సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పదేళ్లలో ఎంతో అభివృద్ధిని సాధించినట్లు రాష్ట్ర ప్ర భుత్వం ప్రకటించింది. అనేక సవాళ్లను అధిగమించి వివిధ రంగాల్లో గణనీయ ప్రగతిని సాధించడం వెనుక జిల్లాల విభజన, జిల్లాలు సాధించిన జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ), తలసరి ఆదాయం (పీసీఐ)కారణంగా పేర్కొంది. రాష్ట్రం ఏర్పడక ముందు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల (బీఆర్‌జీఎఫ్)కింద ఉన్న తొమ్మిది జిల్లాల్లో ఉమ్మడి వరంగల్ ఒకటి కాగా..
ఆతర్వాత అభివృద్ధిలో అన్ని రంగాల్లో పురోగతి సాధించింది. పదేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో సాధించిన ప్రగతి సూచికలో ఉమ్మ డి వరంగల్ జిల్లా భాగస్వామ్యం కూడా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ ఆర్థికాభివృద్ధి–10’ నివేదికలో వెల్లడించింది.
ఆర్థిక వృద్ధి రేటులో హనుమకొండ టాప్–2
ఉమ్మడి వరంగల్‌లో ఆరు జిల్లాలు ఉండగా.. 2021–22 సంవత్సరానికి ఆర్థిక వృద్ధిలో హనుమకొండ జిల్లా టాప్–2లో నిలిచినట్లు నివేదిక స్పష్టం చేసింది. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ ఉత్తమ పనితీరు కనబర్చాయి. ప్రస్తుత ధరల ప్రకారం.. వరుసగా 34.2 శాతం, 24.9 శాతం వృద్ధి రేటుతో ఈరెండు జిల్లాలు ఉన్నాయి. వీటితో పాటు రాష్ట్రంలోని 32 జిల్లాలు వృద్ధి రేటులో పురోగమించగా..
రూ.6,240 కోట్ల జీడీపీపీతో అన్నింటికన్నా చివరన ములుగు జిల్లా నిలిచింది. జిల్లాల ఆర్థికాభివృద్ధికి సూచికగా జీడీడీపీని పరిగణించగా.. అభివృద్ధి అంతా హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే కేంద్రీకృతం కాగా.. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో కొద్దిగా మెరుగ్గా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. గ్రేటర్ వరంగల్ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి కారణంగా.. ఆర్థిక వృద్ధిలో టాప్–2లో నిలిచినట్లు నివేదిక చెబుతోంది.
భూపాలపల్లి భేష్
2021–22లో రంగారెడ్డి జిల్లా రూ.7,58,102 తలసరి ఆదాయంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవగా..రూ.2,34,818తో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎనిమిదో స్థానంలో నిలిచింది.వరంగల్ జిల్లా రూ.1,94,317తో 16వ స్థానం, రూ.1,86,278తో జనగామ 18, రూ.1,79,222లతో మహబూబాబాద్ 20, రూ.1,77,316తో ములుగు 21వ స్థానాల్లో నిలవగా.. హనుమకొండ రూ.1,56,086తో చివరి స్థానానికి చేరింది. బాగా పట్టణీకరణ జరిగిన జిల్లాలతో పోల్చితే.. మారుమూల గ్రామీణ జిల్లాలు తలసరి ఆదాయంలో వెనుకబడి ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. హనుమకొండ జిల్లా కూడా తలసరి ఆదాయంలో వెనుకబడగా..
భూపాలపల్లి మినహా మిగతా జిల్లాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తలసరి ఆదాయం విషయంలో పదేళ్లలో వృద్ధిరేటు గణనీయంగానే పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆయా జిల్లాల ప్రజల సగటు ఆదాయం పెరుగుతూ వస్తోంది. హనుమకొండ జిల్లాలో 2015–16 సంవత్సరానికి తలసరి సగటు ఆదాయం రూ.77,378 ఉండగా.. అది కాస్తా.. 2021–22 నాటికి రూ.1,56,086కు పెరిగింది. వరంగల్ రూరల్, మహబూబాబాద్, ములుగు, జనగామ, జేఎస్ భూపాలపల్లిలోనూ తలసరి సగటు ఆదాయం పెరిగినట్లు నివేదికలో గణాంకాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment