
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
మేడ్చల్ రూరల్: కట్టుకున్న భర్తను కాదని ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ.. తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి, ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది. వివరాల్లోకి వెళ్తే..ఈ నెల 10న ఉదయం మేడ్చల్ పట్టణంలోని కిందిబస్తీలో ఓ ఖాళీ ప్రదేశంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెంది పడిఉన్నట్లు స్థానికుల సమాచారంతో తెలుసుకున్న మేడ్చల్ పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుడి స్వస్థలం మెదక్ జిల్లా ఎస్ కొండాపూర్ తండాకు చెందిన నునావత్ రమేశ్(30)గా గుర్తించారు. గత కొంతకాలంగా మేడ్చల్‌లో నివాసం ఉంటున్నట్లు తెలుసుకున్నారు.
మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, భార్య లలిత(28)ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా వికారాబాద్ జిల్లా నీటూరు నర్సాపూర్‌కు చెందిన నర్సింహ్మ మేడ్చల్‌లో నివాసం ఉంటూ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతను లలితతో సన్నిహితంగా మెలిగాడు. లలిత తరచూ నర్సింహతో ఫోన్‌లో మాట్లాడడం, కలుస్తుండడం చూసిన భర్త రమేశ్ పలుమార్లు ఆమెను హెచ్చరించాడు. దీంతో ఇద్దరి మధ్య గత కొద్ది రోజులుగా గొడవలు సాగుతున్నాయి. ఈ క్రమంలో భార్య లలిత ఎలాగైనా భర్త అడ్డు తొలగించికోవాలని భావించి ప్రియుడు నర్సింహతో కలిసి చంపేందుకు ప్లాన్ వేసింది.
ఈ నెల 9న రమేశ్ మద్యం మత్తులో గొడవకు దిగగా..లలిత పథకం ప్రకారం ప్రియుడిని ఇంటికి పిలుచుకుంది. రాత్రి 10.30 గంటల సమయంలో వచ్చిన నర్సింహ్మ 11 గంటల సమయంలో రమేష్ మెడకు టవల్ చుట్టి గొంతు నులిమి లలిత సాయంతో అంతమొందించాడు. రమేశ్ మృతి చెందినట్లు నిర్ధారించుకున్న ఇద్దరు తెల్లవారుజామున కిందిబస్తీలోని ఓ ఖాళీ ప్రదేశంలో పడేసి వెళ్లి ఏమీ తెలియనట్లు వ్యవహరించారు. 10న ఉదయం సంఘటన స్థలిని, మృతుడి ఒంటిపై గాయాలను గుర్తించిన పోలీసులు మొదట భార్య లలితను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం వెల్లడైంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని బుధవారం వారిని రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment