివృద్ధి కీలకమైన పాత్రను పోషిస్తుందని వారు తెలిపారు. ‘పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన- పట్టణాభివృద్ధి వికేంద్రీకరణ, శాటిలైట్ నగరాల అభివృద్ధి’ అనే అంశంపై శుక్రవారం తాజ్‌కృష్ణ హోటల్లో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో సీఐఐ ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్యానల్, ఎల్అండ్టీ మెట్రో రైల్ సీఎండీ వీబీ గాడ్గిల్ మాట్లాడుతూ.. మన రాష్ట్రంలోనూ పెరిగే పట్టణ ప్రాంత జనాభాకి మౌలిక వసతుల కల్పన కోసం వికారాబాద్, భువనగిరి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, జడ్చెర్ల, చౌటుప్పల్ తదితర నగరాల్లో శాటిలైట్ నగరాల అభివృద్ధికి ప్రణాళికలను రచించడం జరుగుతోందని పేర్కొన్నారు. మురుగునీటి వ్యవస్థ, రక్షిత మంచినీరు, ట్రాఫిక్, పార్కులు, సంస్కృతి ఇలా అన్ని రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని శాటిలైట్ నగరాలను అభివృద్ధి చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ (ప్లానింగ్, టీఅండ్‌టీ అండ్ హెరిటేజ్) అడిషనల్ కమిషనర్ డీ రొనాల్డ్ రోస్ మాట్లాడుతూ.. బార్సిలోనా, షాంఘై వంటి చోట్ల విజయవంతమైన శాటిలైట్ నగరాలను స్ఫూర్తిగా తీసుకుని..మన దేశ పరిస్థితులకు అనుగుణమైన నగరాలను అభివృద్ధి చేయాలని సూచించారు. అప్పుడే అవి ప్రజాదరణకు నోచుకుంటాయన్నారు. భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) జాతీయ అధ్యక్షుడు సీ శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాల లేమి కారణంగానే చాలా కాలంగా విదేశీ సంస్థలు నగరానికి రావటంలేదన్నారు. అందుకే ముందుగా మౌలిక సదుపాయాలను కల్పించుకోవాలని, ఆ తర్వాతే శాటిలైట్ నగరాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. గఈ కార్యక్రమంలో అర్బన్ ప్రాక్టిస్, క్రిసిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వైజరీ డెరైక్టర్ రాకే శ్ బంగే రా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) చైర్మన్ బీ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శాటిలైట్ నగరాలిలా ఉండాలి రాజధానికి సుమారు 100 కి.మీ. ల దూరంలో ఉన్న ముఖ్య పట్టణాలు, నగరాలను శాటిలైట్ నగరాలుగా అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించాలి. పకడ్బందీ పట్టణ ప్రణాళికతో పాటు డ్రైనేజీ, మంచినీరు, రహదారులు, వీధిలైట్లు, పారిశుద్ధ్యం వంటి వసతులు కల్పించాలి. శాటిలైట్ నగరాల నుంచి రాజధానికి చేరుకునేందుకు ఎంఎంటీఎస్ పరిధిని విస్తరించాలి. బస్సుల సంఖ్యను పెంచాలి. ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించే కంపెనీలు, పరిశ్రమలను శాటిలైట్ నగరాల్లోనే ఏర్పాటు చేసేలా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించాలి. ప్రతి చిన్న పనికి రాజధానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా పలు ప్రభుత్వ విభాగాల కార్యాలయాలను శాటిలైట్ నగరాల్లో ఏర్పాటు చేయాలి. -
