నల్లగొండ జిల్లా కట్టంగూరుకు చెందిన యాదగిరి ఉన్న ఊర్లో ఉపాధి కరువై బతుకుదెరువు కోసం ఐదేళ్ల క్రితం కుటుంబంతో సహా శేరిలింగంపల్లికి చేరుకున్నాడు. ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా చేరాడు. భార్య అదే అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్లలో పనికి కుదిరింది. యాదగిరి నెలకు రూ.15 వేలు వేతనం, భార్యకు ఒక్కో ఫ్లాట్ నుంచి రూ.2,500 చొప్పున పది ఫ్లాట్ల నుంచి రూ.25 వేలు వస్తున్నాయి. ఇంటి యజమానులు ప్రేమగా పెంచుకుంటున్న కుక్కలను ఉదయం, సాయంత్రం బయట తిప్పినందుకు రూ.5 వేలు, వారి వ్యక్తిగత వాహనాలను శుభ్రం చేసినందుకు నెలకు రూ.500–700 చొప్పున సంపాదిస్తున్నారు. ఇలా ఈ జంట సగటున రూ.50 వేలకుపైగా సంపాదిస్తోంది. ఐటీ అనుబంధ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ ఏజెంటుగా మారిన ఒకప్పటి నిరుద్యోగి ప్రస్తుతం నెలకు రూ.లక్షకుపైగా సంపాదిస్తుండటం విశేషం.
సాక్షి, రంగారెడ్డిజిల్లా: సగటు వార్షిక ఆదాయంలో రంగారెడ్డి జిల్లా దేశ ఆర్థిక రాజధాని ముంబైని మించిపోయింది. ముంబై వాసి వార్షికాదాయం రూ.6.43 లక్షలు ఉండగా, ఈ జిల్లా సగటు వ్యక్తి ఆదాయం రూ.6.59 లక్షలు ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం (టీఎస్‌డీపీఎస్) తాజా నివేదికలో వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు, అహ్మదాబాద్, కోయంబత్తూరు, ఎర్నాకులం ఉన్నాయి. హైదరాబాద్ రూ.3.51 లక్షలు, మేడ్చల్ రూ.2.40 లక్షలు, వికారాబాద్ రూ.1.32 లక్షలుగా నమోదయ్యాయి.
ఉపాధి అవకాశాలు.. రూ.లక్షల్లో వేతనాలు
హైదరాబాద్ నగరంతో జిల్లా మిళితమై ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు నగరం చుట్టూ 158.50 కిలోమీటర్ల పొడవు ఎనిమిది లేన్ల ఔటర్ రింగ్ రోడ్డు ఉంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ విశాలమైన భూములు ఉండటం, తక్కువ వేతనాలకే కావాల్సిన మానవ వనరులు లభిస్తుండటంతో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ ప్రతిష్టాత్మాక గూగుల్, యాపిల్, ఫేస్‌బుక్, ట్విట్టర్, అమేజాన్, మహేంద్ర, ఇతర టెక్‌సంస్థలు కేంద్ర కార్యాలయాలు తెరిచాయి.
సుమారు ఏడు లక్షల మంది ప్రత్యక్షంగా, మరో పది లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. వీరి నెలసరి వేతనాలు రూ.లక్షల్లో ఉండడంతో తమ ఆదాయాన్ని ఇళ్లు, భూములు, ఇతర ఆస్తుల కొనుగోలుకు వెచ్చిస్తున్నారు. ఫలితంగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అప్పటి వరకు ఆకుకూరలు, కాయగూరలు సాగు చేసుకుంటూ జీవనం సాగించిన రైతులు రాత్రికి రా త్రే కోటిశ్వరుల జాబితాలో చేరిపోయారు. చేతి నిండా డబ్బు ఉండటంతో ఖర్చుకు వెనకాడటం లేదు.
నివాసయోగ్యమైన ప్రాంతం
ఢిల్లీ, ముంబై, ఇతర మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే గ్రేటర్ జిల్లాలు జీవనయోగ్యమైన జాబితాలో ఇప్పటికే గుర్తింపు పొందాయి. ఇటు సమశీతోష్ణ పరంగానే కాకుండా అటు సురక్షితం కావడంతో కీలకమైన రక్షణ, ఎయిర్‌ఫోర్స్, మిలట్రీ శిక్షణ కేంద్రాలు, పరిశోధక కేంద్రాలు కొలువుదీరాయి. ప్రభుత్వం సిటిజన్ల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే పోలీస్ కంట్రోల్ టవర్లను నిర్మించి నిరంతర నిఘా ఏర్పాటు చేసింది. సిటీలోనే కాదు శివారు ప్రాంతాల్లోనూ చీమచిటుక్కుమన్నా ఇట్టే గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. నిరంతరాయ విద్యుత్ సరఫరా, కొత్త పారిశ్రామికవాడలు, టీఎస్‌ఐపాస్ ద్వారా పరిశ్రమలకు సత్వర అనుమతుల జారీ వంటి అంశాలు కూడా జిల్లావాసుల సగటు ఆదాయం పెరుగుదలకు దోహదపడుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (క్లిక్ చేయండి: మీరూ అవ్వొచ్చు ట్రాఫిక్ పోలీసు.. ఎలాగంటే!)
Comments
Please login to add a commentAdd a comment