► బీజేపీ వరంగల్ అర్భన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ
హన్మకొండ : రైతుల మార్కెట్‌లోనే రైతులను తీవ్రవాదుల్లా చిత్రీకరించి రాష్ట్ర ప్రభుత్వం నిర్భంధనాలు విధిస్తుందని బీజేపీ వరంగల్ అర్భన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. ఆదివారం హన్మకొండలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రైతులకు మార్కెట్‌లో మద్దతు ధర అందించక పోవడం టీఆర్‌ఎస్ ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనమని పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లిన వారు పాస్‌పోర్టు, వీసాలతో వెళ్ళినట్లు రైతులు మార్కెట్‌కు ఆథార్ కార్డు, పహాణీనకల్ తీసుకురావాలని ఆంక్షలు విధించడం దుర్మార్గమన్నారు.
రైతులు చేస్తున్న ఉద్యమాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించారు. కందులు, పెసర్లకు బోనస్ ఇవ్వాలని రైతులు కోరితే రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని దుయ్యబట్టారు. ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టి పంట పండిస్తే రైతుకు కనీసం రూ.30 వేలు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మిరప పంటకు బోనస్ ఇచ్చి ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వచ్చే ఏడాది నుంచి ఎకరాలకు రూ.4 వేల చొప్పున రెండు పంటలకు చొప్పున చెల్లిస్తామని చెప్పుతున్న ప్రభుత్వం మార్కెట్‌లో అన్యాయానికి గురవుతున్న రైతులను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు.
రైతులకు మేలు చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం మినహా ఆచరణలో ఏమి కనపడదని దుయ్యబట్టారు. ఉట్టి ఎక్కనోడు స్వర్గంకు నిచ్చెన వేసినట్లుగా సీఎం కేసీఆర్ రైతులకు మేలు చెసే రాజ్యం అంటు గొప్పలు చెప్పుకుంటున్నారని తూర్పారబట్టారు. ఇప్పటికైన మార్కెట్‌లో నిర్భందాలు ఎత్తివేసి, రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రైతులను సంఘటితం చేసి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. రైతులకు బీజేపీ అండగా నిలుస్తుందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పుల్యాల రవీందర్‌రెడ్డి, నాయకులు మారెపల్లి రాంచంద్రారెడ్డి, కొలను సంతోష్‌రెడ్డి, సంగాని జగదీశ్వర్, దామెర సదానందం, దొంతి మాదవరెడ్డి, రఘుపతి, ములుగు కృష్ణ పాల్గొన్నారు.
రైతులను తీవ్రవాదుల్లా చూస్తున్న ప్రభుత్వం
Published Sun, Apr 30 2017 8:36 PM | Last Updated on Tue, Sep 5 2017 10:04 AM
Advertisement