మహిళల ఆర్థికాభివృద్ధి భేష్
సాక్షి, సంగారెడ్డి : ‘మహిళల శక్తి ఏమిటో చూశాం. కృషితో ఆర్థిక శక్తిగా ఎదగడమే కాకుండా.. ధైర్య సాహసాలు, ఆత్మ విశ్వాసంతో సామాజిక రుగ్మతలపై కలిసికట్టుగా పోరాడి విజయాలు సాధించారు. మిమ్మల్ని కలుసుకున్నందుకు గర్వపడుతున్నాను..’ అని 14వ ఆర్థిక సంఘం సభ్యురాలు ఎంఎస్ సుష్మానాథ్ సదాశివపేట మండలం వెల్టూర్ గ్రామంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆర్థిక సంఘం సభ్యులు అభిజిత్ సేన్, ఎంఎస్ సుష్మానాథ్, డాక్టర్ సుదిప్తో ముండ్లే, అజయ్ నారాయణ్ ఝా, గోవింద్ రావుల బృందం ఆర్థిక విధానాలపై క్షేత్ర స్థాయి అధ్యయనంలో భాగంగా శుక్రవారం సాయంత్రం జిల్లాలో పర్యటించింది. ఆర్థిక సంఘం చైర్మన్, ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి ఈ పర్యటనను నేతృత్వం వహించాల్సి ఉండగా.. ఆయన పాల్గొనలేదు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి వీ సునీతారెడ్డి, ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి రేమండ్ పీటర్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ప్రేం చంద్రారెడ్డి, ఆ శాఖ కమిషనర్ శశిభూషణ్ కుమార్, కలెక్టర్ ఏ దినకర్ బాబు, జేసీ శరత్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలతో ఆర్థిక సంఘ సభ్యులు సమావేశమయ్యారు. గ్రామంలో ఏవైనా సమస్యలుంటే తెలపాలని సభ్యులు కోరారు. ‘గ్రామంలో మద్య నిషేధం, పేకాట నిర్మూలన సాధించే వరకు పొదుపు ఆపేసి పోరాడాలని గ్రామైక్య సంఘం సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించాం. అందరం ఇళ్లల్లో గాలించి మద్యం సీసాలను బయటకు తెచ్చి వీధుల్లో పగలగొట్టాం. ఊళ్లో ఆడ వాళ్లు అందరూ మూకుమ్మడిగా వంటలు చేయడం మానేసి మూడు రోజుల పాటు పంచాయతీ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేశాం.అమ్మినోళ్లకు రూ.5 వేలు, తాగినోళ్లకు రూ.500 జరిమానాతో పాటు మద్యం గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.500 ప్రోత్సాహక బహుమతి ఇవ్వాలని తీర్మానించేలా చేశాం. ఇలా ఊళ్లో మద్య నిషేధాన్ని సాధించుకున్నాం. గ్రామంలో ఎక్కడైనా పేకాట ఆడుతుంటే సమాచారమిస్తాం.. వచ్చి పట్టుకెళ్లాలని పోలీసులకు చెప్పితే వారు సానుకూలంగా స్పందించారు. ఓ సారి పేకాట జరుగుతుంటే ఫోన్ చేయగా పోలీసోళ్లు వచ్చి 5 మందిని పట్టుకెళ్లి మరుసటి రోజు వదిలేశారు. పోలీసులు ఏం చేశారో ఏమో మళ్లీ ఇప్పుడు గ్రామంలో ఎవ్వరూ పేకాట ఆడడం లేదు’ అని గ్రామ జెండర్ కమిటీ సభ్యురాలు రుక్కమ్మ సమాధానమిచ్చారు. ఇప్పుడు గ్రామంలో మహిళలు సమస్యల నుంచి విముక్తి పొందారని ఆమె స్పష్టం చేయడంతో ఆర్థిక సంఘం బృందం గ్రామ మహిళలపై ప్రశంసల వర్షం కురిపించింది. గ్రామంలో 47 ఎస్‌హెచ్‌జీలు, 582 మంది మహిళలు అందులో సభ్యులుగా ఉన్నారని వెలుగు గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు మల్లేశ్వరి తెలిపారు. రూ.1.48 కోట్ల బ్యాంకు రుణాలు తీసుకున్నామని, 28 సంఘాలు రూ.4.25 లక్షల వడ్డీ మాఫీ పొందాయని తెలిపారు. ఈ డబ్బుతో ఏం చేస్తున్నారని ఆర్థిక సంఘం సభ్యులు ప్రశ్నించగా.. వ్యవసాయం, మేకల పెంపకం, కౌలు వ్యవసాయం, కిరాణ దుకాణాలు ఏర్పాటు చేసి ఉపాధి పొందుతున్నట్లు ఆమె వివరించారు. గ్రామ సర్పంచ్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తమ గ్రామాభివృద్ధికి సహకరించాలని అధికారులను కోరారు. కార్యక్రమం చివర్లో ఆర్థిక సంఘం సభ్యుల చేతుల మీదుగా తలారి సునంద అనే మహిళకు బంగారు తల్లి పథకం కింద తొలి బాండును అందజేశారు. అనంతరం కొండాపూర్ మండలం గిర్మాపూర్‌లోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖీ నిర్వహించినప్పుడు విద్యార్థులు తమ ప్రశ్నలతో ఆర్థిక సంఘం సభ్యులను ఆకట్టుకున్నారు. మీరు మాకు ఏదో ఇవ్వాలని పాఠశాలకు వచ్చారు.. రేపు మేమూ మీలా ఇతరులకు ఇచ్చే స్థితిలో ఉంటామన్న మరో విద్యార్థి ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించడంతో చప్పట్లతో అభినందించారు. అంతకు ముందు నార్సింగిలోని గురుకుల పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థినిలు దివ్య, మాధవిలు తమ పాఠశాలల్లో బోధనా పద్ధతులు, అధ్యాపకుల సేవల గురించి అధికారులకు వివరించారు. పర్యటన ముగిసిన అనంతరం హైదరాబాద్‌కు పయనమయ్యారు. రూపాయి ఎందుకు పతనమవుతోంది? రూపాయి విలువ ఎందుకు పతనమవుతోంది? అని ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం విద్యార్థి రాజు 14వ ఆర్థిక సంఘం సభ్యులకు ప్రశ్నించారు. ‘ఆందోళన పడాల్సిన అవసరం లేదు. రూపాయికి స్థిరత్వం వస్తుంది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.’ అని ఆర్థిక సంఘం సభ్యులు ప్రొఫెసర్ అభిజిత్ సేన్ సమాధానమిచ్చారు. -
ఆర్థికవృద్ధి చీకటికోణం!
అడుగులేని అగాథంలోకి జారిపోతున్నట్టున్న రూపాయి విలువ శుక్రవారం డాలర్‌కు రూ.62 రికార్డును అధిగమించి 4 శాతం విలువను కోల్పోయింది. మరోవంక బీఎస్ఈ సెన్సెక్స్ నాలుగేళ్ల గరిష్ఠస్థాయిలో 699 పాయింట్ల మేరకు పతనమైంది. ఈ పరిణామాలు భారత షేర్, విదేశీ మారక ద్రవ్య (ఫోరెక్స్) మార్కెట్లలో ఉత్పాతాన్ని సృష్టించాయి. అమెరికా ఆర్థిక వృద్ధి గణాంకాలకు మన మార్కెట్లు ఇంతగా స్పందించాల్సింది కాదని ఆర్థికమంత్రి పి. చిదంబరం అంటున్నారు. ఆయన చిత్తానుసారం గాక స్టాక్, ఫోరెక్స్ మార్కెట్లు వాటి సొంత నియమాల ప్రకారమే గత మూడు నెలలుగా స్పందిస్తున్నాయి. అమెరికా ఆర్థికవృద్ధి అంచనాలకు మించి పుంజుకుంటోందని, వడ్డీరేట్లు పెరిగే అవకాశాలున్నాయని బుధవారం అంచనాలు వెలువడ్డాయి. అమెరికా ఆర్థికవ్యవస్థ సంక్షోభంలో పడటంవల్ల ఏర్పడ్డ మాంద్య పరిస్థితుల దుష్ఫలితాలను అనుభవిస్తున్న ప్రపంచానికి, ప్రత్యేకించి మనలాంటి వర్థమాన దేశాలకు ఇది శుభవార్త కావాలి. కానీ అది మన మార్కెట్లలో ఉత్పాతాన్ని సృష్టించడం విచిత్రంగా అనిపిస్తుంది. ఆ విచిత్రమే సామాన్యులకు అంతుపట్టని మాయాజాలంగా మారిన మన ఆర్థిక వృద్ధి పొడుపు కథను విప్పి చె ప్పగలుగుతుంది. అమెరికా వృద్ధి తాజా గణాంకాలేవీ వెలువడక ముందే జూన్ 19న అమెరికా ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) చైర్మన్ బెన్ బెర్నాకె ఒక్క ప్రకటనతో మన మార్కెట్లను మండించేశారు. అమెరికా వృద్ధి ఆశావహంగా ఉన్నందున ఆర్థికవ్యవస్థలో ద్రవ్యత్వాన్ని పెంచడానికి ఫెడ్, బాండ్ల కొనుగోళ్ల రూపంలో ఇస్తున్న సహాయక ప్యాకేజీలను భవిష్యత్తులో దఫదఫాలుగా తగ్గించే అవకాశం ఉందని మాత్రమే ఆయన అన్నారు. అప్పుడు అథోగతికి దిగజారడం ప్రారంభించిన మన రూపాయి మళ్లీ తల పెకైత్తి చూసింది లేదు. 2004-2008 మధ్య 9 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేసిన ఘన చరిత్రను పునరావృతం చేయడానికేనంటూ చిదంబరం రెండు దఫాలుగా ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకు తలుపులను తెరిచే ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. అలా దేశంలోకి ప్రవహించిన పెట్టుబడులు ఇలా పలాయనం చిత్తగిస్తే వృద్ధి రథం పరిగెత్తేదెలా? మూడు నెలలుగా రూపాయి దానికదే తగు స్థాయిలో స్థిరత్వాన్ని సాధిస్తుందని చిదంబరంతోపాటూ పలువురు ఆర్థిక నిపుణులు చెబుతూ వస్తున్నారు. రూపాయి పతనం కంటే వేగంగా ఆహార ద్రవ్యోల్బణం పెరిగి దాదాపు 12 శాతం కావడంతో ఆర్థిక నిపుణులు కాని కూలీనాలీ, వేతన జీవులు, రైతులు, గృహిణులు గగ్గోలు పెడుతున్నారు. రానున్న ఎన్నికల్లో నేతల తలరాతలను రాసేది ఇలాంటి ఓటర్లే. కాబట్టే రిజర్వ్ బ్యాంకు రూపాయి పతనాన్ని నిలువరించడానికి తగు చర్యలు తీసుకుంటుందని చిదంబరం ప్రకటనలు చేశారు. గురువారం రిజర్వ్ బ్యాంక్ దేశం నుంచి స్వల్పకాలిక పెట్టుబడులను ఇష్టానుసారంగా ఉపసంహరించుకోవడంపై కొన్ని ఆంక్షలను విధించింది. శుక్రవారమే స్టాక్ మార్కెట్లలో కల్లోలం ప్రారంభమైంది. ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసే బ్యాంకు వడ్డీ రేట్ల పెంపుదలకు తిరస్కరిస్తున్న ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు విధించిన ఆంక్షలే మదుపర్లలో బీభత్సాన్ని సృష్టించాయంటూ పలువురు ఆర్థిక నిపుణులు ఆయనపై విరుచుకుపడుతున్నారు.పెట్టుబడులు ఎప్పుడుబడితే అప్పుడు రెక్కలుగట్టుకొని ఎగిరిపోయే పరిస్థితులు ఉండటం, రూపాయి విలువ డాలర్‌కు 65గా స్థిరపడటం ఆర్థికవృద్ధికి అవసర మని విధాన కర్తల భావన. మన కరెంటు అకౌంటు లోటు గత ఏడాది స్థూల జాతీయోత్పత్తిలో 4.8 శాతంగా ఉంది. మన విదేశీ మారకద్రవ్య నిల్వలు 28,000 కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఈ ఏడాది 17,235 కోట్ల డాలర్ల రుణ చెల్లింపులు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 1991లో మన బంగారాన్ని తాకట్టుపెట్టుకొని, రూపాయి విలువను తగ్గించుకొని దిగుమతుల కోసం దినదినగండంగా బతకాల్సిన రోజులు పునరావృతం కానున్నాయనే భయాలు వ్యాపిస్తున్నాయి. ఆరునెలల దిగుమతులకు సరిపడా విదేశీ నిల్వలు ఉన్నాయంటూ ప్రధాని అలాంటి భయాలు అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. కానీ, 1991లో మొదలైన మన ఆర్థిక సంస్కరణల చరిత్ర మూడు దశాబ్దాల తర్వాత తిరిగి అక్కడికే చేరబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వాల్‌మార్ట్, మెకీస్ వంటి బడా రిటైల్ వర్తక సంస్థల అమ్మకాలు క్షీణిస్తుండటం అమెరికా వృద్ధి కథనాన్ని సందేహాస్పదం చేస్తోంది. వాల్‌మార్ట్ తన అమ్మకాలు 0.3 శాతం పడిపోవడానికి అల్పాదాయ వర్గాలపై పన్నుల భారం, అల్పవేతనాల వల్ల కొనుగోలుశక్తి పెరగకపోవడమేనని, వారు తమ అవసరాలకు మించి వినియోగం చేయలేకపోవడమే కారణమని వాపోతోంది. వాల్‌మార్ట్ మన విధానకర్తలు చెప్పని నిజాన్ని చెబుతోంది. అల్పాదాయ వర్గాల ఆదాయాలు, కొనుగోలుశక్తి పెరగనిదే వృద్ధి అసంభవమని స్పష్టం చేస్తోంది. వృద్ధిలో మనకు ప్రత్యర్థిగా భావిస్తున్న చైనా తిరిగి అధిక వృద్ధి రేట్లను సాధించ డానికి ప్రజల జీవన ప్రమాణాలను, దేశీయ వినియోగాన్ని పెంచడంపై దృష్టిని కేంద్రీకరించింది. ఉద్యోగితను పెంచే మౌలిక సదుపాయాల నిర్మాణం, భారీ నీటిప్రాజెక్టులు, వెనుకబడిన ప్రాంతాల పారిశ్రామికీకరణ పెద్ద ఎత్తున చేపడుతోంది. ఆ దిశగా దృష్టినైనా సారించలేని మన విధానకర్తల నిర్వాకం ఫలితంగా గత ఏడాది మన పారిశ్రామిక వృద్ధి రెండు దశాబ్దాలలో అతి తక్కువగా ఒక్క శాతంగా నమోదైంది. పైగా మరింతగా ప్రజల కొనుగోలుశక్తిని తగ్గించేలా సబ్సిడీల, సంక్షేమ వ్యయాల కోతలను అమలుచేస్తోంది. గత 22 ఏళ్ల ఆర్థిక సంస్కరణల అనంతరం విదేశీ ద్రవ్యసంస్థలు స్వల్పకాలిక చంచల పెట్టుబడులతో మన రూపాయితోనూ, స్టాక్ మార్కెట్లతోనూ జూదమాడగలుగుతున్నాయి. మన ఆర్థిక వ్యవస్థను ఒక జూదగృహంగా మారుస్తున్నాయి. కాబట్టే ఈ అర్థసంవత్సరంలో అమెరికా వృద్ధి 1.4 శాతమే అయినా, యూరోపియన్ వృద్ధి 0.3 శాతమే అయినా... అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు మన రూపాయి, స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. ఆర్థిక వృద్ధి చరిత్రకు ఉన్న ఈ చీకటి కోణాన్ని గుర్తించేదెన్నడు?