రైతులను క్షోభకు గురిచేస్తున్న ప్రభుత్వం : పల్లె గంగారెడ్డి
కామారెడ్డిటౌన్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతాంగాన్ని దుఃఖ సాగరంలో ముంచేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. శని వారం ఆయన స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి రాకముందుకు రైతులకు రుణాలు మాఫీ చేస్తామని హామీలిచ్చి అధికారంలోకి రాగానే ఆంక్షలు విధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రతి కుటుంబ రైతుకు లక్ష రూపాయల రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రైతులు విద్యుత్‌కోతలతో పంటలు పండక ఆందోళనలో ఉన్నారని అన్నారు.
రెండేళ్ల తరువాత రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తామని ప్రకటిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితి చూస్తే ఎనిమిది నిమిషాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఛత్తీస్‌ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తామని ప్రభుత్వం మాయమాటలు చెబుతోందని ఆరోపించారు. ఇప్పటి వరకు ఎలాంటి విద్యుత్ లైన్‌లను వేయలేదని కనీసం చర్యలు కూడా చేపట్టడం లేదని అ న్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పూర్తిస్థాయిలో సహాయమందించేందుకు కృషి చేస్తోందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాణాల లక్ష్మారెడ్డి, రాష్ట్ర నాయకుడు డాక్టర్ సిద్దిరాములు ఉన్నారు.