
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా.. ఆర్థికాభివృద్ధిలో కేవలం మూడు జిల్లాలకే 43.72 శాతం వాటా ఉంది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పట్టణీకరణ ఎక్కువగా ఉన్న రంగారెడ్డి జిల్లా రూ.2,26,957 కోట్లు, హైదరాబాద్ జిల్లా రూ.1,86,225 కోట్లు, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా రూ.73,132 కోట్ల స్థూల జిల్లా దేశీయోత్పత్తి (జీడీడీపీ)ని సాధించి.. ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచాయి. రాష్ట్రంలోని మిగతా 30 జిల్లాలు కలిపి వాటా 56.28 శాతమే కావడం గమనార్హం.
ములుగు జిల్లా రూ.6,240 కోట్ల జీడీడీపీతో అన్నింటికన్నా చివరన నిలిచింది. ‘తెలంగాణ ఆర్థికాభివృద్ధి ః 10’ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. జిల్లాల ఆర్థికాభివృద్ధికి సూచికగా జీడీడీపీని పరిగణిస్తుంటారు. అభివృద్ధి అంతా హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే కేంద్రీకృతమైందని.. జిల్లాల మధ్య సమతుల్యత లోపించినట్టుగా ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. జిల్లాల మధ్య అసమతుల్యతను తొలగించేందుకు అమలు చేయాల్సిన విధానాలు, పాలనాపర నిర్ణయాలు, ప్రణాళికల రూపకల్పనలో జీడీడీపీని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.
– జీడీడీపీకి సంబంధించి.. భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, మహబూబ్‌నగర్ జిల్లాలు వరుసగా 34.2శాతం, 24.9శాతం. 24.9శాతం వృద్ధి రేటును సాధించి టాప్‌లో నిలిచాయి. రాష్ట్రంలోని 32 జిల్లాలు వృద్ధిరేటులో పురోగమించగా.. ఒక జిల్లా మాత్రం వృద్ధి రేటులో తిరోగమనంలో ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వ నివేదిక వెల్లడించింది.
తలసరి ఆదాయంలో రంగారెడ్డి టాప్
రంగారెడ్డి జిల్లా రూ.7,58,102 తలసరి ఆదాయంతో 2021–22లో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. దేశ సగటు తలసరి ఆదాయంతో పోల్చితే ఇది 5.1 రెట్లు అధికం. హైదరాబాద్ జిల్లా రూ.4,02,941తో, సంగారెడ్డి జిల్లా రూ.3,01,870తో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. వికారాబాద్ జిల్లా రూ.1,54,509 తలసరి ఆదాయంతో అట్టడుగున నిలిచింది. బాగా పట్టణీకరణ జరిగిన జిల్లాలతో పోల్చితే.. మారుమూల గ్రామీణ జిల్లాలు తలసరి ఆదాయంలో వెనుకబడి ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక తలసరి ఆదాయంలో రాష్ట్రంలోని 32 జిల్లాలు రెండంకెల వృద్ధి రేటు నమోదు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నివేదికలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment