Bjp District president
-
ఆ జిల్లాల బీజేపీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ
తెలంగాణలో జిల్లా సారథుల ఎంపికపై భారతీయ జనతాపార్టీ అచితూచి వ్యవహరిస్తోంది. ఈ ఏడాది హైదరాబాద్ (Hyderabad) శివార్లలో స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుల నియామకంపై విస్తృత సంప్రదింపులు జరుపుతోంది. హైదరాబాద్ సెంట్రల్, మేడ్చల్ రూరల్, మహంకాళి సికింద్రాబాద్ జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన అధిష్టానం.. రంగారెడ్డి అర్బన్, రంగారెడ్డి రూరల్, మేడ్చల్ అర్బన్, వికారాబాద్, హైదరాబాద్ గోల్కొండ, భాగ్యనగర్ జిల్లాలను పెండింగ్‌లో పెట్టింది. తమ వర్గానికి చెందిన నేతలకే పార్టీ పగ్గాలు అప్పగించాలని సీనియర్లు పట్టుబట్టడం కూడా వీటి వాయిదా కారణంగా కనిపిస్తోంది.ప్రధానంగా చేవెళ్ల పార్లమెంటు నియోకవర్గం పరిధిలో ఉన్న రంగారెడ్డి అర్బన్, రూరల్ జిల్లాల అధ్యక్షులుగా తన వర్గీయులను నియమించాలని ఓ కీలక నేత పట్టుబడుతుండగా, రంగారెడ్డి అర్బన్, మేడ్చల్ జిల్లా (Medchal District) పరిధిలో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలోని మరో నాయకుడు తన సన్నిహితుడికి అవకాశం కల్పించాలంటూ మొండికేస్తున్నారు. దీంతో ఈ జిల్లాల అధ్యక్షుల నియామక ప్రక్రియకు మరికొన్నాళ్లు పట్టే అవకాశం కనిపిస్తోంది. రంగారెడ్డి గ్రామీణ అధ్యక్ష బాధ్యతలు తనకే అప్పగించాలంటూ ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) నియోజకవర్గానికి చెందిన ఓ మహిళా నేత ఒత్తిడి చేస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో చేవెళ్ల పార్లమెంటరీ స్థానం పరిధి పార్టీ సంస్థాగత జిల్లా రంగారెడ్డి రూరల్‌లో అధికంగా ఉన్నందున మాకే అవకాశం ఇవ్వాలని అక్కడి నాయకులు పట్టుబడుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా లంకల దీపక్‌రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా లంకల దీపక్‌రెడ్డి (Lankala Deepak Reddy), మేడ్చల్ రూరల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బుద్ది శ్రీనివాస్, మహంకాళి సికింద్రాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా గుండుగోని భరత్‌గౌడ్ (gundagoni bharath goud)ను నియమిస్తూ సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. దీపక్ రెడ్డి గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అనుచరుడిగా చెబుతున్నారు. భరత్ గౌడ్ గతంలో బీజేవైఎం రాష్త్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఎంపీ డా.లక్ష్మణ్ అనుచరుడిగా పేరుంది.చదవండి: 19 జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల నియామకంస్టేట్ కౌన్సిల్ సభ్యుల నియామకం.. మహంకాళి సికింద్రాబాద్ జిల్లాలో 4 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి ఒక్కో స్టేట్ కౌన్సిల్ సభ్యుడిని ఎన్నుకుంటారు. అందులో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి శేషసాయి, సనత్‌నగర్ నుంచి సురేష్ రావల్, సికింద్రాబాద్ నుంచి గణేష్ ముదిరాజ్, కంటోన్మెంట్ రాయల్ కుమార్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లాలో అంబర్పేట్ నియోజకవర్గం నుంచి నర్సింగరావు యాదవ్, ఖైరతాబాద్ నుంచి నగేష్, జూబ్లీహిల్స్ శ్రీనివాస్‌రెడ్డి, నాంపల్లి అనిల్‌కుమార్‌లకు అవకాశం కల్పించగా, మేడ్చల్ నియోజకవర్గం నుంచి అచ్చని నర్సింహకు స్టేట్ కౌన్సిల్లో స్థానం లభించింది. -
కమల దళపతి ఎవరో..
సాక్షి, రంగారెడ్డి: బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందోననే చర్చ ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. ఈ నెలాఖరులోగా బీజేపీ జిల్లా అధ్యక్షుడిని నియమించాలని అధిష్టానం ఆదేశించిన నేపథ్యంలో అందరి దృష్టి ఆ పదవిపైకి మళ్లింది. మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి జిల్లా అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ కనిపిస్తోంది. ప్రస్తుతానికి నలుగురు అభ్యర్థులు రేసులో ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా వెల్లడవుతోంది. వీరిలో ముగ్గురూ మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన వారే కావడం విశేషం. మరొకరు ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని నేత. వీరిలో ఒకరు తొలిసారిగా బరిలో ఉండగా.. మరో ఇద్దరు రెండోసారి రేసులో నిలిచారు. మొన్నటి వరకు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన బొక్క నర్సింహారెడ్డి ఈసారి కూడా పోటీపడుతున్నారు. ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడకు చెందిన అర్జున్‌రెడ్డి గతంలో ఆశించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన మళ్లీ ఆశలు పెట్టుకున్నారు. అలాగే మహేశ్వరం మండలానికి చెందిన కడారి జంగయ్య యాదవ్, బస్వ పాపయ్యగౌడ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీళ్లంతా పార్టీలో సీనియర్ నేతలు. పార్టీ కోసం దాదాపు 35 ఏళ్లకుపైగా శ్రమించిన వ్యక్తులు. జిల్లా అధ్యక్ష పదవి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుతం బూత్, మండల స్థాయి కమిటీల ఎన్నికలు జరుగుతున్నాయి. మరోమూడు నాలుగు రోజుల్లో 50 శాతం కమిటీల నియామకాలు పూర్తికానున్నాయి. ఆ తదుపరి జరిగేది జిల్లా అధ్యక్ష ఎన్నికలే. మొత్తం మీద ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తికానుంది. ఇందుకు కొన్ని రోజుల సమయమే ఉండటంతో జిల్లా అధ్యక్ష ఎన్నికపై పార్టీలో సర్వత్రా చర్చజరుగుతోంది. పార్టీ అధిష్టానం సూచించిన వ్యక్తికే అధ్యక్ష పదవి కట్టబెడుతున్నప్పటికీ పలువురు నేతలు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరోసారి పీఠం కోసం.. గ్రామ అధ్యక్షుడి బాధ్యతలతో 1983లో పార్టీలో ప్రస్థానం మొదలుపెట్టిన బొక్క నర్సింహారెడ్డి.. ప్రస్తుతం జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. జిల్లాలో సంస్థాగతంగా ఒకింత పార్టీ బలోపేతం చేయడంలో ఆయన కీలక భూమిక పోషించారు. అంజన్‌కుమార్‌గౌడ్ అధ్యక్షునిగా పనిచేసిన సమయంలో నర్సింహారెడ్డి రెండు పర్యాయాలు జనరల్ సెక్రటరీగా సేవలందించారు. తన సొంత మండలం కందుకూరులో రెండు దఫాలు పార్టీ తరఫున ఎంపీపీ స్థానాన్ని గెలిపించుకోవడంతో ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. అంతేగాక ఆయన జెడ్పీటీసీ అభ్యర్థిగా రెండుసార్లు బరిలో నిలిచి సమీప ప్రత్యర్థికి గట్టి పోటీనిచ్చారు. కిసాన్ మోర్చా జిల్లా సెక్రటరీ, ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా, సెక్రటరీగా, ట్రెజరర్‌గా సేవలందించారు. మొదట్లో ఏబీవీపీతోనూ సంబంధాలు కొనసాగించిన ఆయన.. పార్టీ కోసం 36 ఏళ్లు శ్రమించారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల సమయంలో అప్పటి కమల దళపతి అమిత్‌షా పర్యటన విజయవంతంతో ఆయన మన్ననలు అందుకున్నారు. ఈ గుర్తింపే తనను మరోసారి అధ్యక్ష పదవిలో కూర్చోబెడుతుందని బలంగా విశ్వసిస్తున్నారు. అధిష్టానంపై నమ్మకంతో బరిలో.. ఆది నుంచి ఆర్ఎస్ఎస్తో సత్సంబంధాలు ఉన్న పోరెడ్డి అర్జున్‌రెడ్డి అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. ఇంటర్మీడియెట్లోనే విద్యార్థి నేతగా గెలిచిన ఆయన.. పార్టీలో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం గడించారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన అర్జున్.. ప్రస్తుతం కిసాన్ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. గతసారి కూడా ఈయన అధ్యక్ష పదవి కోసం పోటీపడ్డారు. 1983 నుంచి 1998 వరకు ఏబీవీపీలో క్రియాశీలకంగా కొనసాగి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మూడు పర్యాయాలు పనిచేశారు. ఆ తర్వాత బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్‌గా, జిల్లా కార్యవర్గ సభ్యుడిగా, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడిగా సేవలందించారు. ఇలా ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీతో సుమారు 36 ఏళ్ల అనుబంధమున్న తన పట్ల పార్టీ అధిష్టానం సానుకూలంగా వ్యవహరిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. తొలిసారిగా రేసులో.. కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించి పార్టీలో ఉన్నత పదవులను అలంకరించిన కడారి జంగయ్య యాదవ్ తొలిసారిగా పార్టీ జిల్లా బాస్ పదవి రేసులో ఉన్నారు. 1984 నుంచే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న జంగయ్య 1987లోనే మహేశ్వరం మండల అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. నాలుగు పర్యాయాలు పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా కొనసాగిన ఆయన 1996లో జిల్లా ఉపాధ్యక్షునిగా సేవలందించారు. రెండు దఫాలు సెక్రటరీగా పనిచేశారు. పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన గతంలో మహేశ్వరం మండలం తుమ్మలూరు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. మొత్తంగా పార్టీ బలోపేతం కోసం 35 ఏళ్లుగా పనిచేస్తున్నారు. కింది నుంచి పైవరకు అన్ని స్థాయిల్లో పార్టీ కోసం కష్టపడిన తనను అధ్యక్ష పదవి వరిస్తుందని ధీమాతో ఉన్నారు. సుదీర్ఘ అనుభవం.. కిసాన్ మోర్చా రాష్ట్ర జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న పాపయ్యగౌడ్ జిల్లా అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారు. పార్టీలో 37 ఏళ్లపాటు పనిచేసిన అనుభవమున్న ఆయన కూడా తొలిసారిగా పదవిని ఆశిస్తున్నారు. కరసేవలో, జాతీయ సమైక్యత, దేశ సమగ్రత కోసం పార్టీ గతంలో చేపట్టిన ఏక్తా యాత్రలో పాల్గొన్న పాపయ్య.. గీతకార్మిక కుటుంబం నుంచి వచ్చి పార్టీకి పలు హోదాల్లో సేవలందించారు. యువమోర్చా జిల్లా సెక్రటరీ, ప్రసిడెంట్, పార్టీ జిల్లా వైస్ ప్రసిడెంట్, సెక్రటరీగా, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. మిగిలిన నాయకులకంటే పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉన్న తనకు అధ్యక్ష పదవి వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. -
రైతులను తీవ్రవాదుల్లా చూస్తున్న ప్రభుత్వం
► బీజేపీ వరంగల్ అర్భన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ హన్మకొండ : రైతుల మార్కెట్లోనే రైతులను తీవ్రవాదుల్లా చిత్రీకరించి రాష్ట్ర ప్రభుత్వం నిర్భంధనాలు విధిస్తుందని బీజేపీ వరంగల్ అర్భన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. ఆదివారం హన్మకొండలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రైతులకు మార్కెట్లో మద్దతు ధర అందించక పోవడం టీఆర్ఎస్ ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనమని పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లిన వారు పాస్‌పోర్టు, వీసాలతో వెళ్ళినట్లు రైతులు మార్కెట్‌కు ఆథార్ కార్డు, పహాణీనకల్ తీసుకురావాలని ఆంక్షలు విధించడం దుర్మార్గమన్నారు. రైతులు చేస్తున్న ఉద్యమాలను టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించారు. కందులు, పెసర్లకు బోనస్ ఇవ్వాలని రైతులు కోరితే రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని దుయ్యబట్టారు. ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టి పంట పండిస్తే రైతుకు కనీసం రూ.30 వేలు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మిరప పంటకు బోనస్ ఇచ్చి ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వచ్చే ఏడాది నుంచి ఎకరాలకు రూ.4 వేల చొప్పున రెండు పంటలకు చొప్పున చెల్లిస్తామని చెప్పుతున్న ప్రభుత్వం మార్కెట్లో అన్యాయానికి గురవుతున్న రైతులను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. రైతులకు మేలు చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం మినహా ఆచరణలో ఏమి కనపడదని దుయ్యబట్టారు. ఉట్టి ఎక్కనోడు స్వర్గంకు నిచ్చెన వేసినట్లుగా సీఎం కేసీఆర్ రైతులకు మేలు చెసే రాజ్యం అంటు గొప్పలు చెప్పుకుంటున్నారని తూర్పారబట్టారు. ఇప్పటికైన మార్కెట్లో నిర్భందాలు ఎత్తివేసి, రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రైతులను సంఘటితం చేసి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. రైతులకు బీజేపీ అండగా నిలుస్తుందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పుల్యాల రవీందర్‌రెడ్డి, నాయకులు మారెపల్లి రాంచంద్రారెడ్డి, కొలను సంతోష్‌రెడ్డి, సంగాని జగదీశ్వర్, దామెర సదానందం, దొంతి మాదవరెడ్డి, రఘుపతి, ములుగు కృష్ణ పాల్గొన్నారు. -
రైతులను క్షోభకు గురిచేస్తున్న ప్రభుత్వం : పల్లె గంగారెడ్డి
కామారెడ్డిటౌన్ : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగాన్ని దుఃఖ సాగరంలో ముంచేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. శని వారం ఆయన స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి రాకముందుకు రైతులకు రుణాలు మాఫీ చేస్తామని హామీలిచ్చి అధికారంలోకి రాగానే ఆంక్షలు విధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రతి కుటుంబ రైతుకు లక్ష రూపాయల రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రైతులు విద్యుత్‌కోతలతో పంటలు పండక ఆందోళనలో ఉన్నారని అన్నారు. రెండేళ్ల తరువాత రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తామని ప్రకటిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితి చూస్తే ఎనిమిది నిమిషాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఛత్తీస్‌ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తామని ప్రభుత్వం మాయమాటలు చెబుతోందని ఆరోపించారు. ఇప్పటి వరకు ఎలాంటి విద్యుత్ లైన్లను వేయలేదని కనీసం చర్యలు కూడా చేపట్టడం లేదని అ న్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పూర్తిస్థాయిలో సహాయమందించేందుకు కృషి చేస్తోందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాణాల లక్ష్మారెడ్డి, రాష్ట్ర నాయకుడు డాక్టర్ సిద్దిరాములు ఉన్నారు.