సాక్షి, రంగారెడ్డి: తలసరి ఆదాయంలో మన జిల్లా అగ్రగామిగా నిలిచింది. అంతేకాకుండా రాష్ట్ర సగటు తలసరి ఆదాయం కంటే జిల్లా తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో నమోదవడం విశేషం. జిల్లాలో విస్తృతంగా ఐటీ, సాఫ్ట్‌వేర్, వాటి అనుబంధ కంపెనీలు ఉండటంతో అదేస్థాయిలో ఉద్యోగులకు ఆదాయం సమకూరుతోంది. దీంతో తలసరి ఆదాయం గణనీయంగా పెరుగుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన రాష్ట్ర సామాజిక, ఆర్థిక నివేదిక–2019 స్పష్టం చేస్తోంది.
జిల్లా తలసరి ఆదాయం రూ.4.57 లక్షలు కాగా.. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2.05 లక్షలు. మొన్నటి వరకు రంగారెడ్డి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న వికారాబాద్ జిల్లా తలసరి ఆదాయం మనతో పోల్చితే నాలుగో వంతు మాత్రమే. జిల్లా స్థూల ఉత్పత్తిలోనూ మన జిల్లా ముందు వరుసలో నిలబడటం గొప్ప విషయం. రాష్ట్రంలో హైదరాబాద్ జిల్లా అగ్రస్థానంలో ఉండగా.. మనం రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాం. జిల్లాలో ఉత్పత్తి అవుతున్న వస్తువులు, సేవల విలువ 1.35 లక్షల కోట్లు ఉన్నట్లు నివేదిక ద్వారా వెల్లడవుతోంది. జిల్లా శివారు ప్రాంతాలు ఉత్పత్తి, సేవల రంగానికి కేరాఫ్‌గా అడ్రస్‌గా నిలివడంతో స్థూల ఉత్పత్తి విలువ చెప్పుకోదగ్గ రీతిలో నమోదైంది.
సాగులో పదో స్థానం..
మహానగరం చుట్టూ రంగారెడ్డి జిల్లా విస్తరించడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. భూముల క్రయవిక్రయాలు అధికంగా జరుగుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు, ఐటీ, సాఫ్ట్‌వేర్ సంస్థలు ఏర్పాటవుతుండటం, మహానగరం విస్తరిస్తుండటంతో జిల్లా పరిధిలో రియల్ రంగంలో పెట్టుబడులకు చాలా మంది మొగ్గుచూపుతున్నారు. ఈ డిమాండ్ మేరకు పంట పొలాలు కాస్తా వెంచర్లుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోతోంది. రాష్ట్రంలో మనజిల్లా సాగులో 10వ స్థానంలో నిలిచింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 1.93 హెక్టార్లలో పంటలు వేసినట్లు నివేదిక స్పష్టం చేస్తోంది.
అక్షరాస్యత 71.95 శాతం
విద్యాసంస్థల ఏర్పాటుకు జిల్లా ప్రధాన కేంద్రంగా మారింది. అత్యధికంగా విద్యాసంస్థలు కొలువుదీరుతున్నాయి. ప్రాథమిక పాఠశాలల నుంచి ఇంటర్, ఇంజినీరింగ్, వృత్తి విద్యనందించే కళాశాలలు వందల్లో ఉన్నాయి. ఫలితంగా అక్షరాస్యత కూడా అదేస్థాయిలో నమోదైంది. రాష్ట్రంలో కెల్లా మన జిల్లా అక్షరాస్యతలో 71.95 శాతంతో నాలుగో స్థానంలో నిలిచింది. జిల్లా జనాభా 24.26 లక్షలు కాగా.. ఇందులో 15.29 లక్షల మంది అక్షరజ్ఞానులే. మనకంటే ముందు హైదరాబాద్, మేడ్చల్, వరంగల్ జిల్లాలు ఉన్నాయి.
‘పని’మంతులు 42.15 శాతం
జిల్లా జనాభాలో 42 శాతం మంది ఏదో ఒక పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 24.26 లక్షలుకాగా.. ఇందులో 10.22 లక్షల మంది ప్రజలు ఆయా రంగాలకు సంబంధించి పనులు చక్కబెడుతున్నారు. అత్యధికంగా 6.13 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఉండగా.. వీరి తర్వాత వ్యవసాయ కూలీలు 2.13 లక్షల మంది ఉన్నారు. ఇక రైతులు 1.65 లక్షల మంది ఉన్నట్లు నివేదిక ద్వారా వెల్లడవుతోంది. మరో 29,544 మంది కుటీర పరిశ్రమలపై ఆధారపడ్డారు.
రేషన్ కార్డుల్లో రెండో స్థానం
ఆహార భద్రత కార్డులు కలిగి ఉండటంలో రాష్ట్రంలో మన జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఇతర ప్రాంతాల నుంచి బతుకు దెరువుకోసం వస్తున్న కుటుంబాలు మన జిల్లాలోనే నివాసం ఉంటున్నారు. దీంతో రేషన్ కార్డుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుతం జిల్లాలో 5.25 లక్షల కార్డులు నమోదవగా.. రాష్ట్రంలోని మొత్తం రేషన్ కార్డుల్లో ఇది 6 శాతం.
ఎయిర్ ట్రాఫిక్‌లో గణనీయ వృద్ధి
శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఏటేటా ప్రయాణికుల సంఖ్యను పెంచుకుంటోంది. 2018–19 (ఏప్రిల్– డిసెంబర్)లో 15.88 మిలియన్ల ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు జరపడం విశేషం. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. గతేడాది ఈ సంఖ్య 13.26 మిలియన్లు మాత్రమే. అంటే ఏడాది వ్యవధిలో ఎయిర్ ట్రాఫిక్ 20 శాతం పెరిగిందన్నమాట. 2017–18తో పోల్చితే 2018–19లో ఇక్కడి నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల వృద్ధి 20 శాతం నమోదైంది. అంతర్జాతీయ ప్రయాణికుల విషయానికి వస్తే ఈ వృద్ధి 11 శాతమే ఉంది. సరుకు రవాణా విషయంలో 8శాతం మెరుగుదల కనిపించింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి 18 అంతర్జాతీయ గమ్యస్థానాలకు, దేశంలో 48 ప్రాంతాలకు విమానయాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. దేశీయంగానూ సర్వీసుల సంఖ్య పెరిగింది.
ప్రతి ఇంటికీ ఎల్పీజీ
జిల్లాలో దాదాపు ప్రతి ఇంటికి వంటగ్యాస్ (ఎల్పీజీ) కనెక్షన్ ఉంది. వంట చెరుకు ఆధారిత పొయ్యిలను ఎక్కడా వినియోగించడం లేదు. జిల్లాలో సుమారు 8.30 లక్షల కుటుంబాలు ఉన్నట్లు అంచనా. ఇందులో 7.90 లక్షల కుటుంబాలకు వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు నివేదిక వెల్లడిస్తోంది. గతేడాదితో పోల్చితే కనెక్షన్ల సంఖ్య 86 వేలకుపైగా పెరిగింది. పల్లెలు కూడా పట్టణాలుగా రూపాంతరం చెందుతుండటంతో ఆ మార్పు కనిపిస్తోంది.
జిల్లా తలసరి ఆదాయం | రూ.4,57,034 |
సాగు విస్తీర్ణం | 1.93 లక్షల హెక్టార్లు |
జిల్లా స్థూల ఉత్పత్తి | రూ.1,35,034 కోట్లు |
అక్షరాస్యులు | 15,29,945 |
పనిచేసే జనాభా | 10,22,641 |
వ్యవసాయదారులు | 1,65,705 |
వ్యవసాయ కూలీలు | 2,13,624 |
ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు | 6,13,768 |
వంటగ్యాస్ కనెక్షన్లు | 7,90,684 |
Comments
Please login to add a commentAdd a comment