కమల దళపతి ఎవరో.. | 4 BJP Leaders From Rangareddy On Race For BJP District President | Sakshi
Sakshi News home page

కమల దళపతి ఎవరో..

Published Wed, Dec 18 2019 8:54 AM | Last Updated on Wed, Dec 18 2019 8:54 AM

4 BJP Leaders From Rangareddy On Race For BJP District President - Sakshi

సాక్షి, రంగారెడ్డి: బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందోననే చర్చ ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. ఈ నెలాఖరులోగా బీజేపీ జిల్లా అధ్యక్షుడిని నియమించాలని అధిష్టానం ఆదేశించిన నేపథ్యంలో అందరి దృష్టి ఆ పదవిపైకి మళ్లింది. మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి జిల్లా అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ కనిపిస్తోంది. ప్రస్తుతానికి నలుగురు అభ్యర్థులు రేసులో ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా వెల్లడవుతోంది. వీరిలో ముగ్గురూ మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన వారే కావడం విశేషం. మరొకరు ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలోని నేత. వీరిలో ఒకరు తొలిసారిగా బరిలో ఉండగా.. మరో ఇద్దరు రెండోసారి రేసులో నిలిచారు. మొన్నటి వరకు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన బొక్క నర్సింహారెడ్డి ఈసారి కూడా పోటీపడుతున్నారు. ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడకు చెందిన అర్జున్‌రెడ్డి గతంలో ఆశించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన మళ్లీ ఆశలు పెట్టుకున్నారు. అలాగే మహేశ్వరం మండలానికి చెందిన కడారి జంగయ్య యాదవ్, బస్వ పాపయ్యగౌడ్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీళ్లంతా పార్టీలో సీనియర్‌ నేతలు. పార్టీ కోసం దాదాపు 35 ఏళ్లకుపైగా శ్రమించిన వ్యక్తులు. జిల్లా అధ్యక్ష పదవి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుతం బూత్, మండల స్థాయి కమిటీల ఎన్నికలు జరుగుతున్నాయి. మరోమూడు నాలుగు రోజుల్లో 50 శాతం కమిటీల నియామకాలు పూర్తికానున్నాయి. ఆ తదుపరి జరిగేది జిల్లా అధ్యక్ష ఎన్నికలే. మొత్తం మీద ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తికానుంది. ఇందుకు కొన్ని రోజుల సమయమే ఉండటంతో జిల్లా అధ్యక్ష ఎన్నికపై పార్టీలో సర్వత్రా చర్చజరుగుతోంది. పార్టీ అధిష్టానం సూచించిన వ్యక్తికే అధ్యక్ష పదవి కట్టబెడుతున్నప్పటికీ పలువురు నేతలు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.  

మరోసారి పీఠం కోసం.. 
గ్రామ అధ్యక్షుడి బాధ్యతలతో 1983లో పార్టీలో ప్రస్థానం మొదలుపెట్టిన బొక్క నర్సింహారెడ్డి.. ప్రస్తుతం జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. జిల్లాలో సంస్థాగతంగా ఒకింత పార్టీ బలోపేతం చేయడంలో ఆయన కీలక భూమిక పోషించారు. అంజన్‌కుమార్‌గౌడ్‌ అధ్యక్షునిగా పనిచేసిన సమయంలో నర్సింహారెడ్డి రెండు పర్యాయాలు జనరల్‌ సెక్రటరీగా సేవలందించారు. తన సొంత మండలం కందుకూరులో రెండు దఫాలు పార్టీ తరఫున ఎంపీపీ స్థానాన్ని గెలిపించుకోవడంతో ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. అంతేగాక ఆయన జెడ్పీటీసీ అభ్యర్థిగా రెండుసార్లు బరిలో నిలిచి సమీప ప్రత్యర్థికి గట్టి పోటీనిచ్చారు. కిసాన్‌ మోర్చా జిల్లా సెక్రటరీ, ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడిగా, సెక్రటరీగా, ట్రెజరర్‌గా సేవలందించారు. మొదట్లో ఏబీవీపీతోనూ సంబంధాలు కొనసాగించిన ఆయన.. పార్టీ కోసం 36 ఏళ్లు శ్రమించారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల సమయంలో అప్పటి కమల దళపతి అమిత్‌షా పర్యటన విజయవంతంతో ఆయన మన్ననలు అందుకున్నారు. ఈ గుర్తింపే తనను మరోసారి అధ్యక్ష పదవిలో కూర్చోబెడుతుందని బలంగా విశ్వసిస్తున్నారు.

అధిష్టానంపై నమ్మకంతో బరిలో.. 
ఆది నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌తో సత్సంబంధాలు ఉన్న పోరెడ్డి అర్జున్‌రెడ్డి అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. ఇంటర్మీడియెట్‌లోనే విద్యార్థి నేతగా గెలిచిన ఆయన.. పార్టీలో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం గడించారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన అర్జున్‌.. ప్రస్తుతం కిసాన్‌ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. గతసారి కూడా ఈయన అధ్యక్ష పదవి కోసం పోటీపడ్డారు. 1983 నుంచి 1998 వరకు ఏబీవీపీలో క్రియాశీలకంగా కొనసాగి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మూడు పర్యాయాలు పనిచేశారు. ఆ తర్వాత బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్‌గా, జిల్లా కార్యవర్గ సభ్యుడిగా, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడిగా సేవలందించారు. ఇలా  ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ, బీజేపీతో సుమారు 36 ఏళ్ల అనుబంధమున్న తన పట్ల పార్టీ అధిష్టానం సానుకూలంగా వ్యవహరిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.  

తొలిసారిగా రేసులో.. 
కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించి పార్టీలో ఉన్నత పదవులను అలంకరించిన కడారి జంగయ్య యాదవ్‌ తొలిసారిగా పార్టీ జిల్లా బాస్‌ పదవి రేసులో ఉన్నారు. 1984 నుంచే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న జంగయ్య 1987లోనే మహేశ్వరం మండల అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. నాలుగు పర్యాయాలు పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ సభ్యులుగా కొనసాగిన ఆయన 1996లో జిల్లా ఉపాధ్యక్షునిగా సేవలందించారు. రెండు దఫాలు సెక్రటరీగా పనిచేశారు. పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన గతంలో మహేశ్వరం మండలం తుమ్మలూరు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. మొత్తంగా పార్టీ బలోపేతం కోసం 35 ఏళ్లుగా పనిచేస్తున్నారు. కింది నుంచి పైవరకు అన్ని స్థాయిల్లో పార్టీ కోసం కష్టపడిన తనను అధ్యక్ష పదవి వరిస్తుందని ధీమాతో ఉన్నారు.  

సుదీర్ఘ అనుభవం.. 
కిసాన్‌ మోర్చా రాష్ట్ర జనరల్‌ సెక్రటరీగా కొనసాగుతున్న పాపయ్యగౌడ్‌ జిల్లా అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారు. పార్టీలో 37 ఏళ్లపాటు పనిచేసిన అనుభవమున్న ఆయన కూడా తొలిసారిగా పదవిని ఆశిస్తున్నారు. కరసేవలో, జాతీయ సమైక్యత, దేశ సమగ్రత కోసం పార్టీ గతంలో చేపట్టిన ఏక్తా యాత్రలో పాల్గొన్న పాపయ్య.. గీతకార్మిక కుటుంబం నుంచి వచ్చి పార్టీకి పలు హోదాల్లో సేవలందించారు. యువమోర్చా జిల్లా సెక్రటరీ, ప్రసిడెంట్, పార్టీ జిల్లా వైస్‌ ప్రసిడెంట్, సెక్రటరీగా, కిసాన్‌ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. మిగిలిన నాయకులకంటే పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉన్న తనకు అధ్యక్ష పదవి వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement