మిగతా జిల్లాలపై కుదరని ఏకాభిప్రాయం!
8 జిల్లాలకు వారంలో ప్రకటించే అవకాశం
రాష్ట్ర అధ్యక్షుడు ఖరారయ్యాక
మిగతా 11 జిల్లాలకు నియామకం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ సంస్థాగత ఎన్నికలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సంస్థాగతంగా పార్టీని 38 జిల్లాలుగా విభజించగా, సోమవారం 19 జిల్లాలకు మాత్రమే అధ్యక్షులను ప్రకటించారు. ఈ జిల్లాల్లో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల పేర్లను కూడా ప్రకటించారు. అయితే కొన్ని జిల్లాల్లో అధ్యక్షుల పేర్లపై ఏకాభిప్రాయం కుదరలేదని, సామాజిక వర్గాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేలా కూర్పు ఇంకా పూర్తిస్థాయిలో సాధ్యం కాలేదని తెలుస్తోంది.
ఏకాభిప్రాయం కుదరని కొన్ని జిల్లాల్లో రాష్ట్ర, జిల్లా నాయకత్వాలు ప్రతిపాదించిన పేర్లపై స్థానిక నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి. కొన్నిచోట్ల స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం జిల్లా అధ్యక్షులుగా ప్రతిపాదించిన వారి విషయంలో అసంతృప్తి వ్యక్తం చేయడంతో నియామకాలు ఆగినట్టుగా తెలిసింది. ఇప్పటివరకు ప్రకటించిన 19 జిల్లాల్లో ఒక్క మహిళకు కూడా అవకాశం దక్కలేదు.
8 జిల్లాల్లో ఏకాభిప్రాయం దిశగా.. 8 జిల్లాలకు సంబంధించి ఏకాభిప్రాయం కుదిరే దిశగా
కసరత్తు జరుగుతోంది. మొత్తం 38 జిల్లాలకు గాను యాభై శాతానికి పైగా అంటే 20కు పైగా జిల్లాలకు అధ్యక్షులను ఎన్నుకుంటేనే రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నిక లేదా నియామకానికి అవకాశం ఉంటుంది. అందువల్ల వారం, పది రోజుల్లో 8 జిల్లాలకు కూడా అధ్యక్షులను ప్రకటిస్తే మొత్తం 27 జిల్లాలకు అధ్యక్షులను నియమించినట్టు అవు తుందని చెబుతున్నారు. రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడు నియమితులయ్యాక మిగిలిన 11 జిల్లాలకు అధ్యక్షులను ఖరారు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రకటించిన 19 జిల్లాలను చూస్తే...రెడ్డి–6, ఎస్సీ–1, వైశ్య–2, బీసీలు–10 మంది ఉన్నట్టుగా తేలింది. ఇక త్వరలో ప్రకటించే 8 జిల్లాల్లో ఒకటి మహిళకు, ఆ తర్వాత ఖరారు చేసే 11 జిల్లా ల్లో కూడా మరో రెండు లేదా మూడు జిల్లాలకు మహిళలకు అవకాశం లభించవచ్చునని అంచనా వేస్తున్నారు.
19 జిల్లాల అధ్యక్షులు వీరే..
పతంగి బ్రహ్మానంద (ఆదిలాబాద్ జిల్లా), వెంకటేశ్వర్‌గౌడ్ (మంచిర్యాల), శ్రీశైలం ముదిరాజ్ (ఆసిఫాబాద్), దినేష్ కులాచారి (నిజామాబాద్), నీలం చిన్నరాజులు (కామారెడ్డి), రాచకొండ యాదగిరిబాబు (జగిత్యాల), కర్రే సంజీవ్‌రెడ్డి (పెద్దపల్లి), వి.రాధామల్లేష్ గౌడ్ (మెదక్), బుద్ధి శ్రీనివాస్ (మేడ్చల్–మల్కాజిగిరి), నాగం వర్షిత్‌రెడ్డి (నల్లగొండ), పి.శ్రీనివాసరెడ్డి (మహబూబ్‌నగర్), దుప్పలి నారాయణ (వనపర్తి), కొలను సంతోష్‌రెడ్డి (హనుమకొండ), గంట రవికుమార్ (వరంగల్), నిశిధర్‌రెడ్డి (భూపాలపల్లి), సౌడ రమేష్ (జనగామ), సిరికొండ బలరాం (ములుగు), గుండగోని భరత్‌గౌడ్ (మహంకాళి సికింద్రాబాద్), లంకాల దీపక్‌రెడ్డి (హైదరాబాద్ సెంట్రల్ జిల్లా) లను అధ్యక్షులుగా బీజేపీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment