Per capita income
-
తలసరి ఆదాయంలో విశాఖ ‘వన్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 13 నుంచి 26కు పెంచిన తరువాత తొలిసారిగా 2022–23 ఆర్ధిక సంవత్సరానికి జిల్లాల వారీగా తలసరి ఆదాయం లెక్కలను డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటస్టిక్స్ వెల్లడించింది. ఈ లెక్కల ప్రకారం విశాఖపట్నం జిల్లా నంబర్‌వన్ స్థానంలో ఉండగా, రెండులో కృష్ణా, మూడులో ఏలూరు జిల్లా ఉంది. 2021–22లో ఉమ్మడి జిల్లాల్లో తలసరి ఆదాయంలో కృష్ణాజిల్లా మొదటి స్థానంలో ఉండగా విశాఖపట్నం రెండో స్థానంలో ఉంది. చివరి స్థానంలో విజయనగరం జిల్లా ఉంది. -
ఐదేళ్లలో తలసరి ఆదాయం డబుల్
న్యూఢిల్లీ: దేశ ప్రజల తలసరి ఆదాయం వచ్చే ఐదేళ్లలో రెట్టింపు కానుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. రాబోయే దశాబ్దాల్లో ప్రజల జీవన ప్రమాణాలు భారీగా మెరుగుపడనున్నాయని, ఇదంతా గత పదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణల చలవేనని ఆమె చెప్పారు. శుక్రవారమిక్కడ జరిగిన కౌటిల్య ఆర్థిక సదస్సు మూడో ఎడిషన్‌లో మాట్లాడుతూ ఆమె ఈ విషయాలను వెల్లడించారు.గడిచిన దశాబ్ద కాలంగా భారత్ ఆర్థిక వ్యవస్థ పరుగులతో ఐదేళ్ల కాలంలోనే అతిపెద్ద ప్రపంచ ఎకానమీల్లో 10వ స్థానం నుంచి ఏకంగా 5వ స్థానానికి ఎగబాకిందన్నారు. ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) గణాంకాల ప్రకారం దేశంలో తలసరి ఆదాయం 2,730 డాలర్లను చేరుకోవడానికి 75 ఏళ్లు పట్టింది. దీనికి మరో 2,000 డాలర్లు జతయ్యేందుకు కేవలం ఐదేళ్లే పడుతుంది. రానున్న కొన్ని దశాబ్దాల్లో సామాన్యుని జీవన ప్రమాణాలు దూసుకెళ్లనున్నాయి. భారతీయుల జీవితాల్లో ఇదొక మరపురాని కాలంగా నిలిచిపోతుంది’ అని సీతారామన్ పేర్కొన్నారు. పలు దేశాల్లో ఉద్రిక్తతలతో పరిస్థితులు దిగజారుతూ, ప్రపంచ శాంతికి విఘాతం కలుగుతున్నప్పటికీ, 140 కోట్ల మంది జనాభా గల మన దేశంలో ఆర్థిక అసమానతలను తగ్గిస్తూనే తలసరి ఆదాయాన్ని కొన్నేళ్లలోనే రెట్టింపు చేసే ప్రయత్నాల్లో భారత్ ఉందని ఆమె పేర్కొన్నారు.నవ భారత శకం... 2047 నాటికి 100 ఏళ్ల స్వాతంత్య్ర మైలురాయిని దాటనున్న నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరడం ద్వారా నవ భారత శకం ఆవిష్కృతమవుతుందని సీతారామన్ పేర్కొన్నారు. వికసిత భారత్‌లో అభివృద్ధి ఫలాలు ఒక్క భారతీయులకు మాత్రమే కాకుండా మిగతా ప్రపంచానికి కూడా విరజిమ్ముతాయని చెప్పారు. మొండి బకాయిలను తగ్గించడం, వాటికి ప్రొవిజనింగ్ పెంపు, లాభదాయకతను మెరుగుపరచడం వంటి స్థిరమైన విధానాలపై దృష్టి సారించడం ద్వారా దేశ బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేశామని, దీనివల్ల ఫైనాన్షియల్ వ్యవస్థ అత్యంత పటిష్టంగా మారిందన్నారు. -
త్వరలోనే రెట్టింపు ఆదాయం
సమీప భవిష్యత్తులో దేశ ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరగబోతున్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మాలాసీతారామన్ తెలిపారు. ప్రజల తలసరి ఆదాయం కొన్ని సంవత్సరాల్లోనే రెట్టింపు అవుతుందని అంచనా వేశారు. శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైన ‘కౌటిల్య ఆర్థిక సదస్సు’ మూడో ఎడిషన్‌లో మంత్రి పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘సమీప భవిష్యత్తులో సామాన్య మానవుల జీవన ప్రమాణాలు భారీగా పెరగబోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ‘గిని ఇండెక్స్’(ఆర్థిక సమానత్వాన్ని కొలిచే సూచిక. ఇది 0-1 మధ్య ఉంటుంది. 0-పూర్తి ఆర్థిక సమానత్వం, 1-అధికంగా ఉన్న ఆర్థిక అసమానత్వం) 0.283 నుంచి 0.266కు క్షీణించింది. పట్టణ ప్రాంతాల్లో ఇది 0.363 నుంచి 0.314కి చేరింది. కొవిడ్ పరిణామాల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంది. 140 కోట్ల జనాభా తలసరి ఆదాయాన్ని కొన్ని సంవత్సరాల్లోనే రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గడిచిన ఐదేళ్ల వ్యవధిలో ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో పదో స్థానం నుంచి ఐదో స్థానానికి చేరుకున్నాం. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 2730 డాలర్ల (రూ.2.2 లక్షలు) తలసరి ఆదాయాన్ని చేరుకోవడానికి 75 ఏళ్లు పట్టింది. మరో 2,000 డాలర్లు(రూ.1.6 లక్షలు) అదనంగా సంపాదించేందుకు మాత్రం ఐదు ఏళ్లు సరిపోతుంది’ అన్నారు.ఇదీ చదవండి: భారత్‌లో యాపిల్ నాలుగు స్టోర్లు..? ఎక్కడంటే.. -
జగన్ పాలనలో తలసరి ఆదాయం భారీగా పెరుగుదల
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభం వెంటాడినా.. నవరత్నాల పథకాలతో ప్రజలకు అండగా నిలిచి రాష్ట్ర ఆదాయం పెరగడానికి నాటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విశేష కృషి చేసింది. దాని ఫలితంగా ఐదేళ్ల జగన్ పాలనా కాలంలో రాష్ట్ర తలసరి ఆదాయం భారీగా పెరిగింది. ఈ విషయం 2023–24 దేశ ఆర్థిక వ్యవస్థ గణాంకాలతో ఆర్బీఐ హ్యాండ్ బుక్‌లో స్పష్టమైంది. శుక్రవారం విడుదలైన ఆ హ్యాండ్ బుక్‌లో గత పది సంవత్సరాల్లో వివిధ రాష్ట్రాల్లో తలసరి ఆదాయం పెరుగుదల వివరాలను ఆర్బీఐ వెల్లడించింది. గతంలో చంద్రబాబు ఐదేళ్ల పాలన కన్నా వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలోనే రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువగా పెరిగినట్లు ఆర్బీఐ పేర్కొంది. 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు చంద్రబాబు పాలనలో తలసరి ఆదాయం రూ. 60,128 మాత్రమే పెరిగింది. అదే 2019–20 నుంచి 2023–24 ఆర్థిక సంవత్సరం వరకు వైఎస్ జగన్ పాలనలో తలసరి ఆదాయం రూ. 88,448 పెరిగిందని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. చంద్రబాబు పాలనను తలదన్నేలాగతంలో చంద్రబాబు ఐదేళ్ల పాలన కాలాన్ని తలదన్నేలా.. వైఎస్ జగన్ పాలన కాలంలో ప్రతి ఏడాది కూడా జాతీయ సగటు తలసరి ఆదాయాన్ని మించి రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదల నమోదైంది. 2019–20లో దేశ జాతీయ సగటు తలసరి ఆదాయం రూ. 1,52,504 ఉండగా.. 2023–24 ఆర్థిక సంవత్సరంలో అది రూ. 2,14,951కు చేరింది. ఇదే సమయంలో 2019–20లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,60,341 ఉండగా 2023–24 ఆర్థిక సంవత్సరం నాటికి అది రూ. 2,42,479కు చేరింది. జీవన ప్రమాణాలు పెరిగిన ఫలితంగా.. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయనడానికి, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందనడానికి తలసరి ఆదాయం కొలమానంగా నిలుస్తుంది. రాష్ట్రం లేదా ప్రాంతం మొత్తం ఆదాయాన్ని అక్కడి జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది. రాష్ట్ర జనాభా ఆర్థిక శ్రేయస్సును తలసరి ఆదాయం సూచిస్తుంది. తలసరి ఆదాయం పెరిగింది అంటే ప్రజలు వస్తువులు, సేవలపై ఖర్చు చేయడానికి ఎక్కువ డబ్బును కలిగి ఉన్నట్లు అర్థం. ఏదైనా రాష్ట్రం లేదా ప్రాంతం అభివృద్ధికి కొలమానం కూడా తలసరి ఆదాయం పెరుగుదలే. కోవిడ్ సమయంలో వ్యవసాయంతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అలాగే వివిధ వర్గాల ఆదాయ మార్గాలను పెంచేందుకు, ఆయా రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు సజావుగా సాగేందుకు తగిన వాతావరణాన్ని కూడా ఆనాటి ప్రభుత్వం కల్పించింది. ప్రజల చేతుల్లోకి డబ్బులు చేరవేస్తేనే ఆర్థిక రంగానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో నవరత్నాల పథకాల ద్వారా లబ్ధిదారులకు నేరుగా నగదును బదిలీ చేసింది. ఫలితంగా రాష్ట్ర తలసరి ఆదాయంలో భారీగా పెరుగుదల నమోదైంది. అంతే కాకుండా గత ఐదేళ్లలో దేశ జాతీయ సగటు తలసరి ఆదాయాన్ని మించి రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగింది. కోవిడ్ లాంటి సంక్షోభాలు లేకపోయినా చంద్రబాబు 2014–15 నుంచి 2018–19 వరకు ఐదేళ్ల పాలనలో రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదల తక్కువగానే ఉంది. -
సేవల రంగం.. సుస్థిర ప్రగతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పురోగతిలో సేవల రంగం కీలకపాత్ర పోషిస్తోందని, కరోనా విపత్తు తర్వాత కోలుకున్న ఈ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక, ఉత్పత్తి రంగాల్లో అభి వృద్ధి కనిపిస్తున్నప్పటికీ అస్థిరత, మందగమనం కూడా నమోదవు తున్నా యని ఈ గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన సమగ్ర నివేదికను ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం ముందుంచింది. మంగళవారం ప్రజాభవన్‌లో జరిగిన సమావే శంలో, ఈ నివేదికలోని అంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ఆర్థిక శాఖ వివరించింది. ⇒ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో స్థిరంగా అభివృద్ధి కనిపిస్తోంది. జీఎస్డీపీ వృద్ధి రేటు జాతీయ సగటు 10.1 శాతం కాగా, తెలంగాణ 12.8% వృద్ధి నమోదు చేసుకుంటోంది. దేశ జనాభాలో తెలంగాణ జనాభా 2.8% కాగా, జీడీపీలో తెలంగాణ వాటా 5.1%. ⇒ రాష్ట్ర తలసరి ఆదాయం దేశ సగటుతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. ఈ వ్యత్యాసం ఏటా భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశ తలసరి ఆదాయం రూ. 1.84 లక్షలు కాగా, తెలంగాణ తలసరి ఆదాయం రూ.3.57 లక్షలు. ⇒ 2014–15 నుంచి 2022–23 వరకు బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలిస్తే కేవలం 81 శాతం మాత్రమే ఖర్చు నమోదయింది. అంటే రూ.100 బడ్జెట్లో ప్రతిపాదిస్తే రూ.81 మాత్రమే ఖర్చు చేయగలిగాం. ⇒ రెవెన్యూ ఆదాయంలో అస్థిరత ఆర్థిక ప్రగతిలో హెచ్చుతగ్గులు, ద్రవ్యలోటుకు దారితీస్తోంది. జీఎస్డీపీతో పోలిస్తే దేశంలోని ఇతర రాష్ట్రాల రెవెన్యూ ఆదాయం 14.6 శాతం కాగా, తెలంగాణ ఆదాయం 12.2 శాతం మాత్రమే. ⇒ జీఎస్డీపీతో పోలిస్తే ద్రవ్యలోటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. పంజాబ్ (4.5 శాతం), కేరళ (4.90 శాతం) తర్వాతి స్థానంలో రాష్ట్రం ఉంది. ⇒జీఎస్డీపీతో పోలిస్తే అప్పులు 2014–15లో 18.1 శాతం ఉంటే, 2023–24 నాటికి 27.4 శాతానికి చేరాయి. రూ.5 వేల కోట్లు ఇప్పించండికేంద్ర ప్రభుత్వం నుంచి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ.5 వేల కోట్లకు పైగా నిధులను ఇప్పించాలని 16వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (2014)లోని సెక్షన్ 94(2) ప్రకారం రూ.1,800 కోట్లు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రూ.1,188.88 కోట్లు, ఏపీ నుంచి రావాల్సిన రూ.408.49 కోట్లు, 2014–15 సంవత్సరంలో లెవీ కింద ఎక్కువగా తీసుకున్న రూ.1,468 కోట్లు, 2023–24 ఆర్థిక సంవత్సరంలోని మూడు, నాలుగు త్రైమాసికాలకు గాను జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఇవ్వాల్సిన రూ.323.73 కోట్లు ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది. ప్రజెంటేషన్‌లో రంగాల వారీగా పేర్కొన్న గణాంకాలివే..వ్యవసాయ అనుబంధ రంగాలు (ప్రైమరీ సెక్టార్)సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) ప్రకారం ఈ రంగంలో దేశ సగటు 3.5 శాతంతో పోలిస్తే తెలంగాణ సగటు 5.4 శాతంగా నమోదయింది. ఈ మేరకు ప్రగతి శాతం ఎక్కువగానే ఉన్నా ఈ రంగంలో అస్థిర పురోగతి నమోదవుతోంది. జీఎస్డీపీలో ఈ రంగం వాటా పరిశీలిస్తే పశువులు, జీవాలు 7.7 శాతం, మైనింగ్ 7.4 శాతం, మత్స్య పరిశ్రమ 6.4 శాతంగా నమోదయ్యాయి. పారిశ్రామిక రంగం (సెకండరీ సెక్టార్): ఈ రంగంలో ప్రగతి అస్థిరంగా ఉంది. దేశ సగటు 5.9 శాతంతో పోలిస్తే మందగమనం కనిపిస్తోంది. ఈ రంగంలో తెలంగాణ సగటు కేవలం 5.7శాతం మాత్రమే. జీఎస్డీపీలో ఈ రంగం వాటా కింద నిర్మాణ రంగం 7.6 శాతం, తయారీ రంగ పరిశ్రమలు 5.4 శాతం నమోదు చేస్తున్నాయి. సేవల రంగం (టెరిటరీ సెక్టార్): ఈ రంగంలో మాత్రం అభివృద్ధి సుస్థిరంగా కనిపిస్తోంది. దేశ సగటు 6.5 శాతంగా ఉంటే తెలంగాణ సగటు 8.1 శాతంగా నమోదవుతోంది. జీఎస్డీపీలో ఈ రంగం వాటా పరిశీలిస్తే వాణిజ్య సేవలు 12.4 శాతం, స్టోరేజీ 12, వాయు రవాణా 10.9 శాతం, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సేవలు 8.9 శాతంగా నమోదు చేసుకున్నాయి. -
యాభై ఏళ్ల భారత విజయగాథ
1970ల వరకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 1.9 శాతానికి తగ్గిపోయింది. కానీ అనంతరం స్థిరమైన పనితీరు నమోదవుతూ వచ్చింది. ఇప్పుడది 3.5 శాతం. ప్రపంచ సగటు కంటే దేశ ఆర్థిక వ్యవస్థ రెండింతలు వృద్ధి చెందుతోంది. అన్నింటిమీదా నియంత్రణలున్న వామపక్ష విధానాల నుండి దూరం జరిగి కొత్త ఆర్థిక విధానం ప్రారంభం కావడమే దీనికి కారణం. భారతీయులు ఉత్సాహవంతులైన షేర్ మార్కెట్ పెట్టుబడిదారులుగా మారారు. ఈ విజయగాథకు వ్యతిరేక కథనం కూడా ఉంది. ఆదాయపు నిచ్చెన దిగువ ఉన్నవారికి మంచి వేతనాలతో కూడిన పని ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థ 7–ప్లస్ శాతానికి చేరుకోగలుగుతుంది. అప్పుడే నిజంగా అధిక వృద్ధి సాధించిన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలుస్తుంది.అప్పుడు అలా కనిపించక పోయివుండొచ్చు, కానీ 50 ఏళ్ల క్రితం భారతదేశం పెద్ద మలుపును చేరుకుంది. ఆర్థిక సంక్షోభం, రాజకీయ ఉపద్రవం ఏర్పడ్డాయి. ఒక సంవత్సరం తర్వాత దాని నిర్ణయాత్మక చర్య ఏమిటంటే, ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించడం. కాకపోతే రెండేళ్ల లోపే అది తారుమారైపోయింది. దేశాన్ని ప్రభావితం చేసిన ఒక ముఖ్య ఘటనను ఆ సమయంలో ఎవరూ గుర్తించలేదు. అదేమిటంటే, ఇందిరా గాంధీ హయాంలో అమలైన సంపూర్ణ వామపక్ష దశ నుండి దూరం జరుగుతూ ఆర్థిక విధానంలో కొత్త దిశ ప్రారంభం కావడమే. అంతవరకు ఆర్థిక వ్యవస్థగా భారత దీర్ఘకాలిక పనితీరు నామమాత్రంగానే ఉండింది. కాలక్రమేణా కొత్త ‘భారత విజయ గాథ’ పుట్టుకొచ్చింది.1970ల మధ్యకాలం వరకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కంటే భారత్ చాలా నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. వరుస యుద్ధాలు, దిగుబడిలేని పంటలు, క్షామం, వేదనాభరితమైన రూపాయి క్షీణతతో పాటు రెండు చమురు షాక్‌ల రూపంలో దాదాపు 15 ఏళ్ల సంక్షో భాలను ఎదుర్కొన్న తర్వాత మార్పు మొదలైంది. నెహ్రూ హయాంలోని ప్రారంభ ఆశావాదం తర్వాత జరిగిన ఈ సంఘటనలు చాలా వరకు జాతి తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేశాయి.ఆర్థిక వ్యవస్థ స్థిరీకరించబడిన తర్వాత, అర్ధ శతాబ్దపు స్థిరమైన పనితీరు నమోదైంది. తక్కువ ఆదాయం, మధ్య ఆదాయం కలిగిన దేశాలతో పాటు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా మన వృద్ధి రేటు అధిగమించింది. పర్యవసానంగా దేశం మునుపెన్నడూ ఆస్వాదించని అంతర్జాతీయ స్థాయిని నేడు కలిగి ఉంది. అయినప్పటికీ, కొన సాగుతున్న పేలవమైన సామాజిక ఆర్థిక కొలమానాలు, పెరుగుతున్న అసమానత కారణంగా మన వృద్ధి రేటు ‘ఆశాజనకమైన’ రికార్డుగా అయితే లేదు.ఆర్థిక పరివర్తనకు ముందు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా క్షీణిస్తూ ఉండేది. 1960లో 2.7 శాతం నుండి 1975లో 1.9 శాతానికి మన వృద్ధి క్షీణత మందగించింది. 2013లో కూడా, ప్రపంచ జీడీపీలో భారత్ వాటా 1960 నాటి కంటే కొంచెం తక్కువగా ఉంది. ఇప్పుడు 2024లో ఇది 3.5 శాతం. పైగా ఆర్థిక వ్యవస్థ ప్రపంచ సగటు కంటే రెండింతలు వృద్ధి చెందుతున్నందున, ప్రపంచ వృద్ధికి భారత్ మూడవ అతిపెద్ద దోహదకారిగా ఉంటోంది.తలసరి ఆదాయం కూడా అదేవిధంగా మెరుగుపడింది. 1960లో ప్రపంచ సగటులో 8.4 శాతంగా ఉన్న దేశ తలసరి ఆదాయం 1974లో 6.4 శాతానికి తగ్గింది. 2011లో ఈ సంఖ్యలు 13.5 శాతా నికి, 2023లో 18.1 శాతానికి మెరుగుపడ్డాయి. దాదాపు ఐదు దశాబ్దాల కాలంలో మూడు రెట్ల పెరుగుదల! అయినప్పటికీ చాలా దేశాల్లోని ప్రజలు మనకంటే మెరుగైన జీవన ప్రమాణాలను అనుభవిస్తున్నారు. ఆఫ్రికా బయటి దేశాల్లో, మన పొరుగు దక్షిణాసియా దేశాల్లో తలసరి ఆదాయం ఇంత తక్కువగా ఉన్నవి పెద్దగా లేవు. అంటే, మనం ప్రయాణించవలసింది ఇంకా ఎంతో ఉంది.భారతదేశ కథను మార్చేది దాని జనాభా పరిమాణమే. తలసరి ఆదాయం తక్కువగా ఉంది. కానీ 140 కోట్లసార్లు గుణిస్తే అది భారత ఆర్థిక వ్యవస్థను ఐదవ అతిపెద్దదిగా చేస్తుంది. ఇప్పటికే, భారత్ మొబైల్ ఫోన్లు, మోటార్ సైకిళ్లు, స్కూటర్లకు రెండవ అతిపెద్ద మార్కెట్. విమానయానం, కార్లకు మూడవ లేదా నాల్గవ అతిపెద్ద మార్కెట్. ఈ ఉత్పత్తులు, సేవా మార్కెట్లలో వృద్ధికి, పెరుగు తున్న మధ్యతరగతి కారణమవుతోంది. ఇది ‘డాలర్–బిలియనీర్ల’ పెరుగుదలకు దారితీసింది (200 బిలియనీర్లు. ప్రపంచంలో మూడో స్థానం). మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా భారత స్టాక్ మార్కెట్ నాల్గవ స్థానంలో ఉంది.1970ల మధ్యకాలం వరకు, దాదాపు సగం మంది దారిద్య్ర రేఖకు దిగువన నివసించారు. నేడు, అధికారికంగా 10 శాతం కంటే తక్కువ మంది పేదలు ఉన్నారు. భారత్‌ను ఇప్పుడు పేద ప్రజల దేశంగా కాకుండా అభివృద్ధి చెందుతున్న శక్తిగా అంతర్జాతీయంగా ప్రస్తావిస్తున్నారు. అయినప్పటికీ, వియత్నాం వంటి దేశాలు ‘అధిక అభివృద్ధి’ హోదాను పొందగా, భారత్ తన మానవాభివృద్ధిలో ‘మధ్యస్థ అభివృద్ధి’ దేశంగా మాత్రమే కొనసాగుతోంది. మరో దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ కాలం వరకు ‘అధిక అభివృద్ధి’ విభాగంలో చేరే అవకాశం లేదు. దీనికి మించి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో కూడిన ‘అత్యున్నత అభివృద్ధి’ విభాగం ఉంది. ఇందులోకి చేరాలన్నది ప్రస్తుతం దేశ ఆకాంక్ష.దేశంలో పాఠశాల విద్య సగటు సంవత్సరాలు 2010లో ఉన్న 4.4 ఏళ్ల నుండి ఇప్పుడు 6.57 ఏళ్లకు మెరుగైనాయి. 1,000 జనాభాకు ఒక వైద్యుడు ఉంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన నిష్పత్తి కంటే ఇది ఎక్కువ. దేశ ప్రజల ఆయుర్దాయం 70 సంవత్సరాల పరిమితిని కూడా దాటేసింది. అధిక ఆదాయాలు వైవిధ్యమైన, సమృద్ధికరమైన ఆహారంలో ప్రతిబింబిస్తాయి. పాల వినియోగం 10 రెట్లు పెరిగింది. చేపల వినియోగం కూడా అలాగే ఉంది. గుడ్ల వినియోగం 20 రెట్లు పెరిగింది. వీటన్నింటి కంటే ముఖ్యమైనది మనస్తత్వంలో మార్పు. 1970ల మధ్య వరకూ భారత్ సామ్యవాద భావజాలానికి కట్టుబడి ఉంది. అనేక పరిశ్రమలను పెద్ద ఎత్తున జాతీయం చేయడమే కాకుండా, కాగితం నుండి ఉక్కు వరకు, చక్కెర నుండి సిమెంట్ వరకు, ఆఖరికి స్నానం సబ్బుల నుండి కార్ల వరకు ప్రతిదానిపై ధర, ఉత్పత్తి నియంత్రణ ఉండేది! దీని అనివార్య ఫలితం ఏమిటంటే కొరత, బ్లాక్ మార్కెట్లు. పారిశ్రామిక వివాదాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికసంఘాల పక్షం వహించడం పరిపాటిగా ఉండేది. కానీ పరిస్థితులు మారాయి. కమ్యూనిస్ట్ పార్టీలు ఐసీయూలో ఉన్నాయి. పైగా వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వాలు ఇప్పుడు కార్మిక చట్టాలను మార్చాలనుకుంటున్నాయి. పన్ను రేట్లు సహేతుకంగా మారాయి.భారతీయులు ఇప్పుడు ఉత్సాహవంతులైన షేర్ మార్కెట్ పెట్టుబడిదారులుగా మారారు. 1974లో షేర్ల అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ విలువ రూ. 12 కోట్లు (నేటి డబ్బులో దాదాపు రూ. 350 కోట్లు). దీనితో పోల్చితే, గత రెండేళ్లలో అనేక కంపెనీలు రూ. 15,000 –21,000 కోట్ల విలువైన పబ్లిక్ ఇష్యూలు జారీ చేశాయి (ఎల్ఐసీ, అదానీ, వోడాఫోన్ మొదలైనవి). ఒక దశాబ్దం క్రితం వరకు, మ్యూచు వల్ ఫండ్ కంపెనీలు బ్యాంకు డిపాజిట్లలో ఎనిమిదో వంతు కంటే తక్కువ మొత్తాలను నిర్వహించాయి; ఆ షేర్ రెండింతలు పెరిగి ఇప్పుడు పావు వంతు కంటే ఎక్కువకు చేరుకుంది. వచ్చే ఐదేళ్లలో భారతదేశం తన జీడీపీకి గత పదేళ్లలో చేసిన దానికంటే, మరింత ఎక్కువ జోడిస్తుంది.భారత్ సాధించిన ఈ విజయగాథకు వ్యతిరేక కథనం కూడా తక్కువేమీ లేదు. ఏడేళ్ల క్రితంతో పోలిస్తే వినియోగ సరుకుల ఉత్పత్తి ఏమాత్రం పెరగలేదు. నిల్వ ఉండని సరుకుల ఉత్పత్తి వార్షిక సగటు కేవలం 2.8 శాతమే పెరిగింది. దీనివల్ల స్పష్టంగానే, వినియోగ దారులు ఆర్థికంగా ఒత్తిడికి గురవుతారు. ఆదాయ నిచ్చెన దిగువ ఉన్నవారికి మంచి వేతనాలతో కూడిన పని లేకపోవడాన్ని ఇది సూచిస్తుంది. ఇది మారినప్పుడు మాత్రమే ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7–ప్లస్ శాతానికి చేరుకోగలుగుతుంది. అప్పుడే నిజంగా అధికంగా వృద్ధి సాధించిన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా గుర్తించబడుతుంది.టి.ఎన్. నైనన్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
జగన్ పాలనలో జనం హ్యాపీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరుగుదలే ఇందుకు నిదర్శనం. రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయనడానికి, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందనడానికి తలసరి ఆదాయమే కొలమానం. చంద్రబాబు ఐదేళ్ల పాలనలోకన్నా గత ఐదేళ్ల సీఎం జగన్ పాలనలో తలసరి ఆదాయం పెరుగుదల ఎక్కువగా ఉంది. రెండేళ్లు కోవిడ్ సంక్షోభం నెలకొన్నప్పటికీ, దాన్ని అధిగమించి వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.88,448 పెరిగింది. కోవిడ్ సంక్షోభం లేకపోయినప్పటికీ చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదల రూ.60,128 మాత్రమే. చంద్రబాబు ప్రభుత్వం చివరి ఏడాది 2018–19 లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,031 మాత్రమే ఉండగా, సీఎం జగన్ పాలనలో 2023–24 ఆర్థిక సంవత్సరానికి రూ.2,42,479కి పెరిగింది. అంతేకాకుండా 2019–20 నుంచి 2023–24 ఆర్థిక సంవత్సరం వరకు ఐదేళ్లలో జాతీయ సగటును మించి రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదల నమోదైంది. 2019–20లో దేశ జాతీయ సగటు తలసరి ఆదాయం రూ.1,34,432 ఉండగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,14,000కు చేరింది. ఇదే సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2019–20లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,60,341 ఉండగా 2023–24 నాటికి రూ.2,42,479 కు చేరింది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2018–19లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,031 తో దేశంలో 17వ స్థానంలో ఉంది. కోవిడ్ సంక్షోభం ఉన్నప్పటికీ 2019–20లో రాష్ట్ర తలసరి ఆదాయం వరుసగా పెరుగుతూ 2022–23 నా టికి దేశంలోనే 9వ స్థానంలో రాష్ట్రం నిలిచింది. తలసరి ఆదాయం అంటే.. తలసరి ఆదాయం అనేది రాష్ట్ర జనాభా ఆర్థిక శ్రేయస్సు ముఖ్యమైన సూచిక. ఇది వ్యక్తులు, కుటుంబాలపై ఆచరణాత్మక ప్రభావాలను కలిగి ఉంటుంది. తలసరి ఆదాయం అంటే సాధారణంగా ప్రజలు వస్తువులు, సేవలపై ఖర్చు చేయడానికి డబ్బుని కలిగి ఉండటం. ఇది వారి జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. విద్య, ఆరోగ్య సంరక్షణ, ఇతర అవసరాలను తీర్చడంలో ముఖ్యమైన అంశంగా ఉంటుంది. ఏదైనా రాష్ట్రం, ఆ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి కొలమానం తలసరి ఆదాయమే. జగన్ సర్కారు కోవిడ్ సంక్షోభాన్ని అధిగమించిందిలా.. రెండేళ్ల పాటు కోవిడ్ సంక్షోభంతో రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోయినప్పటికీ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాల పథకాలను యథాతథంగా అమలు చేసింది. ఈ సమయంలో ప్రజల చేతుల్లో డబ్బులు ఉంటేనే ఆర్థిక రంగానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పథకాల ద్వారా లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ చేసింది. జీవనోపాధి కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకొంది. వ్యవసాయంతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, అభివృద్ధి కార్యకలాపాలు నిలిచిపోకుండా చర్యలు తీసుకుంది. ప్రజల ఆదాయ మార్గాలను పెంచేందుకు అన్ని రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు సజావుగా సాగే వాతావరణాన్ని కలి్పంచింది. ఫలితంగా కోవిడ్ సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది. రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదల ఎక్కువగా నమోదైంది. -
పట్టణ తలసరి వ్యయంలో తెలంగాణ టాప్
సాక్షి, హైదరాబాద్: సగటు భారతీయుడి నెలవారీ ఖర్చు పట్టణాల్లో రూ.6,459 ఉంటే, అదే గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి రూ.3,773గా ఉన్నట్లు ఓ నివేదిక తేల్చింది. పట్టణ ప్రాంతాల్లో ఆహారేతర నెలవారీ ఖర్చు రూ.3,929 కాగా ఆహారానికి సంబంధించి రూ.2,530 వ్యయం చేస్తున్నట్లు తెలిపింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఆహారేతర ఖర్చు నెలకు రూ.2,023 కాగా ఆహారానికి రూ. 1,750 వ్యయం చేస్తున్నారు. పెద్ద రాష్ట్రాల్లో సగటు పట్టణ నెలవారీ తలసరి వ్యయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. నిత్యావసరాల ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సగటు భారతీయుడి నెలవారీ ఖర్చులు ఎలా ఉంటాయి? వేటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు? పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యయాల తీరు ఎలా ఉంటుంది? ఇవన్నీ అందరికీ ఆసక్తిని కలిగించే అంశాలే. ఈ నేపథ్యంలోనే..‘హౌస్‌హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ (గృహావసరాల వినియోగ ఖర్చు) (మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్–ఎంపీసీఈ (నెలవారీ తలసరి ఖర్చు) సర్వే 2022–23’పేరిట కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఓ సర్వే నిర్వహించింది. గతంలో కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే పేరిట ప్రతి ఐదేళ్లకు సర్వే నిర్వహిస్తుండగా, చివరగా 2011–12లో దీనిని నిర్వహించారు. ఇప్పుడు పదేళ్ల తర్వాత తాజా సర్వే నిర్వహించారు. అయితే సర్వేకు అనుసరించిన విధానం (మెథడాలజీ)లో మార్పుల కారణంగా గతంలో నిర్వహించిన అధ్యయనాలతో దీనిని పోల్చలేదని నేషనల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్ఎస్వో) తెలిపింది. కాగా ఇటీవల విడుదల చేసిన ఈ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ తర్వాత ఢిల్లీ, హిమాచల్ పెద్ద రాష్ట్రాల్లో సగటు పట్టణ నెలవారీ తలసరి వ్యయంలో రూ.8,251తో తెలంగాణ టాప్‌లో ఉండగా, ఢిల్లీ (రూ.8,250), హిమాచల్‌ప్రదేశ్ (రూ.8,083) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే మొత్తంగా చూస్తే చండీగఢ్ (రూ.12,577) మొదటి స్థానంలో ఉండగా, సిక్కిం (రూ.12,125), అండమా¯న్ అండ్ నికోబార్ (రూ.10,268), గోవా (రూ.8,761), అరుణాచల్ ప్రదేశ్ (రూ.8,649) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక పట్టణాల్లో శ్రీమంతులుగా ఉన్న టాప్ 5 శాతం మంది రూ.20,824 వ్యయం చేస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,501 ఖర్చు చేస్తున్నారు. మరోవైపు దిగువ స్థాయిలో ఉన్న 5 శాతం మంది పట్టణాల్లో రూ.2,001, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,373 ఖర్చు చేస్తున్నట్లు నివేదిక వివరించింది. -
భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే..
భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఏటా మన ఆర్థిక వ్యవస్థ 7-8శాతం వృద్ధి చెందాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ సి.రంగరాజన్ అన్నారు. అనుకున్న విధంగా అది అభివృద్ధి చెందితే తలసరి ఆదాయం 13000 డాలర్లకు (సుమారు రూ.10.80 లక్షలు) చేరుతుందని చెప్పారు. దాంతో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని భావించారు. సమాజంలో తీవ్ర ఆర్థిక అసమానతలున్నాయని, దాంతోపాటు పేదరికాన్ని తగ్గించేందుకు నూతన ఆవిష్కరణలు మాత్రమే పరిష్కారం కాదన్నారు. వృద్ధి రేటుతో పాటు సామాజిక భద్రత, సబ్సిడీల వంటివీ అవసరమని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే తలసరి ఆదాయం రూ.10.80లక్షలుగా ఉండాలన్నారు. అయితే ప్రస్తుతం మన తలసరి ఆదాయం రూ.2.25 లక్షలుగా ఉందన్నారు. ఇదీ చదవండి: ట్రాన్స్జెండర్లకు ప్రతిష్టాత్మక కంపెనీలో ఉద్యోగాలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి డాలర్ విలువ, ద్రవ్యోల్బణం, మారకపు రేటుపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ‘మారకపు విలువను తక్కువ స్థాయిలో ఉంచి, కరెన్సీ విలువ పెంచితే ఆదాయం పెరుగుతుంది. అప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు అవకాశం ఉంటుంది’ అన్నారు. -
పెరిగిన తలసరి ఆదాయం
సాక్షి, అమరావతి: గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరుగుతోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం జాతీయ సగటు తలసరి ఆదాయాన్ని మించి పెరిగింది. 2022–23లో జాతీయ తలసరి ఆదాయం కన్నా రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 47,518 ఎక్కువగా నమోదైంది. 2022–23లో జాతీయ సగటు తలసరి ఆదాయం రూ. 1,72,000 ఉండగా రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,19,518లకు చేరింది. అలాగే గత మూడేళ్లుగా ఆదాయపు పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో గత మూడు సంవత్సరాల్లో ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య 1.65 లక్షలకు పెరిగినట్లు ఇటీవల లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. 2020–21లో ఆదాయపు పన్ను చెల్లించిన వారి సంఖ్య 19.79 లక్షల ఉండగా 2022–23లో ఆదాయపు పన్ను చెల్లించిన వారి సంఖ్య 21.65 లక్షలకు పెరిగినట్లు పంకజ్ చౌదరి తెలిపారు. పన్ను లేకపోయినా ఐటీ రిటర్న్ దాఖలు చేస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. పైసా కూడా ఆదాయపు పన్ను చెల్లించని వారు 2020–21లో 12.55 లక్షల మంది ఐటీ రిటర్న్ దాఖలు చేస్తే, వారి సంఖ్య 2022–23లో 13.04 లక్షలకు పెరిగినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. భారీగా పెరిగిన ఐటీ రిటర్న్‌లు దేశంలో ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య గత మూడు సంవత్సరాల్లో భారీగా పెరిగినట్లు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. దేశం మొత్తం మీద 2020–21లో 6.72 కోట్ల మంది ఆదాయపు పన్ను చెల్లించగా 2022–23లో ఆ సంఖ్య 7.40 కోట్లకు పెరిగినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆదాయపు పన్ను చెల్లించని వారు కూడా ఐటీ రిటర్న్ దాఖలు చేయడం దేశవ్యాప్తంగా పెరుగుతోందని ఆయన తెలిపారు. 2020–21లో ఆదాయపు పన్ను చెల్లించని వారు 4.84 కోట్ల మంది ఐటీ రిటర్న్ దాఖలు చేస్తే 2022–23లో ఆ సంఖ్య 6.16 కోట్లకు పెరిగినట్లు కేంద్ర మంత్రి వివరించారు. దేశ సగటును మించి.. జాతీయ సగటు తలసరి ఆదాయాన్ని మించి రాష్ట్ర తలసరి ఆదాయంలో పెరుగుదల నమోదైంది. 2022–23లో జాతీయ సగటు తలసరి ఆదాయంలో పెరుగుదల రూ. 23,476 ఉండగా.. అదే ఏపీలో రూ. 26,931లకు పెరిగింది. దీంతో దేశ, రాష్ట్ర తలసరి ఆదాయం మధ్య వ్యత్యాసం 2022–23లో రూ. 47,518గా నమోదైంది. కోవిడ్ సమయంలో కూడా రాష్ట్ర తలసరి ఆదాయం పెరగడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలే అని నిపుణులు చెబుతున్నారు. ప్రజలకు డబ్బులిస్తేనే ఆర్థిక రంగానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల ద్వారా లబి్ధదారులకు నేరుగా నగదు బదిలీ చేసింది. టీడీపీ హయాంలో 2018–19లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,54,031తో దేశంలో 17వ స్థానంలో ఉన్న రాష్ట్రం.. 2022–23 నాటికి రూ. 2,19,518తో 9వ స్థానంలో నిలిచింది. -
సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ ఏపీ టాప్: విజయసాయిరెడ్డి
సాక్షి, పల్నాడు జిల్లా: ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఏం చేశామో చెప్పేందుకే సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర చేస్తున్నామని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. యాత్ర సందర్భంగా శుక్రవారం మాచర్ల నియోజకవర్గం రెంటచింతలలో ఆయన పార్టీ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ తో సమావేశమయ్యారు. 2019 మాదిరిగానే 2024లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ ఇచ్చామని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందనేది అవాస్తవమన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలవి తప్పుడు ఆరోపణలని దుయ్యబట్టారు. సీఎం జగన్ పాలనలో ఏపీ ప్రజల తలసరి ఆదాయం పెరిగిందన్నారు. సీఎం జగన్ విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఫిషింగ్ హార్బర్స్, పోర్టులు నిర్మిస్తున్నామని, అభివృద్ధి విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. రాషష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో బస్సుయాత్ర జరుగుతుందని తెలిపారు. మాచర్ల నియోజకవర్గానికి ఈ నాలుగున్నరేళ్లలో డీబీటీ ద్వారా రూ. 890కోట్లు , రూ. 300 కోట్లు నాన్ డీబీటీ ద్వారా ఖర్చు చేశామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ఇదే మీటింగ్‌లో పాల్గొన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. నాలుగున్నరేళ్ళ పాలనలో ఒకటి, అర లోపాలు ఉంటే ఉండవచ్చన్నారు. ఉన్నది లేనట్టు అబద్ధాలు ప్రచారం చేయాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం చేసిందే చెప్పండని ఇన్ఫ్లూయెన్సర్లకు సూచించారు. -
తలసరి విద్యుత్‌లో తెలంగాణ నెంబర్ 1.. అసలు నిజం ఇదే!
సాక్షి, హైదరాబాద్: దేశమైనా, రాష్ట్రమైనా ప్రగతిపథంలో ఉందని చెప్పడానికి తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగాన్ని ప్రామాణిక సూచికగా తీసుకుంటారు. అయితే ఈ రెండింటిలోనూ తెలంగాణ దేశంలో నంబర్ 1 స్థానంలో నిలిచింది. రూ.3,12,398 తలసరి ఆదాయంతో, 2,126 యూనిట్ల తలసరి విద్యుత్ వినియోగంతో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది..’అని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు మంగళవారం గోల్కొండ కోట సాక్షిగా చేసిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగానూ సీఎం ఇదే ప్రకటన చేశారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నిజంగానే దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని కేంద్రం స్వయంగా పార్లమెంట్లో ప్రకటించింది. అయితే, తలసరి విద్యుత్ వినియోగంలో మాత్రం తెలంగాణ అగ్రస్థానంలో లేదు. 2126 యూనిట్ల తలసరి విద్యుత్ వినియోగంతో మనరాష్ట్రం జాతీయస్థాయిలో 10వ స్థానంలో ఉంది. గత ఫిబ్రవరి 17న సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ(సీఈఏ) ప్రకటించిన ‘అఖిల భారత విద్యుత్ గణాంకాలు–2022’ నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. దేశంలోని మొత్తం 37 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని 2020–21 వార్షిక విద్యుత్ సరఫరా గణాంకాల ఆధారంగా సీఈఏ తాజా నివేదిక ప్రకటించింది. జాతీయస్థాయిలో ఏటా వార్షిక విద్యుత్ గణాంకాలను సీఈఏ ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నా తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగంలో ఏడో స్థానంలో ఉందని సీఈఏ నివేదిక పేర్కొంటోంది. తప్పుదోవ పట్టిస్తున్న అధికారులు..? తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో చేసిన ప్రసంగంలో సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం ప్రసంగం కోసం సీఎంఓ ఎప్పటికప్పుడు అన్ని శాఖల నుంచి సమాచారం సేకరిస్తుండగా, అధికారులు తప్పుడు వివరాలు అందించి తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శలున్నాయి. వ్యవసాయ విద్యుత్‌లో రాష్ట్రం అగ్రస్థానం ► రాష్ట్రాల్లో వివిధ కేటగిరీల వారీగా తలసరి విద్యుత్ వినియోగాన్ని పరిశీలిస్తే.. 592.24 యూనిట్ల తలసరి వ్యవసాయ విద్యుత్ వినియోగంతో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ►గృహ కేటగిరీలో 813.94 యూనిట్ల తలసరి వినియోగంతో గోవా అగ్రస్థానంలో ఉండగా, 340.62 యూనిట్లతో తెలంగాణ 5వ స్థానంలో ఉంది. ►వాణిజ్య కేటగిరీలో 273.11 యూనిట్ల వినియోగంతో గోవా అగ్రస్థానంలో, 128.81 యూనిట్ల వినియోగంతో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ►హెచ్‌టీ కేటగిరీలో పారిశ్రామిక విద్యుత్ వినియోగంలో 1163.99 యూనిట్ల వినియోగంతో గోవా ప్రథమ స్థానంలో ఉండగా, తెలంగాణ 299.19 యూనిట్ల వినియోగంతో పదోస్థానంలో ఉంది. -
పడుతూ లేస్తూ.. పైపెకి!... ఒడిదొడుకుల మధ్య ఆర్థికాభివృద్ధి
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పదేళ్లలో ఎంతో అభివృద్ధిని సాధించినట్లు రాష్ట్ర ప్ర భుత్వం ప్రకటించింది. అనేక సవాళ్లను అధిగమించి వివిధ రంగాల్లో గణనీయ ప్రగతిని సాధించడం వెనుక జిల్లాల విభజన, జిల్లాలు సాధించిన జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ), తలసరి ఆదాయం (పీసీఐ)కారణంగా పేర్కొంది. రాష్ట్రం ఏర్పడక ముందు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల (బీఆర్జీఎఫ్)కింద ఉన్న తొమ్మిది జిల్లాల్లో ఉమ్మడి వరంగల్ ఒకటి కాగా.. ఆతర్వాత అభివృద్ధిలో అన్ని రంగాల్లో పురోగతి సాధించింది. పదేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో సాధించిన ప్రగతి సూచికలో ఉమ్మ డి వరంగల్ జిల్లా భాగస్వామ్యం కూడా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ ఆర్థికాభివృద్ధి–10’ నివేదికలో వెల్లడించింది. ఆర్థిక వృద్ధి రేటులో హనుమకొండ టాప్–2 ఉమ్మడి వరంగల్‌లో ఆరు జిల్లాలు ఉండగా.. 2021–22 సంవత్సరానికి ఆర్థిక వృద్ధిలో హనుమకొండ జిల్లా టాప్–2లో నిలిచినట్లు నివేదిక స్పష్టం చేసింది. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ ఉత్తమ పనితీరు కనబర్చాయి. ప్రస్తుత ధరల ప్రకారం.. వరుసగా 34.2 శాతం, 24.9 శాతం వృద్ధి రేటుతో ఈరెండు జిల్లాలు ఉన్నాయి. వీటితో పాటు రాష్ట్రంలోని 32 జిల్లాలు వృద్ధి రేటులో పురోగమించగా.. రూ.6,240 కోట్ల జీడీపీపీతో అన్నింటికన్నా చివరన ములుగు జిల్లా నిలిచింది. జిల్లాల ఆర్థికాభివృద్ధికి సూచికగా జీడీడీపీని పరిగణించగా.. అభివృద్ధి అంతా హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే కేంద్రీకృతం కాగా.. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో కొద్దిగా మెరుగ్గా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. గ్రేటర్ వరంగల్ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి కారణంగా.. ఆర్థిక వృద్ధిలో టాప్–2లో నిలిచినట్లు నివేదిక చెబుతోంది. భూపాలపల్లి భేష్ 2021–22లో రంగారెడ్డి జిల్లా రూ.7,58,102 తలసరి ఆదాయంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవగా..రూ.2,34,818తో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎనిమిదో స్థానంలో నిలిచింది.వరంగల్ జిల్లా రూ.1,94,317తో 16వ స్థానం, రూ.1,86,278తో జనగామ 18, రూ.1,79,222లతో మహబూబాబాద్ 20, రూ.1,77,316తో ములుగు 21వ స్థానాల్లో నిలవగా.. హనుమకొండ రూ.1,56,086తో చివరి స్థానానికి చేరింది. బాగా పట్టణీకరణ జరిగిన జిల్లాలతో పోల్చితే.. మారుమూల గ్రామీణ జిల్లాలు తలసరి ఆదాయంలో వెనుకబడి ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. హనుమకొండ జిల్లా కూడా తలసరి ఆదాయంలో వెనుకబడగా.. భూపాలపల్లి మినహా మిగతా జిల్లాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తలసరి ఆదాయం విషయంలో పదేళ్లలో వృద్ధిరేటు గణనీయంగానే పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆయా జిల్లాల ప్రజల సగటు ఆదాయం పెరుగుతూ వస్తోంది. హనుమకొండ జిల్లాలో 2015–16 సంవత్సరానికి తలసరి సగటు ఆదాయం రూ.77,378 ఉండగా.. అది కాస్తా.. 2021–22 నాటికి రూ.1,56,086కు పెరిగింది. వరంగల్ రూరల్, మహబూబాబాద్, ములుగు, జనగామ, జేఎస్ భూపాలపల్లిలోనూ తలసరి సగటు ఆదాయం పెరిగినట్లు నివేదికలో గణాంకాలు చెబుతున్నాయి. -
3 జిల్లాలు = 30 జిల్లాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా.. ఆర్థికాభివృద్ధిలో కేవలం మూడు జిల్లాలకే 43.72 శాతం వాటా ఉంది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పట్టణీకరణ ఎక్కువగా ఉన్న రంగారెడ్డి జిల్లా రూ.2,26,957 కోట్లు, హైదరాబాద్ జిల్లా రూ.1,86,225 కోట్లు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రూ.73,132 కోట్ల స్థూల జిల్లా దేశీయోత్పత్తి (జీడీడీపీ)ని సాధించి.. ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచాయి. రాష్ట్రంలోని మిగతా 30 జిల్లాలు కలిపి వాటా 56.28 శాతమే కావడం గమనార్హం. ములుగు జిల్లా రూ.6,240 కోట్ల జీడీడీపీతో అన్నింటికన్నా చివరన నిలిచింది. ‘తెలంగాణ ఆర్థికాభివృద్ధి ః 10’ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. జిల్లాల ఆర్థికాభివృద్ధికి సూచికగా జీడీడీపీని పరిగణిస్తుంటారు. అభివృద్ధి అంతా హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే కేంద్రీకృతమైందని.. జిల్లాల మధ్య సమతుల్యత లోపించినట్టుగా ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. జిల్లాల మధ్య అసమతుల్యతను తొలగించేందుకు అమలు చేయాల్సిన విధానాలు, పాలనాపర నిర్ణయాలు, ప్రణాళికల రూపకల్పనలో జీడీడీపీని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. – జీడీడీపీకి సంబంధించి.. భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, మహబూబ్‌నగర్ జిల్లాలు వరుసగా 34.2శాతం, 24.9శాతం. 24.9శాతం వృద్ధి రేటును సాధించి టాప్‌లో నిలిచాయి. రాష్ట్రంలోని 32 జిల్లాలు వృద్ధిరేటులో పురోగమించగా.. ఒక జిల్లా మాత్రం వృద్ధి రేటులో తిరోగమనంలో ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. తలసరి ఆదాయంలో రంగారెడ్డి టాప్ రంగారెడ్డి జిల్లా రూ.7,58,102 తలసరి ఆదాయంతో 2021–22లో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. దేశ సగటు తలసరి ఆదాయంతో పోల్చితే ఇది 5.1 రెట్లు అధికం. హైదరాబాద్ జిల్లా రూ.4,02,941తో, సంగారెడ్డి జిల్లా రూ.3,01,870తో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. వికారాబాద్ జిల్లా రూ.1,54,509 తలసరి ఆదాయంతో అట్టడుగున నిలిచింది. బాగా పట్టణీకరణ జరిగిన జిల్లాలతో పోల్చితే.. మారుమూల గ్రామీణ జిల్లాలు తలసరి ఆదాయంలో వెనుకబడి ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక తలసరి ఆదాయంలో రాష్ట్రంలోని 32 జిల్లాలు రెండంకెల వృద్ధి రేటు నమోదు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నివేదికలో తెలిపింది. -
దేశానికే ఆదర్శంగా తెలంగాణ మోడల్
రాయదుర్గం (హైదరాబాద్): తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శంగా మారిందని, సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య మోడల్ ఎంతో గుర్తింపు సాధించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు పారిశ్రామిక ప్రగతితో పాటు ఆర్థిక, సామాజిక ప్రగతిని సమాంతరంగా ముందుకు తీసుకెళుతోందని పే ర్కొన్నారు. ఐటీ రంగం నుంచి మొదలుకుని వ్యవసాయం రంగం దాకా అన్ని రంగాల్లోనూ తెలంగాణ తన ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తోందని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా పేద, మధ్య తరగతి, ధనిక వర్గాలు అనే వ్యత్యాసం లేకుండా అందరి ప్రగతికీ ప్రభుత్వం పాటుపడుతోందని అన్నారు. మంగళవారం హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీ హబ్ ప్రాంగణంలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో కేటీఆర్ మాట్లాడారు. భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణ రాష్ట్రంలో ఉందని, ప్రస్తుతం మూడు లక్షల 17 వేల రూపాయల తలసరి ఆదాయం కలిగి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి చెప్పారు. రాష్ట్ర జీఎస్డీపీ 2014లో రూ.5 లక్షల కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ.13.27 లక్షల కోట్లకు చేరిందన్నారు. 2014లో జరిగిన సమావేశంలో ఇన్నోవేషన్ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పామని, ఆ మాట మేరకు ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద టీ హబ్, టీవర్క్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్..: ప్రపంచ దేశాలతో పోటీ పడి పెట్టుబడులు రప్పించాలంటే భారీ ఎత్తున మౌలిక వసతుల కల్పన చేపట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం తగిన ప్రణాళికలు రూపొందించిందని కేటీఆర్ చెప్పారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుతో పాటు ప్రపంచంలోనే ఏకైక అతిపెద్ద ఫార్మా క్లస్టర్.. హైదరాబాద్ ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైసెస్ పార్కును సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేశామని, ప్రపంచంలోనే అతిపెద్ద స్టెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ తయారీ యూనిట్ కూడా తెలంగాణలోనే ఉందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్‌గా మారిందన్నారు. వచ్చే సంవత్సరం నాటికి ప్రపంచంలో సగానికి పైగా వ్యాక్సిన్లు హైద రాబాద్ నగరంలోనే తయారు అవుతాయన్నారు. పారిశ్రామిక ప్రగతితో ఆర్థిక వ్యవస్థ బలోపేతం రాష్ట్రంలో సాధించిన పారిశ్రామిక ప్రగతి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, రియల్ ఎస్టేట్ వంటి ఇతర రంగాల బలోపేతానికి దోహదం చేసిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలోని చిన్న రాష్ట్రం ప్ర పంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (కాళేశ్వరం)ను నిర్మించిందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తోందని చెప్పా రు. రాష్ట్ర ప్రజలు 2014లో ఉన్న పరిస్థితులు, ప్రస్తు తం ఉన్న రాష్ట్ర ప్రగతిని బేరీజు వేసుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, పారిశ్రామిక రంగానికి చెందినవారు పాల్గొన్నారు. -
మున్సిపాల్టీల్లో తల‘సిరి’ తక్కువే
సాక్షి, అమరావతి: దేశంలో 15 రాష్ట్రాల్లోని మున్సిపాలిటీల మొత్తం ఆదాయంలో తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉందని నీతి ఆయోగ్ అధ్యయన నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం మున్సిపాలిటీల జాతీయ సగటు తలసరి ఆదాయం రూ.4,624 కాగా.. 15 రాష్ట్రాల్లో ఈ సగటు ఇంకా తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. పట్టణ జనాభా పెరుగుతున్నప్పటికీ జీడీపీలో మున్సిపాలిటీల వ్యయం 0.44 శాతం నుంచి 0.37 శాతానికి తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. మున్సిపాలిటీల ఆర్థిక పరిస్థితులు, అకౌంటింగ్ విధానంపైనా నీతి ఆయోగ్ నివేదికను విడుదల చేసింది. ఇందులో దేశవ్యాప్తంగా మున్సిపాలిటీల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంతో పాటు పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక, పరిపాలన సంస్కరణలు చేపట్టాలని పేర్కొంది. ఏపీలో స్థానిక సంస్థలకు 16 అంశాలు బదిలీ 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ స్థానిక సంస్థలకు 18 అంశాలను బదిలీ చేయాల్సి ఉన్నప్పటికీ కేవలం ఆరు రాష్ట్రాలు మాత్రమే 18 అంశాలను బదిలీ చేశాయని, ఆంధ్రప్రదేశ్ 16 అంశాలను బదిలీ చేసిందని నివేదిక వెల్లడించింది. అలాగే, పట్టణ స్థానిక సంస్థల్లో ఏటా తప్పనిసరిగా అకౌంటింగ్ విధానం ఉండాలని నివేదిక సూచించింది. అలాగే, నీతి ఆయోగ్ ఇంకా ఏం సూచించిందంటే.. ► రాష్ట్రాల తరహాలోనే పట్టణ స్థానిక సంస్థల్లోనూ ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టం అమలుచేయాలి. ► పట్టణ స్థానిక సంస్థలు సొంత ఆదాయ వనరులను పెంచుకోవడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. ► దేశంలో 223 క్రెడిట్ రేటింగ్‌లు ఇస్తే కేవలం 95 పట్టణ స్థానిక సంస్థలకే పెట్టుబడి రేటింగ్ ఉంది. ఇందులో కేవలం 41 మున్సిపాలిటీలే బాండ్ల ద్వారా రూ.5,459 కోట్ల నిధులు సమీకరించాయి. ► 2036 నాటికి పెరిగే జనాభాలో 73 శాతం పట్టణాల్లోనే ఉంటుందని, అందుకనుగుణంగా మౌలిక వసతుల కోసం అవసరమైన నిధుల సమీకరణకు మున్సిపల్ బాండ్ల జారీతో పాటు ఇతర మార్గాలను అనుసరించాలి. ఇందుకోసం మున్సిపాలిటీల సొంత ఆదాయాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు క్రెడిట్ రేటింగ్ సాధ్యమవుతుంది. ► స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరులైన ఆస్తి పన్ను, వినియోగ రుసుం చాలా తక్కువగా వస్తున్నాయి. అయితే, దేశ జీడీపీలో మున్సిపాలిటీల ఆస్తి పన్ను కేవలం 0.2 శాతమే ఉంది. ► మున్సిపాలిటీలు ఎక్కువగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బదిలీచేసే నిధులపైనే ఆధారపడుతున్నాయి. ► మెరుగైన మున్సిపల్ పాలన కోసం ఆర్థిక సంస్కరణలు చేపట్టాలి. ► మున్సిపల్ అకౌంటింగ్ రికార్డులు, వార్షిక ఖాతాలు కచ్చితత్వంతో ఉండాలి. ► వాస్తవ ఆదాయం, వ్యయంతోనే అకౌంటింగ్ ఉండాలి తప్ప ఇంకా రాని ఆదాయం, చేయని వ్యయాలను అకౌంటింగ్లో ఉండకూడదు. ► ఏటా ఆదాయంలో 5 శాతం నగదు నిల్వ ఉండేలా చూసుకోవాలి. ► రుణ స్థాయిలో చట్టబద్ధమైన సీలింగ్‌ను విధించుకోవాలి. ► జీతం, పెన్షన్ వ్యయాలను 49 శాతానికి పరిమితం చేయాలి. ► 51 శాతం ఆస్తుల సృష్టి, రుణ సేవలు, పెట్టుబడికి వ్యయం చేయాలి. ► క్రెడిట్ రేటింగ్‌తో బాండ్ల జారీని ప్రోత్సహించాలి. ► ఫలితాల ఆధారిత బడ్జెట్‌ను రూపొందించుకోవాలి. ► ఆదాయ అంచనాలు సగటు వార్షిక వృద్ధి కంటే ఎక్కువగా ఉండకూడదు. ► స్థానిక సంస్థలు ఆర్థిక డేటాబేస్‌ను ఏర్పాటుచేయాలి. ► సొంత పన్నులు, కేంద్ర.. రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయం, వ్యయంతో పాటు అన్ని వివరాలు పౌరులకు ప్రదర్శించాలి. -
ముంబై, బెంగళూరులను మించిపోయిన రంగారెడ్డి జిల్లా
నల్లగొండ జిల్లా కట్టంగూరుకు చెందిన యాదగిరి ఉన్న ఊర్లో ఉపాధి కరువై బతుకుదెరువు కోసం ఐదేళ్ల క్రితం కుటుంబంతో సహా శేరిలింగంపల్లికి చేరుకున్నాడు. ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మన్‌గా చేరాడు. భార్య అదే అపార్ట్మెంట్లోని ఫ్లాట్లలో పనికి కుదిరింది. యాదగిరి నెలకు రూ.15 వేలు వేతనం, భార్యకు ఒక్కో ఫ్లాట్ నుంచి రూ.2,500 చొప్పున పది ఫ్లాట్ల నుంచి రూ.25 వేలు వస్తున్నాయి. ఇంటి యజమానులు ప్రేమగా పెంచుకుంటున్న కుక్కలను ఉదయం, సాయంత్రం బయట తిప్పినందుకు రూ.5 వేలు, వారి వ్యక్తిగత వాహనాలను శుభ్రం చేసినందుకు నెలకు రూ.500–700 చొప్పున సంపాదిస్తున్నారు. ఇలా ఈ జంట సగటున రూ.50 వేలకుపైగా సంపాదిస్తోంది. ఐటీ అనుబంధ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ ఏజెంటుగా మారిన ఒకప్పటి నిరుద్యోగి ప్రస్తుతం నెలకు రూ.లక్షకుపైగా సంపాదిస్తుండటం విశేషం. సాక్షి, రంగారెడ్డిజిల్లా: సగటు వార్షిక ఆదాయంలో రంగారెడ్డి జిల్లా దేశ ఆర్థిక రాజధాని ముంబైని మించిపోయింది. ముంబై వాసి వార్షికాదాయం రూ.6.43 లక్షలు ఉండగా, ఈ జిల్లా సగటు వ్యక్తి ఆదాయం రూ.6.59 లక్షలు ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం (టీఎస్‌డీపీఎస్) తాజా నివేదికలో వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు, అహ్మదాబాద్, కోయంబత్తూరు, ఎర్నాకులం ఉన్నాయి. హైదరాబాద్ రూ.3.51 లక్షలు, మేడ్చల్ రూ.2.40 లక్షలు, వికారాబాద్ రూ.1.32 లక్షలుగా నమోదయ్యాయి. ఉపాధి అవకాశాలు.. రూ.లక్షల్లో వేతనాలు హైదరాబాద్ నగరంతో జిల్లా మిళితమై ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు నగరం చుట్టూ 158.50 కిలోమీటర్ల పొడవు ఎనిమిది లేన్ల ఔటర్ రింగ్ రోడ్డు ఉంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ విశాలమైన భూములు ఉండటం, తక్కువ వేతనాలకే కావాల్సిన మానవ వనరులు లభిస్తుండటంతో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ ప్రతిష్టాత్మాక గూగుల్, యాపిల్, ఫేస్బుక్, ట్విట్టర్, అమేజాన్, మహేంద్ర, ఇతర టెక్‌సంస్థలు కేంద్ర కార్యాలయాలు తెరిచాయి. సుమారు ఏడు లక్షల మంది ప్రత్యక్షంగా, మరో పది లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. వీరి నెలసరి వేతనాలు రూ.లక్షల్లో ఉండడంతో తమ ఆదాయాన్ని ఇళ్లు, భూములు, ఇతర ఆస్తుల కొనుగోలుకు వెచ్చిస్తున్నారు. ఫలితంగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అప్పటి వరకు ఆకుకూరలు, కాయగూరలు సాగు చేసుకుంటూ జీవనం సాగించిన రైతులు రాత్రికి రా త్రే కోటిశ్వరుల జాబితాలో చేరిపోయారు. చేతి నిండా డబ్బు ఉండటంతో ఖర్చుకు వెనకాడటం లేదు. నివాసయోగ్యమైన ప్రాంతం ఢిల్లీ, ముంబై, ఇతర మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే గ్రేటర్ జిల్లాలు జీవనయోగ్యమైన జాబితాలో ఇప్పటికే గుర్తింపు పొందాయి. ఇటు సమశీతోష్ణ పరంగానే కాకుండా అటు సురక్షితం కావడంతో కీలకమైన రక్షణ, ఎయిర్‌ఫోర్స్, మిలట్రీ శిక్షణ కేంద్రాలు, పరిశోధక కేంద్రాలు కొలువుదీరాయి. ప్రభుత్వం సిటిజన్ల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే పోలీస్ కంట్రోల్ టవర్లను నిర్మించి నిరంతర నిఘా ఏర్పాటు చేసింది. సిటీలోనే కాదు శివారు ప్రాంతాల్లోనూ చీమచిటుక్కుమన్నా ఇట్టే గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. నిరంతరాయ విద్యుత్ సరఫరా, కొత్త పారిశ్రామికవాడలు, టీఎస్ఐపాస్ ద్వారా పరిశ్రమలకు సత్వర అనుమతుల జారీ వంటి అంశాలు కూడా జిల్లావాసుల సగటు ఆదాయం పెరుగుదలకు దోహదపడుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (క్లిక్ చేయండి: మీరూ అవ్వొచ్చు ట్రాఫిక్ పోలీసు.. ఎలాగంటే!) -
తలసరి ఆదాయంలో భారత్‌ను మించనున్న బంగ్లా!
న్యూఢిల్లీ: తలసరి ఆదాయం విషయంలో 2020లో భారత్‌ను పొరుగున ఉన్న బంగ్లాదేశ్ మించిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేస్తోంది. ఒక దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువను ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం. ఐఎంఎఫ్ ‘‘వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్’’ నివేదిక ప్రకారం, 2021 మార్చి 31వ తేదీతో ముగిసే ఆర్థిక సంవత్సరంలో భారత్ తలసరి ఆదాయం 1,877 డాలర్లుగా (డాలర్ మారకంలో రూపాయి విలువ 70 ప్రకారం చూస్తే, రూ.1,31,390)నమోదుకానుంది. ఇక ఇదే కాలంలో బంగ్లాదేశ్ తలసరి ఆదాయం 1,888 డాలర్లకు పెరగనుంది. కరోనా సవాళ్ల నేపథ్యంలో భారత్ ఆర్థిక వ్యవస్థ 2020లో 10.3% క్షీణిస్తుందని ఐఎంఎఫ్ ఇదే నివేదికలో అంచనావేసింది. కొనుగోలు శక్తి ప్రమాణాల్లో భారత్‌దే పైచేయి! ఐఎంఎఫ్ అంచనాల ప్రభావాన్ని తగ్గించే గణాంకాలను అధికార వర్గాలు ప్రస్తావిస్తుండడం ఇక్కడ మరో అంశం. దేశాల ఉత్పాదకత, కరెన్సీల కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలకు సంబంధించిన పర్చేజింగ్ పవర్ ప్యారిటీ (పీపీపీ) విధానం ప్రకారం చూస్తే, భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2019లో బంగ్లాదేశ్‌కన్నా 11 రెట్లు అధికమని అధికార వర్గాలు బుధవారం పేర్కొన్నాయి. తలసరి ఆదాయంలో భారత్‌ను బంగ్లాదేశ్ అధిగమించనున్నదన్న ఐఎంఎఫ్ అంచనాలను ప్రస్తావిస్తూ, ‘‘ఆరు సంవత్సరాల్లో బీజేపీ పాలన సాధించిన ఘనత ఇదీ’ అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఒక ట్వీట్ నేపథ్యంలో అధికార వర్గాలు తాజా వివరణ ఇచ్చాయి. 2014– 15లో రూ.83,091గా ఉన్న భారత్ తలసరి ఆదా యం 2019–20లో రూ.1,08,620కి చేరిందని అధి కార వర్గాలు వివరించారు. పీపీపీ విధానం ప్రకారం, 2020లో భారత్ తలసరి ఆదాయం 6,284 డాలర్లు ఉంటుందని అంచనావేసిన ఐఎంఎఫ్, బంగ్లాదేశ్ విషయంలో దీన్ని 5,139 డాలర్లుగానే లెక్కగట్టడాన్ని అధికారులు ప్రస్తావించారు. జీడీపీలో 90 శాతానికి కేంద్ర రుణ భారం వాషింగ్టన్: కరోనా నేపథ్యంలో గవర్నమెంట్ బాండ్లు, ట్రెజరీ బిల్లులు, స్వల్పకాలిక రుణాలకు సంబంధించిన కేంద్ర రుణ భారం(పబ్లిక్ డెట్) భారీగా పెరిగే అవకాశం ఉందని ఐఎంఎఫ్ అంచనావేస్తోంది. 1991 నుంచీ జీడీపీలో పబ్లిక్ డెట్ స్థిరంగా దాదాపు 70% వద్ద కొనసాగుతుండగా, తాజా పరిస్థితుల్లో ఇది దాదాపు 90 వరకూ పెరిగే అవకాశం ఉందని ఐఎంఎఫ్ ఫైనాన్షియల్ వ్యవహారాల డైరెక్టర్ విక్టర్ గ్యాస్పర్ తెలిపారు. -
ఆర్థికాభివృద్ధికి కేరాఫ్ రంగారెడ్డి, హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు కేంద్రమైన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు.. వస్తు, సేవల ఉత్పత్తిలోనూ అగ్రగామిగా నిలుస్తున్నాయి. దేశ, రాష్ట్రాల ఆర్థికాభివృద్ధి రేటును దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ), రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్పీడీపీ)గా మదిస్తారు. ఈ తరహాలోనే జిల్లాల ఆర్థికాభివృద్ధి రేటును జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)గా మదిస్తారు. ఒక నిర్దిష్ట కాలవ్యవధిలో, సాధారణంగా ఒక ఏడాదిలో ఒక జిల్లాలోని భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తి అయిన అన్ని తుది వస్తువులు, సేవల మొత్తం ఆర్థిక విలువను జీడీడీపీగా పేర్కొంటారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా రూ.1,73,143 కోట్ల జీడీడీపీతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రూ.1,67,231 కోట్ల జీడీడీపీతో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. కేవలం ఈ రెండు జిల్లాలే రూ.లక్ష కోట్లపైగా జీడీడీపీని కలిగి ఉన్నాయి. రాష్ట్ర ఆర్థికాభి వృద్ధి రేటును పరుగులు పెట్టించడంలో ఈ రెండు జిల్లాలదే ప్రధాన పాత్ర అని తాజా గా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్ర ఆర్థిక, సామాజిక సర్వే నివేదికలోని జీడీడీపీ గణాంకాల పేర్కొంటున్నాయి. హైదరాబాద్ దేశానికే ఫార్మా రంగ రాజధానిగా పేరుగాంచింది. నగరంలో పెద్ద సంఖ్యలో ఐటీ కంపెనీలు, తయారీ తదితర రంగాల పరిశ్రమలున్నాయి. వీటిల్లో అధిక శాతం హైద రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కేంద్రీకృతమై ఉండడంతో ఇక్కడి నుంచి దేశ, విదేశాలకు ఏటా రూ.లక్షల కోట్లు విలువ చేసే వస్తు, సేవల ఉత్పత్తులు ఎగుమతి, రవాణా అవుతున్నాయి. హైదరా బాద్, రంగారెడ్డి జిల్లాల జీడీడీపీ మాత్రమే రూ.లక్షన్నర కోట్ల గీటురాయిను దాటి రూ.2 లక్షల కోట్ల దిశగా దూసుకుపోవడానికి ఈ పరిశ్రమలే ప్రధాన తోడ్పాటు అందిస్తున్నాయి. పెరుగుతున్న అసమానతలు.. జీడీడీపీతో పాటు తలసరి ఆదాయంలో సైతం ఈ 2 జిల్లాలు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు అందనంత దూరంలో ఉన్నాయి. రూ.5,78,978 తలసరి ఆదాయంతో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలవగా, రూ.3,57,287తో హైదరాబాద్, రూ.2,21,025తో మేడ్చల్–మల్కాజ్గిరి ఆ తర్వాతి స్థానంలో నిలిచాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో ఏ ఒక్క జిల్లా రూ.2 లక్షల తలసరి ఆదాయాన్ని కలిగి ఉండగకపోవ డం గమనార్హం. పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రంలోని జిల్లాల మధ్య నెలకొన్న అసమానతలను ఈ గణాంకాలు అద్దంపడుతున్నాయి. జీడీడీపీ, తలసరి ఆదాయంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, స్థానికంగా పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు అమలు చేయాల్సిన ప్రత్యేక కార్యచరణ ప్రణాళికలు, రాయితీ, ప్రోత్సాహాకాల విధానాల రూపకల్పన కోసం ఈ గణాంకాలు కీలకం కానున్నాయి. -
ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చే సర్వే..!
న్యూఢిల్లీ: దేశంలో వినియోగదారుల డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని ఐహెచ్‌డీఎస్ సర్వే తెలిపింది. ఇటీవల కాలంలో భారత్‌లో వినియోగదారల డిమాండ్ క్షీణించిందని జాతీయ నమూనా సర్వే (ఎన్ఎస్ఎస్) వివరాల ఆధారంగా పలు సర్వేలు వెల్లడించినప్పటికీ.. తాజా సర్వే ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చే అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐహెచ్‌డీఎస్ నేతృత్వంలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్‌సిఎఇఆర్), మేరీల్యాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు వినియోగదారుల డిమాండ్‌పై అధ్యయనం చేశారు. రాజస్థాన్‌లో 2,706 , బీహార్‌లో 1,643, ఉత్తరాఖండ్ 479 కుటుంబాల జీవన ప్రమాణాలను అధ్యయనం చేశామని ఐహెచ్‌డీఎస్ సర్వే తెలిపింది. ఎన్ఎస్ఎస్ సర్వేకు భిన్నంగా 2011-17 మధ్య కాలంలో ప్రజల వినియోగం పెరిగిందని సర్వే అభిప్రాయపడింది. మరోవైపు తలసరి ఆదాయంలో వృద్ధి 2004-05, 2011-12 మధ్యకాలంలో గణనీయంగా తగ్గిందని తెలిపింది. 2011-17 మధ్య కాలంలో తలసరి ఆదాయం, తలసరి వినియోగం వరుసగా 3.5, 2.7 శాతం పెరిగిందని సర్వే పేర్కొంది. 2004-05, 2011-12 సంవత్సరాలలో కుటుంబాలకు చెందిన తలసరి ఆదాయ వృద్ధి 7.2 శాతంగా ఉండగా, తలసరి వినియోగ వృద్ధి 4 శాతంగా నమోదైనట్టు సర్వే తెలిపింది. 2004-05, 2011-12 మధ్య కాలంలో వాహనాల కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో జరిగాయని, కార్లు, మోటారు వాహనాల కొనుగోళ్లు 22 శాతానికి పెరిగాయని, 2017 నాటికి మరో పది పాయింట్లు పెరిగినట్లు సర్వే ప్రకటించింది. ఆర్థిక విధానాల రూపకల్పనలో వినియోగ డిమాండ్ కీలక పాత్ర పోషిస్తుందని ఎన్ఎస్ఎస్ పేర్కొన్న విషయం తెలిసిందే. స్పష్టమైన డాటా లేకపోవడం వల్లే ఆర్ధిక విధానాలను రూపకల్పన చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. -
భూపాలపల్లి భేష్..
సాక్షి, భూపాలపల్లి: ఏజెన్సీ ప్రాంతాలు అధికంగా ఉన్న జిల్లాలుగా పేరున్న భూపాలపల్లి, ములుగు తలసరి ఆదాయంలో మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. పూర్తిగా పట్టణ జనాభాతో కూడిన వరంగల్ అర్బన్ జిల్లా కూడా భూపాలపల్లి, ములుగు జిల్లాల కంటే వెనుకబడే ఉంది. అయితే రాష్ట్రంలో అతి తక్కువ పట్టణ జనాభా కలిగిన జిల్లాల జాబితాలో మాత్రం ములుగు, భూపాలపల్లి జిల్లాలు చివరి స్థానాల్లో ఉండడం గమనార్హం. ఈ ఆసక్తికరమైన విషయాలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వే 2019 బహిర్గతం చేసింది. ఇదే విధంగా గత సంవత్సరాలతో పోలిస్తే జిల్లాలో ఆహార భద్రతా కార్డుల సంఖ్య, ఎల్పీజీ కనెక్షన్లు పెరిగాయి. 2016–17లో ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో 1.80 లక్షల హెక్టార్ల సాగుభూమి ఉంటే 1.50 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. 2017–18లో మాత్రం 1.78 లక్షల హెక్టార్లలో సాగు విస్తీర్ణంలో ఉంటే 1.40 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. మొత్తం సాగుభూమితో పాటు నికర సాగు విస్తీర్ణం స్వల్పంగా తగ్గినట్లు సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. 12వ స్థానంలో జిల్లా తలసరి ఆదాయం విషయంలో ములుగుతో కలిసిన భూపాలపల్లి జిల్లా రాష్ట్రంలోనే 12 వస్థానంలో ఉంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,80697 నుంచి రూ. 2,05,696కు పెరిగింది. దీనికి అనుగుణంగానే జిల్లాలో ప్రజల తలసరి ఆదాయం పెరిగింది. ప్రస్తుత ధరల వద్ద రెండో సారి సవరించిన అంచనాల ప్రకారం 2016–17లో ములుగు, భూపాలపల్లి జిల్లాల తలసరి ఆదాయం రూ.1,10,140 గా ఉంటే 2017–18లో రూ.1,24,612 పెరిగింది. దాదాపు 13 శాతం పెరుగుదల నమోదైంది. తలసరి ఆదాయం విషయంలో జనగామ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాలు ఉమ్మడి భూపాలపల్లి జిల్లా కంటే వెనుకబడే ఉన్నాయి. రెండు జిల్లాల్లో సింగరేణి, జెన్కో, వ్యవసాయ రంగాలే ప్రజలకు ఆదాయ మార్గాలు ఉన్నాయి. సారవంతమైన గోదావరి పరీవాహక ప్రాంత భూములు ఉండడంతో మిగతా జిల్లాలతో పోలిస్తే పంట ఉత్పాదకత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో జిల్లాల్లో ఈ రంగాల్లో పనిచే స్తున్న కార్మికులు, రైతుల ఆదాయం ఇతర జిల్లాలతో పోలిస్తే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అట్టడుగు స్థానాలు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ జనాభా పెరుగుతోంది. రాష్ట్రంలో 38.9 శాతం దాటింది. అయితే భూపాలపల్లి, ములుగు జిల్లాలు మాత్రం పట్టణ జనాభాలో అట్టడుగు స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో అతి తక్కువ పట్టణ జనాభా ఉన్న జిల్లాల్లో ములుగు జిల్లా 33వ స్థానంలో ఉండగా నారాయణపేట జిల్లా 32, భూపాలపల్లి జిల్లా 31 స్థానాల్లో ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం భూపాలపల్లి జిల్లాలో మొత్తం జనాభా 4,16,763 ఉంటే పట్టణాల్లో నివసించే వారి సంఖ్య 42,387. ములుగు జిల్లాలో 2,94,671 జనాభా ఉంటే పట్టణ జనాభా 11,493. ములుగు, భూపాలపల్లి జిల్లాలు పూర్తిగా గ్రామీణ ప్రాంతాలు ఉండడం రెండు జిల్లాల్లో కలిపి ఒక్కటే మునిసిపాలిటీ ఉండడం పట్టణ జనాభా తక్కువగా ఉండటానికి కారణంగా కనిపిస్తోంది. పెరిగిన కనెక్షన్లు.. రెండు జిల్లాల్లో ఎల్పీజీ కనెక్షన్లు, ఆహారభద్రత కార్డుల సంఖ్య పెరిగినట్లు సామాజిక ఆర్థిక సర్వే 2019 వెల్లడించింది. 2017 డిసెంబర్ నాటికి భూపాలపల్లి జిల్లాలో 20,7544 ఆహారభద్రత కార్డులు ఉంటే 2019 ఇప్పటి వరకు రెండు జిల్లాలో కలిపి 21,2553 ఆహారభద్రత కార్డులు పెరిగాయి. కొత్తగా 5,009 కుటుంబాలకు ఆహారభద్రతకార్డులు అందాయి. జిల్లాల వారీగా చూస్తే ములుగు జిల్లాలో 90,345, భూపాలపల్లి జిల్లాలో 1,22,210 ఆహారభద్రత కార్డులు ఉన్నాయి. జిల్లాలో ఎల్పీజీ కనెక్షన్లు కూడా పెరిగాయి. 2017–18లో ములుగు,భూపాలపల్లి జిల్లాల్లో మొత్తం 1,32,600 గ్యాస్ కనెక్షన్లు ఉంటే 2018–19 నాటికి 1,74,241 కనెక్షన్లకు పెరిగాయి. ఎక్కువ లింగనిష్పత్తి భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో లింగనిష్పత్తి రాష్ట్ర సగటు 988 కంటే ఎక్కువగా ఉండడం సంతోషకర విషయం. భూపాలపల్లి జిల్లాల్లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 1004 మంది స్త్రీలు ఉన్నారు. అలాగే ములుగులో 1015 మంది స్త్రీలు ఉన్నారు. అయితే 0–6 చిన్నారుల్లో లింగనిష్పత్తి ఆందోళన కలిగిస్తోంది. భూపాలపల్లి జిల్లాలో బాలబాలికల లింగనిష్పత్తి చూస్తే ప్రతి వెయ్యి మంది బాలురకు 913 బాలికలు ఉన్నారు. ఈవిషయంలో ములుగు జిల్లా మెరుగ్గా ఉంది. వెయ్యి మంది బాలురకు 971 మంది బాలికలు ఉన్నారు. -
తలసరి ఆదాయంలో అట్టడుగున జగిత్యాల జిల్లా
సాక్షి, జగిత్యాల: జిల్లావాసుల వ్యక్తిగత ఆదాయం రాష్ట్రంలోనే అత్యల్పంగా ఉంది. రాష్ట్రంలో ఏడాదికి ఒక వ్యక్తి పొందే ఆదాయం సగటున రూ.1,80,697 ఉండగా జిల్లా సగటు మాత్రం రూ.92,751గా ఉంది. తలసరి ఆదాయంలో జగిత్యాల జిల్లా రాష్ట్రంలోనే అట్టడుగున ఉంది. జిల్లా భూ విస్తీర్ణం, సాగు విషయంలో రాష్ట్రంలో 12వ స్థానంలో ఉంది. వ్యవసాయాధారిత జిల్లాలో వ్యక్తిగత ఆదాయం రూ.93వేల లోపే ఉన్నట్లు సామాజిక, ఆర్థిక సర్వేలో వెల్లడైంది. 2015–16తో పోలిస్తే మాత్రం వ్యక్తిగత ఆదాయంలో రూ.15వేలు వృద్ధి చెందినట్లు తెలుస్తుంది. రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదించిన సందర్భంగా ప్రభు త్వం 2017–18 కాలానికి సంబంధించిన సోషల్, ఎకనామిక్ అవుట్‌లుక్‌ను విడుదల చేసింది. పక్క జిల్లాలు నయం తలసరి ఆదాయం విషయంలో జగిత్యాల జిల్లా కంటే పక్క జిల్లాలు మెరుగ్గా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా తలసరి ఆదాయం రూ.1,46,634 ఉండగా, కరీంనగర్ రూ.1,28,221, రాజన్న సిరిసిల్ల జిల్లా తలసరి ఆదాయం రూ.99,296గా ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం రూ.4,57,034గా ఉంది. 2015–16లో రూ.77,070గా ఉన్న జిల్లా తలసరి ఆదాయం 2017–18 నాటికి రూ.92,751కి చే రింది. అయినా తలసరి ఆదాయంలో రాష్ట్రంలో జగిత్యాల జిల్లా వెనుకంజలో ఉండటం గమనించాల్సిన విషయం. గ్రామీణ జనాభా ఎక్కువగా, పట్టణ జనాభా తక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం. పట్టణీకరణ పెరుగుతున్నప్పటికీ పారిశ్రామికీకరణ చెందకపోవడం కూడా వ్యక్తిగత ఆదాయంపై ప్రభావం చూపుతుంది. జీడీడీపీలో 12వ స్థానం స్థూల దేశీయోత్పత్తిలో జగిత్యాల రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. సంవత్సర కాలంలో జిల్లా భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల లెక్కింపు విలువే జీడీడీపీ(డిస్ట్రిక్ట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్). జగిత్యాల జిల్లా జీడీడీపీ రూ.10,82,725 లక్షలుగా నమోదైంది. సాగు విస్తీర్ణం 1.60 లక్షల హెక్టార్లు జిల్లా భూవిస్తీర్ణం, సాగు విషయంలో రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 1.85 లక్షల హెక్టార్ల భూవిస్తీర్ణం ఉండగా ఇందులో 1.60 లక్షల హెక్టార్లు సాగవుతున్నాయి. రాష్ట్రంలో 1.5 నుంచి 2 లక్షల హెక్టార్ల భూమి ఉన్న పది జిల్లాల సరసన జగిత్యాల జిల్లా నిలిచింది. గతంతో పోలిస్తే ఆహార పంటల సాగు కంటే వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. 2001–02లో 70.8 శాతం ఆహారపంటలు, 29.2 శాతం వాణిజ్యపంటల సాగుకాగా.. 2017–18లో ఆహారపంటల విస్తీర్ణం 61.3 శాతానికి తగ్గగా, వాణిజ్యపంటల సాగు 38.7 శాతానికి పెరిగింది. ఆహారధాన్యాలు, తృణధాన్యాలు, పప్పులు వంటి ఆహార పంటలు సాగు తగ్గిపోగా, పత్తి, నూనెగింజలు, పూలు, పసుపు వంటి వాణిజ్యపంటల సాగు పెరిగింది. రాష్ట్ర అక్షరాస్యత రేటు 66.54 శాతంగా ఉండగా మహిళల కంటే పురుషుల అక్షరాస్యత శాతం మెరుగ్గా ఉన్నట్లు సర్వే తెలిపింది. ఈ ఏడాది రాష్ట్ర వృద్ధి రేటు 11.2 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. వ్యవసాయ పంటల సాంధ్రత విషయంలో కరీంనగర్ జిల్లా 1.58 లక్షల హెక్టార్ల విస్తీర్ణంతో ప్రథమస్థానంలో నిలవగా, రాష్ట్ర సాంధ్రత సగటు మాత్రం 1.24 లక్షల హెక్టార్లుగా ఉంది. జిల్లా జనాభా 9,85,417కు చేరుకుందని ప్రభుత్వ సర్వే వెల్లడించింది. ఇందులో పురుషులు 4,84,079 మంది ఉండగా స్త్రీలు 5,01,338 మంది ఉన్నట్లు తెలిపింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు 7,64,081 మంది కాగా 2,21,336 మంది జనాభా పట్టణాల్లో నివసిస్తున్నారు. -
తలసరి ఆదాయంలో రంగారెడ్డి టాప్
సాక్షి, రంగారెడ్డి: తలసరి ఆదాయంలో మన జిల్లా అగ్రగామిగా నిలిచింది. అంతేకాకుండా రాష్ట్ర సగటు తలసరి ఆదాయం కంటే జిల్లా తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో నమోదవడం విశేషం. జిల్లాలో విస్తృతంగా ఐటీ, సాఫ్ట్వేర్, వాటి అనుబంధ కంపెనీలు ఉండటంతో అదేస్థాయిలో ఉద్యోగులకు ఆదాయం సమకూరుతోంది. దీంతో తలసరి ఆదాయం గణనీయంగా పెరుగుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన రాష్ట్ర సామాజిక, ఆర్థిక నివేదిక–2019 స్పష్టం చేస్తోంది. జిల్లా తలసరి ఆదాయం రూ.4.57 లక్షలు కాగా.. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2.05 లక్షలు. మొన్నటి వరకు రంగారెడ్డి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న వికారాబాద్ జిల్లా తలసరి ఆదాయం మనతో పోల్చితే నాలుగో వంతు మాత్రమే. జిల్లా స్థూల ఉత్పత్తిలోనూ మన జిల్లా ముందు వరుసలో నిలబడటం గొప్ప విషయం. రాష్ట్రంలో హైదరాబాద్ జిల్లా అగ్రస్థానంలో ఉండగా.. మనం రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాం. జిల్లాలో ఉత్పత్తి అవుతున్న వస్తువులు, సేవల విలువ 1.35 లక్షల కోట్లు ఉన్నట్లు నివేదిక ద్వారా వెల్లడవుతోంది. జిల్లా శివారు ప్రాంతాలు ఉత్పత్తి, సేవల రంగానికి కేరాఫ్‌గా అడ్రస్‌గా నిలివడంతో స్థూల ఉత్పత్తి విలువ చెప్పుకోదగ్గ రీతిలో నమోదైంది. సాగులో పదో స్థానం.. మహానగరం చుట్టూ రంగారెడ్డి జిల్లా విస్తరించడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. భూముల క్రయవిక్రయాలు అధికంగా జరుగుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు, ఐటీ, సాఫ్ట్వేర్ సంస్థలు ఏర్పాటవుతుండటం, మహానగరం విస్తరిస్తుండటంతో జిల్లా పరిధిలో రియల్ రంగంలో పెట్టుబడులకు చాలా మంది మొగ్గుచూపుతున్నారు. ఈ డిమాండ్ మేరకు పంట పొలాలు కాస్తా వెంచర్లుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోతోంది. రాష్ట్రంలో మనజిల్లా సాగులో 10వ స్థానంలో నిలిచింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 1.93 హెక్టార్లలో పంటలు వేసినట్లు నివేదిక స్పష్టం చేస్తోంది. అక్షరాస్యత 71.95 శాతం విద్యాసంస్థల ఏర్పాటుకు జిల్లా ప్రధాన కేంద్రంగా మారింది. అత్యధికంగా విద్యాసంస్థలు కొలువుదీరుతున్నాయి. ప్రాథమిక పాఠశాలల నుంచి ఇంటర్, ఇంజినీరింగ్, వృత్తి విద్యనందించే కళాశాలలు వందల్లో ఉన్నాయి. ఫలితంగా అక్షరాస్యత కూడా అదేస్థాయిలో నమోదైంది. రాష్ట్రంలో కెల్లా మన జిల్లా అక్షరాస్యతలో 71.95 శాతంతో నాలుగో స్థానంలో నిలిచింది. జిల్లా జనాభా 24.26 లక్షలు కాగా.. ఇందులో 15.29 లక్షల మంది అక్షరజ్ఞానులే. మనకంటే ముందు హైదరాబాద్, మేడ్చల్, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. ‘పని’మంతులు 42.15 శాతం జిల్లా జనాభాలో 42 శాతం మంది ఏదో ఒక పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 24.26 లక్షలుకాగా.. ఇందులో 10.22 లక్షల మంది ప్రజలు ఆయా రంగాలకు సంబంధించి పనులు చక్కబెడుతున్నారు. అత్యధికంగా 6.13 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఉండగా.. వీరి తర్వాత వ్యవసాయ కూలీలు 2.13 లక్షల మంది ఉన్నారు. ఇక రైతులు 1.65 లక్షల మంది ఉన్నట్లు నివేదిక ద్వారా వెల్లడవుతోంది. మరో 29,544 మంది కుటీర పరిశ్రమలపై ఆధారపడ్డారు. రేషన్ కార్డుల్లో రెండో స్థానం ఆహార భద్రత కార్డులు కలిగి ఉండటంలో రాష్ట్రంలో మన జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఇతర ప్రాంతాల నుంచి బతుకు దెరువుకోసం వస్తున్న కుటుంబాలు మన జిల్లాలోనే నివాసం ఉంటున్నారు. దీంతో రేషన్ కార్డుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుతం జిల్లాలో 5.25 లక్షల కార్డులు నమోదవగా.. రాష్ట్రంలోని మొత్తం రేషన్ కార్డుల్లో ఇది 6 శాతం. ఎయిర్ ట్రాఫిక్‌లో గణనీయ వృద్ధి శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏటేటా ప్రయాణికుల సంఖ్యను పెంచుకుంటోంది. 2018–19 (ఏప్రిల్– డిసెంబర్)లో 15.88 మిలియన్ల ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు జరపడం విశేషం. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. గతేడాది ఈ సంఖ్య 13.26 మిలియన్లు మాత్రమే. అంటే ఏడాది వ్యవధిలో ఎయిర్ ట్రాఫిక్ 20 శాతం పెరిగిందన్నమాట. 2017–18తో పోల్చితే 2018–19లో ఇక్కడి నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల వృద్ధి 20 శాతం నమోదైంది. అంతర్జాతీయ ప్రయాణికుల విషయానికి వస్తే ఈ వృద్ధి 11 శాతమే ఉంది. సరుకు రవాణా విషయంలో 8శాతం మెరుగుదల కనిపించింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి 18 అంతర్జాతీయ గమ్యస్థానాలకు, దేశంలో 48 ప్రాంతాలకు విమానయాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. దేశీయంగానూ సర్వీసుల సంఖ్య పెరిగింది. ప్రతి ఇంటికీ ఎల్పీజీ జిల్లాలో దాదాపు ప్రతి ఇంటికి వంటగ్యాస్ (ఎల్పీజీ) కనెక్షన్ ఉంది. వంట చెరుకు ఆధారిత పొయ్యిలను ఎక్కడా వినియోగించడం లేదు. జిల్లాలో సుమారు 8.30 లక్షల కుటుంబాలు ఉన్నట్లు అంచనా. ఇందులో 7.90 లక్షల కుటుంబాలకు వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు నివేదిక వెల్లడిస్తోంది. గతేడాదితో పోల్చితే కనెక్షన్ల సంఖ్య 86 వేలకుపైగా పెరిగింది. పల్లెలు కూడా పట్టణాలుగా రూపాంతరం చెందుతుండటంతో ఆ మార్పు కనిపిస్తోంది. జిల్లా తలసరి ఆదాయం రూ.4,57,034 సాగు విస్తీర్ణం 1.93 లక్షల హెక్టార్లు జిల్లా స్థూల ఉత్పత్తి రూ.1,35,034 కోట్లు అక్షరాస్యులు 15,29,945 పనిచేసే జనాభా 10,22,641 వ్యవసాయదారులు 1,65,705 వ్యవసాయ కూలీలు 2,13,624 ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు 6,13,768 వంటగ్యాస్ కనెక్షన్లు 7,90,684 -
తలసరి ఆదాయంలో వెనుకే ఉన్నాం!
న్యూఢిల్లీ: ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడం ఊహించినదేనని, తలసరి ఆదాయ పరంగా ఇప్పటికీ మనం తక్కువ స్థాయిలోనే ఉన్నామని, ఈ విషయంలో చాలా దూరం ప్రయాణించాల్సి ఉందన్నారు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్. అంతర్జాతీయంగా భారత్ చెప్పుకోతగ్గ స్థాయిలో జోక్యం చేసుకునే విధంగా ఉండాలని కుమార్ అభిప్రాయపడ్డారు. త్వరలోనే మన దేశం బ్రిటన్ను అధిగమించి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నారు. ‘‘చాలా ఎక్కువగా అంచనా వేసిందే. అధిక వృద్ధి రేటు ఫలితమే ఇది. త్వరలోనే బ్రిటన్ను అధిగమిస్తాం. 2018లో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ఐదో స్థానానికి చేరుకుంటాం. కానీ, మన తలసరి ఆదాయం ఫ్రాన్స్‌తో పోలిస్తే 20 రెట్లు తక్కువ. కనుక మన ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదు’’ అని రాజీవ్ కుమార్ అన్నారు. ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిన భారత్ పాత్ర అంతర్జాతీయ వేదికపై మరింత ఎక్కువగా ఉంటుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఇందుకు తగిన విధంగా సన్నద్ధమై, జాతి ప్రయోజనాల కోసం అంతర్జాతీయంగా అర్థవంతమైన పాత్ర పోషించాలన్నారు. ప్రపంచ బ్యాంకు రూపొందించిన గణాంకాల ఆధారంగా 2017లో మన దేశం 2.59 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో ప్రపంచంలో ఆరో స్థానికి చేరుకున్న విషయం గమనార్హం. -
‘తలసరి’లో వెనుకబడిన రాష్ట్రం
- రూ.20 వేలు ఎక్కువగా తెలంగాణ - మరోవైపు పెరుగుతున్న అప్పు సాక్షి, అమరావతి: తలసరి ఆదాయంలో రాష్ట్రం బాగా వెనుకబడిపోయింది. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలు ఏపీకన్నా ముందుస్థానాల్లో ఉండటం గమనార్హం. తెలంగాణ తలసరి ఆదాయం ఏపీకన్నా సుమారు రూ.20 వేలు ఎక్కువగా ఉంది. మరోవైపు ఏపీలో తలసరి అప్పు మాత్రం పెరుగుతూ పోతోంది. అదే సమయంలో తలసరి వ్యయం అప్పు కన్నా తక్కువగా ఉండటం గమనార్హం. రెండురోజుల జిల్లా కలెక్టర్ల సదస్సులో భాగంగా గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2016–17కు చెందిన రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని విడుదల చేశారు. మహారాష్ట్ర, హర్యాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయంలో వెనుకబడింది. పంజాబ్ తలసరి ఆదాయం రూ.1,26,063 కాగా, తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,40,683, ఏపీ తలసరి ఆదాయం రూ.1,22,376గా ఉంది. జిల్లాల ఆర్థిక ముఖచిత్రం విడుదల ఆదాయంలో (జిల్లాల స్థూల ఉత్పత్తి) కృష్ణా, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో ఉండగా విజయనగరం, శ్రీకాకుళం, వైఎస్సార్ జిల్లాలు చివరి స్థానాల్లో ఉన్నాయి. జిల్లాల వారీగా స్థూల ఉత్పత్తితో పాటు ఏ ఏ రంగాల్లో ఏ ఏ జిల్లాలు ఏ స్థానంలో ఉన్నాయనే వివరాలు (2016–17) కూడా చంద్రబాబు విడుదల చేశారు. వ్యవసాయ ఆదాయంలో పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. పారిశ్రామిక రంగ ఆదాయంలో విశాఖపట్నం, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. సేవా రంగంలో విశాఖ తొలి స్థానంలో ఉండగా కృష్ణా, గుంటూరు జిల్లాలు తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఇక తలసరి ఆదాయంలో కృష్ణా, పశ్చిమగోదావరి, విశాఖపట్నంలు జిల్లాలు మొదటి మూడు స్థానాలు ఆక్రమించాయి.