మూడు జిల్లాలకు అధ్యక్షుల ప్రకటన, మరికొన్ని చోట్ల వాయిదా
తెలంగాణలో జిల్లా సారథుల ఎంపికపై భారతీయ జనతాపార్టీ అచితూచి వ్యవహరిస్తోంది. ఈ ఏడాది హైదరాబాద్ (Hyderabad) శివార్లలో స్థానిక సంస్థలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుల నియామకంపై విస్తృత సంప్రదింపులు జరుపుతోంది. హైదరాబాద్ సెంట్రల్, మేడ్చల్ రూరల్, మహంకాళి సికింద్రాబాద్ జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన అధిష్టానం.. రంగారెడ్డి అర్బన్, రంగారెడ్డి రూరల్, మేడ్చల్ అర్బన్, వికారాబాద్, హైదరాబాద్ గోల్కొండ, భాగ్యనగర్ జిల్లాలను పెండింగ్‌లో పెట్టింది. తమ వర్గానికి చెందిన నేతలకే పార్టీ పగ్గాలు అప్పగించాలని సీనియర్లు పట్టుబట్టడం కూడా వీటి వాయిదా కారణంగా కనిపిస్తోంది.
ప్రధానంగా చేవెళ్ల పార్లమెంటు నియోకవర్గం పరిధిలో ఉన్న రంగారెడ్డి అర్బన్, రూరల్ జిల్లాల అధ్యక్షులుగా తన వర్గీయులను నియమించాలని ఓ కీలక నేత పట్టుబడుతుండగా, రంగారెడ్డి అర్బన్, మేడ్చల్ జిల్లా (Medchal District) పరిధిలో మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గంలోని మరో నాయకుడు తన సన్నిహితుడికి అవకాశం కల్పించాలంటూ మొండికేస్తున్నారు. దీంతో ఈ జిల్లాల అధ్యక్షుల నియామక ప్రక్రియకు మరికొన్నాళ్లు పట్టే అవకాశం కనిపిస్తోంది.
రంగారెడ్డి గ్రామీణ అధ్యక్ష బాధ్యతలు తనకే అప్పగించాలంటూ ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) నియోజకవర్గానికి చెందిన ఓ మహిళా నేత ఒత్తిడి చేస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో చేవెళ్ల పార్లమెంటరీ స్థానం పరిధి పార్టీ సంస్థాగత జిల్లా రంగారెడ్డి రూరల్‌లో అధికంగా ఉన్నందున మాకే అవకాశం ఇవ్వాలని అక్కడి నాయకులు పట్టుబడుతున్నారు.
హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా లంకల దీపక్‌రెడ్డి
హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా లంకల దీపక్‌రెడ్డి (Lankala Deepak Reddy), మేడ్చల్ రూరల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బుద్ది శ్రీనివాస్, మహంకాళి సికింద్రాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా గుండుగోని భరత్‌గౌడ్ (gundagoni bharath goud)ను నియమిస్తూ సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. దీపక్ రెడ్డి గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అనుచరుడిగా చెబుతున్నారు. భరత్ గౌడ్ గతంలో బీజేవైఎం రాష్త్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఎంపీ డా.లక్ష్మణ్ అనుచరుడిగా పేరుంది.
చదవండి: 19 జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల నియామకం
స్టేట్ కౌన్సిల్ సభ్యుల నియామకం..
మహంకాళి సికింద్రాబాద్ జిల్లాలో 4 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి ఒక్కో స్టేట్ కౌన్సిల్ సభ్యుడిని ఎన్నుకుంటారు. అందులో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి శేషసాయి, సనత్‌నగర్ నుంచి సురేష్ రావల్, సికింద్రాబాద్ నుంచి గణేష్ ముదిరాజ్, కంటోన్మెంట్ రాయల్ కుమార్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లాలో అంబర్‌పేట్ నియోజకవర్గం నుంచి నర్సింగరావు యాదవ్, ఖైరతాబాద్ నుంచి నగేష్, జూబ్లీహిల్స్ శ్రీనివాస్‌రెడ్డి, నాంపల్లి అనిల్‌కుమార్‌లకు అవకాశం కల్పించగా, మేడ్చల్ నియోజకవర్గం నుంచి అచ్చని నర్సింహకు స్టేట్ కౌన్సిల్‌లో స్థానం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment