గత ఐదేళ్లలో రూ.88,448 పెరిగిన రాష్ట్ర తలసరి ఆదాయం
గతంలో చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పెరుగుదల రూ.60,128 మాత్రమే
బాబు పాలనలో చివరి ఏడాది రూ.1,54,031గా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం..
జగన్ పాలన(2023–24)లో రూ.2,42,479కి పెరుగుదల
వైఎస్ జగన్ పాలనలో జాతీయ సగటును మించి పెరుగుదల
2023–24 దేశ ఆర్థిక వ్యవస్థ గణాంకాల నివేదికలో ఆర్‌బీఐ వెల్లడి
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభం వెంటాడినా.. నవరత్నాల పథకాలతో ప్రజలకు అండగా నిలిచి రాష్ట్ర ఆదాయం పెరగడానికి నాటి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విశేష కృషి చేసింది. దాని ఫలితంగా ఐదేళ్ల జగన్ పాలనా కాలంలో రాష్ట్ర తలసరి ఆదాయం భారీగా పెరిగింది.
ఈ విషయం 2023–24 దేశ ఆర్థిక వ్యవస్థ గణాంకాలతో ఆర్‌బీఐ హ్యాండ్ బుక్‌లో స్పష్టమైంది. శుక్రవారం విడుదలైన ఆ హ్యాండ్ బుక్‌లో గత పది సంవత్సరాల్లో వివిధ రాష్ట్రాల్లో తలసరి ఆదాయం పెరుగుదల వివరాలను ఆర్‌బీఐ వెల్లడించింది. గతంలో చంద్రబాబు ఐదేళ్ల పాలన కన్నా వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలోనే రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువగా పెరిగినట్లు ఆర్‌బీఐ పేర్కొంది.
2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు చంద్రబాబు పాలనలో తలసరి ఆదాయం రూ. 60,128 మాత్రమే పెరిగింది. అదే 2019–20 నుంచి 2023–24 ఆర్థిక సంవత్సరం వరకు వైఎస్ జగన్ పాలనలో తలసరి ఆదాయం రూ. 88,448 పెరిగిందని ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి.
చంద్రబాబు పాలనను తలదన్నేలా
గతంలో చంద్రబాబు ఐదేళ్ల పాలన కాలాన్ని తలదన్నేలా.. వైఎస్ జగన్ పాలన కాలంలో ప్రతి ఏడాది కూడా జాతీయ సగటు తలసరి ఆదాయాన్ని మించి రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదల నమోదైంది.
2019–20లో దేశ జాతీయ సగటు తలసరి ఆదాయం రూ. 1,52,504 ఉండగా.. 2023–24 ఆర్థిక సంవత్సరంలో అది రూ. 2,14,951కు చేరింది. ఇదే సమయంలో 2019–20లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,60,341 ఉండగా 2023–24 ఆర్థిక సంవత్సరం నాటికి అది రూ. 2,42,479కు చేరింది.
జీవన ప్రమాణాలు పెరిగిన ఫలితంగా..
ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయనడానికి, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందనడానికి తలసరి ఆదాయం కొలమానంగా నిలుస్తుంది. రాష్ట్రం లేదా ప్రాంతం మొత్తం ఆదాయాన్ని అక్కడి జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది. రాష్ట్ర జనాభా ఆర్థిక శ్రేయస్సును తలసరి ఆదాయం సూచిస్తుంది. తలసరి ఆదాయం పెరిగింది అంటే ప్రజలు వస్తువులు, సేవలపై ఖర్చు చేయడానికి ఎక్కువ డబ్బును కలిగి ఉన్నట్లు అర్థం.
ఏదైనా రాష్ట్రం లేదా ప్రాంతం అభివృద్ధికి కొలమానం కూడా తలసరి ఆదాయం పెరుగుదలే. కోవిడ్ సమయంలో వ్యవసాయంతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అలాగే వివిధ వర్గాల ఆదాయ మార్గాలను పెంచేందుకు, ఆయా రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు సజావుగా సాగేందుకు తగిన వాతావరణాన్ని కూడా ఆనాటి ప్రభుత్వం కల్పించింది.
ప్రజల చేతుల్లోకి డబ్బులు చేరవేస్తేనే ఆర్థిక రంగానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో నవరత్నాల పథకాల ద్వారా లబ్ధిదారులకు నేరుగా నగదును బదిలీ చేసింది. ఫలితంగా రాష్ట్ర తలసరి ఆదాయంలో భారీగా పెరుగుదల నమోదైంది. అంతే కాకుండా గత ఐదేళ్లలో దేశ జాతీయ సగటు తలసరి ఆదాయాన్ని మించి రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగింది. కోవిడ్ లాంటి సంక్షోభాలు లేకపోయినా చంద్రబాబు 2014–15 నుంచి 2018–19 వరకు ఐదేళ్ల పాలనలో రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదల తక్కువగానే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment