సాక్షి, హైదరాబాద్: అఫర్డబుల్ హౌసింగ్‌కు మారుపేరుగా నిలిచిన హైదరాబాద్.. క్రమంగా కాస్ట్లీ సిటీగా మారుతుంది. దేశంలోని ఏ మెట్రో నగరంతో పోల్చినా భాగ్యనగరంలో ప్రాపర్టీ ధరలు తక్కువని అవకాశం దొరికినప్పుడల్లా వేదికల మీద డెవలపర్లు ఊదరగొట్టేవాళ్లు. కానీ, దేశంలో ముంబై తర్వాత అత్యంత ఖరీదైన నగరంగా నిలిచిందని ప్రాప్‌టైగర్.కామ్ తాజా నివేదిక వెల్లడించింది.
వార్షిక ప్రాతిపదికన హైదరాబాద్‌లో ప్రాపర్టీల విలువ 6 శాతం వృద్ధి చెంది.. చ.అ. ధర సగటున రూ.5,800 నుంచి రూ.6,000 వేలకు పెరిగిందని పేర్కొంది. ముంబైలో ఏడాదిలో 3 శాతం పెరిగి.. రూ.9,600 నుంచి రూ.9,800లుగా ఉంది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలో గృహాల విక్రయాలలో హైదరాబాద్‌లో అత్యధిక వృద్ధి నమోదవుతుంది. బాచుపల్లి, తెల్లాపూర్, గండిపేట, దుండిగల్, మియాపూర్ ప్రాంతాలలో గృహ విక్రయాలకు డిమాండ్ విపరీతంగా ఉంది.
ఆయా ప్రాంతాలలో ఇళ్ల ధరలు పెరుగుతున్నప్పటికీ.. డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. దాదాపు పదేళ్ల కాలంలో అతి తక్కువ గృహ రుణ వడ్డీ రేట్లు ఉండటం, స్టాంప్ డ్యూటీలను తగ్గించడం, సర్కిల్ ధరలలో సవరణలతో పాటు గృహ కొనుగోళ్లలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలతో అందుబాటు ధరలలోని ఇళ్ల విక్రయాలలో అత్యధిక వృద్ధి నమోదయిందని ప్రాప్‌టైగర్.కామ్ బిజినెస్ హెడ్ రాజన్ సూద్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment